March 29, 2024

ముఖపుస్తక పరిచయం

రచన: గిరిజారాణి కలవల

మూర్తి గారు సాయంత్రం ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా కనపడ్డ దృశ్యం.. ఆయనను నిశ్చేష్టుని చేసింది. ఆశ్చర్యంతో నోరు తెరిచేసారు. కలయో.. నిజమో.. తెలీని స్థితిలో.. తనకు తనే గట్టిగా గిల్లుకుని.. హా.. ఇది నిజ్జంగా నిజ్జమే.. అనుకుని, ఆ అయోమయంలోనే లోపలికి చిన్నగా వెళ్ళారు. అలాగే ఫ్రెష్ అయి, తానే కాఫీ పెట్టుకుని తాగుతూ.. ఇందాక హాలులో తాను చూసిన దృశ్యాన్ని తలుచుకున్నారు.
తన సతీమణి సరోజ.. కింద ఫ్లోర్ లో వుండే రమణి.. ఇద్దరూ సోఫాలో పక్కపక్కనే కూర్చుని టపటపా సెల్ఫీలు తీసుకుంటున్నారు. మూతులు బిగించి, సాగదీసి, ముడేసి, అబ్బో రకరకాలుగా సెల్ఫీ కర్రను అటు తిప్పి, ఇటు తిప్పీ.. ఫోజులెడుతున్నారు. టీపాయ్ మీద తాగేసిన కూల్ డ్రింకుల గ్లాసులు, తిన్న ప్లేట్లు వున్నాయి. ఆ కబుర్ల జోరు ప్రవాహంలా సాగుతోంది. ఇవన్నీ మూర్తిగారికి ప్రపంచంలో ఎనిమిదో వింతలా అనిపించింది.
ఔను.. మరి… ఉప్పునిప్పులా వుండే వీరిద్దరూ పాలునీళ్ళలా కలసి ఇలా వుండడం ఆశ్చర్యమేగా మరి. నాలుగేళ్ల క్రితం ఈ అపార్ట్మెంట్ లోకి తమ ఇద్దరి కుటుంబాలు ఇంచుమించు ఒకేసారి గృహప్రవేశం చేసుకున్నాయి. తన క్రింద ఫ్లోర్ లో రావుగారు, భార్య రమణి, వారిద్దరి పిల్లలు వుంటారు. తమ పిల్లలు, వారి పిల్లలు ఇంచుమించు ఒకే వయసు వారు. ఒకే స్కూల్లో చదువుతున్నారు. ఇళ్లలో చేరిన కొత్తల్లో తమ రెండు కుటుంబాలు స్నేహంగానే వుండేవి. పిల్లలు నలుగురూ కలిసి ఆడుకోవడం, చేసుకున్న పిండివంటలు ఇచ్చిపుచ్చుకోవడాలూ, కలిసి పిక్నిక్కులూ, అబ్బో భలే జోరుగా సాగేవి. అలా ఓ ఏడాది పాటు జరిగాక ఉన్నట్టుండి ఇద్దరి ఆడవాళ్ళ మధ్య చిన్న చిన్న విషయాలలో తేడాలు రావడం మొదలయి, సర్దుకుపోలేక, భయంకరమైన గొడవలు రావడం ప్రారంభమయ్యాయి. వాటి ఫలితం పిల్లల మీద, మగవారిద్దరి మధ్య కూడా పడింది. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద పడడం ఆగిపోయింది. కూరగాయల బండి మీద కూరలు కొనడం పోటీ నుండి, శ్రావణమాసం పేరంటం పోటీవరకూ సాగేది. పిల్లల చదువులు, ఆటలు వంటి వాటి మీద కూడా ఒకరిని మించి మరొకరు వుండాలని పిల్లల మీద ఒత్తిడి తీసుకురావడం మొదలెట్టేరు. ఓ కుటుంబం సెలవలలో యూరప్ ట్రిప్ వెడితే.. వెంటనే రెండో కుటుంబం అమెరికా ట్రిప్ వెళ్ళాల్సిందే. ఒకరు ఇంటికి ఓ కొత్త వస్తువు కొన్నారని తెలీగానే అవసరం వున్నా లేకపోయినా మరొకరు కొనాల్సిందే. తను, మూర్తి గారు ఆడవాళ్ళిద్దరికీ తెలీకుండా మోర్నింగ్ వాకింగ్ లో కలిసినప్పుడు చెప్పుకుని ఎప్పటికైనా వీళ్లు మారకపోతారా అని ఒకరినొకరు ఓదార్చుకునే వారం.
ఇన్నాళ్ళకి ఆ మంచి రోజు వచ్చిందని ఆనందంతో తబ్బిబ్బు అవుతూ.. మూర్తిగారికి ఫోన్ చేసేసి విషయం చెప్పేసి, విని ఆయనింకా షాక్ లోనుండి తేరుకోకుండానే, ఆ ఆనందాన్ని ఆదివారం మందుపార్టీలో పంచేసుకుందామని అనేసుకున్నారప్పుడే.
కాసేపటికి, రమణి వెళ్లిపోయాక సరోజ లోపలికి రాగానే.. ఏమీ తెలీనట్టు పేపరు చదువుతూ, అసలు విషయం ఆవిడే చెపుతుందికదా అని దొంగచూపులు చూడసాగారు రావుగారు. అనుకున్నట్టుగానే.. సరోజ వచ్చి చటుక్కున పేపరు లాగేసి అదేంటీ.. రమణిని పలకరించకుండా లోపలికి వచ్చేసారు.. ఏమనుకుంటుందో అని కూడా లేదు మీకు..”అనేసరికి ఏం సమాధానం చెప్పాలో కూడా తోచలేదు పాపం రావుగారికి.”అదికాదు.. సరోజా… మీరేదో ఫోటోల హడావిడిలో వున్నారు కదా.. డిస్ట్రబ్ చెయ్యడమెందుకని.. లోపలకి వచ్చేసా..”అన్నారు ఆయన. ”ఓసారి హలో.. అంటే మీ సొమ్మేం పోయింది”అని మూతి తిప్పుకుంటూ వంటింటిలోకి వెళ్లింది.
రావుగారికి మాత్రం ఈ సూర్యకాంతం, ఛాయాదేవి కి సఖ్యత ఎలా కుదిరిందన్న విషయం బోధపడక తల బద్దలు కొట్టకున్నారు. తను కూడా బంగాళదుంపలకి తొక్కు తీసే నెపంతో చిన్నగా వంటింటిలోకి చేరి భార్యతో మాటలు కలపసాగారు. అన్ని కబుర్లు చెపుతోంది కానీ అసలు సంగతి బయటకి రాలేదు. వంటయిపోగానే గిన్నెలు టేబుల్ మీదకి చేర్చేసి, భోజనాలకి కూర్చున్నారు. ఇక లాభం లేదు.. ఆవిడ చెప్పేట్లులేదు.. తనే అడుగుదామనుకునేసరికి భార్యామణి ఒక చేత్తో వడ్డన, మరో చేత్తో ఫోన్ లో ఫేస్బుక్ మొదలెట్టింది. అలాంటి పరిస్థితిలో ఏదడిగినా ఆవిడ దగ్గర నుండి జవాబు రాదని తెలిసి ఆయన మౌనంగా తినడం మొదలెట్టారు.
ఫోన్ చూసుకుంటున్న శ్రీమతి ముఖారవిందం వెలిగిపోతోండం చూసి ఆగలేక అడిగేసారాయన ‘ఏమిటి సంగతీ’ అని. దానికి జవాబుగా ఆవిడ ఫోను చూపించింది. ఇందాక వీళ్లు ఇద్దరూ తీసుకున్న ఫోటోలు ఇద్దరి పేర్లూ టాగ్ చేసుకుని ఫేస్బుక్ లో పెట్టారు… వాటికి వచ్చే కామెంట్లు, లైకులు వందల సంఖ్యలో వచ్చేసి వున్నాయి. అవి చూసుకునే కాబోలు మురిసిపోతోంది.”సరే కానీ.. మీ ఇద్దరికీ పడదుకదా… ఇప్పుడిలా ఇద్దరూ ఒక్కటై పోవడమేమిటి… ఈ ఫోటోలు ఏమిటీ… మిమ్మల్ని మెచ్చుకుంటూ ఇన్ని కామెంట్లు రావడమేమిటీ… నాకేమీ అర్థం కావడం లేదే…”అని వెర్రిమొహం వేసుకుని అడిగారాయన.
దానికి ఆవిడిచ్చిన సమాథానానికి బుర్ర గిర్రున తిరిగింది. అదేంటంటే…. ఇన్నాళ్లూ వీళ్లు ఎలా కలుస్తారా అని తను, రావుగారు ఎదురుచూస్తూవుంటే… ఈ ఇద్దరినీ కలిపింది ఆ జుకర్ బర్గ్ మహాశయుడని తెలిసి హాశ్చర్యంతో నోరు తెరిచాడు..
ఇంతకీ ఆ కథనం ఏంటంటే…. సదరు ఫేస్బుక్ లో మణి అనే పేరుతో తన శ్రీమతీ, రోజా అనే పేరుతో రావుగారి శ్రీమతీ, ఏదో గ్రూప్ లో పరిచయమయి, గాఢ స్నేహితురాళ్ళయిపోయారట. వాళ్ళ ఫోటోలు ఎక్కడా పెట్టుకోక పోవడంతోనూ. ..పేర్లు కూడా పూర్తిగా లేకపోవడంతోనూ… ఒకరికొకరు ఎవరో తెలీకుండానే… ప్రాణ స్నేహితురాళ్ళయిపోయారట. అలా చాటింగ్ లు చేసుకుంటూ.. కుంటూ.. ఈరోజు కలుసుకుందాం అనుకని ఇంటి అడ్రస్ లు చెప్పుకునేసరికి ఎవరో తెలిసిందట. బోలెడంత ఆశ్చర్యపోయి, అబ్బురపడిపోయి , పాత గొడవలు అసలు తలుచుకోకుండా.. కొత్తగా ఫ్రెండ్స్ అయినట్లుగా… కలుసుకున్నామని చెప్పింది. ఈ కలుసుకోవడం వల్లే ఫోటోలు తీసి ఫేస్బుక్ లో పెట్టుకుంటే మాకు బోలెడు కామెంట్లు ఎలా వస్తున్నాయో చూడండి…. అంటూ ఆవిడ కామెంట్లు లెక్కపెట్టుకోవడంలో మునిగిపోయింది.
ఆశ్చర్యం నుండి తేరుకున్న మూర్తిగారు తనలో తనే”ముఖాముఖాలు చూడడానికి కూడా ఇష్టపడని వీరిద్దరినీ ముఖపుస్తకం ఎంత చిత్రంగా కలిపింది. తను, రావుగారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరనిది.. ఈ ఫేస్బుక్ వల్ల అయింది. ఇలాగే ముఖపరిచయంలేని వారెందరినో.. కలుపుతోంది.. ఒకానొకచోట స్పర్థలతో విడతీస్తోంది.. ముఖపుస్తకమా!.. నీకు జోహారు. నువ్వు ఏదైనా చేయగలవు”అనుకుని రావుగారితో ఈ సంతోషాన్ని ముస్తఫా… ముస్తఫా.. అనుకుంటూ ఫోనులో పంచుకున్నారు.

3 thoughts on “ముఖపుస్తక పరిచయం

  1. హహ..
    ,బాగుందండి .
    వైరి,మైత్రిగా మారిన వైనం.
    కధ,కధనం చాలా బాగున్నాయి.

  2. ఎవరెవరో ఒకరికొకరు తెలిశాక వారి మధ్య వైరాన్ని మరచి పోవడం ఆ పాత్రల పరిణతి కి నిదర్శనం మాత్రమే కాదు రచయిత్రి అభిలాష, వ్యక్తిత్వం కూడా కారణమే. యథో మనః తథో బుధ్ధి , యథో బుధ్ధి తథో కలం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *