April 23, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 20

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య


అన్నమయ్య శ్రీవేంకటేశ్వరునికి చేసుకునే విన్నపం ఈ కీర్తనలో మానవజీవితం, భ్రమలు మాయలతో గడచిపోవడం గురించి చేసే నివేదన. ఈ లోకంలో జన్మంచిన ప్రతి మానవుడు ఎలా సుఖంగా.. సంతోషంగా జీవించాలా? అనే ఆలోచనతోనే గడుపుతారు. కానీ అసలు నేనెవరిని? ఈ ప్రపంచం ఏమిటి? దీన్ని ఎవరు సృష్టించ్చారు? ఈ జీవులంతా ఎవరు? మరణించాక ఎక్కడికి వెళ్తున్నారు? అని అలోచించడంలేదు. ఈ సృష్టికి లోనై మిమ్ములను గమనిచలేని స్థితిలో ఉన్నాము. మీరే కరుణజూపి మమ్ము కడతేర్చాలి అని అన్నముడు చేసే నివేదన ఇది.
కీర్తన:
పల్లవి: ఏమి సేయగలవాడ నిదివో నేను
నీమరుగు చొచ్చితిగా నీ చిత్తమికను
చ.1. పుట్టినవాడను నేను భోగించే వాడను నేను
గట్టిగా నిప్పుడు నాకు గర్తవు నీవు
పట్టరాదు జవ్వనము పాయరాదు సంసారము
యిట్టివెల్ల నీ మాయ యేమీ ననరాదు ||ఏమి||
చ.2. కడు గాంక్షలు నాసొమ్ము కర్మములు నాసొమ్ము
నడమ నంతర్యామివి నీకు నీవు
వుడివోవు కోరికలు వొదుగదు కోపము
కడదాకా నీ మహిమ కాదనరాదు ||ఏమి||
చ.3. భావించలేనివాడను ప్రకృతిలోని వాడను
శ్రీవేంకటేశ దయసేసితివి నీవు
తోవదప్పదు జ్ఞానము తొలగదు వివేకము
దేవుడవు నీమర్మము తెలియగరాదు ||ఏమి||
(రాగం: ఆహిరి; ఆ.సం.సం.3; 235వ రేకు; కీ.సం.200)
విశ్లేషణ:
పల్లవి: ఏమి సేయగలవాడ నిదివో నేను
నీమరుగు చొచ్చితిగా నీ చిత్తమికను
ఓ కలియుగ ప్రత్యక్ష దైవమా శ్రీవేంకటేశ్వరా! నేను ఏమి చేయగలను? ఇదిగో నేను నీ ఆశ్రయం కోసం వచ్చాను. ఇక అంతా నీ ఇష్టం. మా పాపాలు పుణ్యాలు అన్నీ మీకే అర్పిస్తున్నాం. ఆదుకొని మమ్ము కడతేర్చు స్వామీ అని అన్నముడు స్వామి కడ విలపిస్తున్నాడు కన్నీరు మున్నీరుగా.

చ.1. పుట్టినవాడను నేను భోగించే వాడను నేను
గట్టిగా నిప్పుడు నాకు గర్తవు నీవు
పట్టరాదు జవ్వనము పాయరాదు సంసారము
యిట్టివెల్ల నీ మాయ యేమీ ననరాదు.
ఈ భూమిపై జన్మించినది నేను. కర్మానుఫలమైనా సుఖాస్వాదనైనా అనుభవిస్తున్నదీ నేనే! కానీ ఇప్పుడు నీ మరుగుచొచ్చాను. ఇప్పుడు నన్నుఆదుకునే కర్తవు నీవే! యవ్వనమదము పట్టరానిదన్న విషయము ఎరుగుదును. సంసార బంధములు త్రోసిపుచ్చి జీవించలేను అన్నదీ వాస్తవమే! ఇదంతా జగన్నాటకసూత్రధారిగా నీవాడించే మాయానాటకమని ఎరుగుదును. ఏమి అనగలను? మీరు భగవద్గీతలో చెప్పినట్టు… చేసేవాడివీ… చేయించే వాడివి… అన్నీ తమరే కదా! ఆ మాయలను గూర్చి నేను ఏమని నిందించగలను? ఎవరిని నిందించగలను?

చ.2. కడు గాంక్షలు నాసొమ్ము కర్మములు నాసొమ్ము
నడమ నంతర్యామివి నీకు నీవు
వుడివోవు కోరికలు వొదుగదు కోపము
కడదాకా నీ మహిమ కాదనరాదు
అంతులేని కోరికలతో అలమటిస్తున్నాను. ఆ కోరికలు నెరవేరడానికి నేను పడే పాట్లు చేసే పనులు అన్నీ నా కర్మములే అని నాకు తెలుసు. కానీ ఈ విషయంలో నా తప్పొప్పులను ఎంచే నాధులు మాత్రం మీరే! కోర్కెలు అనంతాలు. అవి ఏమాత్రం తగ్గిపోవు. అవి తీరనప్పుడు నాకు కలిగే దు:ఖాతిశయము కూడా నా అధీనంలో ఉండదు. కడ దాకా ఈ ఆశలపోరాటం గెలుపోటములు మానవులుగా పుట్టినందుకు తప్పవు. అలాగే ఇవన్నీ చేయించే నీ మహిమనూ కాదనలేను.

చ.3. భావించలేనివాడను ప్రకృతిలోని వాడను
శ్రీవేంకటేశ దయసేసితివి నీవు
తోవదప్పదు జ్ఞానము తొలగదు వివేకము
దేవుడవు నీమర్మము తెలియగరాదు
నీవు సృష్టించిన ఈ సమస్త ప్రకృతికి ఆధీనుడై జీవం గడిపేవాడను నేను. నీ మాయాజాలం , నీ మహిమలు నేను వూహింపలేను, భావింపలేను. నా పూర్వజన్మల సుకృతం కొద్దీ నన్ను దయచూశావు. చాలు స్వామీ చాలు. నేను ఈ దారి ఎన్నటికీ వీడను గాక వీడను. నావివేకం విస్తరిస్తూ ఉంటుంది. ఆత్మజ్యోతి ఆరిపోదు. శ్రీవేంకటేశ్వరా! నీ రహస్యాలు తెలుసుకోవడం సామాన్యులకు దుస్సాధ్యం.

ముఖ్యమైన అర్ధాలు: మరగు = ఆశ్రయము; చిత్తము = ఇష్టము, మనసు; పట్టరాదు = ఆపరాదు; పాయరాదు = విడచిపోలేని స్థితి; ఉడివోవు = తగ్గిపోయేవి కావు; ఒదగదు = నా అధీనంలో జరిగే విషయం కాదు; మర్మము = మాయ, రహస్యము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *