March 28, 2024

రెండో జీవితం

రచన : అంగులూరి అంజనీదేవి

జీవితం చిన్నదే అయినా మనుషుల్లో ఆశలు, ఆకాంక్షలు వుంటాయి. తాము చేరుకోవలసిన గమ్యాలు, పెట్టుకున్న లక్ష్యాలు వుంటాయి. శాంతికి, అశాంతికి మధ్యన అవ్యక్తపు ఆలోచనలు, ఊహకందని అలజడులు వుంటాయి. వీటికోసం ఎంతో గోప్యంగా తమ హృదయాన్ని రహస్యపు మందిరంగా చేసుకొంటారు. మనసును దారంతో బిగించి కట్టిన పొట్లంలా మార్చుకుంటారు. తాము గీసుకున్న బొమ్మలో తామే తిరుగుతున్నట్లు తమలోకి తాము చూసుకుంటారు. ఎక్కడ ఆగుతామో అక్కడ మన ఆనందం ఆగుతుందని గ్రహిస్తారు. తిరిగి ప్రయాణం సాగిస్తారు. అదొక నిరంతర సాహస యాత్రలా సాగుతారు. చివరకు జీవితం చిన్నది కాదని భ్రమిస్తారు. కానీ… జీవితం లేత కొమ్మల్ని పట్టుకొని వేలాడే మంచుబిందువు. తప్పని సరిగా తెగిపోయేదే. జారిపోయేదే!
ఒక జీవిత కాలం ఎందుకు బ్రతుకుతున్నామని ఎవరిని వాళ్లు ప్రశ్నించుకున్నప్పుడు ” ప్రేమించేందుకు, ప్రేమను వెతుక్కునేందుకు అని మాత్రమే కాకుండా ప్రేమించబడేందుకు, ప్రేమను పంచేందుకు” అని జవాబు చెప్పుకోగలగాలి. అనుమానించేందుకు, అవమానించేందుకు అని కాదు. ఒక మనిషి ఎదుటి మనిషిని ప్రేమించినా, అవమానించినా, అభిమానించినా, చివరికి అనుమానించినా దాని అంతస్సూత్రం ఆత్మతృప్తి… కానీ అనుమానంతో, అవమానంతో వచ్చే తృప్తి పరిపూర్ణం కాదు. గెలిచినట్లు కాదు… ఎవరు ఎవర్ని ప్రపంచంలో గెలవాలన్నా ఒకే ఒక్క ఆయుధం ప్రేమ. దీనితో గెలిచిన గెలుపు శాశ్వతం.
ఆరోజు కాలేజీలో జరిగే సెమినార్లో అంతవరకు మాట్లాడిన వాళ్లంతా స్టడీగురించి, ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ గురించి, సోషల్‌ యాక్టివిటీస్‌ గురించి, ఎన్విరాన్‌మెంట్ కండిషన్స్‌ గురించి, ఇంకా ఫ్రెండ్‌షిప్‌ గురించి మాట్లాడారు.
ఇప్పుడు ద్రోణ వంతు వచ్చింది.
వెంటనే ద్రోణ మైకు అందుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు.
”ప్రేమంటే ఎదుటి మనిషి హృదయ సముద్రపు లోతు, ఒడ్డు, వెడల్పు తెలుసుకొని, అంతులేని అన్వేషణ చేస్తూ, ఆపేక్ష కురిపిస్తూ ఆ మనిషి రూపాన్ని క్షణం కూడా మరచిపోకుండా వెన్నెల ముద్దలో, గులాబి పువ్వులో చూసుకోవటమే… అంతేకాదు. అదొక మానసిక స్థితి. నిరంతర ధ్యానం. ప్రేమ మనుషుల్ని బందీలను చేస్తుంది. ఒకరిని మరొకరి ఆధీనంలో వుంచుతుంది. అలాటి ప్రేమలోని తాజాదనాన్ని, సున్నితత్వాన్ని కోల్పోకుండా వుండాలంటే స్థితప్రజ్ఞత కావాలి… ఇష్టంతో ఏర్పడిన ప్రేమలో బాధ్యత కన్పిస్తుంది. భరించటం వుంటుంది… ‘నేను’ తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమీ నాకు లేదు. ‘నువ్వు’ తప్ప ఈ ప్రపంచాన్నుంచి ఇంకేమీ నాకు అక్కర్లేదు అన్పిస్తుంది. ఇంతెందుకు ఒక్కోసారి మన భావాలు కూడా మనల్ని ఎంతగానో ఊపి, ఊగించి చివరికి మనం ప్రేమించిన వ్యక్తి దగ్గర మనల్ని ఆపేస్తాయి. అదిమాత్రమే అంతిమ లక్ష్యం అన్నట్లు… ఆ ఒక్క గమ్యం కోసం తక్కిన ప్రయాణాలన్నీ త్యాగం చేసుకుంటాం. ఎందుకు? మనదైన, మనసైన, ఆవ్యక్తి మనకోసం అన్వేషిస్తుంది. నిరీక్షిస్తుంది. వదిలిపోలేని బంధంలా ఆ మనిషి స్పృహ మనల్ని తాళ్లతో చుట్టి వేస్తుంది. మనం ఎంత బలవంతులమైనా ‘ప్రేమ’ దగ్గర మాత్రం ఎప్పటికీ బలహీనులమే. అది మన బలం కూడా కావొచ్చేమో…
కానీ… ఎదుటివాళ్లకి ఇష్టం లేకుండా ఫోర్స్‌ చేసి ప్రేమించమని వెంటబడకూడదు. ‘నో’ చెప్పగానే తప్పుకోవాలి. స్నేహితులకి చెప్పుకోటానికో, బయట వ్యక్తులకి చెప్పుకోటానికో నాకో లవర్‌ కావాలనుకోవటం తప్పు… ఎందుకంటే చాలామంది ప్రేమ పేరుతో ఎవరూ తమ వెంట పడకూడదని, ఏ ఆటంకం లేకుండా తమ చదువు సాగితే బావుండని ఆశిస్తారు. కెరియర్‌ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటారు. చచ్చినప్పుడు ఎంతసేపు ఏడ్వాలి? ఏడ్వకుండా ఎంతసేపు చదవాలి? అన్నట్లు ప్రతిక్షణాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. కెరియర్‌ని బిల్డప్‌ చేసుకోవాలనుకుంటున్నారు.
అటువంటి వాళ్ల జీవితాల్లోకి ప్రేమ పేరుతో వెళ్లకూడదు. డిస్టర్బ్‌ చెయ్యకూడదు. ఒకప్పుడు ప్రేమకోసం తమ ప్రాణాలను పోగొట్టుకున్నవాళ్లుంటే ఇప్పుడు ప్రేమ పేరుతో ప్రాణాలను తీస్తున్నారు. యాసిడ్లు పోస్తున్నారు. ఇది ప్రేమకాదు. హింస…” అని ద్రోణ స్పష్టంగా చెప్తుంటే అక్కడున్న విద్యార్థులందరికి అతని మాటలు నచ్చినట్లు క్లాప్స్‌ కొట్టారు.
ద్రోణ తను చెప్పాలనుకున్న ‘ప్రేమ’ గురించి చెప్పి, వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు.
ఆ సెమినార్లో సీనియర్స్‌, జూనియర్స్‌ అని లేకుండా అందరూ వున్నారు.
సెమినార్‌ పూర్తయ్యాక ఆముక్తతో… ”సంవేద రాలేదా?” అన్నాడు ద్రోణ
అతనెందుకు సంవేదను అడుగుతున్నాడో అర్థమయిన దానిలా ముఖం చిన్నబుచ్చుకొని… ”రాలేదు ద్రోణా! అయినా తన విషయంలో నువ్వేం డౌట్ పెట్టుకోకు. డబ్బులు తప్పకుండా ఇస్తుంది. ఒకవేళ తను ఇవ్వకపోయినా నేను ఇస్తాను…” అంది ఆముక్త.
అతను నొచ్చుకున్నట్లు చూస్తూ… ”ఛ. ఛ. నేను అందుకోసం అడగలేదు ఆముక్తా! సెమినార్‌కి వచ్చి వుంటే బావుండేది కదా అని అడిగాను. అంతే!” అంటూ పక్కకెళ్లాడు ద్రోణ.
వెళ్తున్న ద్రోణని చూసి సమయం, సందర్భం చూడకుండా ద్రోణతో అలా మాట్లాడవల్సింది కాదని ఆముక్తకి ఆ క్షణంలో బాధనిపించింది.
క్లాసయ్యాక క్యాంటీన్‌ దగ్గరకి వెళ్లినప్పుడు ద్రోణతో ”ద్రోణా! ఆరోజు సంవేద కాలేజి ఫీజుకోసం కొంత డబ్బు అవసరమై నిన్ను అడగ్గానే ఇచ్చావు. థ్యాంక్స్‌! కానీ నేను నీ దగ్గర తీసుకొని తనకి ఇచ్చానని సంవేదకి తెలియదు. నేనే ఇచ్చాననుకుంటోంది. ఇప్పటికే చాలాసార్లు ”ఇంట్లో డబ్బుకి ఇబ్బందిగా వుంది ఆముక్తా! తర్వాత ఇస్తాను.” అంది. ‘ఇట్స్ ఓ.కె.’ అన్నానే కాని, ద్రోణ ఏమనుకుంటాడో అన్న గిల్టీ ఫీలింగ్‌ నన్ను పొడుస్తోంది. అయినా ఆ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నాది. ఇస్తాను..” అంది ఆముక్త.
అతను ఆ మాటల్ని శ్రద్ధగా విని… ”ఆముక్తా! నేనిప్పుడు నా క్లాస్‌మేట్స్ తో కలిసి బయట రూంలో వుండటం లేదు. అక్కడ చదువుకోటానికి డిస్ట్రబెన్స్‌గా వుండి, ప్రస్తుతం మా కౌముది అక్కయ్య వాళ్ల ఇంట్లో వుంటున్నాను. సంవేద ఉండేది మా అక్కయ్య వాళ్ల ఎదురింట్లోనే… రోజులు గడుస్తుంటే వాళ్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితి మా అక్కయ్య ద్వారా తెలిసింది. నేను తన ఫీజుకోసం ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి ఇవ్వనవసరం లేదు. నువ్వు కూడా అడక్కు…” అన్నాడు చాలా దయార్థ హృదయంతో.
”తనలా వూరుకోదు. డబ్బులు అందగానే ఇచ్చేస్తుంది. తను అలాటి మనిషి కాదు..” అంది తలవంచుకొని సంవేద వ్యక్తిత్వం తెలిసినదానిలా.
”కానీ ఫోర్స్‌ చెయ్యకు. ఎప్పుడిస్తే అప్పుడు తీసుకుందాం.” అన్నాడు ద్రోణ లైట్ తీసుకో అన్నట్లు.
కానీ ఆముక్తకి తెలుసు సంవేద ఇంట్లో ఆర్థిక పరిస్థితి తీసుకున్న డబ్బుల్ని తిరిగి ఇచ్చే స్థితిలో లేదని… ద్రోణకీ తెలుసు ఈ ప్రపంచంలో మనం ఎవరికి ఏది ఇచ్చినా అది మన దగ్గర తగ్గిపోతుంది కాని మనం ఇష్టపడే వ్యక్తికి ఏమిచ్చినా అది ఇంతై, అంతై అన్నట్లు పెరిగి పెద్దదై నిలువెత్తు విలువై కన్పిస్తుందని…
అందుకే ఆముక్తకి ‘బై’ చెప్పి అక్కడనుండి వెళ్లిపోయాడు ద్రోణ.
*****

మరుసటి రోజు క్లాసుకెళ్లాలని ద్రోణ బైక్‌ దిగి వస్తుంటే… ఆముక్త అతనికి ఎదురుగా వెళ్లి… ”ద్రోణా! ఈ రింగ్‌ నీ దగ్గర వుంచు. సంవేద మనీ ఇచ్చాక తీసుకుంటాను” అంది.
రింగ్‌వైపు చూస్తూ… ”ఈ రింగ్‌ ఎవరిది?” అన్నాడు ద్రోణ.
”నాది. తను నా ఫ్రెండ్‌! నా ఫ్రెండ్‌ కోసం నాకేమైనా చెయ్యాలనిపిస్తుంది. ప్రస్తుతం నా దగ్గర కూడా అంత డబ్బు లేదు. అందుకే ఈ రింగ్‌…” అంది
ద్రోణ ఆముక్త ముఖంలోకి చూస్తూ… ”నువ్వు నా ఫ్రెండ్‌వి ఆముక్తా! నీకోసం ఐ మీన్‌ నీ ఫ్రెండ్‌ కోసం నువ్వింతగా ఆలోచిస్తున్నప్పుడు, నేను నీ ఫ్రెండ్‌కి ఆ మాత్రం హెల్ప్‌ చెయ్యటంలో పెద్ద ఇబ్బందేం లేదు నాకు… ఇలా రింగ్‌ ఇచ్చి అమ్మాయిల మీదున్న నగల్ని తాకట్టుపెట్టుకునేవాడ్ని చెయ్యకు. ఇవ్వడం తెలియనప్పుడు ఫ్రెండ్‌షిప్‌ ఎందుకు దండగ…” అన్నాడు. బాధ, కోపం మిళితమై అతని ముఖం జేవురించింది.
”అది కాదు ద్రోణా!” అని ఆమె మ్లాడబోతుంటే…
”చూడు ఆముక్తా! నువ్వింకేం చెప్పకు. నేను నా ఫ్రెండ్స్‌ని వెంటేసుకొని సినిమాలకో, పార్టీలకో వెళ్లి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టలేదు. ఒక అమ్మాయి కాలేజి ఫీజుకోసం కొంత డబ్బును హెల్ప్‌ చేశాను. ఇది ఖర్చు కాదు. అవసరం. అదీ చదువుకోసం. ప్లీజ్‌! దీని గురించి మరచిపోండి! ఈ పనిలో నాకు తృప్తి వుంది.” అంటూ తన క్లాసురూం వైపు వెళ్లాడు.
ఆముక్త తన ఫ్రెండ్‌ కోసం వెయిట్ చేస్తూ అక్కడే నిలబడింది.
ద్రోణ సాయంత్రం కాలేజినుండి ఇంటికెళ్లాక ఫ్రెషప్పయి ఎప్పటిలాగే మేడ మీదకెళ్లి డైరీ రాస్తూ కూర్చున్నాడు. అతనికి మొదటిసారి ఆముక్త సంవేదను పరిచయం చెయ్యటం గుర్తొచ్చింది. ఆ రోజు ద్రోణకి సంవేద పేరు బాగా నచ్చింది. ఆ పేరులో వున్న సౌందర్యం, లాలిత్వం, పరిపూర్ణత అతని మనసును హత్తుకొంది. ఆముక్త సంవేదను పిలిచిన ప్రతిసారి అతను క్లాసులోకి వెళ్తూనో, అటు, ఇటు తిరుగుతూనో వింటూనే వుంటాడు. అదేం చిత్రమో ఆ పిలుపు ఎంత వద్దన్నా అతని చెవుల్లో మళ్లీ, మళ్లీ రిపీట్ అవుతోంది. అలా కావటం ఆశ్చర్యంగా కూడా వుంది.
సంవేద తనకేమవుతుంది? స్నేహితురాలా? ప్రేమికురాలా? ఆ రెండూ కాక ఇంకేమైనానా? మరెందుకు ఆమెపట్ల తన మనసింత ఉద్విగ్నంగా కొట్టుకుంటుంది? అంతేకాదు ఆకాశం ఉరిమినప్పుడు నేల పులకించినట్లు… మేఘం కురిసినప్పుడు భూమి తడిసి తన్మయత్వంతో ఒళ్లు విరుచుకున్నట్లు… మనసంతా ప్రజ్వలిత పాలపుంత అవుతోంది,
ముందెప్పుడూ లేనివిధంగా దాహార్తితో కంపిస్తున్న తన హృదయంలోకి ఆమె మెల్లగా నడుచుకుంటూ రావటం అతనికి అర్థమవుతోంది. కొండల నడుమన ఆకుపచ్చని రంగేసినట్లు అతని గుండె సస్యశ్యామలమవుతోంది. మనసును కెలికి ఓ వెన్నెల రాత్రి కలలోకి కూడా వచ్చింది. అపూర్వంగా చూసి, ‘నా వైపు చూడవా? నేను నీ మనిషిని.’ అన్నట్లు నవ్వింది. మళ్లీ కన్పిస్తానని చెప్పింది. ఆ చెప్పటంలో ఎంత ఆత్మీయత! ఎంత ఆర్ధ్రత!
అది చూడగానే… అతని మనసు తేనెతో నిండిన దోసిలి అయింది. ఎప్పుడూ లేనిది ఏమిటో తన మనసులోగిలిలోకి ఈ అతిధి రాక అనుకున్నాడు. ఆ రాకలో వుండే స్వచ్ఛతకి, గాఢతకి కట్టుబడిపోయాడు. ఒక మనిషిని ఇంతగా ప్రేమించడం వుంటుందా అని ఆశ్చర్యపోయాడు. ఆ ఆశ్చర్యంలో కూడా ఏదో ఆనందం.
ఇక ఆపుకోలేక.. ఎన్నో ఏళ్లుగా ఆ అమ్మాయిని ప్రేమించి, ప్రేమించి అలసిపోయినవాడిలా ఉద్వేగంతో ఆలోచిస్తూ డైరీలో ఒక్కో అక్షరాన్ని ఎంతో ఆర్తితో, నిజాయితీతో నింపుతున్నాడు.
నిజానికి సంవేదను చూసిన క్షణం నుండి తన మనసు ఎలా తరంగిణి అయిందో.. గుర్తొస్తేనే ప్రపంచాన్ని మరిచి ఆ అమ్మాయిని ఎలా చేరుకోవాలను కుంటున్నాడో.. ఈ స్పందన ఎంత కొత్తగా వుందో.. ఏది ఎప్పుడు పుడ్తుందో తెలియనట్లు ఈ ప్రేమ ఎందుకు పుట్టిందో…! ఒకవేళ ఇది ప్రేమ అయితే అనుక్షణం ఆ అమ్మాయిని తలచుకుంటూ ‘తనకి నేనేమిచ్చానా?’ అని ఆలోచిస్తూ… ‘ఇంకా ఏం కావాలి?’ అని అడగాలనుకుంటూ.. అన్నీ ఇచ్చినా ఇంకా ఏదో మిగిలివుందే ‘ఎప్పుడివ్వాలి?’ అని ఆరాటపడ్తూ… ‘ప్రేమంటే ఇలా మౌనంలో తడుస్తూ ప్రయాణించడమేనా’ అని అనుకుంటూ…. ‘ప్రతి చోటా నీవే అయ్యి, నాకంటూ ఏమిలేని నాలో నేనెక్కడో అర్థంకాక నేను ఒక గాఢమైన అలౌకిక ఆనందంలో మునిగిపోతున్నాను కదా!’ అని సంవేద చెవిలో చెబుతున్నట్లు భ్రమపడ్తూ, నిజంగానే ఏదో ఒక రోజు ఈ ‘ప్రేమ’ ను ఆమెతో చెప్పాలని ఆలోచిస్తుంటే…
అంతలో ద్రోణ స్నేహితుడు లోహిత్‌ లోపలికి వచ్చి ”ఏమి చేస్తున్నావ్‌ ద్రోణా ! వీడు నా ఫ్రెండ్‌ విష్ణు…” అంటూ ఫ్రెండ్‌ని పరిచయం చేశాడు.
‘హలో…’ అంటూ పలకరింపుగా నవ్వి., రాస్తున్న డైరీని పక్కన పెట్టి ఆ ఇద్దర్ని కూర్చోమన్నట్లు సోఫావైపు చేయి చూపాడు ద్రోణ.
విష్ణు ద్రోణవైపు ఆసక్తిగా చూస్తూ ”మీ పేరు ద్రోణ కదా! వెరయిటీగా వుంది. దాని మీనింగేంటి?” అన్నాడు కూర్చుంటూ.
”ద్రోణ అనే పదం ద్రోణి నుండి వచ్చింది. ద్రోణి అంటే కుండ. కుండలోంచి పుట్టటం వల్ల ద్రోణుడు, కుంభ సంభవుడు అని కూడా అంటారు. భారతంలో ద్రోణాచార్యులు అలాగే పుట్టారట…” అన్నాడు ద్రోణ.
”కుండలోంచి క్రియేషన్‌ జరిగింది కాబట్టి ద్రోణాచార్యులు టెస్ట్‌ట్యూబ్‌ బేబి…” అన్నాడు విష్ణు
విష్ణు ఆలోచనాశక్తికి చకితుడై ”నేను మాత్రం టెస్ట్‌ట్యూబ్‌ బేబీని కాదు. నేను పుట్టిన నక్షత్రాన్ని బట్టి, నాకా పేరు పెట్టారు. పూర్తి పేరు ద్రోణవర్షిత్‌! ఈజీగా పిలవొచ్చని ‘ద్రోణ’ అంటుంటారు”. అన్నాడు ద్రోణ.
”ద్రోణా! వీడికో బొమ్మకాని, కవితకాని కావాలట… ఫ్రెండ్‌కి ప్రజెంట్ చేస్తాడట.. నువ్వు బొమ్మలు బాగా వేస్తావని చెప్పి నీదగ్గరకి తీసుకొచ్చాను.” అన్నాడు లోహిత్‌.
”బొమ్మగీసే మూడ్‌లో లేను లోహిత్‌! మన సీనియర్‌ ఆముక్త వుందిగా. భావకవితలు అద్భుతంగా రాస్తుంది. ఓ కవిత రాసి ఇమ్మని అడగండి!” అన్నాడు ద్రోణ.
ఆముక్త పేరువినగానే విష్ణు ఫీలింగ్స్‌ మారాయి.
ద్రోణకి దగ్గరగా వెళ్లి ”ఆముక్తను గుర్తు చెయ్యకురా! వాడసలే బాధలో వున్నాడు.” అన్నాడు లోహిత్‌.
ద్రోణకి అర్థమైంది. విష్ణు ఆముక్తను గాఢంగా ప్రేమిస్తున్నాడు. కానీ ఆముక్త పెళ్ళి ద గ్రేట్ బిజినెస్‌ మాగ్నెట్ మణిచందన్‌తో జరగబోతోంది.
అక్కడో క్షణం కూడా కూర్చోలేక ”రా వెళ్దాం!”’ అంటూ లోహిత్‌ను తీసుకొని బయటకెళ్లాడు విష్ణు…
జీవితం ఓ ప్రశ్న. అదెప్పుడంటే జవాబు దొరకనప్పుడు. విష్ణు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు అనుకుంటూ లేచి కికీ దగ్గరకెళ్లి నిలబడ్డాడు. ఎదురింట్లో వెన్నెల కిరణంలా తిరుగుతూ మళ్లీ సంవేద కన్పించింది.
ద్రోణలో ఒకవిధమైన ప్రకంపన మొదలై అతని గుండె చాలా తీవ్రస్థాయిలో స్పందించింది.
స్పందన మార్పుకి నాంది…
ఎలా స్పందిస్తున్నామన్నదే అస్తిత్వం, వ్యక్తిత్వం.
ఈ స్పందనే సిద్ధార్దుడిని బుద్దుడిగా మార్చింది.
ఆగ్నేస్‌ను విశ్వమాత చేసింది.
కరమ్‌చంద్‌ని మహాత్ముడిగా నిలబెట్టింది.
ద్రోణకి వెంటనే కుంచె పట్టుకోవాలనిపించేలా చేసింది.
మరుసటి రోజు…
”వేదా!” అంటూ గట్టిగా పిలిచింది సంవేద తల్లి శకుంతల.
”వేద లేదు శకుంతలా!” అంటూ చిన్నకూతురు నిశిత తండ్రిని ఇమిటేట్ చేసినట్లు గంభీరంగా అంటుంటే నవ్వకుండా వుండలేకపోయింది శకుంతల.
అయినా ఆ నవ్వును పైకి కన్పించనీయకుండా…
”వేదా! సంవేదా ! ఎక్కడున్నావే. త్వరగా రా!” అంటూ గట్టిగా పిలిచింది శకుంతల.
”అదిరాదు. దానికి పెత్తనాలు ఎక్కువయ్యాయి.” అంది నిశిత తల్లి లాగే గట్టిగా మాట్లాడుతూ…
”అది వింటే వూరుకోదు నీకు…మరీ నోరెక్కువైపోతోంది!” అంది శకుంతల
”దానికి చెల్లెలంటే ప్రాణం.” అంది నిశిత
ఆ మాటకి కదిలిపోయింది శకుంతల. సంవేద నిశితను ఎంతగా ప్రేమిస్తుందో గుర్తుచేసుకుంటూ కళ్లు తడిచేసుకుంది.
తల్లి భావాన్ని కనిపెట్టింది నిశిత. తల్లి తన గురించి అలా బాధపడటం నిశితకి ఇష్టం వుండదు. అయినా తల్లి ఎంత చెప్పిన వినకుండా బాధపడ్తూనే వుంటుంది.
”అమ్మా! అక్క ఎక్కడికెళ్లిందో చెప్పనా! కౌముది అక్కయ్య డ్రస్‌ మెటీరియల్స్‌ తెచ్చిందట. చూసి వస్తానని వెళ్లింది.” అంటూ నిజం చెప్పింది నిశిత.
”మొన్ననే కదే డ్రస్‌లు కొన్నది. అప్పుడే ఎందుకట?” అంది శకుంతల
”నా కోసం కొంటానంది. దానికి ఈ మధ్యన నామీద ప్రేమ ఎక్కువైందిలే..” అంది నిశిత తమాషాగా కళ్లు తిప్పుతూ కాసింత గర్వంతో…
నిశిత ముఖంలోని సంతోషం చూసి అలాగే నిలబడి… ‘దీని ముఖంలో ఈ సంతోషం ఎప్పటికి ఇలాగే వుంటే బావుండు’ అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తోంది శకుంతల.
నిశితకు దేవుడు ఒక కాలు లేకుండా చేసినా మాటలతో ఆకట్టుకునే నైపుణ్యం ఇచ్చాడు. ఎంత విషాదంలో వున్న వాళ్లయినా ఆమె మాటలకి ప్రశాంత మనస్కులైపోతారు. మనిషి చూడానికి అందంగా వుండి, ఒక కాలు లేదన్న భావాన్ని బయటకి కనబడకుండా వుంటుంది.
నిశితకి తెలుగు బాగా చదవగలిగేంత వరకు నేర్పింది సంవేద. అప్పుడప్పుడు కాలేజి లైబ్రరీనుండి బుక్స్‌ తెచ్చి ఇస్తుంది. ఆ బుక్సే నిశితకు మంచి కాలక్షేపం..
సంవేద గురించి ఏ ఆలోచన లేదు శకుంతలకి. నిశిత గురించి నిత్యం బాధపడ్తూనే ఉంటుంది.
ప్రభాకర్‌ గేటు తీసుకొని లోపలకి వస్తూనే శకుంతల చెంప చెళ్లు మనిపించాడు. ఆమె తేరుకునే లోపలే ఇంకో చెంపమీద బలంగా కొట్టాడు.
కళ్లు తిరిగినట్లై రెండు చెంపల్ని పట్టుకొని, అలాగే నిలబడింది శకుంతల. తనేం తప్పు చేసిందో అర్థం కాలేదు. కళ్లలో నీళ్లు తిరగటం తప్ప…
అది చూసి వణికింది నిశిత. తండ్రి తల్లిని కొట్టినప్పుడల్లా అదే పరిస్థితి ఆమెది. తల్లిని కొడుతుంటే ఏ బిడ్డా ఓర్చుకోలేదంటారు. చూస్తూ నిస్సహాయంగా విలపించటం తప్ప మరోదారి లేదు నిశితకి…
”బుద్ది వుందా నీకు? ఎదిగిన ఆడపిల్లని ఇళ్లవెంట తిప్పుతావా? ఆడపిల్లల్ని కన్న తల్లికి వుండాల్సిన లక్షణమేనా ఇది? ఏం పని నీ కూతురికి ఎదురింట్లో..? పిలువు దాన్ని..” అంటూ కోపంగా అరుచుకుంటూ లోపలకి వెళ్లాడు ప్రభాకర్‌.
తల్లి తనవైపు చూస్తే తన కంటి చూపుతోనే తల్లిని ఓదార్చాలని చూస్తోంది నిశిత. కానీ నిశిత ఫీలింగ్స్‌ని పట్టించుకోకుండా ఎదురింటి వైపు చూసింది శకుంతల.
అక్కడ కౌముది – సంవేద ఇంకా కొంతమంది ఆడవాళ్లు డ్రస్‌ మెటీరియల్స్‌ చూస్తున్నారు.
యువకుడైన ద్రోణ – లోహిత్‌ ఫ్రెండ్స్‌ పతంగిలు ఎగరేస్తూంటే డాబాపై నిలబడి వున్నాడు. అతను సంవేదను చూడలేదు.
పైన ద్రోణ వున్న విషయం సంవేద చూడలేదు. చూస్తే వెళ్లేది కాదు.
కౌముది తమ్ముడు వున్నట్లు తెలిసి సంవేద అక్కడకెందుకు వెళ్లటం అన్నదే ప్రభాకర్‌ కోపం.
”సంవేదా!” గట్టిగా కేకేసింది శకుంతల.
అది పిలుపుకాదు. అరుపు.
ద్రోణ కిందకి చూశాడు.
సంవేద పరిగెత్తుతున్నట్లే ఇంట్లోకి వెళ్లటం చూసి ఇప్పటి వరకు ఆ అమ్మాయి తను నిలుచున్న చోటుకిందనే వుందన్న వూహ చాల థ్రిల్లింగ్‌గా అన్పించింది.
తండ్రి ఇంట్లోకి వచ్చి వుంటాడన్న భయంతోనే ఊపిరి బిగబట్టుకొని లోపలకెళ్లిన సంవేదను తన దగ్గరకి రమ్మని సైగ చేసింది నిశిత. సంవేద వెంటనే నిశిత దగ్గరకి వెళ్లింది.
”అక్కా”! అమ్మను నాన్న కొట్టాడు” అంది బాధగా ముఖం పెట్టింది నిశిత.
సంవేద గుండె కలుక్కుమంది.
”ఎందుకు?” అంది వెంటనే…
”నువ్వు ఎదురింట్లో వుండటం చూసి… ఆడపిల్లకి ఏంటా తిరుగుళ్లు అని…” అంది నిశిత.
తననో చట్రంలో బిగించి ఆ చట్రమేదో సడలినట్లు తండ్రిలో కలిగిన ఉలికిపాటుకి కోపం వచ్చింది సంవేదకి…
ఎంతమంది అమ్మాయిలు కాలేజీలు మానేసి పార్కులకి వెళ్ళటం లేదు? సినిమాలకు వెళ్ళటం లేదు? తను ఎదురింటికి వెళ్తే తప్పా? అలా వెళ్లినందువల్ల అక్కడ జరిగిన తప్పేమీ లేదుకదా!… అనవసరంగా తల్లి కొట్టించుకొంది. తను ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా తల్లిని కొడతాడు. ఇదేం సంస్కృతి? ఇదేం తృప్తి? ఇలాటి తండ్రులు వుంటారా? అని ఆవేశం ఆపుకోలేక…వెంటనే తల్లి దగ్గరకి వెళ్లింది సంవేద.
”అమ్మా ! నాన్న కొట్టాడా?” అంది”
మాట్లాడలేదు శకుంతల.
”నాన్న కొడ్తుంటే అలాగే పడుంటావా? అందుకేనా నువ్వుండేది? ఇదేమిటని ప్రశ్నించలేవా? ఇంత వయసొచ్చినా చిన్నపిల్లలా కొట్టమని ఒళ్లప్ప జెప్పటమేనా నీపని..? మేం ఎదుగుతున్నాం.. ఇంతకు ముందులా ఊరుకోమని చెప్పు నాన్నకి…” అంది సంవేద.
”అది కాదు వేదా! నువ్వు కౌముది వాళ్ల ఇంటికి ఎందుకు వెళ్లావు? అదీ వాళ్ల తమ్ముడు వుండగా.. అదే నాన్నకి కోపం. అందుకే కొట్టాడు” అంది నెమ్మదిగా కూతురు వైపు చూస్తూ…
”ఈ పద్దతేం బాగలేదమ్మా! నేనేమైనా అతని దగ్గరకెళ్లి మాట్లాడానా? నాన్న ఎందుకింత వక్రంగా ఆలోచిస్తున్నాడు?” అంది సంవేద.
”ఆడపిల్ల తండ్రికి భయముంటుంది సంవేదా” అంది శకుంతల.
”ఇది భయంకాదు. నన్ను అనుమానించటం, అవమానించటం, ఆయనెలా మాట్లాడినా ఏం చేసినా సహిస్తున్నాం. కాబట్టి రెచ్చిపోతున్నాడు. అదే ఎదురు తిరిగితే…? అంటూ నత్తగుల్లలోంచి బయటకొచ్చి సాగినట్లు సంవేద ప్రశ్నిస్తుంటే…
”ఎక్కడున్నావే శకుంతలా! పిలుస్తుంటే నిన్ను కానట్లు పలకవేం? విన్పించట్లేదా?” అంటూ ప్రభాకర్‌ పిలవగానే భయపడ్తూ పరిగెత్తింది భర్త దగ్గరకి శకుంతల.
తలకొట్టుకొంది సంవేద.
”అదొచ్చిందా? ఇంకా ఆ ఇంట్లోనే చచ్చిందా?” అన్నాడు
”వచ్చిందిలెండి” అంది ముక్తసరిగా శకుంతల
”దాన్ని ఆ స్పోకెన్‌ ఇంగ్లీష్‌ క్లాస్‌కి వెళ్లనియ్యకు. వచ్చేవరకు రాత్రవుతుంది. లేదంటే టైమింగ్స్‌ మార్చుకోమని చెప్పు!” అన్నాడు ప్రభాకర్‌ సంవేదను ఉద్దేశించి…
”వీలు కాదటండీ! అలా మార్చుకోవాలని అది కూడా అనుకొంది. ఈ కోచింగ్‌ క్లాసుల టైమింగ్సే అలా వున్నాయి ఆడప్లిలలకి కాస్త ఇబ్బందిగానే వుంది…” అంది శకుంతల.
ఏ మూడ్‌లో వున్నాడో ఏం మాట్లాడలేదు ప్రభాకర్‌.
రాత్రి ఎనిమిది కాకముందే.. ఎప్పటిలాగే రౌండ్‌ టేబుల్‌ సెక్షన్‌ మొదలుపెట్టాడు ప్రభాకర్‌
ఆ టేబుల్‌ మీద విస్కీ, సోడా, ఐస్‌, చిప్స్‌ అమర్చి వున్నాయి.
ఆ వాతావరణం ఆ ఇంట్లో రోజూ వుంటుంది.
ఇంట్లో అందరు చూస్తుండగానే తాగుతూ కూర్చుంటాడు.
ఆయన్నలా చూస్తూ నిశ్శబ్దంగా తిరగటం ఆ ఇంట్లో అందరికి అలవాటైపోయింది.
మితంగా తాగినంతసేపు ఏమీ అనడు.
మోతాదు మించితే చెప్పిందే చెప్పి, అరిచిందే అరిచి, పిచ్చెక్కేలా చేస్తాడు.
”మీ ఇద్దరు తిని, వెళ్లి పడుకోండి!” అంది శకుంతల సంవేదతో…
ఆ మాటతో మౌనంగా ప్లేట్లు అందుకొని – నిశితకి, తనకి అన్నంపెట్టుకొని, తన గదిలోకి తీసికెళ్లింది సంవేద. వెళ్లేముందు తండ్రిముందున్న బాటిల్స్‌ని, తండ్రిని ఒకటికి రెండుసార్లు అలాగే చూసి వెళ్లింది.
అన్నం తిన్న తర్వాత.. బెడ్‌షీట్స్ సరిచేసి, చెల్లి పక్కన పడుకొంది.
చెల్లిపై చేయివేసి… కాలేజీలో ఆ రోజు జరిగిన విషయాలు చెబుతూ పడుకొంది.
”ఇక చాల్లెండి! ఎక్కువైనట్లుంది…” అంది శకుంతల భర్త తాగి, తాగి ఏమవుతాడోనన్న బెంగతో…
ఆయన తాగుతూ ఎంజాయ్‌ చెయ్యటం లేదు. దీర్ఘాలోచనలో వున్నాడు.
సడన్‌గా శకుంతలవైపు చూశాడు.
”పెద్దదానికి పెళ్లిచేసి, కుంటిదాన్ని ఇంట్లో వుంచుకుందాం శకుంతల!” అన్నాడు ఫ్రభాకర్‌. ఆశ్చర్యపోయింది శకుంతల.
చదువుకుంటున్న సంవేదకు, ఇప్పుడు పెళ్లేంటి? ఆ సంభాషణ నచ్చలేదు. శకుంతలకి.. కానీ తనిప్పుడు ఏ మాత్రం అడ్డు చెప్పినా బండబూతులు తిడతాడని మౌనంగా చూసింది.
”ఇవాళ మా ఆఫీసులో ఒక అబ్బాయి గురించి మాట్లాడుకున్నాం. ముందుగా మా ఫ్రెండ్‌ ఇంటికెళ్లి ఆ అబ్బాయి వివరాలు తెలుసుకుందాం. ఆ తర్వాత నేరుగా అబ్బాయి ఇంటికి వెళ్లి, చూసి వద్దాం..” అన్నాడు ప్రభాకర్‌.
ఆశ్చర్యపోయింది శకుంతల.
అప్పుడే అబ్బాయిని చూడటం దాకా వచ్చిందా అని ఆలోచిస్తూ – తనకీ పెళ్లి ప్రయత్నాలు ఏమాత్రం నచ్చటంలేదని చెప్పాలనుకుంది. ఆయన మాట కాదంటే ఆయన అరిచే అరుపులకి చుట్టుపక్కల వాళ్లు నిద్రలేస్తారని భయంతో వణికి పోయింది.
ఆయన ధోరణిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత తాగినా ఏ మాత్రం తడబడటంలేదు. స్పష్టంగానే చెబుతున్నాడు. కాకుంటే కళ్లు బాగా ఎర్రబడి మత్తుగా చూస్తున్నాడు. ఉచ్ఛ్వాస, నిశ్వాసలు కాస్త తేడాగా వున్నాయి.
ఆయన తాగినపుడు అలాగే వుంటాడు. నిద్రపోయి లేస్తే తిరిగి మామూలైపోతాడు. త్వరగా అన్నం తిని పడుకుంటే బావుండని చూస్తోంది శకుంతల.
”అబ్బాయి మనకు నచ్చితేనే చేద్దాం శకుంతలా! మా ఫ్రెండ్‌తో కూడా అదే చెప్పాను. ‘మా అమ్మాయిని ముందు చూపించం. చదువుకుంటోంది. డిస్టర్బ్‌ అవుతుంది. మాకు అన్నివిధాల పర్వాలేదనిపిస్తే వెంటనే పెళ్లి చేస్తాను.’ అని చెప్పాను” అన్నాడు ప్రభాకర్‌.
భర్త మాటలు పద్ధతిగా అన్పించాయి శకుంతలకి. ఇంతకన్నా ఎక్కువగా ఏ తండ్రీ ఆలోచించడేమో! మంచి సంబంధం దొరికితే సంవేదకు పెళ్లి చెయ్యటమే ఉత్తమం అనుకొంది.
ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లు బయటకెళ్లాక పైకి చెప్పుకోలేని ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం పెళ్లి చేసుకున్నాక తగినంత స్వేచ్ఛ, ఎకనామికల్‌ సెక్యూరిటీ, ఆత్మగౌరవాన్ని నిలుపుకోగలిగేంత వాతావరణం వుంటుందో లేదో నన్న అనుమానం.. అందుకే పెళ్లికన్నా ఉద్యోగానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
కానీ బయటవుండే సమస్యలు బయటవుంటాయి. ఇంట్లో వుండే ఇబ్బందులు ఇంట్లో వుంటాయి. సంవేదకి మంచి సంబంధం దొరికితే పెళ్లి చెయ్యటమే మంచి దనుకొంది.
భర్తకి వ్యతిరేకంగా మాట్లాడలేదు.
”రేపు ఉదయాన్నే అబ్బాయిని చూడానికి వెళ్దాం. పద పడుకుందాం..” అన్నాడు లేవబోయి కాస్త తూలుతూ, వెంటనే శకుంతల పట్టుకోవటంతో పూర్తిగా లేచి, ఆమె ఆసరాతో బెడ్‌ దగ్గరకి నడిచాడు.
”మీరు అన్నం తినలేదు. తిన్నాక పడుకుందాం!” అంది
‘ఉష్‌’ అంటూ నోటిమీద వేలువుంచుకొని…
”పడుకో.. అన్నాడు గట్టిగా..
టక్కున పడుకొంది శకుంతల. ఆమెకు ఆకలిగా వుంది.
మోకాళ్లను కడుపులోకి ముడుచుకొంది. అప్పుడప్పుడు ఇదే పరిస్థితి.
*****

ఉదయం ఎనిమిది గంటలకి…
సంవేద కోసం అబ్బాయిని చూడాలని శకుంతల, ప్రభాకర్‌ వెళ్లారు. తామెక్కడికి వెళ్తున్నామో సంవేదకి చెప్పలేదు.
నిశితకి టిఫిన్‌ పెట్టింది సంవేద.
ఆ తర్వాత ఏం చేయాలో తోచలేదు.
కాలేజి లేదు…
ఇంట్లో టీ.వి. లేదు..
సినిమా లేదు. షికారు లేదు…
బయటకెళ్లే అలవాటులేదు..
ఆ అలవాటును కూడా ఒక తాడులా చేసుకొని ప్రతిరోజు ఒక దారం పోగుతో దాన్ని కలిపినేస్తూ తెంచటానికి వీలుకానంత బలంగా మార్చుకొంది.
ఆలోచిస్తూ కూర్చుంది సంవేద. అలా చాలాసేపు గడిచింది.
ఎప్పటినుండో సంవేదలో ఓ కోరిక వుంది.
ఆ కోరిక తీరాలంటే తల్లీదండ్రి ఇంట్లో వుండకూడదు. ఇవాళ వాళ్లిద్దరు ఇలా ఇంట్లో లేకపోవటం అనేది అరుదైన అవకాశం. కానీ ఆమెలో కలిగే సంకోచం ఆ అవకాశాన్ని డామినేట్ చేస్తోంది.
కానీ ఈ విషయంలో వెనుకడుగు వెయ్యకూడదు. నిస్సంకోచంగా నిర్ణయం తీసుకోవాలి.
తండ్రిని గుర్తుచేసుకుంటూ ధైర్యం తెచ్చుకొంది.
‘నువ్వు సంతోషంగా వుండాలంటే ఒక్క క్షణమైనా నీ తండ్రిని అనుకరించు, ఆయన ప్రతిరోజూ అనుభవిస్తున్న ఆనందపు నిషాను కాస్తయినా చవిచూడు’ అని ఆమె మనసు పదే పదే చెప్పింది.
అనుకరణ చాలా గొప్పది అది లేకపోతే మనం ఏమీ నేర్చుకోలేం. ఏమీ చేయలేం. పిల్లలు పెద్దవాళ్లను అనుకరిస్తూ మాటలు, నడక, నడత ఎలా అలవర్చుకుంటారో అలాగే వాళ్ల అలవాట్లను కూడా ఫాలో అవుతారు.
వెంటనే లేచి నాన్న విస్కీ బాటిల్స్‌ని దాచుకునే ర్యాక్‌ దగ్గరకి వెళ్లింది. వాటివైపు చూసింది.
ఓ విస్కీ బాటిల్‌ని బయటకి తీసింది.
ఆలస్యం చేస్తే అమ్మా, నాన్న వస్తారని.. వెంటనే ఆ బాటిల్‌ మూతతీసి, విస్కీని గాజు గ్లాసులోకి ఒంపుకొని, సోడా కలిపింది. గడ, గడ తాగింది. ఆమె గొంతు చుర, చురా మండి ఎంతో ఘాటుగా అన్పించింది.
ఆ బాటిల్‌ని తిరిగి యధా స్థానంలో పెట్టింది.
ఇన్ని రోజులు నాన్న తాగుతుంటే అదెలా వుంటుందో నన్న జిజ్ఞాస వుండేది. ఇప్పుడది తీరింది. ప్రపంచాన్ని జయించినట్లు అంతు తెలియని తృప్తిగా వుంది.
అలా ఓ ఐదు నిముషాలు గడిచాక…
నర,నరాల్లో ఏదో అగ్ని పాకుతున్నట్లై, పరిసరాలు తనచుట్టూ తిరుగుతున్నట్లు అన్పించటం మొదలైంది.
తల తిరుగుతోంది. దిక్కు తెలియనట్లు తిక్క, తిక్కగా వుంది. కడుపులో తిప్పి, వాంతి వచ్చినట్లుగా అన్పిస్తోంది.
ఒక్క అడుగులో బయట కొచ్చింది.
శరీరం తేలిపోతున్నట్లు స్వాదీనం తప్పుతోంది.
అడుగులు తడబడి అక్కడున్న స్టూల్‌ని తట్టుకొని టక్కున కింద పడింది.
కాలేజీకి వెళ్తున్న ద్రోణ గేటు దాటి బయటకి రాగానే శబ్దం విన్పించి అటువైపు చూశాడు.
కిందపడ్డ సంవేదను చూసి నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే తేరుకుని…
”అయ్యో! కిందపడిందే! ఇప్పుడెలా?” అన్నట్లు అతని మనసు ఉద్విగ్నంగా కొట్టుకొంది.
ఆమె దగ్గరకి ఎవరూ రాకపోవటంతో ఇంట్లో ఎవరూ లేరనిపించింది.
ఏం చేయాలో తోచనట్లు ఒక్కక్షణం అలాగే నిలబడిపోయాడు.
సంవేదకు, ద్రోణకు మధ్యన రోడ్డే అడ్డం.
ద్రోణకి ఇప్పుడు తను వెళ్ళవలసిన పని గుర్తు రావడంలేదు. సంవేద తప్ప అతని కళ్లకి ఇంకేం కన్పించటం లేదు.
దగ్గరకి వెళ్లి ఆమెను పూలచెండులా చేతుల్లోకి తీసుకొని, స్పృహ వచ్చేంత వరకు తన ఒడిలో పడుకోబెట్టుకొని అసలేం జరిగిందో తెలుసుకోవాలని వుంది.
ఇంట్లో ఎవరూ లేనట్లు అర్థమై అచేతనంగా పడివున్న సంవేద దగ్గరికి వెళ్లాలన్న ఆత్రుతతో ఒక అడుగు ముందుకు వేశాడు.
అంతలో ఆటో వచ్చి ఆగింది.
ఆటోలోంచి సంవేద అమ్మా, నాన్న దిగారు.
ద్రోణ వాళ్లను చూడగానే ముందుకి వేసిన అడుగును వెనక్కి తీసుకున్నాడు.
లోపల కెళ్లగానే కిందపడివున్న సంవేదను చూసి, కంగారు పడింది శకుంతల.
”ఇదేంటండీ! ఇది కిందపడింది?” అంటూ ఆదుర్దాగా ముందుకి వంగి సంవేద భుజాలు పట్టుకొని, లేపాలని చూసింది.
ప్రతిరోజు భర్త దగ్గర వచ్చే వాసన సంవేద దగ్గర గుప్పుమనటంతో శకుంతల గుండెలు అదిరాయి.
”ఇదేం ఖర్మ దేవుడా!” అంటూ భర్తవైపు చూసింది.
”ఈ మధ్యన పిల్లలకి డైటింగుల గోల ఎక్కువైంది ఇదికూడా డైటింగ్‌ చేస్తుందేమో! కళ్లు తిరిగి కిందపడింది. లేపి లోపల పడుకోబెట్టు… భూమి, ఆకాశం ఏకమైనట్టు ఏంటా ఎక్స్‌ప్రెషన్‌? ” అంటు సంవేదవైపు చూడకుండా…”ఆ కుంటిదెక్కడ చచ్చిందో చూడు” అంటూ నిశితను గుర్తుచేసి, అక్కడ తన అవసరమేం లేనట్లు తన గదిలోకి వెళ్లాడు ప్రభాకర్‌.
నిశిత గుర్తొచ్చింది శకుంతలకి…
సంవేదను అలాగే వదిలి, నిశితకూడా ఇదే పరిస్థితిలో వుందేమోనన్న భయంతో ఒక్క వుదుటున లేచి నిశిత కోసం వెళ్లింది.
తలుపేసుకొని, చదువుకుంటూ తన లోకంలో తనుంది నిశిత.
తను భయపడిందేం అక్కడ లేకపోవటంతో ‘హమ్మయ్యా’ అనుకొని తిరిగి సంవేదన దగ్గరికి వచ్చింది.
మెల్లగా లేపి, అతిప్రయత్నంతో లోపలకి తీసికెళ్లి పడుకోబెట్టింది.. తొమ్మిది నెలలు కడుపులో పెరిగి బయటకొచ్చిన బిడ్డను ఎత్తుకోవటం తేలికే కాని ఇరవై సంవత్సరాలు పెరిగిన బిడ్డను మోయటం మాటలు కాదు.
నిస్సహాయంగా సంవేదను చూస్తూ అక్కడే కూర్చుంది. మత్తుగా, మరో లోకంలో వున్నట్లున్న కూతురి వైపు చూడాలంటేనే భయంగా వుంది.
ఇలా ఎందుకు జరిగింది?
రోజూ తన భర్త తాగుతున్నందువల్లనే కదా అయినా…
వయసొచ్చిన పిల్లలు చూస్తుండగా విస్కీ తాగితే ఒక్కోసారి ఇలాటి పరిణామాలు వస్తాయని ‘తాగే తండ్రులు’ ఒక్కసారి కూడా ఆలోచించరా? అసలు అలాటి స్పృహ వుండదా వాళ్లలో వాళ్లను మార్చాలంటే ఎన్ని మాటలు కావాలి! ఎన్ని జీవిత సత్యాలు చెప్పాలి! ఎంత మనోయజ్ఞం జరగాలి! అంత ఓపిక, శక్తి లేని దానిలా శకుంతల ప్రాణం వుసూరుమంది.
కానీ భర్తను మార్చుకోవటం భార్యగా తన ధర్మం.
ఎలాటి ప్రయత్నాలు చేయకుండా దివ్యశక్తులు అద్భుతాలను చేయవన్నట్లు మన ప్రయత్నం లేకుండా ఏదీ జరగదు. ఇలా చాలామంది భార్యలు తాగుబోతు భర్తల్ని చిన్నపిల్లల్ని చేసి మార్చుకోవాలని బెత్తం చేత్తో పట్టుకున్న టీచర్లలా ఫీలవుతుతుంటారు.
శకుంతల మాత్రం ఆ భావంలోంచి బయటకొచ్చి, ఎంతో ఎదిగిన దానిలా కర్తవ్యం ఆలోచించింది.
…మెల్లగా లేచి భర్త దగ్గరికి వెళ్ళింది.
”ఆ సంబంధం ఖాయం చేద్దామండీ!” అంది శకుంతల.
‘వద్దనుకొని, వచ్చేశాం కదా! మళ్లీ ఇంతలోనే ఈ మార్పేంటి?” అన్నాడు చిరాగ్గా ప్రభాకర్‌. భర్త వాలకం చూస్తుంటే…
ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది.
తప్పతాగి పడివున్న కూతురే ఆమె కళ్లముందు మెదిలి మనసును పర పర కోస్తోంది.
”ఆ అబ్బాయి తండ్రి పెంపకంలో పెరిగినవాడు కాదని .. తండ్రివున్నా ఎక్కడున్నాడో తెలియదని… అత్తగారు వున్నా కూడా మామగారు లేరని… పెద్దవాళ్లు లేని ఇంటికి అమ్మాయిని ఇస్తే ఎలా వుంటుందోనని… నువ్వేగా వద్దన్నావ్‌!” అన్నాడు. ఈసారి ఆయన గొంతులో కాస్త సౌమ్యత ధ్వనించింది.
మాట్లాడలేదు శకుంతల.
పరిశీలనగా ఆమెనే చూస్తూ….
”నీ ముఖమేంటి శకుంతలా! కూర్చోబెట్టిన పీనుగలా వుంది. వెళ్లి కడుక్కొనిరా! చూడబుద్దికావటం లేదు.” అన్నాడు.
‘ఇది కడుక్కంటే వచ్చే కళ కాదులెండి!’ అని మనసులో అనుకుంటూ అలాగే కూర్చుంది.
”ఏమైంది శకుంతలా?” అన్నాడు అనునయంగా..
”నాకెందుకో ఇంటికొచ్చాక ఆ సంబంధాన్ని వదులుకోవాలనిపించటం లేదు. ఆ అబ్బాయికి మంచి క్వాలిఫికేషన్‌ వుంది భవిష్యత్తులో మంచి పొజిషన్‌లోకి వస్తాడు. కట్నం కూడా మన స్థోమతకి తగినట్లే అడుగుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? మనం అనుకున్నవి పెద్ద కారణాలు కావేమో ననిపిస్తోంది” అంది శకుంతల.
ఇంటికి వచ్చేంతవరకు ‘ఈ పెళ్లివద్దు’ అని వాదించిన శకుంతలేనా ఈ మాటలు అంటున్నది అన్నట్లు ఆశ్చర్యపోయాడు ప్రభాకర్‌. అయినా తల్లి కదా ఏది మాట్లాడినా బిడ్డ శ్రేయస్సునే బేస్‌ చేసుకుంటుందన్న నమ్మకంతో…
”సరే! ఆలోచిద్దాంలే శకుంతలా!” అన్నాడు.
”ఆలోచించటం కాదు. వెంటనే వాళ్లకి ఫోన్‌ చెయ్యండి! సంవేదను చూసుకోటానికి రమ్మని…”అంది.
”ఏంటి నీ తొందర? వెళ్లి సంవేదను పిలువు. దాన్ని కూడా ఓ మాట అడుగుదాం…” అన్నాడు.
ఆ మాటతో కంగారుపడింది. భయంతో చెమట్లు పోశాయి వెంటనే తేరుకొని…
” అది పడుకొని వుంది లెండి! ఇప్పుడెందుకు దాన్ని కదలించటం… నేను తర్వాత మాట్లాడతాను. ముందు వాళ్లకి ఫోన్‌ చెయ్యండి!” అంది.
”సరే చేస్తాను…” అన్నాడు ప్రభాకర్‌.
భార్య చెప్పిన పని చెయ్యటం ఆయనకి ఇదే మొదటిసారి. ఈ అనుభవం చాలా కొత్తగా, హాయిగా ఉంది.
ఫోన్‌ చేసి సంవేదను చూసుకొని వెళ్లమని మధ్యవర్తితో మాట్లాడాడు ప్రభాకర్‌. వాళ్లకి అమ్మాయి నచ్చితే త్వరగా పెళ్లి చెయ్యాలన్నదే ఆయన ఆలోచన.
*****

రోజులు క్షణాల్లా దొర్లుతున్నాయి.
ఒకరోజు శకుంతల సంవేదను కూర్చోబెట్టి మాట్లాడింది. మాట్లాడుతూనే కూతుర్ని పట్టుకొని ఏడ్చింది. తండ్రిని ఇమిటేట్ చెయ్యొద్దని, జీవితంలో ఇంకెప్పుడూ తాగడం లాంటి పని చెయ్యొద్దని చెప్పింది.
”నన్ను క్షమించమ్మా! ఇంకెప్పుడూ అలాటి పని చెయ్యను. ప్రామిస్‌!” అంటూ మాట ఇచ్చింది సంవేద.
సంవేద పెళ్లి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
*****

ట్రాఫిక్‌ రూల్స్‌కి వ్యతిరేకంగా స్కూటీ నడుపుతోంది శృతిక. ఆమె వెనుక ఫ్రెండ్‌ తమ్ముడు రోషన్‌ కూర్చుని ఉన్నాడు.
లోకల్‌లో అంత స్పీడ్‌గా ఆ స్కూటీ వెళ్తుంటే చూసేవాళ్లకి ఏమో కాని, రోషన్‌కి మాత్రం భయంతో ప్రాణాలెగిరిపోయేలా వున్నాయి.
”అక్కా!” అంటూ గట్టిగా పట్టుకొని ”కొంచెం స్పీడ్‌ తగ్గించు… ఇప్పుడు మనకంత అర్జంట్ పనులేం లేవుగా…” అన్నాడు రోషన్‌
”అంత స్పీడ్‌లో వెళ్తేనే బైక్‌మీద వెళ్తున్న ఫీలింగ్‌ వస్తుంది నాకు… నువ్వు భయపడి నన్ను భయపెట్టకు.” అంది శృతిక.
‘నీ ఫీలింగ్‌తో నన్ను చంపకక్కా! ఆటోలో వెళ్లినా వెళ్లేవాడ్ని… ఏదో మా ఇంటివైపు వెళ్తున్నావని డ్రాప్‌ చెయ్యమన్నాను.” అంటూ గట్టిగా కళ్లు మూసుకున్నాడు.
”ఒరే రోషిగా! నీకో చిట్టి చిట్కా చెప్పనా! స్పీడ్‌గా వెళ్తే చావర్రా ! త్వరగా వెళ్తారు.” అంది ఒకచేత్తో హ్యాండిల్‌ పట్టుకొని, ఇంకో చేత్తో తన తలమీద హ్యాట్ తీసి, అదే చేతిని వెనక్కి పోనిచ్చి రోషన్‌ తలమీద పెడ్తూ….
అసలే భయంగా వున్న రోషన్‌ ”ఎక్కడికి పైకా?” అన్నాడు.
”కాదురా ! ఇంటికి… అదిగో అక్కడ సిగ్నల్‌ పడింది. ఇప్పుడు నేనక్కడ ఆగకుండా ఎలా వెళ్తానో చూడు…” అంటూ ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర ఆగకుండా వెళ్లింది.
స్టాప్‌ లిమ్‌ట్ దగ్గర నిలబడివుండే ట్రాఫిక్‌ పోలీస్‌ శృతికను ఆపాడు. అతని స్టైల్‌లో మాట్లాడుతూ…
‘వెహికిల్‌ని పక్కన పెట్టి దిగు’ అన్నాడు.
ఆమె ఏమాత్రం తొణక్కుండా దిగింది.
రోషన్‌ కూడా దిగాడు. దిగి, ఓ పక్కగా నిలబడి, సడన్‌గా చెంపమీద కొడితే బిత్తరపోయినట్లు చూస్తున్నాడు. రోషన్‌ వైపు చూసి ‘వీడేంటి ఇలా అయ్యాడు’ అనుకొంది శృతిక.
స్కూటీకి సంబంధించిన రికార్డ్స్‌ చూపించమన్నాడు పోలీస్‌… ఒక్కక్షణం అర్థం కానట్లు చూసింది శృతిక.
”అర్థం కాలేదా? డ్రైవింగ్‌ లైసెన్స్‌, వెహికిల్‌ పర్మిట్, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్, ఇవన్నీ వున్నాయా? వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా పనిష్‌మెంట్ పెద్దగా వుంటుంది” అంటూ బెదిరించాడు.
అవన్నీ స్కూటీలోంచి తీసి చూపించింది.
అతను చూశాడు. అవన్నీ మళ్లీ ఆమెకే ఇచ్చాడు. అవి తీసుకొని…
‘ఇక నేనిక్కడెందుకుంటాను?’ అన్నట్లు స్కూటీవైపు నడవబోయింది.
”ఆగు…” అన్నాడు గద్దింపుగా..
ఆగింది శృతిక.
”ట్రాఫిక్‌ రూల్స్‌ని వ్యతిరేకించి స్పీడ్‌గా దూసుకొచ్చావు. దీనివల్ల యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం వుంది. నువ్వు ఫైన్‌ కట్టందే వెళ్లడానికిలేదు.” అన్నాడు కటువుగా
”ఎంత కట్టాలి?” అడిగింది వెంటనే.
చెప్పాడు పోలీస్‌.
”అంత డబ్బు నా దగ్గరలేదు.” అంది
”పార్కింగ్‌ ప్లేస్‌లో స్కూటీని పెట్టి, కీ నా చేతికి ఇచ్చి ఇంటికెళ్లు… ఫైన్‌ కట్టి స్కూటీని తీసికెళ్లు అన్నాడు.
ఒక్క నిముషం పెదవి కొరుకుతూ ఆలోచించి, సెల్‌పౌచ్‌లోంచి మొబైల్‌ తీసి ఏ నెంబర్‌కి చేయాలా అని చూస్తోంది. తండ్రికి చేస్తే కోప్పడతాడు. అక్క కృతికకు చేస్తే?
అమ్మో ! నిన్ననే ఓ గంట నిలబెట్టి ఓ క్లాస్‌ పీకింది.
‘సాఫ్ట్‌స్కిల్స్‌లో కోచింగ్‌ తీసుకోమని… సాఫ్ట్‌స్కిల్స్‌ను పెంచే పర్సనాలిటీ డెవలప్మెంట్, కాన్ఫిడెన్స్‌ బిల్డింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, మైండ్‌ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌ వంటి అంశాల్లో తర్ఫీదు పొందటం వల్ల ఎదుటివారిని మెప్పించే నైపుణ్యం, స్పష్టమైన వాక్చాతుర్యం అలవడుతుంది’ అని…
ఇలా తను హాస్టల్లో వుండకుండా బయట తిరుగుతున్నానని తెలిస్తే చంపేస్తుంది. ఇప్పుడెలా?
స్కూటీని తియ్యమన్నట్లు లాఠీతో స్కూటీపై గట్టిగా కొట్టాడు పోలీస్‌.
ఉలిక్కిపడింది శృతిక.
‘నాకు మాత్రమే గొప్పగా గుర్తింపురావాలి. నాకంటే ఎవరూ గొప్పవారు కాదు. ఏపనిలో కూడా నాకు నేనేసాటి… అవకాశం దొరికితే ఎలాంటివారినైనా అవహేళన చెయ్యగల సత్తా వుంది నాకు…’ అన్న అభిప్రాయంతో వుండే ఆమెకు ఇలా నాలుగు రోడ్లు కలిసేచోట పోలీస్‌ పక్కన స్కూటీతో నిస్సహయంగా నిలబడటం తలకొట్టేసినట్లు వుంది. ఇప్పటికే రోడ్డుమీద వెళ్లే తన ఫ్రెండ్స్‌ కాని, కాలేజీ వాళ్లుకాని చూసివుంటారేమోనని ఆత్మన్యూనతతో చచ్చిపోతోంది.
వెంటనే పోలీస్‌ చెప్పినచోట స్కూటీని పార్క్‌చేసి, కీ అతని చేతిలో పెట్టి, ఆటో ఎక్కింది. రోషన్‌ కూడా ఆమెతో పాటు ఆటో ఎక్కాడు.
‘త్వరగా ఇంటికి వెళ్లటమంటే ఇదేనా శృతికక్కా?’ అన్నట్టు ఆమె ముఖంలోకి చూశాడు. రోషన్‌ చూసింది ఒక్కసారే అయినా మళ్లీ, మళ్లీ చూస్తున్నట్లు అన్పించి… వాడి చూపుల్ని తట్టుకోలేకపోతోంది. వాడి దృష్టిని మళ్లించటం కోసం… చాలా ముద్దుగా వాడివైపు చూసి…
”రోషీ! అదిగో ఆ హోర్డింగ్‌ చూడు.. వివెల్‌ సోప్‌ అడ్వర్‌టయిజ్‌మెంట్ ”అందం మీ సొంతం ప్రపంచం మీ పాదాల చెంత.” బావుంది కదూ” అంటూ రోషన్‌ తొడమీద మెల్లగా గిల్లింది.
రోషన్‌ ఉలిక్కిపడి అటు చూసేలోపలే దాన్ని దాటి వెళ్లింది ఆటో…
తన ఫీలింగ్‌ని శృతిక అర్థం చేసుకుందో లేదోనని, మళ్లీ చూశాడు. అదేచూపు, అదేస్థాయిలో గుచ్చుకుంటోంది. ఇంటికి వెళ్లేంతవరకు వీడింతేనా?
‘ఒరేయ్‌! అలా చూడకురా! అసలే నా బాధలో నేనున్నా… అయినా ఆ చూపేంటిరా! అలా కూడా చూడగలవా నువ్వు?’ అని మనసులో అనుకొంది… మనసులో ఎన్ని అనుకుంటే ఏం లాభం? పైకేమైనా తెలుస్తాయా? చస్తాయా!
కొద్దిదూరం వెళ్లగానే ఓ ప్లెక్సీ బోర్డు కన్పించింది. ‘హమ్మయ్యా!’ అనుకుంటూ ”అదిగో అటు చూడు రోషన్‌! ‘ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చివేస్తుంది’ ఈ కాప్షన్‌ చాలా బావుంది కదూ!” అంది.
రోషన్‌ దానివైపు చూడకుండా..
”కొన్ని ఐడియాలు అంతే శృతికక్కా! మార్చి, మార్చి వేస్తుంటాయి.” అన్నాడు.
ఇదేదో తను ఇంతకముందు చేసిన పనికి దగ్గరగా అన్పించి, ఆ ఫీలింగ్‌ని పైకి కన్పించనీయకుండా.. ఎప్పుడైనా, ఎక్కడైనా మీవెంటే అన్న ‘హచ్‌’ హోర్డింగ్‌వైపు చూపించింది.
‘నేను నీవెంటగా రానక్కా! జీవితంలో పొరపాటున కూడా నీ స్కూటీ ఎక్కను. ఆ పోలీసోడి చూపులకి తడవకుండా జాగ్రత్త పడ్డాను.’ అన్నట్లుగా ఓ చూపు చూశాడు. ఆమె రోషన్‌వైపు చూసే లోపలే ఇంకో హోర్డింగ్‌ వచ్చింది.
రోషన్‌ ఉత్సాహంగా, ఉల్లాసంగా దానివైపు చూస్తూ…
”అదిగదిగో శృతికక్కా! అన్నికన్నా అది చాలా వెరైటీగా వుంది. ఎవరికి దురదపెడితే వాళ్లే గీరుకోవాలి అన్నట్లు గోడకేసి వీపును గోక్కుంటూ ఆ దురదపోవాలంటే ఈ క్రీమును వాడండి! అన్నట్లు ఓ వ్యక్తి ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తున్నాడు. చూడు” అన్నాడు.
రోషన్‌ చెప్పేది అర్థమవుతున్నా చాలా క్యాజువల్‌గా వుండానికి ప్రయత్నిస్తూ, ఇల్లు రాగానే ఆటోని ఆపి, దిగింది శృతిక.

ఇంకా వుంది.

1 thought on “రెండో జీవితం

Leave a Reply to padmaja Cancel reply

Your email address will not be published. Required fields are marked *