March 28, 2024

కొత్త కథలు – సమీక్ష

రచన: ఎమ్మెస్వీ గంగరాజు

అలనాటి మేటి తారకలు, శాంతా రంగస్వామి, పూర్ణిమా రావు, అంజుమ్ చోప్రా, డయానా ఇడుల్జీ మొదలగు వారూ, ఈనాటి తారకలు మిథాలీ, దీప్తీ, మంధానా, హర్పీత్, జూలన్ మొదలగు వారూ కలసి అద్భుతంగా ఆడుతూ అలరిస్తున్న క్రికెట్ మాచ్ ని వీక్షిస్తూంటే కలిగే అనుభూతి లాంటిదే, నిన్నా. మొన్నటి మేటి రచయిత్రులూ, నేటి వర్ధమాన రచయిత్రుల కలాల నుండి జాలువారిన ఈ 33 “కొత్త కథలు” కదంబాన్ని అవధరించడంలో కలుగుతుంది అని చెప్పక తప్పదు. క్రొత్త పాతల మేలు కలయిక అంటే ఇదేనేమో!

అలనాటి తారకలు పరుగుల వరదలు కురిపించకపోయినా వారి లేట్ కట్ లూ, స్క్వేర్ కట్ లూ ప్రేక్షకులను అలరించినట్లే, సీనియర్ రచయిత్రుల కథలలో ఉండి ఉండీ మెరిసిన తళుకులు పాఠకులను అలరించి తీరుతాయి.

దొరికిన అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకుని ప్రతిభను ప్రదర్శించిన జూనియర్ ఆటగాళ్ళ(ఆటగత్తెల)కు మల్లె వర్ధమాన రచయిత్రులు తమ ప్రతిభ ప్రదర్శించారు కథలలో.

నాలుగో, అయిదో కథలు కాస్త నిరుత్సాహం కలిగించినా కథలు భేషుగ్గా ఉన్నాయనే చెప్పాలి. మొత్తం మీద ‘సినారె’ బెనిఫిట్ మాచ్ ని – అదేనండీ, సంస్మరణ కథా సంకలనాన్ని – రక్తి కట్టించేలా చేశారు నిర్వాహకులు వంశీ రామరాజు గారు!

రచయిత్రులచే విరచితమవ్వడం వలన కాబోలు ఎక్కువ శాతం స్త్రీ పాత్రల ప్రాధాన్యత గలవే! ఉదా:
శృతి (శృతి అనకూడదు, శ్రుతి అనాలనుకోండి.) కథ”దుష్ట రక్షణ”.ఈ కథలో శ్రుతి ఏదో ఆధారం చూపించి నిందితునికి శిక్ష పడేలా చేస్తుంది అని చివరి వరకూ ఆశించిన పాఠకుడికి కాస్త నిరాశ కలుగుతుంది), రమ్య(నెల పొడుపు కథ.’కథని పూర్తిగా అరటి పండు ఒలిచి పెట్టినట్టు చెప్పేస్తే పాఠకుడిని చిన్న చూపు చూసి నట్టే అవుతుంది. అతడి ఊహకి కూడా కొంత విడిచి పెట్టాలి.’ అంటాడు సుప్రసిద్ధ కథకుడు చెహోవ్!నిజమే! అయితే, ఈ కథలో రమ్య ఆశయం ఎలా నెరవేరుతుందో పూర్తిగా పాఠకుని ఊహకి విడిచి పెట్టేశారు రచయిత్రి. అంతా పాఠకుడే ఊహించుకుంటే ఇక కథకులెందుకు?), ఇందిర(పెండ్లి అంటే ఇది), జానకి(పొద్దు తిరుగుడు పువ్వు), మాలతి(ఉత్తరం), వెంకట లక్ష్మి(స్వాభిమానం), చైతన్య(చైతన్య), జయ(గోడలు కదిలాయ్), ప్రణీత(ఈ ప్రశ్నకు బదులు ప్రశ్న కాదు), ప్రియాంక(పేరు), వైజయంతి, మారియా(మానవత్వపు స్పర్శ), సుజాత(విచక్షణ), ధార(వేగు చుక్క పొడిచింది కథ- సామాజికంగా ఇది పరిష్కారం కాదేమోనని పించింది) , ప్రవల్లిక(అమ్మా, నాన్న – ఒక పెళ్ళి), సావిత్రి(ఆలంబన), సుమ(నిర్లక్ష్యం వెల).

కొన్ని కథలు పురుష పాత్రలకూ ప్రాధాన్యత ఇచ్చాయి. ఉదా:
శేఖర్(ఇది కథ కాదు), కొడుకు(వచ్చే జన్మకైనా),వంశీ మాధవుడు, రాజారావు(ప్రేమంటే భయం ఎందుకు?),రామకృష్ణారావు(హుండీ).

సెంటిమెంట్ ప్రధానంగా కలవి – పాత సామాన్లు, వెన్నెల పుష్పాలు. విలక్షణమైన కథ”ఇద్దరు”. ‘మనిషి జాడలు’ లో రచయిత్రి ఒక క్రొత్త విషయం చెప్పారు. కారు ఓనర్లకుపయోగ పడవచ్చు. ఆర్ద్రతతో కూడిన కథ ‘బడుగు నీడ’. తమాషా కథ “శ్రద్ధగా పని నేర్చుకో నాన్నా”(పొత్తూరి విజయలక్ష్మిగారి బ్రాండు! “మైక్రో ఫైనాన్స్” లోని కష్టాలు తెలిపే కథ. మంచి సెటైర్ తో కూడిన కథ “తెలుగు రాని దానివని దిగులు చెందకు.”.

33 రచయిత్రులను ఏక ధాటిగా చదవడం ఒక చిత్రమైన అనుభవం. చివరగా, క్రికెట్ పరిభాషలో ప్రారంభించాం కాబట్టి అదే ఒరవడిలో ముగింపు పలుకుదాం!”ఉత్తరం”, “స్వాభిమానం”, “ప్రేమంటే భయం ఎందుకు?”, “హుండీ” కథలు సెంచరీలతోనూ, “ఇది కథ కాదు”, “”అమ్మ, నాన్న – ఒక పెళ్ళి”, అర్థ సెంచెరీలతోనూ అలరించాయని స్వాభిప్రాయం!

1 thought on “కొత్త కథలు – సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *