భాషను ప్రేమించరా!

రచన: నాగులవంచ వసంతరావు

భాషను ప్రేమించరా బతుకును పండించరా
బాష నేర్చుకుంటే నీ బతుకే బంగారురా!

భాషే మన మెతుకురా భాషే మన బతుకురా
భాష రాకపోతే మన బతుకే ఆగమ్మురా

మాతృభాష మాధుర్యం మదినిండా నింపరా
హృదిలోని భావాలను అలవోకగ తెలుపరా

వృత్తియందు మెప్పు పొంద భాష కీలకమ్మురా
భాషతోటి ‘బాసు’ మనసు బాగ దోయవచ్చురా!

ఉద్యోగం వ్యాపారం వృత్తి ఏదైనగాని
భాషయందు ప్రావీణ్యత బాగ ఉపకరించురా

మదిలోని భావనలు మనసునిండ ముసురుతుంటె
బహిర్గత పరచుటకు భాష సాధనమ్మురా

మనసులోని భావనలు మాటలుగా పూయించి
భగవంతుని పాదాలకు భాషలోన సమర్పించి

శ్లోకాల రూపంలో స్తోత్రాలుగ కీర్తించి
సృష్టికర్త కృపనుబొంద భాష కీలకమ్మురా

భాష ఏదైనగాని భావమొక్కటేనురా
భాష విలువ లెక్కించ ఎవరితరము గాదురా

భాషలోని పరిమళాలు బాగ చిలుకరించరా
భాషామతల్లి సిగలోన బాగ గుభాళించరా

భాషలోని లాలిత్యం యతిప్రాసలోని ఔచిత్యం
పదములలో పొందుపరచి పాఠకులకు పంచరా

ఆస్థాన కవులు అవధానులు ఆలపించిన భాషరా
మేధో సంపత్తినంత వెలికితీసిన ఖ్యాతిరా

అచ్చతెలుగు నుడికారం భాషమీది మమకారం
కవిగాయక పాండిత్యం కవితలలో చూపరా

రకరకాల అక్షరాలు పదములలో ఏర్చికూర్చి
భాషలోని సౌందర్యం బహుచక్కగ తెలుపరా

భాషలు బహువిధములుండ భావమొక్కటేనురా
భావజాల ప్రకటనకు భాషే తొలిమెట్టురా

రాయలు మెచ్చిన భాష రమ్యమైన యతిప్రాస
శ్రోతలనలరింపజేయు శ్రావ్యమైన పరిభాష

పరీక్షల రాతలకు ఉపన్యాస పోటీలకు
భాషమీద పట్టుంటే బహుమతులన్ని నీవిరా

కడుపులోని కాదారం కట్టలు తెంచుతు ఉంటె
భాషామతల్లి రూపంలో బయటకు నెట్టాలిరా

ఘనమైన గత చరిత్ర అక్షరాల రూపంలో
గ్రంథాలుగ ముద్రించి భద్రంగా దాచరా

మంచిని కాపాడుటకు చెడును చెండాడుటకు
అక్షరాల ఆయుధాలు అనునిత్యం సంధించరా
***

Leave a Comment