March 29, 2024

గ్రహణం వదిలింది

రచన: గిరిజ కలవల

సాయంత్రం ఐదు కావస్తోంది. రాధ ఆఫీసు పని ముగించి టేబుల్ సర్దేసింది.
“ఏంటో.. మేడమ్ గారు అప్పుడే బయలుదేరిపోతున్నట్లున్నారే.. ఏమన్నా విశేషమా ఈ రోజు..” వెనక నుండి సూపరిడెంట్ భూషణం వ్యంగ్యంగా అన్నాడు.
“అవును.. సార్… రేపు మా అమ్మాయి పుట్టినరోజు.. డ్రస్ కొనుక్కుని వెళ్ళాలి. పెండింగ్ వర్క్ అంతా అయిపోయింది. అందుకనే వెడుతున్నాను.”అంది రాధ.
“డిసైడైపోయారుగా.. అలాగే కానీండి. . పుట్టినరోజు.. పార్టీ లు అంటారేమో.. ఈ వంకతో రేపు సెలవంటారేమో కుదరదు.. ముందే చెపుతున్నా..”అన్నాడు.
“సెలవు అవసరం లేదు నాకు. వెడుతున్నా”అని బయలుదేరిన రాధకి తెలుసు వాడి చూపులు వెనక గుచ్చుకుంటున్నాయని. కంపరంతో కొంగు నిండుగా కప్పుకుని ఆఫీసు నుంచి బయటపడింది.
బజార్లో పాపకి డ్రస్ తీసుకున్నాక. స్వీట్స్ కూడా పాక్ చేయించింది రాధ. అత్తగారికి కూడా వెంకటగిరిచీర తీసుకుంది. మామగారికి తీసుకోవడం ఇష్టం లేదు కానీ ఆయన అనే వంకర మాటలు భరించలేక ఓ పంచె, లాల్చీ కూడా తీసుకుంది. కవర్లు అన్నీ పట్టుకుని బస్ కోసం వెయిట్ చేసే ఓపిక లేక ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరింది.
అలసటగా వెనక్కి ఆనుకుని కళ్లు మూసుకున్న రాధ.. కి సూర్య గుర్తు వచ్చాడు. వెంటనే కళ్ళు నీటి చెలమలయ్యాయి.”సూర్యా.. రేపు పాప పుట్టినరోజు.. గుర్తుందా నీకు.. ఆరోజు హాస్పిటల్ లో ఎంత హడావుడి చేసావు… శుక్రవారం లక్ష్మీదేవి పుట్టింది నా ఇంట అంటూ స్టాఫ్ మొత్తానికి స్వీట్స్ పంచావు. తెగ మురిసిపోయావు. పాపని నేలమీద నడవనీయను.. అరచేతులపై పెంచుతాను.. పెద్ద చదువులు చదివిస్తాను.. అందాల రాజకుమారుని తెచ్చి అంగరంగ వైభవంగా పెళ్ళి చేస్తాను… అని ఎన్నెన్నో అన్నావే… ఎక్కడకి వెళ్లి పోయావు… నన్ను.. పాపని వదలి తిరిగి రాలేని లోకాలకెందుకు వెళ్ళావు.. నేనూ నీతో వద్దామంటే.. ఈ బంధాన్ని అడ్డు వేసావు..”మూగగా రోదిస్తోంది రాధ.
“అమ్మా.. ఈ వీధేగా మీరు చెప్పింది”అన్న ఆటోడ్రైవర్ మాటకి ఉలిక్కిపడి చెంపలు తుడుచుకుని”ఆ కుడిప్రక్క పచ్చగేటు ముందు ఆపు”అంది రాధ.
గేటు తీసుకుని ఇంట్లోకి వెడుతున్న రాధని బయటే కూర్చుని సిగరెట్ కాలుస్తున్న మామగారు రాజారావు పైనుంచి కింద దాకా ఓ చూపు చూసాడు. ఆ చూపులో రకరకాల అర్థాలు. తలదించుకుని రాధ లోపలికి వెళ్లి పోయింది.
మంచినీళ్ళతో ఎదురొచ్చిన అత్తగారు సుమతితో..”పాప విసిగించిందా.. అత్తయ్యా… బజారుకి వెళ్లి ఇవన్నీ కొనేసరికి ఆలస్యం అయింది.”అని తెచ్చిన కవర్లు అందించి సంజాయిషీ ఇచ్చుకుంది రాధ.
“ఏం లేదమ్మా.. ఆడుకుంటోంది… పేచీ లేకుండా అన్నం తినేసింది. పాపకి కొత్త బట్టలు తెచ్చావు చాలు… మాకెందుకమ్మా ఇప్పుడు.. అయినా బయటకి వెళ్ళేదానివి నీకుండాలి మంచి బట్టలు..”అన్న సుమతి మాటలకి చిరునవ్వే సమాధానమిచ్చి వంటింటిలోకి వెళ్లింది రాధ.
కాఫీ కలిపి కప్పులో పోసుకుని తన రూమ్ లోకి వచ్చి కూర్చున్న రాధకి కిటికీలోనుండి అస్తమిస్తున్న సూర్యుడు కనిపించేసరికి… తన జీవితంలో నుండి అస్తమించిన తన సూర్యని తలుచుకుంది. గతమంతా కళ్ళముందు మెదలసాగింది.
చిన్నపుడే తల్లి తండ్రులని కోల్పోయి మేనమామ పంచన పెరిగింది తను. అత్త రాజ్యం సూటిపోటి మాటలతో.. ఆవిడకి ఎదురు చెప్పలేని మామయ్య ఆనందరావు ఆదరణలో డిగ్రీ వరకు చదువుకోగలిగింది. మామయ్య స్నేహితుడొకరు తెచ్చిన సంబంధం. సూర్య గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ గా చేస్తున్నాడు.. తల్లితండ్రి తనతోనే వుంటారు.. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. పిల్లాడి ఉద్యోగం ఒకటే కుటుంబానికి ఆధారం. ఇంతకుమించిన సంబంధం చూడడం తన వల్ల కాదని ఆనందరావు అనుకుని.. ఓ మంచి ముహూర్తంలో.. తనకి సూర్యకి పెళ్ళి చేసాడు. అప్పగింతల సమయంలో అత్త రాజ్యం సూర్య తల్లి సుమతితో చెప్పేసింది … ఇకపై రాధ బాధ్యత పూర్తిగా మీదే.. ఇన్నాళ్ళ పెంచడమే మాకు గొప్ప.. ఇకపై పండగలూ… పబ్బాలూ… పురుళ్ళూ అంటూ మా కొంపకి రావొద్దు.. అని నిర్మొహమాటంగా .
దానికి సహృదయురాలైన సుమతి కూడా ఏమనుకోలేదు… ఫర్వాలేదు.. మాకు కూతురైనా.. కోడలైనా.. రాధే…. ఇక నుండి రాధ బాధ్యత మాదే.. అని హామీ ఇచ్చింది. పోగొట్టుకున్న తల్లిని సుమతిలో చూసుకుని పొంగిపోయింది తను. కానీ.. మామగారు రాజారావు మాత్రం ఎప్పుడూ మాట్లాడలేదు కానీ తనతో.. ఆయన చూపులూ, ఆయన తరహా ఎందుకో నచ్చలేదు తనకి.
ఇక సూర్య… తన జీవితంలో ఎదురుచూడని అదృష్టం సూర్య రూపంలో వచ్చిందని మురిసిపోయింది. తననెంతో ఆరాధనగా.. ఆప్యాయంగా చూసుకునేవాడు. తనకు చేతనైనంత దానిలోనే అన్నీ అమర్చి పెట్టేవాడు. సూర్య ప్రేమలోనూ.. అత్తగారు సుమతి అభిమానంతోనూ కాలం వేగంగా సాగిపోతోందన్న సంగతే పట్టించుకోలేదు తను.
అప్పుడప్పుడు అత్తగారు చాలా బాధ పడుతూ ఉదాసీనంగా వుండడం.. తరచు కంటనీరు పెట్టుకోవడం గమనించేది తను. కారణం ఆవిడా చెప్పేది కాదు.. తానూ అడిగే సాహసం చేయలేదు. ఒకసారి సూర్య దగ్గరే “మీ అమ్మగారు ఎందుకో కలత పడుతున్నారు.. ఏంటో కనుక్కోరాదా”అని అంటే దానికి సమాధానంగా సూర్య”అమ్మ బాధ ఎవరూ తీర్చలేనిది. చిన్నతనం నుండీ చూస్తున్నాను. నాన్న అలవాట్లు.. ఆయన ప్రవర్తించే తీరు అమ్మనెపుడూ బాధిస్తూనే వుంటుంది. అమ్మ సగటు ఆడదానికి ప్రతిరూపం. భర్తని ఎదిరించి మనలేని మనస్తత్వం. చాలాసార్లు చెప్పాను.. అమ్మా.. ఈ ఇంటి నుంచి.. నాన్న నుంచి దూరంగా వెళ్లి పోదామని.. ఒప్పుకోలేదు. ఆ ఆలోచనే తప్పంది.. భర్తను వీడిన భార్యకి అన్నీ అవమానాలే బయట.. దాని బదులు ఈ నాలుగు గోడల మధ్య అవమానాలే నయం.. అంటూ.. తనలో తనే కుమిలిపోతోంది తప్ప ఎవరికీ చెప్పుకోదు… నువ్వే అమ్మని అనునయించాలి..”అని చెప్పాడు.
ఎలా ఓదార్చాలో తెలీక మౌనంగానే వుండిపోయేది తను. ఈ క్రమంలో తాను నెల తప్పడం.. అత్తగారికి.. సూర్యకి పండగే ఆ వార్త. తనని నేల మీద కాలు పెట్టనీకుండా చూసుకునేవారు ఇద్దరూ. మామగారిలో ఈ వార్త ఎటువంటి భావమూ తెలియపరచలేదు. నెలలు నిండి తాను పండంటి ఆడపిల్లని ప్రసవించడం.. ఉన్నంతలోనే నామకరణం జరిపించి అందరినీ పిలిచి భోజనాలు పెట్టడం చేసాడు సూర్య. పాప ముచ్చట్లతో కాలం సాగుతూంటే.. ఆ దేవుడికి కన్ను కుట్టింది కాబోలు… ఆఫీసు నుండి ఇంటికి వస్తుండగా సూర్యని లారీ ప్రమాదంలో తన వద్దకు తీసుకెళ్లి పోయాడు. లోకం చీకటైపోయింది తనకి. కొండంత కొడుకు పోయినా దుఃఖం దిగమింగుకుని అత్తగారు తన కోసం.. పాప కోసం.. అండగా నిలబడ్డారు. డిగ్రీ చదివిన తనకి సూర్య ఆఫీసులో ఉద్యోగం రావడం జరిగింది. ఈ పనుల మీద మామగారు తనని తీసుకువెళ్ళడం.. ఆ వంకతో.. ఈ వంకతో.. మీద చేతులు అనుకోకుండా వేసినట్టు వేయడం.. తనకి కంపరంగా అనిపించేది. అత్తగారికి చెప్పుకోలేని పరిస్థితి. ఎలాగో ఈ పరిస్థితి నుండి బయటపడడం అనిపించేది. భర్త తోడు లేని ఆడది అంటే ఇంటా బయటా తక్కువ భావమే.. అడుగడుగునా ముళ్ళకంచెలే.. చూసి చూసి అడుగులేసి పాప కోసం భారంగా జీవితాన్ని గడుపుతోంది తను. కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలి అనుకుంది.
ఇంతలో”ఏంటమ్మా.. లైట్ కూడా వేసుకోకుండా కూర్చున్నావు.”అంటూ స్విచ్ వేసింది అత్తగారు సుమతి.
“సరే! కానీ.. రేపు సెలవు పెట్టు.. పాప పుట్టినరోజు కదా.. మీ మామయ్యగారు బయటకి వెడదాం అన్నారు.. హోటల్ లో భోంచేద్దామన్నారు.”అని అన్న సుమతికి”అయ్యో.. అత్తయ్యా.. రేపు సెలవు కుదరదు. ఇంకోసారి వెడదామని చెప్పండి మామయ్యగారికి.”అని జవాబిచ్చింది.
“అదేం కుదరదు.. రేపు సెలవు పెట్టాల్సిందే… బయట భోజనంలో పాప సరిగ్గా తింటుందో లేదో.. ఇప్పుడే పాయసం చేస్తున్నా.. మళ్లీ రేపు రాత్రికి గ్రహణం కూడాను.. వచ్చి స్నానాలు చేసి వండుకోవాలి. సెలవు సంగతి ఆఫీసులో వాళ్ళకి ఇప్పుడే చెప్పెయ్యి”. అని ఖచ్చితంగా అనేసి జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్లి పోయింది సుమతి.
ఆఫీసులో సెలవు ఇవ్వనని ముందే చెప్పాడు భూషణం.. ఇప్పుడెలాగా.. అని ఆలోచించి.. ఏదో ఒకటి అందరిముందు కామెంట్ చేస్తాడు అంతేగా.. అని తన కొలీగ్ కి రేపు రావడం కుదరదని చెప్పేసింది.
వంటింటిలో సుమతి మనవరాలికి ఇష్టమైన సేమియా పాయసం చేద్దామనే ప్రయత్నంలో వుంది. చేతులు పని చేస్తోన్నా.. ఆవిడ ఆలోచనలు మాత్రం ఎక్కడో వున్నాయి. తన భర్త ఎంతటి నికృష్టుడో తెలుసు… ఇంట్లో నిక్షేపంలాంటి తనని పెట్టుకుని బయట వెధవ తిరుగుళ్లు. వయసు పెరిగినా బుధ్ధి మాత్రం రాలేదు. ఇదివరలో ఇంటికే ఎవరెవరినో తెచ్చేవాడు. ఎదురు మాట్లాడితే చెయ్యి చేసుకోవడమే. దమ్మిడీ సంపాదన లేకపోయినా మగాడిననే పొగరు. ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో నోరు మూసుకుని వుండిపోయేది. తండ్రి అలవాట్లు కొడుక్కు రాకుండా .. ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేసింది. రత్నంలాంటి కోడలు.. మాణిక్యంలాంటి మనవరాలు ఇంటికి వచ్చినా ఈ మనిషిలో రవ్వంతైనా మార్పు లేదు. ఇప్పుడు భర్తని కోల్పోయి.. తమ కోసం ఉద్యోగం చేసి కొడుకులా చూసుకుంటున్న కోడలిపై కన్నేసాడు. అది కనిపెట్టిన తాను. రాధ మన కూతురితో సమానం.. చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు.. ఇన్నాళ్ళూ మీరేం చేసినా నేను మాట్లాడలేదు.. కానీ ఇప్పుడు ఊరుకోను.. గోలగోల చేస్తాను. కోడలినీ.. మనవరాలినీ తీసుకుని వేరే వెళ్లి పోతాను.. రాధ జోలికి రాకండి.. అని కాళ్ళావేళ్ళా పడింది.. అరిచింది.. ఏడిచింది.. కానీ ఆ ధూర్తుడు మాత్రం కరగలేదు. పైగా.. నిన్న.. పసిది.. మనవరాలిని ఎత్తుకుని..”ఏం చేస్తావో.. నాకు తెలీదు… ఎల్లుండి దీని పుట్టినరోజు వంకతో మిమ్మల్ని బయటకి తీసుకువెడుతున్నా.. రాధని ఒప్పించు.. అక్కడ నువ్వు పాపని తీసుకుని ఏదో వంకతో బయటకి వెళ్ళాలి.. నా కోరిక తీరాలి. లేదంటే.. నీ మనవరాలి గొంతు పిసికి చంపేస్తాను. నా సంగతి తెలుసుగా.. అనుకున్నది సాధించడానికి ఏదైనా చేస్తాను”అని బెదిరించేసరికి తాను హడలిపోయి నోట మాట రాలేదు. ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు తనకి. ఇప్పుడు కూడా రాధ ఆఫీసు నుంచి రాగానే”చెప్పావా.. లేదా”అన్నాడు. ఒప్పుకోకపోతే అన్నంత పనీ చేసి పసిదాని ప్రాణం తీసినా తీస్తాడు. ఒప్పుకుంటే రాధ బతుకు అన్యాయమైపోతుంది. ఎలా.. ఎలా…అని ఆలోచిస్తూ.. పాయసంలో పంచదార కలపసాగింది. దేముడి మీదే భారం వేసి.. ఓసారి ఆ పాయసం దేముడి ముందు పెట్టి నైవేద్యం పెట్టి… కాపాడు తండ్రీ… తప్పే చేస్తున్నానో… ఒప్పే చేస్తున్నానో.. నీదే భారం.. అంటూ కన్నీరు కారిపోతూండగా వేడుకుంది.
భర్త రాజారావుని భోజనానికి పిలిచింది.అన్నీ వడ్డించాక పక్కన కప్పు నిండుగా పాయసం పెట్టింది సుమతి.”రేపు కదా.. పాప పుట్టినరోజు.. ఈ రోజు స్వీట్ చేసావేమిటి”అన్న అతనికి జవాబుగా”రేపు బయట భోంచేద్దామన్నారు కదా… ఈ రోజే పాయసం చేసేసా..”అంది సుమతి.”ఓ. సరే .. సరే..”అంటూ తనకిష్టమైన పాయసం కప్పు తీసుకుని తిన్నాడు. భోజనం ముగించి తన గదిలోకి వెళ్లిపోయాడు రాజారావు.
అక్కడంతా శుభ్రం చేసేసి కోడలిని భోజనానికి పిలిచింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు. మథ్యలో”అత్తయ్యా… పాయసం చేసానన్నారు.. ఏదీ..”అంది రాధ.” ఇందాక మీ మామయ్య గారికి ఇక్కడ వడ్డిస్తున్నపుడు కంగారులో పాయసం గిన్నె మీద మూత పెట్టడం మర్చిపోయానమ్మా… బల్లి పడింది.. పారబోసేసా…. రేపు మళ్లీ చేసుకుందాం”అంది సుమతి.
“ఔనా… నయమే. చూసారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రమాదమే..”అన్న రాథకి “ప్రమాదం జరగకూడదనేమ్మా నా తపన”అంది సుమతి.
ఆవిడ మాటలు అర్థంకాక మౌనంగా భోంచేసి.. అన్నీ సర్దేసి.. పాపని తీసుకుని గదిలోకి వెళ్ళింది రాధ.
సుమతి కూడా”రాధా.. నేను కూడా నీ గదిలోనే పడుకుంటానీవేళ..”అంటూ రాధ గదిలోకి వచ్చింది.
ఈ రోజు అత్తగారి మాటతీరు ఎందుకో వింతగా తోస్తోంది రాధకి.
“అలాగే అత్తయ్యా.. రండి.”అంది.
“రేపు సెలవు కావాలని ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పాను అత్తయ్యా”అంది రాధ.
“రేపటి సంగతి రేపు చూద్దాం.. పడుకో..”అన్న అత్తగారిని విచిత్రంగా చూసి పాపని జోకొడుతూ నిద్ర లోకి జారుకుంది రాధ.
సుమతి కళ్ళు మూసుకుందే కానీ.. రేపు జరగబోయే సంఘటనలే కళ్ళ ముందు మెదిలి భయపెట్టసాగాయి.
తెల్లారింది.. రాధ లేచేసరికి పక్కన సుమతి లేదు. వంటింట్లో చప్పుళ్ళు వినపడేసరికి.. అత్తగారు అప్పుడే కాఫీల పనిలో మునిగిపోయారనుకుని… తాను స్నానాలు కానిచ్చుకుని వంటింటిలోకి వెళ్ళింది. ఆవిడ పూజ అయిపోయి టిఫిన్ ల ఏర్పాటులో వుంది. తనని చూసి..”రా.. రా.. లేచావా.. కాఫీ తాగి పాపని లేపు.. నెత్తిన నూనెపెట్టి.. హారతిచ్చి.. తలంటు పోద్దాం.”అంది. సరే అని చెప్పి…”ఔనూ.. ఈ రోజు గ్రహణం అన్నారు… ఎన్ని గంటలకి పడుతుందీ.. ఎప్పుడు విడుస్తుందీ.. మళ్లీ స్నానాలు చెయ్యడం వుంటుందేమో కదా..”అన్న రాధకి.. జవాబుగా ఆవిడ మనసులోనే”మనకి పట్టిన గ్రహణం ఎప్పుడో వదిలిపోయింది తల్లీ… ఇక మనకేం అపాయముండదు”అనుకుంది.
నిన్న రాత్రి బల్లి పడిందని అబధ్ధం చెప్పి…. పాయసంలో నిన్న మథ్యాహ్నం తెచ్చిన పాయిజన్ కలిపి ముందు రాజారావుకే తినిపించి.. మిగిలిన పాయసం అంతా సింకులో పారబోసిన విషయం తనకొక్కదానికే తెలుసు. కోడి తన రెక్కల మాటున పిల్లలని దాచుకున్నట్లు.. కోడలికని.. మనవరాలిని తాను దాచుకోగలిగింది. తాను తీసుకున్న నిర్ణయంతో. ఎన్నాళ్ళ నుండో బరువెక్కిన తన గుండె బరువు ఒక్కసారిగా దిగిపోయినట్లనిపించింది. ఇది తప్పు నిర్ణయం కాదు.. ఆ పాయసం దేముడి ముందు పెట్టినపుడు ఆ భగవంతుడే తనకీ దారి చూపించాడు. తమకి పట్టిన గ్రహణం వదిలించాడు. తాను బతికి వుండగా తన కోడలికి ఎలాంటి గ్రహణం పట్టకుండా కాపాడుకుంటాను అనుకుంది సుమతి.

3 thoughts on “గ్రహణం వదిలింది

  1. కధ చాలా బాగుంది. చాలా మంచి ముగింపునిచ్చేరు.

  2. అమ్మ లాంటి అత్తయ్య చేసిన ఈ దుష్ట శిక్షణ చాలా సరి అయిన నిర్ణయం.అలాంటి వాళ్ళకి జీవించే హక్కు లేదు.
    కథ బాగుంది గిరిజా.
    వసంత లక్ష్మి.

  3. గిరిజగారూ! కధ చాలా బాగుంది. ఒక్కోసారి దుష్టశిక్షణ ఈ మోతాదులో ఉంటేనే మిగిలినవాళ్ల జీవితాలు బాగుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *