March 28, 2023

ఎందరో మహానుభావులు 1. రావు బాలసరస్వతి

ముఖాముఖి చేసినవారు: విశాలి పేరి

తెలుగు పాటల మణిహారములో సరస్వతీ దేవిని అలరించిన స్వర కుసుమాలు ఎన్నో. ప్రతీ పాట ఒక తేనె గుళికగా అందించిన గాయకులు ఎందరో! పాటలో ప్రతి పలుకు మనసుపొరలలో గూడు కట్టుకొనేలా చేసే గాయకులు చాలా తక్కువమందే! . లాలిత్యం, హాయిగా రాగ యుక్తం ఆలపించే గాయనీమణులలో చెప్పుకోతగినవారు రావుబాల సరస్వతి దేవి గారు. తన గాత్రంతో మనసులను సుదూర తీరాలలో ఓలలాడించగల స్వర బాల. గట్టిగా మీటితే తంత్రులు కందిపోతాయేమో అనిపించే సున్నిత స్వర రాగవీణ.
ఈ మధ్య కాలంలో నేను కలిసిన ” ఎందరో మహానుభావుల “లో రావు బాల సరస్వతిదేవి గారు ఒకరు. 93 సంవత్సరాలు వయసులో ఆవిడ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆవిడని నేను కొన్ని ప్రశ్నలు అడగగా ఆవిడ చెప్పిన జవాబులివిగో!

మీ జననం :
నేను 1928 ఆగస్ట్ 28న మద్రాస్ లో జన్మించాను. పెరిగింది గుంటూరు జిల్లా బాపట్లలో. నాన్న పార్థసారథి, అమ్మ విశాలాక్షి.

మీ విద్యాభ్యాసం :
పాటల మీద ఆసక్తి ఎక్కువ అవ్వడంతో, చదువు మీద శ్రద్ధ తగ్గింది. స్కూల్ కి ఎగ్గొట్టడం మొదలగునవి చేసేదాన్ని. అమ్మ తిట్టి, కొట్టేది. కానీ నాన్న గారు మాత్రం బాగా ప్రోత్సాహం ఇచ్చారు.

పాటల మీద మీకు కలిగిన ఆసక్తి:
మా తండ్రి గారికి ఒక థియేటర్ ఉండేది, అక్కడ ఎక్కువగా నాటకాలు, మూకీ సినిమాలు ప్రదర్శించేవారు. శ్రీరంజని, స్థానం నరసింహా రావు గారు, కపిలవాయి మొదలగువారందరు అప్పుడు ఆ నాటకాలలో నటించేవారు. వారు పాడే తీరు చూసి పాడాలనే కుతూహలం కలిగింది. ఒకసారి కపిలవాయి రఘునాథం గారు ఒక నాటకం ప్రదర్శిస్తున్నారు, ఆ నాటకానికి నేను మా అమ్మగారితో కలిసి వెళ్ళాను. అప్పుడు ఆ నాటకం లో “నమస్తే ప్రాణనాథ” అనే పాట నేను పాడుతానని మారాము చేశాను. మా అమ్మ ఊరుకోమన్నా ఊరుకోలేదు. ఇదంతా స్టేజ్ మీదనుండి కపిలవాయి గారు చూశారు. అంతే స్టేజ్ దిగి నన్ను ఎత్తుకొని ఆ పాట స్టేజ్ మీద పాడించారు. అది చూసి ఆ నాటకానికి వచ్చిన వారు, నటించినవారు చాలా ముచ్చట పడ్డారు.

సినీగీతాలు పాడుటకు మీకు కలిగిన అవకాశం:
గుంటూరులో కొబ్బరపు సుబ్బారావు గారు హెచ్.ఎం.వి. లో గ్రాంఫోను రికార్డింగ్ చేసేవారు. “భక్త కుచేల” సినిమా కోసం, కుచేలుని కూతురిగా నటించడానికి, తన పాట తాను పాడుకునే పిల్ల కోసం చూస్తున్నారు. ఎవరో నా పేరు చెప్పారు. 1934లో, అంటే నా 6 సం||ల వయసులో మొదటి సారిగా సినిమాలకి పాట పాడాను నేను. ఆ రోజుల్లో ఆ వయస్సులో పాటలు పాడిన రికార్డ్ నాకే దక్కింది.

సినిమాలలో బాలనటిగా మీ ప్రవేశం :
సి. పుల్లయ్య గారు “సతీ అనసూయ”, “దృవవిజయం”(1935) తీయడానికి నిర్ణయించుకున్నారు. అందులో నటించేవారందరూ 13 ఏళ్ల లోపువారే. ఆ సినిమాలో “గంగ” పాత్ర నన్ను వరించింది. ఆ సమయం లో రికార్డింగ్ కలకత్తాలో జరిగింది. ఆ రికార్డింగ్ కి మా నాన్న గారు తీసుకొని వెళ్ళారు. ఆ సమయం లో నన్ను ఎవరు ఎన్ని పాటలు పాడమన్నా సరే ఒక “కాడ్బెరీ చాక్లెట్” ఇస్తే పాడేసేదాన్ని. అప్పుడు నేను పాడిన పాటలన్నీ ” ఈస్ట్ ఇండియ స్టూడియో ” లో రికార్డ్ అయ్యాయి. అదే సమయంలో నేను “సైగల్” మొ|| పెద్దవారిని చూసి నేర్చుకునే అవకాశం లభించింది. నా గొంతులో వచ్చే మార్ధవ్యము, లాలిత్యము అలా బెంగాళీ గాయకులను చూసి అలవరించుకున్నదే.
కె. సుబ్రహ్మణ్యంగారు “భక్త కుచేల”(తమిళ్) లో యాక్ట్ చేయమని అడిగారు నన్ను. నాకు ఆ సమయంలో తమిళ్ లో మాట్లాడటమే వచ్చు, కాబట్టి పెద్ద పెద్ద బోర్డుల మీద డైలాగులు తెలుగులో వ్రాసి చెప్పించేవారు. ఆ డైలాగులు అన్నింటికీ చెరో “కాడ్బరీ చాక్లెట్” ఇచ్చేవారు. ఆ సినిమాలో కుచేలుని కూతురు, బాల కృష్ణునిగా నటించాను. (ద్విపాత్రాభినయం) ఆ తరవాత తీసిన “బాల యోగిని”లో కూడా నటించాను. అలా “బాల” కృష్ణుడు, “బాల”యోగినిలో నటించడంతో ” సరస్వతి ” అని అమ్మా నాన్న పెట్టిన పేరు కాస్త “బాల సరస్వతి” గా మారింది.

శాస్త్రీయ సంగీతం మీరు ఎక్కడ నేర్చుకున్నారు :
ఆ తరవాత గుంటూరు వదిలి మా కుటుంబమంతా “మద్రాస్” చేరాము. ఆలతూరు సుబ్బయ్య గారి దగ్గర శాస్త్రీయ సంగీతము అభ్యసించాను. పునాది కోసం సంగీతం నేర్చుకున్నాను కానీ సింగపూర్ రబ్బర్ లా సాగే ఆ రాగాలన్నా, ఆ గమకాలన్నా అంత ఇష్టము ఉండేది కాదు నాకు. అందువల్లనే అటువంటి పాటలు పాడటానికి ఇష్టపడేదాన్ని కాదు. ఎప్పుడూ అలా పాడటానికి సాహసించలేదు కూడా. నాకు సున్నితమైన, ఆహ్లాదకరమైన సంగీతమే ఇష్టము. అది ఆనాటిది కానివ్వండి, ఈనాటిదైనా కానివ్వండి- కేకలు పెట్టే పాటలు, సాగతీసే పాటలు ఏ నాడు పాడలేదు, ఇష్టపడలేదు.
కథానాయికగా సినిమాల్లో ప్రవేశం :
“ఇల్లాలు” సినిమా తీయడానికి గూడవల్లి రామబ్రహ్మం గారు ఎస్. రాజేశ్వరరావు గారిని యాక్టర్, సంగీత దర్శకుడిగా స్వీకరించారు. అదే సినిమాకు హీరోయిన్ గా నన్ను తీసుకున్నారు. కానీ, నన్ను ఒక తమిళ్ అమ్మాయిగా పరిచయం చేశారు. ఆ విధంగా సినిమాలలో ప్రవేశం జరిగింది. అప్పటి నుండి ఎస్. రాజేశ్వరరావు గారితో ఎన్నో పాటలు పాడాను.

ఏ.ఐ.ఆర్. లో మీ ప్రవేశం :
ఒకసారి ఆల్ ఇండియా రేడియోలో సాయంత్రము 7:30 కి జరిగే పాటల కార్యక్రమములో పాడవలసిన గాయని రాలేదు. అప్పుడు నేను పని చేస్తున్న స్టుడియోకి “ఎవరైనా పాడేవారు ఉన్నారా?” అంటూ కబురు పంపించారు. స్టూడియో ఓనర్ “ఒకరేమిటి! రాజేశ్వర రావు, బాల సరస్వతి అనే ఇద్దరు పిడుగులు ఉన్నారు ” అని మమ్మల్ని పంపారు . ఆ విధంగా ఏ.ఐ. ఆర్. లో పాడే అవకాశం 1940 లో లభించింది. లైట్ మ్యూజిక్ అనేది ఏ.ఐ.ఆర్. లో ప్రారంభమయ్యింది అప్పటి నుండే.

మీ నాన్నగారి సినిమాల్లో పాడారా :
అప్పటికి నేను ఇంకా “చైల్డ్ ఆర్టిస్ట్” గా సినిమాలలో చేస్తున్నాను. మా నాన్న గారు “రాధిక” అనే సినిమా తీశారు. పద్మనాభం బాలకృష్ణునిగా, రఘురామయ్య గారు (ఈల పాట) పెద్ద కృష్ణునిగా నటించారు. ఆ సినిమా హిట్ కాలేదు కానీ, అందులో నేను పాడిన “గోకులంలో కృష్ణుడు నల్లన, గోకులంలో పాలు తెల్లన” చాలా ప్రజాధరణ పొందింది.

ప్లే బ్యాక్ సింగర్ గా మీ కెరీర్ :
1943లో భాగ్యలక్ష్మి సినిమా తీశారు. అందులో కమలా కోట్నీస్ యాక్ట్ చేశారు. ఆవిడకు ప్లే బ్యాక్ నేను పాడాను, అదీ బి.ఎన్.ఆర్. గారి ప్రోత్సాహం తో. ఆ సినిమాకి నేను పాడిన పాట “తిన్నే మీద చిన్నోడా” తెలుగులో మొట్ట మొదటి ప్లే బ్యాక్ వేరే వారికి పాడినది.

మీ వివాహం, తదనంతరం మీ కెరీర్ :
నా 15వ ఏట అంటే 1944 లో కోలంక రాజా వారితో (వెంకటగిరి సంస్థానం) నా వివాహం అయ్యింది. ఆ తరవాత పాటకి శృతి తప్పింది. ఇంట్లో వారు ఇలా సినిమాలలో పాడటం చిన్నతనంగా భావించేవారు. కాబట్టి వారికి చెప్పి, నా చేత పాటలు పాడించడం మాన్పించేశారు. ఏ.ఐ.ఆర్. కి మాత్రం పాడటానికి అనుమతి ఇచ్చారు.
ఆ తరవాత నా అంతట నేనే కొన్ని పాటలు కంపోస్ చేసుకొని రేడియో లో పాడాను. “చలి గాలి వచ్చింది”, “నల్లని వాడా నీ గొల్ల కన్నెనోయి”, “హాయమ్మ హాయి బంగారు పాపాయి”, “గోపాల కృష్ణుడు” చాలా ప్రాచుర్యం పొందాయి. అలా గత 5-6 సం||ల వరకు పాడాను.

మీరు ఎటువంటి పాటలు పాడటానికి ఇష్టపడతారు :
ఆర్టిస్ట్ వాయస్ కల్చర్ కి తగినట్టుగా పాటలు ఇస్తే ఎలాంటి పాటలైనా వినసొంపుగా ఉంటాయి. అలా కాక నా చేత అరుపులు, హై పిచ్ లో పాడిస్తే అవి కర్ణకఠోరమే. అందుకే కొన్ని పాటలు పాడననే చెప్పాను. నాకు సాటిస్ఫాక్షన్ లేని పాటలు ఎంత బలవంత పెట్టినా పాడలేను.

అప్పటి మీ తోటి గాయనీగాయకులతో మీ సాన్నిహిత్యం :
అప్పుడు పాడిన వారిలో ఎం.ఎల్. వసంత కుమారి , పి.ఎం. పెరి నాయక్ , టి.వి. రత్నం వీళ్లంతా తమిళ్ గాయనీమణులు. నా తరవాత పాడినవాళ్ళలో జిక్కి, లీల, జమునారాణిలతో సన్నిహితం కలదు.
జెమిని స్టూడియోస్ వారు “రాజీ నా ప్రాణం” అనే సినిమాకి “మల్లె పూలు మొల్ల పూలు” అనే పాట వెస్టర్న్ స్టైల్లో పెట్టారు, అంత రేంజ్ లో పాడటానికి కొద్దిగా కష్టపడ్డాను. నాతో పాడేటప్పుడు ఘంటసాల వారి శృతి తగ్గించుకొని పాడేవారు. ఏ.ఎం. రాజా గారిది నాతో సరిగ్గా సరిపోయేది.

ఇష్టమైన పాట :
తెనాలి రామకృష్ణలో “ఝం ఝం కంకణములు మ్రోగ “(జావలి), స్వప్న సుందరి లో పాటలు అన్నీ ఇష్టము.

కష్టపడి పాడిన పాట :
“రాజీ నా ప్రాణం” లో “మల్లె పూలు” పాట 5 రోజులు పట్టింది రికార్డ్ చేయాడానికి. చిన్న తప్పుకే మళ్ళీ మొత్తం పాట మొదలెట్టాల్సి వచ్చేది. 60- 70 మంది ఆర్కెస్ట్రాలో ఏ ఒక్కరు తప్పు వాయించినా మళ్ళీ కథ మొదటికే. ఇలా ప్రాణాలు తోడింది “రాజీ నా ప్రాణం”.

ధరణికి గిరి భారమా పాట గురించి :
ఈ పాట సినీ ప్రపంచానికి దూరమయ్యే ముందు పాడిన పాట , చాలా ప్రజాధరణ పొందింది.

అభిమాన గాయనీ గాయకులు :
ట్యూన్, సంగీతము నచ్చితే ఏ పాటైనా ఎవరు పాడినా వింటాను. ఎవరైనా ఒరిజినల్ వాయిస్ లో పాడితే చక్కగా ఉంటుంది, ఫాల్స్ వాయిస్ లో కీచు గొంతుతో పాడితే కర్ణకఠోరమే.

ఇష్టమైన రాగం :
భీంపలాస్ “తలపు తీయునంతలోనే తత్తరపాటు ఎందుకోయి” సి.వి. సుబ్బరామన్ చేసిన ఆ రాగం ఇప్పటికీ మరువనిది. ఎస్. రాజేశ్వరరావు గారికి కూడా ఇష్టమైన రాగం ఇదే. ఆయన ఎక్కువ పాటలు చేసినది కూడా ఇదే రాగం లో. మేము ఎక్కువగా పాడినది ఈ రాగం లోనే అవడం మూలంగానేమో చాలా ఇష్టమైన రాగం అయ్యింది.

సినిమాలో చివరి పాట :
“సంఘం చెక్కిన శిల్పాలు” (విజయనిర్మల తీసినది) లో నా చేత పాడించింది. రమేశ్ నాయుడు గారి సంగీత దర్శకత్వంలో.

ఈ నాటి పాటల పై అభిప్రాయము:
భాష రానివారి చేత కూడా పాడించినప్పుడు అందులో భావం, తప్పొప్పులు చెప్పి పాడించాలి. అప్పుడే పాట సుస్థిరంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఎస్. రాజేశ్వర రావు గారు, సుసర్ల దక్షిణా మూర్తి , పెండ్యాల సి.వి. సుబ్బరామన్ గారు… వీరందరు నా తరవాత వచ్చిన వారే, కానీ నాకంటే పెద్దవారు. వారిని ఈ రోజుకీ గుర్తు పెట్టుకునేలా చేసింది వారి ఆహ్లాదకరమైన పాటలే.

అవార్డ్స్ :
ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు.

ప్రస్తుతం మీ జీవితం:
1974లో భర్త పోయాక మైసూర్ లో సెటిల్ అయ్యాను. కానీ ఎన్.టి.ఆర్. నన్ను ఆంధ్రాకి రమ్మని బతిమాలి తగిన స్థానాన్ని ఇస్తామని అన్నారు. కాని తీరా వచ్చాక ఆయన పదవి నుండి, ఆ తరవాత శాశ్వతంగా పోవడంతో నేను మళ్ళీ ఏ గుర్తింపు లేకుండా ఉండిపోయాను.

గాయనిగా మీ ప్రస్థానంలో ఒక చోట ఆగిపోయారు.. గాయనిగా మీరు కోల్పోయినదేంటి?
నా తరవాత వచ్చిన ఎందరో గాయనీమణులు చాలా ఖ్యాతి పొందారు, అది వారి అదృష్టము, వారి విద్వత్తు కి ఒక మైలు రాయి కావచ్చు, కానీ వారు మంచి సంగీత దర్శకుల చేతిలో పడటం వజ్రానికి సాన పెట్టడం లాంటిదే. కొందరు సంగీత దర్శకులు చేసిన ప్రయోగాలు వారికి వరాలయ్యాయి.
జానకి సన్నాయితో కలిసి ఆలపించిన పాట, ఎస్.రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో సుశీల పాడిన వీణ పాటలు, వారి ఖ్యాతి కిరీటంలో చక్కటి మణులు. ఇలాంటి అవకాశాలు నాకు లభించలేదు.

ఈ వయసులోనూ ఏమాత్రమూ విసుగు లేకుండా అడిగిన ప్రశ్నలన్నింటికీ చాలా శాంతంగా, వినయంగా జవాబిచ్చిన ‘బాల సరస్వతీ దేవి ” గారికి కృతజ్ఞతలు. భగవంతుడు ఆవిడకు ఆయురారోగ్యాలు ఇవ్వలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

3 thoughts on “ఎందరో మహానుభావులు 1. రావు బాలసరస్వతి

  1. ఇన్తర్వ్యూ బాగుంది. రావు బాల సరస్వతి నా అభిమాన గాయని . ఆవిడ పాడిన బంగారు పాపాయి బహుమతులు పొందాలి నాకు చాలా ఇష్టం. నేనూ పుట్టినప్పుడు మా అమ్మ , మా అత్తయ్య నన్ను ఎత్తుకొని ఈ పాట పాడేవారట. ఇప్పటి కీ మా ఇంట్లో కొత్తగా పుట్టిన పాపాయికి ఈ పాట పాడుతాము 🙂

  2. విలక్షణమైన గానం. వింటుంటే మనసుకి హాయిగా ఉండేది.

  3. ఎటువంటి అవార్డు రాకపోవడం బాధాకరం.ఇంటర్వ్యూ చాలా బావుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

September 2017
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930