April 19, 2024

మాయానగరం – 42

రచన: భువనచంద్ర

“మీరు ఇలా తిండి మానేస్తే ఎలా బాబూజీ… పిల్లల వంక చూడండి. కిషన్ గారైతే మంచం మీద నుంచి లేవలేకపోయినా మీ గురించి అడుగుతున్నారు ” అనూనయంగా అంది మదాలస.
“ఏం చెయ్యను బేటి… ఉన్న ఒక్కగానొక్క కూతురు ఎక్కడుందో తెలీదు. అసలేమయ్యిందో తెలీదు. ఎలా తినబుద్ధి అవుతుంది? ” దీనంగా అన్నాడు సేఠ్ చమన్ లాల్. ఒక్క నెల రోజుల్లోనే అతను సగానికి సగం తగ్గిపోయాడు. బాధతోనూ, మనోవ్యధతోనూ శరీరం సగం వడిలిపోయింది.
“సుందరిగారి గురించి నాకు కొద్దో గొప్పో తెలుసు బాబూజీ. ఆమెకి ఏమీ కాదు.గుండె ధైర్యం మెండుగా వున్న మనిషి. తనకి తాను ఏ అపకారము చేసుకోదు. జరిగినదానికి భయపడి , ఎక్కడో కొంతకాలం దాగి వుంటుంది. ఖచ్చితంగా తిరిగివస్తుందని నాకు నమ్మకం వుంది. దయచేసి లేవండి. కనీసం తను వచ్చేవరకైనా మీరు ఆరోగ్యంగా వుండాలిగా ” చమన్ లాల్ ని అనూనయించి ‘రోటీ ‘ తినిపించసాగింది మదాలస.
యాక్సిడెంట్ అయ్యిన రోజు నుంచే ‘మిస్ ‘ అయ్యింది సుందరి. ఆమె ఏర్ పోర్ట్ కి వెళ్ళిందన్న ఆచూకీ మాత్రం ‘స్పష్టం ” గా తెలిసింది. అంతే కాదు బ్యాంక్ నుంచి ఆరు లక్షల కాష్ డ్రా చేసినట్టు కూడా తెలిసింది. ఇంట్లో వెతికితే ఆమె చెక్ బుక్ కూడా కనపడలేదు.
“సారీ డాడ్ … నేను పోలీసులకి వాగ్మూలం ఇస్తూ ఇక్కడ వుండలేను. అందుకే వెళ్తున్నాను. మళ్ళీ వస్తాను… ఎప్పుడొస్తాన్ మాత్రం చెప్పలేను.” అన్న నోట్ మాత్రం సేఠ్ చమన్ లాల్ టేబుల్ మీద పెట్టి వెళ్ళింది.
యాక్సిడెంట్ లో బహుషా ‘రుషి ‘ చనిపోయి వుంటాడనే భయంతోనే ఆమె వెళ్ళిపోయిందని అనుకున్నాడు చమన్ లాల్. నెల గడిచినా మరే కబురు ఆమె నుంచి రాలేదు.
కిషన్ లాల్, రుషి, ఇద్దరూ హాస్పటల్ లో ఉన్నప్పుడే మదాలసని పిల్లల్ని చూసుకోడానికి , ఇంటి విషయాలు చూసుకోడానికి ‘కేర్ టేకర్’ గా ఉద్యోగమిచ్చాడు చమన్ లాల్. కూతురి ఉత్తరం చూశాక అతనికేమీ పాలుపోలేదు. పిల్లల్ని చూసుకోడానికైనా ఎవరో ఒకరు ఉండాలనే మదాలసకి ఉద్యోగమిచ్చాడు.
చాలా విశాల హృదయంతో నెలకి పది వేల రూపాయిల జీతమూ నిర్ణయించాడు. మూడేళ్ళ కాంట్రాక్టుతో కార్బన్ పేపర్ మీద సంతకం చేయించి పక్కా ‘ అప్పాయింట్ మెంట్ లెటర్ ‘ టైపు చేయించి, సంతకం పెట్టి మరీ ఉద్యోగం ఇవ్వడంతో, మదాలస కూడా ధైర్యంగా ఉద్యోగం విషయం ఇంట్లో చెప్పింది. చెప్పిన మరుక్షణమే మదాలస అత్తగారి గుండెల్లో రాయి పడింది. భర్తగారికైతే కళ్ళు తిరిగినై కారణం అతని జీతం ఏడు వేలు మాత్రమే!
“భలే అదృష్టవంతురాలివమ్మాయ్… నిన్న డిగ్రీ పాస్ అవ్వడం ఇవాళ్టికల్లా పదివేల రూపాయిలొచ్చే ఉద్యోగం దొరకడం. అంతా ఆ శ్రీకృష్ణమూర్తి మహిమానున్నూ.. ఆశీస్సున్నున్నున్నున్నూ… ! లేకపోతే దీంతస్సదియ్యా వీధికో వందమంది ఉద్యోగం కోసం అంగలారుస్తుంటే , మరి నీకు ఠక్కున దొరకడం మహాభాగ్యం కాదూ! ” మెచ్చుకుంటున్నట్టు మెచ్చుకుంటూనే మాట విరుపుతనాన్ని ప్రదర్శించిందో పొరుగింటి పాపాయమ్మ.
“అవునవును.. మహాభాగ్యం కాదూ! అవును కానీ అమ్మాయ్ పిల్లలకి కేర్ టేకర్ అంటే ఆయా ఉద్యోగమా? ఆయాకి పదివేలంటే మహాభాగ్యం కాక మరోహటీ మరోహటీనా? ” నవ్వులో విషాన్ని సమ్యుక్తంగా చిమ్ముతూ అన్నాడో వెనకంటి వైకుంఠ వర ప్రసాదు.
ఒక్కమాట కూడా మాట్లాడకుండా చిన్నగా చిరునవ్వు నవ్వి లోపలకి వెళ్ళిపోయింది మదాలస.
“అబ్బా..! ఆయా ఉద్యోగానికి ఏం టెక్కు పోతోందిరా నాయనా! ” అక్కసునంతా గొంతులో ధ్వనింపచేసిందో ఇరుగింటి ఇల్లేరమ్మ.
“అమ్మాయి! ఇంత కాలానికి నీ కష్టాలు తీరాయనుకో పాపం ఒక్కడి సొమ్ముతో ఇంత ఇంటి భారం మొయ్యాల్సి వచ్చేది. ఇంకనే బ్రహ్మాండంగా సంసార సాగరాన్ని ఈదొచ్చు. అమ్మాయ్ నీరజా.. ఇక నీ పెళ్ళి భోజనమే మిగిలింది. ” ఇప్పటి దాకా ఆ కుటుంబాన్ని మహా ఆదరిస్తున్నట్టు మొహం పెట్టి చిలక పలుకులొలికించాడో చిదంబర శాస్త్రి.
“మంచిమాట అన్నావోయ్. అసలు సిసలు అదృష్టం నీరజదేననుకో ” వత్తాసుపలికాడో కాలక్షేపం శర్మ.
అన్నీ వింటూ మౌనంగా వున్నది మదాలస. “వదినా.. నువ్వు నిజంగా గ్రేట్. ” కావలించుకొని అన్నది నీరజ. అసలేం మాట్లాడాలో ఆమెకు అర్ధం కాలేదు. బయటకు ఎలా వున్నా , మదాలస లోలోపల రగులుతోన్న అగ్నిపర్వతం అని ఆమెకు తెలుసు. “పోనీ ఏ తిరుగుడో ” అని మదాలసతో అన్నప్పటి నుంచి నీరజ తప్పు మాట్లాడానన్న భావం దహిస్తూనే వుంది. మదాలస కూడా అవసరానికి మించి ఎవరితోనూ మాట్లాదటం మానేసింది. పోగొట్టుకున్న చనువును ఎలా తిరిగి పొందడం?
మదాలసకి ఇబ్బందిగా వున్నా ఓ మొండి ధైర్యం మనసులో కొండలా ఎదిగింది. భర్తా అత్తగార్లు ఏమంటారో తెలీదు. ” నీ “అంతట నువ్వు నిర్ణయించుకున్నాక నాదేముంది? ఆఫ్ట్రాల్ మొగుడి గాడ్ని” చెప్పిన వెంటనే విప్పిన చొక్కా మళ్ళీ వేసుకొని బయటకు పోతూ అన్నాడు మూర్తి. ఆ మాట మాట్లాడింది అతను కాదని అతనిలోని అహంకారంతో కూడిన నిస్సహాయత అనీ స్పష్టంగా మదాలసకి అర్ధమయ్యింది.
“మదాలస… కంగ్రాట్స్!! ఏనాడు నువ్వు నీ పూర్తి జీతాన్ని నీ అత్తింటి వారి చేతుల్లో పొయ్యద్దు. వచ్చిన మొత్తం నీ బ్యాంకులోనే, నీ అకౌంటులోనే వేసుకో. అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రమే కుటుంబం కోసం ఖర్చుపెట్టు. ఎందుకంట్, నీకు ధైర్యాన్ని ఇచ్చేది నీ బ్యాంకు బేలన్సే “స్ఫస్టంగా మదాలసకి చెప్పింది మాధవి, సేఠ్ చమన్ లాల్ ఉద్యోగమిచ్చాడని విన్న మరుక్షణమే.
పొద్దున్నే యధాతథంగా అది వరకు చేసినట్టుగానే ఇంటిపనులు చేసి ఠంచనుగా పదింటికల్లా చమన్ లాల్ గారింట్లో ఉంటోంది మదాలస. ఆమెని ఇంటి దగ్గర నుంది తీసుకొని రాడానికీ, తిరిగి ఇంటికి పంపడానికీ కూడా ‘రిక్షా’ ఏర్పాటు చేసింది చమన్ లాల్ గారే! మదాలస టిఫిను, భోజనం కూడా చమన్ లాల్ ఇంట్లోనే జరిగిపోతున్నాయి. వంటపనికి ఓ గుజరాతి వృద్ధురాలిని తెప్పించారు. పేరుకి మాత్రమే ఆవిడ, చేస్తున్నది మాత్రం మదాలసే! ముసలావిడ చేస్తున్నప్పుడు గుజరాతి వంటకాల్ని జాగ్రత్తగా గమనించి , చాలావరకు పర్ఫెషన్ గానే నేర్చుకుంది మదాలస.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *