March 29, 2024

రెండో జీవితం 2

రచన: అంగులూరి అంజనీదేవి

గబగబ లోపలకెళ్లింది.
”మమ్మీ! మమ్మీ !” అంటూ పిలిచింది.
మిక్సీలో మసాలపొడి వేస్తూ, ఆ సౌండ్‌లో శృతిక పిలుపు విన్పించక వెంటనే పలకలేదు సుభద్ర.
”అబ్బా! మమ్మీ! ఓ నిముషం ఈ మిక్సీని ఆపు. ఎప్పుడు చూసినా దీని సౌండ్‌తో చచ్చిపోతున్నా…” అంది శృతిక.
శృతిక మూమెంట్స్ చూడగానే అర్థమై మిక్సీ ఆపింది సుభద్ర.
ఇవాళ హాలిడే కూడా కాదు. శృతిక హాస్టల్‌నుండి ఎందుకొచ్చినట్లు? ఎప్పుడు చూసినా ఇంటికొస్తుంది. హాస్టల్‌ ఫీజు దండగ అని మనసులో అనుకుంటూ…
”నిన్ననే కదే హాస్టల్‌ కెళ్లావ్‌! అప్పుడే వచ్చావెందుకు? ఇలా తిరుగుతుంటే చదువెలా వస్తుంది? ఇలా చదివితే ఇప్పుడున్న కాంపీషన్‌లో నువ్వు వెనకేవుంటావు. అదేదో పారిన్‌ లాంగ్వేజెస్‌ ట్రైనింగట. అందులో జాయినవరాదటే… జర్మన్‌, ఫ్రెంచ్‌, జపనీస్‌ లాంగ్వేజెస్‌లో సర్టిఫికెట్ వుంటే ట్రాన్స్‌లేటర్‌గా పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసుకోవచ్చట. అక్క చెప్పింది.” అంది సుభద్ర.
ప్రస్తుతం తనున్న పరిస్థితికి, తల్లి మాటలకి ఏ మాత్రం సెట్ అవదని ఓపిగ్గా తలవంచుకొంది శృతిక.
”ఏంటలా వున్నావ్‌? అక్కను చూసి నేర్చుకోవే. అక్క చూడు ఎంత కష్టపడి చదువుతుందో…” అంది
”అక్కడ నా స్కూటీని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ పట్టుకున్నాడు. అది వినకుండా ఇప్పుడు అక్కగురించి అంత కష్టపడి చెప్పటం అవసరమా మమ్మీ?” అంది శృతిక.
”హాస్టల్‌కి కాలేజి దూరమని స్కూటీ కొనిస్తే ఇలా పోలీసులకి ఎన్నిసార్లు అప్పజెబుతావే దాన్ని…? ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర ఎర్రలైట్ వెలగ్గానే ప్రతి ఒక్కరు ఆగిపోతారు. ఆ మాత్రం తెలియదా నీకు?” అంది సుభద్ర.
” ఆ మాత్రం నాకు తెలియదని నేను చెప్పానా? ఏదో త్వరగా ఇంటికొద్దామనుకున్నాను. అలా జరిగిపోయింది. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయా?” అంది శృతిక.
”సరే! అక్కడ ఫైన్‌ కట్టాలంటే డబ్బు కావాలిగా! నా దగ్గర లేవు. డాడీ ఇవ్వరు. ఇప్పుడెలా?” అంది.
”ఎప్పుడు చూసినా డాడీ, డాడీ అంటావెందుకు? ఆఫీసుల్లో ఆడవాళ్లు కష్టపడ్డట్లు నువ్వూ ఈ వంటగదిలో కష్టపడ్తున్నావ్‌! ఆ మాత్రం డబ్బుల్ని నీ దగ్గర వుంచుకోలేవా? అడిగితే ఇవ్వరా డాడీ?” అంది.
”అవసరాలకు ఇస్తారు కాని, ఇలా ఫైన్లు కట్టడానికి ఇవ్వరు. ఒకసారి మీ విమలత్త ఏమందో తెలుసా? ‘మా అన్నయ్య శృతికకు చిన్నప్పటి నుండి కట్టే ఫైన్లు చూస్తుంట్తే ఆ డబ్బుతో మీరే ఓ చిన్నపాటి కాలేజి కట్టుకోవచ్చు వదినా!’ అని అంది…” అంటూ శృతిక కళ్లలోకి చూసింది సుభద్ర.
”అవును కదా! అలా అంది కదా! అది నిజమా! ఏదైనా ప్రాకట్టికల్‌గా ఆలోచించటం రాదు విమలత్తకి… వాళ్ల కొడుకైతే మరీనూ! ఎప్పుడు చూసినా సైలెంటుగా అన్నీ తెలసినవాడిలా మా కాలేజీలో ఓ లెక్చరర్‌లా అన్పిస్తాడు. మా లెక్చరర్‌ కూడా అంతే పదిక్లాసులకి ఓ జోక్‌ కూడా వెయ్యడు.”
టాపిక్‌ వేరే రూట్లో వెళ్తున్నట్లు అన్పించి మౌనంగా వుంది సుభద్ర.
”మమ్మీ! నా స్కూటీ!” అంది శృతిక
”డబ్బులిప్పుడు కావాలంటే లేవు శృతీ!” అంది సుభద్ర
మండింది శృతికకు..
”అదే అన్నయ్య అడిగితే నువ్విలాగే అంటావా? అసలు వాడెన్ని ఫైన్లు కట్టడంలేదు. రోడ్డు మీద వాడి బండి ఎప్పుడు చూసినా సిక్ట్సీ పైనే స్పీడ్‌ వెళ్తుంది. త్రిబుల్స్‌ లేకుండా వాడెప్పుడైనా డ్రైవ్‌ చేశాడా? వాడికో రూలు … నాకో రూలు… కనేటప్పుడు మాత్రం ఇద్దరూ సమానమే అంటారు. ఆ తర్వాతనే తేడాలు చూపిస్తారు.” అంది కోపంగా శృతిక.
శృతిక మాట్లాడటం మొదలుపెడితే తట్టుకోవటం కష్టమని సుభద్రకి తెలుసు. అంతేకాదు ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటుంది. ‘పొరపాటు’ అని తెలిసినా ఇలా ఇంకెప్పుడు చేయకూడదు అని అనుకోదు. వ్యక్తిత్వం లేనిదానిలా ఎక్కడికక్కడే సరిపెట్టుకుంటుంది లేదంటే నిర్లిప్తంగా ఉంటుంది.
చిన్న రంధ్రంతో పడవ మునిగినట్లు బలమైన వ్యక్తిత్వం వున్నవాళ్లే ఒక్కోసారి పెయిలవుతుంటారు. అలాంటిది ఇలా ప్రతిదీ ఆషామాషీగా తీసుకొని నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా? ఇలా అయితే ఇకముందు ఎలా వుంటుందో.. మొన్ననే ఒక యాక్సిడెంట్ చేసి తృటిలో తప్పించుకొంది. అని వ్యధ చెందుతూ తలవంచుకొంది సుభద్ర.
”ఏమి మమ్మీ! ఆలోచిస్తున్నావు? దాన్నక్కడే వదిలేద్దామా?” అంది తల్లిని బెదిరిస్తున్నట్లు…
అప్పుడొచ్చాడు నరేంద్రనాధ్‌. రావడమే కోపంతో, టెన్షన్‌తో గస పెట్టుకుంటూ వచ్చాడు.
”ఆ స్కూటీని ఇంటికి తేవద్దు. అక్కడే వుండనీ.. లేకుంటే ఈ స్పీడేంటి? ఈ ఫైన్లేంటి? నా కొలీగ్‌ చెప్పాడు. మీ అమ్మాయి స్కూటీని ట్రాపిక్‌ పోలీస్‌ పట్టుకున్నాడని … వెంటనే వచ్చాను. ఈ వయసులో ఈ టెన్షన్‌ అవసరమా నాకు?” అన్నాడు భార్యని, కూతుర్ని చూస్తూ… ఒళ్లంతా చెమట పట్టింది ఆయనకు..
”అది నన్ను కనక ముందు తెలుసుకోవలసింది. ఇప్పుడు ఏ టెన్షన్లు లేకుండానే గడిచిపోతుందా? జీవితమంటే అంత ఈజీయా తేలిగ్గా నడిపించానికి… ఎంత ఆశో చూడు…” అని మనసులో గొణుక్కుంటూ పైకి విన్పిస్తే ఫైన్‌ కట్టడని మౌనంగా వుంది శృతిక.
భర్త ఆందోళన అర్థం చేసుకొంది సుభద్ర.
”మీరేం టెన్షన్‌ పడకండి! ప్రతిదానికి ఇలా అయితే బి.పి. పెరుగుతుంది. ఆ ఫైన్‌ డబ్బులిచ్చి పంపండి! అదేదో అదే చూసుకుంటుంది.” అంటూ అతి మామూలుగా మాట్లాడింది.
”ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావు సుభద్రా! దాని సంగతి తెలిసే నువ్విలా…” అన్నాడు
”ఏం చేద్దామండీ! ఏదో చిన్నపిల్ల అని వదిలేద్దాం…” అంటూ సమర్థించింది.
శృతిక అడిగినంత డబ్బు ఇచ్చి ఆఫీసుకెళ్లాడు నరేంద్రనాద్‌.
పిల్లలు ఎంత ఇబ్బంది పెడ్తున్నా తనలో తను టెన్షన్‌ పడతాడేకాని, గట్టిగా నాలుగు మాటలు మాట్లాడి భార్యను నొప్పించడు. పిల్లల్ని కష్టపెట్టడు. ఆఫీసులో తనకొచ్చే జీతంతోనే ఇల్లుగడిపి, పిల్లలు చేసే వెదవ పనులకి ఫైన్లు కట్టి బరువుగా నిట్టూర్చటం అలవాటు చేసుకున్నాడు.
స్కూటీవున్న స్థలానికి వెళ్లింది శృతిక…
*****

”శృతికను ద్రోణకి ఇచ్చి పెళ్లి చేద్దామండీ! ఒకసారి మీ చెల్లెలితో, బావగారితో మాట్లాడండి!” అంది సుభద్ర.
”దీని స్వభావం వాళ్లకి సరిపోదేమో! ఆలోచించు సుభద్రా! పెళ్లంటే ఓ జీవిత కాలానికి సంబంధించింది. నవ్వులాట కాదు.” అన్నాడు నరేంద్రనాద్‌.
”భవిష్యత్‌ బ్రహ్మలా మాట్లాడకండి శృతికకు ఏంతక్కువ?” అంది
”తల్లికి బిడ్డ ఎప్పుడూ ఎక్కువగానే కన్పిస్తుంది.” అన్నాడు
”అలా అనుకుంటే ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా వుండవు. పెళ్లిళ్లు కావటంలేదా? కాల ప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతుంటాయి. పెళ్లి చెయ్యటం మన ధర్మం…”
”ద్రోణకి కాకుండ ఇంకెవరికైనా ఇచ్చి చేద్దాం.” అన్నాడు.
”ఇంకెవరైనా దాన్ని అర్థం చేసుకోలేరు. ఇది పొరపాటున ఏదైనా తొందరపడి మాట్లాడినా మీ చెల్లెలు కడుపులో పెట్టుకుంటుంది. అన్నయ్య కూడా మంచివాడు. ద్రోణ సంగతి మనకి తెలిసిందే.. అక్కడైతే మనమ్మాయి సురక్షితంగా వుంటుంది” అంది.
”విమల ఏమంటుందో?”
”మీ మాట కాదనదు. ఆమెకు మీరంటే గౌరవం…”
”అయినా ఆలోచిద్దాంలే తొందరేముంది?”
”మీరు ఆలోచించే లోపల అది ఎక్కడో చోట యాక్సిడెంట్ చేసి కాళ్లూ, చేతులు విరగ్గొట్టుకుంటుంది. ఇది మాత్రం సత్యం.” అంది సుభద్ర.
వినలేనివాడిలా చూశాడు. భార్యచెప్పింది నిజమే అన్పిస్తోంది. విమల ఒప్పుకోకపోయినా గడ్డం పట్టుకొని బ్రతిమాలి అయినా తన కూతుర్ని ద్రోణకిచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాడు నరేంద్రనాధ్‌.
*****

సంవేదకి శ్యాంవర్ధన్‌తో పెళ్లి అయింది.
భర్త ఆఫీసునుండి ఇంటికి వచ్చేంతవరకు ఆ పని, ఈ పని చేసింది అత్తగారు చెప్పిన ఎక్స్‌ట్రా పనుల్ని కూడా ఓర్పుగా చేసింది సంవేద.
శ్యాంవర్ధన్‌ వచ్చి డ్రస్‌ మార్చుకుంటుంటే వంటగదిలోకి వెళ్లి, స్టౌ వెలిగించి, కుక్కర్‌ పెట్టింది. భర్త ఇంటికొచ్చి తనని చూడగానే ఎలా చిన్నపిల్లాడై, మురిపించి, మరిపిస్తాడో గుర్తొచ్చి పులకించి వంటగదిలోంచి బయటకొస్తూ…
భుజంమీద నుండి బరువుగా ముందుకి జారిన జడను కుడిచేత్తో వెనక్కి విసిరింది. ఆ విసురుకి తల్లోని సన్నజాజులు దెబ్బతగిలినట్లు ముఖం మాడ్చుకొని అతి సున్నితంగా కిందకి రాలాయి. కాళ్లకింద పడితే నలుగుతాయన్నట్లు వెంటనే వంగి నేలరాలిన పూలను ఏరి డైనింగ్‌ టేబుల్‌ అంచున పెట్టింది.
ఆమె కిందకి వంగగానే జారిన జడను ఎప్పటిలాగే వెనక్కి విసిరింది. ఆ విసురుకి ఆ జడ వెళ్లి శ్యాంవర్ధన్‌ ముఖానికి తాకింది.
”ఎన్నిసార్లు కొడతావే నీ జడతో నన్ను… ఆడుకుంటున్నావా నాతో…?” అంటూ అతని గొంతు గంభీరంగా, కోపంగా విన్పించటంతో కాస్త వణికింది సంవేద.
”నీకీ మధ్యన బాగా ఎక్కువవుతుంది. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు…” అన్నాడు. అతని మూడ్‌ బాగాలేదని తెలిసిపోతోందామెకు.
”అయ్యో! అలాంటిదేం లేదండి! ఏదో అలా విసిరినప్పుడు కొద్ది కొద్దిగా మిమ్మల్ని తాకుతున్నట్లుంది. అది యాదృశ్చికం” అంది.
”యాదృశ్చికమా! నీ బొందా! ముఖం మండుతోంది..” అన్నాడు.
… దగ్గరకి వెళ్లి ‘ఉఫ్‌, ఉఫ్‌’ అంది మంట తగ్గటం కోసం…
”చాల్లే నీ ట్రీట్మెంట్.. గిల్లి ఏడ్పించి, ముద్దు పెట్టుకున్నట్లు…” అన్నాడు అదోలా చూస్తూ శ్యాంవర్ధన్‌ ఆ చూపును గమనిస్తూ…
ముద్దు అన్న పదం వినగానే వెనక్కి, వెనక్కి అడుగులు వేసి, వంటగదిలోకి వెళ్లింది సంవేద.
సహచర్యం అనేది వీణలాంటిది. తీగలపై వేళ్లు ఆడే విధానాన్ని బట్టే శృతులైనా, గతులైనా.. ఎంత గట్టి తీగలైనా లాగి పీకితే మొత్తుకుంటూ మూలుగుతాయి. వాటినే గొప్ప రాగాలనుకుంటారు.
”వేదా ! సోడా పట్టుకురా! ఈరోజు మందు నీ చేత కలిపించుకోవాలి” అన్నాడు.
”మీరు ఏదైనా అడగండి తెస్తాను. అది మాత్రం తేను.” అంది ఖచ్చితంగా… ఇప్పుడు సంవేదకు మందంటేనే భయంగా ఉంది. ఆ రోజు తను తాగినప్పుడు తల్లి తనను పట్టుకొని ఏడ్వటం, ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యనని తల్లికి మాట ఇచ్చి ఓదార్చటం ఆమెకింకా గుర్తుంది.
”ఏం! ఎందుకు ? నేను కలపమన్నానే కాని, తాగమనలేదుగా”
”అలా అని నేను అనట్లేదు మా నాన్నకు కూడా మా అమ్మే కలిపిచ్చేది. నేను ఇచ్చేదాన్ని కాదు.” అంది.
” మీ నాన్నకి నువ్వెలా ఇస్తావే పిచ్చిమొద్దు.. భార్య ఇస్తుంది కానీ…” అన్నాడు
”నేను మా అమ్మలాంటి భార్యను కాను. నన్ను అర్థం చేసుకోండి!” అంది వంటగదిలోంచి బయటకు రాకుండానే…
”భార్యల్లో కూడా రకాలుంటారా? అమ్మలాంటి భార్య, అక్కలాంటి భార్య, అమ్మమ్మ లాంటి భార్య అని…” అన్నాడు.
”అదంతా నాకు తెలియదు. ఈ విషయంలోనైతే నన్ను బలవంతపెట్టకండి! నేనసలే మంచిదాన్ని కాదు.” అంది తనెలా తాగిందో గుర్తొచ్చి.
”మంచి దానివి కాకుంటే ఏంచేస్తావ్‌? నన్నేమైనా మర్డర్‌ చేస్తావా?” అన్నాడు.
”ఛ…ఛ అవేం మాటలండీ! ఒక్కసారే అంత పెద్దమాట అనేశారు. నేను బాధపడ్తానని తెలిసే మాట్లాడుతున్నారు కదూ” అంటూ బాధగా తలవంచుకొని, ముఖాన్ని దోసిట్లో పెట్టుకొంది.
తలలో వున్న సన్నజాజులు ఎందుకేడుస్తున్నావ్‌ అన్నట్లు ముందుకి కదిలి ఆమె చెంపల్ని నిమిరాయి. సన్నజాజులు తప్ప నిన్ను ఓదార్చే వారెవరూ లేరన్నట్లు ఆ వాతావరణం మౌనంగా మారింది.
సంవేద ఏడుస్తున్నట్లు అన్పించినా, అదేం పెద్ద విషయం కాదన్నట్లు ఆమెవైపు చూడకుండా… కొద్దిసేపు అలాగే కూర్చుని, ఆ తర్వాత మెల్లగా లేచి ఆమెకు దగ్గరగా వెళ్లి చెవి దగ్గర ముఖం పెట్టి…
”నేను నీ చేత విస్కీలో సోడా కలపమన్నానని నీ ఫ్రెండ్‌ అదే కవితలు రాస్తుంది చూడు ఆముక్త.. ఆవిడతో చెబుతావా? చెబితే ఆవిడ నన్నేం చేస్తుంది? అసలేంటే నీ బెదిరింపులు? మంచిదాన్ని కాదని తెగరెచ్చిపోతున్నావ్‌?” అన్నాడు శ్యాంవర్ధన్‌. అలా అంటున్నపుడు ఆమె జడ అతని చేతిలో వుంది.
”ఆముక్త నా ఫ్రెండ్‌! అంతే! ఇలాంటివి ఆమెతో చెప్పను” అంది. అయినా అతనామె జడ వదలలేదు నొప్పిగా వుంది.
”అత్తయ్యా ! మీ అబ్బాయి చూడు…” అంటూ పిలవాలనుకుంది. మళ్లీ ఏమనుకుందో, ఆ పిలుపును గొంతులోనే నొక్కేసుకుంది.
కళ్లలో నీళ్లు చిప్పిళ్లటంతో అమ్మ గుర్తొచ్చింది. పెళ్లిచేసి అత్తగారింకి పంపుతూ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
”స్త్రీ జీవితానికి రెండు ముఖాలు వుంటాయి వేదా! ఏ ముఖంలో మారే రంగుల్ని ఆ ముఖంలోనే నిక్షిప్తం చేసుకోవాలి. రెండు ముఖాలకి పొంతన వుండకూడదు. ఉండాలని చూడకు. వుంటే బావుంటుందని ఆశించకు. ఆశలకి, ఊహలకి అతీతమైన జీవితంలోకి నువ్విప్పుడెళ్తున్నావ్‌! ఇమిడిపోతున్నాననుకో కూరుకుపోతున్నాననుకోకు.
జీవితం సుదీర్ఘమైనది. క్షణ క్షణం మరణిస్తున్నా పైకి ఏమాత్రం కన్పించకుండా అవసరాన్ని బట్టి నిస్తుండాలి. ఒక్కోసారి నటన కూడా బావుంటుంది. ఎందుకంటే నేను ప్రతిరోజు చేస్తున్న పని అదే కాబట్టి…ఇప్పుడు నాకేం తక్కువ చెప్పు! ఇద్దరు కూతుళ్లున్నారు. భర్త వున్నాడు. కానీ నిజాలను చూసి ఉలిక్కిపడకుండా ఉద్రేకాలను అణచుకుంటేనే ఇవన్నీ దక్కుతాయి. ఇవిగో ఇవి కన్నీళ్లు కావు. ఆనంద భాష్పాలు..” అంటూ కళ్లు వత్తుకొంది.
కన్నీళ్లని ఆనందభాష్పాలుగా వ్యక్తం చేసిన అమ్మలోని సహనం కళ్లముందు మెదిలి సంవేదలోని కన్నీళ్లు ఆగిపోయాయి. ఆవేశం, ఉద్రేకం, సూిగా ప్రశ్నించటం, ఎదురుతిరగటం లాంటివి భర్తదగ్గర చెయ్యకూడదని అమ్మ చెప్తుంటే ఏమో అనుకుందికాని, ఇప్పుడు తనుకూడా అమ్మలాగే సర్దుకుపోవటం విచిత్రంగా అన్పించింది.
పెళ్లి అనేది ఆమెలో ఎంత మార్పు తెచ్చిందో ఆమెకు అర్థమవుతోంది. ఆ మార్పులో ఆనందాన్ని వెతుక్కోవాలని కూడా చూస్తోంది.
”ఫ్లీజ్‌ ! వదలండి! నొప్పిగా వుంది.” అంది ఊపిరి బిగబట్టి, అలా అడుగు తున్నప్పుడు ఆమె మెడ పక్కన నరాలు ఉబ్బి, ఎమోషన్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకుంటుందో తెలిసిపోతోంది.
”వదలకపోతే మీ అమ్మతో చెబుతావా?” అన్నాడు నిర్లక్ష్యంగా
”నాకు మా అమ్మను చూడాలని వుంది.” అంది బాధను దిగమింగుతూ…
”నీకిప్పుడేమంత కష్టమైన పని చెప్పానని.. ఇంత మాత్రానికే మీ అమ్మ గుర్తురావాలా? ఛ…ఛ నీకన్నా చిన్నపిల్లలు నయం. ఏ పని చెబితే ఆ పని చేస్తారు.” అంటూ ఆమెను వదిలి వెళ్లి కూర్చున్నాడు.
స్టౌ ఆపి, కుక్కర్‌ దింపి, వెళ్లి పడుకొంది.
ఆమె ఆలోచనలు ఇంకోవిధంగా సాగుతున్నాయి.
భర్త చేత ఈ తాగుడు మాన్పించాలి.
లేకుంటే రోజూ ఈ గొడవతో నలిగిపోతూ ఓర్పును అరువు తెచ్చు కోవాలంటే.. అసహజంగా అన్పిస్తోంది. అందుకే…
ఆమెలో ఓ ఆలోచన వచ్చింది. అది భర్తతో చెప్పాలని అతను వచ్చేంతవరకు ఎదురుచూస్తూ మెలకువతోనే వుంది.
వచ్చి పడుకున్నాడు శ్యాంవర్ధన్‌.
ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నలుపుతూ…
”నీ దగ్గరో మంచి గుణం వుంది వేదా! నీకెంత కోపం వచ్చినా, నా మీద అలిగి మూడంకె వెయ్యవు.” అన్నాడు ముద్ద, ముద్దగా మాట్లాడుతూ.. అతను కొంచెం తాగినా, తాగాడన్న విషయం వెంటనే తెలిసిపోతోంది.
ఒక్కక్షణం బాధగా కళ్లు మూసుకొంది. ఇన్నిరోజులు తాగి మాట్లాడే తండ్రిని దూరంనుండి భరించేది. ఇప్పుడు భర్తను దగ్గరగా వుండి భరించాల్సి వస్తోంది.
”ఏమండీ! ఇక్కడేదో హాస్పిటల్‌ వుందట… అక్కడ తాగే మగవాళ్లకి కౌన్సిలింగ్‌ ఇస్తారట. నాకెందుకో మీకు కౌన్సిలింగ్‌ అవసరమనిపిస్తోంది. రేపు వెళ్దామా?’ అంది చాలా ప్రేమగా.. దేన్నైనా అమాంతం అంగీకరించే అమాయకుడ్ని కాను నేను అన్నట్లు ఆమె నోటిమీద చేయిపెట్టి…
”రేపు నువ్వు మీ పుట్టింటికి వెళ్లి, మీ అమ్మను చూసుకొని రా! లేకుంటే ఇలాంటి పిచ్చి, పిచ్చి ఆలోచనలే వస్తుంటాయి. ఇక పడుకో.. మరచిపోకు రేపు మీ పుట్టింటికి వెళ్లటం …” అన్నాడు.
మనసునెవరో నలిపినట్లైంది సంవేదకి..
నిద్రపోతున్నట్లు నిస్తూ కళ్లు మూసుకొంది.
నటనే జీవితమా? అనుకుంది.
*****

తెల్లవారింది.
సంవేద ఇంట్లో, రోజులాగ వుండలేకపోతోంది. ఆమె ఏ పనిచేస్తున్నా ‘రేపు వెళ్లి మీ అమ్మను చూసుకొని రా!’ అన్న భర్త మాటలే విన్పిస్తున్నాయి.
పనంతా అయ్యాక ఆఫీసుకి ఫోన్‌చేసి ‘నేను మా ఇంటికి వెళ్తున్నాను’ అని భర్తతో చెప్పింది.
శ్యాంవర్ధన్‌ కంగారుపడ్డాడు. రాత్రి టైంలో ఏదో మూడ్‌లో వుండి అలా అంటే ఈ పిచ్చిది నిజంగానే వెళ్తుందా’ అని మనసులో అనుకుంటూ అతనేదో చెప్పబోయే లోపలే ఫోన్‌ పెట్టేసింది సంవేద.
”సరే! వెళ్లిరానీ! పుట్టింటి మీద బెంగకూడా కాస్త తగ్గుతుంది. వచ్చాక, చెప్పిన మాట వింటుంది’. అని మనసులో అనుకున్నాడు.
సంవేద పుట్టింటికి వెళ్లింది.
…వెళ్లగానే చెల్లిని కావలించుకొని, ముద్దుపెట్టుకొంది. తల్లి రెండు చేతుల్ని పట్టుకొని గిర, గిరా తిప్పింది. తండ్రి దగ్గరకి వెళ్లి.. ‘నాన్నా ! నేనొచ్చాను.’ అంది ఆయన ఆ మాటవిని, సంవేదవైపు చూడకుండానే..
‘ఊ…’ అన్నాడు.
దాంతో సంవేద మనసు చివుక్కుమన్నా ఆ సంతోషంలో అదేం పట్టించుకోలేదు.
చెల్లితో కలిసి అన్నం తింటుంటే ఆనందంగా ఉంది.
తల్లేమో – అల్లుడి గారి గురించి అడుగుతూ ”ఇంకాస్త తిను వేదా!’ అంటూ వడ్డిస్తూంటే మాటలురాని దానిలా తింటూ కూర్చుంది సంవేద. భోజనాలు అయ్యాక-
”అమ్మా! చెల్లి స్టిక్‌తో బ్యాలెన్సయి ఇప్పుడు బాగా నడుస్తోంది. నాకు చాలా సంతోషంగా వుంది” అంది ఒకప్పుడు స్టిక్‌ పట్టుకున్నా సరిగ్గా నడవలేక పోయిన నిశితను గుర్తుచేసుకుంటూ…
”కేరళ డాక్టర్‌ మన ఊరికి రావడమే నిశిత అదృష్టం. ఆయన ఇచ్చిన ఇంజక్షన్లు బాగా పనిచేశాయి. నిశిత కూడా ఇప్పుడు అక్క నన్ను చూస్తే ఆనందిస్తుందని రోజూ నిన్ను గుర్తుచేసుకుంటూ ఒక్కోసారి రాత్రివేళల్లో అక్కా! అక్కా! అంటూ కలవరిస్తోంది వేదా!” అంది శకుంతల
కదిలిపోయింది సంవేద.
చెల్లెలు తనకి ఎన్నిసార్లు గుర్తొచ్చిందో గుర్తుచేసుకొంది.
”అక్కా! బావ నిన్ను బయటకి తీసికెళ్లి తినిపిస్తుంటారా?” అంది సడన్‌గా నిశిత. అలా తీసికెళ్లి తినిపిస్తేనే మంచి బావ. అని నిశిత అభిప్రాయం.
నవ్వింది సంవేద. ఎన్నో రకాల నవ్వుల్లోంచి ఓ నవ్వుని సెలెక్ట్‌ చేసుకొని నవ్వినట్లుందా నవ్వు..
అక్కవైపు ఆసక్తిగా చూస్తోంది నిశిత.
కూతురి చేతుల్ని ప్రేమగా నిమురుతూ, గాజుల్ని సరిచేస్తూ, ఏమి చెబుతుందా అని ఎదురుచూస్తోంది శకుంతల.
”బావ చాలా మంచివాడు నిశీ! ఒక్కమాటలో చెప్పాలంటే బంగారంతో కప్పబడిన ముత్యపు చిప్ప.” అంది సంవేద.
”అదేం పోలికే వేదక్కా?” అంది నిశిత ఆశ్చర్యపోతూ
”కాస్త ఎఫెకట్టివ్‌గా వుంటుందని చెప్పాను.” అంది సంవేద
హాయిగా నవ్వారు వాళ్లు..
ఇక్కడ తండ్రి తాగినట్లే అక్కడ తన భర్త కూడా తాగుతాడని, తాగినప్పుడు అతన్ని భరించటం కష్టంగా వుందని చెబితేవాళ్లు తట్టుకోగలరా? అందుకే అబద్దపు రంగునీళ్లని నిజంపై చల్లి శ్యాంవర్ధన్‌ గురించి అందంగా చెప్పింది.
అది వింటున్నప్పుడు వాళ్ల ముఖంలో కన్పిస్తున్న వెలుగును కొలవటానికి ఎన్ని క్యాలిక్యులేటర్లయినా సరిపోవనిపించింది. సంవేదకు…
సంవేద జీవితం సర్వాంగాలను అలంకరించుకొని వున్న పచ్చి పసుపు ముద్దలా అన్పించి కూతురు వెళ్లేటప్పుడు కనుదిష్టి యంత్రాన్ని పంపాలనుకొంది.
”శకుంతలా!” అంటూ భార్యను కేకేశాడు ప్రభాకర్‌.
”ఆ… వస్తున్నా!” అంటూ భర్త దగ్గరకి వెళ్లింది శకుంతల.
అప్పటికే ఆయన ఓ రౌండ్‌ తాగి వున్నాడు.
”నీ పెద్దకూతురు ఎన్ని రోజులు వుంటుందట..?” అంటూ భార్య ముఖంలోకి చూడకుండా చిప్స్‌ తింటూ అడిగాడు.
”వచ్చింది ఈరో జే కదండీ!” అంది శకుంతల.
”పెళ్లి చేసి పంపాక ఇంకా ఏం పని దానికి మనింట్లో..?” అన్నాడు.
”ఏదో పని వుండి రాలేదండీ! చూసిపోదామని వచ్చింది” అంది.
”చూసిపోవటానికి ఇదేమైనా ఎగ్జిబిషనా?” అన్నాడు.
ఆ మాటకి ఆశ్చర్య చకితురాలైంది శకుంతల.
”పుట్టింటిని ఎగ్జిబిషన్‌తో పోల్చకండి! వినటానికి బావుండదు. కన్నవాళ్లను చూడాలని ఏ ఆడపిల్లకైనా వుంటుంది. దానికి మీరిలా అర్థాలు మార్చి మాట్లాడితే ఉరేసుకోవాలనిపిస్తుంది.” అంది.
”అర్థాలతో, పరమార్థాలతో నాకేం పని? కష్టపడి పెళ్లి చేసి పంపాక ఇక్కడేం పని అంటున్నా.. ఆ కుంటిదాంతో ఎలాగూ బాధలు తప్పవు. ఈ పెద్దది కూడా ‘చూసిపోతాను’ అంటూ వచ్చి కూర్చుంటే సంపాయించి పెట్టేది నువ్వా? నేనా?” అన్నాడు కఠినంగా.
ఆ మాటలు స్పష్టంగా విన్పిస్తున్నాయి సంవేదకి. ఆమెలోని నరనరం వేదనతో మూలిగింది.
భర్త మాటలకి బాధపడింది శకుంతల.. ఆయనెప్పుడూ అలాగే మాట్లాడతారు. అదేం అంటే ‘ఉన్న విషయం మాట్లాడుతున్నా తప్పేంటి?’ అంటాడు. ఏది తప్పో, ఏది ఒప్పో తెలియదు కాని, మనుషులకి మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ఇంకా ఏమంటాడో, సంవేద వింటుందని వెళ్లి తలుపు మూసి వచ్చింది.
”అక్కా! నాన్న మాటలకి బాధపడ్తున్నావా?” అంది నిశిత జాలిగా.
”ఇది బాధ అని ఎవరితో చెప్పుకోవాలి నిశీ? అనేది మన నాన్నే కదా! అయినా నాన్న పైకి అలా అంటారే కాని లోపల మనమంటే ప్రేమ వుంటుంది. నాన్నే లేకుంటే మనమింత వాళ్లం అయ్యేవాళ్లమా?” అంది సంవేద.
అక్క పైకి అలా మాట్లాడుతున్నా లోపల చాలా ఫీలవుతోందని నిశితకి తెలుసు.
”నాన్న ఇలాంటి వ్యక్తి అని మీ అత్తగారికి తెలిస్తే ఎలా అక్కా? అసలే. ఆ రోజు నీ పెళ్లిలో కట్నం దగ్గర పెద్ద గొడవ చేసింది. ఆవిడకి డబ్బు పిచ్చి అని చాలా మంది అన్నారు. నీకావిడతో కష్టంగా వుంటుందేమోనని నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను. అవునా?” అంది.
నిశిత తలపై చేయి వేసి గుండెలకి అదుముకుంటూ…
”అలాంటిదేం లేదు నిశీ! నువ్వెక్కువగా ఆలోచించకు సరేనా?” అంది సంవేద
‘సరే’అన్నట్లు తలవూపింది నిశిత.
గోడకి కొత్తగా ఓ బొమ్మ తగిలించివుంటే సంవేద దృష్టి దానిమీద పడింది. ఆమె దాన్నే చూస్తూ దానిపక్కన…
‘ ఒక చెంపపై నిశ్శబ్దంగా జారే కన్నీటి చుక్కను తుడవటానికి మరో హృదయం పడే తపనే ప్రేమ… అదే కన్నీటి చుక్కను రానివ్వకుండా మరో హృదయం పడే ఆరాటం స్నేహం…’ అని రాసి వున్న క్యాప్షన్‌ చదివి…
”ఈ బొమ్మ ఎక్కడిది?” అంది సంవేద
”ఇది కౌముది అక్క నాకు గిఫ్ట్‌గా ఇచ్చింది. దాన్ని వాళ్ల తమ్ముడు వేశాడట. ఎగ్జిబిషన్లో పెడితే చాలామంది కొంటున్నారని కూడా చెప్పింది.” అంది నిశిత.
‘హృదయంలోకి తొంగి చూసుకుంటే కదా! అక్కడ వుండే కన్నీటి తడి కన్పించేది? ఎవరికుంటుంది అంత ధైర్యం? హృదయం మాట పక్కన పెడితే! ‘పుట్టిల్లేమైనా ఎగ్జిబిషనా?’ అన్న తండ్రి మాటలే హృదయాన్ని పుండులా మార్చి సలుపుతోంది.
”నిశీ! నీకో జీవిత రహస్యం చెప్పనా?” అంది సంవేద
”చెప్పక్కా!” అంది నిశిత ఆసక్తిగా
”స్త్రీకి రెండు జీవితాలు వుంటాయి నిశీ! ఒక జీవితం ఇక్కడ. ఒక జీవితం అక్కడ. ఎక్కడైనా మనలో కలిగే ఎమోషన్స్‌ని పూర్తిస్థాయిలో తగ్గించుకొని సంయమనం పాటిస్తేనే మానవ సంబంధాలు బావుంటాయి.” అంది సంవేద.
అక్కవైపు అలాగే చూసింది నిశిత.
పెళ్లయాక వేదక్కలో ఇంత మార్పా? అనుకుంటూ అవాక్కయింది.
*****

శృతికను పెళ్లి చేసుకునే ముందు సంవేద కోసం ప్రయత్నం చేశాడు ద్రోణ. సంవేదను పెళ్లి చేసుకుంటానని, వాళ్ల పెద్దవాళ్లతో మాట్లాడమని కౌముదితో చెప్పాడు.
”ఆ అమ్మాయికి వాళ్ల నాన్న ఈ మధ్యనే పెళ్లి చేశాడు ద్రోణా! నాకీ విషయం ముందు తెలిసి ఉంటే బావుండేది కదా! ప్రభాకరంకుల్‌ తాగినప్పుడు ఎలావున్నా ఆడపిల్లల్ని చాలా పద్ధతిగా, క్రమశిక్షణతో పెంచాడు. సంవేద చాలా మంచి అమ్మాయి. ఇల్లు, కాలేజీ తప్ప మరో ప్రపంచం లేనట్లుండేది. ఆ అమ్మాయిని మనం మిస్సయ్యాం…” అంది బాధగా కౌముది.
ద్రోణ తట్టుకోలేకపోయాడు.
ఇన్ని రోజులు – ప్రతిదీ తను అనుకున్నట్లే జరుగుతోందని గర్వపడిన అతడు ఇప్పుడా భ్రమలోంచి బంతిలా బయటపడ్డాడు. నిస్సత్తువ ఆవరించినట్లు, మనశ్శరీరాలు దేన్నో పోగొట్టుకున్నట్లు భయంకరమైన ఒంటరితనానికి లోనయ్యాడు.
కొన్ని పోగొట్టుకున్నా దొరుకుతాయి. కొన్ని దొరకవు. దొరకని వాటిలో సంవేద ఒకటి. తను చేజార్చుకున్నది ఎంత విలువైనదో, ఎంత ముఖ్యమైనదో తెలిసి అతను విలవిల్లాడుతున్నసమయంలో…
”మామయ్యకి శృతికదే ఆలోచన ద్రోణా! హాస్టల్లో వుండనంటుందట. అందులో వుండే కొందరమ్మాయిల ఫోన్‌కాల్స్‌ గురించి, వాళ్లు చేస్తున్న ఎంజాయ్‌ గురించి చెబుతూ చదువు మానేస్తానంటుందట. ఎంత చెప్పినా వినట్లేదట. చదువు మాన్పించి ఇంట్లో పెట్టుకొని ఏంచేయాలి? అంటున్నాడు మామయ్య. ఆయన బాధ చూడలేక శృతికకు పెళ్లిచేయ్యమని చెప్పాను. అత్తయ్యకు కూడా నా మాటలు నచ్చాయి. కానీ… మామయ్యకు శృతికను నీకు తప్ప ఇంకెవరికి ఇవ్వాలని లేదు.” అంది ద్రోణ తల్లి విమలమ్మ.
ఉలిక్కిపడ్డట్టు తల్లివైపు చూశాడు.
”నిర్ణయం నీదే ద్రోణా! నాదేం లేదు. ఇందులో బలవంతం కూడా లేదు. కానీ శృతిక నా అన్నయ్య కూతురు కాబట్టి.. నా కోడలైతే బావుంటుందని నా ఆశ”. అంది.
ద్రోణ మాట్లాడలేదు. ద్రోణ మౌనం చూస్తుంటే ఆమెకింకా ఉత్సాహం పెరిగింది.
”నువ్వు శృతికను తప్పకుండా చేసుకోవాలి ద్రోణా! ఎందుకంటే దానివల్ల మనమందరం ఆనందంగా వుంటాం. మా అన్నా, చెల్లెల్ల అనుబంధం కూడా పెరుగుతుంది. అనుబంధాలు, ఆత్మీయతలు ఎంత అవసరమో నీకు తెలుసుకదా! మీ నాన్నగారు కూడా ‘శృతిక మన ఇంట్లో తిరుగుతున్నా కళగా వుంటుంది. మన అబ్బాయి పక్కన వుండదగిన అమ్మాయి’ అని అంటున్నారు.” అంది విమలమ్మ. అన్ని వైపులనుండి మాట్లాడుతున్న విమలమ్మలోని తల్లి మనసును అర్థం చేసుకున్నాడు ద్రోణ.
శృతికను పెళ్లి చేసుకున్నాడు.
*****

ద్రోణ చిత్రకారునిగా చరిత్ర సృష్టించాలనుకుంటున్నాడు.
మనసు రంగులో అనుభూతి కుంచెను ముంచి, అతనెక్కడ విదిలించినా అదో అందమైన బొమ్మ అవుతుంది. ఇది నిజంగా గీసిన బొమ్మా! లేక బ్రహ్మ సృష్టించిన అపురూపమైన అందమా అన్పిస్తుంది. అంతటి జీవకళను తన కదలికల్తో సృష్టిస్తున్న ఆ కుంచె అతనికో వరం.. అతనిలో ఒక్క ఆర్టే కాక మంచి లిటరరీ మైండ్‌; లిటరరీ టేస్ట్‌ వుంది. దేన్నైనా త్వరగా గ్రహిస్తాడు.
స్టాండ్‌ బోర్డు ముందు నిలబడి బొమ్మ గీస్తున్నాడు ద్రోణ.
చుట్టూ కొండలు – మధ్యలో కొలను. ఆ కొలను చుట్టూ ఆకుపచ్చని పచ్చిక. ఆ పచ్చికలో రకరకాల పక్షులు, కుందేళ్లు… అక్కడ నిలబడిన ఇద్దరు వృద్ధులు తమ చేతికర్రను పక్కన పెట్టి, కుందేళ్లను చేతిలో పట్టుకొని నిమురుతుంటే.. పక్షులు కొన్ని ఆనందతాండవం చేస్తున్నట్లు ఎగురుతుంటే… ద్రోణ కుంచె ఆ పక్షుల రెక్కలకి ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తోంది.
ఆ తర్వాత అతని కుంచె పక్షుల రెక్కల్ని వదిలి కుందేళ్ల చెక్కిళ్లను మీటినప్పుడు గిలిగింతలు పెట్టినట్లై నిజంగానే ఆ కుందేలు ఉలిక్కిపడిందా అన్పిస్తోంది. నెమ్మదిగా అతని కుంచె కిందకి జారి నెమలిని నిమరగా ఆ నెమలి నరనరం మెలి తిరినట్లు పురివిప్పింది. అలా చక, చక కదులుతున్న అతని కుంచె కదలికలు అనంతంలా, అద్భుతంగా సాగుతుంటే…
అతని మొబైల్‌ రింగయింది…
చిత్రం గీస్తూ మధ్యలో ఫోన్‌ లిఫ్ట్‌ చేసే అలవాటు అతనికి లేదు. అదలా మోగి, మోగి ‘నో ఆన్సరింగ్‌’ అంటూ ఆగిపోవలసిందే..
కానీ స్క్రీన్‌పై ఆముక్త పేరు కన్పించగానే వెంటనే లిఫ్ట్‌చేసి… ”చెప్పు! ఆముక్తా!” అన్నాడు.
మొబైల్‌ని టీపాయ్‌ మీద పెట్టి లౌడ్‌స్పీకర్‌ ఆన్‌చేశాడు.
ఫోన్లో మాట్లాడుతున్నా… అతని కుంచె ఆగకుండా బొమ్మకి అక్కడక్కడ రఫ్‌ చేస్తూ కదులుతూనే వుంది.
”నేనో కవిత రాశాను ద్రోణా! దానికి నువ్వు బొమ్మ వెయ్యాలి… కవిత కూడా ఎలా ఉందో చెప్పాలి” అంది యాంగ్జయిటీగా
ఆముక్త గొంతులోని ఆనందం తరంగాలై అతని చెవుల్ని సోకుతుంటే పసితనం, అమాయకత్వం పోదిచేసినట్లు అన్పించింది. ఇలాటి ఫీలింగ్‌ని ఒక్క ఆర్టిస్ట్‌లు మాత్రమే పొందగలుగుతారు.
”కంగ్రాట్స్ ఆముక్తా! అయినా కవితలు రాయటం నీకు కొత్తేమీ కాదుగా…” అన్నాడు. వాళ్లిద్దరి మధ్యన నువ్వు, నువ్వు అని పిలుచుకునే చనువు వుంది.
” ఈ కవిత చాలా కష్టపడి రాశాను. ఎన్నో రోజులు ఆలోచించి, ఎంతో ఫీలింగ్‌తో రాశాను.” అంది.
కవిత రాయాలన్నా, బొమ్మ గీయాలన్నా ఫీలింగ్‌ కావాలి. ఆ ఫీలింగ్‌ కూడా ఎప్పటికప్పుడు కొత్తగా, కష్టంగా, ఇప్పుడే మొదలుపెట్టినట్లు తడబాటుగా, బాధగా, హాయిగా, ఇబ్బందిగా, ఉత్సాహంగా రకరకాలుగా వుంటుంది. ఇది ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి అనుభవమయ్యే వుంటుంది. అందుకే నెమ్మదిగా నవ్వాడు ద్రోణ.
”నువ్వు నవ్వుతున్నావు ద్రోణా! అంటే ! నా కవితకి బొమ్మ వెయ్యవా? కవిత ఎలా వుందో చూడవా? జోక్‌గా తీసుకుంటున్నావా?” అంది గొంతులోకి సీరియస్‌నెస్‌ని తెచ్చుకుంటూ…
”అలాంటిదేం లేదు ఆముక్తా! ఈ బొమ్మ పూర్తికాగానే నీ కవితకి బొమ్మ వేస్తాను…” అన్నాడు.
”మొన్న నువ్వు ఒక ప్రముఖ కవి కవితలకి బొమ్మలు వేశావు చూడు.. అలా వెయ్యాలి నా కవితకి…”
”నీ కవిత ఏ రేంజ్‌లో వుందో చూడాలిగా…” అన్నాడు
ఆముక్త ఫోన్లో తన కవిత గురించి చెబుతోంది.
భర్తతో ఏదో పని వుండి తలుపు తీసుకొని లోపలకి తొంగిచూసిన శృతిక ఫోన్లో అమ్మాయి గొంతువిని షాక్‌ తిన్నదానిలా చూసి, దబాలున చప్పుడు వచ్చేలా గట్టిగా తలుపేసి వెనక్కి వెళ్లింది.
ఆ చప్పుడికి ఒక్కక్షణం కళ్ళుమూసుకొని ఇరిటేషన్‌గా ఫీలయి, డిస్టర్బ్‌ అయినట్లు తల విదిలించాడు ద్రోణ.
”రేపొస్తాను ద్రోణా మీ ఇంటికి… నా కవితతో…” అంది ఆముక్త.
”సరే! ఆముక్తా! అలాగే రా…” అంటూ ఫోన్‌ కట్ చేశాడు ద్రోణ.

*****

ద్రోణకి కాల్‌చేసి ”నేను మీ ఇంటికి వస్తున్నాను ద్రోణా” అంది ఆముక్త. ఎప్పుడు రావాలో చెప్పాడు ద్రోణ. సరిగ్గా అతను చెప్పిన టైంకు… గేటు తీసుకొని లోపలకి నడిచి, నేరుగా అతను బొమ్మలు వేసే గదిలోకి వెళ్లింది ఆముక్త.
ఆమె అలా ద్రోణ గదిలోకి వెళ్లటం – గార్డన్‌లో పూలుకోస్తున్న శృతిక చూసింది. నిన్న ఫోన్లో మాట్లాడింది ఈవిడే కాబోలు అన్న ఆలోచన రాగానే ఆమె మనసు ముడుచుకుపోయింది.

ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *