పట కుటీర న్యాయం

రచన: కాంత గుమ్ములూరి

ఎక్కడ దొరికిన అక్కడే నా గృహం
పట కుటీర న్యాయం
ఆక్రమించిన స్థలం
నా నివాసం
అనుభవించిన దినం
నా అదృష్టం
చెట్టు కిందా , గుట్ట పక్కా,
ప్రహరీ గోడ వెనకాలా
మంచు మబ్బుల
నీలాకాశం నా దుప్పటీ
పచ్చ గడ్డి, మన్ను దిబ్బా
పవళించే తల్పం
వెచ్చనైన రాళ్ళ మట్టి
నా ఆసనం
వర్షం, గాలీ, ఎండా, నీడా
అందరూ నా సహచరులు.

నీ కడుపు నింపుతా ననే
అమ్మ లేదు
నా వంశోద్ధారకుడివి నువ్వే
అన్న నాన్న లేడు
అదుపులో పెట్టే అక్క లేదు
ఆరడి చేసే అన్న లేడు
తోకలా వెంబడించే
తమ్ముడు లేడు
మళ్ళీ మళ్ళీ మారాం చేసే
చెల్లి లేదు
నువ్వెవరని అడిగే
నాధుడు లేడు
నా దక్షత వహించే
ఉద్ధారకుడు లేడు
నేటికోసం చింత లేదు
రేపటి కోసం ఆత్రం లేదు.

ఒంటరి జీవిని
జగమంతా నా విహార భూమి
నా ఇహ పరాల్ని
నువ్వు శాసించ లేవు
నా ఈ క్షణికానందం , స్వతంత్రం
నువ్వు సంగ్రహించలేవు
నా ఈ చీకూ చింతా లేని విచ్చలవిడి జీవితాన్ని
నువ్వు దోచుకోలేవు!

కావాలంటే నా రాజ్యాన్ని
రేపు నువ్వు ఆనందంగా తీసుకో
నీ ప్రదేశాన్ని మరునాడు మరొకరి కోసం
మనసారా వదులుకో
భవ బంధాలను
సునాయాసంగా తెంచుకో…

అదే పట కుటీర న్యాయానికి న్యాయం!!

********************

Leave a Comment