March 28, 2024

ఓషో రజనీష్

రచన: శారదా ప్రసాద్

వాత్సాయనుడికి వారసుడుగా జనం చెప్పుకునే ఓషో జిడ్డు కృష్ణమూర్తిగారి అభిమాని. బుద్ధుడి బోధల వల్ల ప్రభావితుడయ్యాడు.
రజనీష్ చంద్రమోహన్ జైన్ 1960లలో ఆచార్య రజనీష్‌గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్‌ గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించి ఓషో మూవ్‌మెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారుచేశాడు. ఇతడు మధ్యప్రదేశ్‌ లో గల నర్సింగ్‌పూర్ జిల్లాలో ఉన్న కుచ్‌వాడాలో 11. 12. 1931న జన్మించాడు.
జీవితానికి సంబంధించిన గొప్ప విలువలు ఎరుక, ప్రేమ, ధ్యానం, సంతోషం, ప్రజ్ఞ, ఆనందం అని ఆయన బోధించాడు. జ్ఞానోదయం (ఎన్‌లైటెన్‌మెంట్) అన్నది ప్రతి ఒక్కరి సహజ స్థితి, కానీ అది తెలుసుకోలేకపోతున్నారు – మనిషి ఆలోచనా విధానం ముఖ్యకారణం కాగా, సామాజిక పరిస్థితులు, భయం వంటివి మరి కొన్ని కారణాలు అని ఆయన అన్నాడు. హిందీ, ఆంగ్ల భాషలలో ఆయన అనర్గళంగా ప్రవచించాడు. బుద్ధుడు, కృష్ణుడు, గురు నానక్, ఏసుక్రీస్తు,
సోక్రటీసు, జెన్ గురువులు, గురుజెఫ్, సంప్రదాయాలు, సూఫీ, హస్సిడిజమ్, తంత్ర వంటి బోధనలు మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఎన్నింటిలోనో ఆయన ఆరితేరిన దిట్ట. ఏ తత్వమూ సత్యాన్ని పూర్తిగా గ్రహించలేదు అనే నమ్మకాన్ని కలిగి, ఏ “ఆలోచనా పద్ధతి”లో కూడా తనను ఎవరూ నిర్వచించలేరని ఆయన ప్రకటించాడు.
అరవైలలో తరుచుగా శృంగారానికి సంబంధించిన ప్రవచనాలను వెలువరించినందుకు ఆయన్ని”సెక్స్ గురువు” అని పిలిచేవారు. ఆ ప్రవచనాలన్నింటిని Sex to Super consciousness అనే ఆంగ్ల పుస్తకంగా ప్రచురించారు. ఈ పుస్తకం సంభోగం నుండి సమాధి వరకు అనే పేరుతో తెలుగులో అనువదించబడినది. ఆయన చెప్పినది, “తంత్ర పద్ధతిలో అనైతికం అనేది లేదు, అంతా నైతికమే” సెక్స్‌ను నైతికంగా అణగద్రొక్కడం లాభ రహితం, సంపూర్ణంగా చైతన్యసహితంగా అనుభవించనప్పుడు దాన్ని దాటి ముందుకు వెళ్ళలేరు అని. “ప్రేమ ఓ ప్రదేశం. స్వేచ్చగా మనస్పూర్తిగా అనుభవించు. జీవితంలో ఏ రహస్యం ఉండదు. దాచిపెట్టడమే ఉంటుంది. సెక్స్ వల్లనే మనం పుడతాము. అన్ కాన్షస్ నుండి సెక్స్ సూపర్ కాన్షస్ కు తీసుకు వెళుతుంది. సెక్స్ తోనే ముక్తి. జీవితం పక్షి. ప్రేమ, స్వేచ్చ రెండు రెక్కలు. అందరూ మనల్ని వదిలివేయటం ఒంటరితనం. అందర్నీ మనం వదిలి వేయటం ఏకాంతం.
“ప్రతి ఏటా 2, 00, 000 మంది పర్యాటకులతో, పూణే పట్టణములోని ఓషో అంతర్జాతీయ ధ్యాన విహారము (Osho International Meditation Resort) ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక ఆరామాలలో ఒకటి. నేడు 50 భాషలలో అనువాదం చెయ్యబడి ఓషో పుస్తకాలు మున్నెన్నడు లేనంతగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఆయన వ్యాఖ్యానాలు, పలుకులు గొప్ప వార్తాపత్రిక లెన్నింటిలోనో మనకు కనిపిస్తాయి.
భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ నవలాకారుడై విలేఖరి కుష్వంత్ సింగ్, సినిమా నటుడు మరియు రాజకీయనాయకుడు వినోద్ ఖన్నా, అమెరికా కవి రూమీ మరియు అనువాదకుడు కోల్‌మన్ బార్క్స్, అమెరికా నవలాకారుడు టామ్ రాబిన్స్ మొదలైన వారు ఈయన శిష్యులే! కొత్త ఢిల్లీలోని భారత పార్లమెంటు గ్రంధాలయంలో కేవలం ఇద్దరు ప్రముఖుల పూర్తి జీవితకాల రచనలను మాత్రమే పొందుపరిచారు, ఒకరు ఓషో కాగా మరొకరు మహాత్మా గాంధీ.
ఓషో బాల్యంలోనే హిప్నొసిస్ నేర్చుకున్నాడు. హిప్నొసిస్ తో పూర్వ జన్మల రహస్యాలు తెలుసుకున్నాడు. ఓషోను బాల్యంలో ప్రభావితం చేసింది, ఆయన మాతామహుడి మరణం. ఆయన మరణించే సమయంలో పక్కనే రజనీష్ ఉన్నాడు. మృత్యువును గురించి తెలుసుకోవాలనే చింతన ఆయనలో ప్రారంభం అయింది. అతనిని మరింత ప్రభావితం చేసిన సంఘటనలు రెండు! ఒకటి ఆయన ప్రేమించిన అమ్మాయి ‘శశి ‘ 16 వ ఏటనే మరణించటం! రెండవ సంఘటన మహాత్మాగాంధీ దారుణ హత్య!
1955 లో డిగ్రీ పూర్తిచేసాడు. 1957లో సాగర్ యూనివర్సిటీ నుంచి ఎం. ఎ డిగ్రీ తీసుకొని, కొంతకాలం జబల్ పూర్ లో లెక్చరర్ గా పనిచేసాడు. ఆ కాలంలో విద్యార్ధులకు సెక్స్ పాఠాలు చెప్పటంతో, ఆ ఉద్యోగం కాస్తా ఊడింది. అన్ని మతాలను తిట్టేవాడు!అతని సెక్స్ బోధనలు యువతను ఆకట్టుకున్నాయి. 1970 లో బొంబాయికి మకాం మార్చాడు. 1981 లో పూనాలో రజనీష్ ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు. అక్కడికి విదేశీయులు ఎక్కువగా వచ్చేవారు. ఆ రోజుల్లోనే ఆయన సెక్స్ యోగిగా మార్పు చెందాడు. ఆయన ప్రసంగించినంత సేపు భక్తులు తన్మయత్వంతో ఊగిపోయేవారు. ఆయన కళ్ళలో అద్వితీయమైన శక్తి ఉంది. ఆయన్ను ఒక్కసారి చూస్తే చాలు, ఆయన వశమౌతాం!
పేరుకు బ్రహ్మచారి అయినా ఆయనకు చాలామంది స్త్రీలతో సంబంధాలు ఉండేవి. క్రాంతి, లక్ష్మి, క్రిష్టినీవుల్ఫ్ వారిలో ముఖ్యులు. జన్మత:జైనుడైనా ఆయనకు బౌద్ధం అంటే ఇష్టం! శ్రీ కృష్ణ తత్వాన్ని రజనీష్ అంత గొప్పగా చెప్పిన మరొకరు లేరు! ఓషో కృష్ణుడి దగ్గర నుంచి బుద్ధుడి వరకు, జీసస్‌, మహమ్మద్‌, మహావీర తత్వాల మీద వ్యాఖ్యానం చెప్పారు రజనీష్. ఎక్కడ బుద్ధుడు అంతమవుతాడో అక్కడ కృష్ణుడు మొదలవుతాడంటూ కృష్ణ తత్వం మీద ఆయన ఇచ్చిన ఉపన్యాసాల సంకలనాన్ని ఇందిర, గోపాలప్ప సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో చక్కగా అనువదించారు.
మానవ చరిత్రలో కృష్ణుడు మాత్రమే అణచివేతలకు, దమనానికి వ్యతిరేకి అంటాడు ఓషో. సహజ ప్రవృత్తులను, భావావేశాలను అణచివేయడం ద్వారా మనిషి తనను తానే చంపుకున్నాడు అని చెప్పాడు ఓషో. కృష్ణుడే ప్రేమంటూ అతడి ప్రేమ తత్వాన్ని వివరించిన ఓషో కృష్ణుడికి, బుద్ధుడికి, మహావీరుడికి మధ్య ఉన్న తేడాలను కూడా చెప్పాడు. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత, ఆయన నాకు కొత్తగా తెలిసింది ఏమీ లేదు. ‘తెలిసింది’ అక్కడ ఎప్పుడూ ఉంది. బుద్ధుడు చివర్లో చెప్పిందే కృష్ణుడు మొదట్లోనే చెప్పాడంటాడు ఓషో. కృష్ణుడు సర్వకాలాల్లోనూ జ్ఞానిగా ఉన్నాడు. ఆయన చేసిన కృష్ణ తత్వ విశ్లేషణ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. రజనీష్ ను కొంతమంది భావించి నట్లుగా తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు! ఆయన కళ్ళు పలకరిస్తాయి, బోధిస్తాయి! తనకు దీటైన వ్యక్తి ఒక్క జిడ్డు క్రిష్ణమూర్తే అని అంటాడు. అయితే జిడ్డు కృష్ణమూర్తి మాత్రం ఇతన్ని అసహ్యించుకునేవాడు.
రజనీష్ 1981లో అమెరికాలో రజనీష్ పురాన్ని కొన్ని కోట్ల ఖర్చుతో ప్రారంభించాడు. ఇమిగ్రేషన్ సమస్యలు వచ్చాయి. దానికి తోడూ ఆయన ప్రియ సఖి షీలా మొత్తం డబ్బుతో జర్మనీకి పారిపోయింది. రజనీష్ బికారీగా ఇండియాకు చేరుకున్నాడు. ప్రభుత్వం అనుమతించని కారణంగా మనాలిలో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి అక్కడే ఉన్నాడు.రజనీష్ ఆధ్యాత్మిక యాత్ర మొదలైంది,అంతమయింది మనాలీలోనే! రజనీష్ లో లోపాలున్నప్పటికే, అభినందించదగిన విషయాలు కూడా అనేకమున్నాయి! ఆయనకు తెలిసిన యోగ విషయాలు,ఆధ్యాత్మిక విషయాలు మరెవ్వరికీ తెలియవు. “ధ్యానానికి ఆలోచనలు పనికిరావు, ఎక్కడైతే ఆలోచనలు అంతమవుతాయో అక్కడ ‘ధ్యానం’ మొదలవుతుంది.”అని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిందే చివరికి ఈయన కూడా చెప్పాడు! వివాదాస్పదమైన ఈ యోగి 60 ఏళ్ల వయసు రాకముందే, 19-06-1990 న ‘కీర్తి’శేషుడయ్యాడు!
అన్నిటినీ ఆహ్వానించే నాకు ఈయన కూడా ఆరాధనీయుడే! ఆ మహనీయునికి నా స్మృత్యంజలి!

17 thoughts on “ఓషో రజనీష్

  1. లెజెండ్ ఆఫ్ ఇండియన్ గురు
    …. ఓషో బుక్ ఒక్కటి అయినా పూర్తిగా చదవండి….. జీవిత అనుభవాలను ఉదహరించిన ఓషో…… ఒక బుద్ధుడు… ఒక యేసు… ఒక కృష్ణుడు….. OSHO PRANAMS…..

  2. రజనీష్ ని చాలా మంది అపార్ధం చేసుకున్నారు. మామూలు పౌరాణికులు చెప్పే తరహాలో ఆయన ప్రవచనాలు వుండవు. కాని అవి చదవదగినవి. కాంచీ పరమాచార్యను తప్ప నేను ఏ స్వాములను ఆరాధించను. వారంటే గౌరవము వున్నది. రజనీష్ గురించి విపులముగా చాలా బాగా వ్రాశారు. ఆయన గురించి చక్కగా పరిశోధించి సరి అయిన ధృక్పధముతో విశ్లేషించారు. ధన్యవాదాలు.

  3. Very very excellent.I request my friends to study “Talks on the great mystic Astavakra. Enlightenment:The only revolution “by Osho. Enough.

  4. చాలా బావుంది ఓషో గారి గురించి రాసింది. ఆయన మంచి ధ్యాని కూడా. చాలా బుక్స్ చదివాను నేను. అందులో ముఖ్యమైనది అతీషా ప్రజ్ఞ వేదం. ఎంత అద్భుతంగా గా రాశారో ఓషోగారు.

  5. ఓషో తత్వాన్ని సరళమైన భాషలో తెలియచేసినందుకు ,ఓషో అంటే కేవలం బూతుగా ఆలోచించేవారికి ఆయనను గురించిన మరొక కోణాన్ని చూపించినందుకు ధన్యవాదాలు!

  6. ఓషోను గురించి చక్కని సమగ్ర వ్యాసం రాసిన శారదా ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

  7. ఆడా మగ కలయికను బాహాటంగా చెప్పే వాళ్లే ధైర్యవంతులు. ఓషో రజనీష్ గారి గురించి చక్కటి వ్యాసం అందించిన శారదా ప్రసాద్ గారికి ధన్యవాదాలు .

  8. నా దగ్గర రజనీష్ క్యాసెట్స్ ఉన్నాయి. అవి ఎంతో వికాసాన్ని కలిగిస్తాయి.
    ఆయన రాసిన యోగా, ఓషో జీవిత రహస్యాలు నాకు నచ్చిన పుస్తకాలు.
    చక్కని సమగ్ర వ్యాసం రాసిన శారదా ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

  9. సంక్లిష్ట విషయాన్ని క్లుప్తంగా, వివరంగా అందించారు. నిజానికి ఆయన ప్రసంగాలకి ఆకర్షితులవ్వని వారెవ్వరూ లేరు– అతనిగురించి తెలియనివారు తప్ప. అతని ప్ర్ససంగాలకు యువత కంటే మధ్యవయస్కులు జేవితంపై ఓ అవగాహనకోసం వెంపర్లాడేవారు అతనికి దగ్గరయ్యారు. మంచి వ్యాసం.అభినందనలు.

  10. శారద ప్రసాద్ గారి “ఓషో రజనీష్ “ పై వ్యాసం బాగుంది.
    ఆయన books నేను చాల చదివాను జీవితం, ప్రేమ,శృంగారం,వివాహం, మరణాని కవతల,శ్రీ కృష్ణ ,..దేవాలయాల విశిష్టత,యుేగా etc.
    అతని విశ్లేషణ ఆకట్టుకుంటుంది.

  11. రజనీష్ .. ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తగా ప్రాచుర్యం పొందినా, ఒకానొక కాలంలో ఆయన ఎక్కువగా సెక్స్ గురించి వెలువరించిన ప్రసంగాలే ఎక్కువ. మిగిలిన విషయాలు ఎలా ఉన్నప్పటికీ, ఈ రకం ప్రసంగాలు యువతలో ఆధ్యాత్మికత కంటే విశృంకలతనే ఎక్కువగా పాదుకొల్పాయి. దాని ప్రభావం మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఇది నా అభిప్రాయం. మంచి వ్యాసం అందించారు.

    1. లెజెండ్ ఆఫ్ ఇండియన్ గురు
      …. ఓషో బుక్ ఒక్కటి అయినా పూర్తిగా చదవండి….. జీవిత అనుభవాలను ఉదహరించిన ఓషో…… ఒక బుద్ధుడు… ఒక యేసు… ఒక కృష్ణుడు….. OSHO PRANAMS…..

Leave a Reply to alluri gouri lakshmi Cancel reply

Your email address will not be published. Required fields are marked *