May 25, 2024

బ్రహ్మలిఖితం 12

రచన: మన్నెం శారద

వేంకటేశ్వర స్వామి గుడి మెట్లెక్కుతుంటే ఈశ్వరి కాళ్ళు చిన్నగా వణికేయి.
ఒక అపరిచిత వ్యక్తిని కలుసుకోడానికి తనేంటింత ధైర్యంగా వస్తోంది.
తను కాకినాడ పక్కన కత్తిపూడిలో పుట్టి పెరిగింది. ముందు నుండీ ఘోషా కుటుంబం తమది. తండ్రి పట్టుదల వలన కాకినాడ మేనమామ ఇంట్లో వుంది, బి.ఏ వరకు చదివింది. పేరుకి కాలేజీకి వెళ్ళేదే గాని ఇంట్లో వంచిన తల కాలేజీలో ఎత్తేది. మళ్లీ అక్కడ వంచిన తల ఇంట్లో ఎత్తేది. ఆడవాళ్లు ఆ ఇంట్లో కేవలం తినడానికి మాత్రమే నోరు తెరవాలి. మగవాళ్ళేదైనా చెబితే కేవలం సరేనంటూ గంగిరెద్దులా తల తిప్పి చెప్పాలి. బి.ఏ ఫైనలియర్‌లో వుండగా తనకి మేనమామ కొడుకు కుటుంబరావుతో పెళ్ళయింది. కుటుంబరావు కోరమండల్ ఫెర్టిలైజర్స్‌లో పని చేస్తున్నాడు. అతని పట్టుదల వలనే తను ఉద్యోగం చేస్తోంది.
కుటుంబరావు అలవాట్ల పరంగా చూస్తే మంచివాడే.
చుట్ట, బీడీ, సిగరెట్‌లో దేన్నీ ముట్టడు. కల్లు, సారా, బ్రాందిల్లాంటివి చస్తే తాగడు. పరాయి ఆడవాళ్లు వివస్త్రలుగా ఎదురుగా నిలబడ్డా కన్నెత్తి చూడడు. ఎవరితోనూ విమర్శలు పెట్టుకోడు. కోతలు కోయడు. భార్య వండి కంచంలో ఏది పెడితే అది తిని ఆఫీసుకెళ్లిపోతాడు. సాయంత్రం ఇంటికి రాగానే ఆవిడ కాఫీ యిస్తే కాఫీ, టీ ఇస్తే టీ తాగుతాడు. ఆవిడ కాఫీ పేరుతో కుడితిచ్చినా అతడు తాగుతాడేమోనని ఆవిడకనుమానం. కాని ఆవిడకంత ధైర్యం లేదు ఆ పని చెయ్యడానికి.
అలానే ఇద్దరు పిల్లలు పుట్టేరు. స్కూలుకెళ్లి చదువుకుంటున్నారు.
మాట్లాడకపోతే మానే. కనీసం కొట్లాడటం కూడా రాని భర్తతో ఈశ్వరికి జీవితం ఉప్పులేని కూరలా తయారయింది.
ఏది చేసినా ఇది బాగుందనడు. బాగోలేదనడు.
ఎలా తయారైనా నువ్వీరోజు బాగున్నావనో, ఈ చీర నీకు నప్పిందని చస్తే చెప్పడు.
పెళ్లయి పదేళ్లయినా చిన్న మెలికా, మెరపూ లేని జీవితం ఆమెది.
సరిగ్గా మనసు విసిగి వేసారిన సమయంలో సుదీర్ఘ గ్రీష్మ తాపంలో డస్సిపోయింది అనుకున్న తన ప్రాణానికి తొలకరి జల్లులాంటిదయింది ఓంకారస్వామి మాట.
అందుకే ఆమె కట్టుబాట్లని త్రెంచుకొని వెంకట్‌ని కలుసుక్కునేందుకు అక్కడికొచ్చేసింది.
చివరి మెట్టు మీద పాదం మోపుతున్నప్పుడు ఆమె పాదం పట్టి తప్పినట్లుగా వణికింది.
తన తడబాడు నణచుకుంటూ తలెత్తి చుట్టూ చూసింది. సముద్రం వైపుగా వున్న పేరాపెట్ వాల్ నానుకొని ఆమె రాకకోసం ఎదురు చూస్తున్నాడు వెంకట్.
బ్లూయిష్ వైట్ లూయీ ఫిలిప్స్ షర్ట్‌ని, బ్లాకిష్ బ్లూ రేమండ్స్ పేంట్‌లో టక్ చేసి తల బాగా వెనక్కి దువ్వు రెండు చెతుల్నీ పేరాపెట్ వాల్ కాన్చి నిలబడ్డాడు. ఆ డ్రెస్సు కూడా అంతకు ముందు పుట్టినరోజుకి లిఖిత కొనిపెట్టిందే.
వెంకట్ ఈశ్వరి రావడం గమనించి చిరునవ్వు నవ్వేడు. ఆ నవ్వులోని కృతకత తెలీని ఈశ్వరి తనూ నవ్వాలని ప్రయత్నించి విఫలురాలయి సిగ్గుతో తల దించుకుంది.
ఏదో తప్పు చేస్తున్నానన్న భావన ఆమె మనసుని ఎండ్రకాయలా పట్టుకు పీకుతోంది.
“రండి” అన్నాడతను చొరవగా.
ఈశ్వరి బలిపశువులా అతని దగ్గరకు నడిచింది.
“ఇక్కడ కూర్చుందామా, లేక బీచ్‌లో కెళదామా?”
అతని ప్రశ్నకామె కంగారు పడుతూ “వద్దొద్దు. బాగా వెలుగుగా వుంది. ఎవరైనా చూస్తారు.” అంది గాభరాగా.
అతను నవ్వి “సరే, ఇక్కడే కూర్చుందాం” అంటూ అతను కటకటాలుగా కట్టిన పేరాపెట్ వాల్ కానుకుని కూర్చున్నాడు.
ఈశ్వరి కూడా అతని కభిముఖంగా కొద్దిగా దూరంగా మోకాళ్ల మీద తల పెట్టుక్కూర్చుంది.
పైకి గాంభీర్యం వహించినా మనసు మాత్రం సూపర్ ఎక్స్‌ప్రెస్ వచ్చేటప్పుడు దడదడలాడే ఫ్లాట్‌ఫారంలా వణుకుతూనే వుంది.
వెంకట్ క్రీగంట ఆమెని నిశితంగా గమనించేడు.
స్వచ్చమైన పారచూట్ కొబ్బరినూనె రాసి జడ గట్టిగా దువ్వు అల్లింది. అయితే జద చాలా పెద్దది. మంచి గోధుమ రంగులో మెరిసే శరీరం గుండ్రని ఆకృతి. కాటుక దిద్దిన కళ్లు, లిప్‌స్తిఖ్ లేకుండానే గులాబీ రంగులో మెరిసే పెదవులు, మైసూర్ క్రేప్ చీరలో తీర్చిదిద్దినట్లున్న ఆకృతి, ముఖ్యంగా మెడలో దిట్టంగా వున్న రెండు పేటల మంగళసూత్రాల గొలుసు. నల్ల పూసలు, చేతికి ఆరు జతల గాజులు, చెవులకి డైమండ్ దుద్దులు, ఈవిడకి ఓంకారస్వామి పాతికవేలు ఎందుకిమ్మన్నట్టు?
“ఏదో మాట్లాడాలన్నారు?”
వెంకట్ ప్రశ్నకి ఆమె కళ్లెత్తి అతనివైపు చూసింది.
ఓంకారస్వామి చెప్పిన మాటలు చెప్పడానికి నోరు పెగల్లేదు. తీరా విని తననొక పిచ్చిదానిలా జమకట్టి కింగ్ జార్జి హస్పిటల్‌కి తరలిస్తాడేమోనని భయపడిందామె.
“నేను మీకు ఎక్సెస్ పే చేసింది ఇరవై వేలే. ఇరవ్వయిదిచ్చేరు మీరు. సరిగ్గా లెక్క చూసుకోలేదా?” అంది మెల్లిగా.
అతనదోలా నవ్వేడు.
ఆమె తనేమన్నా అతప్పు మాట్లాడేమోనని కంగారు పడింది.
“నా కసలు మీ బాంక్‌లో అకౌంట్ లేదు.”
అతని జవాబు విని ఆమె అదిరిపడింది.
“ఏంటి మీరంటున్నది?” అంది గగుర్పాటుగా.
“ఎస్. మేడం. నేను చెబుతున్నది నూటికి నూరుపాళ్లూ నిజం”
“అయితే మీరెందుకా డబ్బిచ్చేరు?” కొంచెం కోపంగానూ, మరికొంచెం భయంగానూ అడిగింది ఈశ్వరి.
“ఎందుకంటే .. వద్దులెండి. నన్ను పిచ్చివాడిగా జమకడతారు!” అన్నాడు వెంకట్.
ఈసారి ఈశ్వరి అనుమానం బలపడింది.
తనకు చెప్పినట్లుగానే ఓంకార స్వామి ఇతనికి తన గురించి చెప్పేడేమో.
“నేనేం అనుకోను చెప్పండి” అంది ఈశ్వరి కొంత ధైర్యం తెచ్చుకొని.
వెంకట్ పేరాపెట్ వాల్ కటకటాల్లోంచి సముద్రం కేసి దీక్షగా చూశాడు.
అలల వంపులో పైకి లేస్తు, క్రిందకి మునిగిపోయినట్లుగా వంగుతూ వెళ్తూన్న జాలర్ల పదవల కేసి చూస్తూ “నాకో కల వచ్చింది” అన్నాదు.
ఈశ్వరి టెన్షన్‌గా ఊపిరి బిగబెట్టి అతనేం చెప్పబోతున్నాడాని వింటోంది.
“ఆ కలలో నాకొక స్వాముల వారు కన్పించి మీరు గత జన్మలో నా భార్యని, మీరు డబ్బు పోగొట్టుకుని ఆపదలో వున్నారని వెంటనే ఆ డబ్బివ్వమని చెప్పేడు. మీకెంత ఇవ్వమని చెప్పాడో గుర్తు లేదు. అందుకే పాతికవేలు తెచ్చిచ్చేను”. వెంకట్ మాటలు విని అసలే పెద్దవైన తన కళ్ళని మరింత పెద్దవి చేసింది ఈశ్వరి.
“నా పేరు బాంక్ పేరు కూడా చెప్పేడా స్వామి?” అనడిగింది అమాయకంగా.
“చెప్పలేదు. మీ ఆనవాళ్లు మాత్రం కొద్దిగా చెప్పినట్లు గుర్తు. అందుకే సిటీలో బాంక్ బాంక్ తిరిగేను. మీ బాంక్ కొచ్చినప్పుడు మిమ్మల్ని చూడగానే జన్మ జన్మలనుబంధం వున్నట్లుగా అనిపించింది నాకు” అన్నాదు వెంకట్ గాఢంగా నిశ్వసిస్తూ.
ఈశ్వరి మ్రాన్స్పడినట్లుగా చూసిందతనివైపు.
“మీరు వివాహితలా వున్నారు. నా మాటలు విని కోపం తెచ్చుకోకండి. నా కలలు తరచూ నిజమవుతుంటాయి. 1977 నవంబరులో ఉప్పెన వచ్చేముందు కూడా నాకో కలొచ్చింది. అంతా కొట్టుకుపోతున్నట్లుగా. అప్పుడు చిన్నవాణ్ణి. నా మాటలెవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీని షూట్ చేస్తున్నట్లు, భూకంపం వచ్చినట్లు.. దాదాపు అన్నీ జరిగేయి. అందుకే నేను గాఢంగా మీరు నా భార్యని నమ్ముతున్నాను. అలా అని నేనేం మీ జీవితానికడ్డం రాను” అంటూ భారంగా ఏదో పోగొట్టుకున్న వాడిలా నటిస్తూ లేచి నిలబడ్డాడు వెంకట్.
ఈశ్వరి కూడా లేచి నిలబడి “ఆగండి. నా మాట కూడా వినండి” అంది.
“చెప్పండి”
“ఇదే మాట నాకు భీమిలీ బీచ్ రోడ్డులో వున్న ఓంకారస్వామి నాకు చెప్పేరు. నేను డబ్బు పోయినప్పుడు ఆ విషయం తెలుసుకోడానికతన్ని ఆశ్రయించేను. ఆయన గత జన్మలో నా భర్త ఈ డబ్బు తెచ్చిస్తాడని చెప్పేడు. అందుకే సాయంత్రం మీతో మాట్లాడాలన్నాను. మనిద్దరం అక్కడికెళ్దాం రండి” అంది ఈశ్వరి.
“వద్దు. నాకు స్వాములు, బాబాలంటే నమ్మకం లేదు. వెళ్లిన వాళ్లని వాళ్లు ఉత్తినే వదలరు” అన్నాడు వెంకట్.
“నా మాట వినండి. అతను మామూలు స్వామి కానే కాదు. మీ కలలో కొచ్చిందతనేనని నా నమ్మకం. నా మాట కాదనకండి ప్లీజ్!” అంది ఈశ్వరి బ్రతిమాలుతున్న ధోరణిలో.
వెంకట్ ఆమె మాట తీసేయలేనట్లుగా బలవంతంగా “మీ ఇష్టం” అన్నాడూ.
ఈశ్వరి కళ్లలో సంతోషం మెరిసింది.
ఇద్దరూ గుడిమెట్లు దిగుతుంటే అయిదేళ్ల పసిపిల్లాడిలా సముద్రం తుళ్ళుతూ పరుగులు పెట్టి ఆడుతోంది.
మెట్ళు దిగుతూ అతన్ని గమనించింది ఈశ్వరి.
వెడల్పు మొహం, పెద్ద కళ్లు .. బాగానే ఉన్నాడనుకుంది.
కాని.. ఆ కళ్లలో నిర్మలత్వం ఏమాత్రం లేదని, అతని బ్రెయిన్‌లో జరిగే క్రిమినల్ థాట్స్‌కి ఆ కళ్లు గవాక్షాలని గ్రహించలెకపోయిందా అమాయకురాలు.
అతన్ని భర్తగా ఊహించుకొని అతనితో అడుగులెయ్యడానికామె మనసు ఉత్సాహపదింది కూడా.
ఇద్దరూ ఆటోలో భీమిలీ బీచ్ రోడ్డులోని ఓంకార స్వామి ఆశ్రమానికి చేరుకున్నారు.
వారిద్దరూ లోనికి ప్రవేశిస్తుండగా పీనుగులాంటి ఒక మనిషిని గట్టిగా లోనికీడ్చుకొస్తున్నారు కొందరు. అతనసలు స్పృహలో లేడు. వెంట ఇద్దరాడవాళ్లున్నారు.
“ఏం జరిగింది?” అనడిగింది ఈశ్వరి ఆత్రంగా.
“ఏం చెప్పాలి తల్లీ! వీడుత్త తాగుబోతయిపోయేడు. తాగి పడుకుంటే పర్లేదు. అర్ధరాత్రి అందరి కొంపల మీదకి వెళ్తాడు తగాదాలకి. వీడితో మా పరువు పోతోంది. ఓంకారస్వామి మహిమ విని వీణ్ని తాగుడు మానిప్స్తాడేమోనని తీసుకొచ్చేం” అంది ముసలావిడ బాధగా.
ఆవిణ్ణి చూస్తే జాలేసింది ఈశ్వరికి.
ఆ తాగుబోతుని ఓంకారస్వామి ముందు కూలేసేరు.
అతను కళ్ళు మూసుకుని తూలిపోతూ కూర్చున్నాడు.
“గోవిందూ! ఒరే గోవిందూ!” అంటూ అతన్ని పేరుతో పిలిచేడు ఓంకారస్వామి.
అతన్ని పేరు పెట్టి పిలవగానే అతని వాళ్లంతా అతని మహిమ గుర్తించి లెంపలేసుకున్నారు చెంపలు నొప్పి పుట్టేటట్లుగా.
గోవిందు మాత్రం తూలుతూనే “ఊ” అన్నాడు కళ్ళు ఏమాత్రం తెరవకుండానే.
“నోరు తెరు!” అన్నాడు ఓంకారస్వామి.
అతను నోరి తెరిచే స్థితిలో లేనే లేడు.
అతని వాళ్లందరూ కలిసి అతని నోరు బలవంతంగా తెరిచేరు.
ఓంకారస్వామి ఇంత విబూది అతని నోట్లో వేసి “ఈ రోజు నుండితను తాగడు. తాగితే వెంటనే కక్కేస్తాడు. తీసుకెళ్లండి.” అన్నాదు.
అందరూ మళ్లీ అతన్ని లాక్కెళ్ళిపోయేరు.
ఓంకారస్వామి శిష్యుడి అవతారమెత్తిన రాజు ఈశ్వరిని, వెంకట్‌ని లోనికి ప్రవేశపెట్టేడు.
ఈశ్వరి ఓంకారస్వామి పాదాలకి మొక్కి “మీరన్నట్లుగానే జరిగింది స్వామి! ఈయన డబ్బు తెచ్చిచ్చేరు. ఈయన క్కూడా నేను పూర్వ జన్మలో భార్యగా కలొచ్చిందట. “అంది భక్తిగా
ఓంకారస్వామి తలెత్తి వెంకట్‌ని చూస్తూ “ఎవడ్రా నీకు కలలో కొచ్చిన స్వామి?” అనడిగేడు కాస్త కోపంగా.
“మీలానే వున్నాడు స్వామి. నేనిదివరలో చూడలేదు” అన్నాడు.
“నీకు అనుకున్నదానికంటే ఎక్కువే ముట్టింది కదూ!” అన్నాడు ఈశ్వరి వైపు చూస్తూ.
“అవును స్వామి! ఆ అయిదువేలూ మీకిద్దామని తెచ్చేను” అంటూ అయిదువేల కట్ట బయటకు తీసింది ఈశ్వరి.
“మాకెండుకు సన్యాసులం?” అన్నాడు ఓంకారస్వామి దర్పంగా.
ఆ మాట విని రాజు ఖంగు తిన్నాడు. కాషాయ రంగు చీరకట్టి సన్యాసినిలా తయారైన సంపెంగి ఆ డబ్బువైపే ఆశగా చూస్తోంది.
“డబ్బుని చేత్తో తాకరు స్వామి. హుండీలో వెయ్యండి. అన్నదానానికుపయోగపడుతుంది” అన్నాడు రాజు.
ఈశ్వరలాగే చేసింది.
“ఇప్పటికయినా మీకు నమ్మకం కుదిరిందా మీరిద్దరూ భార్యాభర్తలని?”
ఓంకారస్వామి ప్రశ్నకి వాళ్లిద్దరూ బుద్ధిగా తలూపేరు.
“మీకపనమ్మకంగా వుంటే.. ఆళ్లగడ్డ దగ్గర అహోబిళం వెళ్లండి. అక్కడ వెయ్యేళ్ళు తపస్సు చేసిన అభుక్తేశ్వర స్వామి వుంటారు. వారు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు” అన్నాడు ఓంకారస్వామి.
వాళిద్దరూ తలూపి బయటకెళ్లేరు.
వళ్లు వెళ్లగానే ” ఆ తాగుబొతు నా కొడుకు తాగడం మానేస్తాడని చెప్పేవేంటి? వాడు మళ్లీ తాగితే అందరొచ్చి మనల్ని మక్కెలిరగకొడ్తారు” అన్నాడు రాజు గుసగుసగా.
“వాడు పుట్టిందగ్గర్నుంచీ తాగుతున్నాడట. ఇప్పటికెన్ని వేల పీపాలయి వుంటాయో. లివర్ ఎప్పుడో చెడి వాడికి వాంతులు పట్టుకున్నాయని కూడా నాకు తెలిసింది. అందుకే అలా చెప్పేను. భయమేం లేదు. వాడి ఆకారం చూశావుగా. బహుశ వాడికి లోపల గుండె, జీర్ణకోశం, కిడ్నీలు ఇలాంటివేవీ వుండి వుండవు!” అన్నాడు ఓంకారస్వామి నవ్వుతూ.
“వాడు తిరుగుబోతు కూడా!” అన్నాడు రాజు నవ్వుతూ.
“పోనీ వాడి గురించి మనకెందుకులే ఆలోచన. ఈ జంట బహుశ అహోబిళం వెళ్తారు. నీ తమ్ముణ్ణి వెంటనే అభుక్తేశ్వరస్వామి అవతారమెత్తమను. ఈ పిల్ల వలన మనకు చాలా లాభముంటుంది ముందు ముందు” అన్నాడు ఓంకారస్వామి అవతారమెత్తిన నారాయనణ.
రాజు సరేనంటూ తలూపేడు.

*****
కేయూరవల్లి పూజగదిలోంచి బయటకొచ్చింది.
ఇది వరకులా పూజ మీద ఏకాగ్రత కుదరడం లేదు. మనసులో దేవుని రూపానికి బదులు కూతురి రూపం కనబడుతోంది.
లిఖిత పడరాని కష్టాలు పదుతున్నట్లుగా కలలొస్తున్నాయి.
అక్కడికి మనసు చంపుకొని కేయూర లాబ్స్ కి ఫోన్ చేసింది.
ఫోన్ రింగవుతుందే గాని ఎవరూ ఎత్తడమే లేదు.
కేయూర కాఫీ కలుపుకొని మగ్ తీసుకొని బాల్కనీ రెయిల్స్ పట్టుకొని ఆలోచిస్తూ నిలబడింది.
సూర్యుణ్ణి కని, అతను ఆకాశంలో దోగాడుతుంటే.. చూసి మురిసిపోయే తల్లిలా సముద్రం ఉప్పొంగుతుంతుంది.
ఇరవై నాలుగ్గంటల్లో ఈ సముద్రం ఎన్ని రూపాంతరాలు చెందుతుందో గమనిస్తుంటే చాలా ఆశ్చర్యమనిపిస్తుంటుంది కేయూరకి.
*****
ప్రత్యూషంలో వేదాంతిలా, సూర్యోదయం తర్వాత చైతన్యం నింపుకొని కళకళల్లాడే మనిషిలా పది గంటల తర్వాత శ్రమజీవిలా మిట్టమధ్యహ్నం అన్యాయాన్ని చూసి సహించలేని తీవ్రవాదిలా, సాయంత్రం కల్లాకపటమెరుగని పసిపాపలా అర్ధరాత్రి అన్యాయానికి బలయి ఘోషించే స్త్రీమూర్తిలా, పలకకుండానే ఎన్నో భావాల్ని ప్రస్ఫుటం చేసే శక్తి సముద్రానికి మాత్రమే వుందనిపిస్తుందామెకు.
ఆమె ఆలోచనలనుకోకుండా వెంకట్ మీదకి మళ్ళేయి.
లిఖిత వెంకట్‌ని ప్రేమించిన సంగతి ఆమె ఆలోచించే కొలది ఆశ్చర్యాన్ని అపనమ్మకాన్నీ కూడా కల్గిస్తున్నది.
కాని.. ప్రేమ గుడ్డిది.
ఎవరి మనసుని ఎవరు స్పందింప చేయగలరో తెలుసుకోవడం చాలా కష్టం.
కాని ఎందుకో వెంకట్ లిఖితకి తగినవాడనిపించడం లేదు.
మనసుకి నచ్చచెప్పుకోవడం మహాకష్టంగా ఉందామెకు.
సరిగ్గా అపుడే గేటు ముందు వెంకట్ బైకాగింది.
కేయూర దృష్టి అటు మళ్ళింది.
“గుడ్ మార్నింగాంటీ!” అన్నాడు వెంకట్ క్రిందనుందే నవ్వుతూ.
కేయూర తల పంకించింది.
అతను హడావిడిగా మెట్లెక్కి వచ్చి “లిఖిత సంగతులేమైనా తెలిసేయాంటీ?” అనడిగేడు.
“లేదు” అంది కేయూర దిగులుగా.
“ఏంటి తనింత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోంది? మీ ఆందోళనర్ధం చేసుకోనక్కర్లేదా?” అన్నాడు కొంత కోపాన్ని ప్రదర్శిస్తూ.
కేయూర మాట్లాడలేదు.
అతని మాటలామె హృదయాన్ని బరువు చేస్తున్నాయన్న నిజాన్నతను గ్రహించేడతను.
అదే కావాలతనికి.
ఆమె మానసికంగా బలహీనురాలయి తన మీద ఆధారపడాలి.
అతను మళ్లీ ఏదో అనబోతుండగా ఫోను రింగయింది.
కేయూర గబుక్కున రిసీవరందుకుంది.
అవతల్నుండి లిఖిత కంఠస్వరం వినిపించగానే ఆమెకు ప్రాణం లేచొచ్చినట్లయింది.
“హలో లిఖిత! నేను. మీ అమ్మని. ఎక్కణ్ణుంచి?” అంది ఆత్రుతగా.
లిఖిత చెప్పిన విషయం విని ఆమె మొహం మ్లానమవడం వెంకట్ గమనిస్తున్నాడు.
“అయ్యో! అసలు నువ్వెందుకెళ్ళేవు. నీదంతా నీ తండ్రి దూకుడే. సరే. ఇప్పుడే పంపుతాను. ఎడ్రస్ చెప్పు!” కేయూర బాల్ పెన్ అందుకొని గబగబా ఆమె చెపిన ఎడ్రస్ ఫోన్ నెంబర్ నోట్‌బుక్‌లో రాసింది.
“వెంటనే టి. ఎం. ఓ పంపుతాను. నువ్వక్కడే వుండు. జాగ్రత్త. నువ్వే ఆపదలో చిక్కుకుంటావోనని భయంగా వుంది. వెంటవెంటనే ఫోనులు చెయ్యి. లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది” అంటూ రిసీవర్ క్రెడిల్ చేసి వెంకట్ వైపు చూసింది.
“ఎక్కడుందాంటీ!” ఆని ఆత్రం ప్రకటించేడు వెంకట్.
“కొచ్చిన్ వెల్లిందంట. ఎవరో మనీ పర్స్ కొట్టేసేరంట. చేతిలో పైసా లేదట. ఒక పది వేలు అర్జంటుగా పంపమంది. వెంటనే టి.ఎం.ఓ చేసొస్తావా?” అనదిగింది కేయూర గాభరాగా.
“అలాగే ఆంటీ! కాని పదివేలు సరిపోతాయంటారా? అసలు నేనెళ్తే ఎలా వుంటుంది?”
కేయూర ఆలోచించింది.
లిఖిత మొండిగా మున్నార్ అడవుల్లోకి బయల్దేరబోతున్నది. వేరే రాష్ట్రం. అందులోనూ మంత్రగాళ్ల దగ్గరకి. ఒక మగతోడుండటం సమంజసం!” అంతకంటే ఎక్కువాలోచించే స్థితిలో ఆమె లేదు.
వెంటనే విత్ డ్రాయల్ ఫారం మీద ఫిగర్ వెయ్యకుండా సంకతం చేసి అతని చేతికిస్తూ “బాంక్ బుక్ నీ దగ్గరే వుంది కదూ!” అంది.
వెంకట్ అప్పుడే ఆ సంగతి గుర్తొచ్చినట్లుగా నటించి”అవునాంటీ, మర్చిపోయొచ్చేను. ఇంటికెళ్లి బాంక్ కెళ్తాను” అన్నాడు.
“సరే! ముందెలాంటి చిక్కుల్లో వుందో! ఒక పదివేలు పంపించు. తర్వాత నువ్వో పదివేలు తీసుకుని బయల్దేరు. ఫ్లయిటయినా సరే. డబ్బుకాలోచించకు!” అంది కేయూర ఆందోళనగా.
“అలాగే ఆంటీ! నేను నీకు ఫోను చేస్తుంటానుగా! ఒక గ్లాసు మంచినీళ్లిస్తారా?”
కేయూర లోనికెళ్లింది. వెంకట్ అదే అదనుగా టెలిఫోను వైర్ డిస్‌కనెక్ట్ చేసి ఏమీ ఎరగనట్లుగా కూర్చున్నాడు.
కేయూర మంచినీళ్లు తెచ్చిచ్చింది.
అతనా నీళ్లు తాగి లిఖిత ఎడ్రస్ తీసుకుని బయకొచ్చి బైక్ ఎక్కేడు మనసులో హుషారుని దాచుకుంటూ.
కేయూర మాత్రం అతనివైపే చూస్తూ నిలబడింది ఆందోళనణచుకుంటూ.

ఇంకా వుంది.

1 thought on “బ్రహ్మలిఖితం 12

  1. సీరియల్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది..సముద్రం గురించి భలే వర్ణించారు(ప్రత్యూషంలో వేదాంతిలా, సూర్యోదయం తర్వాత చైతన్యం నింపుకొని కళకళల్లాడే మనిషిలా పది గంటల తర్వాత శ్రమజీవిలా మిట్టమధ్యహ్నం అన్యాయాన్ని చూసి సహించలేని తీవ్రవాదిలా, సాయంత్రం కల్లాకపటమెరుగని పసిపాపలా అర్ధరాత్రి అన్యాయానికి బలయి ఘోషించే స్త్రీమూర్తిలా, పలకకుండానే ఎన్నో భావాల్ని ప్రస్ఫుటం చేసే శక్తి సముద్రానికి మాత్రమే వుందని)..తరువాయి భాగం కోసం నిరీక్షిస్తూ ఉంటాము!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *