April 24, 2024

జీవితం ఇలా కూడా ఉంటుందా? – 12

రచన: అంగులూరి అంజనీదేవి

రోజులు గడుస్తున్నాయి.
అరుణోదయం వేళ అప్పుడే సూర్యుడు పైకి వస్తూ ఇళ్ల మధ్యలోంచి, చెట్ల మధ్యలోంచి తొంగి చూస్తున్నాడు. ఆ సూర్యుని లేలేత కిరణాలు సోకి ఆరుబయట గంగిరావిచెట్టు కింద నవారు మంచంలో పడుకొని వున్న సతీష్‌చంద్ర కొడుకు బోసి నవ్వులు నవ్వుతున్నాడు. గాలికి వూగే మొక్కజొన్న కంకుల్లా పిడికిళ్లను పైకి లేపి కదిలిస్తూ కాళ్లతో మంచం మీద తన్ని పైకి జరగాలని చూస్తున్నాడు. సతీష్‌చంద్ర ఫ్రేమ్‌ కుర్చీలో కూర్చుని బాబునే చూస్తూ ”ఏ చిన్నా! ఏ కన్నా! ఇటు చూడు నాన్నా!” అంటూ బాబు పిడికిలిని ముద్దుగా పట్టుకొని వూపుతున్నాడు. పక్కనే కూర్చుని వున్న ధృతితో ”ఈ లేలేత ఎండలో డి విటమిన్‌ వుంటుంది. ఇది బాబు మీద పడితే చాలా మంచిది” అన్నాడు సతీష్‌చంద్ర.
ధృతి ”అవును” అని అనేలోపలే తారమ్మ కొంగును బొడ్లో దోపుకుని వేడినీళ్లు తెచ్చి పంపు దగ్గర వున్న చెప్టా మీద పెట్టింది. రెండు ఎత్తైన పీటలు వాల్చి, ఒక పీట మీద కూర్చుని రెండో పీట మీద కాళ్లు చాపి పెట్టుకుంది. గిన్నెలో వున్న సున్నిపిండిలో కొంచెం నీళ్లు పోసి మెల్లగా కలుపుతూ ”ధృతీ! బాబును తీసుకురా!” అంది.
ధృతి బాబుకి డ్రస్‌ విప్పి తీసికెళ్లి తారమ్మ కాళ్ల మీద పడుకోబెట్టింది. తారమ్మ చేయి చాపగానే రోజు వేసినట్టే ఆ చేతిలో కొద్దిగా ఆముదం వేసింది దృతి.
తారమ్మ ముందుగా ఆ ఆముదాన్ని బాబు చెవుల్లో, ముక్కులో, బొడ్లో వేసి ఆ తర్వాత మాడుకి రాసింది. గొంతు దగ్గర నుండి నెమ్మదిగా గుండెకి, చేతులకి కాళ్లకి పూస్తూ సాగదీసింది. వెంటనే బాబుని బోర్లా తిప్పి కాళ్ల మీద పడుకోబెట్టుకొని వీపుకి రుద్దింది… ఆ తర్వాత సున్నిపిండిని తీసుకొని ముందు తలకి రుద్ది వీపుకి కాళ్లకి చేతులకి మెల్లగా రుద్దింది. అదయ్యాక దోసిలి పట్టి ఆ దోసిలిలో దృతిచేత నీళ్లు పోయించుకుంది. ఆ నీళ్లతో బాబు తలమీద వీపు మీద నెమ్మదిగా కొట్టింది. తర్వాత బేబీ సబ్బుతో వీపును, తలను రుద్ది ఈసారి కూడా దోసిళ్లతో పట్టిన నీళ్లనే తల మీద, వీపు మీద పోసింది. తర్వాత బాబును వెల్లకిలా తిప్పి కాళ్లమీద పడుకోబెట్టుకొని ముఖానికి, పొట్టకు సున్నిపిండి రాసింది. దృతి అక్కడే నిలబడి పైనుండి నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లను ముక్కల్లోకి, చెవుల్లోకి పోనివ్వకుండా ఒళ్లంతా కడిగింది. అలాగే మళ్లీ సబ్బు పూసి నీళ్లు పోసింది. అలా మూడు బక్కెట్ల నీళ్లు పోశారు. బాబు తేటగా అయ్యాడు. దృతి అక్కడే తీగమీద వున్న టవల్‌ని లాగి రెండు చేతుల మీద వేసుకోగానే బాబుని లేపి ఆ టవల్లో పడుకోబెట్టింది తారమ్మ. తారమ్మ వెంటనే తన చేతులను నేలమీద ఆన్చి నెమ్మదిగా లేచి దృతి చేతుల్లో వున్న బాబుని టవల్‌తోపాటే అపురూపంగా అందుకుంది. బాబు ఒళ్లంతా మృదువుగా తుడిచి టవల్‌ కొసను పురిచేసి, ఆ పురిని మెత్తగా చెవుల్లోకి, ముక్కులోకి పోనిచ్చి తడిని తుడిచింది. అలా తుడుస్తున్నప్పుడు బాబు తుమ్ముతూ, హాయిగా కళ్లు మూసుకున్నాడు.
తారమ్మ బాబును చేతుల్లో పట్టుకొని నవారు మంచంమ్మీద కూర్చోగానే దృతి వంటింట్లోకి వెళ్లి కణకణలాడే నిప్పుల్ని వెడల్పాటి గంటెలో వేసుకుని వచ్చింది. ఆ నిప్పుల్లో సాంబ్రాణి వేసి ఆ పొగను బాబుకి ఒళ్లంతా తగిలేలా పట్టుకుంది. తారమ్మ బాబు జుట్టును వేళ్లతో కదిలిస్తు సాంబ్రాణి పొగను జుట్టంతా వ్యాపించేలా చేస్తోంది. సతీష్‌చంద్ర అక్కడే కూర్చుని ఆసక్తిగా చూస్తూ ‘ఈ తారమ్మ ఆంటీకి నా కొడుకంటే ఇంత ప్రేమ, ఇంత శ్రద్ధ ఎందుకో. ఇదెప్పటి ఋణమో అదే ఈ ఆంటీ లేకుంటే తన కొడుక్కి ఇలా ఎవరు స్నానం చేయించేవాళ్లు. దృతికి వస్తుందా? దృతికే కాదు. దృతి వయసున్న ఏ అమ్మాయికి కూడా పసిపిల్లలకు ఎలా స్నానం చేయించాలో తెలియదు. అందుకే ఈమధ్యలో యూట్యూబ్‌లలో చంటిపిల్లలకు బామ్మలు స్నానం చేయించే వీడియోలను చూసి నేర్చుకుంటున్నారట అని మనసులో అనుకున్నాడు.
సాంబ్రాణీ పొగ పట్టటం అయ్యాక బాబు ఒళ్లంతా పౌడర్‌ పూసి నుదుటికి, బుగ్గకి, అరికాలికి కాటుకతో దిష్టిచుక్క పెడుతుండగా సతీష్‌చంద్ర మొబైల్‌ రింగయ్యింది. ఆ నెంబర్‌ ఆనంద్‌ది. వెంటనే లిఫ్ట్‌ చేసి ”హలో! చెప్పన్నయ్యా!” అన్నాడు సతీష్‌చంద్ర.
”మీ వదిన ప్రతిరోజూ మన ఇంటికి రాకుండా వాళ్ల ఊరు వెళ్తోంది సతీష్‌! అక్కడ నుండే ఆఫీసుకి వస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు. అద్దె ఇంట్లో వుంచితేనే నాతో వుంటానంటోంది. అలా వుంచాలంటే నా దగ్గర డబ్బుల్లేవు. ఆమె నాతో లేకుంటే నాకు పిచ్చెక్కేలా వుంది” అన్నాడు.
”ఇది నాకెందుకు చెబుతున్నావు అన్నయ్యా!” అన్నాడు సతీష్‌.
”ఏదైనా సలహా ఇవ్వరా!”
”సలహానా!! పెద్ద చదువులు చదువుకున్నవాడివి. తెలివైన వాడివి. మంచి ఉద్యోగం చేస్తున్నవాడివి, అమ్మానాన్నలతో ప్రేమింపబడుతున్నవాడివి… ఇదంతా వదిలేసి నీకన్నా చిన్నవాడిని, చదువు కూడా పెద్దగా లేనివాడిని… ఇంట్లోంచి బయటకు వెళ్లగొడితే భార్య కాన్పును ఎక్కడో వుండి చేసుకున్నవాడిని… నన్నడిగితే నేనేం సలహా ఇవ్వగలను?” అంటూ కుర్చీలోంచి లేచాడు సతీష్‌చంద్ర.
క్రీం కలర్‌ టీషర్టు, బ్లూనైట్ ప్యాంటులో వున్న సతీష్‌చంద్ర నిద్రలేచి ఇంకా స్నానం చెయ్యకపోయినా కడిగిన ముత్యంలా వున్నాడు. గంభీరంగా, స్పష్టంగా మాట్లాడుతూ మొబైల్‌ని చెవి దగ్గర పట్టుకొని, ప్యాంటు జేబులో చేయి పెట్టుకుని నెమ్మదిగా అడుగులేస్తూ ”నేనటు వెళ్లొస్తాను” అని దృతితో చెప్పి మొక్కజొన్న తోటలోకి వెళ్లాడు. ఆనంద్‌తో మాట్లాడుతూ ఆ తోటలో గట్లమీద నడుస్తున్న సతీష్‌చంద్రకు గట్లకి ఇరువైపుల వున్న మొక్కజొన్న కంకులు ‘హాయ్‌’ చెబుతున్నట్లే సుతారంగా తగులుతున్నాయి.
”అది కాదురా సతీష్‌! నాకు నువ్వు తప్ప ఎవరున్నారు. నా పొజిషన్‌ చాలా బ్యాడ్‌గా వుందిరా! అర్థం చేసుకో… తమ్ముడివి నువ్వు ఆ మాత్రం హెల్ప్‌ చెయ్యలేవా?” అంటూ కమల్‌నాథ్‌ చేసిన ద్రోహాన్ని నాలుగు వాక్యాల్లో చెప్పాడు.
”హెల్ప్‌ అంటే ఎవరి దగ్గరైనా అప్పు ఇప్పించమాంవా?”
”అప్పు కాదురా! నీ దగ్గర లేవా?”
”అంత డబ్బు నాదగ్గర ఎక్కడిది?”
”నీకు అక్కడ చాలామంది స్నేహితులు వుంటారు కదా! వాళ్ళనడిగితే ఇవ్వరా? ఇదేమైనా పెద్ద ప్రాబ్లమా? నువ్వు ఇవ్వాలనుకుంటే చాలా ఈజీగా ఇవ్వొచ్చు”
సతీష్‌చంద్ర నవ్వి ”నా స్నేహితుల్లో అలా అడగ్గానే డబ్బులిచ్చేవాళ్లెవరూ లేరు అన్నయ్యా! నీకో జోక్‌ చెప్పనా మన నాన్న వయసే వున్న ఒక అంకుల్‌ తన కొడుకు స్నేహితుల దగ్గర తన మాటకారి తనంతో డబ్బులు తీసుకొని బ్యాంకులో వేసుకుని తింటూ తాగుతూ వుంటాడట. అడిగితే ‘నేను అడగ్గానే ఎందుకిచ్చారు డబ్బులు? ఇచ్చింది తిరిగి తీసుకోటానికా ఛీ….ఛీ.. అయినా నేనేమైనా పరాయివాడినా మీ స్నేహితుని తండ్రిని… వడ్డీ తీసుకుంటాంరా ఎక్కడైనా? ఛీ..ఛీ…” అంటాడట. ఎంత అడిగినా తీసుకున్న డబ్బులు ఇవ్వడట. ఇలాంటి సోమరిపోతుల్ని ఎక్కడికి తీసికెళ్లి ఉరెయ్యాల్లో చెప్పు!” అన్నాడు.
”నేనిప్పుడు అవన్నీ చెప్పే పొజిషన్‌లో లేను. నాకోసం నువ్వు ఆ మాత్రం చెయ్యలేవా?”
”అలా అనకు అన్నయ్యా! దేశం కోసం నా ప్రాణాలను కూడా అర్పించటానికి సిద్ధంగా వున్న సైనికుడిని నేను…. అలాంటి నేను నీకోసం ఏమైనా చెయ్యగలను… కానీ ఇది మాత్రం చేయలేను. ఎందుకంటే నీకో పొజిషన్‌ రావడం కోసం నేను నా స్నేహితుల దగ్గర డబ్బు తీసుకుంటే ముందుగా నా వ్యక్తిత్వం పోతుంది. తర్వాత నా పొజిషన్‌ పోతుంది. తనకు మాలిన ధర్మం తగునా అన్నయ్యా?”
”అదేంటిరా సతీష్‌ అలా అంటావ్‌!”
”నేనేమీ తప్పు మాట్లాడటం లేదన్నయ్యా! నీకు నా స్నేహితుల దగ్గర డబ్బులు ఇప్పిస్తాను సరే! కానీ ఆ డబ్బును తిరిగి నా స్నేహితులకు ఎప్పుడు ఇవ్వగలవు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడప్పుడే ఇవ్వగలవా? నేను ఇవ్వగలనా? ఇవ్వలేనప్పుడు వాళ్లను మోసం చేసినట్టవుతుందేమో ఒకసారి ఆలోచించు?”
”ఇప్పుడవన్నీ ఆలోచించే శక్తి నాకు లేదురా!”
”ఆలోచించాలి అన్నయ్యా! ఎందుకంటే డబ్బు అనేది చాలా శక్తివంతమైనది. కోటీశ్వరుడి చేతిలో వున్నా, తోటవాడి చేతిలో వున్నా అది దాని విలువను కోల్పోదు. ఐతే దాన్ని వున్న చోట వుంచకుండా అటూ ఇటూ తిప్పితేనే మనిషి తన విలువను కోల్పోతాడు. నేను సైనికుడిని. ఇలాంటి డబ్బు చికాకుల్లో ఇరుక్కుని నా ఆత్మగౌరవాన్ని, ఆత్మ స్థైర్యాన్ని పోగొట్టుకోలేను” అన్నాడు.
ఆ మాటలు ఛట్ మని తగిలాయి ఆనంద్‌కు. అతను మాట్లాడలేదు.
”అన్నయ్యా! నువ్వు నీ పొజిషన్‌ దగ్గరే ఆగిపోయి ఆలోచిస్తున్నావు. అందుకే నా గురించి ఆలోచించలేక పోయావు. పర్వాలేదు. అది నేను ఆలోచించుకోగలను… అయినా ఆ కమల్‌నాథ్‌ తన దగ్గర డబ్బులు లేకనే నీ దగ్గర తీసుకున్నాడనుకుంటున్నావా? కాదు. అలాటి వాళ్లకి వాళ్ల డబ్బులు కావాలి, ఇతరుల దగ్గర వున్న డబ్బులు కూడా కావాలి. ప్రతిక్షణం తను బాగుండాలి. తనే బాగుండాలి అని తపన పడే రకం కమల్‌నాథ్‌”
”నీ మాటలు వింటుంటే నాకన్నా చిన్నవాడివి నువ్వేనా ఇలా మాట్లాడేది అన్పిస్తుంది సతీష్‌! అమ్మ నిన్ను చూసి చిన్నప్పుడు చాలా బాధపడేదిరా! ‘ఒరే ఆనంద్‌! చెత్తరకాలతో స్నేహం చేసి నీ తమ్ముడు చెడిపోతున్నాడురా’ అని… అమ్మ అలా అనడం వల్లనో ఏమో నాకు స్నేహం చేద్దామంటే ఒక్క మంచివాడు కూడా దొరకలేదు. ఎలాటి వాళ్లతోనైనా చిన్నప్పుడు స్నేహం చేస్తేనే మంచీ-చెడూ తేడాలు తెలుస్తాయి. నువ్వలా చేశావు కాబట్టే ఇప్పుడు ఇలా మాట్లాడగులుగుతున్నావ్‌! చెత్తంటే ఏమిటో, చెత్త ఆలోచనలంటే ఏమిటో తెలిసికోగలిగావు. ఏదైనా స్నేహితుల ద్వారానే తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైనా మంచీ-చెడూ తెలియాలంటే స్నేహితులు కావాలి. నాకు స్నేహితులు లేకనే ఇలా తయారయ్యాను. డబ్బు కోసం దృతి విషయంలో కూడా పెద్ద పొరపాటు చేశాను”
”పొరపాటా? ఏం చేశావన్నయ్యా?”
”ధృతిని అమ్మ కాని, మోక్ష కాని ప్రేమగా చూసుకోకపోవటానికి కారణం నేనే…” అంటూ ఇంకా ఏదో మాట్లాడే లోపలే ఆనంద్‌ వైపు నుండి కాల్‌ కట్ అయింది.
ఆ కాల్‌ని క్‌ చేసింది ఆనంద్‌కాదు. ఆనంద్‌ స్నేహితుడు బైక్‌మీద వేగంగా వచ్చి ”ముందు నువ్వు బైక్‌ ఎక్కు ఆనంద్‌! కమల్‌నాథ్‌ దొరికాడు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం!” అంటూ ఆనంద్‌ చెవి దగ్గర వున్న మొబైల్‌ని లాగి అతనే కాల్‌ కట్ చేశాడు.
ఆనంద్‌ బైక్‌ ఎక్కగానే ఆ బైక్‌ తిరిగి స్టార్టయి మలుపులు తిరుగుతూ చాలా రూరల్‌ ఏరియాలోకి వెళ్లింది.
*****

ఆ ఏరియా అంతా చెట్లు, కొండలు, పొలాలు. ఎటుచూసినా పచ్చి పైర్లు. అంతవరకు పెద్ద రోడ్డు మీద వెళ్తున్న ఆనంద్‌ వాళ్ల బైక్‌ ఆ రోడ్డు దిగి సన్ని కాలిబాట మీద వెళ్లసాగింది. ఆ దారి వెంట జన సంచారం కాని, వాహనాలు కాని ఎక్కువగా వెళ్లటం లేదు. ఆ బైక్‌ ఒక్కటే మట్టిదారిన వెళ్తోంది. చుట్టూ నిశ్శబ్దంగా వుండటం వల్ల ఆ బైక్‌ శబ్దం స్పష్టంగా విన్పిస్తోంది…. దారికి ఇరువైపుల వున్న చెట్ల మధ్యలోంచి ఏవో పురుగులు అరిచే వింత అరుపులు వినిపిస్తున్నాయి. అప్పటికే సూర్యుడు బారెడు పైకొచ్చి వీపును చురుక్కుమనిపిస్తున్నాడు. ”ఇంకా రాదేంటి కమల్‌నాథ్‌ వుండే ఇల్లు? ఇదే ఏరియా అని నీకు స్పష్టంగా తెలుసా? లేక దారేమైనా తప్పామా?” అని బైక్‌ నడుపుతున్న ఫ్రెండ్‌ని అడిగాడు వెనకాల కూర్చుని వున్న ఆనంద్‌.
”దారి తప్పలేదు. ఇదే దారి. ఆ ఇల్లు పొలాల మధ్యలో వుంటుందట. ఆ ఇంటి చుట్టు ఇళ్లు వుండవట. అదిగో అదే లాగుంది. జనాలున్నారు చూడు” అంటూ ఆ ఇంటి దగ్గరకి వెళ్లి బైక్‌ ఆపాడు.
అక్కడ వందమంది పైనే వున్నారు. వాళ్లంతా కమల్‌నాథ్‌ ఎప్పుడు బయటకొస్తాడా అని ఎదురుచూస్తున్న వాళ్లే… అందరి ముఖాలలో ఆత్రుత, ఆవేదన, ఆందోళన. ఎండకి ముఖాలు పీక్కుపోయి వున్నాయి. ఎక్కడ నిలబడదామన్నా పొలం గట్లు తప్ప నీడనిచ్చే చెట్లు లేవు. వాళ్లు ఆకలైతే తిండి తినాలన్నా దాహమైతే నీళ్లు తాగాలన్నా అక్కడికి పది కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిందే. వాళ్లలో ఒక్కరికి కూడా ప్రస్తుతం కార్లు లేవు, బైక్‌లు లేవు. అందరూ అక్కడికి నడుచుకుంటూ వచ్చినవాళ్లే. వాళ్లను చూస్తుంటే లోగడ వాళ్లకున్న కార్లను, బైక్‌లను కమల్‌నాథ్‌కి డబ్బులిచ్చాక అమ్ముకున్నవాళ్లలాగే వున్నారు.
బైక్‌ దిగుతూ ”ఛ..ఛ… బైక్‌లో పెట్రోల్‌ అయిపోయింది ఆనంద్‌!” అన్నాడు ఫ్రెండ్‌.
ఆనంద్‌ అదేమీ వినకుండా బైక్‌ దిగి ఆవేశంగా నడుచుకుంటూ ఆ ఇంటి గేటు దగ్గరకి వెళ్లాడు. ఆ గేటు దగ్గర గ్రేకలర్‌ సూట్ లో వున్నతను పెద్ద డాగ్‌ని తన వెంట తిప్పుకుంటూ అక్కడ జనాలను గమనిస్తూ వున్నాడు.
ఆనంద్‌ని ఎగాదిగా చూసి ”ఏంటి ఊగిపోతున్నావ్‌? ఆవేశమా? అదక్కడ నిలబడినవాళ్లలో లేదా? లోపల పెద్దమనుషులు కూర్చుని కమల్‌నాథ్‌గారితో మీ గురించే మాట్లాడుతున్నారు. నువ్వు ఇప్పుడే వచ్చావు. వాళ్లంతా రెండు రోజులుగా వచ్చి వున్నారు. వెళ్లి వాళ్ల పక్కన వుండు” అన్నాడు అతను.
”ఇది అన్యాయం, అక్రమం. ఇక్కడికి ఛానల్స్‌ వాళ్లని పిలిపిస్తా. పోలీసుల్ని రప్పిస్తా” అంటూ హడావుడిగా ఫోన్‌ చేయబోయాడు ఆనంద్‌.
అది చూసి ఆనంద్‌నెవరో పక్కకి లాక్కెళ్లి ”చూడు నువ్వు చేస్తామన్న పనులు మేమూ చెయ్యగలం. అలా చేస్తే అతను జైల్లోకెళ్లి కూర్చుంటాడు. మనకి ఒక్క పైసా రాదు. వాడెలాగూ దుర్మార్గుడే! ఛానల్స్‌, పోలీసులు వాడినేం చేసినా వాడికి లెక్కలేదు. అందుకే ఓపిక పడదాం. లోపల మన గురించే మాటలు నడుస్తున్నాయట…” అంటూ నచ్చచెప్పి వాళ్లలో కలిపేసుకున్నారు.
గంటలు, గంటలు గడచిపోతున్నాయి.
ఆనంద్‌కి ఆకలిగా వుంది. దాహంగా వుంది. ఫ్రెండ్‌తో చెబితే బైక్‌లో పెట్రోల్ అయిపోయిందన్నాడు. అతనికి కూడా ఆకలి, దాహం పోటీపడుతున్నాయి. అక్కడివాళ్లను అడిగాడు.
”పది కిలోమీటర్ల దూరం వెళితేనే ఏదైనా” అన్నారు వాళ్లు.
”అమ్మో! పది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి మళ్లీ ఎప్పుడు రావాలి. ఈ లోపల కమల్‌నాథ్‌ ఎవరి మనీ వాళ్లకి ఇచ్చేసి వెళ్లిపోతే మన మనీ ఎలా రావాలి?” అంటూ ఎవరికి వాళ్లు ఎటూ వెళ్లకుండా అక్కడే వున్నారు… మళ్లీ వాళ్లలో వాళ్లే ”మనిషి ఏదైనా ఒక పని చేసి డబ్బు సంపాదించినట్లే బ్యాంకులో వేసిన డబ్బు కూడా వడ్డీ రూపంలో డబ్బు సంపాయిస్తుంది. అందుకే డబ్బు చాలా విలువైంది. కానీ కమల్‌నాథ్‌ ‘బ్యాంకులో వడ్డీ తక్కువ. నా దగ్గర డబ్బు పెడితే ఎక్కువ వడ్డీ ఇస్తాను’ అని మనకు ఆశ పెట్టి డబ్బులు తీసుకుని వడ్డీ కాదు కదా ఇప్పుడు అసలు కూడా ఇవ్వటం లేదు. ఇలాటి వాళ్ల వల్ల మనం కష్టపడి సంపాయించుకున్న మన డబ్బుల్ని మనమే వాడుకోలేక పోతున్నాం. కనీసం ఆ డబ్బును కళ్లతో కూడా చూసుకోకుండానే చచ్చిపోతామేమో అనిపిస్తుంది. అందుకే కమల్‌నాథ్‌ లాంటివాళ్లకి తొందరపడి డబ్బులివ్వకూడదు. ఇస్తే గోడకు సున్నం వేసినట్లే…” అనుకున్నారు.
అంతలో ఒక జీపు వచ్చి ఆగింది. ఆ జీపులోంచి ఒకతను దిగి అక్కడ వున్నవాళ్లకి ఆహారం పొట్లాలను, వాటర్‌ ప్యాకెట్లను ఇచ్చి వెళ్లాడు. ఎవరూ ఎగబడకుండా అందరికీ అందేలా చాలా ప్రశాంతంగా ఇచ్చి వెళ్లాడు. ఎక్కడి వాళ్లక్కడ కూర్చుని తిన్నారు.
ఆనంద్‌, ఆనంద్‌ స్నేహితుడు కూడా తిన్నారు.
”ఇప్పుడు హాయిగా వుంది. ఎవరో మహానుభావుడు మన ఆకలి తీర్చివెళ్లాడు. లేకుంటే నేను చచ్చిపోయేవాడిని… ఇప్పటికే నా కడుపులో పేగులు ఆకలికి మెలిపెట్టినట్లు నొప్పి పుట్టాయి” అన్నాడు ఆనంద్‌ చాలా సిన్సియర్‌గా.
అది విని ”ఆ జీపు ప్రవీణ్‌ స్వచ్ఛంద సంస్థదట. మనలో ఎవరో ఇన్ఫర్మేషన్‌ ఇవ్వడం వల్ల గత రెండు రోజులుగా ఆ జీపు ఇటే వస్తోంది. మా అందరికి ఆహార పొట్లాలను ఇచ్చి వెళ్తోంది. మనమెవరో వాళ్లకి తెలియదు. ఇక్కడ ఎందుకున్నామో తెలియదు. మన దగ్గర డబ్బులు తీసుకున్న కమల్‌నాథ్‌ ఆ ఇంట్లో చేరి ఏం చేస్తున్నాడో తెలియదు. కాని మనం వాడికోసం బయట ఎండలో నిలబడి ఆకలికి దాహానికి అలమిస్తున్నాం. ఈ టైంలో ప్రవీణ్‌ స్వచ్ఛంద సంస్థ వాళ్లు లేకుంటే మనగతి ఏమయ్యేది?” అన్నారెవరో.
”ప్రవీణ్‌ స్వచ్ఛంద సంస్థ అంటే?” అంటూ ప్రశ్నార్ధకంగా ఆగిపోయాడు ఆనంద్‌. అతనికి దృతి అన్నయ్య ప్రవీణ్‌ గుర్తొచ్చాడు.
”ప్రవీణ్‌ సంస్థ ఫంక్షన్‌ హాలల్లో మిగిలిపోయిన ఆహారాన్ని, నీళ్లని ప్యాక్‌ చేసి బాధల్లో వున్న వాళ్లకి అందిస్తుంది. మిగిలిన ఆహారం అంటే పేట్లల్లో తినగా మిగిలింది కాదు” అన్నారెవరో. ప్రవీణ్‌ గురించి ఇంకా వాళ్లకేం తెలుసో దాని గురించి చాలా మర్యాదగా మ్లాడుకుంటున్నారు. అక్కడ లేని వ్యక్తి గురించి అంత మర్యాదగా మాట్లాడటం మాటలు కాదు. అదంతా విని ఆశ్చర్యపోయాడు ఆనంద్‌. ఇన్నిరోజులు అతనికి ప్రవీణ్‌ అంటే వున్న చిన్నచూపు పోయింది. దృతిని అనవసరంగా బాధపెట్టాను కదా అనుకున్నాడు. పశ్చాత్తాపమే మనిషి మనసును ప్రక్షాళనం చేస్తుంది.
సూర్యుడు కొండల్లోకి దిగిపోతున్నాడు.
పంటపొలాల మీద తూనీగలు, ఎగిరే పురుగులు జుమ్మంటున్నాయి.
”ఇంకొద్ది సేపయితే దోమలొస్తాయి. ఇంకా ఎంతసేపు నిలబడాలి. ఆ ఇంటి చుట్టూ కొత్తగా ఇంకో పది కుక్కలు వచ్చి చేరాయి. అతనేమో బయటకు రాలేదు. కుక్కల్ని మనమీదకు వదిలినా వదలొచ్చు. అందరి మొబైల్‌లలో చార్జింగ్‌ అయిపోయింది. ఎటువెళ్లి బస్సెక్కాలన్నా పది కిలోమీటర్లు నడవాలి. ఇప్పటి నుండి వెళ్తేనే ఇంటికెళ్లగలం రెండు రోజుల నుండి ఇక్కడే వుండి నరకాన్ని చూశాం. ఇక నావల్ల కాదు. అయినా ఇలాంటి వెధవలు డబ్బులు తీసుకునేది తిరిగి ఇవ్వటానికా? కార్లలో తిరిగి ఎంజాయ్‌ చెయ్యానికి కాకపోతే” అంటూ ఒకతను దారి తియ్యగానే మిగిలినవాళ్లు కూడా కమల్‌నాథ్‌ను తిట్టుకుంటూ ‘ఒకప్పుడు అప్పిచ్చువాడు వైద్యుడు అనేవారు, ఇప్పుడు అప్పు ఇవ్వొద్దని సలహా ఇచ్చేవాడే వైద్యుడు’ అనుకుంటూ వెళ్తున్నారు. వాళ్లను చూసి ఆనంద్‌ తన మనసులో ”కమల్‌నాథ్‌ మనిషే! నేనూ మనిషినే! ప్రవీణ్‌ మనిషే! ముగ్గురం ఈ సొసైటీలో బ్రతుకుతున్న వాళ్లమే… ఈ సొసైటీకి మా ముగ్గురిలో ఎవరివల్ల ప్రయోజనం వుంది?” అనుకున్నాడు.
”బైక్‌ను నెట్టుకుంటూ పది కిలోమీటర్లు వెళ్లాలంటే మాటలు కాదు. ఏం చేద్దాం ఆనంద్‌?” అన్నాడు ఫ్రెండ్‌.
”రాత్రికి ఇక్కడే వుందాం!” అన్నాడు ఆనంద్‌.
”వద్దు. ఇప్పటికే చాలామంది వెళ్లిపోతున్నారు. ఇక్కడి వాతావరణం అంత సేఫ్‌గా లేదన్నది మనకన్నా వాళ్లకే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే వాళ్లంతా ఇక్కడ రెండు రోజుల నుండి వున్నవాళ్లు కాబట్టి…” అన్నాడు. అదెవరో విని ”ఎవరినైనా మోసం చెయ్యొచ్చో లేదో కాని నమ్మినవాళ్లను మోసం చెయ్యకూడదు. వీడు మనపట్ల అన్యాయంగా ప్రవర్తించాడు. ఇప్పుడు తప్పించుకుంటాడేమో! ఎప్పటికీ తప్పించుకోలేడు. వేరొకరి నుండి ఇంతకన్నా తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కొంటాడు. పతనమైపోతాడు” అని తిట్టాడు… శాపనార్థాలు పెట్టాడు.
అది విని ”ఎలాగైనా వీడిని వదలకూడదు” అంటూ ఆవేశంగా అరిచాడు ఆనంద్‌.
”అలాగేలే పద” అంటూ ఆనంద్‌ని తీసుకొని బైక్‌ను నెట్టుకుంటూ ఇంటిదారి పట్టాడు ఆనంద్‌ స్నేహితుడు… కొన్ని స్నేహాల వల్ల కొందరు సుఖపడతారు. కొన్ని స్నేహాల వల్ల కొందరు కష్టపడతారు. ఆనంద్‌ స్నేహితునికి ఆనంద్‌ వల్ల బైక్‌ను నెట్టుకుంటూ పది కిలోమీటర్లు నడిచే కష్టం వచ్చింది.
*****

ఆనంద్‌ ఇంటికెళ్లాక ఏం ఆలోచించాడో, ఏం చేశాడో తెలియదు కాని మోక్షను, పూర్విని తీసుకొని అద్దె ఇంట్లో చేరాడు. హాయిగా ఆఫీసుకెళ్తున్నాడు. పూర్విని స్కూల్లో చేర్చాడు. మోక్ష కూడా ఎప్పటిలాగే అదే ఏర్‌టెల్‌ ఆఫీసుకి వెళ్తోంది. అతనేం చేశాడో ఎవరికీ తెలియదు.

సతీష్‌చంద్రకు హైదరాబాద్‌ ట్రాన్స్‌ఫర్‌ అయింది.
సికింద్రాబాద్‌లో తిరుమలగిరి దగ్గర వున్న ఆర్మీ క్వార్టర్స్‌లోకి తన ఫ్యామిలీని మార్చుకున్నాడు. బాబుకి స్నానం చేయించటం ఇబ్బంది అవుతుందని సతీష్‌చంద్ర, దృతి కోరగా తారమ్మకూడా తిరుమలగిరి వెళ్లి వాళ్లతోనే వుంటోంది. సతీష్‌చంద్ర ఫ్యామిలీని అక్కడే వుంచి అప్పుడప్పుడు ట్రైనింగ్‌ కోసం అరుణాచల్‌, శ్రీనగర్‌, ఢిల్లీ, జైపూర్‌ వెళ్లి కొద్దిరోజులు వుండి వస్తున్నాడు.
*****

బార్డర్‌లో వున్న నరేంద్రకు బెంగుళూరు ాన్స్‌ఫర్‌ అయింది. పల్లెలో వున్న సొంత ఇంటిని ఆ ఊరి బడిలోని టీచర్‌కి అద్దెకిచ్చి, పొలం కౌలుకిచ్చి సౌమ్యను, శేషేంద్రను బెంగుళూరు తీసికెళ్లి తన దగ్గర వుంచుకున్నాడు. తారమ్మ దృతి దగ్గరే వుంది. ఇంకో రెండు నెలల్లో ఆమె కూడా నరేంద్ర దగ్గరకి వెళ్తుంది.
ఒకరోజు సాయంత్రం ఆఫీసులో వున్న అంకిరెడ్డికి జువెల్లరీ షాపు నుండి ఫోన్‌ వచ్చింది. ”మా పార్టనర్స్‌ విడిపోయాం. అందుకే అర్జెంటుగా మేమిచ్చిన డబ్బును మేము తిరిగి తీసుకోవాలనుకుంటున్నాం. మీరు వచ్చి డబ్బు ఇవ్వకపోతే మీ పేరుతో వున్న ఇంటిని అమ్మేస్తాం” అని…
అంకిరెడ్డికి అర్థంకాక ”నా ఇంటిని మీరెలా అమ్మేస్తారు?” అంటూ గ్టిగా దబాయించాడు.
వాళ్లు చాలా కూల్‌గా ”ఆ అధికారం మీరే మాకు ఇచ్చారు. వెంటనే డబ్బు పట్టుకురండి! లేకుంటే మీ ఇంటిని అమ్మేస్తాం! మాట్లాడేది చమన్‌లాల్‌” అంటూ కాల్‌ కట్ చేశాడు.
కాల్‌ కట్ అయ్యాక కూడా అంకిరెడ్డి చెవి దగ్గర సెల్‌ఫోన్‌ అలాగే వుంది. దాన్ని ఎంతసేపు అలా పట్టుకున్నాడో ఆయనకే సృహ లేదు. ఆఫీసులో ఎవరో వచ్చి పిలిచేవరకు అలాగే వున్నాడు.
ఇంటికెళ్లాక భార్యతో చెబితే భయపడుతుందని చెప్పలేదు. ఆనంద్‌ ఇంట్లోంచి వెళ్లి వేరే అద్దె ఇంట్లో వుంటున్నప్పటి నుండి ఆయనకు చాలా ఒంటరిగా అన్పిస్తోంది. ఏది చెప్పుకోవాలన్నా వినే ఫ్యామిలీ మెంబర్స్‌ కరువయ్యారు. అలా అని ఆనంద్‌కి బాధలు లేవనికాదు. కమల్‌నాథ్‌ కొట్టిన దెబ్బకి కోలుకోలేక పోతున్నాడు. ఇప్పుడెళ్లి ఇది చెబితే నువ్వుకూడా మోసపోయావా నాన్నా అంటాడు. మోసపోలేదంటే నమ్మడు. పైగా ఇంత వయసు వచ్చాక ఏ వెధవపని చేసి ఇంటిని వేరేవాళ్లకి రాసిచ్చాడోనని ఎగతాళి చేస్తాడు. సతీష్‌చంద్రతో చెబితే శ్రద్ధగా వింటాడు కాని ఆ తర్వాత మా నాన్న క్యారక్టర్‌ ఇదా అని అనుమానపడతాడు.
అందుకే వాసుదేవ్‌కి ఫోన్‌ చేసి కమల్‌నాథ్‌ దగ్గర నుండి చమన్‌లాల్‌ దాకా జరిగింది జరిగినట్లు చెప్పి నిద్రపోయాడు.
నిద్రలో ఆయనకు ఏం జరిగిందో ఊపిరాడలేదు. చెమట్లు పడుతుంటే భార్యను లేపాడు. నిద్రలేచిన మాధవీలత భర్తను చూసి కంగారు పడింది. ఆనంద్‌కి ఫోన్‌ చేసింది. అతని ఫోన్‌ స్విఛ్ఛాఫ్‌లో వుంది. సతీష్‌చంద్రకి ఫోన్‌ చేస్తే ఒక్క రింగ్‌కే లిఫ్ట్‌ చేసి ”నేను ఇప్పుడే వస్తున్నానమ్మా భయపడకు” అంటూ ఒక అర్థగంట లోపలే వెహికిల్‌తో వచ్చాడు.
తండ్రిని తల్లిని వెహికిల్లో ఎక్కించుకొని మిలటరీ హాస్పిటల్‌కి తీసికెళ్లి తండ్రిని అందులో జాయిన్‌ చేశాడు.
వాళ్లిచ్చిన ట్రీట్మెంట్ కి అంకిరెడ్డి తొందరగానే కోలుకున్నాడు.
హాస్పిటల్లో మాధవీలత వుంది. సతీష్‌చంద్ర అప్పుడప్పుడు వచ్చి అవసరమైనవి ఇచ్చి, డాక్టర్‌తో మాట్లాడి వెళ్తున్నాడు. మాధవీలత ఆనంద్‌కి ఫోన్‌ చేస్తే ”ఇవాళ ఆఫీసయ్యాక నేను, మోక్ష, పూర్వి వచ్చి నాన్నగారిని చూసి వెళ్తామమ్మా!” అన్నాడు. ఆ మాత్రానికే సంతోషపడింది మాధవీలత.
అంకిరెడ్డిని చూడాలని ఆయన స్నేహితులు వాసుదేవ్‌, నాయక్‌, జాన్‌ వచ్చారు. వాళ్లు రాగానే అంకిరెడ్డితో ”కమల్‌నాథ్‌ని పట్టుకున్నాం రెడ్డి! అతని దగ్గర వున్న ఆనంద్‌ డబ్బుల్ని తీసుకున్నాం. వెంటనే ఆ డబ్బును చమన్‌లాల్‌కి కట్టాం. నువ్వు చమన్‌లాల్‌కి రాసిచ్చిన పేపర్స్‌ తెచ్చాం. నువ్వింకేం టెన్షన్‌ పడకు. నీ ఇంటికేం ఢోకాలేదు” అన్నారు స్నేహితులు.
ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు అంకిరెడ్డి.
దేనికైనా స్నేహితులు కావాలి. అంకిరెడ్డి కళ్లు చెమర్చాయి. కానీ తను చమన్‌లాల్‌కి ఇంటిమీద రాసిన పేపర్స్‌ ఎప్పుడిచ్చాడో ఆయనకు గుర్తు రావడం లేదు.
”కానీ కమల్‌నాథ్‌ మీకెలా దొరికాడు?” అడిగాడు కాస్త వెనక్కి జరిగి రిలాక్స్‌గా కూర్చుంటూ అంకిరెడ్డి.
”నువ్వు నాకు చమన్‌లాల్‌ ఫోన్‌ చేశాడని చెప్పాక నేను బాగా ఆలోచించి నాయక్‌, జాన్‌ సలహాతో ప్రవీణ్‌ని కలిశాను. నేను చెప్పింది విని ముందు ప్రవీణ్‌ భయపడ్డాడు. ”కమల్‌నాథ్‌ను ఇలా చేస్తే అందరి డబ్బులు పోతాయంకుల్‌. పాపం వాళ్లంతా అతను ఇస్తాడన్న నమ్మకంతో వున్నారు. అతను సామాన్యుడు కాదు. ఇప్పటికే వాళ్లను బాగా ఏడిపిస్తున్నాడు. అయినా మీరు అనుకున్న విధంగా అతన్ని మనం పట్టుకోగలమా” అన్నాడు.
”తప్పకుండా పట్టుకుంటాం. ఎవరి డబ్బులు పోవు!” అన్నాను.
”మీ మాటల్లో ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ కన్పిస్తుంది” అన్నాడు. ”అలా అని మమ్మల్ని తక్కువగా అంచనా వెయ్యొద్దు” అన్నాను ప్రవీణ్‌తో. ఇక్కడ మా ముగ్గురితో పాటు ఇంకో నలుగురు మాజీ సైనికులు వున్నారు. ఎవరొచ్చి ఏ సమస్య మాతో చెప్పినా మేమంతా కలిసి మాట్లాడుకుని పరిష్కరిస్తుంటాం. ఏదైనా హెల్ప్‌ కావాలన్నా చేస్తాం. దేనికీ మేము భయపడము. ఎందుకంటే మేమంతా ఒకప్పుడు పాకిస్తాన్‌ కవ్వింపు చర్యల్ని తట్టుకుని భారత సరిహద్దుల్లో రేయింబవళ్లు రెప్ప వాల్చకుండా పహారా కాసిన సైనికులం… ఎప్పుడు చూసినా దాడులు, చర్చలలో మునిగి తేలినవాళ్లం” అన్నాడు.
”అంత పహారా దేనికి బాబుగారు” అని అడిగింది అక్కడే వున్న తారమ్మ.
”దేనికంటే మన దేశంలో ఏ మూల బాంబులు పేలినా దాని మూలాలు పాకిస్తాన్‌లో వుంటాయి. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల జోక్యం వుంటుంది. అవకాశం దొరికినప్పుడల్లా… వాస్తవాధీనరేఖ వెంబడి ఈ శక్తులు చొరబడి భారత్‌ సైనికులపై కాల్పులకు తెగబడుతుంటాయి. కాశ్మీరు లోయలో అశాంతి చోటు చేసుకోటానికి కారకులవుతుంటాయి” అంటూ వాసుదేవ్‌ ఆగాడు ఆలోచనగా.
”అసలు మన దేశానికి పాకిస్తాన్‌కి ఇంత వైరం దేనికి బాబుగారు! మా నరేంద్రను అడుగుదామనుకుంటాను కానీ వాడు చెబుతాడో లేదో అయినా వాడికేం తెలుస్తాయి చిన్నవాడు. తమరు కొంచెం చెబుతారా? అనుభవజ్ఞులు” అంది తారమ్మ ఆసక్తిగా.
ఆమె వైపు గౌరవంగా చూసి ”భారత్‌ పాక్‌ వైరం ఈనాటిది కాదు తారమ్మా! 1947లో దేశ విభజన కాలం నాటి నుండే వుంది. అప్పట్లో వేలాది మంది ముస్లింలు, హిందువులు చనిపోయారు. కాశ్మీరు సరిహద్దు వివాదంతో రగిలిపోయిన పాక్‌ మన దేశంతో మూడుసార్లు యుద్ధానికి తలపడింది. 1965లో మొదటిసారి రెండు దేశాల మధ్య ఐదు వారాల పాటు యుద్ధం సాగింది. ఆ తర్వాత తాష్కెంట్ ఒప్పందంతో కొంతకాలం ప్రశాంత వాతావరణం ఏర్పడింది. 1970 ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈసారి సిమ్లా ఒప్పందంతో ప్రశాంతత ఏర్పడింది. 1998లో భారత్‌ అణుపరీక్షలకు సిద్ధమైతే ఆ తర్వాత ఏడాదికే పాక్‌ కూడా ఈ రంగంలో ముందడుగు వేసింది. 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో మన సైన్యం ధీటుగా సమాధానం చెప్పింది. మనదేశంలోని ఢిల్లీ మీదుగా పాక్‌లోని లాహోర్‌కు రైలు, బస్సు సర్వీసులను ప్రారంభించారు. 2001లో పాక్‌ తీవ్రవాదులు భారత్‌ పార్లమెంటుపై దాడి చేయడంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. మళ్లీ చర్చలకు ప్రతిష్ఠంభన ఏర్పడింది. 2003లో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చోటు చేసుకున్నా పాకిస్తాన్‌ దాన్ని అతిక్రమించటం పరిపాటిగా మారింది. 2007లో ఢిల్లీ నుండి లాహోర్‌ ప్రయాణించే సంఝోతా ఎక్స్‌ప్రెస్‌పైన తీవ్రవాదులు దాడులు చేశారు. 2008లో పదిమంది తీవ్రవాదులు సముద్ర మార్గం గుండా భారత్‌లోకి ప్రవేశించి ముంబాయ్‌లో దాడులకు పాల్పడ్డారు. దీనివల్ల చాలామంది చనిపోయారు. గాయపడ్డారు. ఇందుకు బాధ్యులు పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరేతోయిబా తీవ్రవాద సంస్థ అని గుర్తించి ‘ఇందులో మీ బాధ్యత లేదా?’ అని పాకిస్తాన్‌ను ప్రశ్నించినా…. ‘ఏదీ ఆధారాలు చూపండీ…?’ అంటూ ఎదురు దాడికి దిగింది తప్ప పశ్చాత్తాపం చూపలేదు. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే పాక్‌తో మన సంబంధాలు ఇలా చర్చలు అవతల వైపు నుండి దాడులు… చర్చల్లో ప్రతిష్ఠంభన… మళ్లీ చర్చలు… దాడులు…. మీకు అర్థమవుతాయని…” అన్నాడు వాసుదేవ్‌.
తారమ్మతో పాటు అందరూ ఆసక్తిగా విన్నారు.
”తర్వాత ఏం జరిగింది వాసు. ప్రవీణ్‌ ఏమన్నాడు” అడిగాడు అంకిరెడ్డి.
”ఏమాండు. మేమిచ్చిన ధైర్యంతో ముందుకు సాగాడు. మేము చెప్పినట్లే చేశాడు తన బృందంతో వెళ్లి కమల్‌నాథ్‌ని పట్టుకున్నాడు. కమల్‌నాథ్‌ దగ్గర నుండి ఆనంద్‌ డబ్బులతో పాటు అందరి డబ్బులూ రాబట్టాం. వెంటనే ఎవరి డబ్బులు వాళ్లకు ఇచ్చేశాం” అన్నాడు.
అప్పుడు తెలిసింది మాధవీలతకు మాజీ సైనికుల విలువ. తెగువ.
”ఇది ఆనంద్‌కి తెలుసా? చెబితే సంతోషిస్తాడు. వెర్రితండ్రి వాడికి ఈ దిగులే ఎక్కువైంది ఈ మధ్యన” అన్నాడు అంకిరెడ్డి. అతని మాటల్లో తండ్రి ప్రేమ కన్పించింది.
”ఇంకా తెలియదు రెడ్డీ! ఇప్పుడే ఫోన్‌ చేశాం. వస్తూ వుంటాడు” అన్నాడు వాసుదేవ్‌.
వాళ్లు అలా మాట్లాడుకుంటుండగానే సతీష్‌చంద్ర తన భార్య ధృతిని, బాబును, తారమ్మను తీసుకొని వచ్చాడు. వాళ్లు వచ్చిన పది నిముషాలకి ఆనంద్‌, మోక్ష, పూర్వి వచ్చారు. అంకిరెడ్డిని పరామర్శించారు. మోక్ష వెళ్లి ధృతి ప్రక్కన కూర్చుని బాబుని ఎత్తుకుంది. మాటామంతీ అయ్యాక వాసుదేవ్‌ అందర్నీ ఓసారి చూసి
”మీ అందరూ ఏమీ అనుకోనంటే ఇప్పుడు నేనోపని చెయ్యాలనుకుంటున్నాను” అన్నాడు వాసుదేవ్‌.
అందరూ ఒక్కసారిగా వాసుదేవ్‌ వైపు చూశారు.
”ఏమీ అనుకోం. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి. నో అబ్జక్షన్‌” అన్నాడు అంకిరెడ్డి. ఆయనకు కమల్‌నాథ్‌ డబ్బులివ్వడం, తన ఇల్లు తనది కావడం చాలా ఆనందంగా వుంది. అలా ఆయన ఆనందంలో ఆయన వుండగా వాసుదేవ్‌ లేచి ఆనంద్‌ చెంప చెళ్లుమనిపించాడు.
ఆ చర్యకి ఒక్కసారిగా అందరూ బిత్తరపోయారు.
మోక్ష వెంటనే లేచి నిలబడింది- ”అంకుల్‌! ఆయన్నెందుకు కొట్టారు?” అంటూ నిలదీసింది.
ఆనంద్‌ మాట్లాడకుండా తన చెంపనలాగే పట్టుకొని నేల చూపులు చూశాడు.
”అతన్నే అడుగమ్మా అతనేం చేశాడో!”
బాబుని ధృతి చేతికి ఇచ్చి ఆనంద్‌ వైపు తిరిగి ”ఏం చేశారండీ?” అంది కోపంగా.
ఆనంద్‌ మాట్లాడలేదు.
”మీరు చెప్పండి అంకుల్‌! నన్నూ, పూర్విని చూసుకుంటూ ఆయనిప్పుడు బాగానే వున్నారు. ఎందుకు కొట్టారో చెప్పండి! అదీ అందరం చూస్తుండగా. ఆయనకెవరూ లేరనుకుంటున్నారా?” అంటూ కళ్లు పెద్దవి చేసి చూసింది…. ఆమెను చూసి పూర్వి కూడా నిలబడి ఆమె చేయి పట్టుకొని భయంగా చూస్తోంది. ఆ గది మొత్తం చాలా నిశ్శబ్దంగా వుంది.
వాసుదేవ్‌ గంభీరంగా చూస్తూ ”అందరూ వినండి. ఇది దేశ సమస్య కాకపోయినా ఒక కుటుంబ సమస్య. నేను మిలటరీలోంచి బయటకొచ్చాక ఎన్నో సమస్యల్ని చూశాను. పరిష్కారం చేశాను. ఒక వ్యక్తి నుండి వచ్చే ఇన్ని సమస్యల్ని నేనెక్కడా చూడలేదు. ధృతి ఆడపిల్ల. నా తరుపునే మీ ఇంట్లోకి వచ్చింది. మీలో ఒక్కరన్నా ఆమెను ప్రేమగా చూశారా? సౌకర్యంగా వుంచారా? ఆమె ఒక సైనికుడి భార్య… సైనికులకు ఇంటి దగ్గర ఏ సమస్య వచ్చినా దాని ప్రభావం ఆ సైనికుడి మనసుపై పడుతుంది. డ్యూటీ కరెక్ట్‌గా చెయ్యలేడు. అందుకే వాళ్లకు ఏ సమస్య వచ్చినా నెలకోసారి దర్బారులో జరిగే సమావేశంలో- మా ఊరి దగ్గర భూమి తగాదా వుందనో ఇంటి అద్దె దగ్గర గొడవ వచ్చిందనో ఇంకా ఇతర సమస్యలు వున్నాయనో అక్కడున్న కమాండర్‌తోనో, ఆఫీసర్‌తోనో చెప్పుకుంటారు. అది వినగానే ఆ కమాండర్‌గాని, ఆ ఆఫీసర్‌గాని వారి జిల్లాకు సంబంధించిన కలెక్టర్‌కో ఎం.ఆర్‌.ఓ.కో, తాసిల్దార్‌కో, లేదా పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌కో తెలియజేసి సమస్యను కొంతవరకు పరిష్కరిస్తాడు. కానీ భార్యకు సమస్య వస్తే ఆ సైనికుడు ఏం చేయాలి? అదీ కుటుంబ సభ్యులతో వస్తే? మీరంటారు ఆమె తన తల్లిదండ్రుల సహాయం తీసుకోవాలని. అందరూ తల్లిదండ్రులు వున్న ఆడపిల్లలే వుంటారా? తల్లిదండ్రులు లేని ధృతి లాంటివాళ్లు ఏం చేయాలి? ఆయుధం పట్టని సైనికుల్లా నిశ్శబ్ద యుద్ధం చేయాలా?”
”నిశ్శబ్ద యుద్ధమా?” అన్నాడు అంకిరెడ్డి.
”…అది నిశ్శబ్ద యుద్ధమే రెడ్డీ! మీకు తెలియకుండా ధృతి తన పరిస్థితిని ఎవరి దగ్గరకెళ్లి చెప్పుకున్నా మీ కుటుంబ మర్యాద ఏమవుతుంది? నేనెందుకిలా అంటున్నానంటే గ్యాస్‌స్టౌని లీక్‌ చేసి కోడలిని చంపితే ఒక్కసారే ప్రాణం పోతుంది. అందులో ఎలాంటి యుద్ధం వుండదు. పోరాడి గెలవాల్సిన అవసరం కూడా వుండదు. ఎందుకంటే ఏ కాపురంలోనైనా ఒక కోడలి పాత్ర శాస్త్రీయంగా నేర్చుకునే నృత్యం కాదు. ఏదో సమయం వచ్చినప్పుడు ప్రదర్శించి తర్వాత మౌనంగా వుండానికి… నిత్యం కదిలే పాత్ర అది. సంతోషంతో పాటు బాధల్ని, కన్నీళ్లను మౌనంగా దిగమింగుతూ కదిలే పాత్ర. ఆ పాత్రను కుటుంబ సభ్యులందరు దోసిట్లో దీపంలా కాపాడుకోవాలి కాని ఎవరికి తోచినట్లు వాళ్లు విషప్రయోగం చేస్తున్నట్లు ఆడుకోకూడదు. కానీ మీ ఇంట్లో జరిగిందేమి?” అన్నాడు.
అంకిరెడ్డితో పాటు ఆనంద్‌, మోక్ష, మాధవీలత తలదించు కోవలసిన సమయం అది….
”అన్నిచోట్లా తారమ్మలాంటి దేవతలే వుండరు కదా! అందుకే అలాంటి కుటుంబ బాధిత సైనికుల కోసం ప్రతి జిల్లాలో ఒక సైనిక సంక్షేమ శాఖ వుంటుంది. అక్కడికెళ్లి ఒక్క కంప్లెయింట్ ఇస్తే చాలు ప్రభుత్వం తరుపున ఏ సహాయం కావాలన్నా ఆ సైనికుడి భార్యకు అందుతుంది. అక్కడ ఎప్పటికీ ఒక మాజీ సైనికుడు కూర్చుని వెల్‌ఫేర్‌ ఆర్గనైజ్‌ చేస్తూ వుంటాడు. ఇది చాలామంది సైనికుల భార్యలకు తెలియకపోవచ్చు. తెలిసినా ఆఫీసు దగ్గరకి తనకి తోడుగా ఎవరొస్తారనుకోవచ్చు. మాలాంటి మాజీ సైనికులు అలాంటి వాళ్లకు ఎలాంటి సహాయం చెయ్యానికైనా సిద్ధంగా వుంటాం. ఇది తమ కుటుంబ సభ్యుల చేతుల్లో బాధలు పడుతున్న ప్రతి సైనికుని భార్య తెలుసుకోవాలి. మమ్మల్ని వెంటనే కలవాలి. వీళ్లేం చేస్తార్లే అని నిరాశ చెందకూడదు. ఎక్కడో తప్ప ప్రతి చోట మాలాంటి మాజీ సైనికులు వుంటారు” అన్నాడు వాసుదేవ్‌.
”ఐతే మా ఆయన్ని ఎందుకు కొట్టారు? ధృతి విషయంలో మా ఆయన మీద ఒక్క కంప్లెయింట్ వుందేమో ప్రూఫ్‌ చూపించండి. వుంటే దృతి నేరుగా మీ దగ్గరకి రాకపోయేదా?”
”నో… ధృతి నాకెప్పుడూ కంప్లెయింట్ ఇవ్వలేదు. దృతికి కాని మీకు కాని దృతి తరుఫున నేనున్నానన్నది గుర్తుండకపోవచ్చు. అందుకే ఎవరి పాటికి వాళ్లు లోలోపల పైకి కనిపించని గోతులు తవ్వి ధృతిని మానసికంగా హింసించారు. అదంతా నాకు తర్వాత తెలిసింది. అదిప్పుడు అనవసరం. అయినా నేను ఆనంద్‌ని కొట్టింది అందుకు కాదు”
”మరింకెందుకు అంకుల్‌? ఇక్కడ ఇంతమంది వున్నారు. ఒక్కరన్నా అడుగుతున్నారా? కొట్టి చంపేస్తారా మమ్మల్ని…?” అంటూ గొంతు లేపింది.
ఆయన చాలా సౌమ్యంగా ”అతనేం చేసాడో నీకు తెలిసుండక పోవచ్చు. తెలిస్తే అతన్ని నువ్వు కొట్టవు. అసహ్యించుకుంటావు. కొట్టటానికి అసహ్యించుకోవానికి చాలా తేడా వుంది” అన్నాడు.
”అంత పని ఆయనేం చేశారంకుల్‌?” ఈసారి మళ్లీ కళ్లు పెద్దవి చేసింది మోక్ష.
అందరూ ప్రేక్షకుల్లా కూర్చుని వాసుదేవ్‌ వైపు చూస్తున్నారు. బాబు ఏడుస్తుంటే తారమ్మ అటు ఇటు చూసి ధృతికి అడ్డంగా నిలబడి కొంగు అడ్డంగా పెట్టి ”బాబుకి పాలివ్వు” అంది రహస్యంగా.
వాళ్లిద్దరూ ఆ హడావుడిలో వున్నారు. బాబు ఏడుపు మాని పాలు తాగుతుంటే వాసుదేవ్‌ మాటలు తప్ప ఆ గదిలో ఇంకే శబ్దమూ లేదు.
”వాకర్స్‌ మేట్ గా అంకిరెడ్డి మాకు చాలాకాలంగా స్నేహితుడు. సతీష్‌చంద్రను వదిలేసి ఒక్క ఆనంద్‌ని మాత్రమే మా కొడుకు అని ఆయన గర్వంగా చెప్పుకున్న రోజులు కూడా వున్నాయి. ఆ విలువను అతను కాపాడుకోలేదు. నిన్ను అద్దె ఇంట్లో వుంచటం కోసం అతనేం చేశాడో నీకు తెలుసా మోక్షా?”
”తెలియదు కానీ….. ఏం చేసినా తప్పు లేదు అంకుల్‌! నేనే చాలాసార్లు చెప్పాను. ప్రపంచాన్ని మోసం చేసైనా కట్టుకున్న భార్యను పోషించాలి. గాలికి వదిలెయ్యకూడదని…” అంది.
”అది ఎంతవరకు కరక్టో నాకు తెలియదు. కానీ అతను అలా చెయ్యలేదు. కన్న తండ్రి సంతకాన్ని పోర్జరీ చేశాడు. ఆ పేపర్ని బంగారు షాపులో పెట్టి డబ్బు తెచ్చుకున్నాడు. ఆ డబ్బుతోనే మిమ్మల్నిప్పుడు పోషిస్తున్నాడు. అండగా వుండాల్సిన కొడుకు తల్లిదండ్రుల్ని ఈ వయసులో అలా మోసం చెయ్యొచ్చా! దీని వల్లనే మీ మామగారికి గుండెనొప్పి వచ్చింది” అన్నాడు.
అది వినగానే ఆమె కాస్త తల వంచుకుని గొంతు తగ్గించి ”అంకుల్‌! నేను చిన్నదాన్ని. నేను మాట్లాడపోయేది మీకు నచ్చకపోతే నన్ను క్షమించమని ముందుగానే మిమ్మల్ని వేడుకుంటున్నాను” అంది.
”ఏంటో చెప్పమ్మా! మాట్లాడే అధికారం, హక్కు నోరుండే ప్రతి పౌరునికి వున్నాయి” అన్నాడు నాయక్‌.
”మాట్లాడవలసిన సందర్భంలో మాట్లాడకపోవటం మరింత నేరం. నువ్వు మాట్లాడమ్మా!” అన్నాడు జాన్‌.
సతీష్‌చంద్ర వాళ్ల ముగ్గురు పక్కన కూర్చుని వదిన మాటల్ని వింటున్నాడు. బాబు హాయిగా పాలు తాగుతూ మధ్యమధ్యలో ‘ఊ’ కొడుతున్నాడు. వాడు ‘ఊ’ కొట్టేది కూడా వాళ్లు మాట్లాడకుండా ఆగినప్పుడు విన్పిస్తోంది. పూర్వి తండ్రి వైపు తల్లి వైపు బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. మాధవీలత భర్త కోలుకోవటం వల్ల ‘అది చాలు నాకు’ అన్నట్లు ప్రశాంతంగా కూర్చుని వుంది.
”మాట్లాడమ్మా!” అన్నాడు వాసుదేవ్‌ చాలా ప్రశాంతంగా.
”మాట్లాడతాను అంకుల్‌! మా వారు చేసిన పోర్జరీ సంతకం వల్ల మా మామగారికి ఇల్లు పోతుందేమోనన్న భయంతోనేగా గుండె నొప్పి వచ్చింది. అదే పోర్జరీ సంతకంతో మావారు నాకు బ్రతుకే లేకుండా చేశాడు. ‘ఇలా చేశాడేంటి మామయ్యా మీ అబ్బాయి’ అని నేను మా మామగారిని అడిగాను. ‘తప్పు లేదులేమ్మా! మరిన్ని డబ్బులొస్తాయి’ అన్నాడు. నా పర్మిషన్‌ లేకుండా అలా చేస్తే నేనెలా బ్రతకాలి అంకుల్‌! మేమింకా చిన్నపిల్లలమా పెద్దవాళ్లమీద ఆధారపడి బ్రతకానికి? ఇప్పుడు ఆనంద్‌కి పోర్జరీ సంతకం చేసి నన్ను పోషించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? నా సంతకాన్ని పోర్జరీ చేసి నా జీతం మొత్తం లోన్‌కి కట్టయ్యేలా చేసినందువల్లనేగా! కొడుకు దొంగ సంతకం పెట్టాడని తెలిసి కూడా స్పందించని తండ్రి వున్నప్పుడు అవకాశం దొరికితే అదే పని కొడుకు చెయ్యడన్న గ్యారంటీ ఏమి?
ఉన్న అన్ని వెధవ పనులు కొడుక్కి తండ్రి నేర్పకపోవచ్చు. ఇలాంటివి మాత్రం ఏ కొడుకైనా తండ్రిని గమనించుకుంటూ నేర్చుకుంటాడు. మా మామగారు అది తప్పురా అని అప్పుడే కొడుకును దండించి వుంటే అసలు కమల్‌నాథ్‌ అనే వ్యక్తి ఎదురయ్యేవాడా? అతనికి మమ్మల్ని మోసం చేసే అవకాశం వచ్చి వుండేదా? ఏ అవకాశమైనా ఎదుటివాళ్లకి మనమే కదా అంకుల్‌ ఇస్తాం! నా భర్త ఆనంద్‌ మంచివాడని నా తల్లిదండ్రులు అనుకోవచ్చు. పిల్లనిచ్చారు కాబట్టి… నేను కూడా అనుకోవచ్చు కలిసి జీవించాలి కాబట్టి… వాళ్ల తల్లిదండ్రులు ఎందుకు అనుకోవాలి అంకుల్‌! ఏ చిన్న పొరపాటు కొడుకులో కన్పిస్తున్నా దాన్ని సరి చెయ్యాల్సిన అవసరం, వాళ్లకు లేదా? చదవగానే, మంచి ఉద్యోగం చెయ్యగానే గొప్పవాళ్లయిపోతారా? జీవితానికి ఏది అవసరమో చెప్పుకోవద్దా? సతీష్‌చంద్రను చదువుకోలేదనో, ఇంకేదో అనో తీసేసినట్లు చూడగానే ఆనంద్‌ గొప్పవాడైపోతాడా? అసలు గొప్పతనం దేనివల్ల వస్తుంది అంకుల్‌! మోసపోతూ ఒకరిని మోసం చేస్తూ బ్రతికితే వస్తుందా? కమల్‌నాథ్‌ ఇచ్చిన డబ్బుల్ని చమన్‌లాల్‌కి ఇచ్చి మీరు మంచిపని చేశారు అంకుల్‌!” అంది మోక్ష.
ఆమె మాటలు అక్కడున్న అందరికీ నచ్చాయి.
వాసుదేవ్‌ లేచి చమన్‌లాల్‌ దగ్గర నుండి తెచ్చిన అంకిరెడ్డి సంతకం వున్న పేపర్ని అంకిరెడ్డికి ఇచ్చి ఆనంద్‌ దగ్గరకి వెళ్లాడు. ఆనంద్‌ అలాగే తల వంచుకొని వున్నాడు. ఆనంద్‌ భుజంపై నెమ్మదిగా తట్టి ”ఆనంద్‌! నీది కొట్టించుకోవలసిన వయసు కాదు. అయినా కొట్టాను. అందుకే సారీ చెబుతున్నాను” అన్నాడు.
ఆనంద్‌ తల ఎత్తి వాసుదేవ్‌ రెండు చేతుల్ని పట్టుకొని కళ్లకద్దుకుంటూ ”మీరలా అనకండి అంకుల్‌! మీరు నన్ను కొట్టడం ఎంత కరక్టో నాకు తెలుసు. పిల్లల్ని పొగడటమే కాదంకుల్‌! అప్పుడప్పుడు విసుక్కోవాలి. తప్పు చేసినప్పుడు ఇది తప్పురా అని చెప్పాలి. దండించాలి. సమర్థించకూడదు. ఎక్కడైనా పిల్లలు చెడిపోతున్నారూ అంటే కొంత సొసైటీ తప్పు అయితే మిగిలిన కొంత పెద్దవాళ్ల అబ్జర్వేషన్‌ లేక… పిల్లలకి అన్నీ తెలుస్తాయని ఎందుకనుకుంటారంకుల్‌? కడుపు నిండా తిండి పెట్టగానే సరిపోతుందా? ‘అరే బాబూ! నాకు కారు కొనడానికి, ఇల్లు కట్టానికి చాలా కాలం పట్టిందిరా! వాటి కోసం మీరప్పుడే తొందర పడొద్దు. దేనికైనా కొంత టైం కావాలి. ఒక్క రోజులో ఏదీ రాదు’ అని ప్రతి తండ్రీ తన కొడుక్కి చెప్పుకోవలసిన అవసరం వున్న రోజులు అంకుల్‌ ఇవి… లేకుంటే మోసపోవటమో, మోసం చెయ్యటమో తప్పకుండా జరుగుతాయి. మేమిక వెళ్లొస్తాం! రా! వెళ్దాం!” అంటూ మోక్షను, పూర్విని తీసుకొని అక్కడున్న పెద్దవాళ్లందరికి ఓ దండం పెట్టి ఒక్కక్షణం వాసుదేవ్‌ దగ్గర ఆగి ”మీ మిలటరీ దెబ్బ మామూలుగా లేదంకుల్‌!” అంటూ వెళ్లబోతూ ఏదో గుర్తొచ్చి ఆగిపోయాడు ఆనంద్‌. మోక్షను తీసుకొని ధృతి దగ్గరకి వెళ్లాడు. ”ధృతీ! నువ్వు మోక్ష డ్రస్సుల్ని చూసి నవ్వావని అబద్దం చెప్పి నీ ఇంట్లోనే నీకు స్థానం లేకుండా చేశాను. అవడానికి నేను నీకు బావనే అయినా నీకు చాలా అన్యాయం చేశాను. నేనలా ప్రవర్తించి వుండకూడదు” అన్నాడు.
పక్కనే వున్న సతీష్‌చంద్రకి ఆనంద్‌ మాటలు విన్పిస్తున్నాయి. ధృతి పడుతున్న ఇబ్బంది కనిపిస్తోంది. అయినా అతనికేం అర్థం కాలేదు.
”ఏంటన్నయ్యా? ఏం జరిగింది?” అంటూ వచ్చి, ఆనంద్‌ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు సతీష్‌చంద్ర.
”ఏం లేదు సతీష్‌! ఇదే విషయం మొన్న నీతో చెబుతుంటే నా స్నేహితుడొచ్చి కమల్‌నాథ్‌ దగ్గరకి వెళ్దామని కాల్‌ కట్ చేశాడు. పూర్తిగా చెప్పలేకపోయాను. అసలు ఏం జరిగిందంటే…” అంటూ జరిగింది క్లుప్తంగా చెప్పాడు. నేను చాలా తప్పు చేశాను అన్నాడు. ధృతి వైపు క్షమించమన్నట్లు చూశాడు. మోక్షకూడా అలాగే చూసింది.
”పెద్దవారు. మీరలా చూడకండి! కుటుంబం అన్నాక, నలుగురం కలిసి ఓ చోట వున్నాక ఎన్నో జరుగుతుంటాయి. బాబుని తీసుకోండి బావగారు” అంటూ బాబును ఆనంద్‌ చేతుల్లో పెట్టింది దృతి.
ధృతి వ్యక్తిత్వం ప్రత్యేకమైన కోణంలో కన్పించింది సతీష్‌చంద్రకి…
మోక్ష అత్తగారి దగ్గరకి వెళ్లి ”అత్తయ్యా! మనల్ని చూసి ఎవరు నవ్వినా మనకు బాధగానే వుంటుంది. వాళ్ల అంతు చూడాలనిపిస్తుంది. కారణం చిన్నదైనా సమస్య పెద్దగానే తయారవుతుంది. ఆరోజు ధృతి మిమ్మల్ని చూసి నవ్వలేదు. ధృతి మీద నాకున్న కోపంతో నేనే ధృతి మిమ్మల్ని చూసి నవ్వేలా చేశాను. మీకు ధృతి మీద ద్వేషం కలిగేలా చేశాను. తప్పు నాది. ధృతిని క్షమించండి!” అంది.
మాధవీలతకు ఏం జరిగింది అర్థంకాక అలాగే చూస్తోంది. ”నువ్వు చెబుతున్నది నిజమేనా? ధృతి నన్ను చూసి నవ్వలేదా? నువ్వు నవ్విస్తే నవ్విందా?” అంటూ ఆశ్చర్యపోయింది. ఒక్క క్షణం శూన్యంలోకి చూస్తూ ఆమెలో ఆమె గొణిగింది. ఎందుకో ఏమో మాధవీలత కళ్లు అప్రయత్నంగానే చెమర్చాయి. తల్లి కళ్లలో నీళ్లు రావటం తొలిసారిగా చూశాడు ఆనంద్‌.
అది చూసి ”బాధపడకండి అత్తయ్యా! మీరు కావాలని ఏదీ చెయ్యలేదు. కళ్లతో చూసింది నమ్మారు. నేను కళ్లతో చూడకుండా చెవులతో విని నమ్మాను. ఎంత వద్దన్నా నమ్మకుండా వుండలేం. ఏది నమ్మాలో ఏది వదిలెయ్యాలో ఒక్కోసారి తెలుసుకోలేం. అందుకే ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. తెలిశాక సరిదిద్దుకోవటం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేదు” అంది.
మాధవీలత విచార వదనంతో చూస్తోంది.
బాబును ధృతి చేతికి ఇచ్చి ”పద వెళ్దాం” అంటూ మోక్ష భుజాల చుట్టూ చేయివేసి పూర్విని తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆనంద్‌.
వెళ్లిపోతున్న ఆనంద్‌ని చూసి జాన్‌ ”మనిషి ఎంత బలవంతుడో అంత బలహీనుడు. అతని ద్వారా ఏదో ఒక పొరపాటు జరిగిపోతూనే వుంటుంది. దానికి ఎవరూ అతీతులు కారు. ఆనంద్‌లో నాకు పశ్చాత్తాపం కన్పించింది. అతను నాకు నచ్చాడు” అన్నాడు.
అంకిరెడ్డి నిశ్చేష్టుడై ఆనందేనా ఇలా చేసింది అని ఆశ్చర్యపోతున్నాడు.
వాసుదేవ్‌ నవ్వి అంకిరెడ్డి బెడ్‌ దగ్గరకి వెళ్లి ”ఆరోగ్యం జాగ్రత్త రెడ్డీ! నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కాల్‌ చెయ్యి. మేము ముగ్గురం వచ్చి నీ ముందుంటాం. వెళ్లొస్తాం!” అంటూ వాళ్లు ముగ్గురు బయటకెళ్లి ఎవరి కార్లో వాళ్లు వెళ్లిపోయారు.
ఈ లోపల తారమ్మ పిడికెడు మట్టికోసం బయటంతా తిరిగొచ్చింది. ఎక్కడా దొరకలేదు. వెంటనే తన జుట్టు ముడి విప్పి వెంట్రుకలతో బాబుకి దిష్టి తీసింది. అది చూసి నవ్వుతూ ”ఏం చేస్తున్నారాంటీ బాబుకు?” అంటూ వచ్చాడు డాక్టర్‌ రాజు.
”చూసిన ప్రతి ఒక్కరూ బాబు బుగ్గ గిల్లందే వెళ్లడం లేదు. నర్స్‌లు గిల్లిరి, డాక్టర్లు గిల్లిరి, పేషంట్ల బంధువులు గిల్లిరి. గిల్లంది ఎవరో చెప్పు… దిష్టి తీద్దామంటే గుప్పెడు మట్టి దొరకటం లేదు. ఏం సిటీయో ఏమో రాజు!” అంది.
డా|| రాజు బాబు వైపు చూసి ”నేనిప్పుడు గిల్లొచ్చా ఆంటీ?” అన్నాడు. ధృతి అప్పటికే బాబును రాజుకు దగ్గరగా తీసికెళ్లింది. రాజు మెడలోని స్టెత్‌ని పట్టుకొని బాబు వదలడం లేదు.
”గిల్లు గిల్లు. గిల్లొద్దంటే బావుండదు” అంటూ మనిషంతా కదిలింది తారమ్మ. ఆమె అలా కదులుతుంటే చాలా ఆత్మీయంగా అనిపించింది.
రాజు వెంటనే తారమ్మను కావలించుకొని ”మా ఆంటీ బంగారం. మా సౌమ్య అక్కను తన సొంత బిడ్డకన్నా ఎక్కువగా చూసింది” అన్నాడు.
తారమ్మ రాజు చేతుల్లోంచి నెమ్మదిగా బయటకొచ్చి ”నువ్వు ఈ మిలటరీ హాస్పిటల్లో లేకుంటే అంకిరెడ్డి పోయేవాడని అందరూ అనుకుంటున్నారు నిజమేనా? సతీష్‌చంద్ర తీసుకురాగానే చాలా వేగంగా ట్రీట్మెంట్ ఇప్పించావట…” అంది తారమ్మ.
”మన చేతిలో ఏమీ లేదాంటీ ! ఎవరికి ఎవరు ఎలాంటి సహాయం చెయ్యాలో ముందే దేవుడు నిర్ణయించి వుంటాడట. గతానికి వర్తమానం… వర్తమానానికి గతం కనెక్టయి వుంటాయిట” అంటూ అక్కడ నుండి వెళ్లిపోయాడు.
ఎవరూ లేకుండా చూసి మాధవీలత దగ్గరకు వెళ్లింది తారమ్మ. ”మహానుభావుడు అంకిరెడ్డి కోలుకోవటం నీ అదృష్టం అనే చెప్పాలి మాధవమ్మా! నువ్వారోజు నాతో గొడవ పడింది కూడా మనసులో పెట్టుకోకుండా దృతి వస్తుంటే నిన్ను చూడాలనే వచ్చాను. కానీ వచ్చినప్పటి నుండి నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా వుంది. కన్ను దగ్గర మచ్చలున్నాయని కన్నే మూసుకుని తిరుగుతారా ఎవరైనా? మచ్చలుంటే వున్నాయి కాని కన్ను మూసుకుని తిరుగుతుంటే చూసేవాళ్లు నీకో కన్ను లేదనుకోరా? తెలిసినదానిగా చెబుతున్నాను. దేవుడిచ్చిన రెండు కళ్లతో హాయిగా చుట్టూ వున్న వాళ్లను చూడు. మాట్లాడు. ఆనందంగా గడుపు. అంతేకాని బంగారం లాంటి కన్నును ఒకచేత్తో మూసుకుని గుడ్డిదానిలా… కన్ను మూసుకోవటం కోసం భుజాన్ని వంచి గూనిదానిలా… ఇన్ని అవకరాలు అవసరమా? మచ్చలేని మనసు కావాలి కాని ముఖానికి ఎన్ని మచ్చలుంటే ఏం ఈ వయసులో” అంది.
మాధవీలత మూతి అటుఇటు తిప్పి ఆమె మాటల్ని పట్టించుకోకుండా వచ్చిన పని చూసుకుని వెళ్లు అన్నట్లు చూసింది. తారమ్మ అక్కడి నుండి వెళ్లలేదు. ”చూడు మాధవమ్మా! మనం పెద్దవాళ్లమైపోతున్నాం. మనల్ని చూసి ఆనందించాల్సిన మన భర్తలు కూడా పెద్దవాళ్లయిపోతున్నారు. ఒకికి రెండుసార్లు మనవైపు చూసే ఓపిక కూడా వాళ్లలో వుండటం లేదు. అందుకే నువ్వు నీ ముఖాన్ని దాచుకు తిరగటం ఆపేసి మన పిల్లల పిల్లలతో ఆడుకుంటూ గడిపితే ఆ ఆనందంలో ఎంత అందం వుంటుందో ఒకసారి ఆడి చూడు” అంది.
ఆ మాటతో కదిలిపోయింది మాధవీలత ”నిజమే తారమ్మా! నువ్వు చెప్పేంత వరకు నాకీ ఆలోచన రానే రాలేదు. ఇంటికెళ్లాక పూర్విని నాతోనే వుంచుకుంటాను” అంది.
తారమ్మ నవ్వి ”ఆ పని త్వరగా చెయ్యి. పూర్వి నీ మనవరాలే కాదు, అవసరాన్ని బట్టి నీకు పెద్ద దిక్కు కూడా అవుతుంది. ‘నానమ్మా! నానమ్మా!’ అంటూ నీ చుట్టూ తిరుగుతుంటే నీకంటూ ఓ మనిషి వున్నట్లు ఎంత తృప్తి. ఎంత భద్రత” అంది.
మాధవీలత ఎంతో సంతృప్తిగా తల వూపింది. తారమ్మ అక్కడ నుండి వెళ్లి ఒక చోట కూర్చోకుండా మూతికట్టిన ఉలవల బస్తాలాగా అటూ ఇటూ తిరుగుతూనే వుంది.
*****

అంకిరెడ్డిని హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ చేశారు.
సతీష్‌చంద్ర టాక్సీ మాట్లాడుకుని రాగానే అందరూ టాక్సీలో కూర్చున్నారు. తారమ్మ, దృతి బాబును తీసుకొని వెనక సీట్లో కూర్చున్నారు. మాధవీలత, సతీష్‌చంద్ర, అంకిరెడ్డి ముందు సీట్లో కూర్చున్నారు.
టాక్సీని నెమ్మదిగా తీసికెళ్లమని డ్రైవర్‌తో సతీష్‌చంద్ర ముందే చెప్పటం వల్ల రోడ్డుమీద వెళ్తున్న అన్ని వాహనాలకన్నా ఆ టాక్సీ చాలా నెమ్మదిగా వెళ్తోంది. సిటీ ఔట్ స్కర్ట్స్ ఇంకో పదినిముషాల్లో వస్తుందనగా పూర్తిగా ఆగిపోయింది.
సతీష్‌చంద్ర అటుఇటు చూసి ”ఏమైంది?” అన్నాడు.
”ట్రాఫిక్‌ జామ్‌ సర్‌! ఎవరిదో పెళ్లి కారులా వుంది. డాన్స్‌ చెయ్యటం కోసం ఆగినట్లుంది. అటు చూడండి అందరూ ఎలా వెళ్లి చూస్తున్నారో! ఆ డాన్స్‌ చేస్తున్నవాళ్లంతా కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు. పెళ్లికి ముందు ఇదో సరదా అయింది. దీనికో పేరు కూడా వుంది ‘సంగీత్‌’ అని… ఇదిప్పుడు సిటీలలోనే కాదు సర్‌! విలేజెస్‌లో కూడా పాకిపోయింది” అంటూ చెప్పుకుపోతున్నాడు డ్రైవర్‌.
ధృతి తారమ్మ భుజం గుచ్చి పట్టుకొని ఆసక్తిగా బయటకు చూస్తూ ”అది మేఘారే మేఘా మేఘ అనే పాట ఆంటీ! ఆ పాటకు నేను డాన్స్‌ చేస్తే అద్భుతంగా వుంటుందని మా హాస్టల్లో అందరూ నన్ను మెచ్చుకునేవాళ్లు” అంది సరదాగా.
”ఉష్‌! గట్టిగా అనకు మీ అత్తయ్య వింటుంది” అంది తారమ్మ. తారమ్మకి రోడ్డు మీద వేస్తున్న డాన్స్‌ కన్పించక కారు గ్లాస్‌ డోర్లోంచి తొంగితొంగి చూస్తోంది.
సతీష్‌చంద్రకు దృతి మాటలు విన్పించాయి. ”నాన్నా! ఇక్కడికి మా ఇల్లు దగ్గరే! ఆటోలో వెళ్లిపోతాం! నాకు అర్జెంట్ పని వుంది. ట్రాఫిక్‌ ఫ్రీ అయ్యాక మీరు వెళ్లండి! ఆంటీ బాబును తీసుకొని కారు దిగండి! వెళ్దాం” అంటూ కార్లోంచి దిగబోయాడు.
మాధవీలత ఉలిక్కిపడింది. డ్రైవర్‌ నోటి నుండి ఆ డాన్స్‌ గురించి వింటుంటే దృతి విషయంలో ఇప్పటికే చాలా తప్పు చేసినట్లు అన్పించింది. ఆ డాన్స్‌ చెయ్యక ముందు ఏ అమ్మాయీ ఒక ఇంటికి కోడలు కాదు. ఆ తర్వాత ఏ ఇంటికి కోడలు అవుతుందో తెలియదు. ఒకవేళ తెలిసినా ఆ డాన్స్‌ గురించి తను వెళ్లినంత లోతులకు వెళ్లి ఆలోచించకూడదు. వెంటనే కారు దిగబోతున్న కొడుకు చేయి పట్టుకొని ఆపుతూ ”కారు దిగకు సతీష్‌! అందరం కలిసి ఇప్పుడు మన ఇంటికే వెళ్దాం! మనుషులు ఎప్పుడూ ఒకే రకంగా వుండరు నాన్నా! వుండకూడదు కూడా… తారమ్మను మన ఇంటికి తీసికెళ్లి గౌరవంగా చీరె పెట్టి పంపిద్దాం! ఆమె నరేంద్ర దగ్గరకి వెళ్తే మళ్లీ ఎప్పుడొస్తుందో ఏమో! తారమ్మను ధృతిని రెండు రోజులు నా దగ్గర వుంచి తర్వాత తీసికెళ్లు. ధృతితో నేను చెప్పుకోవలసింది కొంత వుంది. అదంతా ఇద్దరం ఓ చోట కూర్చుని చెప్పుకుంటేనే మనసులో వుండే బాధ తొలిగిపోతుంది. ఆ రెండు రోజులైనా మనవడితో హాయిగా గడుపుతాను. ఏదీ తారమ్మా! బాబును ఒకసారి నా చేతికి ఇవ్వు. నా ఒళ్లో కూర్చోబెట్టుకుంటాను” అంది.
తారమ్మ వెంటనే బాబును ఎత్తి మాధవీలత చేతిలో పెట్టింది.
పెళ్లికారు కదిలింది.
ట్రాఫిక్‌ కదలడంతో టాక్సీ కూడా నెమ్మదిగా కదిలింది.
మాధవీలత చేతిలో వున్న బాబు బుజ్జిబుజ్జి చేతులతో ఆమె ముఖాన్ని తడుముతూ ఆడుకుంటూ ఆమెనే చూస్తున్నాడు. ఆమె వంగి బాబును ముద్దుపెట్టుకుంది. మురిసిపోయారు అంకిరెడ్డి, సతీష్‌చంద్ర. వెనక సీట్లో వున్న తారమ్మ, ధృతి హాయిగా నవ్వుకున్నారు.

-: అయిపోయింది :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *