March 19, 2024

మాయానగరం – 40

రచన: భువనచంద్ర

జీవితం ఎంత చిన్నది… ఎంత గొప్పది… ఎంత చిత్రమైనది.. ఎంత అయోమయమైనదీ! అర్ధమయ్యిందనుకున్న మరుక్షణంలోనే ఏమీ అర్ధం కాలేదని అర్ధమౌతుంది. సంతోషంతో ఉప్పొంగిపోయే క్షణాన్నే ఏదో ఓ మూల నుంచి దుఃఖం ఉప్పెనలా మీదపడుతుంది. ఓ కాలమా… ఎంత చిత్రమైనదానివే నువ్వు?..మమల్ని మురిపిస్తావు.. మమల్ని అలరిస్తావు… సడన్ గా మమల్ని నీలో కలిపేసుకుంటావు! చావు పుట్టుక.. యీ రెండు అట్టల మధ్య కుట్టబడిన పుస్తకమేగా యీ జీవితం.
ఆలోచిస్తూ నడుస్తున్నాడు రుషి. సవ్యాద్రి అండతో జీవితం హాయిగా గడచిపోతోంది. కేవలం పదిహేను రోజుల్లో “కాశీ అన్నపూర్ణ భోజనశాల ” అద్భుతమైన పేరు తెచ్చుకుంది. ఆ పేరులో సగం బిళహరిదీ, శీతల్ దీ. కారణం.. వాళ్ళు తన ఆర్డర్ మీద తయ్యారు చేసి ఇచ్చే పొడులూ, పచ్చళ్ళూ, ఊరగాయలూ. తెల్లవారుఝామునే లేచి కూరగాయలు కూడా వాళ్ళే చక్కగా కడిగి, తరిగి ఇస్తున్నారు. మొదటివారం చివర్లో రుషి వాళ్ళ పనికి తగిన ప్రతిఫలాన్ని ‘కవర్లో ‘ పెట్టి ఇచ్చాడు. వాళ్ళు వద్దన్నారు.
“కాదండీ… ఈ డబ్బు నేను ఊరికే ఇచ్చేది కాదు. మీరు చమటోడ్చి సంపాదించుకున్నదే ” ఒక్క మాట చెబుతాను.. లోకంలో డబ్బే సర్వస్వం కాదు. కానీ, ‘డబ్బు ‘ ఇచ్చే ‘ రక్షణ ‘ మరేదీ ఇవ్వదు. డబ్బుని బ్యాంకులో వేసుకోండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడిన తృప్తే కాదూ, ఇతర్లని ఆదుకోగలమన్న ధైర్యమూ వస్తుంది. ” అంటూ బలవంతంగా వారికి ఇవ్వడమే కాక అదే రోజున ఇద్దరికీ విడివిడిగా బ్యాంకు ఎకౌంట్లు తెరిపించాడు. ఆ పని వల్ల బిళహరికీ, శీతల్ కి అనుకున్నంత ఆనందం కలగకపోయినా అవధాని గారు మాత్రం చాలా సంతోషిచారు.
ఇప్పుడాయనకు బిడ్డలు దగ్గర లేరన్న చింత లేకపోగా దేవుడు తనకి ఇద్దరు కూతుళ్లను ఇచ్చాడని సంబరపడుతున్నాడు. “వాళ్ళెవరూ? ” అని ఎవరేనా అడిగితే, దేవుడిచ్చిన కూతుళ్ళనే చెబుతున్నాడు.
బిళహరికి క్షణం తీరిక లేకుండా పోయింది. ఓ పక్క సంగీత పాఠాలు, మరో పక్క తోటపని, ఇంకోపక్క పచ్చళ్ళ తయ్యారీ, కూరగాయలు తరగడం, వీటన్నిటికంటే ఆవిడకి ముఖ్యమైన పని ప్రసాదాల్ని శుచిగా రుచిగా తయ్యారు చేయడం. శీతల్ ఒళ్ళు దాచుకొనే మనిషి కాదు. బిళహరి చేసే ప్రతి పనిలోనూ శీతల్ అదృశ్య హస్తం వుండనే వుంటుంది. గతాన్ని గురించి జ్ఞాపకాలు ఇద్దరినీ బాధపెట్టేవే! బిళహరికి గతం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏదో ఓ పని తానే కల్పించుకొని అందులో దూరిపోతుంది. లేదా మనసుని సంగీతం వైపు మళ్ళించి గర్భగుడికి ఎదురుగా ఉన్న వేదిక మీద కూర్చొని దేవుడికి పాటలు వినిపిస్తూ ఉంటుంది. సుందరీబాయ్ మనస్తత్వం షీతల్ కి తెలుసు. ఖచ్చితంగా ఆవిడ కిషన్ ని రాచి రంపాన పెడుతూ వుంటుందని తెలుసు. ‘పాపం కిషన్ ‘ అని దుఃఖంలో నిట్టూరుస్తూ వుంటుంది. ఆమె దృష్టిలో కిషన్ చిన్నపిల్లవాడు. నిజమూ అంతే , ఆమెకీ, కిషన్ కి మధ్యనున్నది కేవలం వాంఛ నిండిన శారీరక సంబంధం కాదు. దాన్ని మించినది. అది మాటలకందనిది. మనసుకి మాత్రమే అర్ధమయ్యేది.
గుడిలోకి వచ్చాక శీతల్ కి తెలుగు బాగా అర్ధమవ్వసాగింది. మాట్లాడటం కూడా బాగా వచ్చింది. కానీ ఏనాడు తన గతాన్ని బిళహరికి చెప్పలేదు. అలాగే ఆమె గతాన్ని ఏనాడు అడగలేదు. కానీ ఇద్దరికీ తెలుసు.. ఇద్దరివీ అనాథ బ్రతుకులేయని. ఆ అనాథబ్రతుకులోనూ కొంచం తేడా వుంది… పూర్తి చీకట్లోనుంచి బిళహరి వెలుగులోకి వస్తే, వెలుగుని చవి చూసి చీకట్లోకి నెట్టబడి అందులోనుంచి మళ్ళీ వెలుతురులోకి వచ్చిన జీవితం శీతల్ ది. వెలుగు వెలుగే… కానీ అందులోనూ తేడాలున్నాయి. సూర్యుడి వెలుగు వేరు… చంద్రుడి వెలుగు వేరు. గుడ్డి దీపం వెలుగు వేరు… నక్షత్రాల వెలుగు వేరు. ప్రేమను నిండుగా పొంది చీకట్లోకి వచ్చిన బ్రతుకు శీతల్ ది. ప్రేమే అనుభవించని బ్రతుకు బిళహరిది.
బిళహరికి నవ్వొచ్చింది. ఎందుకంటే ఆమెకు కామేశ్వరరావు గుర్తొచ్చాడు. అతని నాటకీయత, అందులోని అమాయకత్వమూ, మూర్ఖత్వమూ అన్నీ గుర్తొచ్చాయి. మనసులోనే భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంది. ” ఆ రోజు ఇంట్లోంచి బయటబడే ధైర్యం చెయ్యకపోతే యీనాడు నా పరిస్థితి ఏమిటి? ” అని కూడా ఆలోచించి వణికిపోయింది. మళ్ళీ మళ్ళీ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్న సమయంలో లోపలికొచ్చాడు రుషి.
“బిళహరిగారూ.. రేపటికో మాంచి ఆర్డర్ దొరికింది. వెయ్యిమందికి భోజనాలు. మనం చేయగలమా లేదా అన్నది ఆలోచించుకొని చెపుతానన్నాను. భోజనాలు రేపు సాయంకాలానికి అంటే నైట్ కి అందివ్వాలి. శీతల్ ని కూడా పిలిచి ఆలోచించండి. ” స్టూల్ మీద కూర్చున్నాడు రుషి చెప్పవలసింది చెప్పి.
“తప్పకుండా చెయ్యగలం. ముందు ఏవేవి కావాలో ఆ లిస్టు వుందా? ”
“సిద్ధంగా వుంది. పప్పు, రెండు కూరలు, రెండు పచ్చళ్ళు, పులిహోర, బూరెలు, సాంబార్, దోసావకాయ, అప్పడాలు. పచ్చళ్ళో ముఖ్యంగా గోంగూర వుండాలి. పప్పు టోమాటో గానీ, మావిడికాయ గానీ. అవీ కాక అప్పడాలూ, వడియాలూ, ఊరమిరపకాయలు తప్పని సరి. ఇహ పెరుగు అన్నమూ మామూలేగదా! ” గడగడా చెప్పాడు రుషి.
“బ్రహ్మాండంగా చేయచ్చు. అయితే రుషి గారూ… వంటలు మాత్రం ఆగ్నేయ మూలనున్న పాత మండపంలో చేద్దాం. అక్కడకు వచ్చి చేయడం మాకు వీలు కాదు. సామాన్లతో మీరు వచ్చేయండి. గాడిపొయ్యి తవ్వించి ఇక్కడే చేద్దాం. గోంగూరమళ్ళు ఉండనే వున్నాయి. రెండో పచ్చడి నేతి బీరకాయ పచ్చడి చేద్దాం. కావాల్సినన్ని కాయలు వున్నాయ్.
బ్రహ్మాండంగా నేతి బీరకాయ పాదు పాకింది. మిగతా వస్తువులూ, వంటపాత్రలూ ఇక్కడికి పంపండి. మీ గైడెన్స్ లోనే చేస్తాము. వారు అడిగినవన్నీ మాత్రమే కాక కందిపొడీ, ఆవకాయ కూడా అదనంగా ఇద్దాం ” నవ్వింది బిళహరి.
“అలాగే ” లేచాడు రుషి. బిళహరిని చూసినప్పుడల్లా రుషికి ఆనందం. ఓ చల్లని నీడలో ఉన్నంత ఆహ్లాదం. శీతల్ తో కూడా బాగా మాట్లాడుతాడు రుషి… కానీ ఆమెలో ఓ గాంభీర్యం కనపడుతుంది. ఎంత చనువున్నా , ఏదో తెలియని శక్తి కొంతవరకే ఆ చనువుని వాడుకోనిస్తుంది తప్పా , ముందుకు పోనివ్వదు.
*********
మదాలస మనసు ఉరకలేస్తోంది. పరీక్షలో ‘పాస్’ విజయం అనేది ఎప్పుడూ గొప్పే. ఒకటో తరగతి పాస్ అయితే ఎంత ఉత్సాహము పిల్లలకుంటుందో ఐ. ఏ. ఎస్. పాసైనవారికి కూడా అంతే ఉద్వేకమూ, ఉత్సాహమూ ఉంటాయి. విజయం విజయమే. తను పరీక్ష పాసయ్యాననే విషయం మదాలసకి అమితమైన సెల్ఫ్ కాంఫిడెన్స్ ని ఇచ్చింది.
ఎన్ని మాటలూ, ఒక వైపు అత్తగారు, మరోవైపున మొగుడు, ఇంకో వైపు అమ్మలక్కలూ, చూపుల్తోటే మనిషిని మింగేసే వెధవలు… ఇందరి మాటల్ని భరిస్తూ పాసవ్వడం మామూలు విషయం కాదుగా! అవును… ఇంకా సాధించాలి. ఇంకా సాధించాలి. ఆనందతో ఉరకలేస్తూ నడుస్తోంది మదాలస ఈ విషయాన్ని మాధవికి చెప్పాలి. తను మళ్ళీ పుస్తకం పట్టుకోడానికి కారణం మాధవి, ఆనందరావులే.
సర్రున ఓ కారొచ్చి ఆమె పక్కనే ఆగింది, చూస్తే అందులో వున్నది సుందరీబాయి.
“హల్లో మదాలస.. ఎక్కడికి? ” గుజరాతి (గుజ్జు) తెలుగులో పలకరించింది సుందరీ బాయి.
“హల్లో సుందరీబాయి గారు… నమస్తే బాగున్నారా? నేను ఎగ్జామ్స్ లో పాసయ్యానండి. మాధవీ అక్కకు చెబుద్దామని వెళ్తున్నాను. ” చిన్నపిల్లలా సంబరపడుతూ చెప్పింది మదాలస.
“కంగ్రాట్స్… నేను తీసుకొని వెళ్తా రండి. నేను తనని కలిసి చాలా రోజులయ్యింది. మరి పార్టీ ఎప్పుడు? ” డోర్ ఓపెన్ చేసి అన్నది సుందరీబాయి.
“పార్టీ ఇవ్వాలంటే ప్రస్తుతానికి ‘వసతి ‘ లేదండి. అంతే కాదు ముందు ఏదన్నా ఉద్యోగంలో చేరాలని నా కోరికండి. ఆ తరవాత తప్పకుండా పార్టీ ఇస్తా. ” కొంచం బిడియంగా నవ్వుతూ అంది మదాలస.
“ఓహ్… డోంట్ వర్రీ… ఉద్యోగానిదేముంది? మా ఇండ్రస్టీస్ లో నే ఇప్పిస్తా. సరేనా? ” భుజంతట్టింది సుందరీబాయి.
“అవునూ… ఆనంద్ రావుగారేవైనా ఉత్తరాలు రాస్తున్నారా మనవాళ్ళకి? ” స్టీరింగుని మాధవి ఉండే రోడ్డు వైపు తిప్పుతూ అడిగింది సుందరీబాయి.
“తెలీదండి. కానీ ఒకటి రెండు సార్లు శోభ అనడం గుర్తుంది. ఆనంద్ రావుగారు ఉత్తరాలు రాశారని ” అమాయకంగా నిజం చెప్పింది మదాలస. ఆనందరావు బొంబాయ్ లో ఉన్నాడని సుందరికి తెలుసు. కానీ ఎక్కడో తెలీదు. శోభ ద్వారా లాగితే ‘రహస్యం ‘ బయటపడుతుందని సంతోషపడింది సుందరి.
కిషన్ చంద్ మీద ద్వేషం ఆమెకి అసహ్యంగా మారింది. ఆఫ్ట్రాల్ ఓ పనిమనిషిని, తను వుండగానే అతను ప్రేమించడం సుందరీ బాయి జీర్ణించుకోలేకపోయింది. వాడు కుళ్ళీ కుళ్ళీ ఏడ్వాలంటే, వాడెదురుకుండానే తను వేరొక మగాడితో సుఖించాలి. సుందరీబాయి మనసులో ద్వేషాగ్ని మబ్బులా కమ్ముకుంది. తెలీకుండానే ఆమె కాలు ఏక్సిలేటర్ ని అదిమింది. కారు క్షణంలో స్పీడందుకుంది. మదాలసకి ఒకసారి కంగారు పుట్టి “మేడమ్ సుందరిగారూ!” అంటూండగా కారుని రైట్ తిప్పి ఎదురుగా వస్తున్న లారీ నుంచి తప్పించింది సుందరి. కానీ ఆ రైట్ సైడ్ నుంచి వస్తున్న రుషి అమాంతం అంతెత్తున ఎగిరిపడతాడని సుందరి వూహించలేదు. బ్రేకు వేసి కారు ఆపింది. రక్తపు మడుగులో రుషి. షాక్ లో సృహ కోల్పోయింది సుందరి.
******
కిరాణా కొట్టు వాడిచ్చిన పచారీ సరుకుల బిల్లు రుషిని బ్రతికించిందనడంలో అతిశయోక్తి కాదు. ఆ దుకాణం దారుడిచ్చిన అడ్రస్ ని బట్టి రుషి బాబాయికి కబురంపితే, చోద్యం చూసే రిక్షావాడు సుందరిని చూసి చమన్ లాల్ కి కబురెట్టాడు.
హుటాహుటిని రుషి హాస్పటల్ కి తరలించబడ్డాడు. అదో చిన్న హాస్పటలు. డాక్టర్ మహా మంచివాడు. అడ్వాన్స్ కూడా అడకుండా మందులు తన ఫార్మసీ షాప్ నుంచే తెప్పించి రుషిని బ్రతికించాడు. నాలుగు గంటల తరవాత కళ్ళు తెరిచిన రుషికి అర్ధమయ్యింది…. తను హాస్పటల్లో వున్నానని.
అతను చెప్పిన మొట్టమొదటి మాట ఏమంటే, ” బాబాయ్ గుళ్ళో బిళహరి వుంటుంది. అమెతో విషయం చెప్పు. ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకున్న పని మిస్ కాకూడదు. అది నా మాటగా చెప్పు. ఆ వెయ్యి భోజనాలు సక్రమంగా అందించిన తరవాతే హాస్పటల్ కి రమ్మను. ఏదైనా పోగొట్టుకోవచ్చు, నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. అతను చెప్పింది తన బాబాయ్ సహ్యాద్రికి. ఆ మాట విన్నది సహ్యాద్రి మాత్రమే కాదు… మదాలస కూడా విన్నది. ఇంత పెద్ద యాక్సిడెంటు తరవాత కూడా ‘నమ్మకం’ గురించిన మాటలు వింటూ విస్తుపోయింది మదాలస.
వెళ్ళాలా? వద్దా? మదాలస ఆలోచన. రుషి అన్న మాటలు విన్న సహ్యాద్రి వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. పేషంటు దగ్గర ఎవరూ లేరు. ఇప్పుడేం చెయ్యాలి? రుషి మొహం వంక చూసింది మదాలస.. చిన్నవాడే! ఆ మొహంలో చెప్పలేని పవిత్రత, ప్రశాంతత. అతను చెప్పిన మాటలను బట్టి అతనో కాటరింగ్ ‘ చేసేవాడనిపిస్తోంది. మాటని బట్టి స్పష్టంగా బ్రాహ్మణుడనిపిస్తోంది.
“ఊహు.. “మత్తుగా కదిలాడు రుషి. ఎనస్తీషియా తన పని బాగా చేస్తోంది. తలకీ, చేతులకీ, మోకాళ్ళకి కట్లున్నాయి. ఎన్ని కుట్లు తలకి పడ్డాయో తెలియదు. వెళ్ళాలా? వద్దా? ఆలస్యం అయితే? ఓ కంఫ్యూజన్ లో ఉంది మదాలస.
“రుషి అనే పేషంట్ ని ఇక్కడ చేర్చారుట కదా… ఎక్కడ? ” గుజరాతి యాస తెలుగులో అన్నాడు చమన్ లాల్.
“ఆ గదిలో ” నర్సు చెప్పిన మాట మదాలస విన్నది. గుజ్జూ యాస బట్టి అది సుందరీ బాయి చుట్టాలెవరేన్నానేమో అనుకుంది మదాలస. ఆమె ఆలోచన పూర్తయ్యేలోగానే లోపలికొచ్చాడు చమన్ లాల్. రుషిని చూసి షాక్ తిన్నాడు.
“మీరెవరమ్మా… అతని భార్యవా? నా పేరు చమన్ లాల్. యాక్సిడెంటు చేసింది మా అమ్మాయి… పేరు సుందరి. ” రుషి చేతిని మెల్లిగా టచ్ చేసి గద్గద స్వరంతో అన్నాడు చమన్ లాల్.
“మీరెవరో నాకు తెలీదండి. సుందరిగారు బాగా తెలుసండి. నేను మాధవిగారింటికి వెళ్తోంటే , తనే దింపుతానని కారు ఎక్కించుకున్నారండి. ఓ లారీని తప్పించబోయి సందులోకి తిప్పారండి పాపం యీయనకి…
ఆమెకు పెళ్ళైందన్న విషయం చూడగానే గ్రహించాడు చమన్ లాల్. అవును, యీ హాస్పటల్లో ఎవర్నో చూస్తూ కూర్చుంటే వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారూ… అన్న ఆలోచన వచ్చిందాయనకి.
“నువ్వేం చేస్తావమ్మా? ” అని అడిగాడు
” ప్రవేట్ గా పరీక్ష రాసి పాసయ్యానండి. ఆ విషయంలో మాధవీ అక్కకు చెప్పి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిద్దామని బయలుదేరానండి. ఆ సమయంలోనే సుందరీ గారు నన్ను కారెక్కించుకొని… ” మళ్ళీ మధ్యలో ఆపేసింది మదాలస. సుందరి ఉద్యోగం ఇప్పిస్తానన్న విషయం యీ పరిస్థితిలో చెప్పడం ఆమెకి ఎందుకో నచ్చలేదు.
“ఉద్యోగం నేనే ఇస్తా… ఇదిగో నా కార్డ్. నిర్భయంగా వుండు. యీ పిల్లవాడి బాబాయి వచ్చే వరకూ నేనూ ఇక్కడే వుంటా… కూర్చోమ్మా. ” అనూనయంగా అన్నాడు చమన్ లాల్.
సేఠ్ చమన్ లాల్ గారు హాస్పటల్ కి విజిటర్ గా వచ్చిన సంగతి క్షణంలో పాకిపోయింది. డాక్టర్ గారు క్షణంలో ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
“డాక్టర్ గారు.. వైద్యానికి ఎంత ఖర్చైనా ఫర్వాలేదు. మీరు ఇతన్ని ఏ హాస్పటల్ లో చేర్చినా ఫరవాలేదు. కానీ, మీ పర్యవేషణలోనే వైద్యం జరగనివ్వండి. ఖర్చు గురించి ఆలోచించవద్దు. ఇతను నాకు చాలా కావల్సినవాడు. ఐ వాంట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ హిమ్ ” అంటూ బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి ఇచ్చాడు చమన్ లాల్.
“అయ్యా… డబ్బు ఇప్పుడు వద్దండి…. ఇతనికేం ప్రమాదం లేదు. అతను లేచాక ఎంత ఖర్చయ్యిందో అంతా మీ దగ్గర తీసుకుంటాను. ” వినయంగా చెక్ తిరిగిచ్చాడు డాక్టర్. అప్పుడతని పేరుని చూసింది మదాలస. డాక్టర్ రమణ.” దేవుడున్నాడు డాక్టర్… నిజం.. మీవంటి మంచి మనుషుల హృదయాలలో నిలిచే వున్నాడు ” చమన్ లాల్ కళ్ళలోనుంచి అశృవులు జాలువారాయి. ఎందుకో అతనికి మళ్ళీ తన భార్య గుర్తొచ్చింది.
******

2 thoughts on “మాయానగరం – 40

  1. ఎంతో గొప్పగా ఉంది, శైలీ, కథనం, కథ…అన్నీ పట్టుగా సాగుతున్నాయి. ఏదైనా పోగొట్టుకోవచ్చు, నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. అనే స్పృహే మనిషిని ఉత్తమ స్థితిలో నిలబెడుతుంది. సకల సద్గుణాలకీ ఈ స్పృహే. చదువు ఈ విలువని విద్యార్థిలో ప్రోది చేస్తే దేశం బంగారమై పోతుంది.

Leave a Reply to BHUVANACHANDRA Cancel reply

Your email address will not be published. Required fields are marked *