March 29, 2024

కొత్త కథలు – సమీక్ష

సమీక్ష: – నండూరి సుందరీ నాగమణి

కొత్త కథలు – ౩౩ మంది రచయిత్రుల మంచి కథలతో వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు వెలుగు లోనికి తీసుకువచ్చిన ఒక మంచి పుస్తకం.

ఈ పుస్తకములో సీనియర్ రచయిత్రుల దగ్గరనుండి, వర్థమాన రచయిత్రులవరకూ అందరి కథలూ ఉన్నాయి. ప్రతీ కథ కూడా కథా, కథనమూ ఆసక్తిని కలిగించేలా ఉండటం హర్షదాయకం.

విపంచితో విద్యుల్లతకు చిన్ననాటి స్పర్థా పూర్వక స్నేహం, పెద్దయ్యాక, ఆమెను చూసి, కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుడిని గుర్తు చేసి కళ్ళు తెరిపిస్తుంది, ‘విశ్వవిపంచి’ అనే కథలో. ‘దుష్ట రక్షణ’ అనే కథలో తనను భక్షించబోయిన ముష్కరులను తెలివితో బంధించి, వారిని న్యాయస్థానానికి ఈడ్చిన శృతి పాత్రను అభినందించకుండా ఉండలేము. కానీ, దోషులు నిర్దోషులుగా నిరూపించబడి విడుదల కావటం, దుష్టులకే రక్షణ కలగటం కించిత్ బాధనే కలిగిస్తుంది. కానీ జరుగుతున్న వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబంగా నిలిచిందీ కథ.

‘నెలపొడుపు’ అనే కథలో చేయని నేరానికి, ఒక హంతకిగా, కళంకితగా జైలు శిక్షను అనుభవించి తిరిగి వచ్చిన రమ్య పాత్ర కొడుకు కోసం ఎంతో ఆశతో తిరిగి వచ్చినా, బామ్మ పెంపకంలో పెరిగిన ఆ కొడుకు ఆవిడ నూరిపోసిన విష ప్రభావంతో తల్లిని ఛీత్కరించగా కుమిలిపోతూ వెనుదిరిగిన ఆమెను తన మాటలతో ధైర్యం చెప్పి, తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడం కోసం అయినా పోరాడమని అనునయిస్తాడు పోలీసు నరసింహ. ఆ స్ఫూర్తితో తిరిగి నిలబడుతుంది రమ్య.

‘స్వాభిమానం’ అనే కథలో దిక్కులేని ఒక దీనురాలికి భర్తయై అండగా నిలబడిన ఒక వృద్ధుడి ఔన్నత్యం మన కనులు చెమరింపజేస్తుంది. ‘పెండ్లి అంటే ఇది’, ‘అమ్మ నాన్న – ఒక పెళ్ళి’ కథలు జయప్రదమైన అభ్యుదయ వివాహాల గురించి ఎంతో వివరంగా తెలియజేస్తాయి. ‘పాతసామాన్లు’ అనే కథలో అటక మీద దాచిన ఒక్కొక్క వస్తువుకూ ఒక్కొక్క జ్ఞాపకాన్ని వెలికి తెచ్చి, మనసుకు హాయిని కలిగిస్తారు, రచయిత్రి. ఈ కథ మన ఇంటింటి కథ అని అనిపిస్తుంది. ‘మనిషి జాడలు’ కథ ధనముతో కొలవని మానవత్వాన్ని పరిచయం చేస్తుంది.

‘వచ్చే జన్మకైనా…’, ‘శ్రద్ధగా పని నేర్చుకో నాన్నా…’ కథలు మగపుట్టుకలో ఉండే కష్టాలను చెబుతూనే, గిలిగింతలతో నవ్విస్తాయి. ‘హుండీ’ కథ, మానవ హృదయం, మానవత్వపు దైవాన్ని నిలుపుకొని, ఎలా దేవాలయం కాగలదో ఎంతో హృద్యంగా తెలియజేస్తుంది. ఇంకా ‘చైతన్య’ కథ మహిళలకు స్ఫూర్తిదాయకంగానూ, ‘పేరు’ కథ వారిని ఆలోచింపజేసేది గానూ రచింపబడ్డాయి. ‘మానవత్వపు స్పర్శ’ మంచాన పడిన ఒక రోగికి మానసిక సాంత్వననిచ్చి కోలుకునేలా చేసిన ఒక మంచి మనిషిని పరిచయం చేస్తుంది. ఓ హెన్రీ వ్రాసిన ‘ది లాస్ట్ లీఫ్’ కథ లీలగా మనకు గుర్తుకు రాక మానదు. ‘తెలుగురాని దానివని దిగులు చెందకు…’ నేటి చిత్ర కథానాయికల, గాత్రదాన కళాకారిణులు, గాయనీ మణుల ఎంపిక మీద సంధించిన చక్కని వ్యంగ్యాస్త్రం.

మిగిలిన కథలన్నీ కూడా చదువరుల మనసులకు ఎంతో తృప్తిని ఇస్తాయి. పాఠకులూ, రచయిత(త్రు)లూ కూడా చదివి తీరవలసిన పుస్తకం ఇది. డా.సి.నారాయణరెడ్డిగారి సంస్మరణలో ఇంత మంచి పుస్తకం తీసుకువచ్చిన ‘వంశీ’ వారు ఎంతైనా అభినందనీయులే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *