April 20, 2024

ఒక్క క్షణం ఆలోచించు!

రచన: నాగులవంచ వసంతరావు

మనిషికి మత్తెక్కించి
మనసును మాయచేసి
ఇల్లు ఒళ్ళు రెంటిని గుల్లచేసి
సంఘంలో చులకనచేసే
మద్యపాన రక్కసీ!
మానవజాతి మనుగడపై
నీ ప్రభావం మానేదెప్పుడు?

ఆడపడచుల ఆక్రందనలు, ఆవేదనలు
“చీర్స్” చప్పుళ్ళలో కలిసిపోయాయి
ఐస్ ముక్కల హిమతాపానికి
మంచులా కరిగిపోయాయి
మహాత్ముల ఉపన్యాసాలు, నీతిబొోధలు
సంఘ సంస్కర్తల త్యాగఫలాలు
మద్యం మత్తులో చిత్తుగా ఓడిపోయాయి

అర్ధరాత్రి స్వాతంత్ర్యం అర్థం తెలిసిపోయింది
గాంధీజీ కలలుగన్న భరతమాత గౌరవం
బక్కచిక్కి బరువెక్కి బజారుపాలైంది
మధ్యం నిషాముందు ఇoద్రభోగం దిగదుడుపే!

ఎవడన్నాడు నా దేశం బీదదని
ఒక్కసారి బార్ ను దర్శించిచూడు
కుబేరుల తలదన్నే కాసుల గలగలలు
కుంభవృష్టిలా కురిసే మధ్యం సెలయేర్లు

గజం భూమి ధర గణనీయంగా పెరిగిన నేడు
గజానికో బార్ వెలసినా ఆశ్చర్యం లేదు!
మందు మంచి నీరులా ఉపయోగించినా కరువేరాదు
లక్షలాది జీవితాలు బలైనా బాధే లేదు!

మనసా! ఇంద్రియాలంటే
నీకెందుకింత చులకన
క్షణాలలో పడేస్తావు
నీ వలలో క్షణికానందాలకు

ఆరునూరైనా అనుకున్న టైంకు
టంచనుగా హాజరు పరుస్తావు
నీ కబంధ హస్తాలలో
నిత్యం బందీని చేస్తావు

నాకెందుకో కక్ష తీర్చుకోవాలనుంది
మద్యం సేవించే వారిపై కానేకాదు
తాగడానికి మనసును ఉసిగొలిపి
బలహీనతలకు లొంగే ఇంద్రియాల మీద
మానవాభ్యున్నతిని మట్టుబెట్టే
మనో చాంచల్యం మీద!
***

1 thought on “ఒక్క క్షణం ఆలోచించు!

Leave a Reply to Perla. RAMU Cancel reply

Your email address will not be published. Required fields are marked *