March 28, 2024

బుద్ధుడు-బౌద్ధ మతం

రచన:  శారదా  ప్రసాద్

​బౌద్ధ మతం ప్రపంచంలోని ముఖ్యమైన మతాలలో ఒకటి. మొత్తం ప్రపంచంలో బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు 23 కోట్లనుండి 50 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా.బౌద్ధంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి – మహాయానము, థేరవాదము. తూర్పు ఆసియా, టిబెట్ ప్రాంతాలలో మహాయానం (వజ్రయానంతో కలిపి) అధికంగా ప్రాచుర్యంలో ఉంది.”బుద్ధుడు అట్టడుగువర్గాల విముక్తి ప్రధాత. రాజకీయ మార్గదర్శి’’ గౌతమ బుద్ధుని పైనా, ఆయన సామాజిక కార్యాచరణ పైనా విస్తృత పరిశోధన చేసిన సి.ఎఫ్. కొప్పన్ అన్నమాటలివి. దేశదేశాల సామాజిక పరిశోధకులు, శాస్త్రవేత్తలు వందలాదిగా పరిశోధనా గ్రంథాలను వెలువరించారు. మన దేశంలో దామోదర్ ధర్మానంద్ కోశాంబి, దేవీప్రసాద్ చటోపాధ్యాయ, రాహుల్ సాంకృత్యాయన్, బి.ఆర్. అంబేడ్కర్, రొమిల్లా థాపర్ లాంటి వాళ్లు వారిలో ముఖ్యులు.

క్రీ.పూ. 566లో సిద్ధార్థుడుగా జన్మించిన గౌతమ బుద్ధుడు క్రీ.పూ. 485 వరకు జీవించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. బుద్ధుడు అత్యంత నిర్మొహమాటంగా యజ్ఞ, యాగాలను నిరసించాడు. అవి ఆగిపోవడానికి ఆయన చాలా శ్రమించాడు. ఎవరి నుంచీ ఏ వస్తువునూ బలవంతంగా తీసుకోరాదాని చెప్పాడు.ఇది కూడా చాలా ముఖ్యమైనది. వైదిక వర్గం స్వర్గం, నరకం, పునర్జన్మ, పాపకర్మల పేరిట కానుకలను తీసుకోవడాన్నిఇది నిరోధించింది. బుద్ధుడు ప్రత్యామ్నాయ ఆచరణను రూపొందించారు. బౌద్ధాన్ని ఆచరించే భిక్షువులు ప్రజలు ఏది ఇస్తే అదే తినాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఖరీదైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు తీసుకోరాదని నిబంధన విధించారు.వైదిక వర్గం పట్ల అయిష్టం కలిగిన ప్రజలకు సహజంగానే బౌద్ధం పట్ల గౌరవాదరాలు పెరిగాయి.లైంగిక అసభ్య కార్యకలాపాలకు పాల్పడకూడదని బుద్ధుడు ప్రబోధించారు.నాటి వైదిక వర్గం దేవుడి పేరుతో, మహిమల పేరుతో ప్రజల అజ్ఞానాన్ని సొమ్ముచేసుకొని తమ ఉనికిని సుస్థిరం చేసుకోవాలని చూసింది.బుద్ధుడు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాడు.

ప్రజలు శక్తివంతులని, వాళ్ల భవిష్యత్తుని వాళ్లే నిర్మించుకుంటారని, అందుకు దేవుడి లాంటి అతీత శక్తులు కారకులు కాదని చాలా ఖరాఖండిగా చెప్పాడు.మద్యం లాంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండమని కూడా చెప్పాడు. కుల అసమానతలను కూడా బుద్ధుడు వ్యతిరేకించాడు.గౌతమ బుద్ధుడు బోధించిన ధర్మ సూత్రాలు బౌద్ధానికి మూలాధారం. త్రిపిటకములు అనే శాస్త్ర గ్రంథం బౌద్ధానికి ప్రధాన ఆధారమని అధికులు విశ్వసిస్తారు. ఇందుకు అదనంగా మహాయాన బౌద్ధులు “మహాయాన సూత్రాలు” అనే రచనను విశ్వసిస్తారు.

బుద్ధుడు సమాజాన్ని ఒక అవగాహనతో జీవించే సహజీవనాన్ని అందుకు సంబంధించిన సూత్రాలను, ఆచరణలను ప్రవచించాడు. ద్వేషం ద్వేషంతో చల్లారదు. అది ప్రేమతోనే సాధ్యం అన్నాడు. వ్యక్తి తన జీవితంలో నిరాడంబరంగా ఉండాలని, సంపద కూడబెట్టడం ద్వారా స్వార్థం పెరుగుతున్నదని, రేపటి గురించి కాకుండా నేటి గురించి ఆలోచించాలని చెబుతూ వచ్చాడు.బౌద్ధం భారతదేశంలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. అనేక దేశాల్లో మొదటి మతంగా చాలా దేశాల్లో రెండు, మూడు స్థానాల్లో ఉంది.తత్వశాస్త్రానికి మౌలికసూత్రం మనిషికి మరో మనిషికి, మనిషికి – సంఘానికి, మనిషికి – ప్రకృతికి ఉండే అంతస్సంబధాలను పెంచుకోవడమే. ఈ అంశాలన్నిటి పట్ల బౌద్ధం చాలా తీవ్రంగా పనిచేసింది. ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించే దృక్పథాన్ని రూపొందించింది.

హిందూమతం హింసతో జంతుబలులు చేస్తూ యజ్ఞయాగాదులు జరుపుతూ ఉన్న రోజులలో బౌద్ధం పుట్టింది. అహింసావాదం ప్రచారం చేసింది. సంఘంలో ఉన్న హెచ్చుతగ్గులు పోవాలన్నది, స్త్రీపురుషులు సమానం అనీ, మానవులంతా ఒకటేనని అన్నది బౌద్ధం బోధించింది. ప్రజలు బౌద్ధాన్ని ఆరాధించారు. ఆదరించారు. అనుసరించారు.తెలివిగా బుద్ధుడు కూడా దశావతారాల్లో ఒక్కడన్నారు.దేవుడు అనే భావనను దూరం పెట్టిన బుద్దుడినే దేవుడిగా మార్చారు . కాని బుద్ధుడి భావాలు అమలుపరచలేదు. సమానత్వం అనే మూలభావాన్ని ఆచరించలేదు. కాని బౌద్ధాన్ని పారద్రోలగలిగారు.క్రీ.పూ. 6 వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు, అంతకు కొంచం ముందుగా జైన మహావీరుడు, ఈ వర్ణ వ్యవస్థను వ్యతిరేకించి, అట్టడుగు వర్గాలకు ఈ వేదమత దోపిడీనుండి విముక్తిని చూపించారు. దానితో, వేద మతం దాదాపుగా కనుమరుగైపోయి, బౌద్ధ, జైనాలు పూర్తిగా భారత దేశం అంతటా విస్తరించాయి. బుద్ధుడు భౌతిక వాది. సృష్టికర్త అనేవాడు లేడనీ, దైవ ఆరాధన నిరుపయోగమనీ, కోరికలే అన్ని కష్టాలకూ కారణమనీ ఆయన బోధించాడు. అయితే బుద్ధుడు చనిపోయిన తరువాత దాదాపు 400 ఏళ్ళలో, మహాయాన బౌద్ధం ప్రాముఖ్యత సంతరించుకున్న తరువాత బుద్ధుని భగవత్‌ స్వరూపునిగా పూజించటం ప్రారంభం అయ్యింది.

బుద్ధుని జన్మస్థలం లుంబినీ వనం. క్రీ.పూ. 563వ సంవత్సరం, వైశాఖ పూర్ణిమ రోజున అతడు జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి సిద్ధార్థుడు అని నామకరణం చేశారు. బుద్ధుడు జన్మించిన వెంటనే తల్లి మరణించడంతో సవతి తల్లి గౌతమి ప్రజాపతి అతడిని పెంచింది.దీనికి కృతజ్ఞతగానే సిద్ధార్థుడు గౌతముడిగా పిలుపించుకున్నాడు.చిన్న వయసులోనే యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడే రాహులుడు. సిద్ధార్థుని సవతి తల్లి కుమారుడు దేవదత్తుడు. సిద్ధార్థుని జీవితంలో సంభవించిన నాలుగు సంఘటనలు అతడికి ప్రాపంచిక సుఖాల పట్ల విరక్తిని కలిగించాయి.ఒకసారి వృద్ధుడ్ని, రోగిని, శవాన్ని, యతిని చూచి భౌతిక జీవనం పట్ల విరక్తి కలిగింది . శాశ్వతమైన ఆధ్యాత్మికతకు సంబంధించిన పరమార్థాన్ని ఆకళింపు చేసుకోవడానికి ఇల్లు విడిచి పెట్టాడు.ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం బుద్ధగయలో ఉన్న బోధి వృక్షం కింద తపస్సుచేసి జ్ఞానోదయాన్ని పొందాడు.ఈ క్రమంలో అతడు గౌతమ సిద్ధార్థుడు కాస్తా గౌతమ బుద్ధుడయ్యాడు. దీనినే ‘మహాసంబోధి’అని పిలవడం జరుగుతోంది. ఆ కారణంగా ప్రస్తుతమున్న రావివృక్షం (బోధి వృక్షం) బౌద్ధులందరికీ ఆరాధ్య వృక్షరాజమైంది.

బుద్ధుడు నాలుగు ఆర్యసత్యాలను ప్రవచించాడు.దుఃఖము, దుఃఖ సముదయము, దుఃఖనిరోధము, దుఃఖ నివారణోపాయం అనే నాలుగు ఆర్య సత్యాలను అష్టాంగ మార్గాల ద్వారా సాధించాలి. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వచనము, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి అనే ఈ ఎనిమిది అంశాలతో బౌద్ధ ధర్మం, మతం ఏర్పడింది. బుద్ధుని ఆశ్రయించిన వారు బౌద్ధులయ్యారు. బుద్ధుని ధర్మాచరణ – సమత అన్నివర్గాల వారిని ఆకర్షించింది. బుద్ధుడు కులవ్యవస్థను నిరాకరించాడు. ధర్మాన్ని, జ్ఞానాన్ని పొందడానికి అందరూ అర్హులేనని ప్రకటించాడు.అన్ని ప్రాంతాలకు పాదచారియై ప్రయాణిస్తూ చెట్లకింద నివాసం ఉంటూ, రోజూ భిక్షాటన చేసి, ఒక పూట మాత్రమే భోజనం చేసి, జీవితాన్ని, ధర్మాన్ని నియమబద్ధంగా నడిపాడు.

నిమ్నవర్గాలకు చెందిన ఉపాలి, సోపాకుడు, సుప్పియుడు, సుమంగలుడు, శకటాలుడు, డంకుడు, పృథక్కుడు తదితరులను తన శిష్యులుగా చేసుకున్నాడు. బుద్ధుడు అహింసను,శాంతిని బోధించాడు.ఒకరోజు ఒక వ్యక్తి  బుద్ధుడి వద్దకు వచ్చి ‘నాకు సంతోషం కావాలి’ అని కోరాడు. అప్పుడు బుద్ధుడు ,”నీ వాక్యంలోని ‘నాకు’ అనే మాటను తొలగించు, అది అహంకారానికి సంకేతం.అలాగే ‘కావాలి’ అనే మాటను తొలగించు. అది కోరికలకు చిహ్నం .అవి తొలగించిన తర్వాత నీకు (అందరికీ) మిగిలేది సంతోషం “అని చెప్పాడు .ఒక జీవిని చంపడమే కాదు, దాన్ని బంధించినా, పక్షుల్ని బోనులో పెట్టి  పెంచుకున్నా అది కూడా హింసే అన్నాడు బుద్ధుడు .చేతలతోనే కాదు, మాటల ద్వారా దూషించినా, బాధపెట్టినా దాన్ని కూడా ‘జీవహింస’ గానే  చెప్పాడు.బౌద్ధానికి ముందు మన సంప్రదాయంలో పౌర్ణమికి ప్రాధాన్యత లేదు. బుద్ధుని తర్వాత చాంద్రమానం ప్రాముఖ్యత హెచ్చింది. పౌర్ణమికి ప్రాధాన్యత పెరిగింది.

బౌద్ధానికీ, పౌర్ణమికీ అవినాభావ సంబంధం ఉంది. బుద్ధుడు జన్మించిందీ , ఇల్లు విడిచిందీ, జ్ఞానోదయం పొందిందీ, పరినిర్వాణం పొందిందీ వైశాఖ పూర్ణిమ రోజే. బుద్ధుడు తొలిగా పరివ్రాజకుడైనదీ, ధర్మప్రచారం ప్రారంభించిందీ, తొలి బౌద్ధసంఘం ప్రారంభించినదీ ఆషాఢ పూర్ణిమ నాడు. బుద్ధుడు తన తల్లికి భిక్షుణిగా దీక్ష ఇచ్చినది ఆశ్వయుజ పౌర్ణమి నాడు.ఫాల్గుణ పౌర్ణమి బుద్ధుడు తన ఏడేళ్ల కుమారుడు రాహులునికి భిక్షు దీక్ష ఇచ్చిన రోజు.ఇంకా బుద్ధుడు ఇలా చెప్పాడు–“ఒక గొప్ప వ్యక్తికంటే సంఘమే గొప్పది,ఉన్నతమైనది.వ్యక్తి సేవ కంటే సంఘ సేవ ఉన్నతమైనది.బుద్ధుడు నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు. మానవజీవితాన్ని అర్థం చేసుకోమనే అందరూ చెప్తారు. చెప్పే విధానాలు మాత్రమే వేరు. ‘దయగా ఉంటే మంచిది’ అని మిగతా సంప్రదాయాలు చెబితే, ‘దయతో ఎలా ఉండాలో’ బౌద్ధం చెబుతుంది. ఎవరి పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలో నేర్పుతుంది.బుద్ధుడి కాలం నుంచే స్త్రీలకు ప్రాధాన్యత ఉంది. బుద్ధుడి బంధువైన మహాప్రజాపతి బౌద్ధమతాన్ని అవలంబించింది. అలాగే అశోకుడి కుమార్తె!లోకానికి మార్గదర్శకులుగా ఉండే మహనీయులందరూ నిరాడంబర జీవితాన్నే గడిపారు. స్వంత పనులకోసం మరొకరిపై ఆధారపడటం కూడా బుద్ధుడికి ఇష్టం ఉండేది కాదు. ఓపిక ఉన్నంత వరకు ఎవరి పని వారు చేసుకోవాలని చెప్పేవాడు. ఎనభైఏళ్ల వయసులో కూడా ఆయన పనులను ఆయనే చేసుకునేవాడు. ఆయన భోజనం చేసిన తర్వాత భిక్షాపాత్రను కడగటానికి ఆయన ప్రియశిష్యుడు ఆనందుడు ఎంత అడిగినా ఇచ్చేవాడు కాదు. నేను అన్నం తింటున్నాను గదా నా పాత్రను నేనే కడుక్కోవడం న్యాయం అనేవాడు. బుద్ధుడు స్వయంగా తాను ఆచరిస్తూ, నిరాడంబరత ప్రాముఖ్యాన్ని లోకానికి చాటి చెప్పాడు.

ఇతరుల గురించి ఈర్ష్య పడకుండా, తమను తాము మంచివారిగా మలచుకోవాలని, మనకు ఉన్న అతి పెద్ద సంపద అయిన మేధస్సును సక్రమంగా వాడుకోవాలని బౌద్ధం బోధిస్తుంది.అలాగే మానవ అభివృద్ధికి అవసరమైన ఆధ్యాత్మికతను వయసుతో సంబంధం లేకుండా అందరూ అలవరచుకోవాలని  చెబుతుంది.” ఒకసారి శుద్దోధనుడు బుద్ధుడిని కపిలవస్తుకు వచ్చి తన బోధలు వినివించవలసిందిగా కబురుపెట్టాడు.అలాగే బుద్ధుడు తన పరివారంతో కపిలవస్తుకు చేరాడు. తండ్రిని సమీపించి రాహులుడు తనను ఆయన కుమారుడిగా పరిచయం చేసుకొని,ఆయన వారసత్వ సంపదను తనకు అందచేయమని వేడుకున్నాడు.అందుకు బుద్ధుడు చిరునవ్వుతో అంగీకరించి, పక్కనే  ఉన్న ధర్మసేనాపతి సారిపుత్రుణ్ణి పిలిచి,రాహులునికి భిక్షు దీక్ష ఇవ్వమని చెప్పాడు. “ఇదొక ధర్మ సామ్రాజ్యం,ఇదే నా ఆస్తి”అంటూ రాహులుడికి ఒక భిక్షాపాత్రను అందించాడు బుద్ధుడు. అప్పుడు రాహులుడి వయసు ఏడు సంవత్సరాలు.రాహులుడు బౌద్ధమతంలో తొలి బాల బిక్షువుగా మారాడు.బౌద్ధమతంలో బాలభిక్షువుల్ని శ్రామణేరులు అంటారు.ఆ విషయం తెలిసిన  శుద్ధోధనుడు చాలా దు:ఖించాడు.ఆ దు:ఖంతోనే,”ఇక నాకు ఈ రాజ్యం ఎందుకు, నన్నుకూడా నీ సంఘంలో చేర్చుకో!” అని బుద్ధుడిని కోరి అతను కూడా బిక్షువుగా మారాడు . బుద్ధుని సవతి తల్లి గౌతమి, తండ్రి శుద్ధోధనుడు, భార్య యశోధర కూడా భిక్షు సంఘంలో చేరారు.

బౌద్ధ ధర్మంలో రాహులుడు ఎంతో నిష్ణాతుడయ్యాడు. బుద్ధుడు అతనికిచ్చిన ప్రబోధాలు బౌద్ధ సారస్వతంలో  ‘రాహులో వాద సుత్త’గా ప్రసిద్ధి చెందాయి . ఆయన ఎక్కువకాలం ఆమ్రరత్న వనంలో జీవించాడు. రాహులుడు ఎప్పుడు మరణించాడో తెలియదు. కానీ, చాలా చిన్నవయసులో యువకునిగా ఉన్నప్పుడే మరణించాడు. పూర్వజన్మలు,మరు జన్మలు లేవన్న బుద్ధుడిని గురించి బౌద్ధ గ్రంధాలలో విచిత్రంగా ‘బుద్ధుని జాతక కధలు’ఎలా వచ్చాయో అంతుబట్టదు.’బుద్ధుని జాతక కధలు’ ప్రకారంగా సిద్ధార్ధ గౌతముడు బుద్ధుడు కాకముందు ఐదువందల నలభై ఏడు జన్మలు ఎత్తినట్లు బౌద్ధగ్రంథాలు చెప్పాయి .అయితే ఈ కధలు– మనలో ఉండాల్సిన ప్రేమ, కరుణ, సహనం, మైత్రీభావాల గురించి స్పష్టంగా తెలియచేస్తాయి.

బుద్ధుడు ధర్మప్రచారంలో 80 ఏళ్ళవరకూ జీవించాడు. చివరికి కుశీనగరంలో బుద్ధుడు మహాపరినిర్వాణం చెందాడు. బుద్ధుని బోధనలు దేశ విదేశాల ప్రజలెందరినో ఆలోచింపచేసేలా చేశాయి. ఫలితంగా చాలామంది బౌద్ధం స్వీకరించే విధంగా ప్రేరేపించాయి.భారతదేశానికి బౌద్ధం ఇప్పుడు మరింత అవసరం. అదే విషయాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పదే పదే వివరించారు.పదిమందికి పంచేకొద్దీ తనలో ప్రావీణ్యతను పెంచేది విధ్య.పదిమందిలో మెలిగేకొద్దీ తనలో సంస్కారాన్ని పెంచేది శుద్ది.పదిమందితో తిరిగేకొద్దీ తనలో సమయస్ఫూర్తిని పెంచేది బుద్ది.ఇదంతా కూడా సజ్జనుల సాంగత్యం వలనే సాధ్యపడుతుంది.మీరే ఆలోచించండి!

 

బుద్ధుడి గురించి ప్రముఖులు—

బుద్ధుడు యోగుల్లో చక్రవర్తిలాంటివాడు– ఆది శంకరాచార్య

దాస్య విమోచన గురించి, దు:ఖ నిరోధం గురించి, సమ సమాజాన్ని గురించి బోధించి, మూఢ నమ్మకాలకు తావులేకుండా, మనిషిని మానవతా విలువలవైపు నడిపించే బౌద్ధం అన్ని మతాలకంటే ఉన్నతమైనది.– కారల్‌ మార్క్స్‌

ఈ భూమి మీద ఆచరణలో ఉన్న మతాలన్నింటిలోనూ, శాస్త్రీయ జ్ఞానానికి అనుగుణంగా తన బోదనలు చేసింది బౌద్ధమతమే. ఆధునిక, శాస్త్రీయ అవసరాలకు సరిపోయే మతం ఏదైనా ఉన్నదా అంటే అది బౌద్ధమతమే. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

ఈ ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టిన అందరిలో అత్యంత గొప్పవాడు బుద్ధుడు.– రవీంద్రనాథ్‌ ఠాగోర్‌

శీలం, ప్రజ్ఞల్లో బుద్ధుడు క్రీస్తును కూడా మించిపోయాడు. బెట్రాండ్‌ రస్సెల్‌

ఏసుక్రీస్తు బోధనలలో నూటికి తొంభైశాతం బౌద్ధం నుంచి స్వీకరించినవే…ఆధునిక ప్రపంచానికి సరిపోయే మతం బౌద్ధమే.…ప్రపంచాన్ని రక్షించగల శక్తి ఒక్క బౌద్ధానికి మాత్రమే ఉంది…. సంస్కర్తలందరిలోనూ అత్యుత్తముడు గౌతమబుద్ధుడు…బుద్ధుడు నా గురువు. – అంబేద్కర్‌

ప్రాణం ఉన్నదేదీ ఏకాంతంగా జీవించదు… తన కోసమే జీవించదు!సంఘం కోసం జీవించేదాన్నే ‘ప్రాణి’అనొచ్చు!

 

బుద్ధం శరణం గచ్ఛామి

ధర్మం శరణం గచ్ఛామి

సంఘం శరణం గచ్ఛామి

8 thoughts on “బుద్ధుడు-బౌద్ధ మతం

  1. ఏసుక్రీస్తు బోధనలలో నూటికి తొంభైశాతం బౌద్ధం నుంచి స్వీకరించినవే…ఆధునిక ప్రపంచానికి సరిపోయే మతం బౌద్ధమే.…ప్రపంచాన్ని రక్షించగల శక్తి ఒక్క బౌద్ధానికి మాత్రమే ఉంది…. సంస్కర్తలందరిలోనూ అత్యుత్తముడు గౌతమబుద్ధుడు.
    యీ విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను. శారదా ప్రసాద్ గారు, బౌద్ధమతం గురించి యింతటి చక్కని వ్యాసాన్ని అందించినందులకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
    నాగయ్య

  2. మిత్రమా శాస్త్రి,
    ‘బుధ్ధుడు- బౌధ్ధం’ గురించి మంచి విశ్లేషణాత్మక వివరణ తో నీ వ్యాసం చాలా బాగుంది. నీ నుండి
    మరెన్నో తెలుసుకోవలశిన విషయాలు నీ రచనలు విశ్లేషణ ల ద్వారా వెలువడాలని ఆశిస్తూ..
    మిత్రుడు,
    వి.యస్,కె,హెచ్,బాబురావు.

  3. మిత్రులు శాస్త్రిగారికి నమస్తే. ఈవ్యాసంలో బుధ్ధునిగురించి, బౌధ్థమత ఆవిర్భావం, అందుకు కారణమైన ఆనాటిసమాజపరిస్థితులు,బౌధ్ధమత మూలసూత్రాలగురించి చక్కగా వివరణాత్మకంగా, క్లుప్తంగా వ్రాసారు. ఆనాటి మూఢనమ్మకాలకు,యజ్ఞయాగాదులకు,జంతుబలులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులుగా మార్చడంకోసం ముందు తను ఆచరిస్తూ ముందుకు సాగి చివరికి బౌధ్ధమతాన్ని స్థాపించి విశ్వానికి ఒక మార్గదర్శిగా చరిత్రలోనే నిలచిన మహామనిషి గౌతమబుధ్ధుడు.
    అయితే ఆనాటి వైదికవర్గాలు తమమనుగడకే ప్రశ్నార్థకంగా మారి దేశవ్యాప్తంగా విస్తరించిన బౌధ్ధమతాన్ని మనదేశంనుంచి ఎలా లేకుండా చేయగలిగాయో వివరించితే ఈవ్యాసానికి ఇంకా నిండుదనం వచ్చేదని నాఅభిప్రాయం.
    విశ్వవ్యాపితమైన బౌధ్ధం,కొన్ని దేశాలలో ప్రధాన మతంగా విరాజిల్లుతుంటే నిజంగామనం దురదృష్టవంతులమా అనిపిస్తుంది.
    ఏమైనా ఒక చక్కని, విలువైన వ్యాసాన్ని అందించిన మీకు,మాలికపత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను.

  4. బుద్దుడు గురించి ఈ తరం వారికి మధ్య తరం వారికి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు అందించారు. ప్రముఖుల గూర్చిన అద్భుత సమాచారాన్ని అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఇంకా ఇటువంటి ఉపయుక్తకరమైన పోస్టులు మీ నుండి ఆశిస్తున్నాం.

  5. బుద్ధుని గురించి, బౌద్ధధర్మం గురించి బాగా వివరించారు. దశావతారాలలో బుద్ధుని గురించి ఇప్పటికీ వివాదాలున్నాయి. కీ.పూ.19 శతాబ్దంలో బుద్ధగయలో పుట్టిన ఆదిబుద్ధుడు అహింసాధర్మాన్ని ప్రవచించాడని, గౌతముని శిష్యుడై గౌతమబుద్ధుని పేరుగాంచి దశావతారాలలో ఒకనిగా ఆరాధించబడ్డాడని కొన్ని కథనాలున్నాయి. ఇతని తల్లి పేరు అంజన. కీ.పూ.5వ శతాబ్దంలో పుట్టిన సిద్ధార్థుడు నేపాల్‌లోని లుంబినిలో జన్మించినట్టు ఆధారాలున్నాయి. ఇతను శాక్యునిగా కూడా పిలువబడ్డాడు. ఏది
    ఏమైనా, బుద్ధుడు ప్రపంచంలో అహింసాధర్మాన్ని బోధించి, కొత్తమతానికి బాట వేసాడు.

  6. బుద్ధుడు-బౌద్ధ మతాన్ని ఆసక్తికరంగా చెప్పినందుకు ధన్యవాదాలు

Leave a Reply to Nagaiah Cancel reply

Your email address will not be published. Required fields are marked *