March 28, 2023

Gausips – ఎగిసే కెరటాలు-14

రచన: -శ్రీసత్య గౌతమి

కానీ పాపం సింథియాకు తెలియలేదు, ఆమె మాట్లాడే ప్రతి మాట సోఫియా, శామ్యూల్ లు రికార్డ్ చేస్తున్నారని.
సోఫియా అడిగింది “మరి అంతా అఫీషియల్ గానే జరుగుతున్నది కదా. లహరి ని ఆ డిఫెన్స్ ప్రోజెక్ట్స్ నుండి తొలగించవచ్చుగా? అనధికారికంగా నిన్ను అప్పాయింట్ చేసి ఆమె మీద, ఆమె వర్క్ మీద నీ నిఘా ఎందుకు?”
దానికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు సింథియా కు. వెంటనే …
“ఏమో … నా ఉద్యోగం నేను చేస్తున్నా”.
“అంటే … నీకొక ఉద్యోగం క్రియేట్ చేసి జీతమివ్వడానికన్న మాటే కదా?”
“వెల్ … బాస్ ఈజ్ బాస్. బాస్ చెబితే వినాలి. లహరి చెప్పినది వినలేదేమో … నేను బాస్ చెబితే వింటున్నాను”.
“ఏ మాట?”
“నాకు తెలియదు. ఇంతకు మునుపు ఆ ల్యాబ్ లో నేను పనిచెయ్యలేదు. నాకు విషయాలేమీ తెలియలేదు”
“ఓహో. పోనీ ఇప్పుడయినా నువ్వెప్పుడూ అడగలేదా కౌశిక్ ని?”
“లేదు”
“మరి వారిద్దరి మధ్య ఏమయ్యుంటుందని నువ్వు ఊహిస్తున్నావు?”
“అయినా అవన్నీ మీకెందుకు? మీక్కావలసినది రిపోర్ట్సే గా? ఇచ్చేస్తాను. తీసుకో” అంటూ ఫైల్స్ ముందుకు తోసింది సింథియా.
“మాకొద్ధు” అని ఏక కంఠంతో ఇద్దరూ చెప్పారు.
షాక్ తిన్నది సింథియా. “అదేంటి ఇప్పుడు ఈ మాట మారుస్తున్నారు?” అని సింథియా అడిగింది.
“అవును. ఈ డీల్ ఓ కే. కాదు మాకు. నీకు నువ్వే చెప్పావ్, లహరి రిజల్ట్స్ ని, రిపోర్ట్స్ ని మార్చేస్తున్నది అని. మరి ఇవి నిజమైన రిపోర్ట్సే అని మాకు గ్యారంటీ ఏమిటి?”
మళ్ళీ షాక్ తిన్నది సింథియా. “హన్నా… వీళ్ళకెందుకు ఇవన్నీ చెప్పానో అనవసరం గా. ఏదో తన చేత కౌశికి లహరి మీద వ్రాయించిన అబద్దపు కంప్లైంట్లకు ఒక ప్లాట్ ఫాం కల్పిద్దామని చెప్పాను గానీ, ఇలా జరుగుతుందనకోలేదు. అయినా వీళ్ళూ దొంగలే గా! దొంగలకు కూడా నిజాయితీ కావాలా?”….అంటూ ఆలోచనలో పడింది.
“సోఫియా చాలా వేగం గా ఆమె మనోభావాలను చదివి “వీళ్ళకు కూడా ఎంత తెలివా? వీళ్ళకీ నిజాయితీ అవసరమా?” అని ఆలోచిస్తున్నావు కదూ…..అని అన్నది.
అంతే … ఆ మాటకు త్రుళ్ళి పడింది సింథియా.
“అలా అని కాదు గానీ, ఒక రకంగా అలాంటిదే … ఎందుకు నన్ను నమ్మటం లేదు మీరు?”
“ఓ ..నీకలాగ అర్ధమయ్యిందా? మాకు కావలసినది నిజమయిన రిపోర్ట్స్ అంతే. నీ గురుంచి ఆలోచించాలని మేము నిర్ణయించుకోలేదు”
“ఇవి నిజమయినవే. నన్ను నమ్మండి. నిజానికి కౌశిక్ ఆడిన నాటకంలో నేనొక పావునయిపోయాను. అందునుండి తప్పుకోవడానికి అలా చెప్పాను అంతే” అన్నది సింథియా.
“ఓకే. అయినా మా అనుమానాలు మాకున్నాయి, ఈ రిపోర్ట్స్ ను లహరి చేత కన్ ఫర్మ్ చేయించు. అప్పుడు తీసుకుంటాము”
“అదెలా సాధ్యం? ఆమె హాస్పిటల్ లో ఉంది కదా?”
“అక్కడికి వెళ్ళు”
“నో వే. నేను వెళ్ళను”
“అయితే మాకొద్దు”.
“నేను వెళ్ళి, ఏమని ఆమెకు అడగను?”
“తానెలాగూ … ప్రెజెంట్ చెయ్యడానికి వెళ్ళాలిగా”
“అవును. కౌశిక్ వెళ్ళి చేస్తాడేమో?”
“ఎందుకు? ఆమె చేసినవి అన్నీ తప్పుకదా… అదే కదా నువ్వు ఫైండ్ అవుట్ చేసినది?”
“ఆ ..హ. హా.. అవును కానీ కౌశిక్ ఆమె మీద యాక్షన్ తీసుకోలేదు కదా?”
“ఏం, ఎందుకని?”
“తెలియదు”
“వెళ్ళి లహరికివ్వు. ఆమె అవన్నీ ఓకే అన్నాక మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చెయ్యు”
“కానీ … లహరి కి ఆరోగ్యం బాగోలేదు కదా? తన బ్రెయిన్ సరిగ్గా ఉండి ఉండదు … ఎలా చదువగలదో ఏమో?”
“ఆమె బ్రెయిన్ సంగతి నీకెలా తెలుసు?”
“హా..హ… ల్యాబ్ లో ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. అయినా ఏమోలే నేను ఆమెను చూడడానికి వెళ్ళలేదు”
“ఏం ఎందుకు వెళ్ళలేదు, అందరూ చూసొచ్చినప్పుడు?”
“ఆ… అంటే … నాకు హాస్పిటల్స్ అంటే భయం. వెళ్ళను సాధారణం గా. కానీ అందరినుండీ ఆమె కుశలత తెలుసుకుంటున్నాను”
“అయితే ఇప్పుడు తను ఎక్కడుంది?”
“ఇంకా హాస్పిటల్ లోనే అట. కౌశిక్ చెప్పాడు”
“ఓకే. అక్కడికే వెళ్ళి రిపోర్ట్స్ ని కన్ ఫర్మ్ చేసుకొని రా” అని చెప్పి లేచి వెళ్ళిపోయారు సోఫియా, శామ్యూల్.
సింథియా కు అస్సలు అర్ధం కాలేదు. అర్రె… ఏంటి ఇలా జరిగింది? కౌశిక్ ను నా గ్రిప్ లోకి తీసుకుందామంటే వీళ్ళను వాడుకొని? నా ఐడియా ఏంటిలా వక్రించింది?”
********************************************
లహరి ఎక్కడుందో తెలియదు, ల్యాబ్ లో ఎవరినైనా అడిగినా అనుమానిస్తారు, నేనెందుకు అడుగుతున్నానా అని, కౌశిక్ ని అడిగితే ఎందుకు అని ప్రశ్నిస్తాడు? నేనేనాడూ లహరి ని అసలు మనిషిగానే లెక్కెయ్యలేదు, కేవలం ప్రత్యర్ధిగా తప్పా … ఎలా ఆవిడ వివరాలు నా దగ్గిరకొస్తాయి? సరే … సోఫియాకే లహరి వివరాలు కనుక్కొని చెప్పమందాం” అని అనుకుంటూ ఫోన్ చేసింది. మళ్ళీ రెస్టారెంట్ లో కలవమంది. అలాగే కలిశారిద్దరు.

సోఫియా “యెస్ .. సింథియా. రిపోర్టులు కరెక్టేనా? లహరితో మాట్లాడావా?
“వెల్ … నేను వెళ్ళందే. ఆమె అడ్రస్ నాకు తెలియదు”
“ఈజ్ ఇట్? కానీ, నువ్వెలాగూ లహరి ని కలవాల్సిందే గా, ఆమె వస్తున్నది కదా నెక్స్ట్ వీక్ డిపార్ట్మెంట్ కి?”
“అవును … అంతకు మునుపే మీకిచ్చేద్దామని”
“ఫర్వాలేదు, తర్వాతే తీసుకుంటాం”
“హయ్యో … మీకర్ధం కావడంలేదు. ఆమె లేనప్పుడే నేను ఇవన్నీ మీకు ఇవ్వగలను, ఆమె ఉంటే నేను ఇవ్వలేను”
“ఏం… ఎందుకు?”
“ఆమె మీద ఫ్రాడ్ కేసు మోపి, నేనూ, కౌశిక్ తప్పించుకుంటాం. ఇది ఎవరికీ చెప్పకండి, మనందరం ఇలాగే బ్రతికేవాళ్ళము కాబట్టి నిజాయితీ గా నీకు చెప్పేస్తున్నాను”
“ఓ .. అలాగా. సరే. ఎవరికీ చెప్పము. అసలు మీ ఇద్దరి ప్రోబ్లం ఏమిటి లహరితో”
“నా ప్రోబ్లం అంతా ఒకటే లహరి ఉండడం నాకిష్టం లేదు. నేనూ, కౌశిక్ మాత్రమే ఉండాలి. నా అండర్ లో మిగితావాళ్ళు పనిచెయ్యాలి. కౌశిక్ కూడా నా సలహా సంప్రదింపులతోనే ఏ విషయాన్నైనా ఆలోచించాలి”
“ఎందుకలా?”
“నేను చిన్నప్పటి నుండి అంతే. నా అనుకునే వాళ్ళందరూ నా గురించి అలోచించాలి, నాగురించి బ్రతకాలి”
“మరి కౌశిక్ … నిన్ను తన అనుకున్నాడా?”
సింథియాకి ఎక్కడలేని రోషం పొడుచుకు వచ్చింది. “లేదు … పూర్తిగా కాదు, నా వాడు అవుతున్నాడని నేను అనుకునే లోపల … ఆ లహరి మాట వింటున్నాడు”.
“లహరితో ఏమయినా సంబంధముందా కౌశిక్ కి?”
“నో నో … ఛ.. లహరి అలాంటిది కాదు, తన పని తాను చేసుకుంటూ, ల్యాబ్ లో అందరికీ హెల్ప్ ఫుల్ గా ఉంటూ … మొత్తం ప్రాజెక్ట్స్ రన్నింగ్ అంతా ఆమే చూసుకుంటుంది”
“మరి నీకు ప్రాబ్లం ఏంటి?”
“అదే ప్రొబ్లం”
“ఆమె తెలివితేటలు, ఆమె డిగ్నిటీ, ఆమె సంస్కారం … ఆమెకున్న గౌరవం”
“హహహ…” పగలబడి నవ్వింది సోఫియా.
“ఏ డబ్బో లేక ఏ కామన్ బాయ్ ఫ్రెండో కాదన్న మాట నీ ప్రోబ్లం. మరి కౌశిక్ ఎలా ఆమెకు దగ్గిరవుతున్నాడని బాధపడుతున్నావు?”
“అలా అనుకున్నాను. కానీ నాకు మొన్ననే తెలిసింది. కౌశిక్ కి లహరి అంటే మహా అసూయా ద్వేషాలు”
“ఎందుకు … కొన్ని నా కారణాలే”
“ఊ … మీ ఇద్దరి ఆలోచనలు ఒకటవ్వడం వల్ల లహరి చావుకొచ్చినదన్న మాట… షి ఆల్ మోస్ట్ డెడ్ అండ్ కేం బ్యాక్”
అనగానే … ఒక్కసారిగా త్రుళ్ళి పడింది సింథియా.
“చావా? చావేంటి? చావేంటి? నాకేం తెలుసు? లహరి నెక్స్ట్ వీక్ వచ్చేస్తున్నది కదా? చచ్చిపోలేదు కదా? ఆ మాటెందుకొచ్చింది?”
ఆ తడబాటుకు ఆశ్చర్యపోతూ సోఫియా … రిలాక్స్. వై ఆర్ యు టెన్సెడ్? ఐ జస్ట్ సెడ్ క్యాజువల్లీ”
“స్టాప్ నాన్సెన్స్”
“వై ఆర్ యు మ్యాడ్ ఎట్ మి? ఐ యాం నాట్ యువర్ కౌశిక్ ఓకే. డోంట్ యెల్ ఎట్ మి” అని తిరిగి అరిచింది సోఫియా.
“ఓకే ఓకే … వియ్ ఆర్ ఆల్ సేం. మనలో మనం అవమానించుకోకూడదు. సరే … చెబుతాను, కానీ … రేపొద్దున్న నాకేమీ ఈ దేశం లో కాకుండా మీరే నన్ను సేవ్ చెయ్యాలి. నాకు గ్రీన్ కార్డ్ కావాలి”
“కౌశిక్ హెల్ప్ చెయ్యడా?”
“లేదు. నన్ను ఉద్యోగంలోనుండి వెళ్ళిపొమ్మన్నాడు మొన్న. అందుకే నాకు కసి. ఆ లహరితో పాటు కౌశిక్ ని కూడా ఇందులో ఇరికించాలి. లహరికి సంబంధించిన ఏ కేసులో అయినా కౌశిక్ ని ఇరికించాలి. నన్ను గౌరవించన్వాడు సుఖపడడానికి వీల్లేదు”… అంటుంటే సింథియా కళ్ళల్లో క్రూరత్వాన్ని చూసింది సోఫియా.
“అంటే నువ్వు ఆల్ మోస్ట్ రోడ్డున పడ్డావన్న మాట. ఉద్యోగం లేకపోతే నీకు వీసా స్టేటస్ లేదు, వీసా లేకపోతే … నువ్వు నీ భారతదేశానికి వెళ్ళిపోవాలి. మరి నీ భర్త?”
“అతడు ఎక్కడున్నాడో నాకు తెలియలేదు. కౌశిక్ ని చూసుకొని నేను అతన్ని వదిలేసాను. అతడు నాతో తెగతెంపులు చేసుకొని వెళ్ళిపోయాడు”
“తెగెతెంపులు … అంటే …”
“పేపర్స్ మీద సంతకాలు చేసేసాను. అతన్ని శాశ్వతంగా వదిలించుకుందామని”
“ఎంత పని చేసావు? మరి నీకిప్పుడు నిలువ నీడ లేకపోయింది కదా?”
అందుకే … నాకు లహరి మీద కసి, కౌశిక్ మీద కూడా కసి”
“దీంట్లో లహరేం చేసింది?”
————————– చాలా సేపు నిశ్శబ్దం.
“చెప్పు, లహరేమిచేసింది?”
“ఆమెనెంత విసిగించినా ఆమె అక్కడినుండివెళ్ళిపోలేదు. మా ఇద్దరికీ లహరి ఇష్టం లేదు. ఆమెను తొలగించే అధికారం కౌశిక్ కు లేదు, అందుకే నా ద్వారా ఆమె మీద ఫ్రాడ్ కేస్ ను బనాయించి, బయటకు తగిలేద్దామని కౌశిక్ చూసాడు, నన్ను తెలివిగా ఇరికించాడు… అన్ని విధాలా”.
“నేను మరోలా అంచనా వేసుకొని అతనికి సహకరించాను, కాని కౌశిక్ అడ్డం తిరిగాడు, అతన్ని నమ్మి నేను రోడ్డున పడ్డాను ఇప్పుడు” …. అంటూ సింథియా వల వల ఏడ్చింది.
“సరే ఏడవకు. జరిగినదేదో జరిగిపోయింది. నీకు నేను తప్పకుండా సహాయ పడగలను. కౌశిక్ ద్వారానే నీకు సహాయం జరిగేలా చూస్తాము”
“ఎలా” అని ఆశగా అడిగింది సింథియా.
“ఏం లేదు నీకు ఉద్యోగం కంటిన్యూ అయ్యేలా. నాకున్న కాంటక్ట్స్ తో మాట్లాడి, ఈ లోపుల చేసుకోవలసిన పనులన్నీ పూరి చెయ్యి” అని అన్నది భరోసాగా సోఫియా.
అంతే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు ఫీల్ అయ్యింది సింథియా. నవ్వుతూ, తప్పకుండా … అయితే నేనిప్పుడే వెళ్ళిలహరిని కలుస్తా. ఈ రిపోర్ట్స్ చూపించి వస్తా” అన్నది.
“అంటే ఆమె రిపోర్ట్స్ ను నువ్వు ఏనాడూ చూడలేదన్న మాట”
“యెస్. ఇంకా అబద్ధమెందుకు? నేనేనాడూ చూడలేదు. ఆమె పై తప్పుడు కంప్లైంట్స్ అన్నీ నా చేత వ్రాయించినది కౌశిక్. నిజానికి నాకేమీ తెలియదు. లహరి అన్ని విధాలా నిర్దోషి”
“ఓకే ” అని ఒక్కమాట మాత్రమే అనేసి సోఫియా లేచి నిలబడింది.
“మరి లహరిని ఎలా కలవడం? … అని అడుగుతూనే … ఉంది … ఈ లోపుల ….
బ్లూ డ్రెస్సుల్లో … అందమైన, పొడవైన, ధృఢమైన తెల్ల జాతి మహిళా పోలీసులు సంకెళ్ళతో ప్రత్యక్షమయ్యారు.
“యు ఆర్ అండర్ అరెస్ట్”
షాక్ తినేసింది … సింథియా. పెద్ద పెనుకేక గొంతులోంచి బయటకు రాక లోపల ఉండక ఒక రకమైన కీచు గొంతుతో …
“వ్వాట్… వాట్ డిడ్ ఐ డు?”
“యు ట్రైడ్ టు కిల్ యువర్ కొలీగ్”
“నో నో నో …. వాట్ ఎవిడెన్సెస్ యు హ్యావ్?”
“వియ్ హ్యావ్ ఎవిడెన్సెస్”
“షో మి షో మీ…. షో మీ…” అంటూ భయం తో బిగ్గరగా అరుస్తూ …. వాళెంత లాగుతున్నా ముందుకు అడుగు వెయ్యకుండా … మొరాయిస్తున్నది.
పోలీసులు ఆమె ను ఎత్తి వాళ్ళ కార్ లో కి తోసేశారు
సింథియా భయంతో గింజుకుంటూ ఏడుస్తూ బయటకు చూసింది, అప్పుడే కార్ స్టార్ట్ చేశారు పోలీసులు, వెనుక వాళ్ళ సిబ్బంది కార్లు కూడా కదిలాయి. అప్పుడు కన్నీళ్ళ మధ్య మసకగా పోలీసు కార్ల వెనుక కనబడింది “లహరి”. ప్రక్కన సోఫియా.
సింథియా అవాక్కయి పిచ్చి చూపు చూస్తూ మౌనం వహించింది, కార్లు ఆ దృశ్యానికి దూరమయ్యాయి.

(సశేషం)

1 thought on “Gausips – ఎగిసే కెరటాలు-14

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

September 2017
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930