March 28, 2024

బ్రహ్మలిఖితం 14

రచన: మన్నెం శారద

లిఖిత ఎంగేజ్ చేసిన టాక్సీ కొచ్చిన్‌లో బయల్దేరింది.
అడుగడుగునా బాక్‌వాటర్స్‌తో, కొబ్బరి తోటలతో మరో లోకంలో అడుగుపెట్టినట్లుంది కొచ్చిన్.
లిఖిత కళ్లార్పకుండా చూస్తుందా స్థలాల్ని.
సహజంగా సైట్ సీయింగ్‌కి, శబరిమలై వెళ్ళే యాత్రికుల్ని తీసుకెళ్ళడానికలవాటు పడ్డ డ్రైవర్ లిఖితలోని ఆసక్తి గమనించి “ఇదేనా మొదటిసారి రావడం మేడం?” అనడిగేడు ఇంగ్లీషులో.
అవునన్నట్లుగా తల పంకించింది లిఖిత.
“ఎన్‌చాంటింగ్ యీజ్ ద కరెక్ట్ వర్డ్ టు డిస్క్రయిబ్ ద బాక్ వాటర్స్ ఆఫ్ కేరళ” అన్నాడతను నవ్వుతూ.
లిఖిత అతనివైపు విస్పారిత నేత్రాలతో చూసింది.
అతను చాలా సింపుల్‌గా వున్నాడు. నల్లని శరీరం, వెనక్కు దువ్విన వత్తయిన క్రాఫు తెల్లషర్టు, తెల్ల లుంగీ చాలా సాదాగా వున్నాడు.
కాని.. ఆ కళ్ళలో మాత్రం అతనిలోని తెలివి తాలూకు మెరపు కనిపిస్తోంది. అతని ఇంగ్లీషు ఉచ్చారణలో మళయాళపు యాస కనిపిస్తున్నా చక్కటి భాష మాట్లాడుతున్నాడు.
“ఏ జర్నీ త్రూ ద బాక్ వాటర్స్ యీజ్ వెరీ ప్లెషరబుల్ ఇన్ ఏ కంట్రీ బోట్ ఫ్రం కొల్లాం టూ కొట్టాయం విచ్ యీజ్ కాల్డ్ వెనీస్ ఆఫ్ ఈస్ట్” అన్నాడతను తిరిగి నవ్వుతూ.
“ఏం చదువుకున్నారు మీరు?” అనడిగింది ఆసక్తిగా.
“ఎం.ఏ లిటరేచర్!”
“మరిలా టాక్సీ నడుపుతున్నారేంటి?”
“చూడండి మేడం. మా రాష్ట్రంలో నిరక్షరాస్యులే లేరు. ఎంతమందికని ప్రభుత్వం ఉద్యోగాలు ప్రొవైడ్ చెయ్యగలదు. అందుకే తప్పుకాని ప్రతి పనిని కష్టపడి చేసుకుంటాం. అయినా డిగ్రీలు ఉద్యోగం కోసమనే ఉద్ధేశ్యం తప్పు మేడం!” అన్నాడతను ఇంగ్లీషులో.
“మీ పేరు?”
“క్రిష్టఫర్. నా సంగతికేం గాని పరిగెత్తుతున్న అందాల్ని మిస్ కాకుండా చూడండి” అంటూ హెచ్చరించేడతను.
లిఖిత మళ్ళీ కిటికీలోంచి బయటికి చూసింది.
కేరళ రాష్ట్రం చాలా గమ్మత్తుగా వుంది. మనలా ఒక వూరు, మధ్యలో ఖాళీ స్థలాలు, మళ్ళీ మరో వూరు. అలా లేదు. అడుగడుగునా తోటలు. తోటల మధ్య ఇళ్ళు. అలా ఎప్పటికీ ఊరు అంతం కానట్లుగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఇళ్ళనానుకునే బాక్ వాటర్సున్నాయి. వాళ్లంతా మరో చోటికి ఫెర్రీల ఆధారంతోనే వెళ్లడం గమనించింది లిఖిత.
“అవర్ స్టేట్ యీజ్ ఏ నేరో స్ట్రిప్ టక్ట్ ఎవే ఇన్ ద సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ ఇండియా ఇన్ బిట్వీన్ ద అరేబియన్ సీ ఆండ్ వెస్ట్రన్ ఘాట్స్” అన్నాడు క్రిస్టఫర్.
లిఖిత అతని మాటలు వింటూ భగవంతుడు సృష్టించిన అందాల్ని ఇచ్చిన ప్రకృతిని ఎలా వుపయోగించుకున్నాడో గమనిస్తోంది. బాక్ వాటర్స్, కొబ్బరి తోటలు, టీ తోటలు, రబ్బరు తోటలతో కేరళ పచ్చదనంతో మనసుని పరవశానికి గురి చేస్తోంది.
టీ తోటల పసుపు, లేతాకుపచ్చ, ముదరాకు పచ్చరంగుల్లో కొండవాలుల్లో అందంగా గీతలు గీసి హద్దులేర్పరిచినట్లుగా కంపిస్తున్నాయి.
అడుగడుగునా చిన్న చిన్న వాగులు, జలపాతాలు, సూర్య కిరణాలు జొరబడకుండా పెరిగిన చెట్లు, నిజంగానే కేరళీయులు దేవతలు భూలోక సంచారానికి కేరళ రాష్ట్రాన్ని సృష్టించుకున్నారని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదనిపించింది లిఖితకి.
భగవతి కోవెలలో పూజారి కుట్టికారన్ చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చేయి. ఇంత చదువుకున్న అందమైన రాష్టరంలో నీచోపాసకులు ఎలా వెలిసేరో అనుకుంది బాధగా.
క్షణం సేపు తండ్రి గుర్తొచ్చి ఆమె మొహం మబ్బులు కమ్మినట్టయింది.
చీకటి పడుతుండగా టాక్సీ మున్నార్ టీన్ చేరుకుంది.
“ఎక్కడ దిగుతారు?” అనడిగేడు క్రిస్టఫర్.
“నాకు తెలీదు. మీరు చెప్పండి. ఎక్కడ బాగుంటుందో?”
“క్రిస్టఫర్ ఒక క్షణం ఆలోచించి “పదండి సినాయ్ కాటేజెస్‌కి తీసుకెళ్తాను” అంటూ టాక్సీని బస్టాండు దగ్గరగా వున్న సినాయ్ కాటేజెస్‌కి తీసుకెళ్ళేడు. లిఖిత అతనికి థాంక్స్ చెప్పి అతని టాక్సీ చార్జీలు పే చేసి లోనికెళ్లి ఒక రూం తీసుకుంది.
స్నానం చేసి భోంచేసి మనసు శరీరం అలసిపోవడం వలన వెంటనే పడుకొని నిద్రపోయింది లిఖిత..

**************
అహోబిళంలో నృసింహస్వామి దర్శనం చేసుకుని “నువ్విక్కడ ఈ కోనేటి గట్టున కూర్చో. నే వెళ్ళి స్వాములవారిని కలిసి రమ్మంటే నిన్ను తీసుకెళ్తాను” అన్నాదు వెంకట్ ఈశ్వరితో.
ఈశ్వరి బుద్ధిగా తలూపింది.
ఆమెకేదో ఆందోళన మొదలైంది మనసులో.
తనకెంత ధైర్యం! మొదటిసారి భర్తని, పిల్లల్ని వదిలేసి ఒక అపరిచిత వ్యక్తితో ఊరుగాని ఊరొచ్చేసింది.
అసలేం జరగబోతున్నదో!
ఇతను కూడ వెంకటే తన భర్తని చెబితే..
ఏం చేయాలి తనిప్పుడు! భర్తని.. పిల్లల్ని వదిలేసి .. ఇతనితో వుండిపోవాలా?
భర్తని వదిలేయగలదుగాని.. పాపం.. పిల్లలు.. ఆ పెద్దాడికి వంట రాదు. చిన్నాడు తనని చూడకుండా ఒక్క పూటా వుండలేదు. వాళ్ల చదువులు పాడయిపోతాయేమో! ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకుంటే.. ఆవిడ తన పిల్లల్ని సరిగ్గా చూస్తుందా? పోనీ తను వెంకట్‌ని బ్రతిమాలి తన పిల్లల్ని తీసుకెళ్తే! అతనొప్పుకుంటాడా?”
“ఈశ్వరి!!”
ఆ పిలుపు విని ఆమె తృళ్ళిపడి లేచి నిలబడింది.
ఎదురుగా వెంకట్‌తో పాటు ఒక గడ్డాలు మీసాలున్న వ్యక్తి నిలబడి వున్నాడు.
“ఈయనే ఓంకారస్వామి చెప్పిన స్వాములవారు. నమస్కారం పెట్టు” అన్నాడు వెంకట్.
ఈశ్వరి అతనికి నమస్కరించింది భయంగా.
“అతను కమండలమెత్తి అందులోని నీళ్ళు ఆమె మీద జల్లి “అపచారం చేసింది అమ్మణీ అమ్మ! నిన్ను కాదని మరొకణ్ణి కట్టుకుంది. పాప దోషం తీసేయాలి! ఒప్పుకుంటుందా?” అంటూ వెంకట్ వైపు తిరిగి చూశాడు.
“ఒప్పుకుంటుంది. ఒప్పుకుంటున్నానని చెప్పు!” అన్నాడు వెంకట్ ఈశ్వరి వైపు తిరిగి.
ఈశ్వరి తలాడించింది అయోమయంగా .
“అయితే రండి” అంటూ అతను కోనేటిలోకి దిగేడు.
వెంకట్ అతనిననుసరించి ఈశ్వరి కోనేటిలోకి దిగేరు.
ఈశ్వరి భయంగా వెంకట్ భుజం పట్టుకుంది.
“ఊ!” అని ఘర్జించేడు స్వామి.
ఈశ్వరి బిత్తరపోతూ చూసింది.
“అపచార దోషం తీసేసేంతవరకు అతన్ని తాకరాదు.!”
ఈశ్వరి తలాడించి వెంకట్‌కి దూరంగా నిలబడింది.
ముగ్గురూ మొలలోతు నీళ్లలో నిలబడ్డారు.
దోసిళ్ళతో నీళ్లు పట్టుకోమని ఏవేవో మంత్రాలు చదవసాగేడు.
ఈశ్వరి కళ్ళు గట్టిగా మూసుకుంది.
అరగంట గడిచింది.
అతను వాళ్ల దోసిళ్ళలో తన చేతిలోని మూటలో పొడి తీసి జల్లేడూ. నీరు పసుపు పచ్చగా మారింది. మరో పొడి తీసి జల్లేడూ. నీరు క్షణాల్లో ఎర్రరంగుగా మారింది.
“దోసిట్లో నీటిని కోనేటిలో వంపండి”
ఇద్దరూ స్వామి చెప్పినట్లే చేసేరు.
క్షణాల్లో కోనేరంతా ఎర్రగా మారిపోయింది.
“కళ్ళు తెరవండి”
ఇద్దరూ కళ్లు తెరిచేరు.
“చూడండి కోనేరే రంగులో వుందో?”
“ఎర్రగా వుంది”
“ఎందుకలా అయింది?” గంభీరంగా అడిగేడు స్వామి.
ఇద్దరూ మౌనంగా చూశారతనివైపు.
ఈ అమ్మణి పాపం చేసింది. భర్తని కాదని మరో వ్యక్తిని మనువాడి ఇద్దరు పిల్లల్ని కన్నది. అందుకే కోనేరు కన్నెర్ర చేసింది . సరే! ఆ పాపమంతా తేసేసేను. ఇప్పుడో మంత్రం చెబుతాను. కళ్ళు మూసుకుని వినండి. మనసెటూ పోకూడదు” అంటూ హెచ్చరించేడు స్వామి.
ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు.
స్వామి ఏదో ఒక మంత్రం చెప్పేడు.
వెంకట్ కొద్దిగా కళ్ళు తెరచి స్వామివైపే చూశాడు.
స్వామి కన్ను కొట్టి ఇవతలికి రమ్మన్నాడు.
వెంకట్ నవ్వాపుకొని ఇవతలికొచ్చి నిలబడ్డాడు.
ఈశ్వరి మాత్రం ఏకాగ్రతగా భక్తిభావంతో కళ్ళు మూసుకుంది.
“నా మాటలు జాగ్రత్తగా విను”
ఈశ్వరి తలూపింది.
“ఇవి నేను చెబుతున్న మాటలు కావు. నీ అదృష్టం పండి ఇక్కడికొచ్చేవు. ఈ జన్మలోనే నీ భర్తని కలుసుకున్నావు. ఇక ఇతన్ని వదలకూడదు.అర్ధమయిందా?”
ఈశ్వరి అర్ధమైనట్లుగా తలూపింది.
“నీటిలో మూడు మునకలెయ్యి!” అన్నాడు అభుక్తేశ్వరస్వామి.
ఈశ్వరి అలానే చేసింది.
ఆమె నిలువెల్లా తడిచి సన్నగా వణుకుతోంది.
అభుక్తేశ్వరస్వామి దృష్టి తడిసిన బట్టల్లో స్పష్టమవుతున్న ఆమె శరీరాకృతి మీద మెడలో నగల మీద ఒక్కసారే పడింది.
“పాపాత్మురాలా!” అంటూ గావుకేక పెట్టేడు.
ఈశ్వరి ఇంకా వణికింది.
“నీ భర్త వుండగా ఆ పెళ్ళెలా చేసుకున్నావు? వాడిని వెంటనే ఈ క్షణం నుండి వదిలెయ్యాలి. అర్ధమయిందా?”
ఈశ్వరి “అయింది స్వామి!” అంది లెంపలు వాయించుకుంటూ.
“అయితే మెడలో తాళి తెంపు!”
ఆమె ఉలిక్కిపడింది.
“ఒక కుక్క కట్టిన తాళిని మెడలో వుంచుకుని ఎగతాళవుతావా?”
“లేదు”
“అయితే తెంచు. ఇతను నీ మెడలో తాళి కడతాడు”
ఈస్వరి అప్పటికే మానసికంగా అసక్తురాలయిపోయింది. పూర్తిగా వాళ్లేం చెబితే అది చేసే పరిస్థితిలో వుంది. భర్తిప్పుడు నిజంగా కుక్కలానే కన్పిస్తున్నాడు. వెంకట్ జన్మజన్మలకి తనకి భర్తగా అనిపిస్తున్నాడు.
ఏదో శక్తి ఆవహించినట్లుగా మెడలో తాళి తెంపేసింది.
అభుక్తేశ్వరస్వామి శంఖం పూరించేడు కోలాహలంగా.
వెంటనే ఆ తెంచిన బంగారపు తాడుని తన జేబులో వేసుకొని మంగళసూత్రాల్ని పసుపు తాడుకెక్కించి ఈశ్వరి మెడలో కట్టమన్నాడు వెంకట్‌ని.
వెంకట్ అతనివైపు నిస్సందేహంగా చూశాడు.
“కొంపేమి మునగదులే. వెయ్యి” అన్నాడతను నెమ్మదిగా.
ఎందుకైనా మంచిదని వెంకట్ ఆవిడ మెడలో నాలు ముళ్ళేసేడు.
ఇద్దరూ కోనేటిలోంచి బయటకొచ్చేరు.
“ఈ తీర్థం తాగండి” అంటూ కమండలంలోని తీర్థం ఇద్దరి చేతుల్లో పోసేడు.
వెంకట్ తాగబోతుంటే మళ్లీ కన్నుకొట్టి ఆగమన్నట్లుగా సైగ చేసేడు స్వామి.
ఈశ్వరి మాత్రం అదేం గమనించలేదు.
మూడుసార్లు భక్తిపూర్వకంగా తీర్థం తీసుకుంది.
“బయటికి రండి” అని ఆజ్ఞాపించి తాను ముందు నడిచేడు అభుక్తేశ్వరస్వామి. పేరుగు తగినట్టుగానే అతను డొక్కలు కనిపిస్తూ వున్నాడు. అతనిని నిశితంగా గమనిస్తూ అనుసరించేడు వెంకట్.
“ఈ పిల్ల విషయం నాకు మా రాజు రాసేడు” అన్నడతను వెంకట్‌తో గుసగుసగా.
వెంకట్ మాట్లాడలేదు.
స్వామి ఈశ్వరివైపు చూసి”నువ్వు కాస్సేపలా చెట్టు క్రింద కూర్చుని దైవధ్యానం చేసుకో” అన్నాడు.
ఈశ్వరి యోగనిద్రలో వున్నట్లుగా తల పంకించి అక్కడే వున్న చెట్టూ క్రింద కూర్చుంది.
అప్పటికే బాగా చీకటి పడింది.
పక్షులు గోలగోల చేస్తూ గూళ్లకి చేరేయి,.
అసలే వృక్ష సముదాయంతో వున్న ఆ ప్రాంతం మరింత చీకటిమయమైంది.
స్వామి అక్కడే వున్న మంటపంలో కూర్చుని వెంకట్‌ని కూర్చోమన్నట్లుగా సైగ చేసేడు.
వెంకట్ కూర్చున్నాడు.
“ఇక్కడే ఈ మంటపంలోనే మనకిప్పుడు శోభనం!”
స్వామి మాటలకి వెంకట్ ఉలిక్కిపడ్డాడు.
“మనకంటున్నారేమిటి?”
స్వామి కన్నుకొట్టి “నేనేం నిజం స్వాములోర్ని గాదు. నా పేరు అసిరి. మా అన్నలా నేనూ చిలకజోస్యం చెప్పి ఈ ప్రాంతాల్లో బతుకుతున్నాను. విశాఖపట్నంలో ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాను. అందుకే ఇంత దూరం పారిపోయొచ్చేను. నాక్కాస్త ఆడ బలహీనతుంది. ఇదొక పిచ్చిముండ మనమిప్పుడేం చేసినా కాదనే స్థితిలో లేదు దాని మనసు. భయపడకు” అన్నాడు.
వెంకట్‌కెందుకో అతను చెప్పింది నచ్చలేదు.
అతని దృష్టి ఆమె ఆస్తి మీదే కేంద్రీకృతమై వుంది.
ఈ శారీరక సంబంధాల మీద అతనికి మక్కువ లేదు.
“వద్దు స్వామి! నాకింట్రస్టు లేదు. ఆ పిల్ల చాలా ఆస్తికి కాబోయే వారసురాలు. అది మనకొస్తే చాలు!” అన్నాడు.
స్వామి హేళనగా నవ్వేడు.
“అదెలానూ వస్తుంది. ఈ ఒంటరి రాత్రి అలాంటి ఆడపిల్లని వదులుకొనే స్థితి నీకుంటే వుండొచ్చు. నాకు మాత్రం లేదు. ఇపుడు మనమేం చేసినా కిమ్మనదా పిల్ల. నువ్వు కూర్చో” అంటూ స్వామి వేషంలో ఉన్న అసిరి చెట్టు క్రింద కూర్చున్న ఈశ్వరి దగ్గర కెళ్ళి భుజం తట్టేడు. ఆమె యాంత్రికంగా పైకి లేచింది.
అతనామె చెయ్యి పట్టుకుని మంటపం వైపు నడిపించేడు.
సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతమంతా ఒక టార్చ్ లైటు గిరగిరా తిరిగింది.
స్వామితో పాటు వెంకట్ కూడా ఆ కాంతిని చూసి ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు.
వెంటనే అడుగులు చప్పుడు వినిపించింది.
ఏం జరగబోతున్నదో స్వామి వేషంలో వున్న అసిరి వెంటనే గ్రహించేడు.
అంతే!!
వెంటనే ఈశ్వరిని వదిలేసి రివ్వున చెట్ల గుబురుల్లోంచి పారిపోయేడు.
ఆ కాంతి చిన్నగా వెంకట్ మొహం మీద నిలిచింది.
“అబ్బాయ్! అమ్మాయేది?”
ఆ గొంతు హెడ్‌మాస్టారు నారాయణరెడ్డిగారిదని గ్రహించేడు వెంకట్.
వెంటనే గొంతు తడారిపోయింది.
“మీరా?” అన్నాదు హీనస్వరంతో.
“అవున్నేనే! మీరీ రాత్రికి ఇక్కడ వుంటారని తెలిసి పరిగెత్తుకొచ్చేను. మీకు ముందే చెప్పేను కదా. ఇక్కడ దొంగ వెధవలుంటారని. ఇంతకీ అమ్మాయేది?” అనడిగేరు మాస్టారు ఆత్రంగా.
“పిల్లల్లేరని అతను పూజ చేస్తానంటే…” అంటూ గొణిగేడు వెంకట్ ఏం చెప్పాలో తోచక.
మాస్టారు గాబరా పడుతూ “అసలమ్మాయేదయ్యా?” అన్నాడు కోపంగా.
వెంకట్ మంటపం వైపు చూపించేడు.
మాస్టారు, జట్కా అతను గబగబా మంటపం వైపు పరిగెత్తినట్లుగా నడిచేరు. అక్కడ ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా కళ్లు మూసుకుని కూర్చుని వుంది ఈశ్వరి.
ఆ అమ్మాయిని ఆ స్థితిలో చూసి మాస్టారి పితృహృదయం ద్రవించింది.
“అమ్మా ఈశ్వరి!” అని పిలిచేడు ఆర్ద్రత మేళవించిన స్వరంతో.
ఈశ్వరి పలకలేదు.
మాస్టారు ఆ పిల్ల వంటి మీద తడి బట్టలు చూసి “ఏం చేసారీ పిల్లని! వాడేడి?” అన్నడు రౌద్రంగా.
“ఏదో పూజ చేసేడు కోనేటిలో అతను పారిపోయినట్లున్నాడు” అన్నాడు వెంకట్ సగం ప్రాణం వచ్చి.
“నువ్వు చదువుకున్నావా?”
వెంకట్ తలాడించేడు.
“ఎందుకు? ఏడవను? మంత్రాలకి చింతకాయలు రాలతాయా? అంతకీ పిల్లలు పుట్టకపోతే ఎవర్నయినా అనాధని పెంచుకోవచ్చుగా. నేను సందేహించి రాకపోతే.. ఈ పిల్ల బతుకు అధ్వాన్నమైపోయేది. ఏదో జరగబోతున్నదనే అనుమానంతోనే నేను పరిగెత్తుకొచ్చేను” అన్నారాయన.
వెంకట్ మాట్లాడలేదు.
మాస్టారు జట్కా అతని సహాయంతో ఈశ్వరిని జట్కా ఎక్కించేరు.
వెంకట్ ఎక్కేక మాస్టారు కూడా ఎక్కేరు.
జట్కా కదిలింది.
ఈశ్వరింకా ఈ లోకంలోకి రాలేదు.
జట్కా వెళ్తుంటే మాస్టారన్నారు మెల్లిగా.
“అహోబిళం చాలా పవిత్ర పుణ్యక్షేత్రం. చూడదగిన స్థలం. కాని మొగలిపువ్వులో మిన్నాగుల్లా ఇప్పుడిలాంటి ప్రాంతాల్ని దొంగస్వాములు ఆక్రమించుకుని కలుషితం చేస్తున్నారు. నమ్మిన మనుషుల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. పిల్లలు పూర్వ జన్మ రుణ సంబంధీకులు. రుణం లేకపోతే పిల్లలు కల్గరు. దానికోసం ఇంగితం మరచి నిన్ను కట్టుకున్న భార్యని పూజల పేరుతో పరాయి వారికప్పగిస్తావా? భార్యాబిడ్డలనే కాదు. ఏ స్త్రీనయినా గౌరవంగా చూడాలి. కన్నబిడ్డలా ఆదరించాలి. వీలైతే సహాయపడాలి. స్త్రీని మోసం చేసినవాడు స్త్రీ ఆస్తిని కాజేసినవాడు ఏడేడు జన్మలు రౌరవాది నరకాలను అనుభవిస్తాడని పెద్దలు చెబుతారు.

ఇంకా వుంది..

1 thought on “బ్రహ్మలిఖితం 14

  1. ఎన్‌చాంటింగ్ యీజ్ ద కరెక్ట్ వర్డ్ టు డిస్క్రయిబ్ ద బాక్ వాటర్స్ ఆఫ్ కేరళ” …నిజం శారద గారూ… కేరళలో 90% people english మాట్లాడగలరు….కేరళ అందాలతో పాటు….తెక్కడీ..మున్నార్ చుట్టుపక్కల villages లో నేటికీ కొన్ని మూఢ నమ్మకాలు…. కొందరు అప్రకటిత స్వాములు ద్వారా ప్రచారం అవుతూనే ఉన్నాయి…చదువుకున్నవారు వారిని అనుసరిస్తూనే వున్నారు…అసలు కథలో భాగమేనా లేక నిజమైనదేదో ఇందులో కలిపారా అన్నంత బాగా కథనం సాగింది. తరువాయి భాగం కోసం ఎదురు చూస్తూ హృదయ పూర్వక అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *