March 29, 2024

రెండో జీవితం 4

రచన: అంగులూరి అంజనీదేవి

ఆమె దృష్టిలో ప్రేమ కామం కాదు. ఇంకేదో…! మరి పురుషునిలో తండ్రి అంశ వుండదు. ప్రేమ అంటే కామమే… ఎవరైనా మనిషి చనిపోతే ఏడుస్తారు. కానీ తాగుబోతుల భార్యలు నిత్యం ఏడుస్తూనే వుంటారు.
వంటగదిలో వున్న శకుంతల – భర్త పిల్లల్ని తిట్లే తిట్లు వినలేక, దేవుడు ఈ చెవులను ఎందుకు ఇచ్చాడా అని బాధపడ్తోంది.
తిట్లు ఆగిపోయాయి.
కుక్కర్‌ విజిల్‌ రెండు సార్లు రాగానే ఆపేసింది.
”మమ్మీ! మమ్మీ!” అంటూ ఆపదలో వున్న దానిలా నిశిత గొంతులోంచి ఆర్తనాదం విన్పించగానే బయటకి పరిగెత్తింది శకుంతల.
ప్రభాకర్‌ కూర్చున్న చోట లేడు. నిశిత దగ్గరకి వెళ్లాడు నిశితను పట్టుకొని నెడుతున్నాడు. ఏం చేస్తున్నాడో అర్థంకాక షాకైంది శకుంతల. క్షణాల్లో తేరుకుని భర్తను చేయి పట్టుకొని ఇవతలకి లాగుతూ…
‘ఏం చేస్తున్నావ్‌ దాన్ని? తాగిన మైకంలో కళ్లు మూసుకుపోయాయా?” అని అరుస్తూ, ఏడుస్తూ ఆయన్ని బలంగా లాగింది.
ఆ విసురుకి నిశితను వదిలి భార్య మీద పడ్డాడు. వాళ్లిద్దరు పెనుగులాడటం మొదలైంది. ఒకరిమీద ఒకరు విరుచుకుపడ్డారు. పై అంతస్థు నుండి విసురుగా కిందవున్న రాళ్ళపై పడటం వల్ల తలలు పగిలి కొద్దిసేపట్లోనే ప్రాణాలు విడిచారు.
అంతా క్షణాల్లో జరిగిపోయింది.
నిశిత అలాగే చూస్తూ, నిస్సహాయంగా అరుస్తోంది. ఆ అరుపులు విని చుట్టుపక్కల వాళ్లొచ్చారు.
ఆ వాతావరణం అరుపులతో, కేకలతో, ఏడుపులతో నిండి – విధిని తలపింపచేస్తోంది.
….కొంతమంది” అయ్యో! అయ్యో! ఇదేం ఘోరం? ఇంతకు ముందేగా ఇద్దర్ని ప్రాణాలతో చూశాం! ఇంతలోనే ఇదేం మాయ? ఇదేం విపరీతం?” అని గుండెలు బాదుకుంటూ నిశిత దగ్గరకి వచ్చారు.
వాళ్లంతా ఒక్కసారిగా అలా రావటంతో… నిశిత కళ్లు, నోరు, ఆవులిస్తున్నట్లు పెట్టి శిలలా అయింది. ఆ షాక్‌లోంచి ఆమెను బయటకు తీసుకురావాలని చూశారు. ఆమె భుజాలు పట్టుకొని కదిలించారు. ఆమె మాట్లాడలేదు. నెమ్మది, నెమ్మదిగా…
కుర్చీలోనే పక్కకి ఒరిగింది.
కంగారుపడి నిశితకూడా చనిపోయిందనుకున్నారు.
ఆత్రంగా ఆమె ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తూ ఒకరు…చేయిపట్టి నాడి చూస్తూ ఒకరు.. గుండెలపై చేయివేసి ఇంకొకరు… చూశారు. శ్వాస ఆడుతుండటంతో బ్రతికే వుందని నిర్ధారణ చేసుకున్నారు.
తర్వాత కార్యక్రమం ఏంటి? ఎలా చెయ్యాలి? అనుకుంటూ.. కొంతమంది కిందవున్న శవాల దగ్గర వున్నారు. వెంటనే శ్యాంవర్ధన్‌ సెల్‌నంబర్‌ తెలుసుకొని – కాల్‌చేసి విషయం చెప్పారు.
నిశిత ముఖంపై నీళ్లు చల్లారు.
ఆమె కళ్లు తెరిచి ఏడుస్తుంటే… అక్కడున్న ప్రతి ఒక్కరు ‘అయ్యో పాపం!’ అంటూ కళ్లు తుడుచుకుంటున్నారు.
*****
మనిషి జీవితం ముగిశాక చివరి గమ్యం శ్మశానం…
శకుంతల, ప్రభాకర్‌ల శవాలను శ్మశానం వైపు తరలిస్తుంటే సంవేద, నిశితల ఏడుపులు, పెడబొబ్బలు, ఆర్తనాదాలు అక్కడున్నవాళ్ల హృదయాలను పిండాయి.
ఒక దృశ్యం రెప్పపాటు కాలంలో చేజారిపోయినట్లు చూస్తుండగానే తల్లిదండ్రులు కనుమరుగై గతంలోకి చేరిపోయారు.
అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చేయించి, ఓ బాధ్యత అయిపోయినట్లు భార్యతో ఊరెళ్లిపోవానికి సిద్ధమయ్యాడు శ్యాంవర్ధన్‌.
నిశితవైపు చూసింది సంవేద.
ఎండలు పెరిగి, నీళ్లు ఎండిపోయి, పొలాలు బీటలువారి, పశువులు బక్కచిక్కిపోతే ఒక ఊరు ఎలా తల్లడిల్లి పోతుందో అలా వుంది నిశిత.
ఒంటరిగా మిగిలిపోయిన నిశితను ఏం చేయాలో అర్ధంకావటంలేదు సంవేదకు. పోయినవాళ్లు ఎలాగూ తిరిగిరారు. నిశితకు తను తప్ప ఎవరున్నారు? ఒక అక్కగా నిశిత గురించి తీవ్రంగా ఆలోచిస్తూ…
”నిశితను ఏం చేద్దామండీ?” అంది మెల్లగా సంవేద.
”మీ వాళ్లెవరైనా తీసికెళ్తారేమో అడిగి చూడు వేదా?” అన్నాడు క్యాజువల్‌గా అతను నిశిత గురించి ఏమాత్రం ఆలోచించటం లేదని అర్ధమై ఆమె మనసు చివుక్కుమంది.
”అడిగి చూశాను. వాళ్లెవరు ముందుకు రావటంలేదు కనీసం. సలహా కూడా ఇవ్వటంలేదు.” అంది
”ఎందుకలా? ” అన్నాడు.
”వ్యర్ధం చేయవద్దు, దేబిరించవద్దు అని ఓ సామెత వుంది. కొందరు తమ దగ్గర వున్న డబ్బునిగాని, వనరులనుగాని, ముందూ వెనకా చూడకుండా ఖర్చుచేస్తారు. అలా ఖర్చుపెట్టేటప్పుడు వాటి అవసరాన్ని, విలువను గుర్తించరు. అలాంటి వాళ్లలో మా నాన్న ఒకడు. ఆయన ఇంతకాలం పనిచేసింది ప్రైవేటు కంపెనీలో కాబట్టి అంతో ఇంతో వచ్చిన డబ్బంతా ముందే వాడేసుకున్నాడట.. ఇప్పుడు నిశితను ఎవరూ పట్టించుకోవటంలేదు. మబ్బులు ఎప్పుడు వర్షిస్తూనే వుండవు కదా! నీళ్లను స్టోర్‌ చేసుకోవాలని నాన్నకి తెలియలేదు.” అంది సంవేద నిస్సహాయంగా చూస్తూ….
భార్య అంతగా క్రుంగిపోయి ఎప్పుడూ కన్పించలేదు.
మానవసంబంధాలు ఎంత బలీయమైనవో, అవి మనుషుల్నెంతగా బాధిస్తాయో అర్ధమవుతోంది శ్యాంవర్ధన్‌కి.
కొద్దిదూరంలో వున్న నిశిత దీర్ఘాలోచనలో మునిగి, ఎవరూలేని అనాధలా, ఏకాకిలా ఒంటరిగా చక్రాల కుర్చీలో కూర్చుని వుంది. ఆమెనలా చూస్తుంటే ఎలాంటి వారికైనా హృదయం కరిగేలా వుంది.
భర్త ఏం సమాధానం చెబుతాడా అని ఎదురుచూస్తోంది సంవేద.
సమాధానం లేనివాడిలా తలవంచుకొని, కాలి బొటనవేలితో నేలను కెలుకుతూ ఆలోచిస్తున్నాడు.
”నిశితను చూస్తుంటే ఏడ్వటం తప్ప నాకింకో ఆలోచన రావటంలేదు. అందుకే మీరేం చెబుతారోనని…!” అంది అతని వైపు ఆశగా, ఆత్రుతగా చూస్తూ…
”చెప్పానికి ఏముంది.? ఏదైనా పనిలో వుంచుదామా అంటే మీ చెల్లెలు ఏ పనీ చేయలేదు. చక్కగా పనులు చెయ్యగలిగివాళ్లకే పనులు ఇవ్వటానికి సందేహిస్తున్నారు. నీకు తెలియంది ఏముంది?” అన్నాడు శ్యాంవర్ధన్‌.
”నిశిత పనిచేసి తనను తను పోషించుకోగలిగితే నాకింత ఆలోచనదేనికి? అలాంటిది లేకనే కదా!” అంది తనలో తను అనుకున్నట్లే…
శ్యాంవర్ధన్‌ మాట్లాడలేదు. నిశిత విషయంలో ఆ ఇద్దరి ఆలోచనలు కలవటంలేదు.
సహచర్యం అనేది సేమ్‌ఫేజ్‌లో వుంటేనే ఇంజనీర్స్‌ మానిటర్స్‌ చేసినట్లు సరైన స్థాయిలో వుంటుంది. లేకుంటే పనికిరాని కాగితాన్ని వుండలా చుట్టి విసిరెయ్యాలనిపించేలా వుంటుంది. కానీ విసిరేయలేరు.
”దాన్ని మనింటికి తీసికెళ్దామండీ!” అంది ధైర్యంచేసి సంవేద.
”ఒకరిని పెళ్లిచేసుకొని ఇద్దర్ని వెంటబెట్టుకొచ్చావ్‌? దేనికి పనికొస్తుందని ఈ కుంటిదాన్ని తెచ్చుకున్నావ్‌? అంటుంది మా అమ్మ. మా అమ్మ సంగతి నీకు తెలియదు” అన్నాడు.
”అంత కుంటిదేం కాదండీ! ఒక కాలిపై నిలబడి సింక్‌ దగ్గర గిన్నెలు తోమగలదు. ఇంట్లో అవసరమైన చిన్న, చిన్నపనులు చెయ్యగలదు. అంత తిండి పెడితే చాలు.. నాకు పనిలో సాయంగా వుంటుంది. మనం దానికి షెల్టర్‌ ఇచ్చినట్లవుతుంది. అక్కను నేనుండి దాన్ని అనాధలా వదిలివెయ్యానికి నా మనసెందుకో ఒప్పుకోవటంలేదు” అంది.
”నీ ఆలోచన నీకు బాగానే వుంది. కానీ మా అమ్మ గురించి ఆలోచించు…” అన్నాడు.
”అత్తయ్యకి నేను నచ్చచెప్పుకుంటాను. మీరిప్పుడు ఒప్పుకొని దాన్ని మనవెంట తీసికెళ్తే చాలు…” అంది.
”కానీ ఎన్ని రోజులు అలావుంచుకోవాలి?” అన్నాడు ఏమాత్రం ఇష్టంలేని వాడిలా.
”దానికి ఏదో ఒక నీడ దొరికేంతవరకు. ఆ తర్వాత ఒక్కక్షణం కూడా వుండదు” అంది నన్ను నమ్మండి అన్నట్లు..
”ఓ.కె.” అంటూ పర్మిషన్‌ ఇచ్చాడు.
నిశితను తమవెంట తీసికెళ్లానికి రెడీ చేసింది సంవేద. ఇంటిఅద్దె, కరెంటు బిల్లు బ్యాలెన్స్‌ వుంటే క్లియర్‌ చేసింది. ఉన్న ఆ కొద్దిపాటి సామాన్లను తెలిసిన వాళ్ల ఇంట్లో పెట్టింది. వెంటనే బయలుదేరారు.
నిశితకి వాళ్లవెంట వెళ్తుంటే – అక్కలో తల్లి, బావలో తండ్రి కన్పించాడు. తన తండ్రిలాంటి వాడు మాత్రం కాదు.
*****
కృతిక అత్తగారు రాలేదన్న కారణంతో శృతిక అక్క దగ్గరే వుంది. ద్రోణ కాల్‌ చేసినప్పుడు అదే విషయం చెప్పింది.
”కృతిక అత్తగారు ఎప్పటికీ రాకుంటే అక్కడే వుండిపోతావా? దీనికి సొల్యూషన్‌ ఇదేనా…” అన్నాడు ద్రోణ.
”అబ్బే.. అలాంటిదేం లేదండి! జస్ట్‌ హెల్ప్‌ అంతే!” అంది. ఆమె తన మనసుకి నచ్చినదాని గురించే ఆలోచిస్తోంది. కానీ ఆమె అభిలాషను, ఆలోచనలను సమర్థించి, సానుభూతి చూపే స్థితిలో లేడు ద్రోణ.
కారణం ఆమెపట్ల అతని మనసు ఒక గాలిలా స్పర్శించి వెళ్లటంలేదు. మహోదృతమైన ఉప్పెనలా పొంగుతోంది. ఆమె మాత్రం మూసిన గుప్పెటలా మౌనంగా వుంటోంది… ఎంతో సున్నితంగా పూసే పూతలా, కాసే కాతలా వుంటుందనుకున్న ఆమె ప్రవర్తన నోటి పూతలా మారి రహస్యంగా బాధపెడ్తోంది. అది ఎవరితో చెప్పుకోలేక ఒంటరిగా కూర్చుని, తర్వాత సాధారణ స్థితికి వచ్చి బొమ్మవెయ్యటంలో మునిగిపోతుంటాడు.
పిల్లల్ని రెడీ చేస్తూ ద్రోణనుండి వచ్చిన కాల్‌ని కట్ చేసింది శృతిక. అతను మళ్లీ కాల్‌ చేశాడు. అప్పుడు మాట్లాడింది పొడి, పొడిగా..
కొలీగ్‌ మేరేజ్‌కి వెళ్లి రాత్రి లేటుగా వచ్చిన కృతిక ఉదయాన్నే బద్దకంతో లేవలేకపోతుంటే… అక్కకి దగ్గరగా వెళ్లి.
”అక్కా! నువ్వు లేచి ఆఫీసుకి రెడీ అవ్వు… నేను వెళ్లి పిల్లల్ని స్కూల్‌ దగ్గర దింపి వస్తాను.” అంది శృతిక.
”హమ్మయ్యా! ఒక పని తప్పింది. ఈరోజు అసలే ముందుగా రమ్మన్నాడు ఆఫీసులో పెద్దబాస్‌…” అని మనసులో అనుకుంటూ డ్రస్సింగ్‌ టేబుల్‌ వైపు చేయి చూపి…
”అదిగో! అక్కడ నా స్కూటీ కీస్‌ వున్నాయి. తీసికెళ్ళు” అంది కృతిక కళ్లు తెరకుండానే.. రోజు ఆఫీసుకెళ్లే ముందు కృతికనే పిల్లల్ని స్కూల్లో వదిలివెళ్తుంది. ఈరోజు అక్క డ్యూటీని శృతిక తీసుకుంది.
పిన్నితో స్కూల్‌ కెళ్లటం అంటే ఆ పిల్లలకి చాలా ఉత్సాహంగా వుంటుంది… మమ్మీ అయితే చాలా క్యాజువల్‌ గా వదిలి ఆఫీసుకి వెళ్తుంది. పిన్ని అలా కాదు ముద్దుచేస్తుంది. అవీ, ఇవీ మాట్లాడుతుంది. కొత్తగా అద్భుతంగా అన్పించిన చోట స్కూటీని ఆపి చూపిస్తుంది. ఏది అడిగినా వద్దు అనకుండా కొనిస్తుంది.
శృతికకు కూడా ఆ పిల్లల్తో సరదాగా గడిచిపోతోంది.
స్కూటీమీద పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తున్న శృతికకు నిన్న టీనాను ట్యూషన్లో వదలానికి వెళ్లినప్పుడు.. ఆ టీచర్‌ ఇంట్లో గోడలకి ద్రోణ వేసిన పెయింటింగ్స్ వుండటం గుర్తొచ్చింది. ఆమె ఆలోచనలు అటు మళ్లాయి.
”టీచర్‌! ఆ పెయింటింగ్స్‌ మా బాబాయ్‌ వేసినవి…” అంది అప్పుడే కొత్తగా కన్పించిన ఆ పెయింటింగ్స్‌ని చూస్తూ టీనా. అలా అంటున్నప్పుడు టీనా కళ్లలో ఒకవిధమైన లైట్ కన్పించింది టీచర్కి..
”బాబాయ్‌ అంటే మీ వారా?” అంది శృతికవైపు చూసి టీచర్.
అవునన్నట్లు తలవూపింది శృతిక.
భర్త ాల్‌ెం బయటవాళ్లకి అద్భుతమే కావొచ్చు. కానీ ఆమెకి మాత్రం అంత ఉత్సాహంగా అన్పించదు.
తనంత ఆత్రుతగా అడుగుతుంటే ఈవిడేిం ఇంత నార్మల్‌గా వుంది అని టీచర్కి అన్పించినా… గొప్ప వాళ్లెప్పుడూ ఇలాగే వుాంరు అనుకొంది.
”ఈ పెయింటింగ్స్ ని నిన్ననే ఎగ్జిబిషన్‌లో కొన్నాం… ఇవి పెట్టాక మా ఇంట్లో కొత్త కళ ప్రవేశించింది. ఎవరు చూసినా అడుగుతున్నారు ఇవి ఎక్కడ కొన్నారు? అని… ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఆర్టిస్ట్‌ను నిన్న ఎగ్జిబిషన్లో చూశాం. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆర్టిస్టులనే వాళ్లు సృష్టికి ప్రతిసృష్టి చేసేవాళ్ళుకదా! అందుకే ఆ ఫీలింగ్‌…” అంది టీచర్.
”ఇట్స్ ఓ.కె.” అంది శృతిక సింపుల్‌గా.
”మీరు ఆయన మిసెస్‌ అని తెలిసి ఎగ్జయిటింగ్‌గా వుంది. జస్ట్‌ ఎ మినట్! మీరిలా కూర్చోండి!” అంది ద్రోణ వర్షిత్‌ తన ఇంటికి వచ్చినంత ఆనందంగా…
…ఏమిటో ఈ ఆనందం? అనుకొని ”నేను వెళ్లాలి…” అంది శృతిక.
ద్రోణకి ఎవరు ఇంపార్టెన్స్‌ ఇచ్చినా శృతికకు నచ్చదు. అది తెలియక తన ఎమోషన్లో తను మాట్లాడుతోంది టీచర్. గోడకి తగిలించివున్న పెయింటింగ్‌ వైపు చూస్తూ…
”ఏదో అన్వేషిస్తున్నట్లున్న ఈ బొమ్మలో పైకి కన్పించని గుండె బరువు, ఎవరూ ఆపలేని దుఃఖం ఒలుకుతోంది. ఆ దుఃఖాన్ని దోసిళ్లతో పట్టి ఆపగలిగే స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్న ఆమెలో ఎంత ఆశ”.. చాలామంది వేసిన బొమ్మల్ని చూస్తుంటాం… కానీ ద్రోణగారి బొమ్మల్లో వున్న ఆర్తి, ఆర్థ్రత, రసనైవేధ్యంలా అన్పించటం విశేష ఆకర్షణ… అందులో కన్పించే మెసేజ్‌ అమోఘం.” అంది టీచర్. ఆమె టీచర్ కాబట్టి తనెలా ఫీలవుతుందో అది చక్కగా ప్రజంట్ చేస్తోందని శృతికకు తెలుసు. ఎదుటివాళ్ల ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని ఆపకూడదనుకొంది.
కానీ తన ఫీలింగ్స్‌ తనకి ముఖ్యం.
ద్రోణ తన ఒక్కదానికే సొంతం.
ఇది నాది అని అనుకోవటంలో వుండే రుచి ఆమెకు తెలుసు.
నాకేవుండాలి. నాకే చెందాలి. మరొకరికి దీనివల్ల ఉపయోగం వుండకూడదు. ఆ స్వార్ధంతోనే కొద్దిరోజులు దూరంగా వుంటే అతను దారిలోకి వస్తాడని ఇలా వచ్చింది.
భర్తలో మార్పువచ్చి వుండొచ్చు. అక్కతో చెప్పి రేపే అతని దగ్గరకి వెళ్లాలి. వెళ్లాక – ఒక్క ఫోన్‌కాల్‌ వచ్చినా వూరుకోకూడదు. భర్తను ఓ ముద్దనుచేసి పిడికిట్లో పెట్టుకోవాలి అనుకుంటూ స్కూటీని డ్రైవ్‌ చేస్తుంటే…
వెనకనుండి స్పీడ్‌గా వస్తున్న స్కూటర్‌ శృతిక స్కూటీకి డ్యాష్‌ ఇవ్వటంతో వెనకనుండి పిన్నిని పట్టుకొని కూర్చుని వున్న టీనా కిందపడింది.
వెనక్కి చూసింది శృతిక.
డ్యాష్‌ ఇచ్చిన స్కూటరతను వేగంగా ముందుకెళ్లి పోయాడు.
కిందపడ్డ టీనా బాధతో గిల, గిల కొట్టుకుంటోంది. ఆ భయంలో ఏంచేయాలో తోచలేదు శృతికకు.
ముందున్న మోనాను వెనక కూర్చోమని, టీనాను ముందు కూర్చోబెట్టుకొని, గట్టిగా పట్టుకొని ఒక చేత్తో డ్రైవ్‌ చేస్తూ హాస్పిటల్‌కి తీసికెళ్లింది.
టీనా ఏడుస్తోంది. ఎడమ చెయ్యి విరిగి చేతివేళ్లు బాగా నలిగి రక్తం కారుతున్నాయి.
యాక్సిడెంట్ కేసు అని – హాస్పిటల్‌ వాళ్లు వెంటనే వైద్యం చేయలేదు.
శృతిక ఫోన్‌ చెయ్యగానే కృతిక వచ్చింది.
భయంతో శృతికకు చెమట్లు పోస్తున్నాయి.
ఈ రోజు తన పొరపాటేం లేదని శృతికకు తెలుసు. తప్పంతా స్కూటరతనిదే.. స్పీడ్‌గా డ్రైవ్‌ చేస్తూ. ఎవరో అమ్మాయికి ‘హాయ్‌!’ చెబుతూ తన స్కూటీకి డ్యాష్‌ ఇచ్చాడు.
ఒకప్పుడు తనుకూడా ఇలా స్పీడ్‌గా వెళ్లి యాక్సిడెంట్లు చేసి తండ్రిని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు టీనా చెయ్యి తన వల్లనే విరిగిందని తెలిస్తే తండ్రి ఏమంటాడో? తల్లేమంటుందో? చూసేవాళ్ళు ఏమనుకుంటారో? అనుకుంటూ టీనా వైపు ఆందోళనగా చూస్తోంది శృతిక.
శృతిక భుజంపై చేయివేసి కంగారుపడకు అన్నట్లుగా తట్టింది కృతిక. అయినా కృతిక కళ్లలో కన్నీళ్లు వూరుతున్నాయి. తల్లికదా!
అక్కడ జరగవలసిన ప్రాసెస్‌ అంతా జరిగాక…
టీనా చేతికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి కట్టు కట్టారు. మత్తు ఇంజక్షన్‌ ఇవ్వటంతో టీనా మత్తుగా పడుకొంది.
ద్రోణ వర్షిత్‌ వచ్చాడు. అతను రాగానే ఆత్రంగా అతని చేయిపట్టుకొని టీనా దగ్గరకి తీసికెళ్లి చూపించింది శృతిక. అతన్ని వదలకుండా అతని ప్రక్కనే నిలబడింది. ఆమెకు చాలా భయంగా వుంది. ఇప్పుడు తలపెట్టుకోటానికి ఆమెకో భుజం కావాలనిపిస్తోంది.
టీనా నానమ్మ గుండెలు బాదుకుంటూ వచ్చింది. లిఫ్ట్‌ పని చెయ్యకపోవటంతో మెట్లన్నీ ఎక్కి పైకొచ్చినట్లు రొప్పుతోంది. అందరు ఒక్కసారే ఆమెవైపు చూస్తున్నా – ఎవర్నీ పట్టించుకోకుండా మనవరాలి దగ్గరకి వెళ్లి విరిగిన చేతిని చూసి బోరున ఏడ్చింది. వెంటనే శృతికవైపు చూసి…
”నువ్వున్నావని తెలిసి ఇలాంటిదేదో జరుగుతుందని ముందే అనుకున్నాను. చిన్న పిల్లల్ని ఎక్కించుకొని బండి నడిపేతీరు ఇదేనా? ఇంకా చిన్నపిల్లవా నువ్వు?” అంది కృతిక అత్తగారు రామేశ్వరి.
సిగ్గుగా వుంది శృతికకు..
”స్కూటీని స్పీడుగా నడపటం నీకు కొత్తకాదు. నువ్వు చేసే యాక్సిడెంట్లకి భయపడి నువ్వెక్కడ కాళ్లూ, చేతులు విరగ్గొట్టుకుంటావోనని మీ నాన్న పెళ్లి చేసి గాలి పీల్చుకున్నాడు. ఇక్కడ కొచ్చి దీని చెయ్యివిరగొట్టావు. ఏం తల్లీ ఓ చోట తిన్నగా వుండలేవా?” అంది రామేశ్వరి అక్కడెవరైనా వింటారన్న వెరపు లేకుండా..
టీనాకి దెబ్బ తగిలిందన్న బాధ ఒకవైపు, రామేశ్వరి మాటలతో చేస్తున్న అవమానం ఇంకోవైపు శృతికను రాళ్లతో కొట్టినట్లనిపిస్తున్నాయి.
చెల్లెల్ని ఏమీ అనలేకపోయినా, పాపను చూస్తుంటే కృతికకు కూడా బాధగానేవుంది.
ఉదయాన్నే క్షణక్షణం గుర్తొస్తుంటే.. ”ఎప్పుడొస్తున్నావు శృతీ?” అని ద్రోణ వర్షిత్‌ ఫోన్‌ చేశాడు. ఆమెకు వెళ్లాలని వున్నా…’ఆ ఒక్కటి అడక్కు’ అన్నట్లుగా అందీ అందనట్లు మాట్లాడింది.. ‘ఇప్పుడు చూడు ఏమైందో! పెద్దావిడ ఎన్ని మాటలు అంటున్నా నోరెత్తలేని పరిస్థితి తెచ్చుకున్నావ్‌!’ అన్నట్లు శృతికవైపు చూడటం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాడు ద్రోణ.
”ఏదో జరిగిపోయింది. ఎన్ని అన్నా ఏముందిప్పుడు…! చెల్లి మాత్రం చెయ్యాలని చేసిందా! ఇలా జరిగినందుకు దానిక్కూడా బాధగానే వుంది. ఊరుకోండి అత్తయ్యా!” అంది కృతిక చెల్లి ఫీలవ్వటం చూసి…
”నీకేం తెలియదు వూరుకో… అంతా నాదే అనుకుంటావ్‌! పిల్లలున్న వాళ్లకే తెలుస్తాయి ఇలాంటి బాధలు. ఇల్లూ, మొగుడు పట్టనట్లుండే వాళ్లకి ఏం తెలుస్తాయ్‌!” అంది రామేశ్వరి.
ఇలాంటి సందర్భాల్లో అత్తగారి నోటిముందు ఎలాంటి కోడలైనా మౌన మూర్తిలా మారటం అతి సహజం.
…ఇక తట్టుకోలేక భర్త చేతిని గట్టిగా పట్టుకొంది శృతిక.
”నేను మా ఇంటికి వెళ్తున్నా అక్కా!” అంది శృతిక అక్క ఇబ్బందిని గమనించి…
”మమ్మీ! డాడీ వస్తున్నారు. వాళ్లొచ్చాక వెళ్లు శృతీ!” అంది కృతిక.
”ఈవిడ మాటలకన్న వాళ్ల మాటలింకా ఘోరంగా వుంటాయి. నేనేమైనా కావాలని చేశానా? ఎందుకిలా అంటారు? ఒకప్పుడు జరిగిన యాక్సిడెంట్లు నా స్పీడు వల్లనే జరిగాయి. కానీ ఇది నావెనక వస్తున్న స్కూటరతను స్పీడువల్ల జరిగిందంటే అర్థం చేసుకోరేం? ఎప్పుడో ఏదో చేశానని ఇప్పుడు కూడా ఇలా అనటం ఏంటి? నాకు మాత్రం టీనా విషయంలో బాధలేదా? ఆవిడకి ఒక్కదానికే బాధవున్నట్లు మాట్లాడుతుందేం..?” అంది రోషంగా శృతిక.
”పెద్దవాళ్లు అలాగే అంటారు. నువ్వేం పీలవ్వకు..”అంది కృతిక.
”సరే! మేము వెళ్తాం వదినగారు!” అన్నాడు ద్రోణ భార్య మనసు మారకముందే అక్కడనుండి వెళ్లాలని కాదు. ఆ వాతావరణంనుండి భార్యను తప్పించటం కోసం…
‘అలాగే’ అన్నట్లు వాళ్ల వెంట హాస్పిటల్‌ బయటవరకు వచ్చింది కృతిక.
ఆటోలోంచి ఆందోళనగా దిగుతూ కన్పించారు నరేంద్రనాధ్‌, సుభద్ర.
వాళ్లను చూడగానే శృతిక… ”డాడీ వాళ్లొస్తున్నారు. మనం ఆగొద్దు రండి! వెళ్దాం!” అంది తొందరచేస్తూ…
”ఏంటా కంగారు? పలకరించి వెళ్దాం…” అన్నాడు ద్రోణ.
”వాళ్లు నన్ను తిడతారు. నేను వెళ్తాను…” అంది భయపడ్తూ.
”చూసి కూడా మాట్లాడలేదనుకోరా! సరే! నువ్వెళ్లి కార్లో కూర్చో… నేను వాళ్లను కలిసి వస్తాను.” అన్నాడు.
”వద్దు! రండి! వెళ్దాం’!” అంది చెయ్యి పట్టి లాగుతూ.
‘ఈ దిక్కుమాలిన భయం ఇప్పుడంత అవసరమా?’ అన్నట్లు ఆమెవైపు చూస్తే మరింత బాధపడ్తుందని.
శృతికను తీసుకొని నేరుగా కారు దగ్గరకి వెళ్లాడు ద్రోణ.
కార్లో కూర్చుని డోర్‌ వేస్తుంటే
”ద్రోణా!” అంటూ పిలిచాడు నరేంద్రనాధ్‌ అప్పుడే ద్రోణని చూసి..
అప్పటికే కారు కదిలింది.
”హమ్మయ్యా!” అనుకొంది శృతిక.
*****
తల్లి నోటినుండి అప్పుడప్పుడు … ‘జీవితం ఇంతే అనుకుంటే నరకం ఎంతో అనుకుంటే స్వర్గం’ అన్న మాటలు వింటుండేది నిశిత. ఇప్పుడా మాటలు గుర్తు చేసుకుంటూ…
తనకి ఒక కాలు సరిగ్గా పని చెయ్యదన్న విషయాన్ని పూర్తిగా మరచిపోయిన దానిలా అక్క పక్కన తిరుగుతూ, అక్క చెప్పిన పనులు శ్రద్ధగా, చేస్తూ అక్క వంట చేస్తుంటే సింక్‌ దగ్గర ఒక కాలిపై నిలబడి గిన్నెలు కడిగి ఇస్తుంది. కూరలు కట్ చేస్తుంది. వేలు కట్ చేసుకున్నప్పుడు అక్కకు తెలియకుండా బాధను దిగమింగుతుంది…
సంవేదను పిలిచి, పిలిచి విసుగొచ్చింది దేవికారాణికి…
”నిశితా ! ఇలారా! జ్వరమొచ్చినప్పటి నుండి తిరగలేకపోతున్నా… ఆకలిగా వుంది. పాలు ఇవ్వు…” అంది.
నిశిత వెంటనే వంటగదిలోకి వెళ్లి స్టౌ మీద వున్న పాలు గ్లాసులో నింపుకొని హార్లిక్స్‌, చక్కర కలిపి తెచ్చి ఇచ్చింది.
అమృతంలా తాగి, హాయిగా అన్పించటంతో ప్రేమగా నిశిత వైపు చూసింది దేవికారాణి.
”మంచి పాలు కలిపి ఇచ్చావు నిశితా! మీ అక్క పాలల్లో నీళ్లు కలపందే ఇవ్వట్లేదు ఈమధ్యన… అదేమంటే.. మీ అమ్మగారిని మెప్పించటం చాలా కష్టం. చల్లగా ఇస్తే వేడి చెయ్యమంటుంది. వేడిగా ఇస్తే చల్లగా చెయ్యమంటుంది. అసలివ్వకుంటే రంకెలేస్తుంది. ఆవిడ్ని చూస్తుంటే నాకు భయంగా వుంది. అని మీ బావతో చెబుతుంది. మనిషిని మనిషిలా చూడటం మానవ ధర్మం.. అత్తనయినంత మాత్రాన కన్పించని కసితోపాటు అంత నిరసన అవసరమా నిశితా! అయినా మీ అక్కను నేనేం చేశాను?” అంది దేవికారాణి.
నిశిత మాట్లాడలేదు.
దేవికారాణి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలాగే మాట్లాడుతుంది. బాగుంటే మాత్రం సంవేదను బెదిరిస్తుంది. అంతేకాదు తన నోటి ప్రతాపంతో ఏడిపిస్తుంది. ఆ తర్వాత తీపి, తీపి కబుర్లు చెప్పి ‘నేను చాలా మంచిదాన్ని..’ అన్న అభిప్రాయం కల్గిస్తుంది.
సంవేద కూడా ఒక్కోసారి తనేంటో అత్తగారికి కూడా తెలియాలిగా అన్నట్లు ర్యాష్‌గా వుంటుంది. మళ్లీ ఏం జరగనట్లే ‘అత్తయ్యా! అత్తయ్యా!’ అంటూ కమ్మగా పిలుస్తుంది. ఆ పిలుపుకి ఎలాంటి అత్త అయినా పులకించి పోవలసిందే.
అలా పులకించి పోవడమే కాదు… ‘నీ అంత వయసులో నేనూ ఒక ఇంటికి కోడలినే వేదా! అప్పుడు మా అత్త నన్ను పెట్టిన బాధలు ఇప్పుడు నిన్ను పెట్టను” అంటుంది దేవికారాణి.
అత్తగారు అలా అనగానే మురిసిపోతూ.. ”మీ అంత వయసు రాగానే నేనూ ఒక కోడలికి అత్తనవుతాను. అందుకే మిమ్మల్నిప్పుడు బాగా చూసుకుంటాను” అంటుంది సంవేద.
ఆ క్షణంలో.. ఆ ఎమోషన్‌లో అలా మాట్లాడుకున్నా ఆ తర్వాత ఎవరి పాత్రలో వాళ్లు లీనమై అత్తా, కోడళ్ల ఆటని పోటీ పడి ఆడుతుంటారు.
పైకి ఎంతో గుంభనగా కన్పిస్తున్న వాళ్లిద్దరి మధ్యన వుండే రాజకీయాలు ప్రపంచ రాజకీయాలను మించి కన్పిస్తుంటాయి.
అందుకే దేవికారాణి వైపు చూడకుండా నేలవైపు చూస్తోంది నిశిత
”మీ అమ్మా, నాన్నా పోగానే నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని నేనే చెప్పాను… మీ అక్కకి నీమీద ప్రేమ లేదు.” అంది రహస్యం చెబుతున్నట్లు దేవికారాణి.
అది నిజం కాదని తెలుసు నిశితకి. ఆరోజు అక్క తనని ఇక్కడికి తీసుకురావానికి దేవికారాణిని ఫోన్లో ఎంత రిక్వెస్ట్‌ చేసిందో తెలుసు.
”నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నిశితా! మీ అక్క నిన్నెలా చూసినా నీకు నేనున్నాను కదా! ఇంకేం ఆలోచించకు… సరేనా?” అంది చిన్నపిల్ల నోట్లో చాక్లెట్ పెట్టినట్లు.
అక్కకు నా మీద ప్రేమ లేదా? ఆశ్చర్యపోయి నోరు తెరిస్తే పేగులు లెక్కపెడుతుందేమోనన్న భయంతో పెదవి కదపలేదు నిశిత.
”కళ్లు తిరుగుతున్నాయి నిశితా! రెండు రోజులుగా విప్పిన బట్టలు అలాగే వున్నాయి. కాస్త ఉతికిపెడతావా?” అంది దేవికారాణి.
”అలాగే ! ఉతుకుతాను…” అంటూ స్టిక్‌ సాయంతో, ఆ గది వెనకాల బాత్‌రూం పక్కన వున్న టాప్‌ దగ్గరకి వెళ్లి దేవికారాణి బట్టల్ని వాష్‌ చెయ్యాలని కూర్చుంది నిశిత.
టాప్‌ తిప్పగానే నీళ్లు రాలేదు. లేచివెళ్లి మోటర్‌ స్విచ్‌ ఆన్‌ చేసి నీళ్లకోసం ఎదురుచూస్తూ అలాగే ఎండలో కూర్చుంది. ఒకప్పుడు అక్కడో చెట్టు వుండేది. ఆకులు రాలి చెత్తపడుతోందని దేవికారాణి కొట్టించింది. ఇప్పుడక్కడ నీడకరువైంది.
నీరెండలో మెరిసిపోతూ – ఎండతాకిడికి కందిపోతూ నీళ్లకోసం వెయిట్ చేస్తున్న నిశితను చూసి…
”నువ్వెందుకే అక్కడ కూర్చున్నావ్‌? రా లోపలకి…” అంది విషయం తెలియని సంవేద.
…చెబితే కోప్పడుతుందని… ”నువ్వెళ్లు! నేనొస్తాను” అంది నిశిత. ఏదో దాస్తున్నట్లు అన్పించి నిశిత దగ్గరకి వెళ్లింది సంవేద. అక్కడేం జరుగుతుందో అర్థం చేసుకొని వెంటనే వెనక్కి వెళ్లి…
”మీ బట్టల్ని రోజు నేనే కదా వాష్‌ చేసేది. దానికెందుకు చెప్పారాపని? ఇప్పటికే అది అన్ని పనులు చేస్తోంది. ఇలాంటి పనులు కూడా చెప్పాలా?” అంది అత్తగారి ముందునిలబడి.
”ఇలాంటి పనులు అంటే! అవి పనులు కావా? పనుల్లో కూడా తేడాలుంటాయా?” అంది దేవికారాణి.
”అమ్మ ఒక్కపని కూడా దానిచేత చేయించేది కాదు.” అంది సంవేద.
”ఇప్పుడుందా అమ్మ? అయినా పనులు చేసుకుంటే తప్పేంకాదు. చెయ్యకుండా తింటేనే చిన్నతనం… ” అంది కఠినంగా.
”అది అందరిలా వుంటే ఎంతపని చేసినా ఏంకాదు. దానికో కాలు లేదు. ఏదో ఇక్కడ వున్నానన్న భయంతో నేను చెప్పిన పనులన్నీ చేస్తూనే వుంది. మీరు కూడా దానికి పనులు చెప్పాలా? నేను చేస్తాను కదా మీ పనులు…” అంది సంవేద.
”ఆ.. నువ్వు చేస్తావ్‌! ఎంత పిలిచినా తిరిగి చూడవ్‌! పనులేం చేస్తావ్‌! అయినా ఇంత ఖర్మేంటి మాకు..? ఒక పనిమనిషిని పెట్టుకుంటే సరిపోతుంది. మీ చెల్లిని పంపించి వెయ్‌” అంది.
”మా చెల్లిని పంపించి వెయ్యమని ఇంకెప్పుడు అనకండి! దానికి నేను తప్ప ఇంకెవరు లేరు. మీ పనులన్నీ మీ కోడలిగా నేను చేస్తాను. దానికి చెప్పకండి!” అంది కచ్చితంగా.
”నువ్వు చేస్తే నాకు నచ్చటం లేదు. నీకన్నా నీ చెల్లెలే బాగా చేస్తుంది. కాలు లేదనే కాని నీకన్నా అదే అందంగా వుంటుంది.” అంది దేవికారాణి.
అందం గురించి వినాలన్నా, మాట్లాడాలన్నా మనసు చాలా ఆహ్లాదంగా వుండాలి. ఒక్కసారిగా తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని, అత్తగారు ఏ క్షణంలో ఏం మాట్లాడతారో తెలియని స్థితిలో వున్న వాళ్లకు అందం గురించి వినాలంటే ఆసక్తిగా లేదు.
ఆవేశంలో అక్క ఏదైనా అంటే – ఉన్న ఈ ఒక్క ఆధారం పోతుందన్న భయంతో అక్క చేయి పట్టుకొని ”రా ! అక్కా ! వెళ్దాం! ఆమెతో గొడవెందుకు?” అన్నట్లు లాగుతోంది నిశిత.
ఏం మాట్లాడాలో తోచనట్లు నిలబడింది సంవేద.
”అది కుంటిది కాకుండా వుండి వుంటే మా శ్యాంకు దాన్నే చేసుకుని వుండేవాళ్లం. నా కళ్లకి అది అంత అందంగా కన్పిస్తుంది” అంది తృప్తిగా నిశిత వైపు చూస్తూ దేవికారాణి.
”చూడండి! అత్తయ్యా! నామీద ఏదైనా కోపం వుంటే నన్నే డైరెక్ట్‌గా పిలిచి తిట్టండి! నా చెల్లికి కాలులేదని వూరికే గుర్తు చెయ్యకండి! జరిగిందేదో జరిగి పోయింది. ఇప్పుడీ అందాల ప్రసక్తి దేనికి?” అంది కోపాన్ని దిగమింగుతూ సంవేద.
అందాల పోటీలో మార్కులు వేస్తూ మధ్యలో డిస్టర్బ్‌ జరిగినట్లు ఫీలయింది దేవికారాణి.
”గుర్తు చెయ్యానికి అదేమైనా మరచిపోయిన పాఠమా! స్పష్టంగా కళ్లముందు కన్పిస్తుంటే… కుంటిదాన్ని కుంటిదనక మీ వీధిలో ఇంకేమైనా అంటారా? నీ పెళ్లప్పుడు కూడా నీకో కుంటి చెల్లెలు వుందని ముందే చెప్పారు. నేనన్న దానిలో పెద్ద నేరమేం లేదు” అంది.
కొడుకు వస్తున్నట్లు అన్పించి, అక్కడేం జరగనట్లు సైలెంట్ గా అయింది దేవికారాణి. కొడుకు బయట కష్టపడి వస్తాడు కాబట్టి ఇంట్లో ప్రశాంతంగా వుంచాలనుకుంటుందామె.. ఆ ప్రశాంతత రావాలంటే ఏం చేయాలో తెలియదు.
శ్యాంవర్ధన్‌ రాగానే నేరుగా బెడ్‌రూంలోకి వెళ్లాడు. అతని వెంట వెళ్లింది సంవేద.
ఏం జరిగిందన్నట్లు వెంటనే ఆమె ముఖంలోకి చూశాడు.
ఏదో జరిగిందన్న విషయం ఆమె ముఖంలో అతనికి తెలిసిపోతుంది.
సంవేద హైపర్‌ సెన్సిటివ్‌.. ఏం జరిగినా ఎమోషనల్‌ అయిపోతుంది. అప్పుడే ఏడుస్తుంది. అప్పుడే నవ్వుతుంది. ఏదీ ముఖంలో దాచుకోలేదు. అన్ని భావాలు స్పష్టంగా కన్పిస్తాయి.
”ఏంటలా వున్నావ్‌? ఏం జరిగింది?” అన్నాడు ఆమె భుజాలను పట్టుకుని కుదుపుతూ.. ఆమె మౌనంగా వుంది.
”అమ్మ ఏమైనా అందా?” అన్నాడు
”నిశితకి పని చెబుతుంది. రాత్రయ్యేసరికి అది బాగా స్ట్రెయిన్‌ అయి మూలుగుతూ పడుకుంటుంది.” అని అనలేక…
” ఆ… అన్నది నా చెల్లి నాకన్నా అందంగా వుంటుందట. కాలు బాగుంటే మీకు చేసుకునేదట…” అంది తలవంచుకుని, అలా అనే ముందు పరిణామాల గురించి ఆలోచించలేదామె.
”ఓస్‌! ఇంతేనా! ఏదో నేను చేసుకున్నట్లే ఫీలవుతున్నావే!” అంటూ తలమీద ముద్దుగా తట్టాడు.
*****
అప్పటివరకు బొమ్మ గీసి ఆ గదిలోంచి బయటకొచ్చాడు ద్రోణ.
మొబైల్‌ని చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ వచ్చాడు.
అంతవరకు భర్తతో ఏదో చెప్పాలని, ఆ చెప్పేదేదో రొటీన్‌లా వుండకుండా చాలా వెరయిటీగా వుండాలని మ్యాటర్‌ని రెడీ చేసి పెట్టుకున్న శృతిక అతన్నలా చూడగానే కరెంట్ పోయి చీకట్లో కూర్చున్న దానిలా అయింది.
”ఈయన ఇక మారడా? ఇంతేనా?” అనుకొంది.
అతను భోంచేస్తున్నప్పుడు కూడా ఒకటి, రెండు కాల్స్‌ మాట్లాడి పెట్టేశాడు.
”తింటున్నప్పుడు కాల్‌ కట్ చెయ్యొచ్చు కదండీ?” అంది శృతిక.
”అదేమైనా యాడా కట్ చెయ్యాటానికి… ఇంపార్టెంట్ కాల్‌ శృతీ!” అంటూ బెడ్‌రూంలోకి వెళ్లి పడుకున్నాడు.
శృతిక – టీనా చెయ్యి ఎలా వుందో అని టీనాను గుర్తు చేసుకుంటూ పడుకొంది.
కాల్‌ రాగానే లిఫ్ట్‌ చేసి.. ”చెప్పు! ఆముక్తా!” అన్నాడు చాలా క్యాజువల్‌గా … అతని పెదవులు ఆ పేరునలా ఉచ్ఛరిస్తూంటే బిగుసుకుపోయింది శృతిక.
ఆముక్త మాట్లాడుతోంది.
ఆమె ఆ రోజు ఏ సందర్భంలో ఎలా స్పందించిందో, దాన్ని కవిత రూపంలోకి తేవటానికి ఎంత కష్టపడిందో చెబుతూంటే శృతికకు ఇబ్బంది అవుతుందని నెమ్మదిగా డోర్‌ తీసుకొని పైకెళ్లాడు.
వెన్నెల్లో తిరుగుతూ మాట్లాడుతున్నాడు.
వైట్ నైట్ సూట్ లో వున్న అతను అక్కడ తిరుగుతున్న తీరు స్థిరమైన వ్యక్తిత్వాన్ని చాటుతోంది.
అతనలా వెళ్లగానే లేచి అతనివెంటే పైకెళ్లి, దొంగలాగా కొబ్బరాకుల నీడలో నిలబడింది శృతిక.
అతను అటు తిరిగి నిలబడి ఆముక్త చెప్పేది ”ఊ” అంటూ వింటున్నాడు. ఆ నిశబ్దంలో అతని గొంతు మృదుగంభీరంగా విన్పిస్తోంది.
కళాకారులు చాలా విషయాల్లో చిన్నపిల్లల్లా వుంటారు. అమాయకంగా అన్పిస్తారు. ఏ బాధలు లేని వాళ్లలా నవ్వుతారు. మాట్లాడతారు. ఇది ఎదుటివాళ్లకి ఒక్కోసారి ఆశ్చర్యంగా కూడా అన్పిస్తుంది.. వాళ్లలో ఎంత కళ వున్నా, ఎన్నో అద్భుతాలను సృష్టించగలిగే శక్తి వున్నా కొన్ని సందర్భాల్లో ఇంత నిగర్వులుగా వుంటారా అని…
…తినటం, పడుకోవటం లాంటి రొటీన్ షెడ్యూల్‌ని పక్కనపెడితే – మిగతా టైమంతా ఏదో ఒక ఐటమ్‌ని మనసులోకి తెచ్చుకొని, స్టాండ్‌ బోర్డుకి అమర్చిన కాగితంపై ఆలవోకగా కుంచెను కదుపుతూనే వుంటాడు. తన మనసు దాహాన్ని తీర్చుకోవటం కోసం ఆర్ట్‌లో మరింత మునిగి మునకలేస్తూ వుంటాడు.
తనకి మంచి పేరు తెచ్చిన పెయింటింగ్స్ ని అప్పుడప్పుడు చూసుకుంటూ.. ఎంతో ఇష్టంగా కష్టపడి మరింత కృషిచేసి ఒక స్థానాన్ని సంపాయించుకోవాలనుకుంటాడు. అభిమానుల ఫోన్‌ కాల్స్‌ కూడా ఒక్కోసారి అతనికి గొప్ప రిలీఫ్‌ని, ఇన్సిపిరేషన్‌ని ఇస్తుంటాయి. అందుకే ఎంత బిజీగా వున్న తనలోని ఆర్ట్‌కి జీవం పోసే తోటి కళాకారుల, కళాభిమానుల ఫోన్‌కాల్స్‌ని మాత్రం మిస్‌ కాడు.
అదీకాక.. ఆర్ట్‌కి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలన్నా, సాధన లోపం లేకుండా సాగిపోవాలన్నా – ఎంతో వ్యయ ప్రయాసలకి ఓర్చి దూరప్రాంతాలకి వెళ్లకుండానే ఈ ఫోన్‌కాల్స్‌ సహకరిస్తుంటాయి ద్రోణకి.

ఇంకా వుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *