March 28, 2024

దూరపు బంధువులు

రచన: మణికుమారి గోవిందరాజుల

చలనం లేకుండా కూర్చొని వున్నాడు కేశవరావు. యెదురుగుండా భార్య వసుధ యెటువంటి బాధా లేకుండా ప్రశాంతంగా పడుకుని వుంది. వచ్చిన బంధువులందరూ అతనికి వోదార్పు మాటలు చెబుతున్నారు.
“యెంత అదృష్ణవంతురాలు! మాట్లాడుతూ మాట్లాడుతూనే అలా పక్కకి వొరిగిపోయిందట. సుమంగళిగా దాటిపోయింది. చాలా కొద్దిమందికి మాత్రమే ఇలాంటి చావు దొరుకుతుంది.”
“ సాయంత్రం కలిసింది. చీకటి పడ్డదాకా మాట్లాడుకున్నాము. భోజనాలయ్యాక కూడా కాసేపు వాకిట్లో మెట్లమీద కూర్చుంది వసుధక్క. ఇక తొమ్మిది దాటుతోంది పడుకుంటాను అని లోపలికి వెళ్ళి గంటన్నా కాకుండా కేశవరావుగారి కేకలకు లోపలికి వెళ్ళి చూసేసరికి అంతా అయిపోయింది” అని పక్క ఇంట్లో అద్దెకు వుంటున్న జ్యోతికి చెబుతుంటేనే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి
“ హార్ట్ అటాక్ అట కదా? ”యెవరో అడిగారు. .
“అవును డాక్టర్ చూసి చెప్పాడు. మాసివ్ అటాక్ అట”
యేది యేమైనా పోయిన ఆమె హాయిగా దాటిపోయింది. ఇపుడు కేశవరావుగారి పరిస్థితి యేంటో పాపం. యెలా తట్టుకోగలుగుతారో? పోట్లాడుకున్నా మాట్లాడుకున్నా ఒకరికొకరు”
“యేమి ఆమె పోతే నేను వుండలేనా? ” మనసులో అనుకున్నాడు కేశవరావు.
“యేంటో? మనం ఇంతమందిమి ఇన్నిరకాలుగా బాధపడుతున్నాము. అతని కంట్లోనుండి ఒక్క చుక్క నీరు, నోట్లోనుండి ఒక్క మాటా రావడం లేదు.”
“నువు మరీను వదినా! మగవాళ్ళు బాధను, ప్రేమను ఎక్స్ ప్రెస్స్ చేయలేరు. అయినా ఆడవాళ్ళు యేడ్చినట్లు మగవాళ్ళు యేడుస్తారా యేంటి? ”
“ఆ రెండూ యేమో కాని మగాళ్ళు కోపాన్ని, చిరాకుని మటుకు వెంటనే పెళ్ళాల మీద చూపిస్తారు. . అది మాత్రం వాళ్ళ హక్కు” యెవరో చాలా కోపంగా అంటున్నారు
“అవునా? నిజంగానేనా? నిజమేనేమో! అందుకేనేమో పోట్లాడుకుంటూనే నలభై యేళ్ళ సంసార జీవితం గడిపారు తామిద్దరూ”
“చీకటి పడకముందే కార్యక్రమం కానిచ్చేద్దాము అన్నయ్యా ! జరిగిపోయినదానికి మనం యేమీ చేయలేం. పద పద” తమ్ముడు హరి వచ్చి చెప్పాడు.
యాంత్రికంగా బ్రాహ్మలు చెప్పినట్లుగా చేయసాగాడు కేశవరావు.
– – – – – –
కేశవరావు, వసుధలది పెద్దలు కుదిర్చిన వివాహం. కేశవరావు చదువుకునే రోజుల్లోనే క్లాస్మేట్ వసంత అనే అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళి చేసుకుందామనుకునే లోపే తండ్రి కుటుంబం మంచిదని, వుద్యోగం చేసే పిల్ల కట్నంతో సహా వస్తుందని వసుధ సంబంధం కుదిర్చేసాడు. ఆ కట్నంతో పెద్ద కూతురి పెళ్ళి చేసాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా డిగ్రీ పూర్తవుతూనే కేశవరావు గుమాస్తా వుద్యోగంలో చేరాల్సి వచ్చింది. అది ఒక అసంతృప్తి కాగా, ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకునే వీలు లేకుండా కట్నం ఆశ చూపి వసుధను తనకు అంటగట్టారనే కోపం ఇంకొకటి. కేశవరావు తండ్రి కొడుకు పెళ్ళికొచ్చిన కట్నంతో కూతురు పెళ్ళి చేసి ఊపిరి పీల్చుకున్నాడు. కాని తండ్రికి యెదురు చెప్పలేక తప్పనిసరిగా చేసుకున్న పెళ్ళితో కేశవరావు సంతోషంగా యేమి లేడు. అసలే కోపిష్టి అయిన కేశవరావుకి అసంతృప్తి తోడై అదంతా యెవరిమీద చూపెట్టాలో తెలీక అన్నిటికి భార్య కారణం అని భార్య మీద చూపెట్టేవాడు. దానికి తోడు మగవాడినన్న అహంకారం ఒకటి. ముగ్గురన్నదమ్ముల మధ్య గారాబంగా పెరిగిన వసుధకి ఆత్మాభిమానం యెక్కువే. భర్త అహంకారాన్ని తట్టుకోవడం కష్టం అయింది. అంతే కాకుండా ఒక్క పని ముట్టుకోని ముగ్గురాడపడుచులు. తనకసలు తెలీదు ఆడపడుచులు పని చెయ్యకూడదని. తనొక్కతే అయినా కూడా యెన్నడు కూర్చుని చేయించుకోలేదు. తనకు కూర్చోబుద్ది కూడా అయ్యేది కాదు. కాని అత్తగారింటికి వచ్చేసరికి పూర్తి వ్యతిరేకంగా వుంది. అత్తగారు చెడ్డదేమి కాదు కాని ఆవిడకేంటంటే కూతుళ్ళు ఇంటి ఆడపడుచులు కాబట్టి కూతుళ్ళు పని చేయకూడదు. మగపిల్లలు వంశోద్ధారకులు. వాళ్ళెందుకు చేస్తారు? ఇక తను అత్తగారేనాయే? ఈ విధంగా ఇంట్లో వున్న తొమ్మిదిమంది సభ్యుల్లో యెనిమిది మంది ఖాళీగా కూర్చుంటే తనొక్కతి వాళ్ళందరికీ చేయడం చాల అవమానంగా అనిపించేది. మామగారికేమి పట్టదు. కోడలు ఉద్యోగం చేస్తే చాలు. కనీసం ఆఫీసునుండొచేసరికైన కూడా యే పని చేయకుండా అలాగే కూర్చునేవాళ్ళు. ఆఫీసు పని చేసొచ్చి యెంతో అలసిపోయేది. కొత్తగా పెళ్ళి అయిన మధురిమలు పంచుకోకుండానే పోట్లాటలు మొదలయ్యాయి. తన తల్లి మాట భార్య వినలేదనే కోపంతో యేకాంతంలో వుండగా వూసులు చెప్పుకునే వేళ వూహించని విధంగా దాడికి దిగేవాడు. ఆ రకంగా కొత్త కాపురం కలహాల కాపురంగానే సాగింది.
– – – – – –
“ అన్నయ్యా! యేమనుకోకురా. . మళ్ళీ కర్మల టైంకి వస్తాము. సౌమ్య పురిటికి వచ్చింది. ఇవాళో రేపో అన్నట్లుగా వుంది. ఒక్కడివి యెలా చేసుకుంటావో యేమిటో. అలాగని మేముండే వీలు లేదు. బాధ్యతలు మాకు ఇంకా పూర్తికాలేదు. ఒంటరివాడివి నువ్వే మా దగ్గరికి వచ్చి వుండరాదూ. అందరం ఒక్కచోటే వుంటాం” తమ్ముడు మాధవ అడిగాడు.
తలవూపి వూరుకున్నాడు కేశవ. . అటూ ఇటూగా తమ్ముళ్ళు మాధవ, హరి, చెళ్ళెళ్ళు పార్వతి, సంధ్య, అరుణ చెప్పేసి వెళ్ళిపోయారు”. భార్య వున్నప్పుడు యెంతో ఆత్మీయులుగా అనిపించారు వీరంతా కూడా. కాని వీరిలో ఇప్పుడు ఆ ఆత్మీయత కనపడటంలేదేమిటో విచిత్రంగా?” అనుకున్నాడు కేశవ . చుట్టూ చూసాడు యెవ్వరూ కనపడలేదు. అందరు వెళ్ళినట్లున్నారు తనకోసం యెవ్వరూ ఆగలేదేంటో. యెక్కడినుండో భార్య అరుపులు వినపడుతున్నట్లుగానే వున్నాయి. భార్య పోతే యెవరూ కూడా బాధపడరా? తనకు కన్నీళ్ళు రావడం లేదు సరే అలాగని హమ్మయ్య పీడా పోయిందిలే అని కూడా అనుకోలేకపోతున్నాడు యెందుకు? గుండెల్లో యేదో భారంగా వుందెందుకో?
ఒకసారి స్నేహితుడి భార్య చనిపోతే ఇద్దరు వెళ్ళారు . చనిపోయిన భార్యను పట్టుకుని విపరీతంగా దుఃఖిస్తున్నాడు అతను. ఆమెతో గడిపిన రోజులన్నీ తల్చుకుని తల్చుకుని యేడుస్తున్నాడు. కాసేపు వుండి ఇంటికొచ్చాక స్నేహితుడిని హేళన చేయడం ప్రారంభించాడు కేశవ.
“అయినా వాడేంటి? ఆడవాళ్ళలా అలా యేడుస్తాడు? నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. అసలు భార్య చస్తే యేడ్చే మగవాణ్ణి వీడినే చూసాను. మగవాడు ఆడంగి వెధవలా యేడుస్తుంటే చూట్టానికి అసహ్యంగా వుంది”
ఇన్నేళ్ళు కాపురం చేసిన భార్య చనిపోతే ఆ మాత్రం బాధ వుండదా? అయినా అందరూ మీలా వుంటారా యేంటి? భార్య యెపుడు పోతుందా అని చూసేవాళ్ళు మీరు”.
“అవునే ! నువు పోతే నాకు హాయి. నేను మటుకు ఛస్తే యేడవను. హమ్మయ్య అని నీళ్ళొదులుతాను. కాదు కాదు యే ఆస్పత్రికో ఇచ్చేస్తాను. . కనీసం వాళ్ళకన్నా వుపయోగపడతావు.
“నిజమే మీకే మాత్రం వుపయోగపడలేదు కదా? నేనిచ్చిన కట్నంతో మీ పెద్ద చెల్లి పెళ్ళి చేసారు. ఆఫీసులో నేను తీసుకున్న లోనుతో మీ రెండో చెల్లి పెళ్ళి, పురుళ్ళు, పుణ్యాలు కానిచ్చారు. మూడో చెల్లి పెళ్ళికి చేసిన అప్పు మొన్న మొన్నటి దాకా తీరుస్తూనే వున్నాము. ముగ్గురు తమ్ముళ్ళను ప్రయోజకులని చేయడానికి నా జీతమూ, జీవితమూ సరిపోయింది. ఇక మీకైతే అన్నిరకాల ఆకళ్ళు తీర్చాను. . ఆఖరికి మీ అమ్మ వుచ్ఛ, నీచాలన్ని యెత్తిపోసాను. యే సందర్భంలో మీకుపయోగపడలేదో చెప్పండి? ఆఖరికి నా తమ్ముళ్ళు నా చెళ్ళెళ్ళు అంటూ నాకు పిల్లలు పుట్టకుండా చేసారు. ఉద్యోగంలో మీకంటే యెక్కడ యెదిగిపోతానో అని యే పరీక్షలూ రాయనివ్వలేదు.” దుఃఖంతో గొంతు పూడుకు పోయింది వసుధకు.
“మరొక్కమాట మాట్లాడావంటే నాలుక చీరేస్తాను. . యెవడికొసం చేస్తావ్? ”
“ఛీ! చదువూ సంస్కారం వున్నవాళ్ళు మాట్లాడే మాటలేనా? భార్యనెలా గౌరవించాలో మీకు తెలీకపోగా యెవరన్నా గౌరవిస్తుంటే అది మీకు హేళన.”
“ఆ నిన్ను పెళ్ళి చేసుకున్నాకే నేను చదువూ సంస్కారం అన్నీ మర్చిపోయాను. ఛీ!” విసురుగా బయటకెళ్ళిపోయాడు .
– – – – – –
తెల్లారింది.
“యేమే! నా మొహాన కాఫీ నీళ్ళేమన్నా పోసేదుందా? నీ గోలే నీది కాని నా గురించిన ఆలోచన వుందా? కాఫీ తాగితే కాని యే పనీ మొదలు పెట్టలేను”
పనిమనిషి రాలేదని సణుక్కుంటూ వాకిలి వూడుస్తున్న వసుధకు సర్రున మండింది. “నేను పోతే మీకు హాయి అంటూంటారుగా? నేను లేననుకుని కాఫీ పెట్టుకుని తాగండి. వీలైతే నా మొహాన కూడా పోయండి.”
“ ఎదురుగుండా దిష్టి బొమ్మలా కనబడుతుంటే లేవని యెలా అనుకుంటాను? వచ్చి కాఫీ ఇవ్వు” కోపంగా అరిచాడు.
సణుక్కుంటూనే వచ్చి కాఫీ ఇచ్చింది. “నేను కాఫీ ఇస్తే కాని మీకు తెల్లారదు. నన్ను తిట్టంది మీకు పొద్దు గడవదు. మగవాడినన్న అహంకారం మీకు ఒళ్ళంతా వుంది”
“వెనకటికి ఓ ముసల్ది నా కోడి కూయకపోతే తెల్లారదు అనుకుందట. అలా వుంది నువు చెప్పేది. ఆ మాత్రం కాఫీ నేనూ పెట్టుకోగలను. కానీ కార్యేషు దాసీ అని మన పెద్దలు చెప్పారు. నువు దాసీ దానివి. చెప్పింది చచ్చినట్లు చెయ్యాలి” హాయిగా కాఫీ తాగుతూ చెప్పాడు.
“అసలు మిమ్మల్ని కాదు మీకు అస్సలు పని చెప్పకుండా పెంచిన మీ అమ్మననాలి”
“మా అమ్మ పేరెత్తావంటే వూర్కోను”
అది అలా అనంతంగా సాగుతూనే వుంటుంది. యెక్కడికో వెళ్ళి ఒపికలు తగ్గాక ఆగుతాయి మొహం కడుక్కుని లోపలికి వస్తూనే కాఫీ రడీగా వుండాలి తనకి. తనకే కాదు తన చెల్లెళ్ళకి కూడా. అయిదు నిమిషాలు లేట్ అయినా వీరంగం ఆడేవారు తాము. ఇక తన చెల్లెలు చేతికి కాఫీ ఇవ్వలేదని తనకంటే పదిహేనేళ్ళు పెద్దదైన వదిన మీద అరుస్తుంటే కూడదని యెన్నడూ వారించక పోగా చెల్లెళ్ళతో కలిసి భార్యను హేళన చేసేవాడు. పడక్కుర్చీలో కూర్చుని కళ్లు మూసుకున్న కేశవకి అన్నీ గుర్తొస్తున్నాయి.
– – – – – –
“అయ్యా కాఫీ!” పనమ్మాయి మంగ మాటతో కళ్ళు తెరిచాడు కేశవ. కాఫీ తీసుకుంటూండగా ఫోన్ రింగయింది. మంగ ఫోన్ తెచ్చి ఇచ్చింది. చూస్తే తమ్ముడు మాధవ.
“యేంట్రా? మాధవా? ”
“అన్నయ్యా! మరి వదినకి కార్యక్రమాలవి చేయడానికి బ్రాహ్మలను మాట్లాడాలి కదా?” నాకేమో రావడనికి అవదు. …”
“చూద్దాం లేరా!” ఫోన్ మధ్యలోనే కట్ చేసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.
“నా వాళ్ళు అనుకుంటున్న వీరెవరూ కూడా మనకు పెద్దతనంలో అక్కరకు రారు. మనకంటూ మన పిల్లలు వుండాలి. ఆర్ధిక ఇబ్బందులు ప్రతి ఇంట్లో వుండేవే. దానికోసం పిల్లల్ని కనడం మానేస్తారా యేంటీ? ఇదెక్కడి వింత? నేనొప్పుకోను”
“నువు ఒప్పుకునేదేమిటి? నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మనం పిల్లల్ని కని మన స్వార్ధం మనం చూసుకుంటే నా బాధ్యతలు యెలా తీర్చగలను? నీ జీతం నా జీతం కలిపితేనే బొటా బొటిగా సరిపోతుంది. ఇక పిల్లలుంటే యెంత ఖర్చు? ”
“ఖర్చు అని పిల్లలు వద్దనుకుంటారా? వున్నదాన్లోనే సర్దుకుందాం. మనం అన్నీ ఆర్చుకుని తీర్చుకునే వేళకు పెంచడనికి మనకు ఓపిక వుండొద్దా? వయసు మళ్ళీ వెనక్కి వస్తుందా? ”
“అదంతా నాకు తెలీదు. ప్రస్తుతం పిల్లలు వద్దు. నువు అబార్శన్ చేయించుకుంటున్నావు. అంతే!” దగ్గరికి వచ్చి బ్రతిమాలుతున్న భార్యను ఒక్క తోపు తోసాడు.
“ అమ్మాఆఆఆఅ!!!!!” కిందపడుతూనే కడుపు పట్టుకుని పెద్దగా కేక పెట్టింది వసుధ.
వులిక్కిపడి పడక్కుర్చీలోనుండి లేచాడు కేశవ. కిందపడ్డప్పుడు తగిలిన దెబ్బతో తాను కోరుకున్నట్లు అబార్శన్ అవడమే కాకుండా శాశ్వతంగా మాతృత్వానికి దూరమైంది వసుధ. కళ్ళనుండి నీళ్ళు ధారగా కారుతున్నాయి కేశవకి.
అది జరిగాక వసుధ యెంతో కృంగిపోయింది. కానీ తానేం చేసాడు?
మంచం మీద ముడుచుకుని పడుకుని కుళ్ళి కుళ్ళి యేడుస్తున్న వసుధ దగ్గరికి వెళ్ళాడు కేశవ. ”యేడ్చింది చాల్లే! చేసిందంతా చేసి ఇప్పుడు యేడ్పులెందుకు? హాయిగా నేను చెప్పగానే ఒప్పుకున్నట్లయితే ఈ విధంగా జరిగేది కాదు కదా? లే! లేచి వంట సంగతి చూడు”గట్టిగా అరిచాడు కేశవ.
“మీరెంతన్నా అరవండి. నేనిప్పుడు లేవలేను. అబార్శన్ అంటే బాలింతతనంతో సమానం. ప్రేమ, గౌరవాలు యెటూ లేవు. మానవత్వం లేని మనుషులు. కాస్తంతన్న జాలి కూడా లేదు. నిన్న నీళ్ళన్నీ మోస్తుంటే చూస్తూ కూర్చున్నారు మీ చెళ్ళెళ్ళు. నా వల్ల కాదు ఇప్పుడు లేవడం . యేం చేసుకుంటారో చేసుకోండి. పస్తులే వుంటారో, వంటే చేసుకుంటారో!”
చివరికి ఆ రోజు యేమి జరిగింది? భార్య ఒక్క చేత్తో చేసే పనిని తామంతా కలిసినా కూడా గందరగోళంగా చేసారు. మొత్తం మీద అన్నం తినేసరికి నాలుగయింది. అపుడైన పడుకున్న మనిషిని లేపి అన్నం పెట్టారా అంటే అదీ లేదు. యెంత జాలి లేని మనుషులు తాము?
– – – – – –
ఒక్కొక్క విషయం గుర్తొస్తున్న కొద్దీ క్రుంగిపోతున్నాడు కేశవ. ఆ తర్వాత వసుధ ఆరోగ్యం చాలా పాడయింది. అయినా కూడా తాము యేమి పట్టించుకోలేదు. యెప్పుడు ఆస్పత్రికి వెళ్ళేదో యెప్పుడు వచ్చేదో. . ఇల్లు, ఇంట్లో చాకిరీ కాలం గడిచిపోయింది. తమ్ముళ్ళు కూడా వుద్యోగాల్లో సెటిల్ అయి, పెళ్ళిళ్ళు చేసుకుని, యెవరి కాపురాలు వాళ్ళు యేర్పాటు చేసుకున్నారు. వాళ్ళల్లో వచ్చిన, వస్తున్న మార్పులను తాను కూడా గమనిస్తూనే వున్నా ఒప్పుకోటానికి తన ఇగో అడ్డం వచ్చేది. తల్లితండ్రి మనవల, మనవరాళ్ళ పెళ్ళిళ్ళు చూసి హాయిగా కాలం చేసారు.
పంపకాలప్పుడు “అన్నయ్యా మేమే నీ పిల్లలం. తండ్రిలా మా బాగోగులు కనుక్కుని మాకు అన్ని వేళలా అండగా వున్నావు. నువు మా దగ్గరే వుండాలి” అన్న తమ్ముళ్ళ మాటలకి పొంగిపోయి తనకంటూ యేమీ లేకుండా చేసుకున్నాడు. ఫలితం తాతల కాలంనాటినుండి వుంటున్న ఇంట్లో తనకంటూ వాటా లేకపోయేసరికి ఇల్లు వదిలి వేయాల్సి వచ్చింది. యెపుడో వుద్యోగంలో చేరిన కొత్తల్లో అందరూ కడుతున్నారని తనతో గొడవపడి వూరికి దూరంగా ఐదు వందల గజాల స్థలం కొన్నది వసుధ. తమ్ముళ్ళ చదువులకు దాన్ని కూడా అమ్ముదామన్నాడు తాను. కానీ వసుధ ససేమిరా వొప్పుకోలేదు. ఆ విషయంగా తామిద్దరి మధ్యా కొన్ని సంవత్సరాలు గొడవ జరిగింది. ఇల్లు వదలాల్సిన పరిస్థితి వచ్చినపుడు ఆ స్థలమే ఆదుకుంది. రిటైర్మెంట్ డబ్బులతో అందులో రెండు గదుల వాటాలు రెండు కట్టి ఒకటి అద్దెకిచ్చి ఒకదాన్లో తాముంటున్నారు. ఆ తర్వాత చిన్నగా రాకపోకలు తగ్గిపోయాయి. తనతో యెంత పోట్లాడినా పిల్లలంటే చాలా ప్రేమ వసుధకి. . అందులో తన మన అన్న భేధం వుండేది కాదు. అందర్నీ ఒకేరకంగా చూసుకునేది. . ఆ మమకారంతో పిల్లలు ఫోన్లు చేయటం లేదనీ, వూళ్ళోకొచ్చినపుడు కూడా రాకుండా వెళ్తున్నారని బాధపడుతుండేది. కాని తను అరిచి నోరు మూయించేవాడు.
వసుధ పోయినరోజు సంగతి గుర్తొచ్చింది. పాత ఇంటి పక్కింటావిడ ఫోన్ చేస్తే మాట్లాడి పెట్టిన వసుధ మొహం చిన్నబోయి వుండడం చూసి అడిగాడు యేంటి సంగతి అని. .
“మాధవ కూతురు సౌమ్య పురిటికి వచ్చిందట. నిన్న సీమంతం చేసారట. మనం కనపడక పోయేసరికి యెందుకు రాలేదా అని అడిగితే దూరంగా వున్నారని పిలవలేదని చెప్పారట . కాని అసలు సంగతి అది కాదు నీకు పిల్లలు లేరు. పురుడొచ్చే సమయంలో నువ్వెందుకని మనల్ని పిలవలేదట . నిండు నెలలతో పూర్ణ గర్భిణి సౌమ్య చాల అందంగా వుందట. సీమంతం సంగతి దేముడెరుగు అసలు కడుపుతో వున్న సంగతే మనకు తెలీదు . పెళ్ళయ్యాక మనం దాన్నసలు చూడనే లేదాయె.” పిల్లల సంగతి వస్తే చాలు వసుధకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.
నిజమే సౌమ్య చాలా అందంగా వుంటుంది. నిదానంగా కుదురుగా వుండే సౌమ్య అంటే అందరికీ ముద్దే. . వసుధకైతే మరీను. సౌమ్య పుట్టినపుడు మాధవ అత్తగారివాళ్ళకు యేవో ఇబ్బందులొస్తే తమ దగ్గరికే తీసుకొచ్చి పురుడు పోసారు. అప్పటినుండి మూదో నెల వెళ్ళేముందు వాళ్ళ ఇంటికి వెళ్ళేవరకు దాన్ని తన చేతుల్లోనే పెంచింది మరి.
“యేమండీ ! నేనేమన్నా అంటే మీకు కోపం. కానీ ఒక్కసారి ఆలోచించండి. నా తమ్ముళ్ళే నా పిల్లలు అన్నారు. . కాని మీ పిల్లలనుకున్న వాళ్ళేమి చేస్తున్నారో చూడండి. మనం తప్ప అందరూ వచ్చారట. మీరంత కాని వాళ్ళెందుకయారో ? కుటుంబాన్ని వదులుకోమని, బాధ్యతలనుండి దూరం అవమని నేనెన్నడు చెప్పలేదు. మన బాధ్యతలని మనం సక్రమంగా నెరవేర్చాము. మరి వీళ్ళేమి చేస్తున్నారు? వీళ్ళకోసమా? ప్రతి స్త్రీ కలలు కనే మాతృత్వానికి నన్ను దూరం చేసారు? వీళ్ళకోసమా? మన దాంపత్య జీవితమంతా కలహాలతోనే గడిపారు? మొగుడు గౌరవం ఇవ్వకపోతే దారిన పోయే కుక్క కూడా ఒసే అంటుందట. నా జీవితంలో ఆనందం లేకుండా చేసారు కదండీ? పెద్దమ్మా నాకది కావాలి . పెద్దమ్మా నాకిది కావాలి . పెద్దమ్మా యే సంగతైనా నీకే మొదలు చెప్పాలనిపిస్తుంది. అంటూ నా వెనకాల తిరిగిన దానికి పెద్దమ్మా నీకో మనవడో మనవరాలో పుట్టబోతున్నారు అని చెప్పాలనిపించలేదా? అక్కా తల్లిలాగా పురుడు పోసావు . నాకు మా అమ్మ తర్వాత నువ్వే అన్న మీ మరదలికి కూడ అనిపించలేదా? అక్కా నీ చేతుల్లో పుట్టిన పిల్ల తల్లి కాబోతున్నదని? లేక నాకు పిల్లలు లేరు గొడ్రాలు కేమి చెప్పేది అనుకున్నారా? మీ తమ్ముడు హరి కొడుక్కి సుస్తీ చేసి హాస్పిటల్లో చేర్పిస్తే నాకు భయం అని కన్నతల్లి ఇంట్లో హాయిగా పడుకుంటే తెల్లవార్లూ వాడిని కంట్లో రెప్పలా చూసుకుని మళ్ళీ ఇంటికొచ్చి ఇంత చాకిరీ చేస్తున్నపుడు గుర్తు రాలేదా నేను గొడ్రాలునని? నీ మాటైతే చక్కగా వింటారు. నువ్వంటే ఇష్టం పిల్లలందరికీ అని పిల్ల మూకనంతా నా మీద పడేసి సినిమాలు, షికార్లు తిరిగినపుడు తెలీదా నేను గొడ్రాలునని? నా బంగారం తాకట్టు పెట్టి, అఫీసులో లోన్లు తీసుకుని వాళ్ళ పిల్లల ఫీజులు కట్తించుకున్నప్పుడు మాత్రం మీరు మమ్మల్ని తల్లిదండ్రులలాగా చూసుకుంటున్నారు అన్న వాళ్ళకు ఆ తలిదండ్రులు ఇంకా బ్రతికే వున్నారని గుర్తులేదా? అల్లుడి వుద్యోగం పోయింది నువిచ్చావని తెలిస్తే అభిమానపడుతుంది అని నా పేరు చెప్పకుండా యెన్ని సంవత్సరములు అత్తయ్య డబ్బులు తీసుకెళ్ళి కూతురుకిచ్చారు? మనవాళ్ళు అన్న ప్రేమతోనే కదా అవన్నీ చేస్తాం? మీరు కట్టిన తాళికి కట్టుబడి కట్టు బానిసలాగా చాకిరీ చేసాను. ప్రేమ ఇస్తే ప్రేమిస్తారంటారు. . మరి మరి నాకేమి ఇచ్చారు మనోవ్యధ తప్ప? నేనేమి చేసానని నన్ను ఇంతగా ద్వేషించారు? మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళిచేసుకోలేక పోయారని మీ అసహాయత, కోపం. కట్నం ఆశ పెట్టి నన్నిచ్చి పెళ్ళి చేసారని మీ నాన్న మీద చూపలేక నా మీద కోపం. మీకున్న కోపానికి యే విధంగా కూడా నేను బాధ్యురాల్ని కాదు. అయినా అంత కోపాన్ని నా మీద చూపించి మీ జీవితాన్ని కూడా అశాంతి పాలు చేసుకున్నారు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండీ. నా వాళ్ళు అంటూ మన జీవితమంతా వాళ్ళకు ధార పోయించారు. ఇప్పుడేమి జరిగింది. అందుకే నేను అంతగా చెప్పాను మన పిల్లలంటూ వుండాలని. ఒక్క సంగతి దేవుణ్ణి ప్రార్ధించుకోండి. నాకన్నా ముందు మీరే పోవాలని. గద్దరిదాన్ని యెలాగన్నా బ్రతగ్గలను. మీకే కష్టమంతాను. ఒకవేళ నాకేమన్నా అయ్యి నేనే ముందు పోతే మీరు శ్రమపడకండి. మీరన్నట్లు హాస్పిటల్ కే ఇచ్చేయండి. బతికున్నప్పుడు సరిగా చూడకపోయినా పోయాక కర్మలు బాగా చేయాలనే నమ్మకం మీకున్నా నాకేమాత్రం నమ్మకాల్లేవు. . నేనడిగిన ప్రశ్నలకి ఒక్కదానికన్నా సమాధానం చెప్పగలిగిన రోజున, మీరనుకుంటున్న ఆత్మీయులు మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక వారం రోజులు ఉంచుకున్నప్పుడు, అయ్యో ఇన్నాళ్ళు నాతో కాపురం చేసింది. నా కష్టసుఖాల్లో పాలు పంచుకుంది అని మీరు మనః స్పూర్తిగా అనుకుని నాకోసం ఒక కన్నీటి చుక్క విదిల్చిన రోజు చాలు నా ఆత్మ శాంతిస్తుంది. అంతకంటే మీరేమి చేసినా జాగ్రత్త మిమ్మల్ని దయ్యమై పీక్కు తింటాను” నవ్వింది వసుధ.
“యేంటో యేదో మాట్లాడేస్తున్నాను. ఒక్కసారిగా మనసంతా వికలమై పోయిందండీ. మనుషులు ఇలా యెలా మారిపోతారు? కాలం గడుస్తున్న కొద్దీ ముందున్నంత వుండదు. కానీ మరీ ఇలా కరివేపాకులా తీసేస్తారా? మనం యేమడిగాము? మణులూ మాణిక్యాలు అడిగామా? లేక ఇక్కడికొచ్చి మనకు సేవ చేయమన్నామ? ఒక ఫోన్ కాల్. ఒక ఆత్మీయమైన పిలుపు. మీకు మేమున్నాము అని ఒక ధైర్యము ఇవే కదా మనం ఆశించేది? ”మాట్లాడి మాట్లాడీ అలసిపోయిన వసుధ మొహం కడుక్కొచ్చి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది.
“యేంటీ! మనం దూరం వున్నాం కాబట్టి దూరపు బంధువులయ్యమని పిలవలేదా? బాగుందండీ మీకొచ్చిన బిరుదు. మెళ్ళో వేసుకుని వూరేగండి” పకపకా నవ్వింది వసుధ . నవ్వుతూనే అలా పక్కకి ఒరిగిపోయింది
“వసుధా!! గట్టిగా పిలుస్తూ లేచాడు కేశవ. తప్పు సవరించుకునే అవకాశం లేకుండా తిరిగిరాని లోకాలకు వెళ్ళిన భార్య మీద కొత్తగా కలిన ప్రేమో లేక మారిన తనవాళ్ళ మనస్తత్వాలను కొత్తగ్గా గమనించడం వల్ల గుండే పగిలిందో ఆకాశం చిల్లు పడ్డట్లుగా గుండెల్లో భారమంతా పోయేట్లుగా వెక్కి వెక్కి యేడవసాగాడు కేశవ.

14 thoughts on “దూరపు బంధువులు

  1. Excellent story,a heart touching story.Atleast those who read the story should understand the feelings of their better half.A woman’s sacrifice cannot be described more than this story.It should be an eye opener for every husband.Life is beautiful but short,enjoy life in the company of your better half.

  2. కథను దృశ్యరూపంలో చూపించావు. చాలా బాగుంది మణీ. అభినందనలు..

  3. entha sahajanga, manasuku hathukupoyela undo ee katha.manasuku pattinchuku chadivithe konthamandi jeevithaalaina sukhamayamouthayi…hats off ….

  4. Super Story. Sequence is extraordinary. Kallallo neellu teppinchindi. Na kanna meeru mundu povalani Bhagavntunni prardinchadi… Entha gudartham imidi vundi. Super

  5. చాలా బాగుందమ్మా కధ. కానీ ఇంత పాషాణ హృదయులుంటారా నిజ జీవితాలలో అనిపించింది.

  6. చాలా బాగుంది. బాగా రాసావు మణి ఇలాంటి వాళ్ళు ఎంతమందో

  7. కథ చాలా బాగుంది ఇప్పుడు సమాజంలో జరుగుతున్న సంఘటనలు కళ్లకు కట్టినట్లు వ్రాసారు

Leave a Reply to వెంకట అద్దంకి Cancel reply

Your email address will not be published. Required fields are marked *