March 28, 2024

కాఫీ విత్ కామేశ్వరి – సమీక్ష

రచన: నండూరి సుందరీ నాగమణి

కం.
కామేశ్వరితో కాఫీ
ఆమే చెప్పెను కబుర్ల నలవోకనిదే
గోముగ విహరించగనే
తామిక రండి, ముదమున తనివిని పొందన్!

‘కాఫీ విత్ కామేశ్వరి’ – అండ్ కబుర్లు… అదేనండీ, కామేశ్వరితో కాఫీ మరియు తను కమ్మగా చెప్పే కబుర్లు అన్న మాట! రోజుకో చక్కని అంశం తీసుకుని, వేడి వేడి ఆనంద్ సినిమాలాంటి కాఫీని తా(లా)గిస్తూ తన కబుర్లతో ఎక్కడెక్కడికో తీసుకుపోయి మళ్ళీ తీసుకువచ్చేస్తుంది కామేశ్వరి… ఒకటా రెండా, డెబ్భై ఏడు కాఫీ ఉదయాలు… అక్కడక్కడ మధ్యాహ్నాలు… ఎప్పుడైనా ‘ఛాయ్ విత్ చెంగల్వల’ అంటూ సాయంత్రం కబుర్లూను…
పుస్తకం గురించి మాట్లాడుకునే ముందు రచయిత్రి గురించి ఓ నాలుగు మాటలు… ‘నేను రచయిత్రిని సుమా!’ అని గర్వంగా అనుకోదు, మన సొంత అక్కలా ఆప్యాయత పంచుతుంది… పిల్లల్లో పాపాయి, పెద్దల్లో అక్కాయి కామేశ్వరి చెంగల్వల. ఈమెతో నాకున్న తీయని అనుబంధం మమ్మల్ని ఆత్రేయపురం అందాలలో విహరింప జేసింది… ఆనందపుటంచులలో నిలిపింది… పాపికొండల పరిష్వంగంలో పరవశించేలా చేసింది… చూసే ప్రతీ దృశ్యాన్ని, కలిగిన ప్రతీ భావనను, చెప్పాలనుకున్న ప్రతీ మాటను అందంగా, ఎదుటివారి మనసుకు హత్తుకునేలా అక్షరీకరించటం అందరికీ సాధ్యం కాదు… అదిగో అలాంటి విషయాల్లో అందెవేసిన చేయి మన కామేశ్వరిది. తాను వ్రాసిన ‘కాఫీ విత్ కామేశ్వరి’ అనే (కథల వంటి) కబుర్ల పుస్తకాన్ని ఎంతో అందంగా, సరియైన సమయానికి అచ్చొత్తించి మనకి అందించిన మన జ్యోతి అనగా జేవీ పబ్లికేషన్స్ అధినేత శ్రీమతి జ్యోతి వలబోజు ఎంతైనా అభినందనీయురాలు.
ఇక పుస్తకం విషయం లోనికి వచ్చేద్దాం. ఇంచుమించుగా అన్ని అధ్యాయాలూ ఒక మంచి, కమ్మని, తీయని గీతంతో శుభారంభంగా ప్రారంభించింది. చెప్పే విషయాలు ఎన్నో, ఎన్నెన్నో… బాహుబలి సినిమా గురించి, మగవారి వంటల గురించి, కార్మిక సంక్షేమం గురించి, మనసుతీరా పంచే నవ్వుల గురించీ, మనసైన జంటల గురించీ, అమ్మ గురించీ, అంత్యాక్షరి గురించీ… ఏదీ వదలలేదు కామేశ్వరి… ఎంతో చక్కగా కళ్ళకు కట్టేలా, మనసుకు పట్టేలా వివరించారు…
మనం మర్చిపోయిన ఉత్తర రచన, అప్పటి తరానికి ఇప్పటి తరానికీ ఆలోచనలలోనూ, ఆచరణలోనూ ఉన్న వ్యత్యాసం, అప్పటి పండుగ వాతావరణం, ఇప్పటి ప్లాస్టిక్ తరుణం – వీటిగురించి చదువుతూ ఉంటే మనసు స్పందించక మానదు. కాలం చాలా వేగంగా మారిపోతోంది అనటానికి మన తరమే సాక్ష్యం.పూలజడలూ, పట్టు పరికిణీలు, రంగవల్లులూ, గొబ్బెమ్మలూ, పండుగలూ గతంలోకి వెళ్ళిపోయి దాక్కున్నాయి. ఈ విషయాన్ని ఎంతో హృద్యంగా చెప్పారు రచయిత్రి.
వేసవి కాలంలో ఆవకాయ పచ్చళ్ళ గురించీ, ఈనాటి అత్తల్నీ, మొగుళ్ళనీ, కోడళ్ళు పెట్టే ఆరళ్ళ గురించీ, ఓర్చినమ్మకు తేటనీరని ఎంతో ఒద్దికగా కాపురాలు చేసిన చేస్తున్న చెల్లెళ్ళ గురించీ (వారి చెల్లెలు పద్మ పొందిక నాకూ తెలుసు మరి!), చిట్టి మనవరాళ్ళ జళ్ళ గురించీ, వీధి వీధికీ వెలిసిన కూరల కూడళ్ళ గురించీ – కామేశ్వరిగారు వ్రాసిన విషయాలు చదివి తీరాల్సిందే, మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవలసిందే…
ఈ రచయిత్రి చాలా నిజాయితీగా తన పొరపాట్లను ఒప్పేసుకుంటారు… తాను పని చేయకుండా, కర్ర పెత్తనం చేసే విషయంలో; అమాయకత్వం, అల్లరి వలన బాగా లావుగా ఉండేవారి మీద జోకులు వేసుకోవటం లాంటివి… చాలా ముచ్చట వేసింది నాకైతే… ఎంత మంది ఉన్నారు ఇలా తెలియక, చిన్నతనం కొద్దీ అలా అనుకునే వాళ్లమంటూ మనతో మనసు పంచుకొనే వారు? అందుకే ఈమె ఆత్మీయతకు వ్యక్తిగతంగా కూడా దాసోహం!
అలాగే అప్పుడెప్పుడో చిన్నతనంలో ఎవరైనా పడిపోతేనో, వాళ్లకి ఏమన్నా జరిగితేనో [అప్పటికి మన పగ వాళ్ళన్న మాట] ‘అచ్చిగచ్చిగ’ అని కసిగా ఏడిపించటం – అసలు ఈ మాట ఎంత మందికి తెలుసో నాకు తెలియదు కానీ మేము చిన్నప్పుడు చాలా చాలా విరివిగా వాడేవాళ్ళం ఈ పదాన్ని… మళ్ళీ ఇన్నాళ్ళకి, ఈ పుస్తకంలో చదివాను ఈ పదం… ఆహా, ఎంత చక్కని, తీయని నోస్టాల్జియా?
ఇప్పుడిక కామేశ్వరి గారి రచనా శైలి గురించి… చక్కని భాష, అలవోకగా చదివింప జేసే పదాల పొందిక, వేగం ఈమెకు వాణి ఇచ్చిన వరం. పుస్తకం తెరవడమే ఆలస్యం., మీరు చదవరు, పుస్తకమే చదివింపజేస్తుంది… ఇంత చక్కని పుస్తకాన్ని రచించిన శ్రీమతి కామేశ్వరి చెంగల్వల గారికి, నా మన:పూర్వక ధన్యవాదాభినందనలు!
మరి ‘మహారాణీ కామేశ్వరీదేవి’ గారి ఈ మంచి పుస్తకాన్ని చదివేయటానికి మీరు సిద్ధమేనా? వచ్చేయండి!
***

2 thoughts on “కాఫీ విత్ కామేశ్వరి – సమీక్ష

  1. నాగమణి చాల బావున్నాయి పుస్తకం చదేవే ముందే నువ్వు కమ్మని కాఫీ లాంటి సమీక్ష రాసావు. కామేశ్వరి గారు మీ కాఫీ తో బాటు కబుర్లు కూడా తొందరలో ఆస్వాదించుతాను

  2. ధాంక్యూ మణీ నేను రాసిన పుస్తకాన్ని గురించి ఇంత హృద్యంగా వెంటనే చదవాలనిపించేలా రాసావు. వెరీ హేపీరా!

Leave a Reply to మణి వడ్లమాని Cancel reply

Your email address will not be published. Required fields are marked *