April 18, 2024

కృషితో నాస్తి దుర్భిక్షం’’

రచన: కె.ఇ.ఝాన్సీరాణి

36వ ఇంటర్వ్యూ పూర్తి చేసిన మురారి బయటకు వచ్చాడు. ఈ ఉద్యోగం వచ్చే అవకాశం లేదని అక్కడ వారి మాట వల్ల తెలిసింది. ఏమితోచని పరిస్థితి. డిగ్రీ చేసి, కంప్యూటర్‌ కోర్సు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కోచింగ్‌ అలా ఎన్నో అర్హతలు, సర్టిఫికెట్లు ఉన్నా ఉద్యోగం మాత్రం సున్నా. ఈ మధ్యనే ఒక అయిదుగురు ఎనిమిది ఇంటర్వ్యూ నుంచి ప్రతి ఇంటర్వ్యూలో కలుస్తున్నారు. వాళ్ళకు కూడా ఉద్యోగం రాలేదన్నమాట. కాని వాళ్ళు నిరుద్యోగంలో తనకు జూనియర్లు అనుకున్నాడు మురారి.
‘మురారిగారూ ఏమయింది?’ అడిగాడు కార్తిక్‌.
పెదవి విరిచాడు మురారి. మురారికి చాలా బాధగా వుంది. ఇంకో ఏడు నెలల్లో తన తండ్రి రిటైరవుతాడు. అప్పుడేంటి పరిస్థితి. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు తనను చదివించారు. కాని ఇంత వరకు ఉద్యోగం రాలేదు. ఎవరితో మాట్లాడాలని లేదు. ఇంటికి బయుదేరాడు మురారి.
తల్లిదండ్రులను పోషించాల్సిన సమయంలో తనే వాళ్ళకి భారమవుతున్నాడు. తనకి ఇంక ఉద్యోగాలు రావా? ఏం చేయాలి? తన బ్యాచ్‌లో నిరుద్యోగి తనొక్కడే. ఫంక్షన్స్‌కి వెళ్ళాలంటే జంకు. స్నేహితుల్ని కలవాంటే సంకోచం. ఇంటికి బంధువులొస్తున్నారంటే బెంగ. అందరి చూపుల్లో ఒకటే ప్రశ్న
‘ఉద్యోగం వచ్చిందా’ అని మరి మార్గమేది? మెల్లగా మెదడులో పురుగు తొలిచేయసాగింది.“`‘‘ఆత్మ హత్య’’ అనే ఆలోచన. ఇంట్లోకి అడుగుపెట్టాడు మురారి. తల్లి సుమిత్ర ఫోన్‌లో వుంది. ‘నేనా? చాలావరకు రేడియో వింటాను. ‘పాడుతా తీయగా’ లాంటి పాట ప్రోగ్రాములు చూస్తాము. సీరియల్స్‌ చాలా తక్కువ. సుజాతా వీలయితే ‘సోనీ’ చూడు ` ఆ! హిందీ ఛానలే,, రాత్రి కృష్ణా బేన్‌ కాక్రా వాలా అని ఒక సీరియల్‌, చాలా బాగుంది. శుక్ర, శనివారాలు మధ్యాహ్నం రీపీట్‌’ అవుతుంది.
భర్త చనిపోయిన ఒక స్త్రీ జబ్బు మనిషి అయిన మామగారిని నలుగురు పిల్లల్ని ఎలా పోషించింది. సమస్యల్ని ఎలా ఎదుర్కొంది. అప్పడాలు చేసినా ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకుంది. అన్నీ చాలా బాగా చూపించారు. సమకాలీన సమస్యలైన ఉల్లిపాయ ధర, పెట్రోల్‌ ధర పెరగడం, కాలేజికి వచ్చిన పిల్ల సమస్యలు. అన్నీ బాగున్నాయి. చదువుకుని ఉద్యోగాలు రాని వాళ్ళు, డిప్రెషన్‌లోకి వెళ్ళేవాళ్ళు తప్పకుండా చూడాలి’ అంది సుమిత్ర.
‘తల్లి తన మనసు చదివిందా’ అనుకున్నాడు మురారి. ఈ మధ్య మాటి మాటికి నిరాశా, నిస్పృహకు లోనవుతున్నాడు. ధైర్యం సన్నగిల్లుతూంది. ఉద్యోగం వస్తుందనే నమ్మకం తగ్గిపోతూంది వాటన్నిటి పర్యవసానమే ఇందాకటి ఆలోచన. తనని ఇంతగా ప్రేమించే తల్లిదండ్రులు తనేదైనా చేసుకుంటే తట్టుకోగలరా? సందిగ్దావస్థలో గదిలోకి అడుగు పెట్టాడు మురారి.
మంచం మీద ఆ వారం స్వాతి వారపత్రిక తెరచి వుంది. తల్లి చదువుతూ ఫోన్‌ వస్తే వెళ్ళినట్టుంది అని పుస్తకం తీసి ప్రక్కన పెడదాం అనుకుంటూ చూస్తే అందులో ఆరోగ్యానికి ఆరు సూత్రాలు అని కనిపించింది. టీ.వీ. ఛానెల్‌ వాళ్ళు అదర గొడుతున్నారు. మళ్ళీ పత్రిక వాళ్ళు కూడానా అనుకుంటూ చూశాడు.
డయాబిటిస్‌కి కాకరకాయ రసం, మొలకెత్తిన పెసలు, శెనగలు. రక్తహీనతకి కీరకాయ ముక్క, క్యారట్‌ ముక్క, టమోట రసం, చిటికెడు ఉప్పు. బీట్‌రూట్‌ రసం. అలా సాగింది ఆ వ్యాసం.
ఉన్నట్టుండి ఒక ఆలోచన మురారిలో. వెంటనే తన ఇంటర్వ్యూలో స్నేహితులకు 5 మందికి ఫోన్‌ చేసి సాయంత్రం పార్కుకు రమ్మన్నాడు.
‘మురారి ఈ మధ్య కాలంలో నిన్ను ఇంత ఉత్సాహంగా చూడలేదు’ అంది మధ్యాహ్నం మురారికి భోజనం పెడుతూ సుమిత్ర. జవాబుగా నవ్వాడు మురారి.
సాయంత్రం ఆరుగంటకు ఆరుగురు స్నేహితులు సమావేశమయ్యారు. ఇంటర్వ్యూ నుంచి వచ్చినప్పుడు తన ఆలోచనలను, తల్లి స్నేహితురాలితో సోనీ లో సీరియల్‌ గురించి సంభాషణ, స్వాతి వార పత్రికలో వ్యాసం, అన్నీ వివరించాడు మురారి.
‘అయితే ఇప్పుడేమంటారు’ అడిగాడు అభినవ్‌.
తోపుడు బండిలో మామిడి పళ్ళు అమ్మేవాడు, చెరకు రసం అమ్మేవాడు కూడా సంపాదిస్తున్నారు. నాదో ఆలోచన
‘మనం కారట్‌, కీర, టమోటో జ్యూస్‌, బీట్‌రూట్‌ జ్యూస్‌, మొలకెత్తిన విత్తనాలు సిటిలో పార్కుల దగ్గర అమ్మడం ప్రారంభిస్తే ఎలా వుంటుంది’ అన్నాడు మురారి.
‘మనమా? పార్కు దగ్గరా? ’ అన్నారు అందరూ ఒక్కసారిగా.
‘అవును తప్పేముంది. మన ఖర్చుకు ఎవరిమీదా ఆధార పడక్కర్లేదు. ప్రయత్నించి చూద్ధాం. ఒకవేళ అది బాగలేకపోతే వేరే ఏదైనా ఆలోచిద్దాం’ అన్నాడు మురారి.
కొన్ని నిముషాల ఆలోచన తర్వాత అందరూ ఆ ఆలోచనను ఆమోదించారు. అలా వీరందరి ఆలోచన ఫలితంగా పుట్టింది ‘మకర’
కాపిటల్‌ కూడా ఎక్కువ అవసరం లేకపోవడంతో ఇబ్బంది లేదు. అందరూ ఒక్కో వెయ్యి రూపాయిలు వేసుకున్నారు. ముందు రెండు పార్కుల ముందు ప్రారంభించానుకున్నారు. వీళ్ళకు అన్నిటికి సలహాదారు అనూష వాళ్ళ అమ్మగారు కళావతిగారు. అమ్మాయిు అబ్బాయి కలిసి ఒక బట్ట కొని వాళ్ళ పెయింటింగ్‌ కళనంతా కుమ్మరించి బ్యానర్‌ తయారు చేసారు
‘మన ‘మకర’ అందరి ఆరోగ్యానికి సహారా’ అంటూ 15 రోజులకు వీరి వ్యాపారం ఊపందుకుంది. రుచిగా, శుచిగా వున్న ‘ఆరోగ్య రసాలు’ చాలా మంది కొనసాగారు. రెండు నెలలయ్యే సరికి అన్ని పార్కుల ముందర ‘మకర ` రస ` శాలలు, వెలిసాయి.
ఇంకొంతమంది నిరుద్యోగులకు పని దొరికింది. ముందు ఇళ్ళల్లో వాళ్ళు నామోషీగా ఫీలయినా ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు.
నాలుగు నెలలకు ఆవకాయ సీజన్‌ వచ్చింది. కళావతిగారు ఆవకాయ కూడా ‘మకర’ ద్వారా ప్రారంభించమని సలహా ఇచ్చారు. ముందు రెగ్యులర్‌ కస్టమర్స్‌కి చిన్న ప్యాకెట్లలో ఆవకాయ పంచిపెట్టారు. కొన్నాళ్ళకు నగరమంతా మకరా ఆవకాయ ఘుమఘుమలతో నిండిపోయింది.
కొన్నాళ్ళకు కార్తీక్‌ వాళ్ళ అమ్మగారు లలిత సాంబారు పొడి సలహా ఇచ్చారు. మరో మూడు నెలలకు రోజూ 5 కిలోల సాంబారు పొడి తయారు చేయాల్సి వచ్చేది. మూడేళ్ళు గడిచేసరికి ‘మకర’ పేరు నగరమంతా మారుమ్రోగి పోయింది. ‘మకర’ తయారీలో ` రుచిలో `శుచిలో స్టాండర్డ్‌ అలాగే వుంది.
మూడో యానివర్సరి రోజు మరో శుభవార్త అందింది వాళ్లకు. ఆ సంవత్సరం ‘బెస్ట్‌ స్మాల్‌ బిజినెస్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌’గా ‘మకర’ అవార్డు అందుకుంది.
అవార్డు ఇచ్చిన ఆర్థిక శాఖామంత్రి మకరను స్టేజి మీదకు పిలిచారు స్నేహితులారుమంది స్టేజి ఎక్కారు. అవార్డు అందుకున్నాక మాట్లాడమంటే మురారి ముందుకు వచ్చాడు. “సభకు నమస్కారం మాకు ఈ అవార్డు రావడానికి కారణమైన మా ఖాతాదారులకు, మాకు సలహాదారులు, శ్రేయోభిలాషి అయిన కళావతి ఆంటీకి కృతజ్ఞతాభివందనం. ‘మకర’ అంటే ఏమిటి అని? మురారిలో ఎం. ‘ఆంగ్ల అక్షరం’ అభినవ్‌ లో ‘ఎ’, కార్తీక్‌లో ‘కె’, అపర్ణలో ‘ఎ’, రాకేష్‌లో ‘ఆర్‌’, అనూషలో ‘ఎ’ కలిపితే మకర. ‘టీ.వీ’, పుస్తకాలు’ యువతను పాడు చేస్తాయి అనే అపవాదు ఉంది. కాని మా అమ్మ చెప్పిన ఒక టీ.వీ. సీరియల్‌, ‘స్వాతి’ వారపత్రికలోని వ్యాసం. నా జీవితాన్ని మార్చి వేశాయి. మాకో ఉపాధి దొరికింది. సంఘంలో గుర్తింపు దొరికింది. ఈ రోజు ఈ అవార్డును మాకిచ్చింది. పరోక్షంగా మాకు దారి చూపించిన మా అమ్మకు ఈ అవార్డు అంకితం అని క్రిందకు దిగాడు మురారి. అయిదు నిముషాల దాక ఆగలేదు చప్పట్లు.
మురారి అండ్‌ కో ‘మకర’ లాగా నిరుద్యోగుందరూ ఏదో ఒక స్వయం ఉపాధి పధకాలను చేపట్టాలని దానికి తమ ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందన్నారు మంత్రిగారు.
‘కృషితో నాస్తి: దుర్భిక్షం’ అని రుజువు చేసిన మకరను మరోసారి అభినందిస్తున్నాను అని ప్రశంసించారు మంత్రిగారు.

*****

2 thoughts on “కృషితో నాస్తి దుర్భిక్షం’’

Leave a Reply to మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *