ఉష …..

రచన:  జి. శ్రీకాంత

 

సూర్యోదయ పూర్వార్ధ సమయం …..

ఉష తొంగి చూసింది…

ప్రియాగమనార్థియై ముంగిట నిలిచింది

తూరుపు దిక్కున నింగిలో ఆమె చీర  కొంగు

నీలాకాశమై  విస్తరించుకుంది

దీర్ఘమైన కురులు దట్టమైన పొగమంచులా పారాయి

ఆమె ధరించిన నగలు నభంలో

నక్షత్రాలై  మిలమిలలాడాయి

సన్నని వెలుగులు చిప్పిల్లగానే

నగల తళుకులు  వెలవెల పోయాయి

చిరు వెలుగులలో చీర కుచ్చిళ్ళు

జేగురు రంగు వెలువరించాయి

అధిగమిస్తున్న సూర్య కాంతులు చొచ్చుకు రాగా

నారంగి, పసుపు, బంగారు వర్ణాలు

చెదరిన మేఘ సముదాయంలా విచ్చుకున్నాయి

అద్దంలో ఆమె సౌందర్యం సముద్ర  తుల్యమైంది

చీర అందాలు అలల వలయాల వలె ప్రస్ఫుటించాయి

మేఘ వర్ణాలు  సాగరంలో ప్రతిబింబమై  మెరిసాయి

రజత కాంతుల అంచులు కెరటాల నురుగునే మరిపించాయి

అరుణోదయ కాంతులు నలువైపులా సంతరించుకున్నాయి

భానుని భవ్య బింబం ప్రియుని వదనమై  ప్రజ్వరిల్లింది

మనోజ్ఞ దృశ్య కావ్యమై హృదయాన నిలిచింది

రాగరంజిత, సిగ్గరి ఉష మటుమాయమైంది !!!

Leave a Comment