April 20, 2024

అతను-ఇతను

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.

అతను తనకు పెళ్లి అయినాసరే,
అమ్మకొంగును వదలలేని బిడ్డ.
ఇతను తనబిడ్డల పెళ్ళిళ్ళు అయినా సరే
భార్యపొందును వదలలేని భర్త.
ఆబిడ్డకు అమ్మే దైవం,ఆమె మాటే వేదం,
అతని దృష్టిలో భార్యంటే మనిషే కాదు.
ఈభర్తకు భార్యే లోకం,ఆమె చెంతే స్వర్గం,
ఇతని దృష్టిలో అమ్మంటే మనిషే కాదు.
అతనికి భార్యంటే అలక్ష్యం,ఇతనికి అమ్మంటే నిర్లక్ష్యం.
అతనికి అమ్మంటే అన్నపూర్ణాదేవి,ఇతనికి భార్యంటే రతీదేవి.
అతనికి అమ్మచేతిలో తన సంపాదన పెట్టటం,
ఆమె మోములోకనిపించే ఆనందఛాయలను తిలకించి,
పదేపదే వాటిని తలుచుకొని పులకించిపోవటం ఇష్టం.
ఇతనికి భార్యకు ఆమె కోరిన ప్రతికోరిక తీర్చటం,
ఆ సంతోషంలో ఆమె వగలుపోతుంటే ఆ సొగసు చూసి,
పగలూరేయీ ఆమె తలంపులో మునిగిపోవటం ఇష్టం.
అతను అమ్మ ప్రభావంవల్ల అలాఅయ్యాడు,
ఇతను ఆలి ప్రయోగం వల్ల ఇలామారాడు.
అతనికి అమ్మంటే ఎక్కువే,ఇతనికి భార్యంటే మక్కువే,
కానీ,ఇద్దరికీ తమపిల్లలంటే మాత్రం ప్రేమ తక్కువే,
ఇద్దరిదీ ఒకలాంటి తెలివి తక్కువే.
ఇద్దరి బుద్ధులకూ శుద్ధిలేదు,వారి ఆలోచనాతీరులలో వృద్ధిలేదు.
అతనిది తల్లిపై అర్ధంలేని భక్తి,ఇతనిది భార్యపై అర్ధంకాని రక్తి.
తల్లి బుద్ధిచెప్పక అతను అలాఅయ్యాడు,
భార్య గడ్డిపెట్టక ఇతను ఇలాఅయ్యాడు.
కన్నవారిని,కట్టుకున్నవారిని అభిమానంతో
సమానంగా చూడటమే సంస్కారమని,
అదే జీవితానికి పెద్ద పురస్కారమని,
తెలుసుకోలేకే అతను,ఇతను దారి తప్పారు,
వారి జీవితాలతో మనకో గుణపాఠం చెప్పారు.

1 thought on “అతను-ఇతను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *