April 20, 2024

రెండో జీవితం .. 5

రచన: అంగులూరి అంజనీదేవి

ఆకులు కదిలినట్లనిపించి ఇటు తిరిగాడు ద్రోణ.
వెన్నెల నీడ కొబ్బరాకుల సందుల్లోంచి శృతిక మీదపడి కదులుతుంటే ఆమె వేసుకున్న లైట్ బ్లూ కలర్‌ నైటీ మీద నల్లపూసల దండ మెరుస్తోంది. ఒక్కక్షణం అతని కళ్లు అలాగే నిలిచిపోయాయి.
”ఒక్క నిముషం శృతీ! వస్తున్నా”… అంటూ కాల్‌ కట్ చేసి భార్య వైపు రెండడుగులు వేశాడు.
”వస్తారులెండి! ఏదో ఒక టైంకు… ఇక్కడేం జరుగుతుందో చూద్దామని వచ్చాను” అంది శృతిక.
ఏం జరుగుతోందని చుట్టూ చూసి, ‘ఏం లేదిక్కడ’ అన్నట్లు భుజాలు ఎగరేశాడు.
అతని భుజాల కదలిక చూడానికి గమ్మత్తుగా అన్పించినా, మనసు మండుతోంది శృతికకు…
”ఇది తట్టుకోలేకనే మా అక్కయ్య వాళ్ల ఇంటికెళ్లి ఖర్మకాలి పాప చెయ్యి విరగ్గొట్టి వచ్చాను. మా నాన్న నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. ఇంకెప్పుడూ అక్క దగ్గరకి వెళ్లొద్దన్నాడు. మొన్న వాళ్లత్తగారు నోటి కొచ్చినట్లు మాట్లాడారట. ఇప్పుడు నేనెక్కడికి వెళ్లాలి. ఇక్కడ వుండలేకపోతున్నా..” అంటూ తల పట్టుకొని ఒక్క వుదుటన కింద కూర్చుంది. మనసంతా వికలమైన దానిలా కుంగిపోతోంది.
”నువ్వు డిస్టర్బ్‌ అవుతావనే పైకొచ్చాను. ఇప్పుడు నీకేంటి ఇబ్బంది?” అన్నాడు. అంతకన్నా ఇంకేం మాట్లాడాలో అతనికి తోచడంలేదు.
”నేను డిస్టర్బ్‌ అవుతానని కాదు. మీ ఇద్దరి మాటలకి ప్రైవసీ కోసం పై కొచ్చారు. నేనేం చిన్నపిల్లను కాను. నాకిలాంటివి బాగా తెలుసు. నేను హాస్టల్లో వుండి చదువుతున్నప్పుడు కొందరమ్మాయిలు మీలాగే ఎప్పుడు చూసినా మొబైల్‌లో మాట్లాడుతుండే వాళ్లు..” అంది పిచ్చిదానిలా అరుస్తూ.
ద్రోణ బిత్తరపోతూ…” ఎవరితో…?” అన్నాడు.
”వాళ్ల లవర్స్‌తో… వాళ్లకో టైమంటూ వుండేది కాదు. పక్కవాళ్లకి డిస్ట్రబెన్స్‌ అనేది లేదు. ఇదిగో ఇలాగే మీలాగే వాళ్లుకూడా నావల్లకాదు ఇలాగైతే…’ అంది ఆవేశంతో రొప్పుతూ లేచి నిలబడి.
…అతను సూటిగా ఆమెనే చూస్తూ… ”ఆముక్త నా లవర్‌ కాదు. రైటర్‌. మాకొచ్చే డౌట్స్ ను క్లియర్‌ చేసుకుంటున్నాం… అంతే ఇంకేం లేదు” అన్నాడు చాలా నిజాయితీగా.
”నాకు నా హాస్టల్‌ ఎక్స్‌పీరియన్స్‌ లేకుండా వుంటే నేను కూడా అలాగే అనుకునేదాన్ని… ఇప్పుడలా అనుకోను. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తిని మనసులో వుంచుకున్నప్పుడు ఇంకో వ్యక్తితో మనసు పంచుకోలేరు. మీరలా కాదు. మీ బొమ్మల్ని మెచ్చుకున్న ప్రతి ఒక్క స్త్రీకి మీ మనసుని, మాటల్ని పంచేస్తారు.” అంది చాలా స్థిరంగా..
అసహనంగా చూశాడు. ఆమెనెలా నమ్మించాలో అర్థంకాక..
”ఆముక్త నాకన్నా వయసులో పెద్దది. ఇంకెప్పుడూ మా ఇద్దర్ని ఆ దృష్టితో చూడకు…” అన్నాడు.
”సీత కూడా రాముడికన్నా వయసులో పెద్దదట… మన క్రికెట్ ప్లేయర్‌ సచిన్‌ భార్యకూడా అతనికన్నా పెద్దదేనట. ఇలాంటి కబుర్లు నాతో చెప్పకండి! నాకు ప్రపంచం బాగా తెలుసు” అంది.
”అవున్లే! హాస్టల్లో వుండి చూశావుగా…” అన్నాడు వ్యంగ్యంగా.
…అతని వ్యంగ్యాన్ని గమనించకుండా ”ఈసారి ఆముక్త వచ్చి మీ గదిలో కూర్చుందనుకోండి! అప్పుడు చెబుతా!” అంది బెదిరిస్తూ…
”ఏం చెబుతావ్‌?” అన్నాడు.
”వ్యాక్యుమ్‌ క్లీనర్‌తో కొడతా!” అంది.
”కొడతావా? కొత్తగా వేసిన నా బొమ్మని చూడ్డానికి రేపే వస్తానంది.” అన్నాడు లోలోన కంగారుపడ్తూ… ఆ బొమ్మని మంచి కాన్సెప్ట్‌తో, గ్రేస్‌తో వేశానని దాన్ని ముందుగా ఆముక్త చూసి కాంప్లిమెంట్ ఇవ్వాలని అతను ఆశిస్తున్నాడు.
”రానీ! చెబుతా!” అంది ఊగిపోతూ.
ఆ మాటతో ఒక్కక్షణం ఆలోచించాడు.
అతనలా ఆలోచిస్తుంటే…
”జోకనుకుంటున్నారేమో! మొన్న తన చీరమీద కావాలనే కాఫీ పోశాను. మీరు పొరపాటున పడ్డాయనుకుంటున్నారు. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటంలేదు” అంది
…లోలోన ఆశ్చర్యపోతూ మెల్లగా ఆమెను దగ్గరకు తీసుకొన్నాడు. మాటలతో ఆమెలోని ఫైర్‌ను తగ్గించాడు.
”ఓ.కె. శృతీ! నీకు నచ్చని పని నేనేం చెయ్యను” అన్నాడు.
”మరి ఫోన్‌ కాల్స్‌?”
”కట్ చేస్తా…!”
హాయిగా నవ్వింది శృతిక. ఆ నవ్వులోని జీవానికి వెన్నెల కూడా వెనుకంజవేసింది.
”మరి ఇంటి కొచ్చిన వాళ్ల మీద కాఫీ పొయ్యటం, వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో కొట్టటం లాంటివి చెయ్యకూడదు.” అన్నాడు.
”అలాగే ! చెయ్యను”. అంది
”మాట ఇవ్వు…” అంటూ చేయి చాపాడు
చేతిలో చెయ్యివేసి మాట ఇచ్చింది
”రేపు ఆముక్త వస్తుంది. నువ్వు మాట నిలుపుకోవాలి” అన్నాడు
”ఆ… ” అంటూ కళ్లూ, నోరు ఒక్కసారే తెరిచింది. వెంటనే అతను ఆమె కనురెప్పలపై తన పెదవులతో చేసిన మౌన మృదంగానికి ఆమె పెదవులు నెమ్మదిగా మూసుకున్నాయి.
*****
ఆముక్త ఫోన్‌ చెయ్యగానే లిఫ్ట్‌ చేసి, ఆమె చెప్పిన మాటలు విని స్టాచ్యూలా నిలబడింది సంవేద.
ఒక్క క్షణం మాటలు రాలేదు ఆమెకు.
వెంటనే అత్తగారి దగ్గరకి వెళ్లి.. ”మీరు నిశితను బయటకు పంపారా అత్తయ్యా?” అంది
దేవికారాణి నిర్లక్ష్యంగా తలతిప్పి మాట్లాడలేదు. సంవేద ‘ఉఫ్‌’ అంటూ సహనాన్ని కూడదీసుకుని… ”మీకేదైనా అవసరమైతే నాకు చెప్పండి! నేను వెళ్లి తెస్తానని చాలాసార్లు చెప్పాను. మీరెందుకిలా దాన్ని బయటకి పంపుతున్నారు?” అంది.
”హు… నువ్వా!! నువ్వు ఈ రోజు తెమ్మంటే రేపు తెస్తావు. ఇప్పుడు పిలిస్తే ఇంకోగంటకి పలుకుతావు. నీ సంగతి నాకు తెలియదా?” అంది
”ఇదో నెపం నానెత్తిన పెట్టి దాన్ని పంపుతారా? దానికేమైనా జరిగితే?” అంది. సంవేద కళ్లలో నీళ్లు కదులుతున్నాయి.
”ఏం జరుగుతుంది? మరీ ఆకాశం నుంచి వూడిపడలేదు నీ చెల్లెలు… ఆ కుంటిదాని జోలికి ఎవరూ పోర్లే అయినా నువ్వు చెయ్యక, అది చెయ్యక ఎవరు చేస్తారు నా పనులు?”
”పనులు ! పనులు ! ఇది తప్ప ఇంకోమాట రాదా? ఛ, ఛ…” అంది ఇరిటేషన్‌గా చూస్తూ సంవేద.
” మూతెందుకు అన్ని వంకర్లు తిప్పుతావ్‌?” అంది దేవికారాణి.
”వంకర్లు తిప్పానా? వక్ర దృష్టితో చూస్తే అన్నీ వంకర్లే కన్పిస్తాయి లెండి!” అంది వత్తి పలుకుతూ సంవేద.
”అత్తను పట్టుకొని అండీ అంటావా? ఇదిగో! నా మెతకతనాన్ని చూసి, తెగరెచ్చిపోతున్నావు నువ్వు…” అంది దేవికారాణి.
”మీరు మెతకా? నవ్విపోతారు వింటే! ఎవరూ లేకనే కదా దాన్ని నా దగ్గర వుంచుకొంది. కాలులేదన్న జాలికూడా లేకుండా బయట పనులు దానితో చేయిస్తారా? అసలు మీకు హృదయం వుందా? మూసుకుపోయిందా? అంది సంవేద.
”అమ్మో ! అమ్మో! నా గుండె మూసుకుపోయిందంటావా? ఊపిరాడక నేను చచ్చిపోవాలనేగా.. అసలే జ్వరమొచ్చి నేను బాధపడ్తుంటే..! మీకు నాలాంటి అత్తకాదే బండబూతులు తిట్టే అత్త కావాలి. అప్పుడు కాని దారిలోకి రారు…” అంది చేతులు చాలా హుషారుగా తిప్పుతూ…
”ఇప్పుడు దారిలో లేమా?” అంది సంవేద.
”ఏం దారి మీ దారి? తల్లీ,దండ్రీ లేనప్పుడు అణిగి, మణిగి వుండాలని తెలియదా? నా ఇంటి కోడలిగా వచ్చి నువ్వూ – నీతో పాటు వచ్చి అది అదృష్టవంతులైపోయారు. లేకుంటే ఈ రోజుల్లో కొంతమంది అత్తలు రెండో కంటికి తెలియకుండా కోడళ్లను ఎలా హింసిస్తున్నారు?
మాటకుముందే ముక్కుమీద కొట్టి అది బెదిరి రక్తమొస్తే అదేదో రోగమంటున్నారు. సుత్తులతో తలమీద కొట్టి కుట్టుకూడా వేయించకుండా దూదిపెట్టి వుంచుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే ‘నా కోడలికి పిచ్చి పట్టిందని’ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరుస్తున్నారు. ఇవన్నీ మీకెలా తెలుస్తాయ్‌ బయటకెళ్లి చూస్తే కదా! చిన్నపని చెప్పినా అదేదో గడ్డపార చేతికిచ్చి బావి తవ్వమన్నట్లు మాట్లాడుతుంటారు…” అంది దేవికారాణి.
” మీ నోట్లోంచి గడ్డపారలు, సుత్తులు వస్తున్నప్పుడు నేనేం మాట్లాడాలి అత్తయ్యా! ఆడపిల్ల పుట్టింటినుంచి మెట్టినింటికి వచ్చినప్పుడు అక్కడ తీసి ఇక్కడ నాటిన పూలమొక్కతో సమానమంటారు. వేర్లు కుదురుకుని, కుదుటపడే దాకా మంచిపోషణ, ఆదరణ అవసరం… అలాటిది మరచిపోయి, అనాదల్ని చూసినట్లు చూస్తుంటే ఏం చేయాలి?
ఈ రోజు ఆముక్త చూడకుంటే ఆ నలుగురు మగపిల్లల చేతుల్లో నిశిత ఈ పాటికి చచ్చిపోయి వుండేది…” అంది సంవేద.
ఏమిటి! మగపిల్లలు వెంటపడ్డారా?” అంటూ జీవితంలో ఎప్పుడు పోనంతగా ఆశ్చర్యపోయింది దేవికారాణి.
”అవునట… కాలేజీ అబ్బాయిలు…” అంటూ సంవేద ఏదో చెప్పబోతుంటే…
”అర్థమయిందిలే… అదేదో ర్యాగింగంటారే.. అదయివుంటుంది. అయినా వాళ్ల కాలేజి అమ్మాయిల్ని చేసుకోవాలి కాని దీని వెంటెందుకు పడటం? ఆ.. ఇలాంటివన్నీ మామూలే…” అంది.
”మీరింత తేలిగ్గా ఎలా మాట్లాడగలుగుతున్నారత్తయా?” అంది సంవేద.
”ఏముందక్కడ జుట్టుపీక్కోటానికి?”
”మీరెందుకు పీక్కుంటారులెండి జుట్టు!”
”నువ్వేదో తేడాగా మాట్లాడుతున్నావ్‌ సంవేదా!”
”తేడా ఏముంది ఇందులో.. నలుగురబ్బాయిలు నిశితను కార్లో ఎక్కించుకోబోతుంటే ఆముక్త చూసి కాపాడింది. ఇప్పుడది ఆముక్త ఇంట్లోనే వుంది. అందుకే దాన్ని బయటకు పంపొద్దంటున్నాను.” అంటూ సంవేద విసురుగా అక్కడ నుండి వెళ్లబోతుంటే….
”ఆగు…” అంది గట్టిగా దేవికారాణి. ఆగింది సంవేద.
పక్కరూంలో నిద్రపోతున్న శ్యాంవర్ధన్‌ ఆ అరుపుకి నిద్రలేచి వాళ్ల దగ్గరకి వచ్చాడు.
”కాలు లేదనే గాని చూట్టానికి అది బావుంటుందని నేను చెప్పలేదా? ఎవరి కళ్లు దానిమీద పడినా తిప్పుకోవటం కష్టం… దాన్ని కాపాడటం మావల్ల కాదు. రేప్పొద్దున ఏదైనా జరిగితే మాకు మాటలొస్తాయి. వెంటనే పంపించివెయ్‌!” అంది దేవికారాణి.
”ఎక్కడికి?”
”ఎక్కడికని నన్ను అడుగుతావేం?”
”మాకెవరూ లేరు. దానికి నేను – నాకు అది తప్ప…” అంది సంవేద వాళ్లెందుకు వాదన పెట్టుకుంటున్నారో అర్థంకాక… ”అసలేం జరిగింది?” అంటూ వాళ్లిద్దరి మధ్యలోకి వెళ్లి నిలబడ్డాడు శ్యాంవర్ధన్‌.
జరిగింది చెప్పింది సంవేద.
”నేను వెళ్లి నిశితను తీసుకొస్తాను. మీ ఇద్దరు గొడవ ఆపి పనులు చూసుకోండి!” అంటూ షర్ట్‌ వేసుకొని ఆముక్త ఇంటికెళ్లాడు.
దారిలో ఓసారి నిశిత ముఖాన్ని గుర్తుచేసుకోవటానికి ప్రయత్నించాడు. స్పష్టత రానట్లు కష్టంగా అన్పించినా మళ్లీ, మళ్లీ ఆమె ముఖాన్ని తన అంతః చక్షువుతో తడిమి చూశాడు… వాళ్లు అనుకోవటమే కాదు. నిశిత అతని కళ్లకి కూడా అందంగానే కన్పించింది.
శ్యాంవర్ధన్‌ వెళ్లేటప్పటికి… ఆముక్త పెట్టిన అన్నం తిని, తనను తీసికెళ్లానికి ఎవరొస్తారా? అని ఎదురుచూస్తోంది నిశిత. ఆమె ముఖం చూస్తుంటే బాగా భయపడినట్లనిపిస్తోంది.
జాలిగా అన్పించింది శ్యాంవర్ధన్‌కి..
…అంతేకాదు నిమ్మాకు రాసుకొని నిగనిగలాడుతున్నట్లు కన్పిస్తున్న నిశిత ముఖాన్ని అందమైన చేతుల్ని ఒక్కక్షణం తన చూపులతో కొత్తగా, రహస్యంగా తడిమాడు. అతని చూపులు అతనికే చిత్రంగా అన్పించాయి.
ఎయిర్‌ కండిషన్డ్‌ రూంలో మెత్తి కార్పెట్ మీద హుందాగా నడుచుకుంటూ వచ్చి… ”నిశితను ఒంటరిగా ఎక్కడికి పంపకండి! బయట ద్విపాదమృగాలు ఎక్కువయ్యాయి.” అంది ఆముక్త.
అలాగే అన్నట్లు తలవూపి… నిశితను తన బైక్‌ మీద కూర్చోబెట్టుకొని, ఇంటి ముఖం పట్టాడు శ్యాంవర్ధన్‌.
దారిలో ఏదైనా హోటల్‌కి తీసికెళ్లి నిశితతో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవాలనిపించింది. తను తప్ప నిశితకి ఎవరూ లేనట్లు, అన్నీ తనే అయినట్లు, అదో విధమైన ఫీలింగ్‌కి లోనౌతున్నాడు. దాన్ని పైకి ప్రదర్శించకుండా, తన కొలీగ్‌ ఎదురై నవ్వుతూ చేయి వూపటంతో బైక్‌ ఆపాడు శ్యాంవర్ధన్‌.
”మీ మిసెస్‌ వెరీ నైస్‌ మిస్టర్‌ శ్యాంవర్ధన్‌!” అని ఆవిడ అంటుంటే అతని నరాలు చిన్న షాక్‌కి గురై తీయగా పులకించాయి.
”నా మరదలండీ!” అంటూ ఆమెకు నిశితను పరిచయం చేశాడు.
నిశిత బైక్‌ మీద కూర్చోవటంతో కాలుమీద చీర కవరైపోయి, అంగవైకల్యాన్ని దాచేసింది. అది గమనించాడు శ్యాంవర్ధన్‌,
ఇల్లు రాగానే… బావ దేవుడులా అన్పించాడు నిశితకి.
*****
ద్రోణ బొమ్మ వేస్తున్నాడు.
ఆముక్త రావటం అతను గమనించలేదు.
అతని డెడికేషన్ని చూడటం… తనకి ఓ ఇన్సిపిరేషన్‌ అన్నట్లు ఏకాగ్రతతో చూస్తూ నిలబడింది.
ఓ నిముషం గడిచాక వెనక్కి తిరిగి ఆముక్తను చూశాడు ద్రోణ.
”కూర్చో.. ఆముక్తా! ఎంతసేపు నిలబడతావు?” అన్నాడు మెల్లగా నవ్వి…
ఆశ్చరపోతూ…”నేను వచ్చింది నువ్వు చూశావా ద్రోణా? అంది కూర్చుంటూ.
అవునన్నట్లు తల వూపాడు.
”ఎలా?” అంది ఇంకాస్త ఎక్కువగా ఆశ్చర్యపోతూ.
”అంతర్నేత్రంతో..” అంటూ మళ్లీ ఓ నవ్వు నవ్వి, ఆమెకి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు.
”మీ డెడికేషన్‌ అద్భుతం!” అంది అంతకన్నా నాదగ్గర పదాలు లేవన్నట్లు చూస్తూ…
అతనేం మాట్లాడలేదు. తీరైన భంగిమలో అతను కూర్చున్న విధానం చాల హుందాగా, రిలాక్స్‌డ్‌గా వుంది.
”బొమ్మలెయ్యటం ఎలా, ఎప్పుడు మొదలుపెట్టారు? మీ ప్యామిలీలో ఎవరైనా వున్నారా? లేక ఎవరినైనా చూసి ఇన్సిపయిర్‌ అయ్యారా?” అంది యాంగ్జయిటీని ఆపుకోలేక ఆముక్త.
”నువ్వు కూర్చున్న తీరు, అడుగుతున్న విధానం చూస్తుంటే ఇంటర్వ్యూ చేస్తున్నట్లుంది. పత్రికలో ఇస్తావా? చానల్లో ఇస్తావా?” అన్నాడు సరదాగా…
”నాకు మాత్రమే తెలుసుకోవాలని వుంది.” అంది కాలుమీద కాలు వేసుకొని ఇంకాస్త ఠీవిగా కూర్చుంటూ
”… నేను విద్యార్థిగా వున్నప్పటినుండి ఎక్కువగా సముద్ర తీరాలకి వెళ్తుండేవాడిని. నదుల్ని కూడా వదిలేవాడిని కాదు. అక్కడ ఏ రాయి కన్పిస్తే ఆ రాయిపై చాలా సేపు పడుకొని గడిపేవాడిని… నేనలా ఎందుకుండే వాడినో మా ఇంట్లో వాళ్లకి అర్థమయ్యేది కాదు.
…పోర్టులకి వెళ్లినప్పుడు పెద్ద, పెద్ద నౌకలు, మత్స్యకారులు అక్కడి వాతావరణం నన్ను బాగా ఆకట్టుకునేవి. కుంచె పట్టాను. రంగులు కలిపాను. నాతోపాటే నాలోని రంగులు కూడా పరిణతి చెందాయి.. మిక్స్‌డ్‌ మీడియాలో ప్రయోగాలు చెయ్యటం మొదలుపెట్టాను. క్లాత్‌, పేపర్‌, ఉడ్‌, క్యాన్వాస్‌లపై నేను చేసే గ్రాఫిక్‌ ఎఫెక్ట్స్‌ ప్రత్యేకంగా కన్పించటంతో నాలో ఇంట్రస్ట్‌ పెరిగింది. నేను చదివింది సి.ఎ. అయినా ఇప్పుడు ఇదే నా ప్రొపెషన్‌ అయింది.” అన్నాడు చాలా ప్రశాంతంగా.
ఎప్పటినుండో తెలుసుకోవాలనుకుంటున్న విషయాలని తెలుసుకుంటున్నట్లు ఆసక్తిగా వింటోంది.
”ప్రకృతిలోని అందాలనే కాక, శ్రమైక సౌందర్యాన్ని, మార్మిక సౌందర్యాన్ని నాదైన శైలిలో ఒడుపుగా పట్టుకొని… ప్రకృతితో మనిషికి వున్న అనుబంధానికి రంగులు అద్దుతుంటాను.. అంతేకాదు కొంతమంది వ్యక్తుల్ని గీస్తున్నప్పుడు వాళ్ల మనసు కూడా తెలిసేటట్టుగా గీస్తుంటాను. అలా బాహ్యరూపంతో పాటు ఇన్నర్‌ ఫీలింగ్స్‌ కనపడాలంటే క్యారికేచర్‌లో బాగా ఎక్స్‌ర్‌సైజు చేయాలి. అలా అనేకం చేశాను.
స్వతహాగా నా మనసు కుంచెలోంచి హాస్యం, కరుణ, ఉద్రేకం, నైరాస్యం, ప్రేమ, బాధ, భయం, జాలువారటం, అందుకు బాగా సహకరించింది. లేకుంటే మన ఆర్టిస్టులం రాసే రాతల్లో కాని, గీసే గీతల్లో కాని స్పష్టత లేకుంటే విమర్శకులు చెంప చెళ్లుమనిపిస్తారు కదా!” అన్నాడు.
చెంప తడుముకుంది యాధృశ్చికంగానే…
”ఇప్పుడేం గీస్తున్నారు?” అంది కాన్వాస్‌ వైపు చూస్తూ
”ఇరవై అయిదుమంది చిత్రకారులం కలిసి ఇంక్‌…. ఆక్రిలిక్‌.. ఆయిల్‌ కలర్స్‌తో రంగులద్ది హైదరాబాదులోని ‘గ్యాలరీ స్పేస్‌’లో పెడ్తున్నాం. ఈ ప్రదర్శన ఇంకో నెలరోజులపాటు జరుగుతుంది. ఇది ట్రావెలింగ్‌ ఎగ్జిబిషన్‌ కాబట్టి ఈ రంగులు ఇక్కడ నుండి ఢిల్లీ, బెంగుళూరుకు తరలివెళ్తాయి. దానికోసమే ఈ బొమ్మ గీస్తున్నాను…” అన్నాడు ద్రోణవర్షిత్‌.
”మరి నా కవితకు బొమ్మ ఎప్పుడు గీస్తారు?” అంది ఆముక్త.
దాని విషయం అప్పుడు గుర్తొచ్చిన వాడిలా…”దాన్ని మళ్లీ ఓసారి చదవాలి ఆముక్తా!” అన్నాడు. అతను బొమ్మ గీస్తాననలేదు. గియ్యను అనలేదు.
ఆమె దృష్టి మూలనున్న చెత్తకుప్ప మీద పడింది… అప్పుడప్పుడు ద్రోణ బొమ్మగీసి, కుదరక చింపేసిన కాగితాలు ఆ చెత్తకుప్పలో వున్నాయి. వాటిమీద దుమ్ము బాగా వుంది. ఆ దుమ్ములో ఆముక్త రాసిన కవిత వుంది. వెంటనే వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకొని దులుపుకుంటూ వచ్చి కూర్చుంది.
”మనకున్న దుమ్ము చాలదని ప్రతిరోజు అంతరిక్షం నుండి పది టన్నుల దుమ్ము భూమిపై పడుతుందట కదా!” అంది ఆ దుమ్మునే చూస్తూ ఆముక్త.
”కరక్ట్‌ ఆముక్తా! అది మనసు మీద పడకుంటే చాలు” అన్నాడు ద్రోణ. తన భార్యను గుర్తుచేసుకుంటూ… ఆ కాగితాన్ని దుమ్ములో వేసింది శృతికనే అని అతనికి తెలుసు.
”మన శరీరం వెయ్యికి పైగా జాతుల బాక్టీరియాకి ఆవాసమని విన్నాను. కాని మనసు మీద దుమ్ము గురించి వినలేదు.” అంది ఆశ్చర్యంగా చూస్తూ.
”భావాలను కలుషితం చేసుకొని, వక్రదృష్టితో ఆలోచించే వాళ్ల మనసునిండా దుమ్మే వుంటుంది ఆముక్తా! దాన్ని దులుపుకోవటం వాళ్లకి రాదు. ఇతరులు వెళ్లి దులపలేరు” అన్నాడు.
ఆముక్త విరోధించింది. అంతటితో ఆ విషయాన్ని వదిలేశాడు.
”నీ కవితకి బొమ్మవెయ్యాలని చాలాసార్లు ట్రై చేశాను. కానీ.. నీ కవిత నేను బొమ్మగీసే స్థాయిలో లేదు. నువ్వింకా ఎదగాలి. సమస్యల్ని సృశించాలి. మార్పుకోసం ఆరాటపడి రాయాలి..” అన్నాడు.
ఆముక్త ముఖంలో రంగులు మారాయి.
వెంటనే తన చేతి వేళ్ల వైపు చూసుకుంటూ…
”కరెక్టే ద్రోణా ! మనం బాగా ఫీలయ్యి రాయాలంటే ప్రయాణాలు ఎక్కువ చెయ్యాలని, అందమైన దృశ్యాలను చూడాలని అంటున్నారు. ఆ ఫీలింగ్‌ కోసం నన్ను లాస్‌ఏంజిల్‌కి తీసికెళ్లమని మావారిని అడుగుతున్నాను. అక్కడకెళ్లి చూశానంటే ఇంకా బాగా రాయగలుగుతాను కదూ! అందరి మన్ననలు పొందగలుగుతాను కదూ!” అంది ఆశగా.
”నువ్వు లాస్‌ఏంజిల్‌ వెళ్లినా రామప్ప వెళ్లినా ఇలాగే రాస్తావు. ఎందుకంటే నువ్వు చూసే దృక్పథంలో, రాసే సబ్జక్ట్‌లో ఎవరూ తాకని కొత్తదనాన్ని పట్టుకోలేక పోతున్నావ్‌!” అన్నాడు నిక్కచ్చిగా.
నిరాశగా చూసింది.
”ప్రయాణం చేస్తే, వర్షం పడితే, సముద్రాన్ని చూస్తే రాసేది రచన కాదు. నీ కవితల్లో ఎక్కువగా మంచుతెరల్లోంచి ఎగసివస్తున్న సూర్యబింబం.. సముద్ర తీరంలో చెంపల్ని నిమిరే చల్లగాలి.. చిగురు కొమ్మల్లోంచి మంద్రంగా కూసే కోకిల కన్పిస్తుంది. అలా కాకుండా ఇది తనదే అన్న ఫీలింగ్‌ వచ్చేలా రాయాలి. అప్పుడు అది చదివి ఆలోచిస్తారు.” అన్నాడు ద్రోణ. ఆమె చేత గొప్పగా రాయించాలని వుంది అతనికి.
అలాగే చూస్తోంది ఆముక్త…
”నీ కవితా చూపులతో… ఆవులించే దిక్కుల్ని చూడగలగాలి. తలలు వంచుకొని ఆలోచిస్తూ నిలబడి వుండే చెట్లను చూడాలి.. పరిసరాలు ఎలా స్థంబిస్తాయో చూడగలగాలి…” అంటూ ఆగాడు.
ఆమెలో ఏదో అలజడి మొదలైంది.
ద్రోణ తన కవితకి బొమ్మ వెయ్యటం డౌటే అనుకొంది.
”మనసు మర్మాలపుట్ట ఆముక్తా! దాని ఎక్స్‌పెక్టేషన్‌ దానికి వుంటుంది. ఇకముందు నువ్వు రాసే కవితలో అభ్యుదయం, నైతికత్వం, వేదాంతం, వుండేలా చూసుకో.. గతంలో వచ్చిన ప్రముఖుల సాహిత్యాన్ని చదువు ఇంకా సాధ్యమైతే జీవితాన్ని చదువు… అప్పుడు నీ కవిత కారు అద్దంపై వర్షం నీటిని తుడిచే వైపర్‌లా వుంటుంది. కళ్లతో పాటు, గుండెకూడా కరుగుతుంది. ” అన్నాడు.
”అప్పటి వరకు నా కవితకి బొమ్మ వెయ్యవా ద్రోణా?” అంది బేలగా.
”నీ కవితకి బొమ్మవేస్తే – నా బొమ్మకి విలువ పెరగాలి. నీకిది సృజనాత్మకమైన సవాలు…” అన్నాడు
మాట్లాడలేదు ఆముక్త.
”నేను ఊహించిన రీతిలో రాయగలిగే శక్తి నీలోవుంది ఆముక్తా! కానీ నీ మెదడు లోపలవున్న ఆలోచనలను నువ్విలా నునుతట్టుతో లేపితే అవి బయటకురావు. అలా లేపగలిగే మంత్రదండం కూడా లేదు. ప్రయత్నమనే గడ్డపారల్ని ప్రయోగించి పెకలించాలి. అప్పుడు పుడ్తాయి నిలబడే కవితలు.. సృష్టికైనా, మనోదృష్టికైనా బద్దకం పనికి రాదు…” అన్నాడు.
”నేను వెళ్తాను వర్షిత్‌…!” అంది ఊపిరాడనట్లు చూస్తూ ఆముక్త.
”వెళ్లే ముందు ఓ మాట.. నీ కవితకు బొమ్మ వేయాలని వుంది. నా భావాలకి తగినట్టుగా రాయి. కాఫీ తాగి వెళ్లు శృతిక తెస్తుంది” అన్నాడు చాలా మర్యాదగా.
ఒక్కక్షణం భయంగా తన చీరె వైపు చూసుకుంటూ…
”వద్దు వెళ్లాలి వర్షిత్‌! బై…” అంది ఆముక్త.
*****
దేవికారాణి ఉదయం నుండి … ”నాకు ఊపిరి ఆడటం లేదు నిశితా! ఫ్యాన్‌ గాలి తగిలితే ఒళ్లంతా వేడెక్కి పోతోంది. ఇదిగో ఈ అట్టముక్క పట్టుకొని కాస్త విసురు” అంటూ పడుకొంది.
వెంటనే వెళ్లి ఆమె చెప్పినట్లు చేస్తోంది నిశిత.
అక్క చూస్తుందేమోనని లోలోపల ఆమెకు పీకుతోంది.
అటు వెళ్తూ చూడనే చూసింది సంవేద. ఆగ్రహంతో కళ్లెర్రచేసి చూస్తూ గది బయటే నిలబడి… ”నా చెల్లికి కాలు లేదన్న జాలికన్నా అమ్మా, నాన్నా లేరన్న చులకనే ఎక్కువుంది మీకు.. అందుకే దాన్నిలా వేధిస్తున్నారు. ఇదెంత పాపామో మీకిప్పుడు తెలియదు.” అంది.
గాఢనిద్రలో వున్న దేవికారాణి టప్పున కళ్లు విప్పింది. ఆమె నోరు విప్పేలోపలే ఆ గదిలోంచి బయటకొచ్చింది నిశిత.
”అక్కా! గొడవెందుకు? ఇప్పుడు నేనేం కష్టపడ్తున్నాను. ఆవిడ దగ్గర కూర్చోవటమేగా… నువ్వు ఆవేశం. తగ్గించుకోకపోతే ఆమె నన్నిక్కడ వుండనివ్వదు. బయటకెళ్లి ఎన్ని బాధలు పడాలో నీకర్థం కాదు. మొన్న ఆముక్తక్క నన్ను చూడకపోతే నేనేమయ్యేదాన్ని…?” అంది నిశిత.
”ఆవిడ ఆరోగ్యంగా వుండి కూడా నీ చేత సేవలు చేయించుకుంటుంది… మనకు అమ్మా, నాన్న లేరని ఇన్‌డైరక్ట్‌గా భయపెట్టిస్తోంది. ఎందుకిలా మనం భయపడాలి?” అంది సంవేద బాధగా.
”ఇలా కొశ్చన్స్‌ వేసుకోవటం కన్నా అడ్జస్ట్‌ కావటం మంచిది.” అంది నిశిత మెల్లగా.
”ఎందుకు అడ్జస్ట్‌ కావాలి? ఆవిడ పనులేమి నువ్వు చెయ్యకు. ఏం చేస్తుందో చూద్దాం…” అంది.
”నామీద నీకున్న ప్రేమతో నువ్విలా అంటున్నావు కాని, తర్వాత దాని పర్యవసానాన్ని పేస్‌ చేయ్యాలంటే నువ్వు చెయ్యలేవు. నామాట విని నువ్వు లోపలకి వెళ్లక్కా!” అంది నిశిత బ్రతిమాలుతూ
”ఆవిడా గదిలో కూర్చుని, ఏ పనీ చెయ్యకుండా టైంకి తినటంలో తప్పులేదు. కానీ… నీ చేత ఇలా కాళ్లు పట్టించుకోవటం, బట్టలు ఉతికించుకోవటం, ఫ్యానాపేసి అట్టముక్కతో విసరమనటం నాకు నచ్చటం లేదు. చూస్తుంటే బాధగా వుంది. అమ్మ నిన్నెలా చూసుకునేది.” అంది ఆవేశాన్ని కాస్త తగ్గించుకుంటూ…
”ఎప్పుడు ఒకే రోజులు వుంటాయా? ఎండాకాలంలో ఎండాలి. వానాకాలంలో తడవాలి. తప్పించుకోవటం సాధ్యమా! నువ్వు పీలవ్వటం తగ్గించుకుంటే నేను హాయిగా వుంటాను. లేకుంటే ఆవిడ మధ్యా, నీ మధ్య నలిగిపోతాను.” అంది నిశిత.
”ఏమి మీ ఇద్దరి గుసగుసలు..? నా గురించేనా? మీ గురించి ఆలోచించుకోండి! అసలే రేట్లు మండిపోతున్నాయి. బ్రతకటం కష్టంగా వుంది. మనిషికి మనిషి బరువై పోతున్నారు. మీ చెల్లిని ఎక్కువ రోజులు వుంచకు…” అంది దేవికారాణి.
ఉలిక్కిపడింది సంవేద.
”నేను చెప్పలేదా! ఆవిడ రియాక్షన్‌ ఎలా వుంటుందో?” అన్నట్లు అక్కవైపు చూసింది నిశిత.
గంట, గంటకి ఈవిడగారి బెదిరింపుని తట్టుకోవటం కష్టంగా వుంది. అటో, ఇటో తేల్చుకోవాలి అని సంవేద అనుకుంటుండగా ఫోన్‌ రింగయింది.
నాలుగడుగుల వెనక్కి వేసి ఫోన్‌ లిఫ్ట్‌ చేసింది నిశిత.
”హలో…” అంది నిశిత. అవతల వ్యక్తి మాట్లాడాక.
”దేవిని పిలవమంటున్నాడు అత్తయ్యా! మీకే ఫోన్‌!” అంది నిశిత.
”దేవి నా ! ఎవడే వాడు? అంత అమర్యాదగా పిలుస్తున్నాడు. వుండమను … వస్తున్నా…” అంటూ ఒక్క ఉదుటన లేచి కోపంగా ఫోన్‌ దగ్గరకి వెళ్లింది దేవికారాణి.
…ఆమె హలో అనగానే
”నేను దేవీ! గంగాధరాన్ని…” అన్నాడు అవతలవైపు నుండి ఆ పేరు వినగానే స్థాణువైంది. ”నువ్వా??” అంది ఆశ్చర్యంతో…
”నేనే దేవీ!” అన్నాడు. ఆయన గొంతులోని మార్ధవాన్ని ఆస్వాదిస్తూ… జ్ఞాపకాల వర్షంలో తడుస్తున్న దానిలా ముఖం పెట్టి…
”రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడే ఇంత జీవితం అయిపోయిందా అనుకున్నాను. మళ్లీ ఇప్పుడు నీ కంఠం విన్పిస్తున్నావు. ఎక్కడున్నావు? ఇన్నాళ్లు ఏమైపోయావు? నీ జాడ తెలుసుకుందామని ఎంతగానో ప్రయత్నించాను.” అంది ఉద్వేగంగా.
సంవేద, నిశిత ప్రేక్షకుల్లా నిలబడ్డారు.
దేవికారాణి కసురుకున్నట్లు ”మీరెళ్లి మీ పనులు చూసుకోండి!” అని వాళ్లవైపు ఉరిమి చూడకుండా ఫోన్లో మాట్లాడుతోంది.
ఆమె అలా తన ద్యాసలో తనుండటం చూసి.. అవతల వ్యక్తి ఆమెకి సంతోషాన్ని ఇవ్వబోతున్నాడని అర్థమైంది వాళ్లకి… ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం తెలియట్లేదు.
దేవికారాణి ఫోన్లోనే – కొద్దిసేపు ఏడ్చింది, కొద్ది సేపు బాధపడింది. కొద్దిసేపు నవ్వింది. అలా రకరకాల ఫీలింగ్స్‌తో ఫోన్‌ పట్టుకొని అలాగే కొద్దిసేపు నిలబడింది.
”నువ్విప్పుడెక్కడున్నావ్‌?” అంది చివరగా కళ్లు తుడుచుకుంటూ…
”బస్టాండ్‌లో వున్నాను దేవీ! ఇప్పుడే బస్‌ దిగి నీకు కాల్‌ చేస్తున్నాను.” అన్నాడు.
”నువ్వు నాకు మూడు కిలోమీటర్ల దూరంలోవున్నావు. మన ఇంటి అడ్రస్‌ చెబుతాను. వెంటనే ఆటో ఎక్కి నేరుగా వచ్చెయి…” అంటూ అడ్రస్‌ చెప్పింది. ఆమెకెంతో ఆనందంగా వుంది.
”ఇదిగో ! సంవేదా! మీ మామయ్య వస్తున్నాడు…” అంది సంబరంగా దేవికారాణి.
… ఆ మాటతో శిల్పాలు కదిలినట్లు కదిలారు సంవేద, నిశిత.
”మామయ్య అంటే?” అంది పూర్తిగా అర్థంకాక సంవేద
”నా భర్త ! నీ మొగుడికి తండ్రి…” అంది అలా అంటున్నప్పుడు ఎప్పుడూ కన్పించనంత సంతోషం కన్పించిందామెలో…
”అవునా!!” అంటూ ఉక్కిరిబిక్కిరయ్యారు.
ప్రైమ్ మినిష్టర్‌ వస్తున్నాడంటే మిగతా నాయకుల్లో కలిగే కంగారులాంటిది వాళ్లలో కలిగింది. వెంటనే అత్తగారి గదిలోకి వెళ్లి అవసరం లేని సామాన్లని బయట పడేసి, మామగారికోసం ఇంకో బెడ్‌వేసి రెడీగా వుంచారు.
ఆ టైంలో వాళ్లిద్దరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఇల్లంతా వాళ్లే అయి తిరుగుతుంటే చూడముచ్చటేసింది దేవికారాణికి… ఆమెకిప్పుడు ప్రపంచమంతా తనకి అనుకూలంగా మారి, అందంగా అన్పిస్తోంది.
కొద్ది నిముషాలు గడిచాక ఇంటిముందు ఆటో ఆగింది.
ఆటోలోంచి గంగాధరం దిగాడు.
పెరిగిన గడ్డంతో, అక్కడక్కడ తెల్లవెంట్రుకలతో, మాసిన బట్టలతో వున్నాడాయన… ఎడమచేయి భుజంవరకు తెగిపోయి కట్టు కట్టి వుంది. ఇంకా ఆ గాయం మానలేదు పచ్చిగానే వుంది. నెమ్మదిగా నడుచుకుంటూ లోపలకి వస్తున్న భర్తను చూసి కళ్లు తిరిగాయి దేవికారాణికి.
భర్త తనకి దూరమైనప్పుడు అచ్చు ఇప్పటి శ్యాంవర్ధన్‌ లాగే వుండేవాడు. శ్యాంవర్ధన్‌ని చూస్తుంటే రోజు ఆమెకు తన భర్తే గుర్తొస్తుంటాడు. ప్రస్తుతం భర్తలో వచ్చిన, మార్పు వికృతంగా, భరించరాని విధంగా వుంది.
తల తిరిగినట్లై, తమాయించుకోలేక – కింద పడబోయి గేటు పట్టుకొని నిలదొక్కుకుంది దేవికారాణి.
”అత్తయ్యా! మీరు కాస్త పక్కకి తొలగండి! మామయ్యగారిని మీ గదిలోకి తీసికెళ్తాం…” అంది సంవేద. నిశిత కూడా అక్క పక్కనే వుంది.
దేవికారాణి కంగారుపడ్తూ… ”వద్దు, వద్దు, నా గదిలోకి వద్దు. నిశిత గదిలోకి తీసుకెళ్లు.” అంది ఆయన్ని అంత దగ్గరగా చూసి తట్టుకునే శక్తి లేనిదానిలా…
”ఇప్పటివరకు మామయ్యగారి కోసం ఎదురు చూశారుగా అత్తయ్యా! మీ గదిలో ఆయనకో బెడ్‌ కూడా వేశాం…” అంది సంవేద అర్థంకాక..
ఆ మాటలు గంగాధరానికి విన్పిస్తున్నాయి.
”ఆయన నన్ను అర్థాంతరంగా వదిలి వెళ్లారు. నా గదిలో ఎందుకు? దూరంగానే వుండనీయ్‌! అలవాటవుతుంది.” అంటూ ఆయన దగ్గరకెళ్లి పలకరించకుండానే తన గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకొంది దేవికారాణి.
”వదిలేసి వెళ్లినా భర్త భర్తే కదా! ఏమిటో ఈవిడ గారి మనస్తత్వం. గడియ, గడియకి మారిపోతుంటుంది.” అని మనసులో అనుకుంటూ గంగాధరాన్ని నిశిత గదిలోకి తీసికెళ్లింది సంవేద.
అది పెద్ద గదేమీ కాదు. ఒకప్పుడు స్టోర్‌ రూం నిశితకోసం దాన్ని గదిగా మార్చారు. నిశిత ముడుచుకొని పడుకుంటే ఇంకొకరు ఫ్రీగా పడుకోవచ్చు. అక్కడ బెడ్‌ లాటి సౌకర్యాలేమి లేవు. ఒక పక్కప్లాస్టిక్‌ కవర్లో నిశిత బట్టలున్నాయి. ఆమె కూర్చునే వీల్‌ చెయిర్‌ వుంది.
గంగాధరానికి ఆ గది చూపించారు.
ఆయన ఆ గదిలోకి వెళ్లి తన బట్టలున్న ఓ చిన్న కవరును ఓ మూలన పెట్టాడు. సంవేద బాత్‌రూం చూపించటంతో, కట్టు దగ్గర తడవకుండా స్నానం చేసి వచ్చాడు.
అన్నం ప్లేటు ఆయన ముందుపెట్టి – ”నేను మీ కోడల్ని మామయ్యా! నాపేరు సంవేద. ఇది నా చెల్లెలు నిశిత” అంది సంవేద.
వాళ్లిద్దర్ని అలా చూస్తుంటే తినకముందే కడుపునిండినట్లయింది గంగాధరానికి.. తింటూ నిశిత గురించి ఆప్యాయంగా మాట్లాడాడు. ఆయనలా తన చెల్లి గురించి అడుగుతుంటే హాయిగా, ఓదార్పుగా వుంది సంవేదకు.
కానీ… ఇంతకాలం తర్వాత భర్త ఇంటికొస్తే, ఆయన దగ్గర కూర్చుని నాలుగు మాటలు మాట్లాడని అత్తగారి మనస్తత్వాన్ని ఎలా బేరీజు వేసుకోవాలో అర్థం కాలేదు సంవేదకి..
*****
రోజులు గడుస్తున్నాయి.
చేస్తున్న పనిలో కొద్దిమందికే ఆనందం దొరుకుతుందాంరు. నిశితకి అలాంటి ఆనందం గంగాధరం ద్వారా దక్కింది. సంవేద బిజీగా వున్నప్పుడు గంగాధరం పనులు నిశిత చేస్తుంది. సంవేద అభ్యంతరం చెప్పటం లేదు. ఆయనంటే సంవేదకి మంచి అభిప్రాయం, అభిమానం వుంది.
నిశిత స్టిక్‌ సాయంతో నడిచినా, యాక్టివ్‌గా వుంటుంది ఏ పని అయినా అవలీలగా, అలసట లేకుండా చేస్తుంది. ”అయ్యో! ఆమెతో పని చేయించుకోవటం ఎలా?” అన్న భావన కలగదు. పని చేస్తున్నంత సేపు చేస్తుంది. ఆ తర్వాత వీల్‌ చెయిర్లో కూర్చుని చదువుకుంటూ గడుపుతుంది.
గంగాధరం భుజం గాయం మానింది.
నిశిత ఎంతో అంకితభావంతో ఆయన పనులు చేస్తుంటే ‘ఇది’ ఏనాటి బంధమో అన్న తలంపు ఆయనలో అప్పుడప్పుడు కల్గుతుంది.
తండ్రి రాక శ్యాంవర్ధన్‌కి సంతోషాన్నిచ్చింది.
ఆఫీసునుండి రాగానే తండ్రిదగ్గర కొద్ది సేపు కూర్చోవటం అలవాటు చేసుకున్నాడు. అది నిశిత కోసమే అని… ఆ ఉత్సాహం కూడా నిశితకు దగ్గరగా మసలుకోవటం వల్లనే అని త్వరగానే గ్రహించాడు గంగాధరం.
దేవికారాణి మాత్రం ‘ఆయన వుండే పరిసరాల్లో నేను సంచరించను’ అన్నట్లు అటువైపు చూడడమే మానేసింది. ఒక చెయ్యి పూర్తిగా లేకుండా ఇంకో చేత్తో బ్రతుకు దుర్భరంగా సాగిస్తున్న భర్తను ”ఇలా ఎందుకు జరిగింది?” అని అడగాలన్న ధ్యాస కూడా లేని దానిలా వుండటం చూసి ఆయన మనసు చివుక్కుమంది. భార్య మౌనాన్ని భరించలేక.. ఒకరోజు ఆమె గది ముందు నిలబడి ”దేవీ!” అంటూ పిలిచాడు. ఆమె ఆయనవైపు చూడలేదు. ”అసలేం జరిగిందంటే!” అంటూ ఇంటినుండి దూరమయ్యాక ఏం జరిగిందో చెప్పబోయాడు. ఆమె వినకుండా డోర్‌ పెట్టుకుంది.
అప్పటినుండి ఆమె గదివైపు వెళ్లటం మానేశాడు.
ప్రతి మనిషికి ఓ సొంత ప్రపంచం వుంటుంది. అందులో ఆటలు, స్కూలు, అల్లర్లు, చదువు, కెరీర్‌, అభిరుచులు, ఆనందాలు, జ్ఞాపకాలు.. సుదీర్ఘమైన జీవితానుభవం వున్న గంగాధరం ఆశకీ – నిరాశకీ మధ్యన ఎంత వేదాంతముందో దాన్ని జీర్ణించుకుంటూ.. మరచిపోలేని మజిలీలను గుర్తుచేసుకుంటూ పడుకున్నాడు.
నిద్రలోనే – ఆ భయంకరమైన అనుభవం గుర్తొచ్చి గట్టిగా, ఆ గది అదిరేలా అరిచాడు గంగాధరం…
ఆ అరుపుకి – పక్కనే పడుకుని వున్న నిశిత గుండె అదిరింది. కళ్లు తెరిచి వెంటనే లేచి కూర్చుంది. మెల్లగా చేయి చాపి స్టిక్‌ అందుకొని, నాలుగడగులు వేసి గంగాధరం బెడ్‌ దగ్గరకి వెళ్లి.. ‘మామయ్యా!’ అంటూ చేతిమీద తట్టింది.
నిశిత చేతి స్పర్శ కన్నతల్లిలా అన్పించి, ఆ పీడకలలోంచి బయటకొచ్చి – ”అమ్మా ! నిశితా!” అన్నాడు ఆమె కళ్లలోకి చిన్నపిల్లాడిలా చూస్తూ… ఆయన ఇంకా భయపడ్తూనే వున్నట్లు ఆయన అధరాలు కంపిస్తున్నాయి.
”ఎందుకు మామయ్యా! భయపడ్తున్నావ్‌? ఏదో ఆపదలో వున్నట్లు అరుస్తున్నావ్‌ ఏం జరిగింది?” అంది నిశిత.
”ఏం లేదు, ఏంలేదు నువ్వు కంగారు పడకు నిశితా! ఏదో పీడకల” అన్నాడు. కానీ ఆయన అలా ఎన్నో రోజులుగా నిద్రలో అరుస్తూనే బతుకుతున్నాడని ఆమెకు తెలియదు.
ఆ అరుపు విని – తలుపు తీసుకొని తండ్రి ద్గగరకి వచ్చాడు శ్యాంవర్ధన్‌. పక్కనే వున్న నిశిత వైపు చూస్తూ… ”ఏం జరిగింది?” అన్నాడు
”అదే అడుగుతున్నాను బావా! నాకూ తెలియదు ఏదో పీడకల అంటున్నాడు మామయ్య”. అంది.
”మంచి నీళ్లు తీసుకురా!” అన్నాడు.
నిశిత వెళ్లి మంచినీళ్లు తెచ్చింది. ఆమె చేతిలోంచి గ్లాసు అందుకొని ‘నాన్నా! మంచినీళ్లు తాగి పడుకో…” అంటూ గంగాధరాన్ని లేపి గ్లాసందించాడు శ్యాంవర్ధన్‌.
మంచినీళ్లు తాగి పడుకున్నాడు గంగాధరం.
పేషంట్ పొజిషన్ని గమనిస్తూ కూర్చున్న డాక్టర్‌లా తండ్రి బెడ్‌కి కాస్త దూరంగా వున్నకుర్చీలో కూర్చున్నాడు శ్యాంవర్ధన్‌.
పడుకుంటే బావుండదని తను కూడా గంగాధరాన్ని చూస్తూ అక్కడే కూర్చుంది నిశిత. బావగారు తండ్రి పట్ల అంత బాధ్యతను ప్రదర్శించటం నిశితకి నచ్చింది. గౌరవం కలిగింది.
తండ్రి నిద్రపోయాడనుకొని నిశిత వైపు తిరిగాడు శ్యాంవర్ధన్‌. అందరు అంటుంటే ఏమో అనుకున్నాడు కాని నిశితలో చక్కని రూపం వుంది. ఆమె చూపు, నవ్వు, మాట – దగ్గరగా చూస్తుంటే హాయిగా అన్పిస్తున్నాయి. నెమ్మదిగా ఆమెతో మాటలు ప్రారంభించాడు.
గంగాధరం నిద్రపోతున్నాడని గమనించి బావగారు మాటలు పెంచటం ఇబ్బందిగా వుంది నిశితకి… కానీ అతని మాటల్లో ఎక్కడా వల్గారిటీ లేదు. అయినా ఏదో అసహజమైన ఫీలింగ్‌… ఆ ఫీలింగ్‌లో కూడా అతని మాటల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యనిదానిలా వినసాగింది.
ఎందుకంటే ఆశ్రయం దొరికిన చోట అతిథిలా ఒదిగి పోతున్న తను అంతకన్నా ఏం చేయలేక…!
”నువ్వు మీ పేరెంట్స్ ని మరచిపోలేక పోతున్నావని సంవేద చెప్పింది. ఈ మధ్యన మా నాన్నగారు వచ్చాక ఆయన పనిలో పడి మీ పేరెంట్స్ ని, మరిచిపోతున్నావని కూడా చెప్పింది. అవునా..?” అన్నాడు శ్యాంవర్ధన్‌ ఆమెనే చూస్తూ
పేరెంట్స్ గుర్తురాగానే నిద్రమత్తు ఎగిరిపోయింది.
”మరచిపోవటమంటే! తాత్కాలికంగా డైవర్ట్‌ అవుతామే కాని, పూర్తిగా పోని బాధంటూ వుందంటే అది తల్లిదండ్రుల్ని కోల్పోవటమే బావా! ఆ బాధ ముందు ఏ బాధ అయినా తక్కువే…” అంది నిశిత.
”ఏదైనా మనం ఆలోచించేదాన్ని బట్టి వుంటుంది. కొంతమందికి శారీరకమైన బాధలు వుంటాయి. కొందరికి మానసికమైన బాధలు వుంటాయి” అన్నాడు.
”నాకు రెండు వున్నాయిగా బావా!” అంది. ఆమెకే జాలిగా వుంది. కదిలిస్తే చాలు తన మనసులోని బాధను పంచాలని చూస్తోంది. ఓదార్పును కోరుతుంది. ఆ విషయంలో ఎంతివాళ్లైనా స్థితప్రజ్ఞతను సాధించలేరు.
… ఆమె భావాన్ని అర్థం చేసుకున్నవాడిలా ”మరిపించే వాళ్లుంటే అవి పెద్ద బాధలేం కాదు…” అన్నాడు
ఆమె మాట్లాడలేదు
”ఇచ్చి పుచ్చుకోవటం వల్ల కూడా కొంత బాధ తగ్గుతుంది…” అన్నాడు ఆమె ముఖంలోకి లోతుగా చూస్తూ…
”పుచ్చుకోవడమేకాని, ఇవ్వటానికి నా దగ్గర ఏముంది?” అంది.
”డబ్బులేదన్న ఫీలింగ్‌ నిన్ను బాధపెడ్తున్నట్లుంది. మేమున్నాముగా నీకెందుకా బాధ?” అన్నాడు.
ఎప్పుడూ మాట్లాడని బావ ఇప్పుడింత అభిమానంగా మాట్లాడుతుంటే – వీళ్లంతా నా మనుషులు అన్న ధైర్యం కల్గింది.
”డబ్బుతో సంబంధం లేకుండా ఇచ్చి, పుచ్చుకునే పద్దతిలో ఎన్ని లాభాలు వున్నాయో చెబుతాను విను…” అన్నాడు నీకో మంచి విషయం చెబుతాను విను అన్నట్లు…
వింటున్నట్లు చూసింది నిశిత.
”చెట్లవల్ల శాకాహార జంతువులకు ఆహారం లభిస్తే ఆ జంతువుల వల్ల చెట్లలో పరపరాగ సంపర్కం జరుగుతుంది. అలాగే మొసళ్లు నోరు తెరుచుకొని కూర్చుంటే కొన్ని రకాల పకక్షులు వాి దంతాల మధ్యన ఇరుక్కున్న మాంసం ముక్కల్ని లాక్కుని తింయి. దీనివల్ల మొసలికి నోరు శుభ్రమవుతుంది. అటు పక్షికి ఆహారం దొరుకుతుంది. కొన్ని లతలు పెద్ద, పెద్ద చెట్లను అల్లుకుంటూ ఎగబాకుతాయి. దానివల్ల లతలకు ఒక ఆధారం దొరుకుతుంది. లతలకు పూచే పూలకు ఆకర్షింబడి వచ్చే కీటకాల వల్ల చెట్లుపూలతో సమర్థవంతమైన పరపరాగ సంపర్కం… ” అని అతను ఇంకా ఏదో చెప్పబోతుంటే సంవేద వచ్చింది.
”ఏంటి? దానికి సైన్స్‌ లెసన్‌ చెబుతున్నారు ఈ టైంలో..! మామయ్యగారు నిద్రపోవద్దా?” అంది.
మా నాన్న నిశితను స్కూల్‌కి వెళ్లనిచ్చేవాడు కాదు. మీరు ఆఫీసునుండి వచ్చాక ఫ్రీ టైంలో దానిక్కాస్త చదువు నేర్పితే బావుండు అని అప్పుడప్పుడు భర్తతో చెప్పటం గుర్తొచ్చి, ఇప్పుడు చదువు చెబుతున్నాడనుకొంది సంవేద.
”ఆయన నిద్రపోకుండా అరుపులతో, కేకలతో మమ్మల్ని నిద్రలేపి కూర్చోబెట్టారు. నిన్ను డిస్టర్బ్‌ చెయ్యటం ఎందుకులే అని మేమిద్దరం ఇలా కూర్చున్నాం… మధ్యలో మళ్లీ అరుస్తాడేమోనని చూస్తున్నాం.” అన్నాడు శ్యాంవర్ధన్‌
…నిద్రపోతున్న వాడిలా పడుకొని వున్న గంగాధరం వైపు చూసి తలకొట్టుకుంటూ ”ఆయన హాయిగా నిద్రపోతున్నారు మీరేమో అరుపులకోసం చూస్తున్నారు. ఆయనకేం కాదు లేవే! ఎందుకంత బెంగ? మీరు రండి! వెళ్దాం!” అంది సంవేద.
అతనికి వెళ్లాలని లేదు….
భార్య చేయి భుజం మీద పడటంతో ఇక తప్పదన్నట్లు లేచి వెళ్లాడు శ్యాం.
గంగాధరం లేచి మళ్లీ అరుస్తాడేమోనని వణుకుతూ పడుకొంది నిశిత.
*****
బ్రష్షులు, కలర్స్‌ అందుబాటులో పెట్టుకొని, ఏకాగ్రత ఏమాత్రం దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకొని, పెయింటింగ్‌ వేస్తూ… అందం, ఆనందం, అంతం, అనంతం, శబ్ద, నిశ్శబ్దం అన్నీ తన బొమ్మలో చూసుకుంటూ అలై, గాలై ఆటై, పాటై సాగిపోతున్నాడు ద్రోణ…
…మొబైల్‌ రింగవుతుంటే స్పీడ్‌గా రెండడుగులు వేసి, మొబైల్‌ అందుకొని ‘హాలో…’ అంది శృతిక.
”బాగున్నావా శృతీ?” అని అవతల కంఠం అనగానే నాన్‌స్టాప్‌గా మాట్లాడటం మొదలుపెట్టింది శృతిక…
”ఆగాగు! ఏం మాట్లాడుతున్నావు శృతీ?” అంటూ ఆశ్చర్యపోయిందామె.
”అవును! ఆయన సమక్షం నాకలాగే అన్పిస్తోంది ఏం చెయ్యను చెప్పు ఎటైనా పారిపోవాలనిపిస్తోంది…” అంది శృతిక.
”పారిపోవటం పరిష్కారం కాదు.. మొన్న ద్రోణ ఏం చెప్పాడో తెలుసా? ఈ మధ్యన నువ్వు మరీ చిన్నపిల్లలా బిహేవ్‌ చేస్తున్నావట… ఏం కావాలో చెప్పవట.. స్వేచ్ఛగా మాట్లాడవట… ఏది చెప్పినా ఫాలో అవ్వవట.. మళ్లీ, మళ్లీ చెబితే మౌనంగా చూస్తావట… ఏం మాట్లాడినా వినబడనట్లు చూస్తావట… అదేం అంటే నన్నిలాగే వదిలెయ్‌ అన్నట్లు ఒంటరిగా కూర్చుంటావట… ఇలా అయితే అతని పరిస్థితి ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించు…” అంది కృతిక.
”ఆయన పరిస్థితికేం బ్రహ్మాండ తాండవం.. రోజుకెన్ని ఫోన్స్‌! ఎందరు అభిమానులు! అదేం చిత్రమో అందరు ఆడవాళ్లే! కొందరైతే నేరుగా ఇంటికే వస్తుంటారు.” అంది శృతిక. అక్కతో చెబితే ఎలావుంటుందో అని ఇన్నిరోజులు చెప్పలేదు కాని ఇప్పుడు చెబితేనే బావుంటుందనుకొంది.
”ఎంతో బ్రాడ్‌ థింకింగ్‌తో స్పీడ్‌, స్పీడ్‌గా వుండే నువ్వు ఎందుకిలా అయ్యావు? ఒంటరిగా ఓ చిన్న సర్కిల్‌లో కూర్చుని ఆలోచించకుండా కాస్త బయటకు రావే… వచ్చి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకో.. లేకుంటే నీ మనసే నిన్ను చంపేస్తుంది మానసికంగా…” అంది కృతిక.
”స్పీడా? నేను స్పీడా? దేన్లో? స్కూటీని నడపటం లోనా? ఆ స్పీడు వల్ల అవయవాలు మాత్రమే పోతాయి. కానీ ఈయన దగ్గరకి వచ్చేవాళ్ల స్పీడు చూశావంటే మతే పోతుంది. ఒక్కసారి చూస్తే జీవితంలో తిరిగి లేచే స్థితిలో వుండము. అంత స్పీడు. ఆ అభిమానం! ఆ ఆరాటం! ఆ ఆనందం! ఓహ్‌ చెప్పలేం!” అంది శృతిక.
”చూడు శృతీ! వాళ్ల కళారంగంలో అభిమానుల పాత్రే ఎక్కువగా వుంటుంది. వాళ్లు వాళ్ల కళలో ఎదగటానికి ఇన్సిపిరేషన్‌ అభిమానుల అభిమానమే… ఆ పొగడ్తలు, ఆ ఎంకరేజ్‌మెంట్ లేకుంటే వాళ్లు అక్కడే ఆగిపోతారు.. ఏదో ఒక జాబ్‌ చేసుకుంటూ ఇదిగో నాలాగ! ఇప్పుడు నేనెంత మందికి తెలుసు చెప్పు! మహా అయితే మా ఆఫీసులో… మన ఫ్యామిలీ మెంబర్లకి అంతేగా! మరి ద్రోణా?” అంది కృతిక.
”ఆయన తెలిసిన ఆడవాళ్లందరికి తెలుసు…” అంది వెంటనే శృతిక.
”ఆడవాళ్ల గురించి ఆలోచిస్తున్నంత సేపు నువ్వు ద్రోణను గుర్తించలేవు. అతనేంటో నీకు అర్థం కాదు.” అంది కృతిక.
”అర్థంకాని అమోఘం ఏముందక్కడ?” అంది వెటకారంగా.
”నువ్వు అతనితో కలిసి బయట కొస్తేగా నీకర్థమయ్యేది. ఎప్పుడు చూసినా ఏదో నేరం చేసిన ఖైదీలా నాలుగు గోడల మధ్యన వుంటే ఏం తెలుస్తుంది? ఆ మధ్యనొక కాస్ట్లీ… ఏరియాలో ద్రోణచేత ‘నేచర్‌ ఆర్ట్‌ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్‌ పెట్టించారు. లక్కీగా ఎందరెందరో సందర్శకులు వచ్చారు. వచ్చిన వాళ్లలో అమెరికన్స్‌, ఆస్ట్రేలియన్స్‌, జర్మన్స్‌ కూడ వుండటం విశేషం. వాళ్లకి నచ్చిన పెయింటింగ్స్ ని లక్షల్లో కొనుగోలు చేసి పట్టుకెళ్లారు. చూస్తున్న నాకే వండరైంది.” అంది కృతిక.
”అది బిజినెస్‌! ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్లు అలా డబ్బుల్ని పోగేసుకుంటుంటారు.” అంది శృతిక.
”చ…చ… నీకెలా చెబితే అర్థమవుతాడే ద్రోణా? అతన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే నీకు నువ్వే అర్థం కాకుండా పోతావు. అతని లైఫ్‌ ప్రస్తుతం నువ్విచ్చే మనశ్శాంతి మీదనే ఆధారపడివుంది. అతన్ని బాధపెట్టకు.” అంది.
”నేనేం బాధపెడ్తున్నా … అతనే నన్ను బాధపెడ్తున్నాడు. నాలుగురోజుల నుండి ఇంటికే రాలేదు తెలుసా? ఒంటరిగా వున్నాను.. పడుకోవాలంటే భయంగా వుంది. నీ దగ్గరికి వద్దామంటే మీ అత్తొకటి!” అంది శృతిక.
”అవునా!!” అంటూ నోరెళ్ల బెట్టింది కృతిక.
అది వినగానే షాక్‌ తిన్నాడు ద్రోణ. క్షణంలో తేరుకొని, కుంచె పక్కన పెట్టి… ‘ఇది అనుమానం కాదు. బలుపు’ అనుకుంటూ హాల్లోకి వచ్చాడు.
అప్పటికే కాల్‌ కట్ చేసి వంటగదిలోకి వెళ్లబోతున్న శృతిక చేయి విసురుగా పట్టుకొని… ”ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడావ్‌? నాలుగు రోజులనుండి నేను ఇంట్లో లేనా?” అన్నాడు కోపంగా.
”ఎందుకంత గట్టిగా పట్టుకుంటారు? నా చెయ్యి విరిగి పోతుంది. వదలండి! మా నాన్న నా కాళ్లు, చేతులు బాగుండాలనే నన్ను మీకిచ్చారు. మీ ప్రవర్తన నన్నెలాగూ మానసిక రోగిని చేసింది. ఈ కాళ్లూ, చేతులు కూడా వుంచరా నాకు.?” అంటూ మోకాళ్లమీద కూర్చుని చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది.
అప్పటికప్పుడే ఈ ఏడ్పేంటి? రివర్స్‌లో మాట్లాడే ఈ మాటలేంటి? తట్టుకోలేక ఆమె చేయి వదిలేశాడు.
”ఈసారి మీ దగ్గరకి మీడియావాళ్లు వస్తారుగా… అప్పుడు మీ భార్యగా నేనెంత రగిలిపోతున్నానో, ఎంత కుమిలిపోతున్నానో చెబుతాను” అంది ఏడుస్తూనే.
ద్రోణ తల పట్టుకూర్చున్నాడు అతనికి బొమ్మపై కాన్‌సన్‌ ట్రేషన్‌ పోయింది. ఆమెతో రోజూ ఇలా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకరకంగా డిస్టర్బ్‌ అవుతూనే వున్నాడు.. అతనికి అక్కడ వుండాలనిపించలేదు. క్షణంలో బయటకి నడిచి – కారెక్కి వేగంగా వెళ్లిపోయాడు.
*****
మహాకవి శ్రీశ్రీ ని అప్పట్లో చూసిన కవులంతా ‘శ్రీశ్రీ గురించి మాట్లాడుకుందాం’ అన్న ప్రత్యేక సభను ఏర్పాటు చేసుకొని, దానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను తెలిసిన మిత్రుడొచ్చి ద్రోణకి ఇచ్చి వెళ్లాడు.
ఆ సభకి ఆముక్తని వెళ్లమని చెప్పాడు ద్రోణ… దానివల్ల ఒక కవయిత్రిగా ఆమెకెంత ఉపయోగమో చెప్పాడు. ప్రముఖ కవులతో పరిచయాలు అవుతాయని చెప్పాడు.
ఆముక్త వెళ్లింది.
వేదికపై అభ్యుదయకవులు, దిగంబరకవులు, విరసం రచయితలు, స్త్రీవాద రచయిత్రులు వున్నారు… సాహితీ ప్రియులతో ఆ సభ కిక్కిరిసి పోయి వుంది.
ముందుగా అధ్యక్షులు తొలి పలుకులు విన్పించారు.
ఆ తర్వాత ఓ విరసం సభ్యుడు మైక్‌ ముందు నిలబడి…
”మహా ప్రస్థానం అంటే విప్లవం.. ‘మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం.. గంటలు! గంటలు! గంటలు! పోనీ, పోనీ పోతే పోనీ! సతుల్‌, సుతుల్‌, హితుల్‌ పోనీ!’ అన్న శ్రీ శ్రీ కవితలో ఎంత విప్లవంవుందో నాకు తెలియదు కాని, నేనా కవితకి బాగా కదిలిపోయాను…” అన్నాడు.
వెంటనే ఓ దిగంబరకవి లేచి – శ్రీ శ్రీ వ్యక్తిత్వం ఎంత విలక్షణమైందో చెబుతూ… శ్రీశ్రీ ని ఒక పసిపిల్లవాడిగా, నిరంతర పాఠకుడిగా, ఒక విదూషకుడిగా, అక్షర ప్రహేళికలతో క్రీడించిన వ్యక్తిగా అభివర్ణించారు.
అంతలో ఓ అభ్యుదయ కవి మైక్‌ పట్టుకొని – ”నేను విశ్వనాధ, కృష్ణశాస్త్రి, టాగోర్‌ల కవిత్వంలో పరవశించిపోతున్న రోజుల్లో మొదటిసారిగా శ్రీశ్రీ మహాప్రస్థానం చదివాను.. శ్రీశ్రీ ఒక ఆరని మంట. ఆగనియుద్ధం. అక్షర హిమనగం. అభ్యుదయ స్వప్నార్ణవం. ప్రపంచ ప్రజలకై ఎత్తిన బావుా…” అంటూ ఆవేశంగా మాట్లాడుతుంటే సభలో చప్పట్లు మారుమోగాయి.
ఆముక్త అలాగే చూస్తోంది.
అసలీ మహాప్రస్థానం అంటే ఏమిటో ఆముక్తకి అర్థం కావటంలేదు.. పక్కనెవరో అడిగారు. ” మహాప్రస్థానం చదివారా?” అని
తడబడింది ఆముక్త.
చదవలేదంటే ఎలా వుంటుంది? ‘కలం పట్టి కవితలు రాస్తూ కూడా ఇంకా చదవలేదా?’ అంటారేమోనని అటూ, ఇటూ కాకుండా తలవూపి తప్పించుకొంది. ‘అమృతం కురిసిన రాత్రి’ చదివాను” అంటూ వెంటనే చెప్పింది.
”అది కూడా మంచి పుస్తకమే.. కానీ ఈ రోజుల్లో సాహిత్యపరమైన పుస్తకాలు భూతద్దం వేసి వెతికినా కన్పించటం లేదు. ఒకప్పుడు వంటగదితో పాటు విధిగా పుస్తకాల గది వర్థిల్లేది. ఇప్పుడు ఏ మధ్యతరగతి ఇళ్లలో చూసినా ఎంసెట్ పుస్తకాలు, జావాలు, సి-ప్లస్‌ పుస్తకాలు కన్పిస్తున్నాయి” అందామె అదో పెద్ద తీరని అగాథంలా ముఖం పెట్టి…
ఆ సభలో అప్పటి తరానికి చెందిన కవులేకాక ఇప్పటి తరానికి చెందిన యువకవులు, యువకయిత్రులు కూడా వున్నారు మహావృక్షాల ముందు లేతమొక్కల్లా…
వేదికపై ‘కవిత ఎలా వుండాలి? మినీకవిత ఎలా వుండాలి?’ అనే చర్చ సాగుతోంది. ఆ చర్చలో సాహిత్యాన్ని చదువుతున్నారు. తాగుతున్నారు. పీలుస్తున్నారు. జుర్రుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచ సాహిత్యాన్నంతా అక్కడ పోగేసుకొని భాషపై పట్టురావాలంటే ప్రబందాలను వదలొద్దంటున్నారు. ఒకప్పుడు శ్రీశ్రీ ‘కవిత్వం తీరని దాహం’ అంటే ఇప్పుడు ‘కవిత్వం నా ఊపిరి’ అంటున్నారు కొందరు.. ‘కవిత్వం నా వ్యసనం’ అంటున్నారు ఇంకొందరు… ‘కవిత్వమంటే ప్రతిరోజు నా కలంలోంచి రాలే గుప్పెడు అక్షరాలు’ అంటున్నారు ఇంకా కొందరు … ‘కవిత్వం అతిసహజంగా నాలోంచి వూరే వూటల తేట’ అంటున్నారు మిగిలిన వాళ్లు…
‘కవిత్వం అంటే ఇదా?’ అనుకొంది ఆముక్త. ద్రోణ తనని ఈ సభకి ఎందుకెళ్లమన్నాడో ఇప్పుడర్థమైంది.
సభ ముగిశాక – దారిలో కారాపుకొని విశాలాంధ్ర బుక్‌షాపుకి వెళ్లి కొంతమంది ప్రముఖ కవుల కవితా సంపుటాలను కొని ఇంటికి తీసికెళ్లింది.
ఏసి ఆన్‌ చేసి పడుకోగానే సంవేద గుర్తొచ్చింది ఆముక్తకి.
‘జీవితాన్ని తడమటమంటే ఏమి వేదా?’ అని తను అడిగినప్పుడు సంవేద ఏమాత్రం తడబడకుండా.. ”అగ్నిపూజ చేస్తే వర్షాలు పడ్తాయని నేతి డబ్బాలను నిప్పుల్లో పోస్తున్నారు కదా! మధ్యాహ్న భోజనంలో పిల్లలకి నెయ్యి ఎందుకు వెయ్యరో.. నీ కవిత్వంతో అడుగు ముక్తా? అలాగే ముఖంమీద వచ్చే ముడతలు వయసు వేస్తున్న ముద్రలని తెలిసి కూడా బ్యూటీషియన్లను తిడుతూ, తమ శరీరచ్ఛాయను మాసిపోకుండా చేయమని వాపోతుంటారు. ఇవన్ని చిన్నగా అన్పించినా ఎంత చికాకుగా వుంటాయో తెలియజెయ్యి” అంది సింపుల్‌గా.
ద్రోణకూడా అంతే! అలాగే మాట్లాడతాడు
ఇవి రాయటానికి భాష కావాలి. చదవమంటాడు.
వెంటనే తన వెంట తెచ్చుకున్న పుస్తకాలను ఆత్రంగా చూస్తూ ఒక్క గంటలో అంతా నేర్చుకోవాలన్నట్లు అందులోని పదాలవెంట పరిగెత్తసాగింది.
ఆ పుస్తకాల్లో .. భావోన్మాదం, యుద్దోన్మాదం అంటూ కొరుకుడుపడని పదాలు కన్పించటంతో వాటిని పక్కన పెట్టి నిరంతర సౌందర్యాన్వేషకుడు కృష్ణశాస్త్రి పుస్తకం అందుకొంది.
ఇప్పుడు హాయిగా వుంది.
కృష్ణశాస్త్రి తన ఆరాధన, అన్వేషణ, ఆలాపనలో నవలావణ్య లతిక ఊర్వశిని ఎలా దర్శించాడో చదువుతూ కూర్చుంది. ఆయన అన్వేషణ ‘అనంతమైనది. అమరమైనది, అతి మధురమైనది’ అని మనసులో అనుకొంది.
ఎప్పుడైనా సౌందర్య నీలివెన్నెల్ని కోరుకునే ఆముక్త సంవేద చెప్పినట్లు, ద్రోణ చెప్పినట్లు రాయలేకపోతోంది. చదవలేకపోతోంది
రేపు వెళ్లి ద్రోణను కలవాలి. సభలోని సంగతులు చెప్పాలి అనుకొంది ఆముక్త.
*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *