April 20, 2024

మాయానగరం – 38

రచన: భువనచంద్ర

“ఇన్నేళ్ళుగా మీరిక్కడ వుంటున్నారు? నాకు తెలిసి, ఇది నీరు లేక మోడుగా మారిన దేవాలయం. దీన్ని ఇంత పచ్చగా చేసినవారెవరు? ” అడిగాడు రుషి. రుషికి ఇరవై తొమ్మిదేళ్ళు వుంటాయి. అందంగా, దబ్బపండుగా వుంటాడు. వొంటి మీద కాషాయ రంగు పైజామా లాల్చీ వున్నాయి. మెడలో రెండు మూడు పూసల దండలూ, ఓ రుద్రాక్షమాలా వున్నాయి. భుజాన వేలాడుతూ ఓ కాషాయ సంచీ. అతడంతట అతను వచ్చి అమరేశ్వర అవధానిగార్ని పరిచయం చేసుకున్నాడు.
” మీ పేరు చెప్పారు. అసలీ వూరు దేవాలయం, నేనూ, ఇక్కడి పరీస్థితులు మీకెలా తెలుసు? ” కుతూహలంగా అడిగారు అవధానిగారు.
“నేను ఇక్కడే ఆడుకునే వాడ్ని. మీ అబ్బాయిలిద్దరూ నాకు స్నేహితులే. మీకు గుర్తుండకపోవచ్చు. నాకు పదహారేళ్ళప్పుడు మా అమ్మగారు పోయారు. చితా భస్మాన్ని గంగలో కలిపితే మా అమ్మకి ముక్తి లభిస్తుందని మా నాన్న కాశీ బయలుదేరాడు నన్ను వెంట తీసుకెళ్ళారు. ఆవిడ ముక్తి సంగతి తెలియదు కానీ మూడు మునకలు వేసి గంగలోకి జారిపోయాడు మా నాన్న. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో అక్కడి సాధువులు నన్ను ఆదుకున్నారు. జీవితం అనేది ఒక ప్రవాహం అని, నీటిలో ఒక బుడగ పుట్టి, నీటిలోనే పెరిగి నీటిలోనే కలిసిపోయినట్టు, జీవితమనే కాల ప్రవాహంలో జీవులు పుట్టి ఇందులోనే కలిసి పోతాయని బోధించారు. దుఖాన్ని సహించే శక్తి ప్రసాదించారు. తిరిగి రాబుద్ధి కాలేదు. నాలుగు రోజుల క్రితం కాశీలో మా బాబాయిని చూశాను. మా పిన్ని చితాభస్మాన్ని తీసుకొని ఆయనొచ్చాడు. ఆయన్ని చూశాక రక్తం ఎంత చిక్కటిదో అర్ధమైంది. నన్ను చూసి ఆయనా భోరుమన్నాడు. ఆయన బలవంతం మీదే యీ వూరికి మళ్ళీ వచ్చాను. మా ఇల్లు గత పదమూడేళ్ళుగా మా బాబాయి స్వాధీనంలో వుంది. దాన్ని అద్దెకిచ్చి ఆయన కాస్త వేన్నీళ్ళకు చన్నీళ్ళు కలుపుకుంటున్నాడు. అయినా నాకేం కావాలి? ఓ చిన్న గది చాలు. అది కూడా ఎంత కాలముంటానో నేనే చెప్పలేను. నేను అడగక ముందే ఆయన ఇంటిని నా పరం చేశాడు. ఆయన చివరి దశలో నన్నే జాగ్రత్తగా చూడమన్నాడు. భార్య అంటే పిన్ని పోయిందాయే! పిల్ల ఒక్కత్తే! అంటే కూతురన్న మాట. నాకు చెల్లెలౌతుంది. అదిప్పుడు అత్తారింట్లో వుంటోంది. దానికి ఇద్దరు పిల్లలు. కనక అది ఇక్కడ వుంది బాబాయికి సేవ చేసే ప్రసక్తే లేదు. ఆయన గవర్నమెంటు కాలేజీలో లెక్చరర్ గా చేసి వాలెంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నాడు. బి.పీ, షుగర్ రెండూ దండిగా వున్నాయి. అక్కడ రోజు శవదహనాలనీ, చితాభస్మం నిండిన కుండల్ని చూసే కంటే, కొంత కాలం బాబాయికి తోడుగా వుండటమే మంచిదని నాకు అనిపించి వచ్చేశా. అవధానిగారు.. నా పేరు ఋషి. మీ చిన్నప్పటి స్నేహితుడు మాల్యాద్రి మాష్టారి కొడుకుని ” అని చిన్నగా నవ్వి అన్నాడు ఋషి.
“మాల్యాద్రి కొడుకు పేరు పురంధర్ కదా? ” కనుబొమ్మలు ముడిచి అన్నారు అవధాని గారు.
“ఆ పురంధరుడ్ని నేనే. కాశీలో సన్యాసులు నాకు ‘రుషి ‘ అని పేరు పెట్టారు. కాషయంలో వున్నప్పుడు యీ నామమే సరైనది. మీ సందేహం తీరాలంటే ఇంకో విషయం గుర్తు చేస్తా… మీ రెండోవాడు ఫాలక్షావధాని చిన్నప్పుడు సాయబులమ్మాయి అష్రఫ్ ని పెళ్ళి చేసుకుంటానని గొడవ చేస్తే మీరు చావగొట్టారు గుర్తుందా? వాడు మూడు రోజుల పాటు మీక్కనపడకుండా దాక్కుంది మా ఇంట్లోనే ” నవ్వాడు రుషి.
“అవునవును ” తనూ సన్నగా నవ్వారు అవధానిగారు.
“సరే ఇప్పుడేం చెయ్యాలనీ? ” మంటపంలో తను కూర్చుంటూ రుషిని కూడా కూర్చోమని చోటు చూపించి అన్నాడు అవధాని.
“ఆలోచించాలి ఏం చేయాలన్నా ముందీ కాషాయ వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాలి. లేకపోతే జనాలు నన్నో కొత్త దేవుడిగా మార్చే ప్రమాదముంది. వీటిని తీసేసి జాగ్రత్తగా ఓ సంచీలో వేసి, యీ గుడి ఆవరణలోనే ఎక్కడో ఓ చోట పెట్టాలనుంది. మీరు అనుమతిస్తేనే అనుకోండి. ఆ తరవాత పొట్ట కూటి కోసం ఏదో ఓ పని , నాకూ శాంతినిచ్చేదీ, ప్రపంచానికి కొద్దో గొప్పో ఉపయోగపడేది చెయ్యాలనుకుంటున్నాను.
అవధాని గారు రుషి మొహం వంక చూశారు. చాలా ప్రశాంతంగా ఏ దుర్భావనా లేనటుంది. ముఖంలో ఓ వెలుగుంది.
“అలాగే మరి కొత్తబట్టలు? ” అని తల పంకించి అన్నారు అవధాని గారు.
“మీరు సరేనన్నారు గనక నేను బట్టల ఏర్పాటు చేసుకుంటాను, చాలా చాలా సంతోషం అవధానిగారు… అన్నట్టు మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం నాకు చాలా ఎబ్బెట్టుగా ఉంది. మీ స్నేహితుడి కొడుకుని గనుక, మీ బిడ్దల నేస్తాన్ని కనుక మిమ్మల్ని బాబాయి అని పిలవచ్చా? ” అని వినయంగా అన్నాడు రుషి.
“అలాగే పిలు. కానీ బాబూ ఇందాక నువ్వన్నట్టు నీరు లేక ఎండిపోయిన చెట్టులాంటి దేవాలయాన్ని ఇద్దరు ఆడపిల్లలు పచ్చగిల్లేట్టు చేశారు. వారూ నీలాగా ప్రస్తుతం అనాధలు. అందుకే, వారిని నువ్వు తోబుట్టువుల్లా గౌరవించగలిగినప్పుడే ఇక్కడకు రా. లేకపోతే రావొద్దు. మాల్యాద్రి నేను ఐదో తరగతి వరకు కలిసి చదువుకున్నాము. అతను గంగపాలైన సంగతి నీవల్ల నేనూ తెలుసుకున్నాను. వెళ్ళిరా. కానీ నా మాటని మరోసారి మననం చేసుకు వెళ్ళు” లేచారు అవధానిగారు.
“ధన్యవాదాలు బాబాయ్… ” నమస్కరించి బయట వైపుకు నడిచాడు రుషి.
ఈ మాటలు బిళహరికి వినపడలేదు. గర్భ గుడిని శుభ్రం చేస్తున్న షీతల్ కి మాత్రం వినపడ్డాయి, కానీ ఒక్క ముక్క కూడా ఆమెకి అర్ధం కాలేదు. బిళహరి బావిలో నుంచి నీళ్ళు తోడిపోస్తూనే వుంది. నూతి పళ్ళెం నుంచి అవి వాళ్ళు సన్నగా తవ్విన కాలువలో నుంచి కూరగాయల మడుల్లోకి చల్లగా పోతున్నాయి.
ధ్వజస్థంభం మీదకి వాలిన కాకి ముక్కుతో ధ్వజస్థంభం గంటని పొడిచింది. అదే సమయంలో ఓ గాలితెర ఆహ్లాదంగా వీస్తూ మిగతా గంటల్ని కదిలించింది. గంటలన్ని గణగణమంటూ శబ్దించాయి. ఆ శబ్ధాన్ని వింటూ ఆనందంగా నవ్వింది బిళహరి.
“కైలాసనాథ కుమారం
కార్తికేయ మనోహరం ”
అంటూ మధురంగా పాడుకోసాగింది. అది ముత్తుస్వామి దీక్షితుల వారిది. “ఏకదంతం భజేహం ” కీర్తనలోని చరణం. బిళహరి రాగం, త్రిపుట తాళం సమకూర్చబడింది. గుళ్ళోని దేవతలు కూడా అ పాట విన్నారా అన్నంత ప్రసన్న ముఖాలతో వెలిగిపోతున్నారు. సంగీతత్రయంలో ముత్తుస్వామి దీక్షితుల వారిది ఓ ప్రత్యేక పంధా. త్యాగరాజులవారూ, శ్యామశాస్త్రులవారూ, ముత్తుస్వామి దీక్షితులవారూ, కర్ణాటక సంగీతానికి మణిదీపాలవంటివారు. ఒకరు ప్రాణమైతే, వేరొకరు శరీరము, వేరొకరు హృదయము. సంగీతం భగవంతుడి భాష.
షీతల్ పాటగత్తె కాదు. కానీ హింది పాటలు పాడగలదు. ముఖ్యంగా మీరా భజనలు. సంగీతపు లోతులు తెలీకపోయినా స్వరమాధుర్యం శ్రోతల్ని కట్టిపడేస్తుంది. బిళహరి పిల్లలకు సంగీతం నేర్పేటప్పుడు ఆమె కూడా కొంచం దూరంలో కూర్చొని నేర్చుకుంటోంది. ఆ విషయం పెద్దగా బయటకి తెలియనివ్వలేదు. ఆమెకి జ్ఞాపక శక్తి ఎక్కువ. అందుకే బిళహరి పాడే పాటల్ని హిందిలో రాసుకొని తనలో తానే పాడుకుంటూ ఉంటుంది. అక్షరాలు కొంచం వంకర టింకర. చదువుకోడానికి కుదిరితేగా వ్రాయడం వచ్చేది! సుందరీబాయ్ పిల్లలు అక్షరాలు దిద్దేప్పుడు కూర్చున్న చదువే షీతల్ ది.

**************
“అదేమిట్రా… హోటల్ పెడతావా? ” ఆశ్చర్యపోతూ అన్నాడు రుషి బాబాయి.
“అవును బాబాయ్… నాకు చక్కగా వచ్చిన పనుల్లో వంట చేయడం వొకటి. రోజు మనం ఎలాగో వంట చేసుకోక తప్పదు. అదే ఏ హోటలో పెడితే , మన సమస్యా తీరడమే గాక నాలుగు డబ్బులూ వస్తాయి. నా చదువుకి ఏ వుద్యోగం వస్తుంది గనకా? అయినా , ఇన్నేళ్ళు కాశీ అన్నపూర్ణ ప్రసాదంతో బ్రతికిన వాడ్ని. వంట చేయడమంటే ఆవిడ సేవ చేసుకోవడమే! కాదనకు ” అనూనయిస్తోనట్లు అన్నాడు రుషి.
“రుషి.. నాకు మాత్రం ఎవరున్నారురా? ఇదంతా కట్టుకుపోతానా? నా ఉద్యోగం నేను వదిలేసినా బోలెడు పెన్షన్ డబ్బు వస్తూనే వుంది. మీ ఇంటి మీద వచ్చే అద్దే కాదు , యీ ఇంటిని అద్దెకిస్తే హాయిగా జరుగుబాటైపోతుంది. ఎందుకా శ్రమ? ” నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు బాబాయి. “ఖాళీగా వుండలేను బాబాయ్ , నేను చెబుతున్నానుగా, స్వఛ్చమైన పదార్ధాలతో వంట చేస్తా, ఇది నా కోరిక, కాదనకు ” బ్రతిమాలుతున్నట్టుగా అన్నాడు రుషి.
“సరే నీ ఇష్టం ” రుషి భుజం తట్టి అన్నాడు బాబాయ్. ఆయన పేరు సవ్యాద్రి. కాశీలో, ఉత్తరాది సత్రంలో వంట చేసి సంపాదించిన తాలుకు డబ్బు రుషి దగ్గర భద్రంగా ఉంది. కొత్తగా కొన్న లాల్చీ తొడుకొని వంటసామాన్లు ఖరీదు చేయడానికి బయలుదేరాడు రుషి. అతను మలుపు తిరుగుతుండగా ఓ స్కూటర్ వేగంగా వచ్చి , గుద్దెయ్యబోతూ చివరి క్షణంలో తప్పించి ఓ గోడని గుద్దుకొని పక్కకి జారిపోయింది. స్కూటర్ వాలా కింద పడ్డాడు. కానీ లేవలేదు.
రుషి గబగబా వెళ్ళి స్కూటర్ వాలా మీదనుంచి స్కూటర్ ని తీసి పార్కు చేసి స్కూటర్ వాలా నాడిని పరీక్షించాడు. నాడి పర్ఫెక్ట్ గా కొట్టుకుంటోంది అతని బాడీని వెల్లకిలా తిప్పేసరికి తెలిసింది… అతను సృహలో లేడనీ… ఫుల్ గా మందులో వున్నాడనీ, తల నుంచి రక్తం స్రవిస్తోంది.
దారిలో పోయేవాళ్ళ సహాయాన్ని అర్ధించి అతన్నో రిక్షా ఎక్కించాడు రుషి. “హాస్పటల్ కి పోనీ ” అని చెప్పేలోగానే రిక్షావాడు “సార్ యీయన మా ఓనర్ చమన్ లాల్ గారి అల్లుడు ” అన్నాడు.
క్షణాలలో ఎస్. టి. డి. బూత్ నుంచి చమన్ లాల్ కి కబురెళ్లింది. మరో పది నిమిషాలల్లో కిషన్ చంద్ శరీరం రిక్షాలో నుంచి ఆంబులెన్స్ లోకి మార్చబడింది. … అక్కడ్నుంచి సూపర్ స్పెషాలిటి హాస్పటల్ కి అంబులెన్స్ పరుగెట్టింది. శేఠ్ చమన్ లాల్ రుషికి కృతజ్ఞతలు చెప్పడమే కాదు తను పరిచయ పత్రాన్ని కూడా ఇచ్చి , మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్పాడు.
ఆంబులెన్స్ వెళ్ళిపోయినా అక్కడే నిలబడ్డాడు రుషి. ఇంతకీ ఇది శుభసూచకమా? అశుభసూచకమా? సామాన్లు కొనడానికి బయలుదేరుతూనే యాక్సిడెంట్ తప్పింది గనకా ఏక్సిడెంట్ చెయ్యబోయినవాడు కూడా గాయాలలో వున్నా, సరైనా సమయానికి వైద్యశాలకి వెళ్ళడం వల్ల ప్రమాదం నుంచి బయట పడతాడు గనకా, జరిగింది శుభసూచకమేనన్న నిర్ణయానికి వచ్చి ముందుకు కదిలాడు రుషి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు???
*********
సర్వనామం సైలెంటుగా కూర్చున్నాడు. పరమశివం నవనీతం ఇంటి ముందు తచ్చాడటం గమనించాక సర్వనామం గుండె భగ్గునమండుతోంది. వీడెందుకు తిరుగుతున్నాడు? అసలు వీడెవరూ…. నవనీతానికి వీడికి ఏం సంబంధం? సర్వనామం పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు. శామ్యూల్ రాకని గమనించలేదు.
“ఏం భాయ్… ఏమిటంత దీర్ఘాలోచన ? ” తన రాయల్ రివాల్వింగ్ ఛైర్ లో కూర్చుంటూ అడిగాడు శామ్యూల్.
“మీదాకా రావల్సిన విషయం కాదులెండి. ఓ చిన్న విషయంలో ఆలోచన చేస్తున్నాను ”
“అదే ఎవరి గురించా అని ” కుతూహలంగా అడిగాడు శామ్యూల్.
“ఒక వ్యక్తిని చూశాను. వాడి వాలకం సరిగ్గా లేదు. లోకంలో వున్న క్రూరత్వమంతా వాడి మొహంలోనే వుంది. వాడు ఎవడో తెలియాలి. తెలుసుకునే దాకా నా మనసుకి మరో ధ్యాస వుండదు ” సుదీర్ఘంగా నిట్టుర్చి అన్నాడు సర్వనామం.
“తెలుస్కోవడం ఎంత సేపు? పోలీసు డిపార్ట్మెంట్ లో మనవాళ్ళు చాలామందే వున్నారు. వాళ్ళని కదిపితే క్షణాలలో కావల్సిన ఇన్ఫర్మేషన్ టేబుల్ మీదకొస్తుంది. ” తేలిగ్గా నవ్వి అన్నాడు శామ్యూల్ రెడ్డి.
“అదే జనాలు చేసే తప్పు. మీగ్గావలిసిన ఇంఫర్మేషన్ వాళ్ళివ్వడమే కాదు… వాడికి మీకు సంబంధం ఏమిటీ అనే విషయాన్ని కూడా అతి జాగ్రత్తగా గమనిస్తారు. పోలీసులంటే పైసలకి కక్కుర్తిపడే వాళ్ళు మాత్రమే కాదు, అవసరమైతే పైసలిచ్చేవాడిని రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టే మహానుభావులు. పాములోడినైనా నమ్మొచ్చు కానీ పోలీసోడిని మాత్రం కల్లో కూడా నమ్మకూడదు. ” బీడీ వెలిగించాడు సర్వనామం.
శామ్యూల్ రెడ్డికి తల తిరిగింది. ” నిజమే భాయ్… అంతలోతుగా నేను ఆలోచించలేదు. ఇంతకీ వాడి సంగతి తెలిస్తే నీకేంటి లాభం? ” శామ్యూల్ లోని కుతూహలం మళ్ళీ తలెత్తింది.
“అన్నిటికీ లాభాలుండవు రెడ్డిగారు… కొన్ని పనులు కేవలం డబ్బుకోసమే చేస్తాము. కొన్ని పనులు చెయ్యడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. ఎప్పుడో ఓ రోజున దేవుడి ముందు నిలబడాలిగా! ” నిర్వేదంగా నవ్వుతూ అన్నాడు సర్వనామం.
“నీకు… నీకు దైవభక్తి ఉందా? ” ఆశ్చర్యంగా అన్నాడు శామ్యూల్ రెడ్డి.
“మెడలో రుద్రాక్షాలో, క్రాసో, రోజుకైదు సార్లు నమాజో చేస్తూ ‘నేను భక్తుడ్ని సుమా ‘ అని జనాలని నమ్మించేంత భక్తున్ని కాను గానీ, ఏదో ఓ శక్తి యీ లోకాన్ని నడిపిస్తోందన్న విషయం మాత్రం ఖచ్చితంగా నమ్ముతా. దానికి దైవభక్తి అన్న పేరు పెట్టినా , మరో పేరు పెట్టినా నాకే మాత్రం అభ్యంతరం లేదు. ” నిర్లిప్తంగా అన్నాడు సర్వనామం. శామ్యూల్ సైలెంటైపోయాడు. సర్వనామంలోని యీ కోణాన్ని అతను చూడటం ఇదే ప్రధమం.
” సరే… రెడ్డిగారూ, నేను శెలవు తీసుకుంటున్నా. వీడి విషయం తేల్చుకున్నాకే మీక్కనపడతాను. ” లేచి చరచరా బయటకు నడిచాడు సర్వనామం.
*********
“ఏం చేస్తే నువ్వు మామూలుగా వుంటావు? ” కోపంగా అన్నాడు బోస్.
కళ్ళెత్తి అతని వంక చూసి మళ్ళీ తలదించుకుంది నవనీతం.
“సరే… చికాకులో నా మనిషివేననుకొని కొట్టాను. కాళ్ళ మీద పడమంటావా? చూడు… నాకు పిచ్చెక్కుతోంది. తిట్టాలనుకుంటే తిట్టు… కొట్టాలనుకొంటే కొట్టు… కానీ నీ మొహంతో నన్ను చంపకు. ” చేతులెత్తి టపాటపా చప్పట్లు కొట్టినట్టు పదిసార్లు దండం పెట్టాడు బోసు.
“తప్పు నాది బోసు బాబూ.. నీది కాదు. యజమాని దగ్గర పనిమనిషిగా పడుండాల్సిన దాన్ని, పక్కలోకొచ్చి పెళ్ళాంలా ఉన్న, పడుకున్నంత మాత్రాన పనిమనిషి పెళ్ళాం అవుతుందా? కాదు. శీలం సంగతి వదిలేయ్. అన్నీ ఇచ్చుకున్నదానికి దానితో ఏం పని? దెబ్బతగిలింది నాకూ, నా శీలానికే కాదు… నా నమ్మకానికి. నీ అపనమ్మకం, అది క్షణమే వున్నా సరే నా నమ్మకాన్ని చంపేసింది. నీవేమీ బాధపడొద్దు బాబూ, లోకంలో కావాల్సినంత మంది దొరుకుతారు. ఒక్కటి మాత్రం చెబుతున్నా… ముందు ఎవరేనా మంచిదాన్ని చూసి పెళ్ళి చేసుకో. ఎందుకో తెలుసా? వందేళ్ళు పని చేసినా పనిమనిషిని నమ్మి ఇంటి తాలూకు అన్నీ తాళాలు ఎవ్వరూ ఇవ్వరు. కానీ, మూడుముళ్ళు వేసిన మరుక్షణమే మొత్తం ఇంటినంతా పెళ్ళానికి అప్పగిస్తారు.
మాలాంటి వాళ్ళం రైలాంటోళ్ళం. వస్తాం.. పోతాం. పెళ్ళాం రైలు స్టేషన్ లాంటిది. ఎన్ని రైళ్లు వచ్చినా ఎన్ని రైళ్ళు పోయినా స్టేషన్ మాత్రం స్థిరంగా ఉన్న చోటే వుంటుంది. వెళ్ళు బాబూ వెళ్ళు… మనసు చెడగొట్టుకోకు. ” నిర్లిప్తంగా అని నేల మీద కులబడింది నవనీతం.
బోసుకసలు ఏం మాట్లాడాలో తోచలేదు. ఒకటి స్పష్టంగా అర్ధమయ్యింది … నవనీతాన్ని నూటికి నూరుపాళ్ళు పోగొట్టుకున్నానని… నేలలో ఇంకిన పాలు మళ్ళీ గ్లాసులోకి రావనీ. మౌనంగా బయటకెళ్ళిపోయాడు.
“మంచి సారా వుందా? ” పళ్ళన్నీ కనిపించేలా లోపలికొచ్చాడు పరమశివం. గుండె గుభిల్లుమంది నవనీతానికి.
“సారానే కాదు. బ్రహ్మాండమైన ఫారెన్ మందే వుంది నాతో వస్తే ” అతని వీపు మీద చెయ్యేస్తూ అన్నాడు సర్వనామం.
“నువ్వెవడివి? ” చాకులాంటి చూపులు సర్వనామం మీద ప్రసరిస్తూ అన్నాడు పరమశివం.
“నా పేరు సర్వనామం, అబ్బా.. నీలాంటి వాడి కోసమే వెతుకుతున్నాను. నాతో వస్తే లాభం నీకే. రానంటావా.. నాకు మాత్రం నష్టం వుండదు. ” స్థిరంగా అన్నాడు సర్వనామం.
“ఇదిగో… ఇద్దరికీ చెరో గ్లాసు సారా పొయ్యి ” వెకిలిగా అన్నాడు పరమశివం.
“పొయ్యదు ”
“ఎందుకు పొయ్యదు.. పోసి తీరాలి. బజార్లో కొట్టేట్టాక అమ్మకానికి కాక ఇంకెందుకూ? అయినా దాని తరఫున మాట్లాడటానికి నువ్వెవరూ? దాని ముండాగాడివా? ”
మాట పూర్తయ్యే లోగానే పరమశివం చెంప ఛెళ్ళుమంది. నాలుగు పళ్ళు జలజల నేల మీద రాలాయి. వెల్లకిలా పడ్డాడు పరమశివం.
“లేచి బయటకు పద… బ్రతకాలని నీకుంటే మాత్రమే. లేకపోతే ఇక్కడే చంపి ఇక్కడే పాతిపెడతా ” చాలా నెమ్మదిగా అన్నాడు సర్వనామం.
తలొంచుకొని బయటకు నడిచాడు పరమశివం. అతని ఒళ్ళు ఒణుకుతోంది. సన్నగా రివటలా వుండే సర్వనామంలో అంత బలం వుంటుందని పరమశివం ఊహించలేదు.
“వీడెవడో నాకు తెలియదు. నీకు అపకారం చేస్తాడన్న భయంతోటే లోపలికి వచ్చాను. వీడే కాదు ఏ ఒక్కడు నీ వంక కన్నెత్తి చూడకూడదు. నవనీతం… మాట తప్పి నీ ఎదురుగా వచ్చినందుకు సారీ… ” ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తు చెప్పాలనుకున్నది చెప్పి బయటకు నడిచాడు సర్వనామం.
ఓ కలగన్నట్టు నిశ్చేష్టయై నిలబడింది నవనీతం. సర్వనామం ఇచ్చిన ఫోన్ నంబరు తన పర్సులో భద్రంగా వున్న సంగతి కూడా ఆ క్షణంలో ఆమెకి జ్ఞాపకం వచ్చింది. కలతపడ్డ మనసులోంచి కన్నీరు ఉప్పొంగింది. కళ్ళగుండా ఆ ఉప్పెన ఆమె గుండె మీదకి చుక్కలు చుక్కలుగా జారింది. రెండు చేతుల్తో మొహం కప్పుకొని వెక్కెక్కి ఏడ్చింది. మనసులో వున్న భయాలన్నీ ఆ వరదలో కొట్టుకుపోగా, అక్కడే, ఆ చాప మీదే గాఢంగా నిద్రపోయింది నవనీతం…. ఎప్పటికో!
పాఠకుడా… ఆ నిద్ర ఎలాంటిదంటే పసిబిడ్డ అనుభవించే నిద్ర. ఏకాంత సేవ తరువాత భగవంతుడ్ని ఒడి చేర్చుకొనే నిద్ర.
“నీలాల కన్నుల్లో మెల మెల్లగా
నిదురా రావమ్మ రావే
నిండారా రావే! ”

ఇంకా వుంది..

1 thought on “మాయానగరం – 38

  1. ఎంత త్వరగా నవలగా వస్తుందా అని నిరీక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *