March 29, 2024

బ్రహ్మలిఖితం 13

రచన: మన్నెం శారద

అర్ధరాత్రి దాటింది.
ఈశ్వరికెంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు.
పదే పదే వెంకట్ రూపం కళ్ళలో కవ్విస్తూ కనబడుతోంది. అతనే తన భర్తన్న భావన ఆమె మస్తిష్కంలో క్షణక్షణం బలపడసాగింది.
పక్కనే పడుకున్న కుటుంబరావు నిద్రలో ఆమె మీద చెయ్యి వేసాడు. బలమైన సర్పం మీద పడినట్లుగా ఆమె ఉలిక్కిపడింది.
వెంటనే ఆ చేతిని చీదరగా విసిరికొట్టింది.
కుటుంబరావుకి మెలకువ రాలేదు.
ఈశ్వరి అతన్ని పరాయి వ్యక్తిలా గమనించింది.
అతను కొద్దిగా నోరు తెరిచి గురక పెడుతున్నాడు.
డొక్కలు గురక వలన ఎగసెగసి పడుతున్నాయి.
ఈశ్వరికి వెంటనే అతను పూర్వజన్మలో కుక్కని ఓంకారస్వామి చెప్పిన మాటలు గుర్తుకొచ్చేయి.
ఆమె అనుకోకుండా కెవ్వున అరచింది.
కుటుంబరావు ఉలిక్కిపడి లేచి” ఏం జరిగింది?” అన్నాడు.
“ఏం లేదు. ఏం లేదు” అందామె తనలోని గగుర్పాటునణచుకుంటూ.
“కలొచ్చిందా? కాసిన్ని మంచినీళ్ళు తాగి పడుకో” గొణీగినట్లుగా అని అటు తిరిగి పడుకున్నాడు.
ఈస్వరి లేచి ఫ్రిజ్ తెరచి మంచినీళ్లు తాగింది.
తిరిగి భర్త పక్కన పడుకోవాలనిపించలేదు.
వెళ్లి పిల్లల గదిలోకి తొంగి చూసింది.
వాళ్లిద్దరూ గాఢనిద్రలో వున్నారు. వాళ్లు కప్పుకున్న దుప్పట్లు సరిచేసి హాల్లోకొచ్చి నిలబడింది.
ముసురుతున్న ఆలోచనలు ఆమె హృదయాన్ని స్థిమితం కోల్పోయేలా చేస్తున్నాయి.
ఏదో జరిగిపోయిందేదో జరిగిపోయింది.
ఇప్పుడెందుకు తనకి గత జన్మ గురించి తెలియాలి.
ఇప్పుడెలా ఈ నిజాన్ని తెలీనట్లుగా నటించి ముందు జీవితాన్ని గడపగలదు తను.
అందులోనూ తన భర్త గత జన్మలో తన పెంపుడు కుక్కని తెలిసేక అతన్నెలా గౌరవించగలదు. అతని స్పర్శనెలా భరించగలదు.
పైగా క్షణక్షణానికి తన మనసు వెంకట్ వైపు మొగ్గిపోతున్నది.
ఒక్కసారి అహోబిలం వెళ్తే?
అక్కడున్న అభుక్తేశ్వర స్వామి ఏం చెబుతారో?
తన జీవితానికెలాంటి నిష్కృతి చూపిస్తారో?
రేపే వెంకట్‌ని అడగాలి. అతనికి తన ఫోను నెంబరు కూడా ఇచ్చింది. అతనొకసారి తనకి ఫోను చేస్తే బాగుండును.
ఈశ్వరి తన ఆలోచనల్లో తానుండగానే ఫోను రింగయింది.
ఈశ్వరి గబాగబా వెళ్లి రిసీవర్ ఎత్తింది.
“హలో నేను.. వెంకట్‌ని.. నీకూ నిద్ర పట్టలేదు కదూ. నాకూ అంతే!” అంటూ నవ్వేడతను.
ఈశ్వరి హృదయం సంతోషంతోనూ, భయంతోను మరింత వేగంగా కొట్టుకుంది.
భర్త గదివైపు చూస్తూ “ఒక్క నిముషం” అని రిసీవర్ పెట్టి ఆ గది తలుపులు దగ్గరకేసి వచ్చి మళ్లీ రిసీవరందుకుంది.
“నిన్ను నేనొదిలి వుండలేకపోతున్నాను డార్లింగ్!”
ఆ మాట వినగానే ఈశ్వరి శరీరమంతా గోదారి లంకల్లో మొలిచిన రెల్లుగడ్డితో సున్నితంగా నిమిరినట్లు పులకరించింది.
“ఏంటి! మాట్లాడవు. నిన్నిబ్బంది పెడుతున్నానా?” అంటూ రెట్టించేడు వెంకట్.
“అదికాదు. ఇప్పుడీ పరిస్థితిలో మనకీ నిజం తెలియకుండా వుండాల్సింది” అంది అతి నీరసంగా ఈశ్వరి.
“తెలిసినందుకు బాధపడుతున్నావా? అలాగయితే నేను నిన్ను బాధించనులే. ఈ ఊరొదిలేసి వెళ్లిపోతున్నాను” అన్నడు వెంకట్ కంఠంలో బాధని అరువు తెచ్చుకుని.
“వద్దొద్దు. మిమ్మల్ని చూడకుండా బ్రతకలేను. ఇప్పటికే ఇక్కడొక క్షణం వుండలేకపోతున్ననాను” అంది ఈశ్వరి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటూ.
వెంకట్ తన పాచిక పారినందుకు సంతోషిస్తూ “ఎలా మరి! నిన్ను తీసుకెళ్లిపోదామంటే.. నువ్వు పెళ్లయినదానివి. పైగా పిల్లలున్నారు. నాకా సరైన ఉద్యోగం… ఆస్తి లేవు. నిన్నెలా పోషించగలను?”
అతని మాటలకి ఆశ్చర్యపోయింది ఈశ్వరి.
“మరి నిన్నెలా పాతిక వేలు తెచ్చిచ్చేరు?” అనడిగిందాశ్చర్యంగా.
“బెగ్, బారో, ఆర్ ధెఫ్ట్! అన్నాడు. రెండోది చేసేను. నా భార్య కష్టంలో వున్నప్పుడు నేనెలా చూస్తూ ఊరుకోగలను”
వెంకట్ జవాబు విని ఈశ్వరి హృదయం ఆర్ద్రమైపోయింది.
“ఇలా ఎప్పుడైనా ఆ కుక్క మొహంగాడన్నాడా?” అనుకుని మనసులోనే.
“ఈసారి మీరలా నాకోసం అప్పు చేయొద్దు. మాకు చచ్చేంత ఆస్తుంది. కాని మా మేనమామ మూణ్నెల్లకోసారొచ్చి నా నగలు తూకం వేసి ఎంత తరుగొచ్చిందో మరీ చూసుకుంటాడు. ఇకపోతే మా పెదనాన్న రేపోమాపో చచ్చేట్లున్నాడు మంచం మీద. ఆయనకి పెళ్లాం, పిల్లలు లేరు. నేనే అతని ఆస్థికి వారసురాల్ని. ఆ ఆస్తి చేతికొస్తే నేనీ కుక్కమొహంగాణ్ని వదిలేసి తీరతాను” అంది ఈశ్వరి.
ఆమె ఆస్థి వివరాలు వినగానే వెంకట్ మొహం చింకి చేటంతయింది. ఏమి తనదృష్టం. అటు లిఖిత అమ్మని బుట్టలో వేసి కంపెనీ హేండోవర్ చేసుకోవాలి. ఇటు ఈ పిచ్చిదాన్ని వశం చేసుకొని ఆస్తి కాజేయాలి.
“ఏంటి మాట్లాడరు?” అంటూ ఈశ్వరి రెట్టించింది.
“ఆహా! ఏం లేదు కుక్కమొహం గాడెవరా అని ఆలోచిస్తున్నాను” అన్నాడూ.
“ఇంకెవరు? ప్రస్తుతం నా మొగుడే. పూర్వ జన్మలో మనింటి పెంపుడు కుక్కేనట ఇతను. అది తెలిసిందగ్గర్నించి నాకతన్ని చూస్తే కంపరమెత్తిపొతున్నది!”
ఆ మాత విని వచ్చే నవ్వాపుకున్నాడు వెంకట్.
“చీ! ఛీ! నీకేం గతి పట్టింది డార్లింగ్. అది సరే మనం ఒకసరి అహోబిలం వెళ్దాం. ఆ ఓంకారస్వామి మాటలెంతవరకు నిజమో తెలుసుకోవాలిగా.” అన్నాడు.
“నేనూ.. అదే అనుకుంటున్నాను. రెండ్రోజులు మా వూరెళ్తానని శెలవు పెడ్తాను. ఆళ్లగడ్డ కర్నూల్ జిల్లాలో వుందట. ముందక్కడికి వెళ్దామంటే.. మనకెవరో ఒకరు దారి చెబుతారు” అంది ఈశ్వరి.
“అలాగే” అన్నాడు వెంకట్ ఆనందంగా రిసీవర్ క్రెడిల్ చేస్తూ..
*****
వెంకట్ ఫోను చేసి చెప్పిన మాటలు గుర్తొచ్చి లిఖిత హృదయం భగ్గుమంటోంది.
“లిఖితా! మీ అమ్మ నీకు టి.ఎం.ఓ చెయ్యమని నాకు చెప్పింది. వెంటనే నన్ను నీకు తోడుగా వుండమని కొచ్చిన్ వెళ్లమని కూడా చెప్పింది. కాని ఈ రెండూ నేను చేయడం లేదు. డబ్బు డ్రా చేసుకున్నాను. అందులో ఒక్క పైసా కూడా నీకు రాదు. వెళ్తూ వెళ్తూ నా మొహాన వెయ్యి రూపాయలు ముష్టోడి కిసిరినట్లు విసిరి కొడ్తావా? ప్రస్తుతం మీ అమ్మ నా గుప్పెట్లో వుంది. చెప్పాలని ప్రయత్నించేవా ఆ అడవిలో నీకెలానో నీ బాబు దొరకడు. నువ్వొచ్చేటప్పటికి మీ అమ్మ బే ఆఫ్ బెంగాల్‌లో కలిసిపోతుంది. బీ కేర్‌ఫుల్!” అంటూ బెదిరించేడు.
అతని మాటలు విని లిఖిత నివ్వెరపోయింది.
తమ ఇంట్లో ఒక పెంపుడు కుక్కలా తిరిగి, తమ కనుసన్నల్లో పడటానికి అడ్డమైన చాకిరి చేయడానికి సిద్ధపడిన ఈ వ్యక్తిత్వం లేని నీచుడు అకారణంగా ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడో అర్ధమయ్యేసరికి లిఖితలో విపరీతమైన ఉద్రేకం చోటు చేసుకుంది.
ఒక నీచుడి బెదిరింపుకి వణికిపోయే మనస్తత్వం కాదామెది.
వెంటనే ఇంటికి రింగ్ చేసింది.
ఎంత ట్రై చేసినా ఫోను డెడ్ సౌండ్ వస్తోంది.
లిఖిత నిస్పృహగా రిసీవర్ని క్రెడిల్ చేస్తుంటే హోటల్ మేనేజర్ ఆమెవైపు జాలిగా చూసి “వాట్ హేపెండ్?” అనడిగేడు.
జరిగింది చెప్పడం చాలా అనవసరమనిపించింది లిఖితకి.
ఆలోచిస్తూ అతనికెదురుగా బిగించి వున్న అద్దంలోకి అప్రయత్నంగా చూసింది.
వెంటనే ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి.
“జస్టే మినిట్!” అంటూ బయటకొచ్చి ఆ రోడ్డులోనే వున్న ఒక జ్యూయలరీ షాపుకెళ్లింది లిఖిత.
తన చెవులకున్న డైమండ్ హేంగింగ్స్ షాపతని చేతిలో పెట్టి “అయి వాంట్ మనీ. వెరీ క్విక్ డిస్పోసల్” అంది లిఖిత.
అతను వాటిని పరీక్షించి , ఆమె చేతిలో లక్ష రూపాయిలు పెట్టేడు.
ఆమె తెల్లబోతూ “లక్షా?” అంది.
“అంతకంటే రాదు. కావాలంటే ఇంకెక్కడైనా అమ్ముకోండి అమ్ముకోండి” అన్నడతను.
తల్లి తనని డైమండ్ టాప్స్ పెట్టుకోమంటే.. తను ఇష్టం లేక ఎంతో మారాం చేసింది. కాని.. ఇప్పుడవే ఊరుకాని ఊరిలో ఆదుకున్నాయి. ఈ లక్ష రూపాయిలు పట్టుకొని తిరుగుతుంటే.. తన కూడా మళ్లీ ఏ నకిలీ జర్నలిస్టో పడకమానడు అనుకుంటూ వాటిని బాగ్‌లో సర్దుకుని షాప్ ఓనర్ వైపు తిరిగి “థాంక్స్” అంది.
అతడు పళ్లికిలించేడు.
లిఖిత గ్లాసు డోర్ తీసుకొని బయటికి నడుస్తుంటే “ప్రొద్దుటే లక్ష రూపాయలు లాభం!” అనుకున్నాడతను డైమండ్ హేంగింగ్స్ చేత్తో తిప్పి అపురూపంగా చూసుకొంటూ.
ఆమె తిరిగి హోటల్‌కి రాగానే మానేజర్ ఆమెని జాలిగా చూస్తూ “డబ్బు కోసం మీరవస్థ పడుతున్నట్టున్నారు. ఒక పని చెయ్యండి. ఈ హోటల్ బిల్ నేను కడ్తాను. మున్నార్ వెళ్లడానికి ఏర్పాటు చేస్తాను. మీరు తిరిగొచ్చేక నాకు డబ్బిద్దురుగాని” అంటూ వేలికున్న అయ్యప్ప స్వామి ఉంగరం తీసేడతను.
లిఖిత అతనివైపు ఆశ్చర్యంగా చూస్తూ “అదెందుకు?” అంది.
“నేనూ మిడిల్ క్లాస్ మనిషినే! కేష్ లేదు నా దగ్గర. ఇదమ్మేసి అర్జెంటుగా డబ్బు తే!” అన్నాడొక బేరర్‌ని పిలిచి.
లిఖిత తేరుకుని “వద్దొద్దు” అంది.
అతను తెల్లబోతూ “ఏం?” అన్నాడు చిత్రంగా చూస్తూ.
“నా దగ్గర డబ్బుంది. మీ సహకారానికి కృతజ్ఞతలు. నేను బిల్ పే చేస్తాను. ఎంతయింది?” అంటూ బాగ్‌లోంచి ఒక పదివేల కట్ట తీసింది లిఖిత.
మానేజర్ ఆ కట్టవైపు విభ్రమంగా చూసేడు.
“ఎక్కడిది?” అనడగబోయి నాలిక్కరచుకొని బిల్ సిద్ధం చేసిచ్చేడు.
ఆమె బిల్ పే చేసి “నాకో సహాయం చేస్తారా?”అనడిగింది.
“విత్ ప్లెషర్!”
“నా దగ్గర లక్ష రూపాయిలున్నాయి. ఇందులో నేనొక పదివేలు మాత్రం తీసుకొంటాను. మిగతాది మీ దగ్గర దాచాలి.!”
ఆ మాట విని అతను గాభరాపడుతూ “అంత డబ్బే! వద్దండి!” అన్నాడు.
లిఖిత చిన్నగా నవ్వి “ఏం ఆ మాత్రం సహాయపడకూడని మనిషిలా కనిపిస్తున్నానా నేను?” అంది.
“అది కాదు. డబ్బు పాపిష్టిదన్నారు. అంతే కాక చాలా అవసరమైనది కూడా. ఏ క్షణం ఏ బుద్ధి పుడుతుందో. కావాలంటే మీ కూడా బాంక్‌కొచ్చి డిపాజిట్ చేయించి పెడ్తాను” అన్నాడు మానేజర్.
“నాకంత టైము లేదు. పైగా నాకు మీమీద చాలా నమ్మకముంది. ప్రాణం పోయినా మీరు నా డబ్బు తాకరు!”
మానేజర్ ఆశ్చర్యంగా చూసి “ఏంటంత నమ్మకం నా మీద!” అన్నాడు.
లిఖిత నవ్వి “నా నమ్మకానికెలాంటి డెరివేషనూ లేదు. కొందరు అప్పు అని తీసుకొని అడిగితే అపకారం చేస్తారు. మీలో నాకు మానవత్వపు విలువలు కనిపిస్తున్నాయి దట్సాల్!” అంటూ తనో పదివేలు తీసుకొని మిగతా బండిల్స్ అతని చేతికందించింది.
అతను వణుకుతున్న చేతులతో దాన్ని అందుకున్నాడు.
ఆమె ‘థాంక్స్’ చెప్పి రెండడుగులు ముందుకేసి వెనుతిరిగి “మీ పేరు?” అనడిగింది.
“జోసెఫ్”
“మరి మీ చేటికి అయ్యప్ప రింగు..?” ఆమె ఆశ్చర్యపోతూ అడిగింది.
“అది నా నమ్మకం..” అతను నవ్వాడు.
లిఖిత చెయ్యి వూపుతూ బయటకి నడిచింది.
*****
ఈశ్వరి, వెంకట్ ఎలాగోలా కష్టపడి కర్నూలు చేరుకొని అక్కడ బస్సెక్కి ఆళ్లగడ్డ చేరుకున్నారు. ఆళ్ళగడ్డ ఊరు చిన్నదయినా రాయలసీమలో రాజకీయపరంగా పేరు గాంచింది.
ఇద్దరూ బస్సు దిగి అహోబిలం ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూండగా పంచెకట్టుతో ఒక ముసలాయన ఎదురుపడ్డాడు. ఈశ్వరిని చూస్తే ఆయనకి సద్భావన కల్గింది.
“ఎక్కడికెళ్ళాలమ్మా?” అనడిగేడాయన.
“అహోబిలం” అన్నడు వెంకట్ తను కల్గజేసుకుంటూ.
“ఇంతెండలోనా?”అతను రిస్టువాచీ కేసి చూసుకుంటూ అని “సరే. ముందు మా యింటికి రండి. భోంచేసి వెళ్దురుగాని” అన్నాడూ.
అపరిచితుల్ని భోజనానికి రమ్మంటున్న అతని సహృదయతకి వాళ్లాశ్చర్యపోయేరు.
అనుమానంగా చూస్తున్న వాళ్లవైపతను చూసి నవ్వి “నా పేరు నారాయణరెడ్డి. రిటైర్డ్ హెడ్‌మాస్టర్ని. నాకు తోచిన మంచి పని చేయడం నాకలవాటు. రండి” అన్నాడు.
వాళ్లతన్ని అనుసరించేరు.
ఇంట్లోవాళ్లు ఎవరు ఏంటి అని అడక్కుండానే వాళ్లకి మంచి భోజనం పెట్టేరు.
“కాస్సేపు పడుకోండి. మూడింటికి లేచి బయల్దేరితే చల్లగా వుంటుందన్నాడాయన.
ఈశ్వరి వెంకట్ పడుకున్నారన్నమాటేగాని నిద్ర పట్టలేదెవరికీ.
ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.
తొందరగా నిజం తెలుసుకొవాలని ఈశ్వరి, అతి తొందరగా అబద్ధాన్ని నిజంగా నమ్మించాలని వెంకట్ ఆతృతపడుతున్నారు.
మూడు కాగానే గంట కొట్టినట్లు ఠక్కున లేచి కూర్చున్నారు.
రెడ్డిగారమ్మాయి వాళ్లకి వేడివేడి పకోడీలు, టీ తెచ్చిచ్చింది.
అవి తిని టీ తాగి తల దువ్వుకొని ఇద్దరూ క్రింద కొచ్చేటప్పటికి జట్కాబండి రెడీగా వుంది.
“ఒరే సుబ్బా, బండి నిదానంగా నదుపు. అమ్మాయి భయస్తురాల్లా వుంది” అని చెప్పేడు నారాయణరెడ్డి.
ఆయన కూతురు మరచెంబుతో నీళ్లు, ఉడకబెట్టిన వేరుశెనక్కాయలు తెచ్చి ఇస్తూ “బండిలో కాలక్షేపం” అంటూ నవ్వింది.
బండి కదులుతుంటే ఈశ్వరి, వెంకట్ అతనికి నమస్కరించేరు.
“జాగ్రత్త! అహోబిల నృసింహస్వామిని దర్శించండి. ఆ చుట్టుపక్కల ప్రాంతం మనోహరంగా వుంటుంది. చూడండి. కాని.. అక్కడుండే బైరాగుల్ని, స్వాముల్ని కదిలించకండి!”అన్నాడు హెచ్చరికగా మాస్టారు.
వాళ్లిద్దరూ మొహమొహాలు చూసుకున్నరు.
జట్కా ఆ లోపున స్పీడందుకుంది.
“ఈ ఊళ్ళో ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలితే బాంబులేసుకొని చంపుకుంటారంటారు. ఈయనెవరో మనం ఎవరో తెలీకపోయినా భోజనం పెట్టి మర్యాదలు చేసేడు” అంది ఈశ్వరి ఆశ్చర్యంగా.
“అవునమ్మా. ఈ ఊరిని బాంబుల గడ్డని కూడా అంటారు జనం. ఈ గడ్డ మీద జనానికి పౌరుషాలు, పంతాలు ఎక్కువ. కుళ్ళుకి, కావేషాలకి, ఆశకి, అసూయకి చంపుకోరు మా వూరి జనం. అలాగే స్నేహానికి ప్రాణాలిస్తారు. అస్తులు పంచేస్తారు. ఆ మాస్టారయ్య మా వూళ్ళొ గాంధీ మహత్ముడిలాంటివాడు. తనకున్న దానిలో బీదలకి అయిదెకరాల ఇళ్ల స్థలం పంచేడు అదిగో ఆ వచ్చే శారదానగర్ ఆయన దానం చేసిన స్థలమే.” అన్నాడు జట్కా సుబ్బడు.
అతని మాటలు మౌనంగా విన్నారు వాళ్లిద్దరూ.
జట్కా వెళ్తోంటే చల్లని గాలి వీచసాగింది. చెట్ల గుబుర్ల సాంద్రత పెరిగి రోడ్డు పొడుగునా నీడ పరుచుకుంది.
జట్కా ఒక చోట ఆగింది.
“దిగండి. అహోబిలం వచ్చింది” అన్నాదు సుబ్బడు.
ఇద్దరూ దిగేరు.
“నువ్వెళ్లిపో. ఈ రాత్రి మేమిక్కడుంటాం”
“ఇక్కడా?”
“ఏం?”
“రాత్రులుండె సదుపాయాలేం లేవిక్కడ. మిమ్మల్ని అంతా చూపించి తిరిగి తీసుకొచ్చేయమన్నారు” అన్నాడు సుబ్బడు.
ఈశ్వరి వెంకట్ వైపు చూసింది.
“మేమొక రాత్రి ఇక్కడ నిద్ర చేయాలనుకున్నాం. నువ్వెళ్లు” అంటూ డబ్బులివ్వబోయేడు వెంకట్.
సుబ్బడు “నయం. మా రెడ్డిగారు డొక్క చించేస్తారిట్టాంటి పన్లు జేస్తే. వస్తా!” అంటూ జట్కా తోలుకు వెళ్లిపోయేడు.
“పడ” అన్నాడు వెంకట్ ముందుకి నడుస్తూ.
ఈశ్వరి అతన్ననుసరించింది.
ఆ ప్రాంతమంతా దట్టమైన చెట్లతో అల్లుకుపోయి ఆకాశాన్ని కనిపించనీయడం లేదు. పలకలు పేర్చినట్లున్న రాళ్ల సందుల్లోంచి సన్నగా చుక్కలుగా కారుతున్నట్లనిపించే నీరు గుడిముందు ఒక కోనేరుగా మారడం చిత్రంగా అనిపిస్తుందెవరికైనా. ఆ కోనేటి మెట్ళు, చుట్టూ రాతి కట్టడం కూడా పలకలతో నిర్మించినట్లే వుంది. ముఖ్యంగా అందులోని నీరు ఎన్నిసార్లు సెడిమెంటేషన్, ఫిల్టరింగ్ చేసినా అంత స్వచ్చంగా మారదనిపిస్తుంది. ఈశ్వరి ఆ వాతావరణాన్ని పరవశంగా గమనిస్తూ గుహలాంటి గుడిలోకి వెంకట్ ననుసరించి నడిచింది.
ఆ రాత్రే ఆమె జీవితం ఒక భయంకరమైన మలుపు తిరగబోతున్నదని , తన అందమైన సంసారాన్ని తానే చేతులారా భ్రష్టు పట్టించుకోబోతున్నానని ఆ సగటు అమాయకురాలికెంత మాత్రమూ తెలియదు.

ఇంకా వుంది.

2 thoughts on “బ్రహ్మలిఖితం 13

  1. మంచి సస్పెన్స్ లో ఉంచేస్తున్నారు. గోదావరి లంకలలో మొలిచిన రెల్లుగడ్డి తో సున్నితంగా గీకినట్టుండడం! బలే ఉపమానాలు తెస్తారు శారద గారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *