March 29, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 19

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య


ఒకరోజు అల్లరికృష్ణయ్య ఎక్కడా కనుపించడంలేదు. మళ్ళీ ఏమి తగాదాలు, గొడవలు తీసుకోస్తాడోనని హడలిపోతూ యశోదమ్మ బాలకృష్ణునికై వెదకింది. కృష్ణయ్య అలా మోచేతిపై తలవాల్చి పడుకుని వుండగా రహస్యంగా తల్లి తొంగి చూచింది. నిద్రలో ఉన్నాడు నల్లనయ్య. నోరు కొంచెం తెరుచుకుని ఉంది. ఆనోట్లో సర్వలోకాలు..సూర్య చంద్రులూ, గ్రహసంతతీ కనిపించాయి. యశోదమ్మ హడలిపోయింది. అప్రయత్నంగా చేతులు జోడించి నిలబడింది. అంతలో క్రిష్ణయ్య లేవనే లేచాడు. “అమ్మా!” అన్నాడు. అన్నమయ్య ఇలాంటి జనశృతులను అధారం చేసుకొని ఎన్నో కీర్తనలను రాశాడు. భక్తపోతన కూడా ఇలాంటి కధలను అల్లి భాగవతంలో “వీడటే రక్కసి విగతజీవగ జన్నుబాలుద్రావిన మేటి బాలకుండు/ వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు జూపిన ముద్దులాడు/ వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దావరీడు/వీడటే యెలయించి వ్రేతల మానంబు సూరలాడిన లోకసుందరుండు” అంటూ నందనందనుని కొనియాడాడు. ఈవారం అన్నమయ్య యశోదమాతగా మారి దర్శించిన శ్రీనివాసుని లీలావిలాసాలను చదివి తరిద్దాం.
కీర్తన:
పల్లవి: ఎవ్వరు గాననివాడు యశోద గనె నట్టె
పవ్వళించేబ్రహ్మతండ్రి బాలుడయ్యె నట్టె॥
చ.1. ఘనయోగీంద్రులమతి గట్టువడినట్టివాడు
పనిలేక రోల గట్టుపడివాడట్టె
తనియ సురలకు పాదము చూపనట్టివాడు
మొనసి బండిమీద మోపినాడట్టె ||ఎవ్వ||
చ.2.అమృతము చేత దచ్చి అందరికిచ్చినవాడు
తమితో వెన్న దొంగిలె దానె యట్టె
గుమురై దేవదానవకోటికి జిక్కనివాడు
భ్రమసి గోపికలపాల జిక్కినా డట్టె ||ఎవ్వ||
చ.3.యిందు గల డందులేడనెంచి చూపరానివాడు
అందమై రేపల్లె వాడ నాడీనట్టె
అంది కృష్ణావతారమయినట్టిదేవుడే
యిందున శ్రీవేంకటాద్రి యెక్కి నిలిచె నట్టె ||ఎవ్వ||
(రాగం: శంకరాభరణం; ఆ.సం.సం.3; 255వ రేకు; కీ.సం.316)
విశ్లేషణ:
పల్లవి: ఎవ్వరు గాననివాడు యశోద గనె నట్టె
పవ్వళించేబ్రహ్మతండ్రి బాలుడయ్యె నట్టె.

ఎవరికీ కనుపించని అగోచరుడైన విష్ణుమూర్తిని యశోద ఎంత ప్రేమతో తిలకిస్తోందో చూడండి. ఆ పవళించినవాడు సామాన్యుడా! సాక్షాత్ విశ్వసృష్టి కర్తయైన బ్రహ్మకు తండ్రి. ఈ విధంగా బాలుడై నా యింటవెలసినాడు. ఎంత అందంగా నిద్రిస్తున్నాడో! యశోదమ్మ సంభ్రమాశ్చర్యాలతో చేష్టలుడిగి నిలుచుండిపోయింది.

చ.1. ఘనయోగీంద్రులమతి గట్టువడినట్టివాడు
పనిలేక రోల గట్టుపడివాడట్టె
తనియ సురలకు పాదము చూపనట్టివాడు
మొనసి బండిమీద మోపినాడట్టె.
ఈ పరంధాముడు మహా మహా యోగీశ్వరుల మదిలో కూడా కట్టుబడనట్టివాడు. అలాంటివాడు ఇక్కడి యశోదమ్మ చేత ఒక రోకలికి కట్టుబడ్డాడు. సకల చరాచర దేవతలు వేడినా తన పాదం చూపని శ్రీహరి, ఒక బండిని తన పాదంతో తన్నినాడు. శకటాసురుని సంహారం వలన శకటాసురునికి వేయి జన్మల పాపం బ్రద్దలై స్వర్గారోహణాభాగ్యం కలిగిందని ఆ అదృష్టాన్ని కొనియాడుతున్నాడు అన్నమయ్య.

చ.2.అమృతము చేత దచ్చి అందరికిచ్చినవాడు
తమితో వెన్న దొంగిలె దానె యట్టె
గుమురై దేవదానవకోటికి జిక్కనివాడు
భ్రమసి గోపికలపాల జిక్కినా డట్టె ||ఎవ్వ||
దేవదానవులచేత మందరపర్వతంతో సముద్రాన్ని చిలికించి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టగలిగిన శ్రీహరి. ఆయన ఇక్కడకు వచ్చి వెన్న దొంగిలించడం ఏమిటి? దేవదానవులకు చిక్కనటువంటి ఈ నారాయణుడు, పరాత్పరుడు ఈ రేపల్లెలోని గోపికలకు చిక్కడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది.

చ.3.యిందు గల డందులేడనెంచి చూపరానివాడు
అందమై రేపల్లె వాడ నాడీనట్టె
అంది కృష్ణావతారమయినట్టిదేవుడే
యిందున శ్రీవేంకటాద్రి యెక్కి నిలిచె నట్టె
ఇందుగలడందులేడని చెప్పలేనటువంటి ఈ లోకేశ్వరుడు ఈ రేపల్లెలో ఆటలాడడం ఏమిటి? అలాంటి శ్రీకృష్ణ పరమాత్మే ఇక్కడ శ్రీవేంకటాద్రిపై శ్రీనివాసునిగా నిలిచాడు. రండి మ్రొక్కి తరించండని అన్నమయ్య సందేశం.
ముఖ్యమైన అర్ధాలు: తనియ, మొనసి = కోరి, తనంతటతాను అనే అర్ధంలో; తమి = యిష్టప్రీతిగా; గుమురు = గుమికూడిన్న, మందలుగా;

1 thought on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 19

Leave a Reply to sastry.mbs Cancel reply

Your email address will not be published. Required fields are marked *