March 28, 2024

“కలియుగ వామనుడు” – 1

రచన:మంథా భానుమతి.

1

“ఏటేటి తిన్నా ఏ పన్జేసినా ఎవ్వురైన..
ఏటి సేత్తారీ నిశి రేతిరీ
ఏమారి ముడుసుకోని తొంగుంటే
ఏడనుంచొత్తాదొ నిదురమ్మ
ఏమడగకుండ తన ఒడికి సేర్సుకోదా!”

వీధి చివరున్న ముసలి బిచ్చగాడు సన్నగా పాడుతూ, మలుపు మూల బొంత పరచి ముడుచుకుని పడుక్కున్నాడు. వెంటనే గుర్రు పెట్ట సాగాడు.
మధ్యరాత్రి ఒంటిగంట దాటింది. రెండో ఆట సినిమాకి వెళ్లొచ్చిన వారు కూడా గాఢ నిద్రలోకి జారుకున్నారు.
వీధి దీపాలు నాలుగింటికి ఒకటి చొప్పున, నీరసంగా వెలుగుతున్నాయి. అవి కూడా అక్కడున్న స్థంబాల మాటున ఒదిగి పోయి, ఉండీ లేనట్లున్నాయి.
అప్పుడప్పుడు దూరాన వినిపించే కుక్కల అరుపులు తప్ప వీధంతా నిశ్శబ్దంగా ఉంది. అమావాస్య దగ్గర పడుతోందేమో ఆకాశంలో మిణుకు మిణుకు మనే నక్షత్రాల కాంతి ఏ మాత్రం వెలుగు నివ్వడం లేదు.
చప్పుడు చెయ్యకుండా, అడుగులో అడుగు వేసుకుంటా ప్రవేశించారు ఇద్దరు ఆగంతకులు ఆ పేటలోకి. సన్నని వీధులు. అటూ ఇటూ చిన్న చిన్న ఇళ్లు. ఇళ్ల ముందు మరీ చిన్న అరుగులు.
వీధి చివరికి వచ్చాక, బిచ్చగాడ్ని చూశారు. వాడు లేస్తే..
ఒకడు తన జేబు లోంచి రుమాలు, సీసా తీశాడు. నెమ్మదిగా వెళ్లి నిద్రపోతున్న బిచ్చగాడి మొహం మీద సన్నగా, సెల్ లైట్ వేసి, ముక్కు దగ్గర సీసాలో ద్రవం పోసిన రుమాలు పెట్టాడు. కొద్దిగా కదిలి వాడు మత్తులోకి జారిపోయాడు.
ఇళ్లు లెక్క పెట్టుకుంటూ ఒక ఇంటి ముందు ఆగారు. ఆ వీధినానుకుని మురిక్కాలవ పారుతోంది. ముందు రోజే వాన కురిసిందమో ప్రవాహం బానే ఉంది. అంత కంపు కూడా లేదు.
ఇంటి ముందు అరుగు మీద రెండు బొంతలు పరచి ఉన్నాయి. వాటిమీద పడుక్కున్న రెండు చిన్న ఆకారాలని చూసి తలెగరేశాడు, ఇద్దరిలో లావుగా పొడుగ్గా ఉన్న వాడు. వాడి పేరు నానా.
అటూ ఇటూ చూసి అరుగెక్కారు.
“ఇద్దరున్నారు ఎట్టా? మనోడు ఎవురో కనిపెట్టేదెట్టా?” గుసగుసగా అడిగాడు నానా. కనిపెట్టలేమన్నట్లు తల అడ్డంగా తిప్పాడు రాజా అనే రెండోవాడు, ఇంటి తలుపు మీదో కన్నేసి.
“ఏం చేద్దాం? మళ్లొద్దామా?”
“వద్దొద్దు. చాలా రిస్కవుతుంది” రాజా పళ్లు గిట్టకరిచి అన్నాడు.
“మరి? వదిలేసి పోడమేనా? అది ఇంకా రిస్క్. చావ కొడ్తారు పని అప్పచెప్పినోళ్లు.”
“వదిలేసెందుకు పోతాం? పనవ్వాల. మనకింకా బేరాల్రావాల.”
ఒక బొంత మీదున్న కుర్రాడు కదిలాడు.
“ఇప్పుడీడు లేచాడంటే గోలగోలవుతుంది. ఏదోకటి చెయ్యాలి.” నానా కంగారుగా అన్నాడు.
“సీసా తియ్యి.” ఆర్డరేశాడు రాజా.
నానా, మళ్లీ తన నల్ల కోటు జేబులోంచి చిన్న సీసా, రుమాలు తీశాడు. చేతులు వణుకుతున్నాయి. వాడి శరీరం పెద్దదే కానీ మెదడు చాలా చిన్నది.
“ఎంతసేపురా… గుడ్డ మీద మందొంచు. ఇద్దరకీ చూపీ..” గుసగుస కంఠంతోనే కసిరాడు రాజా.
“ఇద్దరికీనా…”
“అవునిద్దరి ముక్కులకీ చూపియ్యి. నువ్వాడినెత్తుకో.”
నానా ఆశ్చర్యంగా చూశాడు.
“ఎవుడో తెలీనప్పుడు ఇద్దర్నీ పట్టకుపోడవే నయిం. బంపరాఫరు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ.” రాజా ఒక బొంతమీది పిల్లాడిని భుజం మీద వేసుకుని, సైగ చేశాడు.
ముందు కొంచెం తటపటాయించినా నానా కూడా ఇంకో బొంతమీది పిల్లాడినెత్తుకున్నాడు. పాముల్లా జారిపోయారిద్దరూ.
ఆ సీసాలో మందు క్లోరోఫామ్. మోతాదు ఏ మాత్రం అటూ ఇటూ ఐనా ప్రాణాలకే ప్రమాదం.
వాళ్లు ఆ ఇద్దరు పిల్లలనీ ఎత్తుకెళ్లడం ఎందరి జీవితాలనో మార్చేసింది.
“ఇద్దరూ బెండు బొమ్మల్లాగున్నార్రా. ఎంత దూరమైనా పరుగెత్తచ్చు ఈళ్ల నేసుకుని.” కొద్దిగా రొప్పుతూ అన్నాడు నానా.
“మనకి తప్పకుండా బోనస్ ఇస్తాడు అన్న. ఒకళ్లనుకుంటే ఇద్దర్నేసుకున్నాం కద.” రాజా వంకర నవ్వు నవ్వుతూ అన్నాడు.
“అవునూ! ఈళ్లనేం చేస్తారన్నా? దొంగతనాలు నేర్పిస్తారా? బిచ్చగాళ్లని చేస్తారా?”
“అవన్నీ మనకంతవుసరమా?”
“ఇంకా ఎతదూరం?” విసుగ్గా అడిగాడు నానా.
“ఇప్పుడే కద బరువే లేరన్నావు. అంతట్లోనే అలుపొచ్చిందా?” రాజా గొంతులో గరగర, హేళన.
పేటలోంచి మెయిన్ రోడ్డు మీది కొచ్చేశారు. కొంచెం విశాలమైన వీధి. దీపాలు బాగానే వెలుగుతున్నాయి. గబగబా నడుస్తున్నారు. పరుగెడ్తే లేనిపోని అనుమానాలొస్తాయని తెలుసు ఇద్దరికీ.
“అది కాదన్నా! ఇప్పుడు బీటు టైమయింది. పోలీసోళ్ల కంట గాని పడ్డామంటే మొదటికే మోసం. మనం అసలే చాలా ఫేమసిక్కడ. ఒకళ్లైతే ఏదో కత చెప్పచ్చు. ఇద్దరికేం చెప్తాం?”
“అదీ నిజమే. వచ్చేశాంలే.” కుడి పక్కనున్న రోడ్డు మీదికి తిరిగి, మధ్యతరగతి నివాసాలుండే వీధివైపుకి దారితీశాడు రాజా. అటూ ఇటూ వంకర టింకరగా సందులు..
అక్కడ అన్ని ఇళ్లూ ఒకే మాదిరిగా ఉన్నాయి. ఆ సందులన్నీ గుర్తుపెట్టకోవడం కష్టమే, నాలుగైదు సార్లు వస్తే కానీ సాధ్యం కాదు.
సందులన్నీ తిప్పి తిప్పి, సాదా సీదాగా ఉన్న ఒక ఇంటి ముందు ఆగి తలుపు నెమ్మదిగా తట్టాడు రాజా. వెంటనే తలుపు తెరుచుకుంది. పిల్లల్నెత్తుకుని రాజా, నానా లోపలికెళ్లగానే తలుపు మూసేశారు.
వారి ఉనికిని మాటి మాటికీ మార్చడంలో.. అంతగా ప్రాధాన్యత లేని స్థలాల నెన్నుకోడంలో, ఆరితేరిన ముఠా అది. వాళ్లకున్న అనేక వ్యాపారాలలో క్లిష్టమయిందీ, కీలకమైనదీ పిల్లల ఎగుమతి. ఆ ముఠాకి నమ్మకంగా సరుకుని సప్లై చేసే బ్రోకరు రాజా.
ప్రతీ సారీ తన పనికి మనుషుల్ని మారుస్తుంటాడు రాజా. చీకటి పనుల్లో చేతులు కలిపే వాళ్ల పేర్లన్నీ అతగాడికి నాలిక చివరే ఉంటాయి.
ఒకసారి వాడుకున్న వాడిని, ఏ పనికి వెళ్లాడో మర్చి పోయే వరకూ వాడి జోలికి వెళ్లడు.
“ఇద్దరా?” బొంగురు కంఠంతో అడిగాడు అక్కడ నంబర్ వన్ అనే వాడు.
“చూడండి అన్నా! మీకు వద్దనుకుంటే గప్చుప్ గా ఇప్పుడే వాపస్ పెట్టేసొస్తాం. పనికొస్తారేమో అని ఇద్దరినీ తీసుకొచ్చాం.” మూటల్లా చుట్టిన పిల్లలిద్దర్నీ కింద పడుకోబెట్టారు.
ఆ మూటల్ని విప్పి, అందులో ఉన్న పిల్లల్ని సాగదీశాడు గాంగ్ లీడరు.
ఆ పసివాళ్ల సన్న సన్న చేతుల్నీ, కాళ్లనీ నొక్కి చూశాడొకడు. పొడుగుని కొలిచాడింకొకడు. నడుం, పిరుదులు, తల టేపుతో కొలిచాడు మరొకడు.
అచ్చు కలప బేరగాళ్లు దుంగల్ని కొలిచినట్లు.
పిల్లలిద్దరూ కదల్లేదు దుంగ మొద్దుల్లాగే!
ముక్కు దగ్గర వేలుపెట్టి చూశాడు మొదటివాడు. ముందు బతికుండాలిగా.. మత్తుమందెక్కువై చస్తారొకోసారి ఈ గుంటెదవలు.
“కవలలేంటిరా? ఇద్దరివీ అచ్చుగుద్దినట్టొకటే లెక్కగా ఉంది.” లీడరు సంతోషాన్ని దాచుకుంటూ అడిగాడు. సగం రేటుకి ఇంకొక బేరం వచ్చింది.. ఆనందమానందవే!
“ఏమోనన్నా. ఇద్దరూ ఒకే అరుగుమీదున్నారు. మన బేరం ఏదో తెలీక ఇద్దర్నీ అట్టుకొచ్చేశాం.” రాజా గొంతులో కూడా అంతులేని ఆనందం.
“చాలా రిస్కు తీసుకున్నా. కాస్త చూసియ్యన్నా!” రాజా గొణిగాడు.
“ఇత్తా ఇత్తా. ముందు నాకు రానీరా!”
“అంటే ఆ రెండో సరుక్కి ఇప్పుడీవా?”
“ఇస్తాలే. ముందు నాకు రావాలిగా.. ఈ సరుకు డిస్పాచీ చేసి లెక్క చూసుకూని ఇత్తా. మళ్లీ కలుస్తాం కదా.”
లీడరిచ్చిన డబ్బు తీసుకుని కాస్త నిరాశగా బైటికొచ్చాడు రాజా, నానాకి సైగ చేసి.
“ఏందన్నా! మరీ కోళ్లనో, గొర్రెల్నో, గొడ్లనో లెక్కేసినట్లు ఆ లెక్కలేంటీ.. ఆ కొలతలేంటీ?” ఆశ్చర్యంగా అడిగాడు నానా. వాడు ఇటువంటి పనికి రావడం ఇదే మొదలు.
“అంతేరా. ఇంక ఆళ్లు జంతువుల్తో సమానవే. ఎక్కడికెల్తారో ఏమౌతారో ఏరికి తెల్సు? ఆళ్ల నుదుట్లొ ఏం రాసుందో..” వేదాంతం వల్లించాడు. ఒక్క క్షణం మాత్రం తను చేస్తున్న పనికి విచారిస్తున్నట్లు ఉంది రాజా గొంతు.
“మరి ఎందుకన్నా ఇట్టాంటి పని? ఎందుకో నాకు బాగా అన్పించడంలేదు. ఆ పిల్లల మొహాలు సూత్తా ఉంటే బాధేస్తోంది.”
నానా మాటలకి కోపం తన్నుకొచ్చింది రాజాకి.
కస్సుమన్నాడు.
తను చేస్తున్న తప్పుడు పని ఎవరైనా ఎత్తి చూపుతే అంతే మరి. అందులో తన తోడుదొంగ. తన దగ్గర ఎంగిలాకులేరుకునే ఎదవ.
“ఏందిరా ఏదో పత్తిత్తులా ఏసాలేత్తన్నావ్. పేగుల్తీసేస్తా జాగర్త. మన బతుకులింతే. ఆ బగమంతుడు మనకీ పనే ఎట్టాడు. కసకసా పీకల్తెగ్గొట్టేత్తన్నామా? కన్నోల్లకే బరువై అమ్ముకుంటుంటే ఆ పిల్లల్ని కొనుక్కనే ఆళ్లకి అందిస్తన్నాం. మనం చేసేది రవాణానే. అసలోళ్లకే పోతాది పాపం అంతా. ఇదిగో నీ వాటా.” మెయిన్ రోడ్డెక్కాక నానా చేతిలో కొన్ని నోట్లు పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా చీకట్లో కలిసిపోయాడు రాజా.
నానా వీధి దీపం కిందికెళ్లి అటూ ఇటూ చూసి నోట్లు లెక్కెట్టుకున్నాడు. రెండు వేలున్నాయి. దీని కోసమా ఇద్దరు పసివాళ్లని వాళ్ల అమ్మల దగ్గర్నుంచి తీసుకొచ్చేశాడు! పొద్దున్న లేచి అమ్మ కోసం ఏడుత్తే..
ఎటువంటి బుద్ధిలేని పని చేశాడు..
“నేను కాపోతే ఇంకెవురైనా చేస్తారు..” సర్ది చెప్పుకోడానికి చూశాడు.
ఐనా సరే.. కడుపులో తిప్పడం మొదలెట్టింది.
దీపం స్థంభం కింద నేల మీద కూర్చుని ఆ నిశీధిలో భోరుమని ఏడవ సాగాడు నానా. ఇప్పుడు తను ఎత్తుకొచ్చినట్టే తనను కూడా ఎత్తుకెళ్లిన, తనని పెంచిన కర్కోటకుడిని, ఒక ఎలుగుబంటిని.. వాడు పెట్టిన ఆ చిత్ర హింసనీ తల్చుకుని తల్చుకుని.
ఈ పిల్లల్ని కూడా అంతేనా? వీళ్లకు అమ్మెలా ఉంటుందో తెలుసు. అమ్మ ప్రేమా అనుభవమే.. అట్టాంటప్పుడు ఇంకా కష్టం.
థూ.. ఏం బతుకురా ఎదవన్నెరెదవా!
దుఃఖం తన్నుకొచ్చింది నాభిలోంచీ.
………
నానాకి అమ్మ అంటే ఎలా ఉంటుందో తెలీదు. ఎప్పుడు ఎలా వచ్చి పడ్డాడో ఆ గుంపులోకి. మనుషుల్ని గుర్తుపట్టే వయసు వచ్చేసరికి ఎదురుగా ఎలుగుబంటి లాంటి గూండా. రాళ్లేనా వాడి గుండె కంటే మెత్తగా ఉంటాయేమో.
మోట చేతుల్తోటి ఎగరేసి పట్టుకుంటే పిల్లలు భయంతో కెవ్వుమని కేకలు.. ఆ కేకలే వాడికి ఆనందం. నానాతో కలిసి ఆరుగురు మగ పిల్లలు. చింపిరి జుట్లూ, కన్నీటి చారికల బుగ్గలూ.. అందరూ ఒకే రకం. ఎక్కడ్నుంచెత్తుకొచ్చాడో పాలుతాగే పసి కందుల్ని. గంజి, అన్నం ముద్దల్తో పెరిగారు.
నడక వచ్చినప్పట్నుంచీ అడుక్కోడం నేర్చుకున్నారు.
“అడుక్కునొస్తారా దొంగతనం చేస్తారా” ఒక్కోరినీ పిలిచి కొంచెం పెద్దయ్యాక అడిగాడు గూండా.
అసలేదీ అర్ధం కాదా చిన్నారులకి.. చెప్పిన పని చెయ్యడం తప్ప.
కానీ అడుక్కునొస్తా నన్నవాడి పరిస్థితి చూశాక మిగిలిన వాళ్లంతా దొంగతనవే అని ఒప్పేసుకున్నారు.
వాడి రెండు కళ్లూ పీకించేశాడా రాక్షసుడు. అది తలుచుకుంటే ఇప్పటికీ వెన్ను లోంచీ వణుకొస్తుంది నానాకి.
ఏ మూలో మిగిలున్న మానవత్వం అప్పుడప్పుడు లేస్తుంటుంది. ముఖ్యంగా ఎవరికైనా హాని కలిగించేదైతే.. డబ్బుల దొంగతనం వరకూ ఫరవాలేదు.
ఎవుడో తనని కూడా ఎత్తుకొచ్చి వాడి దగ్గర పడేసుంటారు. అమ్మా, నాన్నా తనని కూడా అమ్మేసుంటారా? తల విదిలించాడు.. అమ్మా నాన్నా ఎవరో తెలీనప్పుడు వాళ్లని అనుకునేం లాభం?
జరగవలసిన అనర్ధం జరిగిపోయింది.. పీకలోతు కూరుకు పోయాడు. తప్పించుకోవడం అసంభవం. తనే కాదు.. ఇప్పుడు కొట్టుకొచ్చిన ఈ చిన్న పిల్లలు కూడా! ఎక్కడికి తీసుకుపోతారో? ఏం పనులు చేయిస్తారో..
ఏ దేముడో రక్షిస్తే తప్ప! లేదా దేముడెవర్నైనా పంపుతే తప్ప..
“ఏమో ఏం చెప్పగలం? ఎవుడైనా రాకపోతాడా? ఎన్నాళ్లు సాగుతాయి అరాచకాలు? రాక్షసులు పుడుతూనే ఉంటారు. ఆళ్లకి ఊడిగం చేడానికి తనలాంటి ఎదవలు కూడా పుడ్తూనే ఉటారు. ఆళ్ల పని పట్టటానికి దేవుడు కూడా పుడ్తూనే ఉంటాడు.” కళ్లు చొక్కాతో తుడుచుకుని, లేచి కాళ్లీడ్చుకుంటూ తనుండే బస్తీకి బయల్దేరాడు.
వచ్చిన రెండు వేలలో వెయ్యిరూపాయలు యెలుగుబంటి గూండాగాడు కొట్టేస్తాడు. మళ్లీ ఇంకో యెదవ పని చేసే వరకూ దీంతోనే సర్దుకోవాల.
ఆడు బతికున్నంత కాలం తన సంపాదనలో సగం కొట్టేస్తాడు.
ఆబద్ధం చెప్తే ఇట్టే పసికట్టేస్తాడు.
ఎప్పుడో ఆడ్ని తనే చంపేస్తాడు. మనసులోనే శపథం పట్టేశాడు.
ఈ పిల్లలనెక్కడికి తీసుకుపోతారో.. నానా కళ్లలో నీళ్లు చలమలా ఊరుతూనే ఉన్నాయి.
దేవుడు పుట్టలేదు కానీ, నానా కోరినట్టుగా తన బంటును పంపించాడెప్పుడో..
పదకొండేళ్ల ముందే ఈ లోకంలోకి వచ్చాడు ఆ బంటు. వాడినే నానా ఎత్తుకొచ్చాడు.
ఆ బంటు చేత ఏం చెయ్య దలిచాడో కాలమే చెప్పాలి.
సరిగ్గా ఐదేళ్ళ క్రితం.. మొదలయింది.
………………
సంధ్య వెలుగులు నెమ్మదిగా తగ్గుతున్నాయి.
వీధి వీధంతా ఒక్కసారిగా విద్యుత్ దీపాల కాంతితో ధగధగ మెరవసాగింది. నమ్రతతో నడిచి వస్తున్నారు అనేక రకాల ఆహార్యాలతో అన్ని వయసుల వాళ్ళూ. పొందికైన చీర కట్టుతో, పంజాబీ దుస్తులతో, పట్టు పావడా జాకెట్టూ ఓణీలతో ఆడవారు.. పొందూరు పంచె కట్టుతో, లాల్చీ పైజామాలతో మగవారూ.. రంగు రంగుల పూలతో మందంగా సాగి పోయే సెలయేరులా వస్తున్నారు.
పెద్దవారి చేతులు పట్టుకున్న చిన్నారులు కూడా సహజసిద్ధమైన దుందుడుకుతనం మాని అడుగులో అడుగు వేస్తూ వస్తున్నారు.
అందరి నుదుటి మీదా విభూతి రేకలు, బొట్లు మెరుస్తున్నాయి దీపాల కాంతిలో.
ఆ రోజు గురువారం.
షిర్డీ సాయిబాబా గుడి ఉన్న వీధి అది. పసి వారి దగ్గర్నుంచీ, వయో వృద్ధుల వరకూ అక్కడ నడుస్తుంటే భక్తి భావం అణువణువునా ఉప్పొంగుతుంది.
గుడి బైట గోడకున్న స్పీకర్లోంచి సాయి భజన వస్తోంది. ఎదురుగా ఉన్న, పళ్ళు, కొబ్బరి కాయలు, పూల కొట్ల దగ్గర హడావుడి పెరుగుతోంది.
బుల్లయ్య తన పూల బండి దగ్గర చకచకా పూల పొట్లాలు కట్టి అడిగిన వాళ్ళకి అందిస్తున్నాడు. మధ్యలో, గులాబీలు అయిపోవడం గమనించాడు.
“చిన్నా!” కొంచెం గట్టిగా అరిచాడు.
మోకాలు పైన చేత్తో సున్నితంగా తట్టినట్లయింది. కిందికి చూశాడు.
బండి కిందనుంచి చిన్న గంప నిండా గులాబీలు అందించాడు చిన్నా. వాడి పేరు చిన్ని కృష్ణ. అందరూ చిన్నా అనే పిలుస్తారు.
ఎప్పుడూ చెరగని చిరునవ్వుంటుంది వాడి మొహంలో. ఎప్పటికప్పుడు ఏ పూలు తక్కువౌవుతుంటే అవి తయారుగా ఉంచుతాడు.
అవి తీసుకుని ఖాళీ గంపని అందించాడు బుల్లయ్య. దాంట్లో చకచకా కాడ మల్లెల్ని నింపసాగాడు చిన్నా, బండి కింద నిల్చునే.
చిన్నాకి ఆరో ఏడు నడుస్తోంది.. వయసుకి మించిన తెలివితేటలు.
వాళ్ళ ఇంటికి అర కిలో మీటరు దూరంలో ఉన్న ఇంగ్లీషు మీడియమ్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఇంకొక నెలలో మూడో క్లాసుకొస్తాడు. ఇంగ్లీష్, హిందీ భాషలలో వాక్యాలు, చిన్న చిన్న కథలు కూడా రాస్తాడు. కార్టూన్లు, పిల్లల పుస్తకాలు చదవడం అలవాటయింది.
ఏ పుస్తకమైనా చదవడం మొదలు పెడ్తే పూర్తయే వరకూ ఆపడు.
ఎన్ని పనులున్నా బుల్లయ్య, చిన్నాని తన పూల బండిమీద కూర్చోపెట్టుకుని బళ్ళో దింపి వస్తాడు. చిన్నా కూడా తేలిగ్గా నాలుగు చామంతులంత బరువే ఉంటాడు. బండి మీద కూర్చున్నంతసేపూ.. తన లేత చేతులతో చామంతుల కాడల్ని తుంచి, గంపలో తీరుగా సర్దుతుంటాడు.
చిన్న పిల్లల్లో అంత పొందిగ్గా ఉండే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు.
స్కూలు కెళ్ళేటప్పుడెలా వెళ్తాడో అంతే శుభ్రంగా సాయంత్రం ఇంటికి తిరిగొస్తాడు.
“మా చిన్ని కిట్టయ్యరా!” ఎదురొచ్చిన నాయనమ్మ ఉంగరాల జుట్టు సవరిస్తూ ఎగరేసి ఎత్తుకుని ముద్దుపెట్టుకుంటుంటే, ఈ మధ్యని చిన్నాకి నచ్చడం లేదు. ఈ నాయనమ్మ ఇంకా చిన్నపిల్లోడనుకుంటోంది. చేత్తో గట్టిగా ఎర్రబడిన బుగ్గ తుడిచేసుకుంటాడు.
అయినా ఏం మాట్లాడ్డు.. నెమ్మదిగా కిందికి జారి, పెద్దమనిషిలా చెట్టుకిందికి వెళ్లి ఎక్కాలు బట్టీ కొడతాడు.. నాయనమ్మకి మరింత ముద్దొచ్చేట్లు.
“రాజ్యాలేల్తావురా కిట్టయ్యా!” దూరం నుంచే రెండుచేతులూ మనవడి వైపు తిప్పి గాల్లోంచి పైకి లేపి మెటికలు విరుస్తుంది.
భగవంతుడు ఎవరిని ఎలా ఎందుకు పుట్టిస్తాడో ఎవరూ చెప్పలేరు. అయితే ప్రతీ వారి పుట్టుకకీ ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది.
చిన్నా ఏం సాధిస్తాడో కాలమే చెప్పాలి.
………………
తెల్లటి ముసుగేసుకుని రెడు చేతులూ చాపి మీది మీదికొస్తున్నాడు.. వాడే! ఎప్పుడూ చిన్నా దగ్గరకొచ్చి బెదిరిస్తుంటాడు. పొద్దున్నే మంచు కప్పుకున్న మంగళగిరి కొండలాగున్నాడు. లేపి భుజాన్నేసుకున్నాడు చిన్నాని.
చిన్నా మెడ సారించి, ఆకాశంలోకి చూస్తే కానీ వాడి తల కనిపించదు. వాడు ఎత్తుకుని నడుస్తుంటే మేఘాల్లోంచి వెళ్ళిపోతున్నటుంది.
గాలికి ముసుగు పక్కకి తొలిగింది. భయంకరమైన మీసాలు, ఎర్రటి కళ్ళు. నల్లని రంగు.. ముందుకొచ్చిన తెల్లని పళ్లు.. గుండెల వరకూ పాకిన గడ్డం. చిన్నాకి వెన్నులోంచీ వణుకొచ్చింది.
“అమ్మా.. అమ్మా!” గొంతు చించుకుని అరిచాడు చిన్నా.
అరిచాననుకున్నాడు…
ఒళ్ళంతా చెమటలు. గొంతు దాహంతో ఆర్చుకుపోతోంది.
చిన్నాని కింద పడేసి పారిపోయాడు ముసుగువాడు. నవారు మంచం మీద లేచి కూర్చున్నాడు చిన్నా.
“ఏందిరా? వణికి పోతున్నావు? మళ్ళా కల కానొచ్చిందా?” సూరమ్మ స్టీలు గ్లాసుతో నీళ్ళు తాగించింది.
“వాడేనే అమ్మా! నన్నెత్తుకు పోతాడేమో.. నాకు భయం వేస్తోందే..” చిన్నా ఏడుపు గొంతుతో అన్నాడు.
“నేనున్నా కదరా కన్నా! ఎవుడూ రాలేడు. వస్తే ఊరుకుంటానేంటీ.. కంట్లో కారం కొడ్తా. కత్తిపీట తెచ్చి కసాపిసా తరిగేస్తా..” కొడుకుని ఒళ్ళో పడుక్కో బెట్టుకుని జో కొట్టింది సూరమ్మ.
చిన్నా వెక్కుతూనే నిద్రపోయాడు. వాడి తల నిమురుతూ ఆలోచనలో పడింది సూరమ్మ.
రెండు రోజుల కొక సారి ఇట్లాంటి కల వస్తుంది చిన్నాకి. కాకపోతే ఒకోసారి నల్లటి ముసుగు… గడ్డం, మీసాలు, ఎర్ర కళ్ళు మాత్రం అవే. తెలివొచ్చాక కూడా తరుముతుంది ఆ రూపం. వెక్కుతూనే వర్ణిస్తాడు.
కళ్ళనిండా నీళ్ళతో కొడుకుని చూసుకుంది.
ఒకవేళ నిజంగానే ఎవరైనా ఎత్తుకుపోతే.. తట్టుకోగలదా తను!
……………….
ఆరోజు ఆదివారం. బుల్లయ్య పొద్దు పొడవక ముందే నీళ్ళోసుకుని, తెల్లని పంచ లాల్చీ తొడిగి, నుదుటి మీద బాబా విభూతి పెట్టుకుని, గుడి దగ్గరకెళ్ళి పోయాడు. పొద్దుటి పూట కొడుకుని బండి దగ్గరకి రానియ్యడు.
ఆదివారం అంతా చిన్నా తలంటుపోసుకోవడం, హోంవర్కులు, చదువుకోవడం.. లైబ్రరీకి వెళ్ళడం, బట్టలు విస్త్రీ చేయించుకోడం వంటి పనులలో మునగానాం తేలానాం లాగుంటాడు.
లైబ్రరీలో పిల్లల విభాగంలో కెళ్ళాడంటే.. నాయనమ్మ వెళ్ళి అన్నానికి పిల్చుకుని రావలసిందే.
ఆ క్రమశిక్షణ చిన్నాగాడికి ఆ ఇంట్లో ఎవరూ చెప్పకుండానే అమలైపోతోంది. స్కూల్లో టీచర్ల ప్రభావం చాలా ఉంది వాడి మీద. ముఖ్యంగా సరస్వతీ టీచరు..
‘సరస్వతీ టీచర్’ అంటే చిన్నాకి చాలా ఇష్టం. చిన్నా ఇంటి సంగతులన్నీ తెలుసుకుని మరింత అభిమానం పెంచుకుంది ఆవిడ కూడా, వాడి మీద. ఇంటిడుమందీ వాడి భవిష్యత్తు మీద చూపిస్తున్న శ్రద్ధ చూసి ముచ్చట పడిపోతుంటుంది.
రోజూ.. పొద్దున్నే బుల్లయ్య పెద్ద మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పూలన్నింటిలో మంచిది ఏరి సరస్వతీ టీచర్ కిస్తుంటాడు చిన్నా. తోటి టీచర్లు, పెంపుడు కొడుకనీ, ఆరాధకుడనీ ఆటపట్టిస్తూ ఉంటారు. అందరికీ చిరునవ్వుతో సమాధానం చెపుతుంది సరస్వతి. ప్రతీ ఆదివారం చిన్నా వాళ్ళ కాలనీకి వచ్చి పిల్లలందరికీ పద్యాలు నేర్పిస్తుంటుంది.
ఎందుకో ఆ రోజు ఇంకా సరస్వతి రాలేదు. పిల్లలంతా చిన్నా వాళ్ళింటికి రెండిళ్ళవతలున్న కమ్యూనిటీ హాల్లోకి చేరారు. ఇంట్లోంచి బైటికొచ్చిన చిన్నాకి పక్కింటి జానీ ఆంటీ, వాళ్ళింటి వాకిలి ముందు కూర్చుని, మోకాళ్ళ మీద తల ఆన్చి ఏడుస్తున్నట్లు అనిపించింది. దగ్గరగా వెళ్ళి చూశాడు.
జానీకి ముప్ఫై ఏళ్ళుంటాయి. తొమ్మిది నెలలు నిండాయి. నాలుగో కానుపు… నెమ్మదిగా మూలుగుతూ, బాధని అణచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కళ్ళలోంచి నీళ్ళు కారిపోతున్నాయి.
ఆంటీ పక్కనే గొంతుక్కూర్చుని చెయ్యి పట్టుకున్నాడు చిన్నా.
“అమ్మని పిల్చుకొచ్చేదా?”
తలూపింది జానీ.. మాట్లాడ్డానికి కూడా శక్తి లేదు.
“అమ్మా! జానీ ఆంటీ పిలుస్తోంది. కడుపునొప్పిగా ఉందంట. రిక్షా పిల్చుకరానా? హాస్పిటల్ కెళ్ళాలో ఏమో!”
సూరమ్మ పరుగెత్తుకుని వచ్చింది. అదే సమయానికి ఆటో దిగిన సరస్వతి, పరిస్థితి చూసి అదే ఆటోలో ఇద్దరినీ ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకెళ్ళింది.
……………
పట్టణానికి ఆనుకుని బలహీన వర్గాలకి, ప్రభుత్వం కట్టించిన పేట అది. అందులో ఉండే వారంతా ఏరోజు ఆదాయం ఆరోజే ఖర్చుపెట్టుకునే వాళ్లే. అన్ని మతాల వాళ్ళూ కష్టం సుఖం కలబోసుకుంటారు.
సూరమ్మ, బుల్లయ్యలుండేది ఆ బస్తీలోనే. మిగిలిపోయిన పూలని రోజూ చుట్టుపక్కల అందరికీ పంచుతుంటారు. బస్తీలో ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేస్తారు.. కానీ చాలా మంది మగవాళ్ళు తాము సంపాదించిందాంట్లో సగం పైగా తాగుడికే ధార పోస్తారు.
అందుకే, వారి పిల్లా పాపలు సగం కడుపులే నింపుకుంటారు. తల్లుల కడుపులు వీపుకి అంటుకుపోయుంటాయి.
బుల్లయ్య వంటివారు కొద్ది మంది బాధ్యతగా ఉన్నా ఆకలికేకలు వినిపిస్తూనే ఉంటాయి అను నిత్యం.
రాత్రిళ్లు మొగుళ్ళచేత తన్నులు తినే ఆడవాళ్ళ ఆర్తనాదాలు ఎక్కువే. మగవాళ్ల కేకలు, బూతులు.. సామాన్లని తన్నడం, చేతికందినవి విసిరెయ్యడం ఆ సమయంలో భీభత్సంగా ఉంటుందక్కడ.
చాలా మందికి ముగ్గురో నలుగురో సంతానం. ఒక బిడ్డకే కడుపునింపలేని పరిస్థితి.. ఎంతమంది సంఘసేవకులు వచ్చి ఉపన్యాసాలిచ్చినా పెడచెవి పెడ్తారు అక్కడి ప్రజలు..
అయినా.. కులమతాల పరంగా ప్రశాంతంగా ఉంటుంది పేట.
గణపతి నవరాత్రులకీ, రంజాన్ కీ, క్రిష్ట్ మస్ కీ అందరూ కలుస్తారు.. ఎక్కడా అసహనం అనే మాట వినిపించదు.
……………
“జానీ ఆంటీ! ఒక్కసారి తమ్ముడినెత్తుకోవద్దా?” చిన్నా పసివాడిని ఆశగా చూస్తూ అడిగాడు.
“అప్పడే కాదు చిన్నా.. ఇంకా కొద్ది రోజులయ్యాక.” జానీకి కొడుకు పుట్టి నెలరోజులయింది. మిగిలిన ముగ్గురు పిల్లలూ.. జానీ ఇద్దరు కొడుకులు, ఒక కూతురు కూడా గుమికూడారు చిన్నాతో..
తమ కంటే చిన్నవాడైన టింకూని చూస్తుంటే అందరికీ తమాషాగా ఉంది.. ముఖ్యంగా చిన్నాకి. వాడుకూడా తమ్ముడూ అనే పిలుస్తున్నాడు. సమయం చిక్కినప్పుడు పక్కింట్లోనే ఉంటున్నాడు.
పిల్లలంతా కలిసి ఆటలు.. పాటలు.
రెండిళ్ళకీ కలిపి ఒకటే పెద్ద అరుగు, వాకిలి. జానీ మొగుడు మస్తానయ్య మేస్త్రీ పని చేస్తాడు. తను పనిచేసే దగ్గర్నుంచి మిగిలిన మాల్ తెచ్చి, వాకిలంతా ఒకరోజు సిమెంట్ చేసేశాడు.
వేసంకాలం రాత్రి అందరూ ఆరుబయట పడుక్కుని కథలూ.. కబుర్లూ..
మస్తానయ్య మాత్రం అప్పుడప్పుడు తాగి వస్తుంటాడు.
పండగలూ పబ్బాలూ, ఆటలూ పాటలూ, కష్టాలూ కన్నీళ్ళ మధ్య కాలం గడుస్తోంది.
……………..

టింకూ పుట్టిన ఐదేళ్ల తరువాత..
చిన్నాకి పదకొండేళ్లు నిండుతాయి.
“అమ్మా.. అమ్మా!” చిన్నా వెనుక వరండా పిట్టగోడ ఎక్కి నిల్చుని పిలిచాడు, తల వంచుకుని.
“అయ్యో.. చిన్నాకి స్కూలు టైమైతా ఉంది. ఇయ్యాళ ఆలిశ్యమైపోనాది..” సూరమ్మ రెండంగల్లో వచ్చి, కొడుక్కి స్కూల్ యూనిఫామ్ వేసి, తలదువ్వి, బుల్లి బూట్లు తొడిగింది.
“చిన్నా.. చిన్నా! పరీచ్చలకి చదూకున్నావా బాగా?”
మౌనంగా బూట్లకి తాళ్ళు ముడేస్తున్న అమ్మని చూస్తున్నాడు.
“ఎంతరిచినా పలకవేంరా?” చిన్నాదించిన తలెత్తి చూశాడు.
వాడి పెద్ద పెద్ద కళ్ళ నిండా నీరు. సూరమ్మ గుండె తరుక్కు పోయింది. దగ్గరగా వెళ్ళి వాడిని ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది.
“ఏందిరా.. సదూకోలేదా?”
“అమ్మా! నేనెందుకే ఇంతే ఉన్నా.. మా క్లాసు పిల్లల నడుం వరకే వస్తా. అందర్లా అంత ఎత్తుగా అవ్వలేనామ్మా!” చిన్నా భుజం మీద మొహం పెట్టి నిశ్సబ్దంగా కన్నీరు కార్చింది సూరమ్మ.
“నీకు తెలిసిందే కదా కన్నయ్యా! ఆ దేవుడు ఎందుకిట్టా చేశాడో.. మనం ఏం చెయ్యలేం. మనకమిరి ఉన్నదాంట్లోంచే సంతోసం ఎతుక్కోవాలి.”
చిన్నాకి పదకొండేళ్లు నిండుతున్నా ఐదేళ్ళ పిల్లాడంతే ఎత్తు, బరువు ఉంటాడు. పరిశీలించి చూస్తేగానీ మొహంలో ఉన్న తేడా కనిపించదు. శారీరకంగా ఎదుగుదల లేకపోయినా తెలివి తన ఈడు పిల్లల కంటే ఎక్కువే.
సరిగ్గా ఏడాది క్రితం.. నాయనమ్మ కనిపెట్టింది చిన్నా లోని తేడాని. అప్పటి వరకూ ఎవరికీ అనుమానం రాలేదు.
చకచకా ఎదిగిపోతున్న టింకూని చూస్తుంటే.. ఎప్పుడూ టింకూని ఆడిస్తుండే చిన్నా అంతే ఉంటున్నాడే అని..
వెంటనే గోలగోల చేసి కొడుకునీ కోడల్నీ ఆసుపత్రికి తరిమింది. మొదట్లో వినిపించుకోలేదు వాళ్లు. కొందరు ఆలిశ్యంగా పెరుగుతారని వాదించారు.
పెద్దామె ఊరుకోలేదు. మొండి పట్టు పట్టి కూర్చుంది.
“అదేమాటా డాక్టేరుని చెప్పనీరా..” అంటూ పోరి పోరి పంపింది.
పుట్టుకతో ఉన్న జన్యు లోపంవల్ల వాడు మరుగుజ్జుగానే ఉండిపోతాడని, ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి తెలుసుకున్న సంగతి ఆ బుల్లి ప్రాణానికి ఎలా చెప్పాలో తెలియలేదు సూరమ్మకి, బుల్లయ్యకి.
డాక్టర్ గారే కూర్చోపెట్టి, బొమ్మలు చూపించి చెప్పారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో కాబోయే డాక్టర్లకి చిన్నా ఒక పాఠం కింద ఉపయోగ పడుతున్నాడు. తరచుగా రమ్మని వాడి ‘ఎదుగుదల’ ని లేదా.. ‘ఎదుగుదల లేకపోవడాన్ని’ ని పరిశీలిస్తూ పర్యవేక్షిస్తున్నారు.
వెళ్లిన ప్రతీసారీ కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు చిన్నా. తను చదువుతున్న స్కూల్లో కంప్యూటర్ కూడా ఒక పాఠ్యాంశం. ఆ మేమ్ నడిగి కంప్యూటర్ ద్వారా తన వంటి వారి సంగతులు తెలుసు కుంటున్నాడు.
కంప్యూటర్ పూర్తిగా వాడడం వచ్చేసింది. ఇంటర్నెట్ బ్రౌజింగ్, సర్ఫింగ్ వంటివి సర్వ సాధారణం వాడికిప్పుడు. ఖాళీ ఉన్నపుడు ఆ మేమ్ దగ్గరే ఉంటాడు. వాడి ఆసక్తి, తెలివి చూసి ఆవిడ కూడా కొత్త కొత్తవి నేర్పిస్తుంటుంది.
భౌతిక లోపం పూడ్చడానికేమో.. వాడికి పాదరసం లాంటి బుర్రనిచ్చాడా దేముడు. పదకొండేళ్లకే, పదహారేళ్ల తెలివి ఉంది.
దొరికిన పుస్తకం చదివేస్తుంటాడు. రాజగోపాలాచారి రామాయణం నుంచీ, హారీ పోటర్ వాల్యూమ్స్ వరకూ.
మొత్తానికి తన స్థితి వాడికి బాగా అర్ధమైపోయింది.
వామనావతారం గురించి తెలుగు మేమ్ చెప్తుంటే కళ్లు పెద్దవి చేసి వింటుంటాడు.
స్కూల్లో కూడా అందరికీ చిన్నా లిటిల్ పర్సన్ అనే అవగాహన వచ్చేసింది. ఐతే ఇంకా.. బుల్లి మనుషులని వింతగా చూడడం మాన లేదు జనం.. ముఖ్యంగా కొత్తగా చేరిన పిల్లలు.
(మరుగుజ్జు అనే మాట బదులు బుల్లి మనిషి అనే వాడ దలిచాను. ఆంగ్ల భాషలో midget అనే మాట అనవద్దనే నిర్ణయం తో little people అనేది వాడుకలోకి తీసుకొచ్చారు. అదే ఈ రచనలో కొన సాగుతుంది.)
చిన్నా సహాధ్యాయులు, టీచర్లు మాత్రం ఏ భేదం చూపించకుండా మామూలుగానే ఉంటున్నారు. వాడి తెలివికి అబ్బుర పడుతుంటారు కూడా!
కొంతలో కొంత నయం.
బుల్లి మనుషులకు వచ్చే భౌతిక సమస్యలేవీ ఇంకా చిన్నాకి రాలేదు. బుల్లి మనుషుల్లో వచ్చే కండరాల పెరుగుదల వాడి విషయంలో ఆలస్యమవడం, మామూలుగా అటువంటి వారు పెరిగేటట్లుగా బరువు పెరక్కపోవడం ఒక రకంగా వాడికి వరమే అయింది.
బుల్లి మనుషులు వయసు పెరిగిన కొద్దీ కాళ్లు వంకరై సరిగ్గా నడవలేరు. తల పెద్దదయి మొహంలో వయసు కనిపిస్తుంటుంది. వీపు వంగి పోతుంది. మెడ లేనట్లు, నేరుగా భుజాల మీద తల ఉన్నట్లు అనిపిస్తుంది.
“ఆ బగమంతుడు ప్రతీ మడిసికీ ఏదో పనిపెట్టే ఈడకి పంపుతాడే. మనోడిక్కూడా చెప్పుకోదగ్గ పెద్ద పనుండే ఉంటది. అంత దిగులు పెట్టుకోమాకండే..” తన దిగులంతా మనసులో దాచుకుని పెళ్లాన్ని, తల్లినీ ఓదార్చడానికి ప్రయత్నిస్తుంటాడు బుల్లయ్య.
బుల్లయ్య, తన దగ్గర పూలు కొనడానికొచ్చేవాళ్ళని చూసి, కొడుకు కూడా అలా కార్లో ఆగి పూలు కొనాలని కలలు కనేవాడు.
అందుకే.. చిన్నా పుట్టగానే వెళ్ళి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకు నొచ్చాడు, తల్లికి చెప్పకుండా. ఒక్కడే ఉంటే బాగా చదివించి పెద్ద ఉద్యోగం చేయించాలని మొగుడూ పెళ్లాలకి కోరిక.
ఎన్ని ఆశలు.. ఎన్నెన్ని కోరికలు..
కారు మాట దేవుడెరుగు సైకిలేనా తొక్కలేడే..
మనసులో కుమిలిపోతూ పైకి నవ్వుతున్నారిద్దరూ.
…………………
ఏడో క్లాసు చదువుతున్న చిన్నా, ఇంటిముందు అరుగు మీద కూర్చుని లెక్కలు చేసుకుంటున్నాడు. మధ్య మధ్య పక్కనే కూర్చున్న టింకూకి హోం వర్క్ చెయ్యడంలో సాయం చేస్తున్నాడు.
యదాలాపంగా టింకూని చూసిన చిన్నా ఆలోచనలో పడ్డాడు. తను అనుకున్నది సాధించ గలుగుతాడా? ఎప్పటికైనా ఏదో చేసి తన సత్తా నిరూపించుకోవాలి. పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ అవాలి.
ఇప్పుడు టింకూ, చిన్నా ఒకే ఎత్తు, లావు ఉన్నారు. మరీ ఎండి పోయినట్లు లేకపోయినా బక్కగానే ఉంటారు.
మరీ ఎక్కువగా, ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి ఉండక పోవడం కూడా మంచిదే అయింది చిన్నాకి.
ఆసుపత్రిలో సైకాలజిస్టులు చిన్నాకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. చిన్నా డాక్టర్లకి బాగా సహకరిస్తున్నాడు.
“నువ్వు వయసుతో పాటుగా అందరిలా ఎదగ లేవు కనుక తీసుకునే ఆహారం జాగ్రత్తగా గమనించాలి. నీ ఎత్తుకి బరువుకీ తగ్గట్లుగా ఎంత తీసుకోవాలో మేం చెప్తాము. నెలకొక సారి మా దగ్గరికి రావాలి. ఏ మాత్రం ఎక్కువ తిన్నా.. లేదా బజ్జీలు, గారెలు లాంటి నూనె పదార్ధాలు తిన్నా బరువు పెరుగుతావు. బరువు పెరిగావంటే బోలెడు సమస్యలు వస్తాయి.” చిన్నాని తన ప్రత్యేక కేస్ కింద చూసుకునే డాక్టర్ చెప్పాడు.
“స్వీట్లు కూడా తిన కూడదు కదా డాక్టర్ గారూ?” చిన్నా కళ్ల పెద్దవి చేసి అడిగాడు.
“అంతే కాదు, జామకాయలు, బొప్పాయి కాయలు తప్ప పళ్లు కూడా తిన కూడదు.”
“తినను డాక్టర్ గారూ! కానీ.. నేను అందరిలా చదువుకో గలను కదా?”
“తప్పకుండా చదువుకోగలవు. నీ తెలివి తేటలు నార్మల్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఎందరెందరో బుల్లి మనుషులు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులయ్యారు. ముఖ్యంగా సినిమాల్లోనూ, టివిల్లోనూ నటిస్తున్నారు. నువ్వుకూడా ఒక రోజు పెద్ద పేరు తెచ్చుకోవచ్చు.”
డాక్టర్ చెప్పింది ఆసక్తిగా విన్న చిన్నా ఒక ప్రశ్న వేశాడు.
“నా బుల్లి సైజుతో నవ్వించడం తప్ప ఏమీ చెయ్యలేనా అంకుల్? నాకు కంప్యూటర్ ఇంజనీర్ అవాలనుంది.”
“ఎందుకవలేవూ.. తప్పకుండా అవచ్చు. బాగా చదువు కోవాలి మరి. ఎవరేమన్నా పట్టించుకోకూడదు. అనేక మంది హేళన చేస్తుంటారు. వినిపించుకోకుండా ముందుకి నడవాలి.”
అవును. డాక్టరంకుల్ చెప్పినట్లు బాగా చదువు కోవాలి.. టింకూని చూడ్డం మాని ఆకాశం కేసి చూశాడు. మబ్బులు నాలుగు కదిలి వెళ్తున్నాయి ఎక్కడికో.
”ఆ మబ్బులకి చెప్పుకోరా నీకేదయైనా బాధేస్తే. అవి చక్కగా దేవుడి దగ్గరకెళ్లి చెప్పేస్తాయి. నీ కట్టం తీరి పోతుంది.” స్కూల్లో ఎవరో ఏడిపించారని ఏడుస్తుంటే, ఓదారుస్తూ నాయనమ్మ చెప్పేది గుర్తుకొచ్చింది.
“నేను బాగా చదువుకోవాలి. పెద్ద ఇంజనీరవాలి. దేవుడికి చెప్పండి.” చిన్నా ఫోన్లో ఎవరికో చెప్పినట్లు మబ్బులకి చెప్పేసి, లెక్కల మీదికి దృష్టి నిలిపాడు.
సరిగ్గా, అప్పుడే మస్తానయ్య ఇంట్లోకి అడుగు పెట్టాడు.
“రండి.. రండి. లోన కూర్చుందాం.” గట్టిగా పిలిచాడు తన వెనుకగా వస్తున్న నేస్తాలని.
కాలనీలో ఇళ్ళను.. ఇళ్ల బైటనే రకరకాల పనులు చేసుకుంటున్న మనుషులను చూస్తూ నాలుగడులు వెనుక వస్తున్న రాజా, పాషా ఉలిక్కిపడి మొహాలు చూసుకున్నారు.
చిన్నా, టింకూ తలెత్తి చూశారు.
వరండాలో నుంచి తామిద్దరూ ఇంట్లోకి వెళ్ళిపోవాలా! అక్కడే కూర్చోవచ్చా..ఏం చెయ్యాలో కాసేపు చిన్నాకి అర్ధం కాలేదు. వచ్చినవాళ్ళెవరో కొత్తవాళ్ళు. అంకుల్ ఏదో పని మీద తీసుకొచ్చుంటాడు.
టింకూని తీసుకుని తమ ఇంట్లోకెళ్ళిపోయాడు.
పిల్లలిద్దరినీ పరిశీలిస్తున్నట్లుగా, ఎగాదిగా చూస్తూ మస్తానయ్య ఇంట్లో కెళ్ళారు రాజా, పాషా.
జానీ సాయంత్రం పనులకెళ్ళింది. కాలనీకి ఆనుకుని ఉన్న కాంప్లెక్స్ లో రెండిళ్ళలో ఇంటి పనులు చేస్తుంది తను.
మస్తానయ్య వచ్చిన అతిధులతో మంతనాలు సాగించాడు.
“అంతేనా? చాలా తక్కువ.”
“మాకేవంత గిట్టుబాటవదు. ఎంత రిస్కో తెలుసా?” పాషా అదో రకంగా మొహం పెట్టి అన్నాడు.
“సరే.. యాభైవేలు. అంతకంటే తక్కువైతే మీరెల్లచ్చు..” మస్తానయ్య మొండిగా కూర్చున్నాడు.
“మరి తరువాత గొడవేం అవకుండా నువ్వే చూసుకోవాల. పోలీసులూ అదీ అంటే కష్టం.” పాషా బెదిరిస్తున్నాట్లుగా అన్నాడు.
“మీ ఆవిడ్ని నువ్వే సముదాయించుకోవాల. ఊరూ వాడా ఏకం చేసేస్తారీ ఆడోళ్లు.” రాజా వార్నింగిచ్చాడు.
అలాగే అన్నట్లు తల ఆడించాడు మస్తానయ్య. లోపల బెదురుగా ఉన్నా పైకి గాంభీర్యం నటిస్తున్నాడు.
ఈ డబ్బు తీసుకుని కొన్నాళ్లు కనిపించకుండా చెక్కేద్దామని నిర్ణయించుకున్నాడు ఎప్పుడో.
………………
“ఏర్రా కుర్రాళ్లిద్దరూ? చిన్నా, టింకూ.. ఏడకెళ్లి పోయారూ?” చీపురు తీసుకుని వాకిలూడవడానికొచ్చిన జానీ అరిచింది.
“పొద్దు పొద్దున్నే.. ఏడ పోయార్రా? ఇస్కూల్లున్నయ్యి కూడా..” జానీ పెద్ద కొడుకు సలీమ్ ఇంట్లోంచి బైటికొట్టి వీధి చివరి వరకూ చూశాడు. ఎక్కడా కనుచూపు మేరలో లేరు ఇద్దరూ.
“రాత్రి ఇక్కడ్నే పండుకున్నారే.. పక్కలైతే కాలీగున్నయ్యి. ఈ పాటికి చిన్నా చదువుకుంటుండాలి. ఎక్కడ పోయారబ్బా! సలీమ్ కాస్త నువ్వటు పోయి చూసి రావా?” సూరమ్మ కూడా బైటికొచ్చింది.
ఆవారం వాకిలూడిచే పని జానీ బేగంది. వారానికి ఒకరు చొప్పున చేసుకుంటారు సూరమ్మా, జానీ.
“ఆంటీ.. ఎక్కడా లేరు.” సలీమ్ గోడక్కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు.
“ఏ పార్క్ కో పోయుంటార్లే. కాసేపట్లో వచ్చేస్తారు. చిన్నా ఉన్నాడుగా ఫర్లేదు” జానీ, వాకిట్లో కళ్లాపు జల్లి ముగ్గేయ సాగింది.
సూరమ్మ మాత్రం, కంగారుగా నడుం మీద రెండు చేతులూ పెట్టుకుని నడి రోడ్డు మీదికొచ్చి ఈ పక్కా ఆపక్కా మార్చి మార్చి చూస్తోంది. ఈ టయంలో ఎక్కిడికీ బోడే చిన్నా గాడు.
అరగంట గడిచింది.
పిల్లలిద్దరి జాడా అయిపులేదు.
చిన్నగా రెండిళ్లలోనూ అలజడి మొదలయింది. టింకూ గవర్నమెంట్ స్కూలే.. మధ్యాన్నించీ ఉంటుంది. కానీ చిన్నా.. ఎనిమిదో గంట కల్లా బస్ స్టాపు దగ్గరుండాలి.
ఈ వేళ్టప్పుడు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లడే..
“చిన్నా!” పిలుస్తూ వచ్చాడు బుల్లయ్య. స్నానం చేసెళ్దామని ఇంటికొచ్చాడు. వెళ్లేప్పుడే చిన్నాని బడి దగ్గర దింపేసొస్తాడు.
బుల్లయ్యతో వెళ్లాడేమోనని ఏ మూలో ఆశతో ఉన్న సూరమ్మ గుండె జారిపోయింది. నిలువు గుడ్లేసుకుని చూస్తుండి పోయింది.
“ఏందిరా.. నీ ఎంబడి రాలే? ఏదన్నా పనుండి తీసుకెళ్లావేమో అనుకుంటన్నా.. ఎక్కడ పోయాడో..” బుల్లయ్య తల్లి, ఏడుపు గొంతుతో అరిచింది.
“ఊరికే అరవమాకే.. ఏ గుడికన్నా పోయాడేమో వచ్చేస్తాడు.” బుల్లయ్య ఇంట్లోకెళ్లాడు.
“అది కాదయ్యా.. టింకూ, చిన్నా ఇద్దరూ కనిపించడం లేదు. స్కూలు టైమయి పోయింది కూడా.” సూరమ్మ కూడా భయం భయంగా అంది.
బుల్లయ్య ఒక్క నిముషం ఆగాడు. నిజమే.. ఈ సమయంలో ఎక్కడికీ వెళ్లడు చిన్నా. అది కూడా టింకూని తీసుకుని. చెప్పకుండా వెళ్లే అలవాటు అసల్లేదు. ఏదో జరిగిందని మనసు హెచ్చరిస్తోంది.
సూరమ్మ గట్టిగా ఏడుపు మొదలు పెట్టింది. అత్తమ్మ నర్సమ్మ కూడా తోడయింది. బుల్లయ్య లోపలికెళ్లి నాలుగు చెంబులు మీద పోసుకున్నాననిపించి, బట్టలేసుకుని బైటికొచ్చాడు.
ఆలిశ్యంగా పడుక్కుని, గుర్రు పెట్టి తొంగున్న మస్తానయ్య, ఈ హడావుడికి లేచొచ్చాడు.
“ఏంటెహే.. గోల..”
“చిన్నా, టింకూ కన్పించడం లేదయ్యా..” జానీ ఏడుపుగొంతుతో చెప్పింది.
“చిన్నా కూడనా?” అసంకల్పితంగా అనేశాడు మస్తానయ్య.
“అంటే.. టింకూ సంగతి నీకు తెల్సా? ఏదీ ఇటు తిరుగు..” జానీ కేదో అనుమానం వచ్చింది.
“అబ్బే నాకేం తెల్సు.. చిన్నా పెద్దోడు కదాని.. ఏడకెల్తారు.. నేనింటనే పండినా కద. బుల్లయ్యా! ఐదు నిమిషాల్లో వస్తా. కలిసెతుకుదాం. ఈడనే ఉంటారెక్కడ్నో.” మస్తానయ్య లోపలి కెళ్లిపోయాడు.
‘దొంగ నాయాళ్లు.. ఇద్దరినీ ఎత్తుకుపోయి నట్లున్నారు. కనిపిస్తారుకదా.. అప్పుడు చెప్తా.’ తిట్టుకుంటూ, దొడ్లో పనులు ముగించుకుని వాకిట్లోకొచ్చాడు.
‘ఏ గోలైతుందో ఏటో.. ఈ బుల్లయ్య గాడూరుకోడు.’ కొద్దిగా వణుకొచ్చింది.
మామూలుగా ‘చాయ్’ అంటూ నానా గోల చేసేవాడు.. గమ్మునెళ్లిపోయాడు బుల్లయ్యతో.
జానీ అనుమానం గట్టి పడింది. కానీ.. ఎవరికీ చెప్పుకోలేదు.
వరండాలోనే ఒక మూలకి వెళ్లి కుళ్లి కుళ్లి ఏడవసాగింది. పిల్లలిద్దరినీ ఏం చేశాడో బద్మాష్ గాడు.. యా అల్లా! ఏం జేతు..
“ఊకో.. జానీ. వచ్చేస్తార్లే. చిన్నా ఉన్నాడు కదా.. కాస్త పెద్దోడే కద. ఆనికన్నీ తెల్సు.” సూరమ్మ తన కష్టం పక్కన పెట్టి ఓదారుస్తోంది.
“అది కాదక్కా! పొద్దుగాల్నుంచీ ఏం తినకుండా.. టింకూగాడసలే ఆకలికాగలేడు. చిన్నా కూడా ఇస్కూలు కెళ్లకుండా.. ఎక్కడ పోయుంటారు? నా కేందో బయమైతాందే.. అస్సల్కే పిల్లగాళ్లనెత్క పోతున్రంట.” అనుకోకుండా తన నోట వచ్చిన మాట నిజమేనా? అందుకేనా మస్తానయ్య మాటాడుకోకుండా పోయాడు.. జానీకి ఒళ్లు జలదరించింది.
“ఏందే.. అట్టా వడకుతా.. ఏంగాదంటున్నా కదా! డాక్టర్లు బరువు పెరగద్దన్నారని చిన్నాగాడు గ్రౌండులో పరగెడతాంటాడు అప్పుడప్పుడు. టింకూ కూడా ఆడితో పోయుంటాడు. వచ్చేత్తార్లే.” నర్సమ్మ ఓదార్చడానికందే కానీ, ఇంత సేపు చిన్నా ఉండడని తెలుసు.ఏమైనా.. జ్వరం వచ్చినా కూడ బడి మానడు. ఎట్టాగైనా జీవితంలో పైకి రావాలనేది వాడి ఆశ.
“అక్కడ బోర్లెయ్యడానికి తవ్వారంట అత్తమ్మా! అందుట్టోగానీ..” సూరమ్మ ఏడుస్తూనే గట్టిగా అంది.
ఆ మాట విని నర్సమ్మ పరుగెత్తింది గ్రౌండు కేసి. అంతకు ముందే ఒక మూడేళ్ల కుర్రాడు బోర్ గొట్టంలో పడి చచ్చి పోయాడని టి.వీ లో చూపించారు. ఆమె వెనుకే సూరమ్మా, జానీ బేగం..
ఇల్లు ఎలా ఉందని చూసుకోలేదు ఎవరూ.. జానీ పిల్లలు ముగ్గురూ బిక్క మొహాలేసుకుని అరుగు మీద కూర్చున్నారు. అందరికీ నీరసం వచ్చేస్తోంది. పదవుతోంది.. అప్పటి వరకూ టీ చుక్క కూడా పడలేదు ఎవరికీ.
సలీమ్ ఇంట్లోకెళ్లి, కిరసనాయిల్ స్టౌ అంటించి అల్యూమినియమ్ గిన్నెలో చాయ్ నీళ్లు పెట్టాడు. ఆ గిన్నె నిండా సొట్టలే. ఆ సొట్టల్లో నల్లగా పేరుకుపోయిన మకిలి వాళ్ల జీవితాలకి ప్రతీకలా ఉంది.
గిన్నెలో నీళ్లలో మిల్లిడు పాలు పోసి, రెండు చెంచాల టీపొడి, నాలుగు చెంచాల చక్కెర వేశాడు. అది సలసలా మరిగాక వడగొట్టి తమ్ముడికీ, చెల్లెలికీ రెండు గ్లాసుల్లో ఇచ్చి, తనొక గ్లాసు తీసుకున్నాడు. మిగిలిన చాయ్.. అమ్మకీ, టింకూకీ అని చెప్పాడు, ఇచ్చిన సగం గ్లాసు చాయ్ తాగి నాలుకలో పెదాలు తడుపుకుంటున్న పిల్లలిద్దరికీ.
నీరసంగా వస్తున్న అమ్మ కనిపించింది సలీమ్ కి. వెనుకే సూరమ్మాంటీ, నర్సవ్వ. ఐతే.. ఏడుపులాగిపోయాయి. ఏడవడానిక్కూడా ఓపికలేకేమో!
ఎదురెళ్లాడు సలీం.. బడికి డుమ్మా కొట్టి తను కూడా వెతకడానికి వెళ్ళాలనుకుంటూ!
“గ్రౌండులో లేర్రా.. బోరుబావుల్లో ఎవురూ పడలేదట్రా.. అదోటి నయం.” సూరమ్మ కొద్దిగా తేలిగ్గా అంది.
“మరేడకి పోయుంటారు. నే కూడ పోయి చూసొస్త. చెల్లిని, తమ్ముడిని ఇస్కూలికి పంపేమ్మా. ఆళ్లింటో ఉండేం చేస్తారు.. కాళ్లకి అడ్డం పడ్డం తప్ప.” సలీం ఇంట్లోకెళ్లాడు బట్టలు మార్చుకోడానికి.
సాయంత్రమయింది.. పిల్లల జాడెక్కడా లేదు.
బుల్లయ్య, మస్తానయ్య, సలీం కూడా అయిపులేరు.
జానీ, సూరమ్మ చుట్టుపక్కలంతా వీధివీధీ తిరిగి చూశారు. ఎక్కడైనా.. ఏదైనా బండి టక్కర్లయ్యాయేమో కూడా అడిగారు. కళ్లు తిరిగి శోషొచ్చే పరిస్థితి వచ్చేవరకూ తిరిగారు.
ఇంక లాభంలేదని ఇళ్లకొచ్చేసి, అంత అన్నం పడేశారు పొయ్యి మీద.. పిల్లలు, ముసలమ్మ ఉన్నారుకా.. తాము మాత్రం, మహ అయితే, ఇంకొక పూట తినకుండా ఉండగలరేమో.
ఊపిరాడుతున్నంత సేపూ కడుపుకి కావల్సిందే.. దానికీ, బుర్రకీ, అవయవాలకీ లింకు.. మగాళ్లు పత్తా లేరు. ఎక్కడపోయారో.. ఏ రోడ్లట్టుకుని తిరుగుతున్నారో!
అరుగు మీదే కూర్చునున్నారు. ఆడవాళ్లందరూ.. సలీం వీధి చివర కనిపించాడు.. కాళ్లీడ్చుకుంటూ..
ఆ ఆశ పోయింది. ఇంక బుల్లయ్య మీదే ఏదైనా ఆశ..
అదీ పోయింది.. బుల్లయ్యని చూడగానే. అతనొక్కడే కనిపించాడు దూరం నుంచి. చూస్తూనే నర్సమ్మ రాగం అందుకుంది సన్నగా. చిన్నాని పుట్టినప్పట్నుంచీ ప్రాణంలా పెంచుకుంది. వాడికి దేముడిచ్చిన లోపానికే కుళ్లి పోతుంటే.. అసలు మనిషే కనిపించకుండా పోతే..
బుల్లయ్య దగ్గరగా వచ్చాడు. అందరూ ఘొల్లుమని ఏడుపందుకున్నారు. చుట్టుపక్కల వాళ్లు కూడా వచ్చేశారు.. వాళ్లందరికీ పదింటికల్లా తెలిసి పోయింది. కూరతెచ్చీ, పప్పు తెచ్చీ.. దగ్గరుండి అన్నాలు తినిపించారు. త్రాణ నిలుపుకోడానికి కాస్తంత కతికారు అందరూ.
“మస్తానయ్య ఏడ్రా?” నర్సమ్మ అడిగిన ప్రశ్నకి తలెత్తి చూసింది జానీ.
“పోలీసు రిపోర్టిస్తానన్జెప్పి స్టేషనుకెళ్లాడు.”
“నువ్వుకూడెళ్లకపోయా?”
“నాకు కళ్లు తిరుగుతున్నయ్యేమ్మా! అందుకే పోలేక పోయా.” అరుగు మీద కూలబడి, రెండు చేతులతో మొహం కప్పుకుని అమ్మ ఒడిలోకి ఒరిగి పోయాడు బుల్లయ్య.
నర్సమ్మ అంత మనిషినీ, చంటి పాపని పొదువు కున్నట్లు దగ్గరికి తీసుకుంది.
తల నిమురుతూ ఓదార్చింది.
బుల్లయ్య చాలా సున్నితమైన వాడు. గుడి దగ్గర పూలు అమ్ముతూ మరింత సున్నిత మనస్కుడయ్యాడు. కొడుకు మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాడు.
సూరమ్మ గుండె దిటవు పర్చుకుని లేచింది. ఎవరో ఒకరు ధైర్యంగా ఉండకపోతే లాభం లేదు. ఇంట్లో అందరూ డీలా పడిపోతే జరగాల్సిన పనెట్టా? లోనికెళ్లి అన్నంలో పప్పు కలుపుకునొచ్చి నర్సమ్మకిచ్చింది.
“రెండు ముద్దలు తిన్రా.. ఏడవటానికైనా ఓపికొస్తుంది బాబూ! లే..” లేపి, చెంగుతో మొహం తుడిచి, నోట్లో ముద్దలు పెట్టింది నర్సమ్మ.
సగం తిని, పక్కకు నెట్టేసి భోరుమన్నాడు బుల్లయ్య.
“అమ్మా! ఆడేవైనా తిన్నాడో లేదోనే..మన చిన్నాగాడు.. అసల్కే పిచిక తిండి. ఆకలికి ఆగలేడు.”
మళ్లీ అందరూ ఏడుపందుకున్నారు. కన్నీళ్ల కింకా కొదవ రాలేదు.
అప్పుడు సమయం సాయంత్రం ఐదు.
……………….

2

అప్పుడే కళ్లు తెరిచిన చిన్నాకి తానెక్కడున్నాడో అర్ధం కాలేదు.
అంతా చీకటిగా.. మసక మసగ్గా ఉంది. టింకూ గాడేడీ? వాళ్లింట్లోకెళ్లుంటాడు. తానున్న చోటేది?
కళ్లు నులుముకుంటూ లేచాడు. కడుపులో ఏమిటోగా ఉంది. లేచి నిలబడ్డాడు. కళ్లు గిర్రున తిరిగాయి. అర్జంటుగా బైటికెళ్లాలి.. కడుపుబ్బి పోతోంది.
చేతులతో తడమ బోయాడు.. ఏదీ అందలేదు.
అటూ ఇటూ చేతుల్ని జాడిస్తూ నడిచాడు. కొద్ది దూరంలో గోడ అందింది. గోడ మీద ఏమీ కనిపించలేదు.. ఎక్కడైనా లైటు స్విచ్చి ఉందేమో! కానీ కుర్చీనో, స్టూలో కావాలి కదా! ఏమీ కనపడ్డం లేదు.
“అమ్మా!” గట్టిగా అరిచాడు. అరిచాననుకున్నాడు కానీ గొంతులోంచి సన్నగా వచ్చింది ధ్వని. అది విన్నాడో ఏమో.. టింకూ కూడా లేచాడు. వాడు గట్టిగా ఏడుపు మొదలెట్టాడు.
“పిల్లలు లేచినట్లున్నారు.. చూడండ్రా! కాసిని పాలో, బ్రెడ్డో పడెయ్యండి. వాళ్ల ఊపిరి ఆగకూడదు. పెట్టుబడంతా దండగవుద్ది.” ఎవరిదో బొంగురు గొంతు వినిపించింది.
చిన్నా అలాగే తడుముకుంటూ వెళ్లాడు, ఏడుపు వినిపిస్తున్న దిక్కుకి. చేతికి తగిలాడు టింకూ. స్విచ్చిలేవీ చిన్నా కందేట్లుండవు.
“చిన్నా! ఎక్కడున్నాం? అమ్మ ఏదీ? ఆకలేస్తోంది.” ఏడుస్తూనే అడిగాడు టింకూ, చిన్నా చెయ్యి తగలగానే.
“అదే నాకూ తెలియట్లేదు టింకూ! ఎక్కడున్నామో.. ఎలా వచ్చామో, ఎక్కడి కొచ్చ్చా మో.. అంతా అయోమయంగా ఉంది.”
ఒక్క సారిగా గదిలో మిరుమిట్లు కొలిపే కాంతి వచ్చింది. ఎవరో లైటేశారు. కళ్లలో అంత కాంతి పడే సరికి, భరించలేనట్లు కళ్లు నులుముకున్నారు చిన్నా, టింకూ.
కళ్లు తెరిచే సరికి పెద్ద గుబురు మీసాలవాడు, తల దించి వాళ్ల కేసి చూశాడు. వాడు.. గది గుమ్మం అంత ఎత్తుగా ఉన్నాడు. కళ్లు ఎర్రగా ఉన్నాయి. మొహం నిండా ఏవో మచ్చలు.
అచ్చు తన కలలో కొచ్చే వాడి లాగే ఉన్నాడు.
బితుకు బితుకు మంటూ చూస్తున్నారు పిల్లలిద్దరూ. ఏడవడానిక్కూడా భయమేస్తోంది.
“అంకుల్.. అమ్మ కావాలీ! ఎక్కడికి తీసుకొచ్చారు మమ్మల్ని?” టింకూ ఏడుస్తూ అడిగాడు.
చిన్నా మాట్లాడ దల్చుకోలేదు. తప్పని సరైతే ఒకటి రెండు తప్ప. వాడు మాట్లాడితే, మాటలోని స్పష్టత, స్వచ్ఛతలని బట్టి మరీ చిన్నపిల్లవాడు కాదని తెలిసి పోవచ్చు.
వాడికి తెలిసి పోయింది తమని ఎత్తుకొచ్చారని.
పిల్లల్ని యెత్తుకు పోయే వాళ్లు తిరిగుతున్నారని బళ్లో, వాళ్ల టీచరు గారు చెప్పారు. రోడ్డు మీద ఏం చెయ్యాలో చెప్పారు కానీ, నిద్ర పోతుండగా, ఏడవడానికి లేకుండా మత్తు మందిచ్చి, ఎత్తుకుపోతే ఏం చెయ్య గలరెవరైనా?
చిన్నా ఎలాగైనా తప్పించుకోవడానికి తోవ వెతకాలనుకున్నాడు. అందుకే మాట్లాడకుండా, ఎక్కడ సందు దొరుకుతుందా అని చూస్తున్నాడు.
“ఇక్కడికి రారా..” గట్టిగా బొంగురు కంఠంతో అరిచాడు మీసాలాడు.
తన్నేమో అనుకుని, టింకూ గట్టిగా ఏడవడం మొదలెట్టాడు.. తల అడ్డంగా తిప్పుతూ.
“నిన్ను కాదెహే.. నోర్ముయ్యి. రేయ్.. ఈ గుంటగాల్ల సంగతి చూడు. ఈళ్లని మంచిగా ఉంచాల. లేదంటే బేరం పోద్ది.”
తలుపు తోసుకుని వచ్చాడింకొకడు. వాడి మొహం కాస్త ఫరవాలేదు. మెడ వరకూ జుట్టు వేళ్లాడుతోంది. పిల్లల్ని చూసి నవ్వాడు.
అప్పటికి చిన్నాకి బాగా అర్ధమయింది.. చాలా చిక్కుల్లో పడ్డామని. అమ్మ, అయ్య ఎలా ఉన్నారో..వాడిక్కూడా ఏడుపొచ్చేస్తోంది. దానికి తోడు, కడుపులో పోట్లు మొదలయ్యాయి. ఆకలి సంగతి తర్వాత.. కడుపుబ్బి పోతోంది. ముందర దాన్ని ఖాళీ చెయ్యాలి. అటూ ఇటూ చూశాడు.
గదిలో ఒక మూలగా కనిపించింది తలుపు.
కొత్తగా వచ్చిన వాడికి చెయ్యెత్తి వేళ్లు చూపించాడు.. చిటికిన వేలు, తరువాత రెండు వేళ్లూ.
వాళ్లు గాభరాగా నేలంతా చూశారు. వాళ్లకి అలవాటే.. పిల్లలు భయపడి పోయి గదంతా పాడు చేసేస్తారు.

ఇంకా వుంది..

4 thoughts on ““కలియుగ వామనుడు” – 1

  1. చాలా బాగుందమ్మా మళ్ళీ నెల్లాళ్ళు ఆగాలా అని బాధ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *