April 19, 2024

మాయానగరం – 39

రచన: భునవచంద్ర

“మాధవిగారూ… నేను మీకు తెలుసు. నా అనే వాళ్ళు నన్నొదిలేశారు. ఎలా పైకొచ్చానని అడక్కండి. ఏ జీవితాన్ని చూసినా పైకి రావాలంటే రెండే పద్ధతులు. ఒకటి కష్టపడి ఎదగటం… రెండోది ఇతరుల్ని కష్టపెట్టి ఎదగటం. ఇతరుల్ని కష్టపెట్టే ఎదిగేది రౌడీలూ, గూండాలూ మాత్రమే కాదు. ఎదుటివారి వీక్ నెస్ ని సొమ్ము చేసుకునేవారు కూడా! ” ఓ క్షణం ఆగాడు బోసు.
“అదంతా నాకెందుకు చెబుతున్నారూ? ” ఏ మాత్రం కుతూహలం ధ్వనించని స్వరంతో అన్నది మాధవి.
“కారణం ఉంది. చెప్పుకోవాలి. ఎవరితో ఒకరితో చెప్పుకోవాలి. కానీ ఎవరితో చెప్పినా ఉపయోగం ఉండదు సరి కదా, నగుబాటవుతుంది. అందుకే మీతో చెప్పుకుంటున్నాను. మీరు నన్ను అర్ధం చేసుకోగలరనే ఓ ఆశ. ” కొంచం దీనంగా ధ్వనించింది బోసుబాబు స్వరం.
“కారణం నాకు అర్ధం కాకపోయినా… వింటాను… చెప్పండి ” అన్నది మాధవి. బోసుబాబు మొహంలో రిలీఫ్ కనపడింది.
“ఎదుటివారి వీక్ నెస్ ని సొమ్ము చేసుకొని ఎదిగేవాళ్ళు కొందరన్నాను గదా! నేను ఎదిగింది అలానే! మనుషులు తాగుడికి బానిసలవుతారని తెలిసే దొంగసారా బట్టీలు పెట్టాను. చట్టానికి దొరక్కుండా చెప్పలేనంత సంపాదించాను. అయితే ఒకటి మాత్రం నిజం. వాళ్ళు చావాలని మాత్రం నిజంగా ఏనాడూ కోరుకోలేదు. కల్తీ చేసింది మాత్రం నేను కాదు. నేను బట్టీలు మానేసి చాలా కాలం అయ్యింది. నాకు సప్లై చేసినవాడు చేశాడు కల్తీ. సరే అదో గొడవ అనుకోండి. నా వల్ల జరిగింది నష్టం నేను పూడ్చే ప్రయత్నమూ చేశాను. ఎన్ని చేసినా నాకూ ఓ మనసుంది. అది నన్ను నిలదీస్తుంది. ఎన్ని తప్పులో చేశాను. ఎటువంటి తప్పులు అని అడగకండి… ఇప్పటికే సిగ్గుతో చస్తున్నా ” మళ్ళీ ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు బోసుబాబు.
“బోసుగారు… మీరు కన్ఫెషన్ ఇవ్వాలనుకుంటే చర్చికి వెళ్ళాలి. లేదూ, తప్పులు సరిదిద్దుకోవాలంటే వారినో, చట్టాన్నో ఆశ్రయించాలి. ఇవన్నీ నాకెందుకు చెప్పడం? ఓ తీవ్రమైన ఎమోషన్ లో మీ జీవిత రహస్యాలు నాకో, మరొకరికో చెప్పడం వల్ల మీకు నష్టం తప్ప మరేదీ ఒరిగేది వుండదు ” స్పష్టంగా అన్నది మాధవి.
“అవునేమో! కానీ… నాకు చెప్పాలనుంది. కారణం ఏమంటే నాకీ జీవితం మీద విరక్తి పుట్టింది. ఇందులోంచి బయట పడడం తేలిక కాదు. కానీ బయటపడతాను. మాధవిగారూ… నేనేమీ హత్యలూ మానభంగాలూ చెయ్యలేదు. ఎవరి గొంతులూ కోయలేదు. బతకాలంటే డబ్బుండాలి… ముఖ్యంగా నాలాంటి కేరాఫ్ అడ్రస్ లేనివాళ్ళకి. అందుకే సంపాదించా. అది లేనప్పుడు ఎవడూ గౌరవించడు. కుక్కలకంటే మనుషుల్ని హీనంగా చూస్తారు. సరే, అదంతా జరిగిపోయిన కథ. ఇంతకు ముందు నాకు ఆడవాళ్ళు తెలుసు. నేనేమీ పరమపవిత్రుడ్ని కాదు. కానీ జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని ప్రేమించా. ఆమె మీకు తెలిసిన అమ్మాయే.. శోభ. ఆమెని ఎలా అడగాలో నాకు తెలియదు. నా తరఫున మాట్లాడేవాళ్ళు లేరు. మరొకటి ఏమిటంటే ఆమె చుట్టూ కూడా తోడేళ్ళు వలపన్నుతున్నాయి. ‘నువ్వూ అదే పని చేస్తున్నావుగా ” అని మీరు నన్నడగొచ్చు. మాధవిగారూ… నేనామెను మనసా వాచా కర్మణా ప్రేమిస్తున్నాను. ఎంతగా అంటే, నా అంతగా ఆమెని ప్రేమించేవాడు లోకంలో మరొకడు లేనంతగా. నేను హృదయపూర్వకంగా , మనస్సాక్షిగా చెప్పాల్సింది చెప్పాను. ఆమెకి మీరే పెద్ద దిక్కని నా అభిప్రాయం. నాకూ పెద్ద దిక్కుగానే వుండండి. ఆమెతో మాట్లాడండి. ఆమెకి ఇష్టం లేకపోతే… ఓ.కే. నేనేమీ ఆత్మహత్య చేసుకోను. కానీ,… ” నమస్కరించి బయటకు నడిచాడు బోసు.
సైలెంట్ అయిపోయింది మాధవి. అతను మాట్లాడినంత సేపూ జాగ్రత్తగా గమనిస్తూనే వుంది మాధవి. అతని మాటలు కల్లాకపటం లేకుండా వున్నాయి. స్ఫష్టంగా నిస్సందేహంగా మాట్లాడాడు. ఏదీ దాచలేదు. ఇప్పుడేం చెయ్యాలీ? శోభకు చెప్పాలా? శోభ అమాయకురాలు. ఈ లోకంలో బ్రతకాలంటే బలమైన తోడుంటే గానీ శోభ బతకలేదు. బోసు అన్నది నిజమే. శామ్యూల్ లాంటి తోడేళ్ళు శోభని మింగడానికి అదును కోసం ఎదురుచూడటం ముమ్మాటికీ నిజమే. ఇప్పుడేం చెయ్యాలి? ” ఆలోచిస్తోంది మాధవి.
“అక్కా! ” లోపలకి వచ్చి మాధవిని హత్తుకుంది శోభ. ఆమె చేతిలో ఉత్తరం ఉంది. అది ఆనందరావు రాసిన ఉత్తరం.

************************

“కాగజ్ కే ఫూల్ చూశావా? ” అడిగింది వందన
“అద్భుతమైన సినిమా ” ఆనందంగా అన్నాడు ఆనందరావు.
“హం దోనో ”
“లవ్లీ మూవీ ”
“మరి గైడ్ ”
“ఆ సినిమా అంటే నాకు పిచ్చి ”
“యాహా కౌన్ హై తేరా ముసాఫిర్ ”
“ఆజ్ ఫిర్ జీనే కి తమన్న హై ”
“పియా తోసే నైనా లాగీ రే ”
“తేరే మేరే సప్నే అబ్ ఏక్ రంగ్ హై ”
“అబ్బా… పాటల కోసం సినిమా, సినిమా కోసం పాటలూ ఎన్నిసార్లు చూశానో ! నన్నడిగితే దేవ్ ఆనంద్ బెస్ట్ ఫిల్మ్ అదే! ” తన్మయంగా అన్నాడు ఆనందరావు.
“గుడ్…. జానీ మేరా నామ్? ఆమ్రపాలి ”
“వావ్… జానీ మేరా నామ్ ఎంటైర్ టైనర్ అయితే ఆమ్రపాలి అద్భుతం. రాహుల్ సాం కృత్యాయన్ గారి రచన కూడా చదివాను. అవునూ… ఆ సినిమా గురించి ఎందుకడుగుతున్నావు? ” నడుస్తున్నవాడల్లా ఆగి అన్నాడు ఆనందరావు.
” ఆ సినిమాలన్నీ మెహబూబ్ స్టూడియోలో. రేపు మనం ఆ స్టూడియో చూడబోతున్నాము. ” నవ్వింది వందన.
“రియల్లీ ” రోడ్డు మీద వున్నామన్న విషయం మరిచిపోయి రెండు చేతుల్తో ఆమెను పైకెత్తేశాడు ఆనందరావు. పకపకా నవ్వుతూ చిలిపి చూపులు చూసింది వందన.
“లవ్లీ పెయిర్ ” బయటకే అన్నాడు ఓ పెద్దాయన.
ఠక్కున ఆమెను కిందకు దించి “సారీ… ఎక్సైట్ మెంట్ ఆపుకోలేక… ” సిగ్గుతో కళ్ళు దించుకున్నాడు ఆనందరావు.
“హా.. ఇలా ఎత్తుకుంటారని తెలిస్తే రోజుకో సర్ప్రైజ్ ఇద్దును కదా… ప్చ్… ఇప్పటి దాకా ఎంత మిస్ అయ్యానో ” విచారంగా మొహం పెట్టి అంది వందన.
తటాల్న కళ్ళెత్తి ఆమె వంక చూశాడు ఆనందరావు. అల్లరి చూపులు నవ్వుతున్నాయి పువ్వుల్లా.
తనూ నవ్వాడు ఆనందరావు.
“కూల్ బాబా కూల్ ” అతని చెయ్యి నొక్కింది వందన.
“ఇక నుంచి మా చుట్టం ఎక్కడ ఏ స్టుడియోలో రికార్డింగ్ కి వెళ్ళినా నిన్ను తీసుకెళ్ళమని చెప్తాలే! అయినా, సినిమాలంటే అంత ఇష్టమా? ”
“ఊహూ… అన్ని సినిమాలూ కాదు. మంచి సినిమాలంటే ఇష్టము. మంచి పాటలంటే ఇష్టము. మంచి మనుషులంటే ఇష్టము ” మెల్లగా నడుస్తూ అన్నాడు ఆనందరావు.
“మరి నేనూ? “చిలిపిగా అన్నది వందన. ఆమె వంక చూసి ” నువ్వంటే చెప్పలేనంత ఇష్టము ” అప్రయత్నంగా అన్నాడు ఆనందరావు.
వందన బుగ్గలో సిగ్గులు మందారాల్లా మొగ్గతొడిగాయి.
యవ్వనం…. ఒక అద్భుతం
యవ్వనం… ఓ ప్రవాహం
యవ్వనం…. ఓ మధురమైన గీతం
ఆ గీతానికి పరవశించని వారెవ్వరూ?

**********

“నువ్వు చస్తే దాన్ని వదిలిపెడతానేమో అని, తాగి బండి మీద నుంచి కింద పడ్డావా? కిషన్.. నువ్వు చచ్చినా దాన్ని మాత్రం వదల్ను. ఆఫ్ట్రాల్… దాని బ్రతుకు నా చెప్పంత విలువ చెయ్యదు అది నన్ను హేళన చేస్తూ బయటకి పోవడమా? అయినా, కాలో చెయ్యి విరిగేపోయేట్టు యాక్సిడెంటు చేసుకోవాలి గానీ ఇదేంటీ? ” కసిగా చూస్తూ బెడ్ మీదున్న జరీవాలాతో అన్నది సుందరీబాయ్. కిషన్ చంద్ మాట్లాడలేదు. అసలామె వంక చూడలేదు.
” ఏం మాట్లాడవేం? ఆ పనిముండ తప్ప నేను ఆడదానిగా కనిపించడం లేదా? అంతేలే… కుక్క కుక్క దగ్గరకే పోతుంది. అసలు బుద్ధి లేనిది మా నాన్నకి. ” చేతిలో వున్న గ్లాసుని విసిరి గోడకేసి కొట్టింది. మరుక్షణమే ఆమె చెంప ఛెళ్లుమంది. కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చూశాడు సేఠ్ చమన్ లాల్.
“ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పటికిప్పుడు నిన్ను ఇంట్లోంచి బయటకి గెంటితే అడుక్కోవడం కూడా రాదు నీకు. రాస్కేల్. ఒక్కతే కూతురు గదా అని గారాబం చేశాను. ఏం చేశాడతను? ఎందుకు సాధిస్తున్నావు? ఫో… నా కళ్ళముందు నుంచి అవతలకి ఫో… లేకపోతే ఇవ్వాళ నేను ఏం చేస్తానో నాకే తెలీదు ” భీకరంగా అరిచాడు చమన్ లాల్. వొణికిపోయింది సుందరీ బాయ్. తండ్రి అంత గట్టిగా అరవడం ఏనాడూ వినలేదు సరి కదా వూహించను కూడా లేదు. మాట్లాడకుండా బయటకు నడిచింది.
“సారీ కిషన్.. దాన్ని క్షమించమని నిన్ను నేను అడగను. అసలు తప్పు నాది. అడ్డు అదుపు లేకుండా పెంచాను. అనుభవిస్తున్నాను. సారీ…” కిషన్ చంద్ భుజం తట్టి తలొంచుకొని బయటకు నడిచాడు చమన్ లాల్. ఏనాడు ఎరుగని అనంతమైన అశాంతిలో అతని హృదయం మునిగిపోయింది.
ఎందుకీ మనుషులకి అహంభావం? ఎందుకు ప్రతి మనిషి ఎదుటి వారు తమ మాటే వినాలనీ, తమ పంతమే నెగ్గాలని ఎందుకు పట్టుదలకి పోతారూ? సడన్ గా అతనికి భార్య గుర్తొచ్చింది. ఆవిడ పేరు రామ్ లత. అత్యంత మృదుభాషి, అత్యంత సౌమ్యురాలు. అటువంటి తల్లికి ఇటువంటి కూతురా? తోటలోకి వెళ్ళాడు చమన్ లాల్. ఆ తోటని వేసింది రామ్ లతా. ప్రతి మొక్క స్వయంగా నాటింది. మామిడి, సపోట, కొబ్బరి, పనస, పంపర పనస, నిమ్మ, గజనిమ్మ, సీతా ఫలం, రామా ఫలం, మారేడు, ఉసిరి, రాచ ఉసిరి, ఇలా ఎన్నో వృక్షాలు! పూలమొక్కలైతే లెక్కలేదు. ఊయలూగడం అంటే రామ లతకు ప్రాణం. మామిడి చెట్టుకి చక్కటి ఉయ్యాలబల్ల వేసింది. ఉయ్యాల బల్ల కట్టిన కొమ్మ చాలా పెద్దది, బలీష్టమైనది. మధ్యాహ్నం వేళ ఆ ఉయ్యాలబల్ల మీద కూర్చొని, తనని కూర్చోబెట్టి తాంబూలం ఇచ్చేది. వెళ్ళి ఆ బల్ల మీద కూర్చున్నాడు చమన్ లాల్.
“ఏంటి తాతయ్య! ఇక్కడ కూర్చున్నావు? ” అని స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు అడిగారు.
“ఏమీ లేదు బేటా. మీరు నాకో మాటివ్వాలి. మీ అమ్మకు కోపం చిరాకు ఎక్కువ. అయినా పెద్దయ్యాక మీరు ఆమెను వదలకూడదు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మీ నాన్న చాలా మంచోడు. నోరు విప్పో, మనసు విప్పో తనకేది కావాలో ఏనాటికీ చెప్పలేడు. బిడ్డలారా… మీ నాన్న అచ్చు మీలాంటి వాడే. ఎప్పుడూ ఆయన్ను కష్టపెట్టకండి. “గద్గద స్వరంతో అన్నాడు చమన్ లాల్.
“అదేంటి తాతయ్య… అవన్నీ ఎందుకు చెబుతున్నావు? ” అయోమయంగా అడిగింది మనవరాలు మున్ని.
“ఎందుకో చెప్పాలనిపించింది బేటా! నా మాట మరచిపోవు కదూ! ” మనవరాలూ, మనవడి బుగ్గలు నిమిరి అన్నాడు చమన్ లాల్.
“అలాగే తాతయ్య ” తాతయ్యని కౌగిలించుకొని అన్నారు పిల్లలు.
వాళ్ళని కూడా ఆ ఉయ్యాల బల్ల మీదే పక్కనే కూర్చోబెట్టుకున్నాడు చమన్ లాల్.
గుజరాత్ లో తన కుగ్రామం. చిన్న కిరాణా దుకాణం నడిపిన తండ్రి, పెళ్ళిళ్లలోనూ మిగతా సమయాలల్లోనూ స్వీట్లూ, నమ్‌కీన్, మసాలా పిండివంటలు తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్న తల్లి గుర్తొచ్చారు. అతని కళ్ళంపట ధారగా నీరు కారసాగింది.
“ఎందుకు తాతయ్య ఏడుస్తున్నావ్? ” అని మనవడు అడిగాడు.
“ఏమీ… లేదు… బేటా… వెళ్ళండి. నాన్నని పలకరించండి! ” అనూనయంగా వాళ్ళని పంపాడు చమన్ లాల్.
“చాదర్ లాగే… సోజారే సోజా..మైనా అయాహీ సారీరాత్ … జా… ఆ.. ఆ.. గీ.. ” తనని ఎత్తుకొని ఆలపించిన పనిమనిమనిషి కాంతా బాయ్ గుర్తొచ్చింది. ఆమే ఇంట్లోనే వుండేది. పదిహేనేళ్ళు వచ్చినా ఆమె రొమ్ముల మధ్యే తల దూర్చి పడుకునేవాడు. ఎంత ప్రేమించింది. పదేళ్ళ వయసులొనే తల్లిపోయిన తనని ఎంత ప్రేమగా పెంచింది?
సడన్ గా కూతురన్న మాట జ్ఞాపకం వచ్చింది. “ఆఫ్ట్రాల్ పనిమనిషి! ” ఆ మాట గుర్తుకి రాగానే గుండె మండింది చమన్ లాల్ కి. ఊహూ.. ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యకపోతే సుందరి బాగుపడదు. ఆమె బాగుపడకపొతే పిల్లల భవిష్యత్తు అంధకారమే.
ఠక్కున లేచాడు చమన్ లాల్. గబగబా బయటకొచ్చాడు. గూర్ఖా ఆశ్చర్యపొయాడు. కారు లేకుండా నడచి వచ్చే యజమానిని చూసి. ” దౌలత్ సింఘ్ రిక్షాని పిలు ” గేటు బయటకొచ్చి గూర్ఖాతో అన్నాడు చమన్ లాల్.
రోడ్డున పోయే ఓ ఖాళీ రిక్షాను ఆపాడు దౌలత్. ఆ రిక్షా కూడా చమన్ లాల్ దే. ఆయన మెనేజర్ నుండి రిక్షాని అద్దెకు తీసుకున్నవాడి పేరు మొహమూద్. స్టిఫ్ గా సెల్యూట్ కొట్టాడు . అదేవీ పట్టించుకోకుండానే ఎక్కి కూర్చున్నాడు చమన్ లాల్. “పద… మెయిన్ రోడ్డులో లాయర్ సింఘాల్ దగ్గరకు పోనీ ” రిక్షావాడికి చెప్పి కళ్ళు మూసుకున్నాడు చమన్ లాల్. అతని కళ్ళలోనుంచి కన్నీరు ధారగా కారుతూ వుండగా, ఒక్కసారి వాంతయ్యింది… రిక్షా ఆగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *