March 28, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 22

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఈ లౌకిక ప్రపంచమంతా మాయామయం. ఈ మాయను మానవుడు సులభంగా దాటగలడా? భగవద్గీతలో భగవానుడు….దైవసంబంధమైనదియు, త్రిగుణాత్మకమైనదియునగు ఈ మాయ దాటుటకు కష్టసాధ్యమైనది. అయితే నన్ను ఎవరు శరణు బొందుచున్నారో వారీమాయను సులభంగా దాటగలరు అంటున్నాడు. భగవంతునిచే కల్పించబడిన యోగమాయ, సత్త్వం – రజస్సు – తమస్సనే మూడు గుణాల రూపంలో ఉన్నది. ఇది జీవులకు దాటరానిది. ఈ మూడు గుణములను జయించగలిగినవాడే ఈ మాయను దాటగలడు. అటువంటి సామ్యావస్థ భగవంతుని శరణుజొచ్చిన వారికే సాధ్యపడుతుంది. ఇతరుల కెవ్వరికి సాధ్యం కాదు. కనుక భగవంతుని శరణుజొచ్చి మాయ మేలిముసుగులో నుంచి మనం బయటపడాలి. ఏదో ఒక అద్భుత సంఘటన జరిగి ఆ శ్రీహరి కృప కలిగితే చెప్పలేము కానీ అన్యులకు ఇది దుస్సాధ్యం అంటున్నాడు అన్నమయ్య.

కీర్తన:
పల్లవి: కటకట యీమాయ గడచుట యెట్లో
ఘటనల హరికృప గలిగినఁ గాక
చ.1. యిరవగుజీవుల కెంతగలిగినా
పరధనకాంతలే బలుప్రియము
ధరఁ గర్మాపుఁజేతలలోనెల్లా
సొరదిఁ బాపమే సులభము ॥కటకట॥
చ.2. నానారుచులు యనంతము గలిగిన
కానిపదార్ధమె కడుఁ దీపు
పానిన చదువుల పఠన లుండగా
మానని దుర్బాషమాఁటలే హితవు ॥కటకట॥
చ.3. యెదలో శ్రీవేంకటేశ్వరుఁడుండఁగ
సదరపు దివిజులు చవులయిరి
అదనను శ్రీగురుయానతి గలుగఁగ
పొదిగొని యివి తలపోయఁగ వలెసె ॥కటకట॥
(రాగం: మలహరి; రేకు సం: 317, కీర్తన 4-96)

విశ్లేషణ:
పల్లవి: కటకట యీమాయ గడచుట యెట్లో
ఘటనల హరికృప గలిగినఁ గాక
అయ్యయ్యో! ఈ మాయను దాటడం ఎటుల? అర్ధం కావడంలేదు. ఏదైన దైవ సంఘటన జరిగి ఆ శ్రీనివాసుని దయ కలిగితే వేరే విషయం కానీ మామూలుగా దాట శక్యమా!

చ.1. యిరవగుజీవుల కెంతగలిగినా
పరధనకాంతలే బలుప్రియము
ధరఁ గర్మాపుఁజేతలలోనెల్లా
సొరదిఁ బాపమే సులభము
ఆహా! శ్రీహరీ! ఈ భువిపై స్థిరంగా ఉన్న జీవులు ఎంత చిత్త చాపల్యం కలిగినవారు? వీరికి ఎంత ధనం ఉన్నప్పటికీ పరధనం మాత్రమే వీరికి ప్రియము. ఇంట సతి ఉన్నప్పటికీ పరకాంతలమీదనే వీరి ధ్యాస! ఈ భూమిపై పుణ్యకార్యాలు చేయాలంటేనే అందరికీ కష్టం. పాపకార్యాలు వరుసగా చేస్తూఆ విషయంలో మాత్రం ముందుంటారు కదా!

చ.2. నానారుచులు యనంతము గలిగిన
కానిపదార్ధమె కడుఁ దీపు
పానిన చదువుల పఠన లుండగా
మానని దుర్బాషమాఁటలే హితవు

మనకు తినడానికి తయారుగా అనేక పదార్ధాలు ఉన్నప్పటికీ, మనకు కాని పదార్ధమే ఎక్కువ తీపుగా ఉంటుంది కదా! పొరుగింటి పుల్లగూర రుచి చందాన ఉంటుంది మన నైజం. అలాగే మనం ఎంతో కష్టపడి గురుశుశ్రూష చేసి వేద,వేదాంగాలను చదువుకుని నెమరు వేసుకోవడానికి భగవంతుడిని ధ్యానించడానికి నాలుకపై తయారుగా ఉన్నప్పటికీ, మనం అనకూడని మాటలు పాపపూరిత భాషణలే సదా చేస్తూ ఉంటాము. అవే మనకు ఇష్టంగా ఉండడం మాయకాకపోతే మరి ఏమిటి?

చ.3. యెదలో శ్రీవేంకటేశ్వరుఁడుండఁగ
సదరపు దివిజులు చవులయిరి
అదనను శ్రీగురుయానతి గలుగఁగ
పొదిగొని యివి తలపోయఁగ వలెసె

అందరి హృదయక్షేత్రాలలో స్థిరంగా నెలకొని శ్రీవేంకటేశ్వరస్వామి ఉండగా, తేలికగా అనుగ్రహం కలుగుతుందని వెళ్ళి చిల్లరదేవుళ్ళను చేరి ఇష్టప్రీతి కొలవడం ఎందుకు? తగిన సమయంలో గురువుగారి శిష్యరికం చేసి ఆయన ఆశీర్వాదం పొందవలెను గదా! అలా చేసినట్లైతే మనకు అనేక సమస్యలు నశించి ధన్యులవడం తధ్యము అని అన్నమయ్య నివేదిస్తున్నాడు.

ముఖ్యమైన అర్ధాలు: కటకట = మనం బాధపడే సమయంలో వాడే పదం. అయ్యో! ఏమి పరిస్థితి ఇది? అనుకోవడం; గడచుట = దాటుట; ఘటన = ఏదైనా అనుకోకుండా జరగడం; ఇరవగు = సుస్థిరము; పలు = ఎక్కువ; ధర = ఈ భూమిపై; సొరిది = వరుస, క్రమము; అనంతము = అంతము లేనివి; కడు = ఎక్కువ; పానిన = ఇష్టపడి స్వీకరించడం; దుర్భాషమాటలు = చెడ్డమాటలు, దుర్భాష అన్నా మాటలు అన్నా ఒకటే అర్ధం. అన్నమయ్య దుర్భాషమాటలు అని ప్రయోగించడంలో ఔచిత్యం కనరాలేదు; సదరపు దివిజులు = తేలికగా అనుగ్రహం ఇచ్చే చిల్లరదేవుళ్ళు; చవులు = ఇష్టులు; శ్రీగురుయానతి = గురువు అనే పదం ఆయన బహుశ: సాధారణ గురువును గురించి కాక అహోబల మటస్థాపకుడు, అన్నమయ్య గురువు అయిన ఆదివన్ శఠకోపయతి గురించి వుండవచ్చు. పొదిగొని = గుంపుగూడు.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *