March 28, 2024

“హాయిగా..”

రచన: మంథా భానుమతి.

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కలలు పండుతున్న ఒక నగరం.. మింటి నుంచి మట్టి మీదికి అమరావతి దిగి వచ్చినట్లు వైభవం ఉట్టి పడుతూ ఉంటుంది. లేచినప్పట్నుంచీ వెనుకనుంచెవరో తరుముతున్నట్లు హడావుడిగా ఉంటారు అక్కడి జనం.
విశాలమైన వీధులు, పెరిగి పోయిన కార్లతో ఎడ్ల బళ్ల కంటే నిదానంగా నడిచే కార్ల తోరణాలతో కళకళ లాడుతుంటాయెప్పుడూ.
ఆ నగర శివార్లలో, ఆధునిక సదుపాయాలతో, రక్షణ వలయంతో, కావలి వారితో.. విశాలమైన ప్రాంగణంలో కట్టిన గృహ సముదాయాలు అనేకం..
పక్కింటి వాళ్లతో, ఎదురింటి వాళ్లతో వినాయక చవితికో, రిపబ్లిక్ డేకో తప్ప కలవని సంస్కృతి.. సాయంత్రం పార్కు కెళ్తే బెంచీల మీద కూర్చుని కనిపించే వృద్ధులు, ఆటలాడే పిల్లలు.. వారిని ఆడించే గ్రాండ్ మాలు, ఆయాలు.. నడి వయసు వాళ్లు, యువత కనిపించేది సూరీడు రాకముందు, వెళ్లిపోయిన తర్వాతే.
అటువంటి గేటెడ్ కమ్యూనిటీలో, ఒక ఇంట్లో.. మధ్యాన్నం రెండు గంటలకి,
“అమ్మా! అమ్మా! గుడ్ న్యూస్..” మారు తాళంచెవితో వీధి తలుపు తెరుచుకుని లోపలికి వస్తూనే ఆనందంతో గట్టిగా అరిచింది రంజని.
“రేపట్నుంచీ వర్క్ ఫ్రం హోమ్. వారానికొక సారి మీటింగ్ కెళ్తే చాలు. బుజ్జిగాడితో ఆడుకోవచ్చు హాయిగా! ఎంత కష్టపడితే వచ్చిందో తెలుసా ఈ ఆఫర్?”
అప్పుడే పదకొండు నెలల వివేక్ ని ఉయ్యాల్లో పడుకోపెట్టాలని ప్రయత్నిస్తున్న పార్వతి ఉలిక్కి పడింది. ఈ సమయంలో ఆకస్మాత్తుగా అనుంగు పుత్రిక అగుపడ్డం ఇదే.. పసివాడు కూడా ఉయ్యాల్లో లేచి నిల్చుని ముందుకి ఒరిగి పోయి కిలకిలా నవ్వుతూ చేతులు చాపాడు. ‘మ్మ..మ్మ’ అంటూ.
చేతిలో ఉన్న లాప్ టాప్ సంచీని పక్కనున్న మంచంమీదికి విసిరేసినట్లుగా పడేసి, రెండంగల్లో ఉయ్యాల దగ్గరికి వచ్చి కొడుకుని ఎగరేసి ఎత్తుకుంది రంజని. కాసేపు వాడితో ఆడుకుని, కిందికి దింపి.. మొహం కడుక్కుని, గదిలోకెళ్లి పడుక్కుంది బైటి గోల వినిపించకుండా తలుపేసుకుని.
అమ్మ వదిలేసి వెళ్లడం.. తన నిద్ర చెడిపోవడంతో తిక్క తిక్కగా ఏడవడం మొదలెట్టాడు చంటాడు. పార్వతి విసుగు మొహంలో కనిపించనీయకుండా వాడికి స్వెటర్ తొడిగాక చిన్ని తోపుడు బండిలో కూర్చోపెట్టి,.. మర్చిపోకుండా తాళంచెవి దానికున్న సంచీలో పెట్టి బైటికి నడిచింది బండి నెట్టుకుంటూ.
కాసేపు బైట తిప్పగానే వివేక్ బండి లో నిద్రపోయాడు. ఇంట్లోకి తీసుకొచ్చి, బండిని హాలు మధ్యలో ఉంచి. పక్కనున్న సోఫాలో వాలి పోయింది, కళ్లు మూసుకు పోతుంటే. అలా ఎంత సేపు పడుకుందో కూడా గ్రహింపు లేదు.
“అమ్మా! ఏంటిక్కడ నిద్రపోయావు? వివ్వీ చూడు ఎలా ముడుచుకుపోయున్నాడో! వాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి, నువ్వు మంచం మీద పడుకోవచ్చు కదా! ఇలా అడ్డదిడ్డంగా పడుకో పెట్తే గ్రోత్ సరిగ్గా ఉండదు.” రంజని తట్టి లేపుతుంటే కళ్లు నులుముకుంటూ లేచింది పార్వతి. కాసేపు ఎక్కడుందో అర్ధం కాలేదు.
గ్రోతా? కూతుర్ని ఎగాదిగా చూసింది.. ఐదడుగుల ఎనిమిదంగుళాలు. ఎత్తుకు సరిపోయే లావు మంచి శరీరసౌష్టవం. దీన్నెక్కడ పడుకోబెట్టానూ అనుకుంది. వంటింటి పక్కనున్న వరండాలో వాసానికి కట్టిన చీర ఉయ్యాల్లో, వెచ్చగా అటూ ఇటూ కదలడానికి లేకుండా.. మరి ఇంత పొడుగెట్టా అయిందీ? పార్వతి మాట్లాడకుండా లేచి, చీర సవరించుకుని వంటింట్లోకి నడిచింది. కాసిని కాఫీ చుక్కలు పడ్తే కానీ బుర్ర పన్చెయ్యదు. పొద్దున్న ఆరింటికో కప్పు, సాయంత్రం నాలుగింటికో కప్పు స్చ్రాంగ్ కాఫీ ఉండాలి తనకి. కూతురికేదైనా సమాధానం చెప్తే అరగంట క్లాసు తీసుకుంటుంది.
ఇద్దరికీ కాఫీ కలిపి, ఒక కప్పు రంజనికిచ్చి కిటికీ దగ్గర కూర్చుని ఆకాశం కేసి చూస్తూ చప్పరించ సాగింది. ఒకదాన్నొకటి తరుముకుంటూ మేఘాలు పరుగెడుతున్నాయి. ఇప్పటి మనుషుల్లాగే వాటిక్కూడా హడావుడే.. ఆగి నాలుగు చుక్కలు కురిసి వెళ్దామని లేదు. నవ్వుకుంటూ లేచి కప్పు లోపల పెట్టొచ్చింది.
“అమ్మా.. ఇదిగో, నాది కూడా..” కాళ్లు జాపుకుని కూర్చుని, ప్రామ్ లో నిద్రపోతున్న చంటాడి ముద్దుమొహం మురిపెంగా చూసుకుంటున్న కూతురి కప్పుకూడా తీసుకెళ్లి సింకులో పడేసొచ్చింది.. “నన్ననే బదులు వాడిని మంచం మీదో, తొట్లోనో పడుకోపెట్టచ్చు కదా” అనుకుంటూ.
ఎవరికైనా ఎదుటివారి పనుల్లో తప్పులెంచడం సులువే.. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ప్రభావం ఏమిటో.. పార్వతికి అప్పుడే గుర్తుకొచ్చింది. చంటాడు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోనీయడు. రెండుసార్లు డయపర్ మార్చాలి. ఒకసారి నీళ్లు పట్టాలి. తనకి నిద్రలో లేస్తే అరగంటకి కానీ మళ్లీ నిద్ర పట్టదు. రాత్రేనా తన దగ్గర పడుకోపెట్టుకోదు రంజని. పగలంతా ఆఫీసులో అలసి పోయొచ్చి, రాత్రి పదకొండువరకూ వేరే దేశంలో ఉన్న వాళ్లతో కలిసి పని చేసి, అప్పుడు నిద్ర పోతుంది. నిద్రపోయేటప్పుడు, వచ్చి కొడుకుని ముద్దు పెట్టుకుని వెళ్తుంది. పార్వతికి కూడా ఏమీ అనాలనిపించదు. నెమ్మదిగా ఇంకొక ఏడు చూసుకుంటే, డేకేర్ లో వేసెయ్యచ్చని పళ్ల బిగువున భరిస్తోంది.
అల్లుడి దగ్గర్నుంచి ఏ సహాయమూ ఆశించలేదు. ఏదో స్వంతంగా స్టార్టప్ ట.. తెల్లారకుండా వెళ్తే అర్ధరాత్రే రావడం. వారానికోసారి కొడుకుని ముద్దాడడానికి సమయం చిక్కితే గొప్ప.
పార్వతికదే అర్ధం కాదు.. ఇంతింత ఎత్తుభారం పనులు అవసరమా? సగం తగ్గించుకుని, ఆ వచ్చే డబ్బుతో కాస్త మనుషుల్లా జీవించచ్చు కదా! ఒకసారెప్పుడో అంటే. అంతెత్తెగిరింది కన్నకూతురు.
“అంత కష్టపడి కాంపిటీషన్లకి తట్టుకుని చదివి ఇంట్లో కూర్చోడానికా? పైగా.. ఈ సదుపాయాలన్నింటికీ ఇయమ్మైలు కట్టాలి. దానికి డబ్బెక్కడ్నుంచొస్తుంది? అందుకే కదా, నిన్ను ఉద్యోగం మానేసి రమ్మంది. నీకు అలవాటే కదా పిల్లల్ని పెంచడం. ఎంజాయ్ చేస్తావు కూడా. మరెందుకా గొణుగుడు?”
అదంతా తలచుకొని గట్టిగా నిట్టూర్చింది పార్వతి.
అంత మధురమైనదేం కాదు పార్వతి గతం. రంజనికి సంవత్సరం పూర్తయే వరకూ బాగానే ఉన్నాడు కామేశ్వర్రావు. ఏ క్షణంలో ఏ పాము ఎవర్ని కాటేస్తుందో చెప్పలేరెవరూ. పార్వతి పసిదానితో అవస్థ పడుతుంటే, సరదాగా మొదలుపెట్టిన పేకాట వారి జీవితాల్ని అస్తవ్యస్తం చేసేసింది. జీతం అందుకున్న మూడు నాలుగు రోజుల వరకూ ఇంటికే రాకపోవడం.. మిగిలిన చిల్లర మాత్రం మంచం మీదికి విసిరెయ్యడం వరకూ వచ్చింది.
పార్వతికి దిక్కు తోచని పరిస్థితి.. అమ్మింట, అత్తింట కూడా ఎవరూ ఆదుకునే వారు లేరు.
“నీ పాపతో పాటుగా ఇంకా కొందరిని చూసుకుంటే ఉద్యోగినులకి సదుపాయం, నీకు ఆదాయం.” పక్కింటి పిన్నిగారు సలహా ఇచ్చారు, పార్వతి కష్టాలు చూడలేక.
వెంటనే, ఉన్న ఇంట్లోనే ముందు గదిలో “అమ్మ ప్రేమ” అనే డే కేర్ మొదలు పెట్టింది. నిబద్ధతతో పనిచేస్తుండడంతో, త్వరలో పిల్లల సంఖ్య పెరగడం, పెద్ద ఇల్లు తీసుకోవడం ఆయాలని పెట్టుకోవడం జరిగింది. అది పెరుగుతుండగానే, పేకాట సిగరెట్లు ఎక్కువయి, ఒక రోజు క్లబ్బులోనే కన్ను మూశాడు కామేశ్వర్రావు.
ఒకోసారి మనుషులు ఉన్నప్పటికంటే లేనప్పుడే బ్రతుకులు బాగా సాగిపోతాయి. కామేశ్వర్రావు బ్రతికున్నప్పుడు పార్వతికి చికాకులు, చీవాట్లు తప్ప ఇంకేం దక్కేది కాదు. పొద్దున్న లేచి కాఫీ, టిఫిన్ కానిచ్చి బైట పడ్తే రాత్రే రావడం.. డబ్బుల్లేకుండా పేకాటెట్లా అనుకునేది పార్వతి.. ఆడే వాళ్ల వెనుక కూర్చుని ఆనందిస్తుంటాడని తెలిసి గట్టిగా నిట్టూర్చడం తప్ప ఏం చెయ్యలేక పోయింది. అలకలూ, ఏడుపులూ, బెదిరింపులూ, కూతురి ఆటపాటలూ ఏవీ అతని ఆగడాలని ఆపలేకపోయాయి.
రంజని చదువూ, వుద్యోగం, పెళ్లీ.. అన్నీ జరిగి కాస్త ఊపిరి పీల్చుకుందామని పార్వతి అనుకునే సమయంలో వివేక్ వచ్చాడు.
పార్వతిని ఉన్న ఊర్లో అంతా సర్దించేసి తన దగ్గరికి తీసుకొచ్చేసింది రంజని.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. భార్యా భర్తలిద్దరికీ లక్షల్లో జీతాలు. దానికి తగ్గ జీవన విధానం. ముందు సరుకులు తెచ్చుకుని ఆ తరువాత డబ్బు కట్టగల సదుపాయం. అయితే.. ఈ ఆర్ధిక ఆనంద సాగరం ఈదుతూ తాము ఏం కోల్పోతున్నారో తెలుసుకోలేక పోతున్నారు.
పార్వతికి అదే బాధగా ఉంటుంది.
పూర్తిగా పసివాడి పాలన తను కూడా చూడలేకపోతోంది. తను క్రెష్ నడిపేటప్పుడు చేతి కింద మనుషులుండే వారు. ఏటికేడూ వెళ్లే వయసే కానీ వచ్చేది కాదు. అందులో వివ్వీగాడు బొద్దుగా ఉంటాడు. కాసేపు ఎత్తుకుంటే నడుం పీకేస్తుంది. ఆ డయపర్లొకటి.. ఓ కాలేస్తుంటే ఇంకో కాలు తీసేస్తాడు. లేకపోతే ఇంగ్లీష్ యస్ అక్షరంలా తిరుగుతాడు. ఇంక అన్నం పెట్టడానికీ, పాలు తాగడానికీ.. ఇదీ అదీ అని లేదు.. అన్నింటికీ వాడికి తోచిన అల్లరి చేస్తుంటాడు. ఎవరైనా చేస్తుంటే బానే ఉంటుంది వాడి నవ్వులు ఆనందించచ్చు. కానీ.. ఈ వయసులో సాధ్యం అయే పనేనా?
“అమ్మా! రేపట్నుంచీ ఇంట్లోనే. హాయిగా!” సోఫాలో కూర్చుని లాప్ టాప్ తెరుస్తూ అంది రంజని.
అంతలో చంటాడు కదిలాడు. కాసేపు ఒళ్లు విరుచుకోడం అయాక సన్నగా రాగం మొదలెట్టాడు.
చటుక్కున లేచి రంజని తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. ‘మళ్లీ ఆఫీసుపని మొదలు’ అనుకుంది పార్వతి. తప్పేదేవుంది.. తన రోజువారీ కార్యక్రమంలో పడిపోయింది..

*****

“వివ్వీ బాబూ! ఎక్కడా.. రావాలీ..” చేతిలో వెండిగిన్నెలో పెరుగన్నంతో గట్టిగా పిలుస్తూ వచ్చింది పార్వతి.
“ష్.. అమ్మా! గట్టిగా మాట్లాడకు. మీటింగ్ లో ఉన్నా.” రంజని ముక్కు మీద వేలేసి, గదిలోకెల్లింది.. తన ఆఫీసు బల్ల దగ్గరకి. ఇంట్లోంచి పని మొదలుపెట్టి వారం అవుతోంది.
పార్వతి కళ్లలో నీళ్లు తిరిగాయి. అంతలో చంటాడు గట్టిగా ఏడుపు మొదలు పెట్టాడు. విసుగ్గా మొహం పెట్టి వచ్చి, తలుపేసేసింది రంజని. వాడూరుకుంటాడా.. తపతప చేతుల్తో నేల మీద కొడ్తూ, తలుపు దగ్గరే కూర్చుని రాగం పెంచాడు.. మ్మ..మ్మ అంటూ.
గిన్నె బల్ల మీద పెట్టి, బలవంతంగా చంటాడ్ని ఎత్తుకుని ప్రామ్ లో కూర్చోపెట్టింది. వెంటనే ఏడుపు ఆపేశాడు.. గిన్నె, ఇంటి తాళాలు పట్టుకుని వాడి బండి నెట్టుకుంటూ ఇంట్లోంచి బైట పడింది పార్వతి. పార్కులో పిట్టల్ని చూపిస్తూ అన్నం తినిపించి, అటూ ఇటూ తిప్పుతుండగా నిద్ర పోయాడు. నెమ్మదిగా ఇల్లు చేరింది.
“ఎక్కడికెళ్లి పోయావమ్మా? మీటింగయిపోయి అరగంటయింది. వివ్వీ గాడితో ఆడుకుందామంటే నువ్వెక్కడికెళ్లావో తెలీదు..” నిష్ఠూరంగా అంటున్న కూతురి కేసి సుదీర్ఘంగా చూసింది పార్వతి.
రంజని ఇంట్లోనించే పని చెయ్యడం మొదలు పెట్టి పది రోజులయింది.
పార్వతికి వత్తిడి పెరిగిపోయింది. కూతురు ఆఫీసు కెళ్తుంటే నెమ్మదిగా తనకి తోచినట్లు చేసుకునే పని..
ఇప్పుడు ఆవిడ పర్యవేక్షణలో జరగాలి. అంతా ఇంటర్ నెట్ లో చెప్పినట్లుగా. డయపర్ తడిసినప్పుడు మార్చేది.. చంటి వెధవ ఎలాగా ఏడుస్తాడు తడపగానే. ఇప్పుడలా కాదు, రెండేసి గంటలకోసారి మార్చి తీరవలసిందే. వాడు మంచి నీళ్లు కావాలని ఏడుస్తాడు చూపిస్తూ.. ఇవ్వకూడదు. పాలలో ఉన్న నీళ్లు సరిపోతాయిట.
ఇవన్నీ సరిపోనట్లు.. ఇంట్లో ఉంటుంది కనుక వేడి వేడిగా లంచ్ తయారు చెయ్యాలి. పార్వతి తన మటుకూ, రాత్రి మిగిలినవి తినేస్తుంది, వెచ్చబెట్టుకుని.
“ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదమ్మా? ఒక్కరగంట ముందు వండేస్తే, జస్ట్ చపాతీలు కూర చాలు.. ఫ్రెష్ గా తినచ్చు.”
నిజమే.. కానీ ఎందుకింత అలసటగా చికాగ్గా ఉంటుంది? అంత మంది పిల్లల్ని అన్ని సంవత్సరాలు చూసుకున్న తను ఒక్క పాపడిని చూడలేకపోతోందెందుకు? కాళ్లు సాగనని మొరాయిస్తాయెందుకు?
అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే.
లాభం లేదు. ఇలాగే నడుస్తుంటే తనకి పిచ్చెక్కడమో, పెరాలిసిస్ రావడమో ఖరారే.
ఆ రోజున అల్లుడు కూడా ఇంట్లో ఉన్నాడు. చంటాడు పడుక్కున్నాడు. భోజనాలయ్యాయి. వంట చాలా బాగుందని మెచ్చుకుంటూ తిన్నారు. అదే సరైన సమయం అనుకుంది పార్వతి.
“మీ ఇద్దరితో మాట్లాడాలి బాబూ! ఒక గంట, ఫోన్లు, లాప్ టాప్ లు కట్టెయ్యండి.”
ఆశ్చర్యంగా చూస్తూ కట్టేసొచ్చారు.
“నా వల్ల కావట్లేదు ఇక్కడుండటం.” మొదలు పెట్టింది.
“అదేంటమ్మా..” ఏదో అనబోతున్న రంజనిని చెయ్యి పట్టుకుని ఆపేశాడు అల్లుడు.
“నిజమే.. నేను ఖాళీగానే ఉన్నాను. పిల్లలని పెంచడంలో అనుభవం కూడా ఉంది. అది నా వృత్తి. అయితే అన్ని సంవత్సరాలు చులాగ్గా ఆనందంగా చేసిన పని ఇక్కడెందుకు కష్టమవుతోంది? పంటి బిగువున సర్దుకుందామని చూస్తూనే ఉన్నా కానీ.. ఏదో చెప్పలేని బాధ. భరించలేకపోతున్నా. నువ్వు ఆఫీసుకెళ్లేటప్పుడు అంత అనిపించలేదు. అదిగో.. వర్క్ ఫర్ం హోమ్ అని సంతోషంగా చెప్పావు చూడు.. అప్పట్నుంచీ..”
“నేనేం చేశాను?” రంజని నిష్ఠూరంగా అంది.
“నువ్వేం చెయ్యట్లేదు. అదే సమస్య. పిల్లవాడిని దగ్గర కూడా పడుకోబెట్టుకోవు. ఖాళీ ఉన్నప్పుడు ఆడుకుని, వాడి అవసరాలకి నన్ను పిలుస్తావు.రాత్రి మూడుసార్లు లేవాలి. ఈ వయసులో లేస్తే అరగంట పైగా పడుతుంది నిద్ర రావడానికి. కునుకు పడుతుండగానే మళ్లీ లేవాలి. పనిమనిషి, గంట ప్రకారం తన పని చేసుకుపోతుంది. మనూళ్లో లాగా ఇక్కడ బంధాలుండవు.”
రంజని ఏదో అనబోతుంటే చేత్తో ఆగమని చెప్పింది.
“ఇది మనం ఆవేశాల్లేకుండా సామరస్యంగా పరిష్కరించుకుందాం. నాకేదైనా జబ్బు చేస్తే మీకే కష్టం. ఇలాగే సాగుతే తప్పకుండా వస్తుంది ఏదో ఒకటి. పైగా ప్రతీ పనికీ నీకు సమాధానం చెప్పుకోవాలి. అంత మంది పిల్లల్ని పెంచిన నాకు పెంపకం మీద లెక్చర్లు.. నీ ప్రతీ పనినీ నీ వెనుకే ఉండి నీ బాస్ చూస్తుంటే చెయ్యగలవా? అలాగే అయింది నా పని. పైగా పిల్లాడిక్కూడా వత్తిడి పెరుగుతోంది. నువ్వు కనిపించకపోతే ఆ సంగతి వేరు.. కనిపిస్తావు కానీ అందవు. పక్క గదిలో ఉన్నావని తెలుసు, కానీ నీదగ్గరికి రావడానికి లేదు. నీ తలుపు దగ్గరే కూర్చుని కూర్చుని అక్కడే పడుకుంటున్నాడని నీకు తెలుసా? ఇంటి పనిలో ఏమైనా సాయానికి వస్తావా? అల్లుడుగారితో సమానంగా సంపాదిస్తున్నా కదాని వంటింట్లోకే రావు. ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఇద్దరూ పనులు పంచుకోవాలన్నారు కానీ, ఇద్దరినీ పనులు చెయ్యద్దనలేదు కదా! జీవితంలో ఎన్నో ఆటు పోట్లెదుర్కున్నాను. ఇంక నాకు శక్తి లేదు.” మాట్లాడడం ఆపేసి, కళ్లు మూసుకుని రొప్పసాగింది పార్వతి.
కాళ్ల దగ్గర ఏదో కదులుతున్నట్లైతే కళ్లు తెరిచింది.
కూతురు కింద కూర్చుని పార్వతి మోకాళ్ల మీద చేతులు వేసింది.
“సారీ అమ్మా! ఇలా ఓపెన్ అయి మంచి పని చేశావు. ఈ ప్రాజక్ట్ అవగానే.. పదిహేను రోజుల్లో.. నేను ఒక సంవత్సరం ఆఫ్ తీసుకుంటాను. అది త్వరగా పూర్తి చెయ్యడానికి రేపట్నుంచీ ఆఫీసుకెళ్తాను. వర్క్ ఫ్రం హోమ్ కాదు..”
“అమ్మయ్య.. హాయిగా.. ఉంది. సగం భారం తగ్గింది గుండె లోంచి.”
చంటాడు లేచి, ఉయ్యాల కడ్డీ పట్టుకుని నిల్చున్నాడు. పార్వతి లేవబోయింది.
“నేను చూస్తాను. నువ్వు కాసేపు పడుకోమ్మా!” రంజని చటుక్కున లేచింది. వివేక్.. హుషారుగా అమ్మ చేతుల్లోకి దూకాడు.
“ఓరినీ.. నే చేసిందంతా అట్టే పోయిందిరా..”
“అంతే అత్తమ్మా! అంతా అవకాశవాదం. హాయిగా చేయించుకుంటారు.. వెనక్కి తిరిగి చూడరు. అదే న్యాయం ఇప్పుడు.”
ఒళ్ళంతా తేలిగ్గా హాయిగా అనిపించి, సోఫాలోంచి తేలిగ్గా లేచింది పార్వతి.

*————————–*

7 thoughts on ““హాయిగా..”

  1. హాయిగా అలా పిల్లలకి చెప్పగలిగితే చెప్పినా వాళ్ళు అర్ధమ్ చేసుకుంటే అంత కన్నా ఆనందం ఏముంది> కానీ అన్నిచోట్లా కూతుళ్ళు అలా అర్ధం చేసుకోరు. ఎంతసెపూ వాళ్ళకే అన్నీ తెలుసున్నట్లు సలహాలు అమ్మలకిస్తారు. అమ్మ సలహా మాత్రం వాళ్ళకు ట్రాష్ అలాంటి వాళ్ళను నేను చాలా చూసాను.వాళ్ళు పిల్లల్ని కనేది వాళ్ళకు సమయం దొరికినప్పుడు ఎంటర్ టైన్ మెంట్ కోసం అన్నట్లుగా బిహేవ్ చేసే పిల్లల్నీ చూసాను. ఇలాంటివన్నీ చూసిన మనం మనకు నచ్చిన ముగింపు ఇవ్వడం తప్ప నిజాన్ని మనం మార్చలేము.పచ్చి నిజాలను కళ్ళకు కట్టినట్లు చిత్రించారు హేట్సాఫ్.

  2. చాలా బాగుందండి . కూతురు అర్ధం చేసుకుంది తిట్టకుండా నయం.

  3. చక్కటి కథ, ఎంచక్కటి కథనం, హాయిగా చదివించే శైలి.. ప్రస్తుత పరిస్థితులను ఎంతో సున్నితంగా చూపించారు భానక్కా.. అభినందనలు..

  4. ఎంత బావుందండీ కధ! ఇది ఎంత యదార్ధమైన, తరుచుగా ఎదురుకునే సమస్సో మధ్యవయసు వారికి! మీరు కధ చెప్తుంటే కళ్లముందు పరిగెట్టాయి దృశ్యాలు. పిల్లలను స్వార్ధపరులం అనలేము కానీ. , కన్నందుకు పిల్లలకోసం కాస్త కష్టపడాలి కదా! ఆదినిష్టూరం మంచిదన్నట్టు పార్వతి ఓపెన్ అప్ అయ్యి మంచి పని చేసింది. పిల్లాడి చేష్టలు భలే అందంగా వర్ణించారు! మీ కధ గురించి ఏం చెప్పగలం? అంత బాగుంది

    1. ధన్యవాదాలు శశీ. ఇదే అవస్థ ప్రస్తుతం విదేశాల్లో.. చాలా మందికి. కొంత డిగ్రీ తేడాలు అంతే.

Leave a Reply to G.S.Lakshmi Cancel reply

Your email address will not be published. Required fields are marked *