March 29, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 21

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఈ సృష్టిలోని సమస్త జీవరాసులను, బ్రహ్మాండాలను సృష్టించేది పరంధాముడే కదా! ఆ శ్రీహరి సృష్టించిన పదార్ధాలనే.. అంటే… అది లడ్డయినా..వడలయినా..చక్కెర పొంగలయినా… స్వామికి “నైవేద్యం సమర్పయామి” అంటూ నివేదిస్తూ ఉంటాము. ఎంత విచిత్రమో కదా! సమస్తo సృష్టించే ఆ దివ్య లీలా మానుష విగ్రహధారికి ఆ పదార్ధాలనే మనం తయారు చేసిన వస్తువుల్లాగా గొప్పకు పోతూ స్వామికి పెడుతూ ఉంటాము. నీ సొమ్మ్ము నీకే ఇవ్వడం..పైగా అదేదో మా సృజన అయినట్టు సంబరపడ్డమూ…. నాకు చాలా సిగ్గుగా ఉంది సుమా! “నీవే సేసిన చేత నీవే చేకొనుటింతే…ఈవల నీ సొమ్ము నీకే యియ్య సిగ్గయ్యీనయ్యా!” అంటున్నాడు ఈ కీర్తనలో అన్నమయ్య. ఆ వివరమేమిటో తెలుసుకుందాం.

కీర్తన:
పల్లవి: నీవే సేసిన చేత నీవే చేకొనుటింతే
ఈవల నీ సొమ్ము నీకే యియ్య సిగ్గయ్యీ నయ్యా!
చ.1. ఆలుబిడ్డలఁగని యటు దన మగనికి
సీలాన సమర్పణము నేయవలె నటయ్యా,
తాలిమి బుణ్యాలు సేసి దైవమా నే నీకు
యే లీల సమర్పించే విందుకే నవ్వు వచ్చీనయ్యా! ॥ నీవే ॥
చ.2. అంకెల గన్నకొడు కటు దమ తండ్రికిని
తెంకి నీ వాడవని తెలుపఁగవలె నటనయ్యా,
నా లోపల నున్న లక్ష్మీశ నే నీకు
పొంకపు నీ బంటనన్న బునరు క్తయ్యీ నయ్యా! ॥ నీవే ॥
చ.3. తన నీడ యద్దములోఁ దానె యటు చూచి
పనివడి ఊరకే భ్రమయువలె నటయ్యా,
అనుగు శ్రీ వేంకటేశ! ఆతుమలోనున్న నిన్ను
గని మని శరణంటిఁ గడఁ బూజించనేలయ్యా! ॥ నీవే ॥
(రాగం: గుండక్రియ; ఆ.సం.సం.2; 188వ రేకు; కీ.సం.444)

విశ్లేషణ:
పల్లవి: నీవే సేసిన చేత నీవే చేకొనుటింతే
ఈవల నీ సొమ్ము నీకే యియ్య సిగ్గయ్యీ నయ్యా!
పరంధామా! శ్రీనివాసా! నేను చేసే పనులనీ కూడా నీ ప్రేరణ వలన కలిగినవే కదా! నీ వస్తువులను నీవే తీసుకుంటున్నావు. కానీ యితరులు నీకు ఇవ్వవలసిన పని ఉన్నదా! మేము నీకు ఇవ్వడం నీవు గ్రహించడం అంతా ఒట్టి మాయ. అది నైవేద్యమైనా….కైంకర్యమయినా…..నిలువుదోపిడి అయినా అన్నీ నీవే సృష్టిస్తున్నావు. నీ సొమ్మును నీకే సమర్పించవలసి వస్తున్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉన్నది నారాయణా! ఏమిటిది? అంటూ స్వామికి తన మాటలు నివేదన చేస్తున్నాడు అన్నమయ్య.

చ.1. ఆలుబిడ్డలఁగని యటు దన మగనికి
సీలాన సమర్పణము నేయవలెనటయ్యా,
తాలిమి బుణ్యాలు సేసి దైవమా నే నీకు
యే లీల సమర్పించే విందుకే నవ్వు వచ్చీనయ్యా!
భార్య సంసారము చేసి తన ప్రాతివ్రత్యం నిరూపించుకుంటే చాలదా! మరలా బిడ్డలను కనడం అనేది ఎందుకు? ఒక వేళ బిడ్డలు కలిగినా వారంతా ఆయనకు చెందినవారే కదా! ఈ బిడ్డలను నీకు సమర్పిస్తు న్నాను అని ఆమె భర్తకు ప్రత్యేకముగా చెప్పవలెనా? దేవా! అదేరీతిలో… నేను సాగించే పుణ్యకార్యములన్నీ కూడా నీ ప్రేరణతోనే చేస్తున్నాను అన్న విషయం నీకు తెలిసినదే కదా! ఆ కార్యాలు అన్నీ కూడా నీకు చెందినవే తప్ప నావి కానే కావు. నీవు నాకు ఇచ్చిన పుణ్యాలను మరల నీకే నేనెట్లు సమర్పింపగలను? నా సంకల్పాలను కార్యరూపం ధరించేందుకు ఊతము నువ్వే కదా! నీవి నీకే ఇచ్చే ఈ మా వింత చేష్టలకు నాకు నవ్వు గలుగుతున్నదయ్యా! అంటున్నాడు అన్నమయ్య.

చ.2. అంకెల గన్నకొడు కటుదమ తండ్రికిని
తెంకి నీ వాడవని – తెలుపఁగవలె నటనయ్యా,
నా లోపల నున్న లక్ష్మీశ నే నీకు
పొంకపు నీ బంటనన్న – బునరుక్తయ్యీ నయ్యా!
తండ్రిగారి వద్ద ఉన్న కొడుకు అస్తమానం ఆయనతో నేను నీ కొడుకును అంటూ పలుమార్లు చెప్పుకోవలసిన పని ఏముoది? నా హృదయములో సదా కొలువై నన్నేలుతున్న లక్ష్మీపతీ! నేను నీకు పొందికైన సేవకుడనని మళ్ళీ పదే పదే వేరుగా చెప్పుకొనవలసిన అవసరం ఉంది అంటారా? అలా చెప్పుకోవడం పునరుక్తి దోషమే కదా!

చ.3. తన నీడ యద్దములోఁ – దానె యటు చూచి
పనివడి ఊరకే – భ్రమయువలె నటయ్యా,
అనుగు శ్రీ వేంకటేశ! – ఆతుమలోనున్న నిన్ను
గని మని శరణంటిఁ – గడఁ బూజించనేలయ్యా!
స్వామీ! శ్రీనివాసా! ఇది ఎలావుందో తెలుసా? నా నీడను అద్దములో చూచుకొని నేనే ఎవరో మరొకరు ఆ అద్దంలో ఉన్నారని భ్రమపడడం లా ఉంది. ఇది తగునా ? ఓ శ్రీహరీ! శ్రీ వేంకటేశ్వరా! నా అత్మలో నీవున్నావు. అది సత్యం. నిన్ను జూచి పరమానంద భరితుడనై నీకు నేను శరణాగతుడనైనాను అన్నది నిజం. మరల మళ్ళీ ప్రత్ర్యేకించి నీవెక్కడో ఉన్నావని తలుస్తూ నీకు పూజపునస్కారాలు చేయవలెనా? నేనే నువ్వు! నువ్వే నేను! కనుక ఆ అవసరం ఉన్నదా? అంటూ అన్నమయ్య జీవులు ఎన్నటికీ స్వతంత్రులు కారనీ, అన్నీ దేవుని ప్రేరణతో జరిగేవేననీ, అందరి హృదయకమలాలలో ఉన్న శ్రీహరి ఆ పరమాత్ముడొక్కడే! కాబట్టి ఎల్లప్పుడూ సద్భావనతో సేవించి జీవులు తమ జీవితాలని సార్ధకము గావించుకొనాలని అన్నమయ్య నివేదిస్తున్నాడు.

ముఖ్యమైన అర్ధాలు:
సీలాన = శీలనిరూపణ;
తాలిమి = క్షమ, ధైర్యము;
అంకెల = వశము;
తెంకి = స్థానము, సుస్థిరము;
లంకె = లంకియయొక్క రూపాంతరము, లెంక, సేవకుడు;
పొంకపు బంటు = పొందికగల శిష్యుడు; పునరుక్తి = ఒకే మాట మళ్ళీ చెప్పడం;
పనివడి = తెలిసి తెలిసీ, కావాలని;
అనుగు = ముఖ్యుమైనటువంటి.

-0o0-

2 thoughts on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *