April 19, 2024

బ్రహ్మలిఖితం – 10

రచన: మన్నెం శారద

“రాగి వేడిని బాగా పీలుస్తుంది తొందరగా. దాని మీద వెలిగించిన కర్పూరపు వేడికి రాగి కాయిన్ వేడెక్కుతుంది. దాంతో ఆముదం కూడా వేడెక్కి దాని డెన్సిటీ (సాంద్రత) తగ్గి పలచబడుతుంది. పలచబడగానే ఆముదం ప్రవహించటం మొదలెడుతుంది వాలుకి. దాంతో పైన జ్యోతి వెలుగుతున్న రాగిబిళ్ళ కదిలి ప్రవాహానికనుగుణంగా నడుస్తుంది. మన అదృష్టం ఆ దిశనుందని.. మనకి భ్రమ కల్గిస్తాడు కోయదొర. నేను కూడా నిన్న జ్యోతి నడవడం గురించి ఆశ్చర్యపడ్డాను. కాని ప్రాక్టికల్‌గా ఆలోచించేను. మీరొక జర్నలిస్టు లోకాన్ని మేల్కొలపవలసిన బాధ్యత వుంది మీకు. ఏదో బ్రతుకుతెరువు కోసమే అయితే ఇంకా చాలా పనులున్నాయి తొందరగా సంపాదించుకోవడానికి” అన్నది లిఖిత.
జర్నలిస్టు ఆమెవైపు తెల్లబోయి చూశాడు.
వయసు చిన్నదయినా ఆమెలోని భావాలు మాత్రం చాలా పదునుగా వుండటమాతను గమనించి ఆశ్చర్యపోయేదు.

*****

కేయూరవల్లి మనసు మాటిమాటికీ స్థిమితం కోల్పోతుంది. దాదాపు ఇరవై సంవత్సరాలు భర్తను వదిలి, భావరహితంగా సముద్రంలో కెరటాలు తకిడికి కదలక నిశ్చలంగా పగలూ రాత్రి అలానే నిలబడి వున్న డాల్ఫిన్ నోస్‌లా కాలం గడిపిందామె.
కాని.. ఇప్పుడెందుకో ఆమె గడ్డకట్టిన హృదయంలో సంచలనం చెలరేగుతోంది.
లిఖిత ఊరు విడిచిన నాటినుండి ఆమె మనసు మనసులో లేదు. కూతుర్ని విడిచి ఎప్పుడూ వుండలేదామె.
దగ్గర వున్నప్పుడు ముద్దు చెసింది. ప్రేమ ప్రదర్శించింది కూడా ఏమీ లేదు.
కాని.. ఇప్పుడు లిఖిత లేకపోతే తెలుస్తున్నదామెకి. తనకి కూతురి పట్ల వున్న అనురాగము.
వెళ్లి ఒక ఫోను కూడా చెయ్యలేదు.
అసలెలా చేరిందో!
ఆయన.. కనిపించేరో లేదో!
ప్రతిక్షణం భారంగా కదిలి గతంలో వినీలమవుతుంటే నిలకడలేని హృదయం చేసే అలజడిని చంపుకోడానికి కేయూరవల్లి వెళ్ళి డ్రాయింగ్ టేబుల్ దగ్గర కూలబడింది.
పెన్సిల్ షార్ప్ చేసి గడులలో డిజైన్స్ నింపుతుంటే.. అవేవీ నచ్చినట్లనిపించిక ఎరేజ్ చేస్తూ కూర్చుంది తిరిగి.
తననవసరంగా లిఖితని పంపించింది.
తండ్రిలాగే ఆమెకూ తొందరెక్కువ. కొంపదీసి తను కూడా కేరళ వెళ్లిపోలేదు కదా..
అలా అనుకోగానే కేయూర గుండే ఒకడుగు క్రిందికి జారినట్లయింది.
కళ్ళలో నీళ్లు సుళ్లు తిరిగేయి.
“ఆంటీ!”
ఆ పిలుపు విని కేయూర కొంగుతో కళ్లు తుడుచుకుని గుమ్మంవేపు చూసింది.
ఎదురుగా ఎంకట్ నిలబడి వున్నాడు నవ్వుతూ.
అతన్ని చూడగానే ప్రానం లేచొచ్చినట్లయిందామెకు.
ఇదివరలో అతనికంత ప్రాముఖ్యమిచ్చేది కాదు. కేవలం లిఖిత స్నేహితుడిగానే గౌరవించేది. అదీ మనసులో మాత్రమే. పెద్దగా మాట్లాడే అవకాశమిచ్చేది కాదు.
కాని.. ఇప్పుడతనామెకు చాలా ఆత్మీయుడిగా గోచరించేడూ.
“వెంకట్, లిఖిత గాని ఫోను చేసిందా నీకు. అసలెలా వెళ్ళింది. ఆ రోజు ఫ్లయిట్ దొరికిందా?” అని అడిగింది కంగారుగా.
వెంకట్ ఆమెని నిశితంగా గమనిస్తూ “బ్రహ్మాండంగా దొరికింది.అసలు నేనెళ్ళకపోతే లిఖిత వెళ్లలేకపోయేది. నా బైక్ ఎక్కమంటే మొండికేసింది. నన్నిష్టం వచ్చినట్టు మాట్లాడింది. అయినా నేను పట్టించుకోలేదనుకోండి. జాగ్రత్తగా ఎయిర్‌పోర్టు చేర్చేను. ఈ పాటికి వాళ్ల డేడితో కబుర్లు చెబుతుంటుంది” అన్నడు.
“నిజంగానే లిఖిత జాగ్రత్తగా చేరుకుంటుందంటావా?” కేయూర సందేహానికి పకపక నవ్వాడు వెంకట్.
“లిఖితనింకా పసిపాపే అనుకుంటున్నారు మీరు. తనకన్నీ తెలుసు. మీకు చెబితే బాగుంటుందో లేదో కాని తను వెళ్తూ వెళ్తూ ఏం చెప్పిందో తెలుసా?” అంటూ కొద్దిగా సిగ్గుపడటానికి ప్రయత్నించేడు వెంకట్.
కేయూర అతనివైపు సందేహంగా చూసి “ఏం చెప్పింది?” అనడిగింది సౌమ్యంగా.
“మీక్కోపం వస్తుందేమో?”
కేయూర రాదన్నట్లుగా తలడ్డం ఊపింది.
“నన్ను వదిలి వెళ్ళలేనంటూ ఏడ్చింది. నన్నూ రమ్మంది. నేనాశ్చర్యపోయేను. తను నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పగానే నా కాళ్లలో వణుకు పుట్టింది. నా స్థానమెక్కడ? మీ అంతస్థెక్కడ? స్నేహానికవన్నీ లేకపోయినా… పెళ్ళికి చాలా అవసరం కదా ఆంటీ. అందుకే.. ఆ సంగతులు తర్వాత మాట్లాడొచ్చని తనని నచ్చచెప్పి పంపించేను.
అతను చెప్పింది విని నిజంగానే దిగ్ర్భాంతికి గురయింది కేయూర. లిఖితకి ఈడొచ్చింది. ఈడుతోపాటు వ్యక్తిత్వమొచ్చింది. ఒకవేళ లిఖిత మనసుకి వెంకట్ నచ్చితే కాదనడానికి తానెవరు?
కాని.. ఎందుకో ప్రతి రూపాయికి లిఖిత దగ్గర చేయి జాచే ఈ వ్యక్తిత్వం లేని పురుషుడు లిఖిత భర్త కావడానికి లోలోపల ఆమె మనసంగీకరించలేకపోయింది.
డోలాయమానంగా వున్న ఆమె మానసిక పరిస్థితిని గ్రహించేడు వెంకట్.
“లిఖితకి భర్త కావడానికి నేనర్హుణ్ణి కాదని మీరాలోచిస్తున్నది. ఆ సంగతి మీకన్నా నాకు బాగా తెలుసు. అందుకే మీరిచ్చి చేస్తానన్నా నేను చేసుకోను. ఆ విషయంలో వర్రీ కాకండి. అద్సరే! అసలింతకీ యింకా యింట్లో కూర్చున్నారేంటి? ఫ్యాక్టరీకి వెళ్లరా?” అన్నాడు నవ్వుతూ.
లిఖిత జాగ్రత్తగా వెళ్లిందని విని కేయూర మనసు ఒకింత ఊరట చెందింది.
“లిఖిత సంగతి తెలీక పిచ్చి పట్టినట్లయింది. నువ్వు చెప్పేవుగా. నాక్కాస్త రిలీఫ్‌గా వుంది. ఇంట్లో కూర్చుంటే చాలా బోర్‌గా వుంది. నేను ఫ్యాక్టరీకి బయల్దేరతాను” అంది కేయూర కాస్త తేలికపడిన మనసుతో.
“నన్ను కాస్త జగదాంబ సెంటర్లో వదిలేయండి” అన్నాడు వెంకట్.
కేయూర రేగిన జుట్టు సరిచెసుకుని, స్లిప్పర్స్ వేసుకుని బయటకొచ్చింది. ఆమెని వెంబడించేడు వెంకట్.
ఇంటికి తాళం వేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని అవతలి వైపు డోర్ తెరిచింది. వెంకట్ ఎక్కగానే డోర్ మూసి ఎ.సి. ఆన్ చేసింది. చల్లని పిల్లతెమ్మెరలాంటి గాలి కారంతా పరచుకొని మనసుకి, శరీరానికి ఆహ్లాదం కలుగచేసింది క్షణాల్లో. వెంకట్‌కి ఎంతో అసూయనిపించింది.
డబ్బుంటే ఎడారిలో సముద్రాన్ని, సముద్రంలో భవనాన్ని సృష్టించుకోవచ్చు కాని.. ఈ డబ్బు అందరికీ అందుబాటులో వుండదు. ఒక ఆడది గర్వంగా, నిటారుగా కూర్చుని డ్రైవ్ చేస్తుంటే ఏమీ చేతానివాడిలా పక్కన కూర్చున్నాడు తను.
ఎందుచేత?
డబ్బులేక!
డబ్బు వలన పొందే సదుపాయాలు లేక!
కేయూర స్టడీగా కారుని డ్రైవ్ చేస్తోంది.
కారు మెత్తగా కదులుతోంది. గతుకుల రోడ్డులోని కుదుపుల్ని మింగి.
కేయూరని క్రీగంట చూస్తున్నాడు వెంకట్. తనొచ్చిన పని కాలేదు. ఇరవై వేలు కావాలని అడగాలని వచ్చేడతను. కాని ఆమెని చూస్తుంటే గొంతు పెగలటం లేదు. ఒకవేళ అడిగినా “ఎందుకు, ఏం పని?” అని అడక్కుండా అంత డబ్బిచ్చే పిచ్చి ఆడదానిలా కనిపించడం లేదామె అతని కళ్ళకి.
ఆమెలో ఏదో గొప్ప మెజెస్టీ వుంది.
నిజానికామె తల కూడా సరిగ్గా దువ్వుకోలేదు. కట్టింది నేత చీర. మెడలో సన్నని చెయిన్. ఎడం చేతికి టైటన్ వాచి. కుడి చేతికి ఒక బంగారు గాజు మాత్రమే వున్నాయి.
కాని.. చాలా శ్రద్ధగా తీర్చి దిద్దుకున్న వాళ్లకన్నా ఆమెలో గొప్ప ఆకర్షణ వుంది. బహుశ అది ఆమె స్వయంగా తనని తాను తీర్చిదిద్దుకున్న వ్యక్తిత్వంలోంచి పుట్టుకొచ్చిన శక్తి కావొచ్చు.
వెంకట్ ఆలోచనల్లో వుండగానే కారు బ్రేకుపడింది.
వెంకట్ ఉలిక్కిపడ్డట్లుగా చూశాడు.
“నువ్వు జగదంబా సెంటర్‌లో దిగుతానన్నావు కదూ?” అంది కేయూర.
“అవునాంటీ!” అంటూ గాభరాగా దిగేడు వెంకట్.
అతను దిగగానే కారు ముందుకి నడవబోతు ఏదో గుర్తొచ్చినట్లుగా రెండడుగులు వెనక్కి నడిపి”వెంకట్!” అంది.
నిరుత్సాహంగా పేవ్‌మెంటెక్కబోతున్న వెంకట్ తన పక్కన నిలబడ్డ ప్రషియన్ బ్లూ కలర్ మారుతీ థౌజండ్‌ని చూసి ఆశ్చర్యపోయేడు.
కేయూరవల్లి డోర్ తెరచి “వెంకట్, ఈ పాతికవేలు కొంచెం ఎల్లమ్మతోట బ్రాంచి ఎస్.బి.ఐ లో డిపాజిట్ చెయ్యి. నేను తిరిగెళ్లాలంటే పూర్ణా మార్కెట్ దాకా వెళ్లి కారు రివర్సు చెయ్యాలి. అక్కదంతా వన్‌వే ట్రాఫిక్” అంటూ బాంక్ బుక్, కాష్ అతని చేతికిచ్చింది.
వెంకట్ మొహం లాటరీ కొట్టినట్లుగా ఆనందంతో కళకళ్లాడింది.
“విత్ ప్లెషర్!” అంటూ డబ్బందుకున్నాడు వెంకట్.
కేయూర ఎక్సిలేటర్‌ని బలంగా తొక్కి కారుని ముందుకి పరుగు తీయించింది.
కారు కనిపించినంత సేపూ చూసి కనుమరుగవ్వగానే హుషారుగా ఈల వేస్తూ, కాష్ తీసుకొని బాంక్ వైపు నడిచేడు వెంకట్. అతని పని కూడా అదే బాంక్‌లో వుండటం విశేషం.

*****

సరిగ్గా సాయంత్రం ఆరుగంటల నలభై అయిదు నిముషాలకి హైద్రాబాద్ కొచ్చిన్ ఎక్స్‌ప్రెస్ జాలార్‌పెయిట్‌లో బయల్దేరింది.
ఎస్పీ హరిహరన్, మిగతా రైల్వే పోలీసు సిబ్బంది లిఖితకి దగ్గరుండి వీడ్కోలిచ్చేరు. ఆమె వద్దని వారించినా టిఫిన్ పాకెట్స్, ఫ్లాస్కులో కాఫీ ఆమె సీటు పక్కన పెట్టేరు. హరిహరన్ ఆమెని ఆప్యాయంగా కౌగలించుకుని “విష్ యూ ఆల్ ది బెస్ట్ బేబీ! రిటర్న్‌లో నాకు తెలియజేస్తే మళ్లీ ఇదే స్టేషన్‌లో నిన్ను కలుస్తాను” అన్నాడు.
అలా చెబుతున్నపుడు అతని కళ్ళు వాత్సల్యంతో తడయ్యేయి.
రైలు కదిలింది. అతని చేతిలోని ఆమె చెయ్యి చిన్నగా జారి విడివడింది.
కంపార్టుమెంటు దూరమవుతుంటే కనిపించినంత సేపూ చెయ్యి వూపుతూనే వున్నాడు హరిహరన్.
లిఖిత హృదయం ఆర్ద్రమైంది.
భారంగా వచ్చి తన సీట్లో కూర్చుంది.
మనసులో ఇంకా తిరుంబత్తూరు గెస్టు హవుసు, జలబంధారి, హరిహరన్ ప్రేమ.. ముద్ర వేసుకొని హత్తుకున్నట్లుగా గుర్తొస్తున్నాయి. అంతా కలిసి పన్నెండు గంటల అనుబంధం .. అంతే!
కాని జన్మజన్మల బంధంగా అనిపిస్తోంది.
తన తాతగారతనికేం చేసేరో తెలీదు కాని.. ఈ ఊరుకాని ఊర్లో భాషేతర ప్రంతంలో, తనకి ఎంతో ఆదరణ, ఆప్యాయతని అందించేరు హరిహరన్.
లేశమాత్రమైన సహాయానికి వంశపారంపర్యంగా కృతజ్ఞతని చూపించిన హరిహరన్‌ని చూస్తుంటే .. ఒక పక్క తన సహాయం అందుకుంటూనే విషాన్ని గుమ్మరిస్తూ, విశ్వాసరహితంగా ప్రవర్తిస్తున్న వెంకట్ గుర్తొచ్చేడామెకు.
ప్రతిక్షణం మరణం వైపు పయనిస్తూన్న ఈ చిన్న జీవితాన్ని కొందరు అకారణ ద్వేషంతో రెచ్చిపోతూ, అబద్ధాలతో మోసగిస్తూ, క్షణక్షణం తమ నీచ ప్రవర్తనతో ఎదుటివాళ్లకి చులకనవుతూ సిగ్గు విడిచి బ్రతుకుతారెందుకో..
“మేడం!”
లిఖిత ఆలోచనల్లోంచి బయటపడి పక్కకి చూసింది.
“ఏంటంత తెగ ఆలోచిస్తున్నారు?” అంటూ నవ్వేడు జర్నలిస్టు.
“హరిహరన్‌గారి గురించి. ఆయన మన గురించి చాలా శ్రమపడ్డారు కదూ!” అంది లిఖిత.
జర్నలిస్టు తీసి పారేసినట్లుగా నవ్వి “మీరు మరీ సెంటిమెంటు ఫీలయిపోతున్నారేంటి? ఆయన జేబులో డబ్బులేవన్నా తీసిపెట్టేడేంటి? గవర్నమెంటు కార్లు, గవర్నమెంటు గెస్టుహౌసు, గవర్నమెంటు సబార్డినేట్స్. అయినా మీ తాతగారి వల్ల ఉద్యోగం సంపాదించేడు కాబట్టి. ఏదో నామ్ కా సర్వీసు చేసినట్లు నటించేడు. వెంటనే ఆయన గురించి మనసులోంచి తీసి పడేసి మన లోకంలో పడండి” అన్నాడు.
లిఖిత అతనివైపు అసహ్యంగా చూసింది.
“ఎంత గవర్నమెంటువే అయినా మనకాయన సేవ చేసి తీరాలన్న రూలేం లేదు. పైగా మా తాతగారేం సర్వీసులో లేరు. చెయ్యారగానే అన్నం పెట్టిన మనిషిని మరచిపోవడం సృష్టిలో బహుశ ఒక్క మనిషికే చేతనవుననుకుంటాను” అంది సీరియస్‌గా.
జర్నలిస్టు మొహం మాడింది.
“ఏదో నేను సరదాకన్నానండి బాబూ! అలా అగ్గి మీద గుగ్గిలమై పోకండి” అన్నాదు నవ్వడానికి ప్రయత్నిస్తూ.
కోయదొర, అయ్యప్ప స్వాములు మళ్లీ ఎక్కేరు.
లిఖిత ఒక ఐ.జీ మనుమరాలని కంపార్టుమెంటంతా తెలిసిపోయి చాలా మర్యాదగా చూడటం ప్రారంభించేరు.
కోయదొర లిఖితని ఎగాదిగా చూసి “మాంచి ఘనమైన జాతకం పెట్టది. కలక్టెరవుద్ది” అన్నాడు.
లిఖిత అతన్ని చిరాగ్గా చూసి “నువ్వింక జాతకాలు చెప్పడం ఆపకపోతే నువ్వు నిన్న కంపార్టుమెంటులో చేసిన గారడీ విద్య రహస్యాలు బయటపెడ్తాను” అంది.
“గారడీ యిజ్జెలా? అట్లనకు పెట్టా కళ్లు పోతాయ్! సమ్మక్క కోపగించేను” అన్నాడు గంభీరంగా.
“నువ్వు నిన్న జ్యోతినెలా నడిపించేవో నేనిప్పుడు చెబితే నా కళ్లు పోతాయో.. నీ వళ్లు చీరబడుతుందో చూద్దాం” అంది సవాలుగా.
అందరూ చిత్రంగా లిఖిత వైపు చూశారు.
కోయదొర మొహం పేలవమైపోయింది.
అయినా దాన్ని కప్పిపుచ్చుకుంటూ “కోయదొరతో ఎకసెక్కాలాడకు”అన్నాడు.
“ఎకసక్కెం కాదు. ఎవరైనా ఒక కాపర్ కాయినుంటే ఇవ్వండి” అంది లిఖిత చాలెంజిగా.
అందరూ గబగబా జేబులు తడుముకున్నారు.
ఇక పరిస్థితి విషమిస్తుందని తెలిసి కోయదొర లేచి నిలబడి గుమ్మం దగ్గరకెళ్ళేడు.
“పారిపోతున్నట్లున్నాడు” అన్నాడు జర్నలిస్టు కంగారుగా.
“కొంపదీసి వెళ్ళే రైళ్ళోంచి దూకడు గదా, అన్యాయంగా చస్తాడు”అన్నాడొక అయ్యప్ప దీక్ష తీసుకున్న వ్యక్తి.
లిఖిత లేచి నిలబడి గుమ్మం వైపు చూసింది.
కోయదొర లిఖితకి రెండు చేతులెత్తి జోడించేడు.
లిఖిత తెల్లబోయినట్లుగా చూసిందతనివైపు.
“కూటికోసం కోటి విజ్జెలు తల్లీ. ఏదోమా పెద్దోల్లు మాకియి నేర్పి పొట్టపోసుకోమన్నారు. నువ్వంతోడివవుతావ్, ఇంతోడివవుతావని జెప్పి ఏదో నాల్గు పైసలు సంపాదించ్కుంటున్న. నా పొట్ట కొట్టమాకు. సదువుకొని, నేయాన్ని తల్లకిందులు జేసి, నీతిమాలి బతుకుతున్న మీ పట్టణాల్లోని జనం కన్నా నేను సెడ్డోణ్ణి కాదు” అన్నాడు చిన్నగా.
లిఖితకి అతను అన్న దాంట్లో అబద్ధమేమీ కనిపించలేదు. అతన్నల్లరి పెట్టడం వృధా అయిన పనిగా భావించి “వచ్చి సీట్లో కూర్చో” అంది తనెళ్ళి సీట్లో కూర్చుంటూ.
ఆమె రాగానే “నా దగ్గరొక రాగి బిళ్ల వుంది. జ్యోతిని నడిపించంది” అనడిగేడొక అయ్యప్ప భక్తుడు.
లిఖిత వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
లిఖిత చిన్నగా నవ్వి “ఊరికే సరదాకన్నాను. నాకేం రాదు.” అంది.
జర్నలిస్టు తెల్లబోయినట్లుగా లిఖితవైపు చూసి “అదేం, అలా వెనక్కు తగ్గిపోతున్నారు. జ్యోతెలా నడుస్తుందో నాకు చెప్పారు కదా~” అన్నాడు.
“అది నీలాంటివాళ్ల కోసం. చేతిలో పెన్నుంది కదాని.. రేప్పొద్దున పేపరు కొక మసాలా వార్తందించి పది రూపాయలు సంపాదించుకోవాలంటే నీలాంటి వాళ్ల కొసం వెలుగుని పంచే శక్తి లేకపోతే తప్పు లేదు కాని చీకటిని వ్యాపింపజేయడం మాత్రం క్షమించరాని నేరం” అంది లిఖిత.
వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో మిగతా వారికి అంతుబట్టలేదు.
అందరి దృష్టి మళ్లించడానికి “అప్పుడే బాగా చీకటి పడిందే టిఫిన్ చేద్దామా?” అంది తన దగ్గరున్న టిఫిన్ పేకట్స్ అందరికీ పంచుతూ.
“ఒక్క మనిషికిన్ని పంపేరేంటి?” అన్నాడొకాయన ఆశ్చర్యంగా.
“ఆయన పెద్ద ఆఫీసరు. ఈవిడొక పెద్దాఫీసరు మనుమరాలు. అందుకే మర్యాదలు పెద్ద లెవెల్లోనే వున్నాయి” అన్నారు మరొకరు.
” ఆ మాటలన్నీ ఎందుకు? అన్నదాతా సుఖీభవ! అన్నారు మన పెద్దలు. ఈ టిఫిన్స్ తిని ఆయన ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకోండి. అదే పదివేలు!” అంది లిఖిత.
అందరూ టిఫిన్స్ చేసి బెర్తులు వాల్చుకున్నారు.
ఎంత వద్దన్నా లిఖిత బెర్త్ కూడా పరచి మర్యాదలు చేసేరు.
లిఖిత బెర్త్ ఎక్కి పడుకొని నిద్రపోవాలని ప్రయత్నించింది కాని.. ఎంతకీ నిద్రపట్టలేదు. పదే పదే తండ్రి గుర్తొస్తున్నాడు.
ఇప్పుడాయన ఎక్కడున్నారో? ఎలా వున్నారో.
అసలు తనాయన్ని చేరుకోగలదా?
ఆ పరభాషా రాష్ట్రంలొ తనకెవరైనా సహాయపడతారా?
అప్పూడు గుర్తొచ్చిందామెకి తను కనీసం తండ్రి ఫోటో ఆయినా చూడనేలేదని ఎలా ఆయన్ని గుర్తించటం?
ఈ విషయం తనకి తల్లికూడా గుర్తు చేయలేదు.
లిఖిత మనసు ఎంతగానొ కృంగిపోయింది బాధతో.
ట్రెయిన్ కొచ్చిన్ చేరేసరికి అయిదు గంటలవ్వొచ్చు. అప్పటికింకా తెల్లావారదు. తను తిన్నగా భగవతి కోవెలకి వెళ్లాలా? ఎక్కడైనా బస చెయ్యాలా?
లిఖిత ఆలోచిస్తూ కళ్లు మూసుకుంది.
ఎక్కడో గుప్పున వాసన.
అది ఖచ్చితంగా లిక్కర్ వాసనే!
ఆమె క్రింద పడుకొన్న కోయదొర వైపు చూసింది.అతడు గాఢ నిద్రలో వున్నాడు. అయ్యపస్వామి దీక్షలో వున్న ఒక వ్యక్తి టాయిలెట్‌కి వెళ్లి వచ్చి క్రింద బెర్త్ మీద పడుకున్నాడు.
కాని.. అతన్ననుమానించడానికి భయమేసింది లిఖితకి
అయ్యప్ప దీక్ష చాలా కఠినతరమైందంటారు. చాలా నిష్టాగరిష్టమైందంటారు. అతనెందుకు తాగుతాడు. అని మనసులోనే లెంపలేసుకుంది లిఖిత.
మరి కొంతసేపటికామెకు కొద్దిగా నిద్రపట్టేసింది. ట్రెయిన్ అతి వేగంగా కదిలిపోతూ ఎక్కడ పట్టాలు తప్పుతుందోనన్నంత వేగంగా పరిగెత్తుతోంది.
ఒక్కసారి ఆమె మీద ఏదో పాకినట్లయి ఉలిక్కిపడి కళ్ళు తెరచింది. ఇందాక అయ్యప్ప దీక్షలో వున్న వ్యక్తి ఆమె మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడు.
లిఖిత భయంతో కెవ్వున అరిచింది.
అంతే!
వెంటనే దాదాపు కంపార్టుమెంట్‌లో అందరూ లేచి పోయేరు. లైట్లు వెలిగాయి.
“ఏం జరిగింది?” అనడిగేరందరూ ఆందోళనగా.
“ఇతను.. ఇతను.. ” అంటూ వణుకుతూ నల్ల డ్రెస్సులో వున్న ఆ వ్యక్తిని చూపించింది లిఖిత.
“నేనా.. నేనేం చేషేను. బాత్రూంకి వెళ్దామని .. లేషానంతే!” అన్నాడతను.
అతను తాగి వున్నాడని అక్కడున్నందరికీ బాగా అర్ధమైపోయింది.
“అబద్ధం. నా మీద చెయ్యేసేడు. తాగాడు కూడా!” అంది లిఖిత్ ఔద్రేకమైన స్వరంతో.
దీక్షలో వుండగా అతను చేసిన అరాచకాన్ని చూసి అందరూ తెల్లబోయేరు. మిగతా అయ్యప్పలు తాము కూడా తప్పు చేసినట్లుగా తలలు దించుకున్నారు.
“నిన్ననే నన్ను ఆడోళ్ళని వశం చేసుకునే వేరుంటే ఇవ్వమని నా ఎంబడి పడ్డాడు. అప్పుడే అనుకున్నా ఈడి కళ్ళకి పొరలు గమ్మేయని” అన్నాడు కోయదొర అతనివైపు చీధరగా చూస్తూ.
అతని మాట విని అందరూ నిశ్చేష్టులయ్యేరు.
వెంటనే కోపంతో అతన్ని కంపార్టుమెంటులోంచి బయటకి నెట్టేయబోయేరు.
“ఈ చీకట్లో ఎక్కడికెళ్తాడులెండి. అతను దీక్షలో చేసిన పాపానికి ఇంతకంటే అవమానం, శిక్ష ఏం కావాలి. నలుగురిలో అతని పరువు తీసేడయ్యప్ప!” అన్నాడొక దీక్షలో వున్న స్వాములు.

ఇంకా వుంది…

2 thoughts on “బ్రహ్మలిఖితం – 10

  1. ప్రతిక్షణం మరణం వైపు పయనిస్తూన్న ఈ చిన్న జీవితాన్ని కొందరు అకారణ ద్వేషంతో రెచ్చిపోతూ, అబద్ధాలతో మోసగిస్తూ, క్షణక్షణం తమ నీచ ప్రవర్తనతో ఎదుటివాళ్లకి చులకనవుతూ సిగ్గు విడిచి బ్రతుకుతారెందుకో….చాలా బావుంది!

Leave a Reply to padmaja Cancel reply

Your email address will not be published. Required fields are marked *