April 25, 2024

ఫ్యామిలీ ఫోటో

రచన – డా. లక్ష్మి రాఘవ

“వాసూ”
రామచంద్ర గొంతు విని రూం నుండి బయటకు వచ్చాడు వాసుదేవరావు.
హాల్లోకి వచ్చిన రామచంద్రను చూస్తూ” రా …రా… రామూ” అని ఆహ్వానిస్తూ ముందుకు వచ్చి సోఫాలో కూర్చోమంటూ సైగ చేసి తానూ రామచంద్ర పక్కనే కూర్చున్నాడు.
“ఏమైంది నీకు? ఫోను స్విచ్చ్ ఆఫ్ చేస్తే అందరికీ కంగారు కాదా అదీ రెండు రోజులు?”
“నీవు ఫోను చేసావా?”
“నేను చేస్తే రెండుసార్లు చూసి ఏకంగా ఇంటికే వచ్చి చూస్తాను. దూరంగా వుండే పిల్లలు కంగారు పడరా???”
“వాడికి తెలిసిందా?”
“నీ కొడుకు రవి రెండు రోజుల్లో లెక్కలేనన్ని సార్లు చేసి చివరకు హైదరాబాదులోని నా కొడుకు మధుకు ఫోను చేసి ‘మీ నాన్నను ఒక సారి చూసి రమ్మని చెప్పరా…మా నాన్నకి ఒంట్లో బాగా లేదు. ఎలా వుందో కనుక్కోమని ఫోను చేసాడంట. వాడు నాకు ఫోను చేస్తే నిన్ను చూసి పదిరోజులు పైన అయ్యింది కదా అనుకుంటూ నేనే వచ్చాను..”
“కొంచెం యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చింది…లోకల్ గా డాక్టరు దగ్గరికి వెళ్లి వచ్చాను. యాన్టీ బయాటిక్స్ ఇచ్చాడు…అవి పడలేదు నాకు…అలర్జిక్ రియాక్షన్ లాగా వస్తే మందు మార్చాడు…అది పని చెయ్యకపొతే బెంగళూరుకు వెళ్ళండి’ అన్నాడు. ఈ మాట మా ఆవిడ కొడుకుతో చెప్పింది..అంతే పొద్దునా.. సాయంకాలం ఒకటే ఫోన్లు.. భరించలేక పోయాననుకో అందుకే స్విచ్ ఆఫ్ చేసి వుంచా”
“ఇది మరీ బాగుంది…నీ ఆరోగ్యం విషయమై వాళ్ళు కంగారు పడి పదేపదే ఫోను చెయ్యడం కూడా తప్పేనా?…”
“కొన్ని విషయాలు మనల్ని బాధ పెడతాయిరా…”
“ఈ కాలంలో కొడుకులు పట్టించుకోకుంటే బాధపడాలి కానీ ఇలా కూడా అనుకుంటారా?”
“మనం ఆరోగ్యంగా వున్నన్ని రోజులూ పిల్లలతో మాట్లాడ్డానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది…కానీ జబ్బు పడ్డప్పుడు వారు వర్రీ అవుతూ వుంటే కష్టంగా వుంటుంది… ఇంకో విషయం ఏమంటే నాకు బాగాలేనప్పుడు “నీకు ఎలా వుంది?”అని పదే పదే అడిగితే ఇష్టం వుండదు…”
“అంటే నీకు ఇష్టం లేదని స్విచ్ ఆఫ్ చేస్తావా? దానితో అమెరికాలో వున్న నీ కొడుకు ఎంత బాధపడతాడో ఆలోచించావా?”
“బాగా లేకపోతే చూపించుకుంటాం..వాడేమైనా రావడానికి అవుతుందా? రెండు పూటలూ డాక్టరు దగ్గరకు పోయినా? ఏమి మందులు” అని అడగటం, తగ్గకపొతే బెంగళూరు పోయి టెస్టు లు చేయించుకో అని సలహాలు ఇవ్వటం భరించలేక పోతున్నానురా..”
“అలా అనుకోకూడదు..వాళ్ళు ఆందోళన చెందుతున్నందుకు ఆనందపడాలి..”
“నాకు అలా అనిపించదు”
“మూర్ఖంగా మాట్లాడుతున్నావు”
“అవును మూర్ఖత్వమే నాది…దూరంగా వుండే వాళ్ళను బాధపెట్టేది ఎందుకు?”
“కొడుకును అమెరికా పంపడానికి ఉత్సాహం చూపింది నువ్వు కాదా? రవి ఏమన్నాడో గుర్తు చేసుకో…”మీకు దూరం అయిపోతాము నాన్నా వెళ్ళను” అనలేదూ? భవిష్యత్తు బాగుంటుంది వెళ్ళు మాదేముంది నీవు అమెరికాలో వుంటే మేము రాలేమా అని నీవు చెప్పలేదా? మనవడు పుట్టాక ఒక్కసారి వెళ్లి వచ్చారు కానీ మళ్ళీ వెళ్ళలేదు మీరు కూడా…”
“అవును వెళ్ళలేదు…అక్కడ వాతావరణానికి అడ్జస్టు కావడం కష్టం. ఇంకా చెప్పాలంటే వాళ్ళ లైఫ్ వాళ్ళది… మధ్యలో మేమెందుకు? అనిపిస్తుంది నాకు..”
“నీవోక విచిత్రం మనిషివి..తల్లీ తండ్రులపై పిల్లల మమకారాలు తెలియనివాడివి కాదు…దూరంగా వున్నవాళ్ళను బాధ పెట్టకూడదు రా…అనుకోగానే రాలేడు కదా ఫోను కూడా తీసుకోకపొతే ఎలా?”
“నీవు మంచిపని చేసావు రామూ, కొడుకును విదేశాలకు పంపలేదు. హైదరాబాదు దూరం కాదు అనుకున్నప్పుడు వెళ్ళచ్చు, నాలుగు రోజులు వుండచ్చు…”
“నా కొడుకు నాకు అందుబాటులో వుండాలనే అమెరికా వెళ్ళలేదురా…ఈ కాలం లో ఇలా ఆలోచించేవాళ్ళు వున్నారంటే మన చేసుకున్న పుణ్యం…అందుకే ఈసారి ఫోను చేసినప్పుడు రవికి చెప్పు బాగానే వున్నావనీ వర్రీ కావద్దనీ..”
“నా బాధ నీకు అర్థం కాదురా…వాడికి ఫోను చెయ్యాలనీ, మాట్లాడాలనీ నాకూ వుంటుంది…కానీ బాధ కూడా వేస్తుంది”
“బాధనా? ఎందుకు అంతగా విచారించుకుని వర్రీ అయ్యే కొడుకు వున్నాడనా?”
“నాకు గిల్టీగా వుంటుంది “
“గిల్టీనా ?? ఏమి మాట్లాడుతున్నావురా??”
“రామూ..ఈ రోజు నీతో ఎందుకు గిల్టీ అనేది మాట్లాడాల్సిందే…లేకపోతే నాకు మనఃశాంతి వుండదు…డాబా మీదికి వెడదామా? “
“ఏమిటి స్నేహితులిద్దరూ డాబా మీదికి కూడా వెళ్లి మాట్లాడుకోవాలా?? నేను కాఫీ తెచ్చా, తాగి వెళ్ళండి” అంటూ కాఫీ కప్పులూ, బిస్కెట్స్ వున్న ప్లేటూ తెచ్చి ఎదురుగా వుంచింది వాసూ భార్య లలిత.
“అలాగేనమ్మా” అని కాఫీ కప్పు అందుకున్నాడు రామచంద్ర. కాఫీలయ్యాక ఇద్దరూ డాబా మీద సెటిల్ అయ్యారు
“నీ గురించి నాకు తెలీని విషయాలు ఏమున్నాయి వాసూ”
“నువ్వూ నేనూ కలుసుకున్నది ఉద్యోగం చేరినప్పుడే…అంతకు మునుపు నేనూ నా నేపధ్యం ఏమిటో తెలుసా? పల్లెటూరి జీవితం..ఎకరం పొలం మీద వ్యవసాయం చేసుకునే తల్లి దండ్రులు…ఎప్పుడూ పడక మీద వుండే నాన్నమ్మ…ఆమెకు సేవలు చేస్తూ ఎప్పుడూ సతమతమయ్యే అమ్మ. పొలం పనులూ అంటూ పంచకట్టుతో పొలంలోనే గడిపే నాన్న… నాకెందుకో చిన్నప్పటినుండీ నేను పల్లెలో వుండకుండా..బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని పల్లె వాతావరణానికి దూరంగా వెళ్లాలని ఆశ. అందుకే బాగా చదువుకున్నాను…నా చదువు కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులను చూసినా అది వారి డ్యూటీ అని అనుకున్నాను..మంచి ఉద్యోగం ఉండటంతో కోరి పిల్లనిచ్చిన మన బాసు…”
“అవును పెళ్ళిలో చూసాను మీ అమ్మా నాన్నలను…”
“అంతే! వాళ్ళు పల్లెటూరులో వుంటారని ఎక్కువ సంబంధాలు పెట్టుకోలేదు నేను… నా భార్య పెరిగిన నాజుకు వాతావరణంలో పల్లెటూరి పోకడ కలిగిన తల్లిదండ్రులని చేర్చుకోవాలని గానీ, చూసుకోవాలని గానీ అనుకోలేదు నేను…ఎప్పుడో తప్ప వూరికి పోయేవాడిని కాదు.నానమ్మ చనిపొతే కూడా చూడటానికి పోలేదు నేను, ఒక వేళ పోయినా ఒక పూట కంటే ఎక్కువ వుండే వాడిని కాను..నా పోకడ గమనించేనేమో నేను అప్పుడప్పుడూ పంపే డబ్బుకూడా వద్దన్నారు వాళ్ళు…
జీవితం అంటే భార్య భర్త పిల్లలు అంతే అక్కడితో ‘ఫ్యామిలీ ఫోటో’ ముగుస్తుంది అనుకున్నానే గాని దానికి మూలమైన తల్లిదండ్రులు కూడా అందులో వుంటారు అని అనుకోలేదు. పిల్లలకు చదువు చెప్పించడం తల్లిదండ్రుల డ్యూటీ అని, వాళ్ళ పెళ్లి అయ్యాక వాళ్ళ ఫామిలీ వారిది అని బాగా నమ్మినవాడిని కాబట్టే రవిని చదివించి, పెళ్లి చేసి అమెరికా పంపించేసాను…అదే కరెక్ట్ అని అనుకున్నాను ఇన్ని రోజులూ..వాళ్ళ ‘ఫ్యామిలీ ఫోటో’ లో మాకు చోటులేదు అనుకున్నాను. కానీ వయసు పెరిగాక ఆరోగ్యం క్షీణించినప్పుడు, మనసు ఆప్యాయత కోసం ఎంత పరితపిస్తుందో ఇప్పుడు తెలుస్తూంది. నాకు వాడిని చూడాలని బలంగా అనిపించిన రోజులు ఎన్నో వున్నాయి…మనవడిని చూడాలనీ, ఆడుకోవాలనీ చాలా అనిపిస్తుంది…ఇవన్నీ మా అమ్మనాన్నలకు కూడా అనిపించి వుంటాయి… వాళ్ళ గురించి ఆలోచించలేదు నేను. ఇప్పుడేమో నాకు బాగా లేదని మా వాడు పడే తాపత్రయం గతాన్ని నాకు అద్దంలో చూపుతోంది.
ఒకసారి నాన్నకు బాగాలేదని అమ్మ కబురంపితే కూడా వెళ్లి చూడలేదు నేను…పైగా ముసలితనంలో ఆరోగ్యాలు బాగా వుంటాయని ఎలా అనుకుంటారు?..అని చెప్పాను కబురు తెచ్చిన మనిషితో…చివరకు నాన్న చనిపోయినప్పుడు నేను ఒంటరిగానే వెళ్లాను “అమ్మ వూరు వదలిరాను” అంటే నాతో అమ్మను రమ్మని బలవంతపెట్టలేదు…ఎందుకంత కఠినంగా వుండి పోయి బాధ్యత లేదని అనుకున్నాను? ఇప్పుడు తెలిసి వచ్చి పశ్చాతాప పడుతున్నాను. రవి నా గురించి అంతగా ఆందోళన పడుతూంటే ‘వాడికున్న జ్ఞానం నాకు లేకపోయిందే.చివరిదశలో అమ్మా నాన్నలకు ఏమీ చెయ్యని నేను శిక్ష అనుభవించాల్సిందే’ అని రవిని దూరంగా వుంచుతున్నాను.మానసికంగా కృంగిపోతున్నాను” అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు వాసు.
వాసూ భుజం మీద చెయ్యి వేస్తూ రాము
”జీవితమంటే ఇదీ అని నీకు నీవే ఒక చిత్రం గీచుకున్నావు. పల్లె వాతావరణం నచ్చలేదని అనుకున్నావే గానీ ఆప్యాయతా, అనుబంధాలను మరిచావు..జీవితం చక్రం లాటిది ..అందరి జీవితాల్లోనూ ఒకే రకం ఘట్టాలే! బాల్యం, యవ్వనం, వృదాప్యం..ఏ వయసుకు తగ్గ సమస్యలు వాటి కుంటాయి…ఫ్యామిలి ఫోటోలో తల్లితండ్రులని తొలగించిన నీ వైనం విచిత్రం!! కానీ ఫ్యామిలీ అంటే తల్లీ తండ్రీ కూడా’ అనేది మరవలేని సత్యం! ఇప్పటి కాలంలో అందరూ పేరెంట్స్ ని ఆశ్రమాలకి పంపుతారు అంటారు కానీ అది తప్పు అని నిరూపించాడు నీ కొడుకు…అంతే కాదు ఇప్పుడు కూడా బాధ్యతలు అందరూ మరువరు అని తెలియ చెప్పాడు రవి… నిజమే నీవు చేసింది తప్పే ! అది నీకు దేవుడు నీ కొడుకు ద్వారానే తెలియచెప్పాడు..నేను చెప్పేది ఒక్కటే ఎప్పుడో జరిగిపోయినదానికి నీవు బాధ్యుడవే అయినా ఈ విధంగా శిక్షించుకుంటారా? నీకు జీవితం లో ఆప్యాయతలు ఎంత ఆనందాన్ని ఇస్తాయో తెలియ చెప్పిన రవికి కూడా శిక్ష వేస్తావా?…… వాసూ గతం గతః అనుకోవాలి!”
“అలా అనుకొని వుండగలనా??”
“నాకు ఒకటి తోస్తూంది… నేను ప్రతి ఆదివారం ఒక వృద్దాశ్రమానికి వెడతాను అక్కడ ఎంతమందో నిరాశ్రయులు, పిల్లలు లేనివారు, కొడుకులు విడిచి పెట్టినవారు, ఎవరూ తోడూ లేని వాళ్ళు వున్నారు. వారికి పనిలో హెల్ప్ చెయ్యడమే కాదు కాస్సేపు కూర్చుని మాట్లాడితే ఎంత సంతోషమో….ఇక మీద రోజూ రెండు గంటలు అక్కడికి వేడదాము..మనకు తోచిన సహాయం చేద్దాం..నీకూ తృప్తి కలుగుతుంది….ఇక రవి మనసు కష్టపెట్టవద్దు..వాడితో ఆప్యాయంగా వుండు..ఎంత తృప్తి కలుగుతుందో చూడు..”
రామూ చెప్పిన విషయంతో మనసు ఏంతో తేలిక అయ్యింది. తనకు ఇది దేవుడిచ్చిన అవకాశంగా మలచుకుని ఉపయోగించుకోవాలనిపించింది. అందుకే తృప్తిగా “థాంక్స్ రామూ ఇద్దరం రేపటి నుండే వెడదాం. రవితో మాట్లాడుతాను ఈ రోజే…” అన్నాడు వాసు.
ముసలితనంలో తల్లి దండ్రుల బాగోగులను చూసుకోలేని ప్రతి కొడుకూ తనకూ ఆ రోజు వస్తుందనీ, మనం చేసిందే మనకు తిరిగి జరుగుతుందనీ విశ్వసిస్తే ప్రతి తల్లిదండ్రీ సుఖంగా వుండగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *