April 20, 2024

మాయానగరం – 41

రచన: భువనచంద్ర

‘గురువు’ గారి అడ్డ మహా గంభీరంగా వుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళతో చిన్న సైజు తీర్ధంలా వుంది. పార్టీ సామాన్య కార్యకర్తల నుంచీ, పార్టీ అధ్యక్షుడి దాకా, చిన్న చిన్న ఫేవర్స్ కోసం పడిగాపులు గాచే నిరుపేదవాడి నుంచి కేంద్రమంత్రివర్యుల దాకా వచ్చిపోతూనే వున్నారు. కారణం ఏమైనా’ప్రెస్’ వాళ్ళకీ,’ఛానల్’ వాళ్ళకీ పండగ్గా వుంది.
“మాదేముంది గురూ, పైన పటారం లోన లొటారం.. ఉత్త డొల్ల.. ఏదో ఈ కార్డుని పట్టుకొని తిరగడం కానీ, మా యాజమాన్యం జీతాలెక్కడ ఇస్తుంది? ఓ మాట చెప్పనా? మేమే నయం , మా ఎడ్వటైజర్ ఏడుస్తూనే ఉంటాడు ఎప్పుడూ వాళ్ళని గిల్లో, వీళ్ళని గీకో, ఎలాగలాగో గ్రాసం సంపాదించకపోతే అతనికి మాత్రం ఎట్టా గడుస్తుంది?” గురూగారు ఇప్పించిన కవర్ ని జేబులో పెట్టుకొని అన్నాడు’అద్వితీయం’. అది అతని కలం పేరు. అసలు పేరు అప్పల్రాజు.
“సర్లే! ఏవున్నా లేకపోయినా మీ పత్రికకు సర్కులేషన్ ఉంది. మాకైతే అదీ లేదుగా. సరేకానీ, మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న పుకారు పక్కన పెడితే, ఇవ్వాళ ఇక్కడ ఇంత సంతగా వుంది కదా , అసలు విషయం ఏమిటంటావూ?” గొంతు తగ్గించి అద్వితీయంతో అన్నాడు’ పరాగం’. ఇదీ కలం పేరే!
“నిజం చెబితే నాకూ తెలీదు” సిన్సియర్ గా మొహం పెట్టి అన్నాడు అద్వితీయం.
“చాల్లెండి వాసన పట్టడం పోలీస్ కుక్క కన్నా మీ ముక్కు వెయ్యి రెట్లు గొప్పదని మాకు తెలీదూ? మీ గుడ్లని మేము కొట్టేస్తామనా?” సుతారంగా అద్వితీయాన్ని వేలితో పొడిచి అన్నది సంఘమిత్ర. ఆవిడా జర్నలిస్టే. మాంఛి యవ్వనంతో కసకసలాడేప్పుడే ఫీల్డ్ కొచ్చింది. వచ్చిన కొత్తలో కుర్ర జర్నలిస్ట్ ల్ని మంచి చేసుకొని వార్తల్ని పుంఖాను ఫుంఖాలుగా వదిలింది. ఇప్పుడు వన్నె తగ్గినా, కన్నెపిల్లలా వగలు పోవడం మాత్రం తగ్గలేదు. అనుభవం కూడా తోడవడంతో వార్తా సేకరణలో ఇప్పటికీ ముందంజలోనే వుంది. మరో లాభం కూడా ఆవిడకు వుంది. కొన్నికొన్ని సమయాలలో తను సంపాదించిన’టిప్స్’ ని’క్లూ’ లని మిగతా జర్నలిస్ట్ లకు చవగ్గా’ అందిస్తుంది.
“సంగూ… నిజ్జంగా తెలీదు.. ప్రామీస్..” తల మీద చెయ్యి పెట్టుకొని అన్నాడు అద్వితీయం. చిన్నగా నవ్వింది సంఘమిత్ర. అందరి ముందు అసలు కథ విప్పడానికతను ఇష్టపడటం లేదని అర్ధమైంది.
“క్షమించాలి… ఇప్పటి దాకా కాఫీ, టీ లతో సరిపెట్టినందుకు గురూగారు మీ అందరికీ సారీ చెప్పమన్నారు. ఉదయమే ఏడుగంటలకు ఠంచనుగా వచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు చెప్పమన్నారు. ఇప్పుడు సమయం ఎనిమిది. హాయిగా మీరు టిఫిన్లు కనిస్తే ఎనిమిదీ ముప్పావుకి గురూగారు మీ ముందు కొచ్చి స్వయంగా మాట్లాడుతారు” సవినయంగా అన్నాడు గురూగారు ఆంతరంగిక శిష్యుడొకడు. అతని వెనకే కాటరింగు వాళ్ళు టిఫిన్ సామాన్లు మోసుకొచ్చారు.
“చాలా అయిటమ్స్ వున్నాయి… ఏమై వుంటాయి?” కుతూహలంగా అన్నాడో చిన్న పత్రికకి సంబంధించిన జర్నలిస్ట్. అతనికెప్పుడూ ఆకలే. అర్నెల్లెకోసారీ జీతంలో సగం ఇచ్చినా ఇచ్చినట్టే అతనికి. అతనికి తెలుసు. ఆ కార్డు చేతిలో లేకపోతే కానీకి కూడా కొరగానని.
“నేను చెప్పనా?” సర్దుతున్న కేటరింగ్ వాళ్ళని చూస్తూ అన్నది సంఘమిత్ర.
“చెప్పు.. కరక్ట్ గా గెస్ చేస్తే పార్టీ” చిన్నగా నవ్వి అన్నాడు మోహన్. అతనో పెద్ద పాప్యులర్ ఛానల్ కి ఇన్చార్జ్. చాలా ముఖ్యమైనవాటికి రావడమే కాదు, సమావేశం అయ్యాక కూడా ప్రధాన వక్తన్ని/ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తాడు. ’లోపలి’ సంగతుల్ని వెలికి తీసి ఎంతవరకు విప్పాలో ఎంతవరకు కప్పాలో అతనే నిర్ణయిస్తాడు. చాలామంది అతన్ని సైలెంటుగా ఫాలో అయ్యిపోతారు. బ్రహ్మిని తమ్మి తమ్మిని బ్రహ్మి చేయగల దిట్ట.
“ఓ.కే.. పులిహోర, ఆవడలు, మిర్చీబజ్జీలూ, సేమ్యా + సగ్గుబియ్యం పాయసం , టమోటా పప్పు, నేతి బీరకాయ పచ్చడి, దోసావకాయ, బంగాళదుంప+ వంకాయా + టమోటా కలగలుపు కూర, గోంగూర పచ్చడి, బెండకాయ స్టఫ్ కూర, కంది పొడి, వూరమెరపకాయలు, అప్పడాలూ, గుమ్మెడికాయ వడియాలు.” నవ్వింది సంఘమిత్ర.
“అంత కరక్ట్ గా ఎలా చెప్పగలిగావు?… అయినా ఇది…” సడన్ గా ఆగాడు మోహన్.
“మోహన్ జీ… నేను చెప్పింది మధ్యాహ్నపు మెనూ… ఎందుకంటే ఒంటిగంటన్నర దాకా మనల్ని ఇక్కడే వుంచుతాడు గురూజీ. ఇహ బ్రేక్ ఫస్ట్ మెనూ ఏమంటే , కంచి ఇడ్లి, పొంగల్ వడ, పెసరట్టు ఉప్మా ఎండ్ పూరీ… కాఫీ, టీ, పాలూ, హార్లిక్స్ మామూలే” చిరునవ్వుతో అన్నది సంఘమిత్ర.
“మై గాడ్ .. యూ ఆర్.. గాడ్ .. అసలు ఇంత స్పష్టంగా ఎలా తెలుసు?” ఆశ్చర్యంగా అన్నాడు మోహన్.
“చూశాక చెప్పండి” లేచి అన్నది సంఘమిత్ర. అందరూ బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేస్తున్న మీడియం హాల్లోకి వెళ్ళారు. టిఫిన్లు కరక్ట్ గా సంఘమిత్ర చెప్పినవే. మెనూ చెప్పినప్పుడు విన్నవాళ్ళు ఆశ్చర్యంగా ఆమె వంక చూశారు.
“మాకుండే రిసోర్సెస్ మాకుంటాయి… అద్దీ…” నవ్వింది సంఘమిత్ర.
“ప్లీజ్ ఏమీ మొహమాటపడకండి. రిలాక్సెడ్ గా టిఫిన్ చేయమని మా గురుగారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.” గురువాణి వినిపించాడు శిష్యరత్న.
అల్లంచెట్నీ, కొబ్బరిచెట్నీ, సాంబారు, కారప్పొడి, నెయ్యి, ఉల్లిపాయ టమోటా చెట్నీలు అద్భుతంగా వున్నాయి. రంగూ, రుచీ, వాసనా కూడా నోరూరించేస్తున్నాయి.
సుష్టిగా లాగించారు పాత్రికేయులూ, ఛానల్ వాళ్ళు,
“మధ్యాహ్నంకి కొంచం ఖాళీ వుంచుకుంద్దాము, లేకపోతే సూపర్ లంచ్ మిస్ అవుతాము.” ఫ్రండ్స్ ని హెచ్చరించింది సంఘమిత్ర.
************
పరమశివం గుండె మండిపోతోంది. జీవితంలో మొదటసారి ఒకడు చెంప పగలగొట్టాడు. నవనీతం విషయంలో ఇది రెండోసారి దెబ్బ తినడం. ఊహూ… అది బ్రతకకూడదు. అనుభవించి అనుభవించి దాన్ని చంపాలి. అలాగే నిన్న కొట్టినవాణ్ణి చంపాలి. పరమకిరాతకంగా చంపాలి. అసలు కారణం ఆ వెంకట్ గాడు… ముగ్గుర్ని చంపితే కానీ పగ తీరదు.” అటూ ఇటూ తిరుగుతున్నాడు పరమశివం. వాడికి కనపడకుండా వాడినే అబ్జర్వ్ చేస్తున్నాడు రొయ్యబాబు. రొయ్యబాబు నిజంగా నీళ్ళల్లో చేపలాంటివాడే!
అయితే ఇతను వలలో చిక్కే చేపలాటోడు కాదు. వలకీ, ఎరకీ కూడా అందనివాడు. అవసరమితే త్రాచుపాములా కూడా మారగలడు. అందుకే సర్వనామం అతన్ని పెట్టాడు పరమశివాన్ని అబ్జర్వ్ చేయడానికి.
సర్వనామం ఓ విచిత్రజీవి. అందరినీ అబ్జర్వ్ చేస్తాడు. అందరినీ దృష్టిలో వుంచుకుంటాడు.”ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు?” అనుకునే మెంటాలిటి.
ప్రతీపనికి తగినవాళ్ళనే పురమాయించాలి. అన్నీ నేనే చేస్తాననుకునేవాడు పరమమూర్ఖుడు. గంటకు వెయ్యి సంపాదించగల వాడు పది రూపాయిల పనికి పోతే వాడంత వెధవ లోకంలో వుంటాడా? అలాగే, బరువులెత్తేవాడి సమర్ధత బరువులెత్తేవాడిదే, పరుగులెత్తేవాడి సమర్ధత పరుగులెత్తేవాడిదే. వీడిని వాడి ప్లేస్ లో పెడితే? అందుకే జాగ్రత్తగా ఎంచుకోవాలి” యీ పాయింటునే సర్వనామం శామ్యూల్ రెడ్డికి చెప్పింది. ఇప్పుడు తానూ అనుసరిస్తున్నది. గత రెండున్నర రోజుల నుంచీ రొయ్యబాబు పని పరమశివాన్ని నీడలా వెంటాడటమే!
కొన్ని నీడలు కనపడతాయి, కొన్ని నీడలు కనపడవు. చేప ఏడిస్తే ఎవరికీ తెలుస్తుంది? కన్నీరు నీటిలో కలిసిపోతుంది గదా! అలాగే, చీకట్లో నీడ జాడ ఎవరికి తెలుస్తుంది? కానీ పాఠకుడా… మనిషి నీడని ఎలాగోలా పట్టుకోవచ్చు… ఓ చిన్న అగ్గిపుల్ల వెలిగించి. కానీ కోటి సూర్యులైనా’మనసు నీడని’ పట్టుకోగలరా?
“అయ్యా… ప్రస్తుతం మన పిచ్చిక ప్రతీకారం మూడ్ లో వుంది. మీ దగ్గరకు రావచ్చా” అని ఎస్. టి. డి బూత్ నుంచి అడిగాడు.
“రా..” పెట్టేశాడు సర్వనామం.
శామ్యూల్ రెడ్డి నంబర్ కాక ఇంకో ఐదు నంబర్లు , అడ్డాలూ వున్నాయి సర్వనామానికి. పని వుంటే గానీ స్కూల్ కి పోడు.
“చెప్పు” రొయ్యబాబుని చూడగానే అడిగాడు సర్వనామం.
“బాస్… ముగ్గుర్ని ఇతను తరచుగా గమనిస్తున్నాడు, ఒకరు నవనీతం, ఆవిడ…”
“ఆవిడ విషయం వదిలేయ్.. మిగతావాళ్ళ గురించి చెప్పు” కట్ చేసి అన్నాడు సర్వనామం.
“వెంకటస్వామి అనేవాడిని, మహదేవన్ అనే పెద్దాయన్ని వీడు వెంటాడుతున్నాడు. మహదేవన్ కూతురు నందిని. వీడు మహదేవన్ కి చుట్టం. పరమ శాడిస్టు. తండ్రి చస్తున్నా, గుక్కెడు నీళ్ళు నోట్లో పొయ్యని పరమ కిరాతకుడు. మీరు నవనీతంగారి సంగతి వదిలేయ్యమన్నా, ఓ విషయం చెప్పక తప్పదు. వింటానంటే చెబుతా” ఆగాడు రొయ్యబాబు. ఓ నిమిషం సైలెంటుగా వున్నాడు సర్వనామం. చివరికో నిర్ణయానికి వచ్చి” సరే చెప్పు… సందేహం అక్కర్లేదులే నీకు తెలిసినవన్నీ నిర్మొహమాటంగా చెప్పు” అన్నాడు
” వన్ మినిట్” జేబులో హాఫ్ బాటిల్ తీసి” మందు తీసుకుంటూ చెప్పనా? మీరీ పని మీద నన్ను పురమాయించిన క్షణం నుంచీ ఇప్పటి దాకా దీన్ని ముట్టుకోలేదు” కొంచం ప్లీజింగా అడిగాడు.
“అలాగే” బీడీ ముట్టించాడు సర్వనామం
ఎవరి బలహీనతలు వారివి. కానీ, ప్రొఫెషన్ లో వుండగా మందు తాగే బలహీనతకి రొయ్యబాబు దూరంగా వుండటం సర్వనామానికి బాగా నచ్చింది. వృత్తికి ఏనాడు మన బలహీనతలు అడ్డు రాకూడదు అనేది సర్వనామం సిద్ధాంతం.
గబగబా ఓ పెగ్గు ఓ గ్లాస్ లో పోసుకొని నీళ్ళు కలుపుకొని గడగడా తాగేశాడు రొయ్యబాబు. ఓ క్షణం సుదీర్ఘంగా గాలి పీల్చుకొని …
“బాస్… శంఖుచక్రాపురంలో వెంకటస్వామీ, పరమశివం, వంట చేయడానికి వెళ్ళినప్పుడు యీ పరమశివంగాడు నవనీతాన్ని చెరబట్టడానికి ప్రయత్నం చేశాట్ట. వెంకటస్వామి అది చూసి ఓ బండరాయి తీసి పరమశివంగాడి బుర్ర పగలగొట్టాడుట. దాంతో వీడి శరీరం చచ్చుబడిపోయింది. అయినా ఏ దేవుడి కరుణతో కోలుకున్నాడు తెలియదు కానీ, కోలుకున్న మాట వాస్తవం. అక్కడ చర్చ్ నుంచి పారిపోయి వచ్చి ప్రస్తుతం’పగ’ తీర్చుకునే ప్రయత్నంలో వున్నాడు. నాకు తెలిసి వెంకటస్వామీ మంచోడూ కాదు, చెడ్డోడు కాదూ, అర్జెంటుగా’ రిచ్” అయిపోవాలనే ఆలోచన గలవాడు. నేను అబ్జర్వ్ చేసినదాన్ని బట్టి అతనికి నందిని మీద, ఆమె తండ్రి మహదేవన్ ఆస్తి మీద కన్నుందని అర్ధమయ్యింది. పరమశివం’పగ’ కి అదే మొదటి కారణం కావచ్చు. రెండో కారణం నవనీతం విషయంలో వెంకటస్వామి అడ్డు రావడం.” సంభాషణ ఆపి మరో పెగ్గు ‘ఫిక్స్’ చేసుకుంటున్నాడు రొయ్యబాబు.
“మరి… మరి… నవనీతం సంగతి” ఆలోచిస్తూ అన్నాడు సర్వనామం.
“నిజం చెబితే ఒకప్పుడు ఆమె బోస్ బాబు ఇలాకా. ఆమె అంటే పడి చచ్చేవాళ్ళు వందల్లోనే వుంటారు. బోస్ బాబు ఇలాకా కావడం వల్ల ఎవరూ ధైర్యం చేయలేదు. చెయ్యరు. ’కల్తీ సారా’ కేసులకి దూరంగా చుట్టం ‘ ఫాదర్ అల్బర్ట్ డేవిడ్’ గారి సంరక్షణలో కొన్ని నెలలు వుంది. అప్పుడే పరమశివంగాడు ఆమె మీద కన్ను వేశాడు.
ప్రస్తుతం ఆమెకీ, బోస్ కి ఏ విధమైన శారీరక సంబంధం లేదు. ఏదో తెలియని వేదనతో జీవితాన్ని గడుపుతోంది ఆమె.’చచ్చేదాక చచ్చినట్టు బ్రతకాలి’ అనేదానికి ఆవిడ జీవితమే ఓ రుజువు. మనిషి మాత్రం నిజంగా’ముత్యమే’ . మనసూ ’ముత్యమే’ దుమ్ముధూళి సంగతి వదిలేయ్యండి. నిత్యం అభిషేకాలు ఎన్ని చేసినా, రోడ్డు పక్కన దేవాళయాల్లోని దేవుళ్ళకి దుమ్ము అంటుకోవడం లేదా? ఇదీ అలాంటిదే” మాట ఆపి , గడగడా గ్లాసు పని పట్టాడు రొయ్యబాబు.
“సరే… ఇన్ని విషయాలు ఎలా సేకరించావు?” కావాలనే అడిగాడు సర్వనామం.
“అయ్యా… మీరు ఈ ప్రశ్న కావాలనే అడుగుతున్నారు. ప్రతి ప్రొఫిషన్ లో కొన్ని కష్టాలు, కొన్ని సులువులు కూడా వుంటాయి. ఎవరు అనుసరించే పద్ధతి వాళ్ళు అనుసరిస్తారు. న్యాయంగా అయితే మా పద్ధతి మేము బయట పెట్టకూడదు. కానీ, నేను చెప్పదలచుకున్నా. కారణం, నేను చేసిన పనిని నాకంటే ఫాస్ట్ గా మీరు చేయగలరు. నాలాంటి వాళ్ళతో కాదు, అవసరమైతే పోలీసుల్తోనే చేయించగలరు. మీ పేరు సర్వనామం. మీరు’టచ్’ చేయని వృత్తంటూ లేదు.’ఛాలెంజ్’ ని ఎదురుకోవడమంటే మీకు మహోత్యాహం. ప్రస్తుతం మీరు అదర్శ విద్యాలయం రెక్టారు శామ్యూల్ రెడ్డి గారు వెల్ విషరూ, ఫండు, ఫిలాసఫర్, గైడూ” నవ్వాడు రొయ్యబాబు.
“నేనడిగింది నా వివరాలు కాదు, కష్టమర్ కెపాసిటి గురించి ఎంక్వైరీ చేశాకే నువ్వు పని మొదలెడతావని నాకు తెలుసు” నిర్లిప్తంగా అన్నాడు సర్వనామం.
“క్షమించాలి. కాస్త అత్యుత్సాహంతో ఎక్కువగా వాగాను. సరే, ఈ వివరాలన్నీ నేను రాబట్టింది ఓ సెక్యూరిటీ గార్డ్ నుంచి. ఆ మనిషే వెంకటస్వామికి పరమశివం గురించి హెచ్చరించింది.” అంటూ మొత్తం వివరాలన్నీ పూసగుచ్చాడు రొయ్యబాబు.
“గుడ్… వాళ్ళ మీద రెండు కళ్ళూ వేసి వుంచు. అవసరమైతే కొందరు ఎసిస్టెంట్లని కూడా పెట్టుకో. కానీ, ఒక్క క్షణం కూడా ఏమరకూడదు.” మరో బీడీ వెలిగించాడు సర్వనామం.
“అలాగే, కానీ ఒక్క మాట చెప్పొచ్చో లేదో తెలీదు. ఆ వివరం మీకు పనికొస్తుందో లేదో కూడా తెలీదు.” మరో పెగ్గు పోసుకొని అన్నాడు రొయ్యబాబు.
” అన్నీ చెప్పు. ఏది పనికొస్తుందో, ఎప్పుడు పనికొస్తుందో, నిగ్గు తేల్చుకోవాలి. ఆ పని నేను చూసుకుంటా” నిర్లిప్తంగా అన్నాడు సర్వనామం. కానీ అతని లోపల విపరీతమైన కుతూహలం.
“నవనీతం ఇంటి వెనకాల వైపు కాపురముంటున్న ఓ ముసలావిడ ఇంఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు నవనీతం గర్భవతి” నెమ్మదిగా కుండ పగలకొట్టాడు రొయ్యబాబు.
ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *