June 14, 2024

Gausips – ఎగిసే కెరటాలు-15_ఆఖరిభాగం.

రచన: శ్రీ సత్యగౌతమి

సింథియాను రిమాండులోకి తీసుకున్నాక, బెయిల్ మీద విడిపించడానికి ఎవరిని సహాయం అడగాలో అర్ధం కాలేదు సింథియాకి. చటర్జీ తో మాట్లాడింది ఫోన్లో పోలీసుల అంగీకారంతో. చటర్జీకి ఉన్నది ఉన్నట్లుగా అంతా చెప్పింది, కాపాడమని ఏడ్చింది. కానీ తానున్నది ఇండియాలో, ఇదంతా జరుగుతున్నది అమెరికాలో. ఇండియానుండి తానెటువంటి మద్ధతు ఇవ్వలేననీ, కౌశిక్ తో మాట్లాడమని చెప్పాడు.

“నేను కౌశిక్ కు ఫోన్ చేశాను. ఏవిటో కాల్ వెళ్ళటం లేదు. తను నాకు దొరకలేదు” అని అన్నది ఏడుస్తూ.

“ఎంత తెలివితక్కువ పన్లు చేసావు సింథియా? నువ్వు కావాలనుకున్నవన్నీ నీకు సమకూర్చాను, పెళ్ళి కూడా చేశాను. నీ కుటుంబం కూడా నీ బాద్యతలు స్వీకరించలేదు… హు.. అయినా నువ్వు వాళ్ళనేనాడు గౌరవించావు గనుక? కనీసం ఇంత చేసిన నా మాటయినా నిలబెడతావనుకున్నాను. చేతులారా పెళ్ళిని పెటాకులు చేసుకున్నావు? ఇంకా ఏమిటి కావాలనుకున్నావు?” అడిగాడు చటర్జీ.

ఏడుపే సమాధానమయ్యింది సింథియాకు. నోరు తెరిచి ఏదో చెప్పబోతోంది చటర్జీ కి … ఇంతలో టైం అయిపోయినదని పోలీసులు ఫోన్ కాల్ ను వారించారు.

ఆ తర్వాత పోలీస్ అడిగాడు … డిడ్ యు గెట్ సంవన్ ఫర్ యువర్ బెయిల్?

యస్… ఐ గాట్ యాన్ ఇన్ ఫర్మేషన్. కుడ్ యు ప్లీజ్ మేక్ అ కాల్ టు థట్ పర్సన్ అండ్ అర్రేంజ్ బెయిల్ ఫర్ మి? … అడిగింది సింథియా .

“ష్యూర్” అని నెంబర్ తీసుకున్నాడు ఆమె నుండి. అది కౌశిక్ నెంబరే. ఆ పోలీస్ ఆ నెంబర్ తీసుకొని అక్కడినుండి వెళ్ళిపోయాడు.

ఒక ఇరవై నిముషాల తర్వాత ఇద్దరు పోలీసు కలిసి వచ్చారు. “డు యు హ్యావ్ ఎనీవన్ ఎల్సెస్ నెంబర్ ఇన్ కేస్ థ వన్ యు గేవ్ డస్ నాట్ వర్క్?”

తన భర్త రాకేష్ నెంబర్ ఇద్ధామా వద్ధా ఇద్దామా వద్దా అని ఆలోచించి ఆలోచించి ఇచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు.

చాలా బాధ పడింది మొదటిసారిగా రాకేష్ గురించి. తను ఎన్ని కలలు కని ఉంటాడు? అతని కలన్నిటినీ ధ్వంసం చేసేసాను. అమెరికా బయలుదేరేటప్పుడు నాన్న చెప్పాడు … భర్తా, పిల్లలు, సంసారం అన్ని చక్కగా సమకూర్చుకొని జీవితం లో సెటిల్ అవ్వమని. వినలేదు…వినలేదు, ఎందుకిలా చేశాను? ఇలా జైలు పాలయ్యాను…. అని మొదటిసారి తండ్రి చెప్పిన మాటను గుర్తు చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది.

తర్వాత ఆమె స్నేహితురాళ్ళు తాను అమెరికాకు బయలుదేరడానికి ముందు … చెప్పిన మాటలను కూడా గుర్తు చేసుకొన్నది…”సింథీ…ఈ పెళ్ళి, గిళ్ళి అనేది ఒక ఉచ్చు. మనలాంటి స్వతంత్ర్య భావాలున్నవాళ్ళము సెట్ కాలేము, ఇవన్నీ కూపస్థమండూకాలకే పరిమితం. సరే అమెరికా వెళ్ళాలంటే అక్కడివాడిని పెళ్ళిచేసుకోవడం ఉత్తమం. దానికి నువ్వు తీసుకున్న స్టెప్ మాత్రం అద్భుతం. ఒకసారి ఉద్యోగం, ఇల్లు సంపాదించేసాక, ఒక పిల్ల పీచో కనేసెయ్ ఇహ రాకేష్ ఎక్కడికీపోడు. తర్వాత ఆ ఉచ్చులోంచి బయటపడిపో, నీ సెటిల్మెంట్స్, నీ మనీ ఎర్నింగ్ గురించే ఆలోచించు. హాయిగా ఉండు, మాతో కంటాక్ట్స్ లో ఉండు, మమ్మల్ని మర్చిపోకు”.

ఆ మాటలు గుర్తొచ్చినవెంటనే తన స్నేహితురాళ్ళకు ఇంటనేషనల్ కాల్ చెయ్యాలని నిర్ణ యించుకున్నది, వాళ్ళు ఏదయినా ఉపాయం చెబుతారేమో అని. పోలీస్ కనబడితే సహాయమడుగుదామనుకున్నది.

తన స్నేహితురాళ్ళు చెప్పిన మాటలనే పదే పదే గుర్తుచేసుకున్నది, కనీసం వాళ్ళు చెప్పినట్లుగా కూడా తాను చెయ్యలేదని చాలా గింజుకుంటున్నది అంతేగాని తాను జైలు కెందుకొచ్చిందనే ప్రశ్నను మాత్రం వేసుకోవడంలేదు. కౌశిక్ ఎందుకు కాంటాక్ట్ లోకి రావడం లేదో ప్రశ్నించుకోవడంలేదు. తాను అరెస్ట్ అయ్యేటప్పుడు అక్కడ లహరి ఎందుకున్నదో ప్రశ్నించుకోవడం లేదు. ఎంతసేపూ తాను ముందు చెయ్యాల్సిన పనులు తన తండ్రి చెప్పినా, స్నేహితురాళ్ళు చెప్పినా, చటర్జీ ఆశించినా తాను పెడ చెవిన పెట్టిందనే పశ్చత్తాపం తోనే మనసునిండా కుమిలిపోతోంది.

ఈలోపు పోలీసులు కనిపిస్తే వాళ్ళకి స్నేహితురాళ్ళ నెంబర్స్ ఇచ్చి వాళ్ళని ఫొన్ లో కలపమన్నది. వాళ్ళు అన్నీ చెప్పినట్లే చేస్తూ, అలా ఆమెకున్న కాంటాక్ట్స్ అన్నిటినీ సేకరించారు. ఒకసారి స్నేహితురాళ్ళందరితో మాట్లాడింది, ఏడ్చింది …

అలా రోజులు గడిచాయి. బెయిల్ అయితే రాలేదు. కౌశిక్ కనబడలేదు, రాకేష్ కూడా కనబడలేదు సింథియాకు. యూనివర్సిటీ ఒక లాయర్ ను ఏర్పాటు చేసింది సింథియాకు. లహరి తరుపున కూడా ఒక లాయర్, పోలీస్ అంతా మందీమార్బలం ఉన్నారు.కేస్ ఫస్ట్ హియరింగ్ కొచ్చింది.

లహరి తరుపు మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం ఆమె పై విష ప్రయోగం (న్యూరోటాక్సిక్) జరిగినట్లుగా తేలింది. దానికి సంజాయిషీ అడిగారు సింథియాను.

దానికీ, తనకు సంబంధం ఏమిటని … తనను అసలు ఎందుకు అరెస్ట్ చేశారని అడిగింది సింథియా.

అప్పుడు ఒక్కొక్కటి ఎవిడెన్సులను లహరి లాయరు కోర్టుకు సబ్మిట్ చేశాడు. లహరి ఆసుపత్రిపాలయ్యాక ఆమె కు జరిగిన టెస్టులు, వాటి రిజల్ట్సు, ఆపై చేసిన డయాగ్నసిస్సులు, ట్రీట్మెంట్స్ మొత్తం వివరాలున్నాయి. వాటిని మరింత సునిశితంగా ఎక్స్ ప్లెయిన్ చెయ్యడానికి డాక్టర్స్ మరియు తదితర సిబ్బందిని ప్రవేశపెట్టారు. అలా వాటిమీదే ఆ రోజుకి సరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ తేదీ అనౌన్స్ చేసి జడ్జిగారు వెళ్ళిపోయారు.

ఇలా వాయిదాలమీద వాయిదాలు జరుగుతూనే ఉంది. ఇరువైపుల అంటే సింథియా లాయరు, లహరీ లాయర్ మధ్య వాదోపవాదాలు జరిగాక … ఆఖరి సాక్షిని ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆ ల్యాబ్ కు చెత్త ఖాళీచెయ్యడానికి వచ్చే మనిషి. అతన్ని చూసి ఆశ్చర్యపోయింది సింథియా “ఇతనేంటి? ఇక్కడకెందుకొచ్చాడని?”

అతడొక నల్ల జాతీయుడు, తాను చూసినది మొత్తం చెప్పాడు. లహరి ఆరోజు కాఫీ త్రాగుతూ తన ఆఫీస్ రూం లొ ఆ కప్ వదిలి, బయటికొచ్చి ఫోన్ మాట్లాడుతుండగా … ఈ సింథియా లహరి రూం లోకి వెళ్ళి ఆమె కాఫీలో ఏదో కలుపుతుండడం చూసానని సాక్ష్యం చెప్పాడు.

లహరి మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు టెస్ట్స్ కు అందని పదార్దమేదో ఆమె శరీరంలో ప్ర్రవేశించిందని తేలింది. ఎందుకంటేవాళ్ళు వాళ్ళు టెస్ట్ చేసిన వాటికి ఆమెలో రియాక్షన్స్ జరుగలేదు. కానీ ఏదో ఆమె బ్రెయిన్ నరాలపై పనిచేసినది, అది రియాక్షన్స్ ఇవ్వడమే కాకుండా ఆమె నరాల కో-ఆర్డినేషన్ ను కూడా తప్పించాయని అర్ధం చేసుకొని అదే రిపోర్ట్ ఇచ్చారు, కోర్టులో డాక్టర్స్ కూడా చెప్పారు. దానికి కౌంటర్ గా డాక్టర్స్ కు కూడా ఎన్నో ప్రశ్నలు సింథియా తరుపు లాయర్, కోర్టు కూడా అడిగింది. ఎందుకంటే అన్యాయంగా ఏ ఒక్కరినీ శిక్షించకూడదనేదే కోర్టు సిద్ధాంతం.

అయితే ఇప్పటివరకూ … లహరి మెడికల్ రిపోర్ట్లకు, ఆ నల్ల జాతీయుడు చెప్పిన సాక్ష్యము తోడయ్యింది. ఇదంతా కోర్టుకు రావడానికి ముందుగానే పోలీసు ఆధ్వర్యం లో జరిపించారు లహరి కుటుంబ సభ్యులు. ఇదంతా సింథియాకు గానీ, కౌశిక్ కు గాని తెలియదు.కానీ యూనివర్సిటీకి తెలుసు, ఈ విషయాలను గోప్యంగా ఉంచి బ్యాక్ గ్రౌండ్ లో ఇదంతా నడిపించారు.

అయినా సింథియా ఈ విషయాన్ని ఖండించింది. తనకెటువంటి సంబంధం లేదన్నది, తానాపని చెయ్యలేదని ఖరాఖండి గా తెలియపరిచింది. దీనితో మరికొన్ని సాక్ష్యాలను కోర్టుకు సబ్మిట్ చెయ్యాల్సిందేగా….

మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ప్రతి వాయిదాలో ఒక క్రొత్త విషయం బయట పడుతూనే ఉంది.

లహరి తరుపున సోఫియా, శామ్యూల్, భర్కా తదితరులను లహరి వైపు ఉన్న సపోర్టింగ్ సిస్టం సింథియాకు మరో రూపంలో ప్రవేశపెట్టింది. ఆమెను నమ్మించడానికి … మొదటిసారి సింథియాను కలిసి వెళ్ళిపోయినతర్వాత అందరూ ఒక హోటల్ లో కూర్చొని … సింథియాకు ఫోన్ చేసి, దాన్ని ఆన్ లోనే ఉంచేసి … వారిలో వారు సంభాషణ జరిపారు. తామందరూ ఒక ఫ్రాడ్ గ్యాంగ్ అని సింథియాను నమ్మించారు. ఆ విషయాన్ని బయటపెడుతూ … తాము రికార్డ్ చేసిన సింథియా మాటలను కోర్టుకు సాక్ష్యాలు గా సబ్మిట్ చేశారు సోఫియా, శామ్యూల్ .

కౌశిక్ ని కూడా ప్రవేశింపజేశారు. కాని అతడు సింథియా … లహరి మీద ఇచ్చిన కంప్లెయింట్స్ పై తానెటువంటి యాక్షన్ తీసుకోలేదనీ, లహరి యొక్క వర్క్ లో ఎట్టి లోపాలు లేవనీ…అందుచేత సింథియా ఇచ్చిన కంప్లైయింట్స్ ని తాను ఇగ్నోర్ చేశానని చెప్పాడు.

సింథియా … ఆ మాటలకు షాక్ తిన్నది. తనకు లహరిపై ఎటువంటి ప్రాబ్లం లేదనీ, ఇదంతా కౌశిక్ ఆడించిన నాటకమని, అతడే నా చేత ఆ కంప్లెయింట్స్ వ్రాయించాడని చెప్పింది. అవే మాటలు సోఫియా, శామ్యూల్ లు కూడా రికార్డ్ చేశారు సింథియా వాళ్ళకు చెబుతుండగా. ఆ రెండూ మ్యాచ్ అయినవి కాబట్టి … కౌశిక్ ఒక నిందితుడే, కాని కౌశికే సింథియా చేత వ్రాయించాడనడానికి సాక్ష్యం లేదు కాబట్టీ కౌశిక్ కేసులోంచి బయటపడ్డాడు. కానీ అతని యొక్క అజాగ్రత్త వల్ల అతనితో కలిసి పనిచేసే సిబ్బందికీ, పరిశోధనలకు రక్షణ లేకపోవడానికి నిమిత్తం యూనివర్సిటీ కౌశిక్ పై తగు యాక్షన్, సిబ్బందిని కాపాడడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు యూనివర్సిటీ ని ఆదేశించింది.

కానీ …సింథియాను వదల్లేదు. పాస్ పోర్ట్స్ ని కూడా తీసేసుకున్నారు. ఈ కేస్ అంతా నడుస్తున్న విధానాన్ని బట్టి … తాను అదే మాట మీద ఉంటే … కోర్టు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంటుంది సాక్ష్యాలకోసం ఎలాగూ… సాక్ష్యాలు దొరక్కపోతే … కేసుని కొట్టేస్తారు అని మాత్రం తన క్రిమినల్ బ్రెయిన్ తో ఆలోచించి అదే పని చేస్తూ కూర్చున్నది.

ఇహ ఆఖరి వాయిదాల్లో సింథియా యొక్క భర్త రాకేష్ ను ప్రవేశ పెట్టి ఎన్నో చిత్రమైన ప్రశ్నలు వేశారు. నిజానికి రాకేష్ లో గొప్ప జాలి ఉంది సింథియా మీద కానీ ఆ జాలి ఈ సమయం లో పనికి రాలేదు. రాకేష్ ని పిలిపించడానికి కారణమేమిటంటే … సింథియా యొక్క క్యారెక్టర్, అలాగే కౌశిక్ తో ఆమెకున్న సత్సంబంధాల గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి పిలిపించారు.

కేసుని తీర్మానించడానికి ముందు సరిపోయినంత సాక్ష్యాలు ఉన్నా, లేకున్నా నిందితులయొక్క పూర్వాపరాలను, ప్రవృత్తిని తప్పకుండా పరిగణన లోకి తీసుకుంటారు, అది ఆ సదరు నిందితులు ఆ తప్పు చేశారు, లేదా చెయ్యగలరనే దాన్ని తప్పకుండా నిర్ణయిస్తుంది. నిందితుల స్వభావమే పెద్ద ఎవిడెన్స్. ఇవన్నీ కూడా సింథియా కు వ్యతిరేకంగానే పనిచేశాయి. రాకేష్ కూడా రక్షించలేకపోయాడు.

ఆఖరికి కోర్టు సింథియా, లహరిపై హత్యాప్రయత్నం చేసుంటదనే నమ్మింది. ఆఖరి తీర్పు తదుపరి వాయిదాలో చెప్పబడుతుందని చెప్పేసింది.

ఎప్పుడూ జీవితం ఎంతో తేలికగా అనిపించేది సింథియాకు. ఒక ఎగిసే కెరటంలానే తాను ఎగిసి ఆకాశాన్నందుకోవాలనుకుందే తప్పా … ఆ ఎగిసేకెరటంకూడా తప్పకుండా క్రిందపడుతుందనే సత్యాన్ని విస్మరించింది. ఆ సత్యాన్ని తెలుసుకున్న సింథియా మొట్టమొదటిసారిగా చాలా భారంగా తిరిగి బోను దిగి పోలీసుల వెంట లోపలికి నడిచింది. చటర్జీ గుర్తొచ్చాడు, భిశ్వా గుర్తొచ్చాడు. ఈసారి మాత్రం … భిశ్వా ఏడుపు తగలడం వల్లే తనకిలా జరిగిందని మాత్రం అనుకోలేదు. తాను ఆనాడు ఆలోచించినది గుర్తు తెచ్చుకొని చిన్నగా విరక్తిగా నవ్వుకున్నది.బాధపడింది. తండ్రి గుర్తొచ్చాడు, తన గత జీవితాన్నంతా గుర్తుకు తెచ్చుకున్నది. అఖరుసారిగా రాకేష్ తో మాట్లాడాలనుకున్నది … మళ్ళీ వద్దనుకున్నది.

(సమాప్తం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *