April 18, 2024

రెండో జీవితం 3

రచన: అంగులూరి అంజనీదేవి

ఆముక్తను చూడగానే చిరునవ్వుతో విష్‌ చేసి.. కూర్చోమన్నట్లు కుర్చీ చూపించాడు ద్రోణ.
కూర్చుంది ఆముక్త.
ద్రోణ వేసిన బొమ్మల్ని చూసి మెచ్చుకుంది ఆముక్త. మన బిడ్డల్ని ఎవరైనా ఇష్టపడ్డప్పుడు మన ఆనందం ఆకాశాన్ని ఎలా తాకుతుందో అదేస్థాయి ఆనందంలో వున్నాడు ద్రోణ.
ద్రోణ చాలా చిన్న వయసునుండే చిత్రాలు గీస్తున్నాడు. ప్రతి చిత్ర ప్రదర్శనలో తన చిత్రాలను ఎంట్రీ చేస్తుంటాడు. అతని చిత్రాలు మిగిలిన వాళ్లకన్నా విభిన్నంగా వుంటూ కళాప్రియులకు గొప్ప అనుభూతిని అందిస్తుంటాయి. ఊహలు, భ్రమలు కాకుండా స్పష్టమైన వాస్తవాలను తన బొమ్మల్లో ప్రజెంట్ చేస్తుంటాడు. ఇప్పటికి అనేక ప్రదర్శనల్లో పాల్గొని అందరి మెప్పు పొందడమే కాక అక్కడక్కడ వున్న ఆర్ట్‌ గ్యాలరీ స్పేస్‌లో అతని బొమ్మలను ప్రదర్శణకి వుంచటం విశేషం…
రీసెంటుగా అతను చేసిన ప్రయోగాలు కళాభిమానులనే కాక, తోటి చిత్రకారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తి వారి అభినందనల వర్షంలో తడిసిపోతున్నాడు.
ద్రోణ చిత్రకళలో పిజి చేశాడు. అంతేకాదు ముంబాయిలోని పాయింట్ ఆఫ్‌ వ్యూ గ్యాలరీలో జరిగిన ప్రదర్శనలో అతని చిత్రాలు గొప్పగా వెలుగుచూశాయి. జైపూర్‌, భూపాల్‌ కోల్‌కత్తా, బెంగుళూరు, న్యూఢిల్లీ లాంటి నగరాలే కాక… లండన్‌, ఫ్రాన్స్‌, శ్రీలంక, న్యూజర్సీ లాంటి ఇతర దేశాల్లో కూడా ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లలో అతని బొమ్మల్ని వుంచాడు.
”ఈ కవిత చదువు ద్రోణా! ఇందులోని నా భావాన్ని మీ బొమ్మ రూపంలో చూసుకోవాలని వుంది.” అంది ఆముక్త.
వెంటనే ఆ కవితను తీసుకొని చదవటం మొదలుపెట్టాడు ద్రోణ. కవిత చదవటం పూర్తి కాగానే దీర్ఘంగా నిట్టూర్చాడు. కుర్చీలో వెనక్కివాలి, కళ్ళు మూసుకుకున్నాడు. ఆ కవిత పట్ల అసంతృప్తి ఉన్నట్లు, అతని ముఖంలో కన్పించకుండా చేయి అడ్డు పెట్టుకున్నాడు.
”ఏంటి ద్రోణా! నా కవిత అంతగా ఆలోచింపజేస్తుందా? నువ్వలా అన్నావనుకో… నాకు చాలా గర్వంగా వుంటుంది.” అంది ఆముక్త.
”అలా అని నేనేం అనలేదు ఆముక్తా! నీ కవితలో భావం బాగుంది. కానీ…” అంటూ అసంతృప్తిగా చూశాడు.
ఆమె మనసు కుంచించుకుపోయింది.
”ఇంకా ఏమైనా స్పష్టత రావాలంటావా ద్రోణా?” అంది లోగొంతుకతో… ఇప్పటికే ఆ కవితకి పడ్డ కష్టం అంతా, ఇంతా కాదు. ఇంకా కష్టపడాలంటే తన వల్ల కాదేమో అన్నంతగా కష్టపడింది.
”నీకెలా చెప్పాలో తెలియని సందిగ్ధతలో వున్నాను ఆముక్తా! నీ కవితకి బొమ్మ గురించి తర్వాత ఆలోచిద్దాం….” అన్నాడు
”ఆలోచించాలి అంటే! నా కవితలో అంత ఇన్సిపిరేషన్‌ లేదనేగా దాని అర్థం..?” అంది … ద్రోణకి ఏదీ నచ్చదు అన్నట్లు…
”ఇన్సిపిరేషన్‌ అంటే పికాసో లాంటి చిత్రకారుడికి గాగిన్‌ నైపుణ్యం స్పూర్తినిస్తే ఆయన జీవితం సోమర్‌సెట్ మామ్‌ లాంటి రచయితను చలింపజేసి పుస్తకం రాసేలా చేసిందట… ఇప్పుడు చెప్పు ఇన్సిపిరేషన్‌ అంటే ఎలా వుండాలో… నువ్వెందుకు ట్రై చెయ్యకూడదూ?” అన్నాడు.
ఏదో అద్భుతమైన ఫీలింగ్‌తో ఆమె హృదయం ఉప్పొంగింది. అంతలోనే తనలోకి తను చూసుకున్నట్లై…
”నా ముఖం నేనేంటి! నాకు వాళ్లతో పోలికేంటి ద్రోణా?’ అంది ఆశ్చర్యపోతూ…
ఒక్క క్షణం ఆమె ముఖంలోకి సూిగా చూశాడు.
”గొప్ప వాళ్లంతా ఒకప్పుడు నీలాగ అనుకున్నవాళ్లే…. సరైన కోణంలో ఆలోచించి, సరైన శిక్షణ పొంది, క్రమశిక్షణతో కృషిచేస్తే సాధ్యం కానిదేది లేదు. అలా కృషి చేస్తేనే కాలంతోపాటు నిలబడిపోతాం.. దేనికైనా డెడికేషన్‌ అవసరం…” అన్నాడు.
ఏదో ఊహించుకుంటూ, నాలుగు వాక్యాలు రాసి, చుట్టుపక్కల వాళ్లు దాన్ని మెచ్చుకోగానే అదో గొప్ప కవితలా ఫీలయ్యే ఆమెకి ద్రోణ మాటలు కొరుకుడు పడటంలేదు. పైగా తన స్థాయిని ఈ విధంగా ఆమె ఎప్పుడూ అంచనా వేసుకోలేదు.
”మన కళాకారుల ప్రపంచం చాలా విచిత్రంగా వుంటుంది ఆముక్తా! నేను చిత్రకారుడ్ని కాబట్టి నా ఆలోచనలన్నీ నాకన్నా ముందు కృషి చేసిన చిత్రకారుల చుట్టే తిరుగుతాయి. వాళ్లెలాంటి మెలుకువల్ని పాటించారు. వాళ్లు గీసుకున్న చిత్రాలు, ఆ చిత్రాలకి వేసిన పెయింట్, రంగుల్ని కలుపుకోవటంలో చూపిన కొత్తదనం పరిశీలిస్తాను. అలాగే నువ్వు కూడా కవితలు రాసేముందు గొప్పవాళ్లు రాసిన పుస్తకాలను బాగా చదవాలి. వాళ్లేం చెప్పారో పరిశీలించాలి…” అన్నాడు
చెక్కిట చేయి చేర్చి వింటూ..
”ఇన్నాళ్లు చిత్రకారుడంటే నువ్వే అనుకున్నాను. ఐ మీన్‌ నాకు తెలిసిన ప్రపంచం చిన్నది కావొచ్చు. రైటర్స్‌లాగా చిత్రకారులు కూడా ఎక్కువమంది వుంటారా?” అంది
”ఎక్కువమంది వున్నా కాలంతోపాటు నిలబడేవాళ్లు చాలా తక్కువమంది వుంటారు ఆముక్తా! వాళ్లలో ‘మోనాలిసా’ చిత్రాన్ని మనకి బహుమతిగా ఇచ్చాడు లీనార్డో… ఆయన చిత్రాలకి మొట్టమొదట ఆయిల్‌ పెయింట్ వాడొచ్చన్న విషయాన్ని కనుక్కున్నాడట.
తర్వాత మైకెలాంగిలో … ఈయన వంద అడుగుల ఎత్తున చర్చి అంతర్బాగపు పై కప్పు మొత్తాన్ని బొమ్మల్తో చిత్రీకరించటం కోసం నాలుగు సుదీర్ఘమైన సంవత్సరాలు ఒక్కడే ‘మంచె’ పై వెల్లకిలా పడుకొని అవిరామంగా పనిచేసి వెన్నెముక పోగొట్టుకున్న చిత్రకారుడట.
ఆ తర్వాత పికాసో అనే చిత్రకారుడు ఏదైనా ఒక చిత్రాన్ని చూడాలంటే కళ్లతో కాదు మెదడుతో అని తన చిత్రాల్లో అందాన్ని తగ్గించి క్లిష్టతను పెంచాడట..
ఇవన్నీ నాకెలా తెలుసని అనుకుంటున్నావా? కొందరు రాసిన పుస్తకాలు చదివి తెలుసుకున్నాను. అన్నాడు ద్రోణ.
”వాళ్లెప్పటి వాళ్లు? ఆ పేర్లు కూడా అదోలా వున్నాయి..” అంది ఆముక్త ఆసక్తిగా.
”చెప్పానుగా! ప్రతిభ వున్న కళాకారులు కాలంతోపాటు జీవిస్తారని.. మనలాంటి వాళ్లకి మైలురాళ్లు” అన్నాడు.
”మరి మనం వాళ్లలా కాగలమా?” అంది
”ఒక్కరోజులో, ఒక్కరాత్రిలో కాలేము. అహోరాత్రులు నిద్రమానుకొని కష్టించిన కళాకారులే ఇప్పుడు మనకి కన్పిస్తున్న ఈ మెరుపులు…” అన్నాడు.
”ఒక్క నిముషం ద్రోణా! రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అనే పాటలో రవివర్మ పేరుంది కదా! ఆయన కూడా చిత్రకారుడేనా?” అంది ఆముక్త.
”అద్భుతమైన చిత్రకారుడు. ఆయన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవాడు. ఎవరి సాయం లేకుండానే తొమ్మిదేండ్లపాటు స్వయంకృషి సాగించి, పరిశోధనలు చేసి, వైఫల్యాలను తట్టుకొని తనకు తానుగా రంగుల మిశ్రమాన్ని నేర్చుకుని పూర్తిగా చిత్రకళకే అంకితమైపోయాడు..” అన్నాడు.
”ఏం సాధించాడు?” అంది ఆముక్త.
”చాలా సాధించాడు. 1873లో తన కురులను మల్లెమాలతో అలంకరించుకుంటున్న నాయర్‌ వనితను చిత్రించాడు. దాన్ని మద్రాసు ‘పైన్‌ ఆర్ట్స్‌ ఎగ్జిబిషన్‌’లో ప్రదర్శిస్తే స్వర్ణ పథకం గెలుచుకొంది. 1874లో శరబత్‌ వాద్యాన్ని వాయిస్తోన్న తమిళ మహిళ చిత్రానికి కూడా మద్రాసులో జరిగిన ప్రదర్శనలో ప్రథమ బహుమతి లభించింది.
1875లో పారదర్శకమైన ఒక తెరకింద శయ్యమీద పవళించిన ఒక మళయాళీ సుందరి తన సహచరితో జలక్రీడ నెరుపుతోన్న చిత్రం.. మళ్లీ 1876లో ‘దుష్యంతుడికి ప్రేమలేఖ రాస్తోన్న శకుంతల.’ ఇది భారతీయ చిత్రకళా చరిత్రలో అపూర్వం. మద్రాసులో జరిగిన ప్రదర్శనలో ప్రదర్శించబడిన చరిత్ర ప్రసిద్ధ చిత్రం.
ఈ విధంగా రవివర్మ చిత్రలేఖనా పరిధి బాగా విస్తరించి స్వదేశాల్లో, విదేశాల్లో అభిమానులు పెరిగి అతని చిత్రాలను కొనేవాళ్లు ఎక్కువయ్యారు. ఇంతకన్నా ఓ కళాకారుడు సాధించవలసింది ఏముంది.” అన్నాడు ద్రోణ.
”దీన్ని బట్టి నాకు తెలిసింది ఏమిటంటే రాజా రవివర్మ చిత్రాలకి ఆడవాళ్ల సౌందర్యమే ఇన్సిపిరేషన్‌ అయిందని… ఎంతయినా మా ఆడవాళ్లం గ్రేట్!” అంది ఆముక్త గర్వంగా.
మౌనంగా వుండిపోయాడు ద్రోణ,
కర్టెన్‌ తొలగించుకొని రెండు కాఫీ కప్పులతో వచ్చి, ఒకి భర్తకి, రెండవది ఆముక్తకి ఇవ్వబోయి కప్పులోని కాఫీ అంతా ఆముక్త చీరపై పోసింది శృతిక.
ఆ వేడికి చురుక్కుమని, టక్కున లేచి నిలబడి కర్చీఫ్‌తో చీరపై కాఫీ మరకల్ని తుడుచుకొంది ఆముక్త.
”అయ్యో! లోపలకెళ్లి వాష్‌ చేసుకో ఆముక్తా!” అంటూ నొచ్చుకున్నాడు ద్రోణ. భర్త ముఖంలోని ఆ ఫీలింగ్‌ని భరించలేకపోయింది శృతిక. కాఫీయే కదా పడింది. అదేదో యాసిడ్‌ పడినట్లు ఏంటా ఎక్స్‌ప్రెషన్‌ అనుకొంది. తను కావాలని పోసినట్లు వాళ్లకి తెలియకుండా గమనిస్తూ…
”సారీ” అంటూ ”రండి! వాష్‌బేసిన్‌ చూపిస్తాను.” అంది శృతిక.
శృతిక వెంట నడిచింది ఆముక్త.
ఆముక్త వివరాలు తెలుసుకోవాలని…
”మీ వారేం చేస్తారు?” అంది మెల్లగా శృతిక
”రియల్‌ ఎస్టేట్ బిజినెస్‌..” అంది ఆముక్త.
ఇంకేం అడగాలో తోచక అంతకుమించి మోహమాటంగా అన్పించి ”అదిగోండి! అదే వాష్‌బేసిన్‌! అటు వెళ్లండి!” అంటూ చాలా క్యాజువల్‌గా తనకేదో పని వున్నట్లు పక్కకెళ్లింది శృతిక.
ట్యాప్‌ తిప్పి, కాఫీ మరకల్ని కడుక్కుని, వచ్చి ద్రోణ దగ్గర కూర్చుంది ఆముక్త. ఆమెకింకా చిత్రకారుల గురించి తెలుసుకోవాలని వుంది.
”బాపు బొమ్మలా వుంది అంటారు. ఆయన బొమ్మలకి ఎందుకంత ప్రత్యేకత?” అంది ఆముక్త.
”అదొక ప్రత్యేకమైన శైలి. అందుకే బాపు ప్రజల నాలుకపై వుండిపోయాడు. నాకు నచ్చిన వాళ్లలో ప్రస్తుతం బాపు తర్వాత కరుణాకర్‌ ఒకరు. ఆయన బొమ్మలు బావుంటాయి” అన్నాడు ద్రోణ.
”మరి నా కవితకి బొమ్మ…” అని ఆమె అడగబోతుంటే.. ఆ రూంని క్లీన్‌ చేద్దామని శృతిక వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో లోపలకి వచ్చింది. ఎప్పుడైనా ఆ గదిని టైం ప్రకారం శృతికనే క్లీన్‌ చేస్తుంది. వర్కర్‌ని రానివ్వదు.
”చూద్దాం ఆముక్తా! ఆ కవిత గురించి నేను తర్వాత మాట్లాడతాను” అంటూ లేచాడు ద్రోణ.
ఆముక్త ‘నమస్తే’ చెప్పి ఇంటికెళ్లింది.
* * * * *
నిండు పౌర్ణమి కావటంతో వాతావరణం ఆహ్లాదంగా వుంది. స్టాండ్‌, బోర్డ్‌, కలర్స్‌ డాబా మీదకి తీసికెళ్లి, ట్యూబ్‌లైట్ అమర్చుకొని, బొమ్మ వేస్తున్నాడు ద్రోణ.
కొద్ది నిముషాలు గడిచాక కరెంట్ పోవటంతో వెలుగుతున్న ట్యూబ్‌లైట్ ఆరిపోయి వెన్నెలే మిగిలింది.
ఇంట్లో క్యాండిల్‌ దొరక్క చీకట్లో భయమనిపించి, భర్తను వెతుక్కుంటూ ఒక్కో మెట్టు ఎక్కి డాబాపై కొచ్చింది శృతిక.
శృతికను గమనించలేదు ద్రోణ.
అప్పుడే ఏదో కాల్‌ రావటంతో డాబాపై తిరుగుతూ మ్లాడుతున్నాడు. అతను చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు.
మండింది శృతికకు.. ఆ కాల్‌ ఆముక్తదే అనుకొంది. భర్తను చూసి వెన్నెలంటే ఇతనికి ఇష్టం కాబోలు.. వెన్నెల్లో, మెరుపుల్లో, మేఘాల్లో కొందరు సౌందర్యాన్ని వెతుక్కొని ఆరాధిస్తారు, ప్రేమిస్తారు, జీవిస్తారు కదా! తన భర్త కూడా అలాగే అనుకొంది. ఎంతయినా ఆర్టిస్ట్‌ కదా! ఆ మాత్రం రసానుభూతి తప్పకుండా వుంటుందని కూడా అనుకొంది.
కానీ ఇలా తనకి తెలియకుండా డాబాపైకి చేరి ఫోన్లో ఆడవాళ్లతో మ్లాడుతూ తిరుగుతుంటాడని తెలియదు.
ఇప్పుడు తెలిసి – అగ్ని హోత్రినిలా ఓ చూపు చూసి కోపంగా, కసిగా నేలపై కాలితో తన్నింది. ఒక్కో మెట్టు దిగి గదిలోకి వెళ్లింది.
ఆమె మనసంతా చీకటైంది. బయట చీకటిని గమనించే స్థితిలో లేదు. వెలుగు అనేది ఎదురు చూసినా వస్తుంది. చూడకపోయినా వస్తుంది. అలాగే కరెంట్ వచ్చి లైట్లు వెలిగాయి.
ఓ గంట తర్వాత కిందకెళ్లి శృతిక పక్కన పడుకున్నాడు ద్రోణవర్షిత్‌. అతనికి మళ్లీ ఫోన్‌ వచ్చింది. రింగ్‌ విని వెంటనే మొబైల్‌ ఆన్‌ చేసి ‘హలో’ అన్నాడు.
అతని గొంతు వింటుంటే నరనరం మెలిపెట్టినట్లు మొత్తుకోవటంతో అప్పటివరకు ఆపుకొని వున్న కోపాన్ని బయికి లాగింది శృతిక… ఒక్క వుదుటన లేచి కూర్చుని…
”ఎవరి దగ్గరనుండి వచ్చిందండీ ఆ ఫోన్‌?’ అంది గట్టిగా
”ఒక్క నిముషం…” అంటూ శృతిక వైపు చూసి, ఎడిటర్‌ దగ్గరనుండి.. ఏదో సీరియల్‌ పంపుతారట. దానికి నన్ను బొమ్మలు వెయ్యమంటున్నారు” అని చెప్పి…
”ఓ.కె. సర్‌! గుడ్‌నైట్!” అంటూ మొబైల్‌ ఆఫ్‌ చేసి టీపాయ్‌ మీద పెట్టాడు ద్రోణ
”చచ్చిపోతున్నా మీ ఫోన్‌కాల్స్‌తో రాత్రీ, పగలూ…” అంది పిచ్చెక్కినట్లు తలపట్టుకొని శృతిక.
”ఏమైంది శృతీ! ఏంటలా వున్నావ్‌?” అన్నాడు ద్రోణ విషయం అర్థంకాక … ఇవాళెందుకో శృతికలో చాలా మార్పు కన్పిస్తోంది ద్రోణకి.
”ఉదయం నుండి మీ ఇద్దరు గదిలో కూర్చుని మాట్లాడుకుంటూనే వున్నారు. మళ్లీ ఈ ఫోన్లేంటి? నేను వుండాలా వద్దా?” అంది
ఇప్పుడర్థమైంది ద్రోణకి.. ఆముక్త గురించి అతిగా ఆలోచిస్తోందని..
”నేను ఆర్టిస్ట్‌ని శృతీ! నా దగ్గరికి అమ్మాయిలొస్తారు, అబ్బాయిలొస్తారు, ఫోన్లు కూడా చేస్తారు. ఎవర్ని చూసినా, ఏ ఫోన్‌ విన్నా నువ్విలా హర్టయి, రియాక్ట్‌ కావటం పద్ధతి కాదు. నేనేదో తప్పుచేస్తున్నవాడిలా నీకు సంజాయిషీ ఇచ్చుకోవటం నాకు నచ్చని పని… ఇంకెప్పుడూ నువ్విలా ఫీల్‌ కాకు…” అన్నాడు అతి ముఖ్యమైన విషయం చెబుతున్నట్లు…
పొగరుగా తలెగరేసింది
”మేనత్త కొడుకు నెత్తినపెట్టుకొని చూస్తాడని మావాళ్లు నాకెన్నో ఆశలు పెట్టి ఈ పెళ్లి చేశారు. ఒక్క రోజన్నా నేను మనశ్శాంతిగా లేను. ఎంత ఆర్టిస్ట్‌ అయితే మాత్రం ఈ అమ్మాయిలేంటి? ఈ ఫోన్లేంటి?” అంది.
”నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావ్‌ శృతీ!” అంటూ నచ్చ చెప్పబోయాడు.
”నన్ను తాక్కండి! ఈ ముసుగు బతుకులంటేనే నాకు చిరాకు.. ఎందుకండీ ఈ దొంగ నాటకాలు? ఎవర్ని సంతోషపెట్టాలని…?” అంది.
”ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు. పడుకో…” అన్నాడు ద్రోణ.
”నేను పడుకుంటే మళ్లీ ఫోన్లో మ్లాడుకుంటారు. అంతేగా?” అంది. ఆమె కళ్లు ఎర్రగా మారి ఆమె బుగ్గలతో పోటీపడ్తున్నాయి.
”నీకెంత చెప్పినా అర్థం కానప్పుడు నేనేం చెయ్యలేను. నేను పడుకుంటున్నా.. లైటాపు” అన్నాడు.
ఆమె కదల్లేదు. లైటాపలేదు. అతనే లేచి స్విచ్‌ ఆపి, పడుకున్నాడు. అతను పడుకున్నా.. ఆమె మాట్లాడుతూనే వుంది.
నిద్రపోతున్నట్లు అతని ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలు చూసి ఉడికిపోతున్న దానిలా లేచి నిలబడింది.
ఆ గదిలో వాకింగ్‌ చేస్తున్న దానిలా సీరియస్‌గా అటు, ఇటు తిరిగింది. తిరుగుతూనే వుంది.
… ఒక కన్ను కొద్దిగా తెరిచి శృతికను చూశాడు ద్రోణ
ఇలా అర్ధరాత్రులు కూడా వాకింగ్‌ చెయ్యొచ్చని తెలిస్తే – ఆడవాళ్లు అర్ధరాత్రులు బయటకెళ్లి షాపులు తెరిపించి, షాపింగ్‌ చేస్తారు కాబోలు. అప్పుడు మొదలవుతాయి కదా ఆర్థిక మాంద్యం బాగాలేదనే మగవాళ్లకి కష్టాలు…!
నేనిప్పుడు నిద్ర నించకపోతే శృతిక తన నోటి వాక్‌ పరిమళాల వడదెబ్బల రుచి చూపిస్తుంది. అయ్యో! నా బాషేంటి ఇలా తయారయింది? నా చేతిలో వుండేది కలమా? కుంచా? అని మనసులో అనుకుంటూ తెరిచిన ఆ ఒక్క కన్నును కూడా టక్కున మూసుకున్నాడు.
శృతికకు నిద్రరావటం లేదు.
చక్కగా జీవితాన్ని అనుభవించాల్సినప్పుడు భర్తతో అనుకూలత లేక మనసును అనుమానమనే రంపంతో కోసుకుంటూ మౌనంగా, ఒంటరితనంతో స్నేహం చెయ్యాలంటే ఏ స్త్రీకైనా కష్టమే.. ప్రేమ, ఆశ, నమ్మకం ఇవి వుంటేనే జీవితం. ఇవి లేనప్పుడు సారంలేని మట్టిలో వేసిన మొక్కలా వెలవెలపోతుంది. అది అర్థం చేసుకోకుండా తను ఏదనుకుంటే అదే నిజమని భర్త బిహేవియర్‌ని నెగెటివ్‌ కోణంలో చూడటం అలవాటు చేసుకున్నాక ఏది కష్టమో, ఏది కష్టం కాదో తెలుసుకునే స్థితిని దాటిపోతుంది ఏ భార్య అయినా… అదే స్థితిలో వుంది శృతిక.
భర్త నిద్రపోతుంటే.. మతిస్థిమితం లేకుండా ఆ గదిలో ఒంటరిగా తిరుగుతూనే వుంది శృతిక.
*****
కొడుకును బి.టెక్‌లో జాయిన్‌చేసి, హాస్టల్లో వదిలి కూతురు దగ్గరికి వచ్చాడు నరేంద్రనాధ్‌.
భోంచేసి డాబామీద కెళ్లి పడుకున్న తండ్రి దగ్గరకి వెళ్లి…
”నాన్నా… పడుకున్నారా?” అంది శృతిక.
”లేదు శృతీ! ఇప్పుడే ద్రోణ మాట్లాడివెళ్లాడు. ఆర్ట్‌లో అతని ప్రోగ్రెస్‌ వింటుంటే మనసంతా హాయిగా అన్పిస్తోంది. ఈ రోజు ఈ స్థితిలో వున్న ద్రోణ వెనక ఎంత సాధన, తపన వున్నాయో చూడకపోయినా తెలుస్తోంది” అన్నాడు. అల్లుడ్ని చూస్తుంటే ఆయనకెంత గర్వంగా వుందో అంతకన్నా ఎక్కువ తృప్తి వుంది.
‘ఆర్ట్‌ పేరుతో ఆయన దగ్గరకి వచ్చే అమ్మాయిల్ని, ఆయనకి వచ్చే ఫోన్‌కాల్స్‌ని తట్టుకోలేకపోతున్నాను నాన్నా… నీ మాటవిని, హాస్టల్లోవుండి నా చదువుని అలాగే కంటిన్యూ చేసి వుంటే బావుండేది. ఇప్పుడు పశ్చాత్తాప పడ్తున్నాను.’ అని తండ్రితో చెప్పలేక…
”అమ్మ ఎలావుంది నాన్నా. నన్ను గుర్తు చేసుకుంటుందా?” అంది.
”అవును శృతీ! పెద్దదేమో హాయిగా భర్త, పిల్లల్తో వుంటూ జాబ్‌ చేసుకుంటోంది. చిన్నది కూడా చదువు మానుకోకుండా జాబ్‌ వచ్చేంతవరకు చదివి వుంటే బావుండేది అని ఒక్కోసారి బాధపడినా అనేకసార్లు ద్రోణలాంటి భర్త అందరికి దొరుకుతాడా?” అని మురిసిపోతోంది మీ అమ్మ. చుట్టుపక్కల వాళ్లకి కూడా ఇలాగే చెప్పుకుంటోంది” అన్నాడు నరేంద్రనాద్‌.
ఆ మాటలు నచ్చనట్లు ముఖం కాస్త ముడుచుకొని..
”నేను అక్క దగ్గరకి వెళ్తాను నాన్నా…” అంది.
”ఎందుకు?” అన్నాడు ఆమెనే చూస్తూ నరేంద్రనాద్‌
”చూడాలని వుంది. పైగా కాల్‌ చేసింది” అంది.
”అది అలాగే చేస్తుంది లేమ్మా! మొన్ననేగా మీ అమ్మ వెళ్లొచ్చింది. నువ్వెళ్తే ఇక్కడ వర్షిత్‌కి ఇబ్బంది అవుతుంది”’ అన్నాడు. అల్లుడు మీద ప్రేమ పెరిగినప్పుడు వర్షిత్‌ అని పిలవటం ఆయనకి ఇష్టం.
తండ్రి ఇష్టాలు శృతికకు తెలియనివి కావు.
”నాకు తెలియదా నాన్నా! ఆయనకి నేను లేకుంటే ఎంత ఇబ్బందో! కాకుంటే అక్కను చూడాలని వుంది. ఆయన కూడా ఇంట్లో వుండట్లేదు. ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ వుందని ఢిల్లీ వెళ్తున్నారు.” అంది
”ఇంకేం ! నువ్వుకూడా ఢిల్లీ వెళ్లు…” అన్నాడు
”నేను వెళ్లట్లేదు…” అంది.
”ఏం! ఎందుకు? వర్షిత్‌ వద్దన్నాడా?”
”ఆయన రమ్మంటున్నాడు నాన్నా…నాకు ఇంట్రస్ట్‌ లేదు. అందుకే వెళ్లటం లేదు.” అంది.
”మరి వర్షిత్‌ ఏమన్నాడు?”
”ఎలాగూ ఢిల్లీ రానంటున్నావ్‌ కదా! ఒక్కదానివి ఇక్కడేం చేస్తావ్‌? మీ అక్కదగ్గరికి వెళ్లు అన్నాడు” అంది ముఖాన్ని తండ్రికి కన్పించకుండా పక్కకి తిప్పుకొని..
”సరే!” అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు నరేంద్రనాద్‌.
”రేపు మీతో వస్తాను నాన్నా ! నన్ను అక్క దగ్గర వదిలి మీరు ఇంటికెళ్లండి’ అంది శృతిక.
”అలాగే శృతీ! వెళ్లి పడుకో!” అంటూ శృతిక చెంప నిమిరాడు నరేంద్రనాద్‌.
తండ్రి అలా అనగానే వెళ్లి బట్టలు సర్దుకొంది.
ఆ రాత్రి ద్రోణ ఎంత బ్రతిమాలినా అతని మాట వినలేదు శృతిక.
*****
తెల్లవారింది.
భర్తకి చెప్పి, తండ్రితో బయలుదేరింది శృతిక.
శృతికను కృతిక ఇంట్లో దింపి, తన ఇంటికెళ్లాడు నరేంద్రనాధ్‌. శృతికను చూడగానే… ”సుత్తి పిన్నొచ్చింది” అంటూ ఎదురెళ్లి ఆమె కాళ్లను చుట్టుకొంది ఫోర్త్‌ క్లాసు చదువుతున్న టీనా. టీనాకి ‘శృతి’ పలకటం స్పష్టంగా రాదు. ఎన్నిసార్లు చెప్పినా సుత్తిని జోడించందే సింగిల్‌గా ‘పిన్ని’ అని పిలవదు. అక్క కూతురు కదా ఎలా పిలిచినా శృతికకు ముద్దుగానే వుంటుంది.
అంతలో కృతిక పెద్దకూతురు మోనా వచ్చింది. పిన్నికి దగ్గరగా వచ్చి… ”పిన్నీ! మమ్మీ ఇంకా ఆఫీసునుండి రాలేదు. మమ్మీ కన్నా ముందు మేమే వచ్చాం… రోజూ ఇలాగే వస్తుంటాం.” అంది హ్యాపీగా మోనా. మోనా ఎయిత్‌ క్లాస్‌ చదువుతోంది.
”అలాగా!” అంటూ వాళ్ల తలలు నిమిరి… వెంటనే కొంగును నడుం దగ్గర దోపి… ”మీరు కాళ్లూ, ముఖం కడుక్కుని డ్రస్‌ మార్చుకోండి! నేను మీకు టిఫిన్‌ రెడీ చేసి పెడతాను” అంటూ ఫ్రిజ్‌లోంచి దోశపిండి తీసి చకచక దోశలు వేసి పిల్లలకి పెట్టింది.
పిల్లలు పాలు తాగుతుండగా వచ్చాడు శృతిక బావ అనిమేష్‌ చంద్ర. అతనిది క్యాంపులు తిరిగే ఉద్యోగం కావటం వల్ల ఇంట్లో గడిపే రోజులు తక్కువగా వుంటాయి. జర్నీవల్ల కాబోలు నలిగిన బట్టల్లో అలసిపోయినట్లు కన్పిస్తున్నాడు అనిమేష్‌ చంద్ర.
శృతికను చూడగానే పలకరించాడు. తను కూడా ఇప్పుడే వచ్చినట్లు చెప్పింది శృతిక.
”నానమ్మేది మోనా? కన్పించటంలేదు?” అన్నాడు పెద్దకూతురు వైపు చూసి అనిమేష్‌ చంద్ర.
అతను క్యాంపునుండి రాగానే తల్లి వచ్చి కాఫీ ఇస్తుంది. కాఫీ తాగుతున్నంత సేపు కొడుకునే చూస్తూ అక్కడే నిలబడుతుంది. ఇది అనిమేష్‌ చంద్రకి చాలా ఇష్టం. వంట కూడా తల్లే ఎక్కువ చేస్తుంది. అదేమని అంటే ‘కృతికని ఆఫీసుకి వెళ్లనీరా! వంటదేముంది…” అంటుంది.
”నానమ్మతో మమ్మీ గొడవపెట్టుకొని వెళ్లగొట్టింది డాడీ” అంది మోనా
”కాదు డాడీ! నానమ్మే మమ్మీతో గొడవపెట్టుకొని వెళ్లింది” అంది టీనా.
ఎవరిది కరక్టో తెలుసుకోలేక వాళ్లు రెడీ అయినట్లు అన్పించి…
”సరే! మీరు ట్యూషన్‌కి వెళ్లండి! టైమయింది.” అంటూ అతను స్నానానికి వెళ్లాడు.
మోనా పెద్దది కాబట్టి ఒక్కతే వెళ్లగలదు. వెళ్లిపోయింది. టీనా వెళ్లలేదు. టీనాను రోజూ వాళ్ల నానమ్మనే స్కూల్‌కి, ట్యూషన్‌కి తీసికెళ్తుంది.
అది తెలిసిన శృతిక టీనాను ట్యూషన్లో వదిలి వచ్చింది
ఆఫీసునుండి ఇంటికొచ్చిన కృతిక శృతికను చూసి హాయిగా ఊపిరి పీల్చుకొంది.
”తల పగిలిపోతోంది శృతీ! కాఫీ యివ్వు…” అంటూ వాష్‌బేసిన్‌ దగ్గరకెళ్లి ముఖం కడుక్కొని, డ్రస్‌ మార్చుకొని వచ్చి ఫ్యాన్‌కింద కూర్చుంది కృతిక.
”ఇదిగో అక్కా! కాఫీ…” అంది శృతిక కాఫీ కప్పును అక్క చేతికి ఇస్తు…
కాఫీ సిప్‌ చేస్తూ…
”థ్యాంక్స్‌! శృతీ! ఇవాళ మా అత్తగారు నేనుండనంటూ వెళ్లిపోయినప్పటినుండి ఒకటే కంగారుగా వుంది. మా ఆఫీసార్డర్‌ మారినప్పటినుండి పని ఎక్కువై ఇంటికి లేటుగా వస్తున్నాను. ఈ పిల్లలతో ఎలాగా అని ఆలోచిస్తున్న టైంలో నువ్వొచ్చి ఆదుకున్నావు…” అంది బోలెడంత కృతజ్ఞత కురిపిస్తూ….
… ఒక చిన్న స్మైలిచ్చి ” ఇట్స్ ఓ.కె అక్కా! నువ్వేం కంగారుపడకు..” అంది శృతిక.
అక్కంటే అపురూపం శృతికకు…
చిన్నప్పుడు తను చేసిన తప్పులన్నీ అక్క తనమీద వేసుకొని, తనకెంత సపోర్ట్‌గా వుండేదో శృతికకు ఇంకా గుర్తుంది.
కృతిక ఆఫీసు విషయాలు చెబుతూంటే వింటూ కూర్చుంది శృతిక.
*****
ఆమె మాట్లాడలేదు. పని వత్తిడివల్లనేమో ఆమె ముఖంపై చిరు చెమట ముత్యాలు అద్దినట్లు మెరుస్తోంది. గమ్మత్తుగా అన్పించింది ద్రోణకి…
నెమ్మదిగా ఆమెను ఓ చేత్తో బంధించి, ఇంకో చేత్తో ఆమె తల వెనకభాగాన్ని మృదువుగా పట్టుకొని ఆమె వూహించని విధంగా చెమటలతో తడిసిన ఆమె ముఖాన్ని పెదవులతో అద్ది, సుగంధ పరిమళాన్ని రాస్తుంటే దాన్ని ఏమాత్రం ఆస్వాదించలేని దానిలా మెల్లగా విడిపించుకొని…
”ఇప్పుడు అక్కయ్య పిల్లలొస్తారు. వాళ్లను రెడీ చేసి ట్యూషన్‌కి పంపాలి. అక్క ఆఫీసు నుండి వచ్చేలోపల వంట చేయాలి. పిల్లలు ట్యూషన్‌ నుండి వచ్చాక వాళ్లతో హోంవర్క్‌ చేయించాలి. బావకూడా లేడు. అక్క బాగా అలసిపోతోంది ఆఫీసు పనితో… ” అని పైకి అనలేక.
”నాకు హెడ్డేక్‌గా వుంది. ఇప్పుడు రాలేను” అంది
”టాబ్‌లెట్ వేసుకొని కాఫీ తాగు, అదే తగ్గుతుంది. అది చూడదగిన ఎగ్జిబిషన్‌. చాలామంది ఆర్టిస్ట్‌లు వస్తున్నారు. వాళ్లలో ఎంతోమంది ప్రముఖులున్నారు. నిన్ను వాళ్లకి పరిచయం చేస్తాను.” అన్నాడు.
అక్కడికొచ్చే అనేకమందిలో తనో ప్రముఖమైన వ్యక్తిలా తిరుగుతున్నప్పుడు పక్కన తన భార్య వుండి తనని గమనిస్తూంటే అదో అంతు తెలియని పులకింత ద్రోణకి… సొంతవాళ్ల అభినందనలు కన్పించని బలం కళాకారులకి.
”నేను రాను. నాకు పడుకోవాలని వుంది.” అంది శృతిక.
అతను బలవంత పెట్టలేదు.
”ఓ.కె. బై…” అంటూ అతను వెళ్లబోతూ, అంతలోనే తిరిగి చూసి…
”నువ్వెప్పుడొస్తున్నావు మన ఇంటికి…” అన్నాడు
”అక్కయ్య పిల్లల్తో ఒక్కతే చేసుకోలేక పోతోంది. బావకూడా ఇంట్లో సరిగ్గా వుండటంలేదు. వాళ్లత్తగారు వచ్చేంతవరకు వుండి వస్తాను. నాన్నతో కూడా అదే చెప్పాను” అంది.
నరేంద్రనాధ్‌ అంటే ద్రోణకి గౌరవం. ఆ గౌరవాన్ని ఆయనెప్పుడు పోగొట్టుకోలేదు.
”సరే!” అన్నట్లు తలపంకించాడు ద్రోణ.
”మరి నేను అప్పటివరకు ఇక్కడే వుండనా?” అంది. కారణం అది కాకపోయినా అదే అన్నట్లు ముఖం పెట్టి…
”వాళ్లత్తగారు రాగానే కాల్‌చెయ్యి నేనొచ్చి తీసికెళ్తాను” అన్నాడు
”అలాగే…” అంది
అతను వెళ్లాక – లోపలకెళ్లి వంట చేసింది.
పిల్లలొచ్చాక – అన్నం పెట్టి, హోంవర్క్‌ చేయించింది.
ఇంకా రాని అక్క కోసం ఎదురుచూస్తోంది.
అప్పుడొచ్చింది కృతిక.
లేటయిందేమని అడగలేదు శృతిక. ఆఫీసన్నాక లేటు కాకుండా వుంటుందా? డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకి వెళ్లి, ఇద్దరి పేట్లలో అన్నం పెట్టి కూరలు వేస్తుండగా…
”తలనొప్పిగా వుందన్నావట… ద్రోణ చెప్పాడు. ఎలా వుంది శృతీ?” అంది వాష్‌ చేసుకున్న చేతుల్ని తుడుచుకుంటూ నిలబడి కృతిక.
”తగ్గిందక్కా! వచ్చి కూర్చో! తిందాం! ఆకలిగా వుంది” అంది మనసులో మాత్రం ద్రోణ ఎక్కడ కలిశాడు అక్కకి అనుకుంది శృతిక.
”ద్రోణ ఫోన్‌ చేస్తే ఆఫీసునుండి డైరెక్ట్‌గా ‘ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌’ దగ్గరకి వెళ్లాను శృతీ! మా కొలిగ్స్‌ కూడా వచ్చారు. చాలా గ్రాండ్‌గా వుందక్కడ! అన్ని బొమ్మలు బాగున్నాయి. ముఖ్యంగా ద్రోణ బొమ్మలు బాగా ఆకట్టుకుంటున్నాయి. మా కొలీగ్స్‌కి నచ్చి కొన్ని కొనుక్కెళ్లారు. నేను ద్రోణ వర్షిత్‌ వదినను అని చెప్పుకోవటం నాకెంతో గర్వంగా అన్పించింది.” అంది టేబుల్‌ ముందున్న చెయిర్‌ కొద్దిగా జరిపి కూర్చుంటూ…
శృతిక విోంంది.
”నువ్వు కూడా వచ్చి చూసి వుంటే బావుండేది” అంది అన్నం కలుపుతూ
”ఆయన గదిని శుభ్రం చేస్తూ ఆ బొమ్మల్ని రోజూ చూస్తూనే వున్నాను కదక్కా! కాకుంటే ఆయన మది గదిలో లేననే నా బాధ…” అని పైకి అంటే అక్క బాధపడ్తుందని మౌనంగా అన్నం కెలుకుతోంది శృతిక.
అది గమనించలేదు కృతిక. అలసిపోయి వుండటంతో గబగబ తిని, పిల్లల పక్కన పడుకొని నిద్రపోయింది.
శృతిక మాత్రం నిద్రపట్టక అటు, ఇటు కదులుతూ పడుకొంది.
*****
శ్యాంవర్ధన్‌ తాగకపోతే బావుంటాడు. అలాంటప్పుడు ధైర్యంగా దగ్గరకి వెళ్తుంది సంవేద. తాగినప్పుడు మాత్రం అడుగుదూరంలో వుంటుంది. దగ్గరకి రమ్మని బలవంతం చేస్తాడు. అతని దగ్గర వచ్చే వాసనను భరించలేక ఆమె వెళ్లదు. తాగనప్పుడు కూడా అదే వాసనను ఊహించుకొని భయపడ్తుంది. లోపలనుండి తన్నుకొచ్చే యావగింపును పెదవి చివరన ఆపుకుంటుంది.
ఎన్నోసార్లు వాంతి చేసుకుంది. అతను చేసుకున్న వాంతిని ఎత్తిపోసింది.
ఈ మధ్యన మరీ ఎక్కువగా తాగుతున్నాడు. ఆఫీసుకి వెళ్లకుండా రెండు రోజుల నుండి ఇంట్లోనే పడుకున్నాడు.
ఈ తాగడమనే పనిని భర్త ఇంత సిన్సియర్‌గా ఎందుకు చేస్తున్నాడో సంవేదకి అర్థం కావటంలేదు. అతను తాగే విధానం చూస్తుంటే… ఎవరో తాగమని ప్రోత్సహిస్తున్నట్లు, తరుముతున్నట్లు, తిడుతున్నట్లు, శాపనార్థాలు పెడ్తున్నట్లు, తాగకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తామన్నట్లు, ఎంత తాగితే అంత విజయమన్నట్లు వుంటుంది. అలా తాగితే గుండె, ఊపిరితిత్తులు దెబ్బతింటాయని తెలిసి కూడా తాగుతున్నాడు.
”పెళ్లికి ముందు నా కొడుకు ఇలా లేడు. ఇప్పుడు ఇలా ఒళ్లు తెలియకుండా తాగి పడిపోతున్నాడు. ఇదేనా మొగుడ్ని మలచుకునే పద్ధతి?” అంటూ ఎప్పుడు కన్పిస్తే అప్పుడు చెంపమీద కొట్టినట్లు మాట్లాడుతోంది సంవేద అత్తగారు దేవికారాణి.
అత్తగారు ఏదో బాధతో అంటోంది అని అనుకోకుండా తన కర్మలా భావించి చాటుకెళ్లి ఏడ్చుకొంది సంవేద. ఎంత ఏడ్చుకున్నా మలచుకోవటం అంటే ఏమిటో ఆమెకు తెలియలేదు.
‘అతను మనిషి కదా! రాయి అయితే ఇంకో రాయితో కొట్టి ఆకారాన్ని మలవొచ్చు. మాటలు చెప్పటం తేలికే.. తనదాకా వస్తేనే తెలుస్తాయి లొసుగులు. అన్నట్లు ఆవిడే మాత్రం మలుచుకుందో తన భర్తను’ అని లోలోపల అనుకుంటూ…
”ఏమండీ! మీరిలా తాగుతుంటే అందరు నన్ను అంటున్నారు. నేను మిమ్మల్ని మార్చుకోలేక పోతున్నానట… అందుకే ఇలా తయారయ్యారట. అయినా ఒకరు మారిస్తేనే మారటమేంటి? మీ అంతట మీరు తాగకుండా వుండలేరా? మీ తాగుడుకన్నా వాళ్ల మాటలే నన్ను బాధపెడ్తున్నాయి…” అంది సంవేద.
”ఏంటి టీచరమ్మా! నీ లెక్చర్‌ నిన్నిలా చూస్తుంటే చేతిలో బెత్తమొక్కటే తక్కువనిపిస్తోంది. ఏదీ ఇలారా!” అన్నాడు చాలా క్యాజువల్‌గా, ఎగతాళిగా…
ఆమె రాలేదు. చేయి చాపి జడ అందుకున్నాడు గట్టిగా లాగటంతో.. ”అబ్బా” అంటూ జడ మొదట్లో పట్టుకొని నెమ్మదిగా అతని దగ్గరకి వెళ్లింది.
అదోలా నవ్వి… ”ఇన్ని రోజులు ఇంత పెద్ద జడతో ఏం పని, ఆయిల్‌ దండగ అనుకునేవాడిని.. ఇప్పుడు చూడు దీని ఉపయోగం ఎంతవుందో…!” అంటూ ఆ జడను అలాగే పట్టుకొని ముఖం మీదకి వంగాడు.
”నాకు కడుపులో తిప్పుతోంది. ఒకసారి నాతోరండి! మీకిప్పుడు కౌన్సిలింగ్‌ అవసరం…” అంది ప్రాధేయపడ్తూ అప్పటికే అనేకసార్లు చెప్పి, ఇక ఇదే ఆఖరిసారి అన్నట్లు చెప్పింది.
ఆమె జడను వదిలి… ”సరే! వేదా! నీమాట ఎందుకు కాదనాలి.. వస్తాను అక్కడ నన్ను కూర్చోబెట్టి నాలుగు మాటలు చెబుతారు. అవసరమైతే ట్రాన్స్‌లోకి తీసికెళ్తారు. .. అంతమాత్రాన నా ఎంజాయ్‌మెంట్ ని వదులకుంటా ననుకుంటున్నావా?” అన్నాడు.
చిన్నవయసునుండి సామాజికపరంగా, ఆర్థికపరంగా, కుటుంబపరంగా ఎన్నో బావోద్వేగాలను చవి చూసి, ఎలాంటి వాతావరణానికైనా తట్టుకొని నిలబడగలిగే శక్తిని సాధించిన దానిలా ఒక్కక్షణం ఓర్పుగా కళ్లు మూసుకొని, తిరిగి అతనివైపు చూస్తూ…
”ఇది ఎంజాయ్‌మెంట్? ఈ కంపు ఎంజాయ్‌మెంట్ ? ఒకసారి అద్దంలో చూసుకోండి! అందులో మిమ్మల్ని మీరు చూసుకోలేక దాన్ని పగులగొడతారు”అంది.
లోలోన ఉలికిపాటుతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు శ్యాంవర్ధన్‌ ‘నువ్వు బాగలేవు’ అంటే అతను తట్టుకోలేడు అతనిపట్ల అతనికి ప్రేమ వుంది. శ్రద్ధ వుంది. ఎంత తాగినా గ్లామర్‌ తగ్గకూడదన్న ఇది వుంది. అందుకే…
”నిజంగానే నేను బాగాలేనా వేదా?” అన్నాడు ముఖాన్ని చేతులతో తడుముకుంటూ….
”బాగుండటమంటే ఇలాగేనా ! ఆ ముఖం చూడండి! ఎలా ఉబ్బిందో…! ఆ కళ్లేమో నెత్తుటి ముద్దల్లా…! ఆ జుట్టేమో అస్తవ్యస్తంగా…! ఒళ్లేమో దీర్ఘరోగిలా తూలుతూ…! ఇలావుంటే బావున్నట్లా?” అంది ఇనుమును వేడి మీద వున్నప్పుడే వంచాలన్న సూత్రం తెలిసినదానిలా…
అతని ముఖం పాలిపోయింది.
”ఒక్కసారి ఆలోచించి చూడండి! ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే తప్పేం లేదుగా. ఒకవేళ మీరు మారతారేమో…” అంది.
”నేను కావాలనే తాగుతున్నాను. ఇది రోగం కాదు. మందులు వేసుకుంటే తగ్గటానికి … వ్యసనం. అంత త్వరగా తగ్గదు” అన్నాడు.
” ఏ వ్యసనానికైనా ‘మానసిక రుగ్మతే’ కారణం. మంచి మానసిక నిపుణులతో వైద్యం చేయించుకుంటే త్వరగానే తగ్గుతుంది. ఇదేమైనా ఆర్థిక లోపమా ఒక్కరోజులో జయించలేకపోవటానికి…” అంది. ఆమెలో కలుగుతున్న ఉద్విగ్నతను, వ్యాకులతను, పొంగిపొర్లే దుఃఖాన్ని మిళితం చేసి అతని హృదయం కరిగేలా వ్యక్తం చేసింది.
ఇద్దరు కలిసి హెల్పింగ్‌ హ్యాండ్‌ స్వచ్ఛంద సంస్థ వాళ్లు నడుపుతున్న మద్యపాన వ్యసనవిముక్తి కేంద్రానికి వెళ్లారు.
అక్కడ పూలమొక్కలతో నీడనిచ్చే పెద్ద పెద్ద చెట్లతో హాయిగా అన్పిస్తోంది. లోపలకి వెళ్లగానే ఎదురుగా కూర్చుని వున్న ఓ వ్యక్తి సంవేదను, శ్యాంవర్ధన్‌ను ప్రేమగా పలకరించాడు. కూర్చోమని బెంచీ వైపు చూపించాడు.
వాళ్లు కూర్చున్నారు.
అక్కడ రెండు బెంచీలపై తాగుడికి బానిసలైన మగవాళ్లు, వాళ్ల తాలూకు ఆడవాళ్లు కూర్చుని వున్నారు. వాళ్లలో కొంతమంది లివరు సైతం పాడై, చెంపలు లోతుకి పోయి వికార స్వరూపంతో వున్నారు.. కొంతమందికి ట్రీట్మెంట్ పనిచేసినట్లు ఇప్పుడిప్పుడే కొత్తకళను సంతరించుకొని వున్నారు.
కొంతమంది తాగుబోతుల భార్యలు తమ భర్తలకి ఏదో నచ్చచెబుతూ వాళ్లతో కొట్టించుకొని ఏడుస్తున్నారు. ఆ ఏడుపుకి శ్యాంవర్ధన్‌ చలించాడు.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు అలాంటి సమస్యనే పక్కవారు ఎలా పరిష్కరించుకుంటున్నారో తెలుసుకోవాలన్నట్లు ఆసక్తిగా ఎలా చూస్తారో అలా చూస్తోంది సంవేద.
ఒకతన్ని కూర్చోబెట్టి సైకాలజిస్ట్‌ మాట్లాడుతున్నాడు.
”మొదటి డ్రింకు ఎప్పుడు మొదలు పెట్టారు? అప్పట్లో ఎంత తాగేవారు? ఇప్పుడెంత తాగుతున్నారు? ప్రస్తుతం తాగి వున్నారా?” అని ప్రశ్నించాడు సైకాలజిస్ట్‌.
అతను సమాధానాలు చెబుతున్నాడు.
”మీరిక్కడ నెలరోజులు వుండవలసి వస్తుంది. రెండు, మూడు సిట్టింగ్‌లు తీసుకుంటాం…” అన్నాడు సైకాలజిస్టు.
”నెల రోజులా! నేను వుండను. వున్నా మీమాట వినను. నన్నెవరూ మార్చలేరు. మీరే కాదు. ఆ దేవుడు కూడా … నేను కావాలనే తాగుతున్నాను. నన్నెలా మాన్పిస్తారు?” అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. అతనికింకా తాగిన మత్తు వదల్లేదు.
”మా దగ్గర తీసుకున్న ట్రీట్మెంట్ తో చాలామంది తాగుడు మాని సంతోషంగా వున్నారు. అలాగే మీరు కూడా ” అన్నాడు సైకాలజిస్ట్‌.
అంతలో ఓ యువకుడు వచ్చి సంవేద ముందు నిలబడి, ఆమెనే చూస్తుంటే – శ్యాంవర్ధన్‌ బిత్తరపోయి… ‘ఎవరు నువ్వు? అన్నట్లు చూశాడు.’ సంవేద కూడా అర్థం కానట్లు చూసింది.
సంవేద కళ్లలోకి చూస్తూ… ” నాకోసమే చూస్తున్నావు కదూ! సారీ! లేటయింది. పద ఇంటి కెళ్దాం.” అంటూ సంవేద చేయి పట్టుకోబోయాడు.
క్షణంలో అలర్టయిన శ్యాంవర్ధన్‌ ఆ యువకుడి కాలర్‌ పట్టుకొని…
”ఎవడ్రా నువ్వు? నా భార్యను పట్టుకోబోతున్నావ్‌!” అంటూ ఆ చెంపా, ఈ చెంపా వాయించాడు.
ఆ చర్యకి అందరు లేచి నిలబడి అవాక్కయి చూస్తున్నారు. భర్త తాగి వుంటే? ఇలా తనని సేవ్‌ చెయ్యగలిగి వుండేవాడా అనుకొంది సంవేద.
సైకాలజిస్ట్‌ వెంటనే లేచి వచ్చి శ్యాంవర్ధన్‌న్ని పట్టుకొని ఆపుతూ…
”కోప్పడకండి! అతనిక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మేమిచ్చిన మెడికల్‌ ట్రీట్మెంట్ వల్ల ఆల్కహాల్‌ ప్రభావం తగ్గి భ్రమలు వచ్చి మగతగా, మత్తుగా విపరీత ధోరణిలో మాట్లాడుతున్నాడు… మీరేమీ అనుకోకండి!” అంటూ తిరిగివెళ్లి అతని స్లీో కూర్చున్నాడు.
శ్యాంవర్ధన్‌ ఆ యువకుడ్ని వదిలేశాడు.
అక్కడ చాలామంది అలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఇదేం ప్రపంచంరా అన్నట్లు.. ఆ పరిసరాలను చూస్తూ, ఆ మనుషుల మధ్యన కూర్చోలేనట్లు సంవేద చేయిపట్టుకొని.
”రా! వెళ్దాం!” అంటూ ఆమెను అక్కడ నుండి లాక్కెళ్లాడు శ్యాంవర్ధన్‌
తనతో తాగుడు మాన్పించాలన్న ఆశతోనే కదా సంవేద ఇలాంటి చోటుకి వచ్చి, ఇలాటి సిట్యువేషన్‌ని ఎదుర్కోవలసి వచ్చింది? తాగుడువల్ల మనుషులు ఇంత భీభత్సంగా మారతారా? సంవేద బాధను అర్థం చేసుకోటానికి తన మనసును తను ఒప్పించుకొని, తను మారితే వచ్చే లాభాలేమిటో బేరీజు వేసుకుంటున్నాడు శ్యాంవర్ధన్‌.
రోడ్డుమీద కొందరు వ్యక్తులు గుమిగూడి వుండటం చూసి ఏమి అని అక్కడ ఆగి వాళ్లవైపు వెళ్లారు శ్యాంవర్ధన్‌, సంవేద.
ఒకతను నేలమీద పడివున్నాడు. శ్వాస ఆడుతున్నా స్పృహలో లేడు. డ్రస్‌ను బట్టి చూస్తే ఆఫీసర్‌లా ఉన్నాడు.
”తప్పతాగి పడిపోయాడు. ఎవరో ఏమో! జేబులో విజింగ్‌ కార్డుందేమో చూసి వాళ్లకి ఫోన్‌ చెయ్యండి!” అని అనేవాళ్లే కాని చేసేవాళ్లు లేరక్కడ.. నలుగురు చూసి వెళ్తుంటే ఇంకో నలుగురు చేరుతున్నారు. ప్రపంచంలో వుండే అసహ్యాన్ని, దరిద్రాన్ని చూసినట్లు చూసి ముఖం అదోలా పెట్టుకొని వెళ్తున్నారు. వాహనాలకి అడ్డంగా వుంటే తొక్కేస్తాయని జాలితో అతని చేతులు పట్టుకొని లేపలేక పక్కకి ఈడ్చి వదిలి వెళ్లారు.. నిషాలో చచ్చినట్లు పడి వున్నాడు.
ఉత్కంఠతో మనుషుల మధ్యలోంచి తొంగి చూశారు ప్రేక్షకుల్లా సంవేద, శ్యాంవర్ధన్‌.
”బాగా తాగినట్లున్నాడండీ!” అంటూ అక్కడ ఎక్కువసేపు నిలబడకుండా చాలా క్యాజువల్‌గా భర్త వైపు చూసి ”రండి! వెళ్దాం!” అంది.
ఆ దృశ్యాన్ని చూస్తుంటే శ్యాంవర్ధన్‌ కళ్లలో సన్ని నీటిపొర కదిలింది. కొద్దినిమిషాల క్రితం ఇదే స్థితిలో తనుండి వుంటే తన భార్యను కాపాడుకోగలిగేవాడా? నీళ్ల టబ్‌లో చేయిపెట్టి కెలికినట్టు మనసంతా వికలమైంది. ఎవరో గుండెను తడుతుంటే శరీరమంతా ప్రతి స్పందించినట్లు ఒక విధమైన అలజడి ప్రారంభమైంది.
సంవేదతో మాట్లాడకుండా మౌనంగా ఇల్లు చేరుకున్నాడు.
వెళ్లగానే బాత్‌రూంలోకి వెళ్లి షవర్‌ తిప్పి దానికింద కూర్చున్నాడు.
అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియదు.
సంవేద తలుపు కొడుతుంటే విని కొత్త జన్మ ఎత్తినట్లు బయటకొచ్చాడు.
మార్పుకి యుగాలు అవసరంలేదు. క్షణాలు చాలు.
”ఇప్పుడు చాలా ప్రశాంతంగా, హాయిగా వుంది వేదా! అన్నం పెట్టు ఆకలవుతుంది.” అన్నాడు.
వెంటనే అత్తగారితో పాటు భర్తకి వడ్డించి తనుకూడా తిన్నది సంవేద.
కొడుకులో కొత్తమనిషి కన్పిస్తుంటే తింటున్నంతసేపు ఆనందిస్తూనే వుంది దేవికారాణి.
గదిలోకి వెళ్లి బెడ్‌మీద పడుకున్నాడు శ్యాంవర్ధన్‌. రెండు చేతుల్ని వెనక్కి పోనిచ్చి, తలకింద పెట్టుకొని సీలింగ్‌ వైపు చూస్తున్నాడు.
‘…మనిషన్నాక ప్రేమించాలి. ప్రేమించబడాలి. స్త్రీలను ప్రేమించాలి. పిల్లల్ని ప్రేమించాలి. పూలను ప్రేమించాలి. రాళ్లను కూడా ప్రేమించాలి. కానీ తాగుడును మాత్రం ప్రేమించకూడదు. అలాగే! నవ్వించాలి. కోప్పడాలి. కసురుకోవాలి. ఏడ్పించాలి. కానీ ఆ ఏడుపు ఓ తాగుబోతు భార్య ఏడ్చే ఏడ్పులా మాత్రం వుండకూడదు.’ అని మనసులో అనుకుంటూ సంవేద త్వరగా వస్తే బావుండను కున్నాడు.
సంవేద మెల్లగా తలుపు తీసుకొని లోపలకి వచ్చి భర్తను చూసి ఆశ్చర్య పోయింది… అతనంత ఫ్రెష్‌గా, మాన్లీగా ఎప్పుడులేడు.
ఆమెకోసమే వేచి వున్నట్లు ఆమె రాగానే కాస్త కదిలాడు.
అతనికి బాగా దగ్గరగా వెళ్లింది. ఎప్పటిలా కాకుండా.. అతను ఏమాత్రం అడగకుండానే అతని ముఖాన్ని ఊహించని విధంగా తన ముఖంతో కప్పేసింది. ఆ చర్యతో ఇన్నిరోజులు భార్య ప్రేమను పొందలేని, సరిగ్గా పొందలేని, మనసారా పొందలేని అసంతృప్తిని జయించాడు.
తాగి, తాగి కుడితిలో పడ్డ ఎలుకలా తడిసేకన్నా ఈ అనుభవం అద్భుతంగా వుంది అనుకొని నెమలి పింఛంలా విప్పుకొని తనపై పరుచుకున్న ఆమె కురుల నీడలో మౌనంగా దాగాడు శ్యాంవర్ధన్‌.
అంతేకాదు. ఆ ఆనందానికి మందేమిటో తెలుసుకొని, దాని ప్లగ్‌ ఎక్కడుందో గుర్తించి రీఛార్జీ చేసుకుంటున్నాడు.
*****
రాళ్లూ, రప్పలు మారతాయో లేదో తెలియదుకాని, తన భర్త మాత్రం లేతమొక్కలా వంగాడని, ఆ సంతోషాన్ని ఆముక్తతో పంచుకోవాలని వెళ్లింది సంవేద.
కాలింగ్‌ బెల్‌ రింగ్‌ విని తలుపుతీస్తూ.. సంవేదను చూసి.. మీటగానే వీణపై తీగ కదలినట్లు ”హాయ్‌ వేదా!” అంది ఆముక్త. వెంటనే సంవేద నీటిలో కదిలిన చేపపిల్లలా నవ్వి ”హాయ్‌ ముక్తా!” అంది.
ఆముక్త సంవేదనే చూస్తూ… ”నీ అందంలో ఒక పర్సెంట్ నాకు వచ్చివున్నా బావుండేది కదా!” అంటూ సంవేద చేయిపట్టుకొని అప్యాయంగా లోపలకి తీసికెళ్లింది ఆముక్త.
సన్నగా నవ్వి… ”నా దృష్టిలో అందానికి వ్యక్తిత్వం, తెలివితేటలే కొలమానం. శరీరం కాదు. అయినా నీకు మాత్రం ఏం తక్కువ?” అంది సంవేద.
”నీ అంత లేదుగా.!” అంది ఆముక్త.
”అలా మనం అనుకోకూడదట. దేవుడు ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడట… ” అంటూ కలియజూసింది సంవేద.
ఒకవైపు ఇంటీరియర్ డిజైనర్‌ ఇల్లంతా లేటెస్ట్‌గా డిజైన్‌ చేస్తోంది. ఫ్యాషన్‌ డిజైనరేమో ఆముక్త శారీస్‌కి డిజైన్‌ చేస్తోంది. చాలా అధునాతనంగా కన్పిస్తోంది అక్కడి వాతావారణం.
ఆముక్త శారీస్‌ని, ఇంటికి చేస్తున్న డెకరేషన్‌ని మెచ్చుకోకుండా వుండలేకపోయింది సంవేద.
ఆముక్తకి బోర్‌ కొట్టినప్పుడు కారుని మార్చినట్లే, ఇంటీరియర్ డిజైన్స్‌ని కూడా ఛేంజ్‌ చేపిస్తుంది.
ఆముక్తకి సంవేదతో చాలా విచిత్రంగా స్నేహం ఏర్పడింది. దాన్ని దోసిట్లో కోడిపిల్లను పట్టుకున్నంత పదిలంగా కాపాడుకుంటున్నారు. వాళ్లిద్దరు ఒకచోట కూర్చుంటే కాలాన్నే మరచిపోయి చిన్నపిల్లల్లా మాట్లాడుకుంటారు. సినిమా నుండి జీవితం దాకా అన్నీ మాట్లాడుకుంటారు. ఒకరికి తెలిసింది ఒకరితో పంచుకుంటారు. మైత్రి అన్నాక ఎంతో కొంత స్నేహ రాజకీయాలు వుంటాయి. కానీ వీళ్ల మధ్యన అవి లేకపోవటం విశేషం.
”జీవితం అరిటాకులో పరమాన్నం పెట్టుకొని నెయ్యితో తినటంలా వుంటుందని చూడటం ఇదే మొదటిసారి ముక్తా ! నీ జీవితం నిజంగానే వెన్నెల పాన్పుపై ఓ రాకుమారి పడుకొని నిద్రించే నిద్రలాంటి అందమైన హరివిల్లు…” అంది సంవేద.
”నా కవిత్వం నీకొచ్చినట్లు మాట్లాడుతున్నావు వేదా!” అంది ఆశ్చర్యపోతూ ఆముక్త… ”స్నేహ మహిమ కావొచ్చు…” అంది సంవేద.
”ఈ మధ్యన చాలా రోజులైంది నువ్వు రాక.. ఇన్ని రోజులు నాకు కన్పించకుండా ఎలా వుండగలిగావు వేదా!” అంది ఆముక్త.
”నాకెన్ని పనులు ! ఎన్ని బాధలు …! అవన్నీ చూసుకొని రావాలి కదా!” అంది సంవేద.
”నీకు బాధలేంటి వేదా! నిన్ను చూస్తుంటే బాధల మనిషిలా లేవు…” అంది ఆముక్త.
”బాధలు పడేవాళ్లను నువ్వెప్పుడైనా చూశావా ముక్తా? కనీసం ఆర్ట్‌ ఫిలిమ్స్‌ చూస్తున్నప్పుడు కూడా అలాంటి జీవితాలు వున్నాయని ఊహల్లోకి కూడా రానియ్యవనుకుంటాం… ఎందుకంటే! అలా వస్తే నీ ఊహల్లో వుండే అందమైన వాతావరణం బెదిరిపోతోంది. ముఖ్యంగా నువ్వెంతో ఇష్టంగా చదివే శరత్‌, తిలక్‌ సాహిత్యం కూడా….” అంది సంవేద.
ఒక్కక్షణం సంవేద వైపు చూసి గతం గుర్తుతెచ్చుకొంది ఆముక్త.
సంవేద ఇంటర్‌ చదువుతున్నపుడు.. ఒకరోజు వర్షంలో నిశితను చేయిపట్టుకొని నడిపిస్తూంటే సంవేద తెల్లని పాదాలు మట్టిలో కూరుకుపోవటం చూసి కారాపి ఎక్కమంది ఆముక్త. అప్పుడు ఆముక్త డిగ్రీ సెకండియర్‌లో వుంది. ఆ రోజు తను చూసిన సంవేదయేనా ఇప్పుడు తన ముందున్నది అన్నట్లు చూస్తోంది ఆముక్త. ఇద్దరి మధ్యన మంచి స్నేహం వున్నా – సంవేద పర్సనల్‌ విషయాలను ఆముక్త ఎప్పుడూ అడగదు.
”నీకు తెలిసిన బాధలు వేరు ముక్తా ! నిజానికి అవి బాధలు కావు. జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ లేకపోవటం, ఆకలి అయినప్పుడు అన్నం దొరకపోవటం అసలైన బాధలు. ఇవి ఎలా వుంటాయో నేను అనుభవించాను. కారణం మా నాన్న తాగుబోతు.
ఆయనకి వచ్చే జీతంలో ఎక్కువ శాతం తాగుడుకే వినియోగించుకునేవాడు. ఇంట్లో ఖర్చులకి చాలా తక్కువ ఇస్తాడు. అమ్మ దాన్ని చూసి, చూసి ఖర్చుచేసేది. అలాంటప్పుడు పెద్దదాన్ని కాబట్టి నా అవసరాలకే ఎక్కువ ఉండేవి. అమ్మ పడ్తున్న బాధను చూడలేక చెల్లి నాలాగ ఇబ్బంది పడకూడదని ఎక్కువ శాతం నేను చెల్లి గురించే ఆలోచించేదాన్ని. ఇప్పుడు కూడా నా మనసు నిశిత గురించే బెంగపడ్తుంది.” అంది సంవేద.
”మీ చెల్లి చాలా లక్కీ కదా!” అంది ఆముక్త.
”లక్‌ అనే పదం మా జీవితాల్లో వుండదు.” అంది సీరియస్‌గా ఎటో చూస్తూ సంవేద.
”ప్రేమ వుంది కదా! అంతకన్నా ఏం కావాలి?” అంది ఆముక్త.
”ప్రేమ అనేది ఎంతవరకు పనికొస్తుంది ముక్తా! అది దేన్ని కొనివ్వగలదు చెప్పు! వీల్‌చెయిర్‌ లేనిదే మా చెల్లి వుండలేదు. చాలాకాలం వరకు మా నాన్న దానికి వీల్‌చెయిర్‌ కొనివ్వలేదు. అమ్మ ఇలాంటి విషయాలు ఎవరితో చెప్పొద్దంటుంది. నాన్న ఎలా వున్నా బయట గొప్పగా చెబుతుంది. అందరిలాగే తను కూడా పరిపూర్ణంగా బ్రతుకుతున్నట్లు కన్పిస్తుంది. ఒక్కోసారి అమ్మ ఏమంటుందో తెలుసా?” అంటూ ఆగింది సంవేద. ఆమెకెందుకో ఈరోజు అన్ని విషయాలు ఆముక్తతో పంచుకోవాలని పిస్తోంది.
ఆముక్త కూడా ఇలాంటి ప్రపంచం తెలియని దానిలా కొత్తగా చూస్తోంది.
”ఇదిగో ఈ బొట్టులేకుండా నా ముఖం బాగుండదు వేదా! ముఖం కడిగాక బొట్టులేకుండా అద్దంలో చూసుకోవాలంటేనే భయం నాకు. దీనికోసమే మీ నాన్నను నేను గౌరవించేది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సెంటిమెంట్ ఏంటి అని ఎగతాళిగా చూడకు. ఏ రోజుల్లో నైనా భర్త అనే పదం ఇచ్చే ప్రొటక్షన్‌ భర్త వుండే స్త్రీలకు దక్కే మర్యాద గొప్పగా వుంటుంది. అతను తాగుబోతా! తిరుగుబోతా! జూదగాడా! అన్నది ఎవరూ పట్టించుకోరు. భర్తకు ప్రత్యాన్మాయం లేదు అనేది అమ్మ….” అంది సంవేద.
ఆముక్త అలాగే చూస్తోంది.
”నేను నా తండ్రివల్ల నా అవసరాలనే కాదు ప్రేమాభిమానాలను కూడా కోల్పోయాను. అత్తగారింట్లో బాధలు పడలేక కొద్దిరోజులు అమ్మఒడిలో సేద దీరుదామని వెళ్తే మా నాన్న గారి అభిప్రాయం ఎలా వుంటుందో చెప్పనా ముక్తా! పరాయి ఇంటికి అమ్మేసిన గొడ్డు తాడు తెంపుకొని తిరిగి వస్తే.. తరిమికొట్టినట్లు వుంటుంది.” అంటూ తండ్రి తనను ఎలా చూసేవాడో చెప్పి… తన భర్త శ్యాంవర్ధన్‌ చేత ఈ మధ్యన తాగుడు ఎలా మాన్పించిందో చెప్పింది సంవేద.
ఆముక్త ఒళ్లు జలదరించింది.
ఆమెకు తెలిసిన ప్రపంచం వేరు. అందులో మగవాళ్లంతా బిజినెస్‌ మాగ్నెట్ లు – ఆడవాళ్లేమో మహారాణులు.
మగవాళ్లలో నిరంతర కృషి, శ్రమ, సర్వీస్‌ దాగి వుంటాయి. ఆత్మవిశ్వాసంతో, ప్లానింగ్‌తో, తామెంతో ముఖ్యమైన వ్యక్తులమన్న కమిట్మెంట్ తో వుంటారు. ఇతరులకంటే డిఫరెంట్ గా వుండాలని వ్యూహాత్మకంగా ఆలోచిస్తుంటారు. ప్రయత్నిస్తుంటారు. డబ్బు సంపాయించటానికి, సౌకర్యాలను పెంచుకోటానికి, సరైన గుర్తింపు తెచ్చుకోటానికి ఏం చేయాలి? ఎలా చేయాలి? అని మార్గాలను అన్వేషిస్తుంటారు.
తన భర్త ఆ కోవకి చెందినవాడే.. ‘సక్సెస్‌ అందరికి రాదు,. ఆయాచితంగా అసలే రాదు. ఎన్నో అవకాశాలను విస్తృతం చేసికొని శ్రమించాలి.’ అని చెబుతుంటాడు… సక్సెస్‌ కాలేని వారి గురించి ఎవరు పట్టించుకోరు. వారి ఆదాయం, సంపాదన గురించి ఆలోచించరు. ఎవరి సామర్థ్యాన్ని వాళ్లు గుర్తించుకొని వాళ్లను వాళ్లు నమ్ముకొని సాగిపోతుంటారు. డబ్బే లక్ష్యంగా, ఆ లక్ష్యమే జీవితంగా, ఊపిరిగా నరనరాన జీర్ణించుకొని టార్గెట్ అనే మహాశక్తిని వెంట బెట్టుకొని చిత్తశుద్ధితో సీరియస్‌గా జీవిస్తుంటారు.
”ఏంటి ముక్తా! ఆలోచిస్తున్నావ్‌!” అంది సంవేద.
”ఏం లేదు వేదా!” అంటూ ఆ టాపిక్‌ని అంతటితో వదిలేసి-
”ఇదిగో వేదా! ఈ పత్రికలో ఈ వారం కవితగా నా కవితను ప్రచురించారు. చదివి చెప్పు! ఎలా వుందో…!” అంది ఆముక్త.
కూర్చుని చదివింది సంవేద.
ఆ కవిత నిండా బావుకత.. ప్రకృతి అందాలు.
”ముక్తా! నీలో బాగా రాయగలిగే శక్తి వుంది. ఇలా వూహించి రాయకుండా మాలాంటి వాళ్ల జీవితాల్లోకి తొంగిచూసి వాస్తవానికి దగ్గరగా రాసి మా బాధల్ని ప్రజెంట్ చెయ్యరాదూ.” అంది సంవేద రిక్వెస్ట్‌గా చూస్తూ…
”బాధల్ని, కన్నీళ్లని ఎవరు చదువుతారు వేదా! జీవితంలో ఎప్పుడూ వుండేవేగా ఈ బాధలు…! రాతల్లో కూడా ఇవేనా అనుకుంటారు. ఏడుపు గొట్టు కవితల్ని రాసి ఏడ్పించటం ఎందుకు చెప్పు! నా వరకు నేను ఏమనుకుంటానో తెలుసా! నేను రాసింది చదవగానే హాయిగా ప్యాన్‌కింద కూర్చునో.. పార్కులో కూర్చునో… రెస్టారెంట్ లో కూర్చునో రిలాక్స్‌ అవుతున్న ఫీలింగ్‌ కలగాలి. ఆ ఫీలింగ్‌ కూడా అద్భుతంగా అన్పించాలి”. అంది ఆముక్త.
కష్టపడకుండా అన్నిరకాల రుచుల్ని వడ్డించుకుని తినేవాళ్లకే ఆముక్త మాటలు బావుంటాయి. తండ్రివల్ల, భర్త ద్వారా మానసికంగా బాగా నలిగిన సంవేదకు, ఆముక్త మాటలు అసహజంగా అన్పిస్తున్నాయి.
”నువ్వు ఒకే కోణంలో ఆలోచిస్తున్నావు ముక్తా! ప్రపంచంలో అనేక కోణాలు ఉన్నాయి. వాటిని ఎందుకు చూడవు నువ్వు..? చూడగలిగే శక్తి వుండి కూడా ఒకే దారిలో నడవాలనుకుంటున్నావ్‌! అదీ బాగా నలిగిన దారిలో నడుచుకుంటూ పోతున్నావు.
బాధల్ని కూడా అందంగా చెప్పొచ్చు. అందంగా అనుభవించవచ్చు అంటే నీ కవిత్వం బాధల్లో వున్నవాళ్లను కూడా ఇన్సపైర్ చెయ్యగలగాలి. వాళ్లు ఆ బాధల్లోంచి బయటకొచ్చి సేదతీరాలి. నువ్వు రిప్రజెంట్ చేసే ప్రతి వాక్యంలో నిత్యం మనల్ని మనం చూసుకోగలగాలి. అది చూసి ఎవర్నివాళ్లు ప్రమోట్ చేసుకోగలగాలి. డైనమిక్‌గా మలుచు కోగలగాలి… నీ కవిత్వం వల్ల ఎలాంటి ఉపయోగాలు వున్నాయో అప్పుడు అర్థమై మళ్లీ ఈ భావుకత వైపు వెళ్లవు..” అంది సంవేద.
”నాకు భావుకత అంటే చాలా ఇష్టం వేదా! నా కన్నా ముందు రాసిన భావ కవులంతా యోధానుయోధులుగా ప్రకటింపబడింది పూల గురించి, ప్రకృతి గురించి రాసేకదా!” అంది ఆముక్త.
”వాళ్లు పూలలో కన్నీళ్లను చూశారు. నువ్వు నిప్పుల్ని చూడు” అంది సంవేద చాలా ప్రశాంతంగా చూస్తూ.
”నిప్పుల్ని చూడటం.. మానసికంగా సంఘర్షించటం.. ఆకలిని తీసుకొని, నిత్యం కడుపులో రగిలే జఠరాగ్నిలా వూహించి. దాన్ని అడవిలో వ్యాపించే కార్చిచ్చుతో, సముద్ర గర్బంలో దాగి వుండే బడబాగ్నితో పోల్చిరాయడం వట్టి హంబగ్‌. ఆకలి అనేది అతి సహజమైన క్రియ. కాగితాలపై అంత గొప్పగా రాసేంత పెద్ద అంశమేం కాదు దానికంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బాధలని, ఆకలని, చావుకేకలని, కన్నీటి సంతకాలని, ఏవేవో ప్రజంట్ చేసి పాఠకుల్ని ఈ కవులెందుకు చంపుతారో నాకు అర్థం కావటంలేదు..” అంది విసుగ్గా చూస్తూ ఆముక్త…
ఆ క్షణంలో… ఆముక్త కవిత్వంలో సంవేద చూడాలనుకున్న మార్పు వేళ్ల సందుల్లోంచి కారిపోతున్న నీళ్లలా జారిపోయింది. కవిత్వమనేది గాయపడిన వాళ్లకి ఆయింట్మెంట్ రాసేలా వుండాలి కాని, సోమరివాళ్లను జోకొట్టేలా వుండకూడదని ఆముక్త ఎప్పటికి తెలుసుకోగలదు. మనసులో అనుకుంటూ అనాసక్తిగా చూస్తే బావుండదని, ఆ పత్రికని రాజుబిడ్డలా పదిలంగా పట్టుకొని…
”ఈ పత్రికను పట్టుకెళ్లి మా ఎదురింట్లో, పక్కింట్లో ఇచ్చి చదవమని చెబుతాను ముక్తా! బై… ” అంటూ లేచింది సంవేద. సంతోషపడ్తూ – సంవేదతో గేటువరకు నడిచింది ఆముక్త.
*****
శకుంతల, ప్రభాకర్‌ పదిరోజుల క్రితం పై అంతస్తులోకి మారారు. ఇంటి ఓనర్స్‌ వయసులో పెద్దవాళ్లు కావటంతో మెట్లెక్కి దిగాలంటే కష్టంగా వుందని కిందకి మారారు.
శకుంతల వాళ్లు మారిన ఇంటిని కొత్తగా కడుతుండటంతో ఇంకా పని మిగిలి వుంది. గోడలకి వెలుపల వైపు ప్లాస్టింగ్‌ చేసి, పిట్టగోడలు కట్టాలి. పై అంతస్థు కావటంతో, ఇంకా వర్క్‌ మిగిలి వుండటం వల్ల అద్దె కాస్త తగ్గించారు. ఇది బాగా ప్లస్‌ అయింది శకుంతలకి… ఆ డబ్బుతో నిశిత అడిగింది కొనివ్వాలని ఆమె ఆశ…
”మమ్మీ! ఈసారి నాకు మంచి స్టిక్‌ కొనివ్వు… నాన్న తెచ్చిన స్టిక్‌కి క్వాలిటీ లేక బ్యాలెన్స్‌ ఆగటం లేదు.”అని ఆ మధ్యన నిశిత అన్న మాటలు గుర్తొచ్చాయి.
చికెన్‌ వండమని చెప్పి తాగుతూ కూర్చున్నాడు ప్రభాకర్‌. వంటగదిలోకి వెళ్లి వంట చేస్తూ తన ధ్యాసలో తనుంది. భర్త తాగుడుకి బానిస కాకుండా వుండి వుంటే తనకింత సమస్య వుండేదికాదు. ఈ మధ్యన ఒక టైమంటూ లేకుండా గొంతుదాకా తాగి కూలబడిపోతున్నాడు. ఏది ఏమైనా ఇంకొద్దిగా డబ్బుని పోగుచేసుకుంటే నిశితకి మంచి స్టిక్‌ వస్తుందని ఆలోచిస్తోంది. శకుంతల.
నిశిత చక్రాల కుర్చీలో కూర్చుని, చేతుల సాయంతో దాన్ని నెట్టుకుంటూ గదిలోంచి బయకి వచ్చింది. రాత్రి ఎనిమిది దాటటంతో చుట్టుపక్కల నిశ్శబ్దంగా అన్నిస్తూ, అక్కడంతా తెల్లని హంసరెక్కలా వెన్నెల కురుస్తోంది. ఆ వాతావరణాన్ని మౌనంగా ఆస్వాదిస్తూ దారినవెళ్లే మనుషుల్ని చూస్తూ కూర్చుంది. స్ట్రీట్ లైట్ వెలుగుతోంది.
ప్రభాకర్‌ కొద్ది కొద్దిగా తాగుతూ, మధ్య మధ్యలో వాగుతున్నాడు.
”పెద్దదేమో వున్నన్ని రోజులు వుండి, మొన్న చెప్పకుండానే వెళ్లింది. పెళ్లయ్యాక రోషం ముదిరి, దానికి నా విలువ తెలియటం లేదు. బలుపంటే అదే… కుంటిదేమో పిలిచినా పలకదు. దీనికి పొగరెక్కువైంది. కళ్లు పైకెక్కాయి. ఏం చూసుకునో వీళ్లకింత..?” అంటూ తిట్ల వర్షం కురిపిస్తున్నాడు.
ఎప్పుడైనా స్త్రీలో తల్లి హృదయం వుంటుంది.

ఇంకా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *