March 29, 2024

కలియుగ వామనుడు 3

రచన: మంథా భానుమతి

“మరి నువ్వు.” ఇంత లావెలా ఉన్నావని అడగలేక పోయాడు చిన్నా. కిషన్ కి అర్ధమైపోయింది, ఏమడగాలనుకుంటున్నాడో.
“ఇంట్లో, బైటా కనిపించిందల్లా ఫైట్ చేసి తినెయ్యడమే. మిగలిన వాళ్ల గురించి చూడను. ఐనా నా కడుపు ఎప్పడూ కాళీగానే ఉంటుంది. అందుకే అమ్మేసుంటారు, నన్ను భరించలేక. ఎక్కడో అక్కడ తింటాన్లే కడుపునిండా అని. వీళ్లు కూడా కడుపు విండా పెట్టట్లేదు. ఎప్పుడూ ఆకలిగానే ఉంటోంది.” కిషన్ హిందీ, మరాటీ కలిపి మాట్లాడుతుంటే బాగా అర్ధమవుతోంది చిన్నాకి.
కళ్లల్లో నీళ్లు తిరిగాయి చిన్నాకి. తాము తక్కువ తినైనా తనకి పెట్టే అమ్మ, నాన్నమ్మలని తల్చుకుని. ఐనా తను డాక్టర్ చెప్పినంతే తప్ప ఎక్కువ తినడానికి ఎట్లాగా లేదు.
“నా దాంట్లోంచి పెడతాలే. నేనెక్కువ తినలేనుగా.”
కిషన్ లేచి పరుగెత్త సాగాడు.
చిన్నా, టింకూ ఏం చేస్తున్నాడా అని చూస్తున్నాడు.
టింకూ, ఇంకొక పిల్లాడితో కలిసి, సీ-సా ఆడుతున్నారు. ఫరవాలేదు.. రాత్రి వరకూ గోల చెయ్యడు. రాత్రైతే చూడాలి.. ఏమంటాడో.
కిషన్ చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది చిన్నాకి. మస్తానంకుల్ నిజంగానే అమ్మేసుంటాడా? ఆ రోజు తాము చదువుకుంటుంటే వచ్చిన వాళ్లిద్దరూ.. ఒకడైతే సినిమాల్లో విలన్ లాగే ఉన్నాడు.
అంతే అయుంటుంది. మస్తానంకులు బాడ్. ఎప్పుడూ ఆంటీని కొడ్తుంటాడు.
టింకూని అమ్మేస్తే.. మరి తననెందుకు తీసుకొచ్చారు? తన్ని కూడా అమ్మేశాడా.. మస్తానంకుల్ అంత పని చేసినా చేస్తాడు.
పాపం! నాయన.. కొడుకునెంతో గొప్పవాడ్ని చెయ్యాలనుకున్నాడు. దేవుడొకలా అన్యాయం చేస్తే ఈ మనుషులొకలా చేస్తున్నారు.
ఉలిక్కి పడి లేచి టైమ్ చూసుకున్నాడు తాన్యా. ఐదు దాటింది. అంటే మూడు గంటలు పడుక్కున్నాడన్న మాట.
పిల్లలేం చేస్తున్నారో! పాపం అనిపించిందొక క్షణం. ఆకలేస్తోందో ఏమో.
ఏం చెయ్యాలో.. డాక్టర్ గారిచ్చిన లిస్ట్ ప్రకారం ఎప్పుడూ చేసే మెస్ అతనికి చెప్పేశాడు పొద్దున్నే. వారం రోజులకి సరిపోయే లిస్ట్ ఇచ్చేశాడు.
వెళ్లి తీసుకుని రావడమే.
లేచి ఒళ్లు విరుచుకుని అటూ ఇటూ చూశాడు. పిల్లలందరూ కూడా తలా ఒక చెట్టు నీడనా నిద్ర పోతున్నారు. లేపి, లోపలికి తీసుకెళ్లాడు. మంచినీళ్ల కుండ దగ్గరికి తీసుకెళ్లి తలా గ్లాసూ నీళ్లిచ్చాడు. ఆబగా తాగేశారందరూ.
అసలు పరుగులు పెట్టాక, ఆటలాడాకే పిచ్చిగా దాహం వేసింది. కానీ, జుట్టంకుల్ తలుపు తీస్తే కానీ లోపలికెళ్ల లేరెవరూ.
మర్నాటి నుంచీ, ఒక కుండ, గ్లాసులూ బైట కూడా పెట్టుకోవాలనుకున్నాడు తాన్యా. తాన్యాకి ముందు పనిచేసే వాడిని బాస్ పట్టుకు పోయాడు.. పిల్లల్ని బాగా చూస్తున్నాడని. రెట్టింపు జీతం ఇచ్చి. వాడు ఆనందంగా వెళ్లిపోయాడు.
“బాత్రూంలో కెళ్లి ఉస్సులేవైనా ఉంటే చూసుకుని, మోహాలు కడుక్కుని రండి. నేను డిన్నర్ తీసుకొస్తా.” తాళం వేసుకుని బైటికెళ్లాడు.
ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడుకుంటారేమో.. అనుమానం వచ్చింది. కానీ.. మాట్లాడుకుంటే మాత్రం ఏం చేస్తారు? ఏం చెయ్యగలరు? వాళ్లకీ తెల్సుగా.. బైటికెళ్లినా ఉంటానికిల్లు లేదని. తలెగరేసి, బండి ముందుకి పోనిచ్చాడు.
ఆనంద్, ఎందుకైనా పనికొస్తుందని, తాన్యాకి మోటర్ సైకిల్ నడపడం నేర్పించి, సెకండ్ హాండ్ మోపెడ్ కొనిచ్చాడు. దాని వల్ల ఎన్నో ఉపయోగాలు కనిపించాయి.
హాల్లో టీవీ ఆన్ చేశాడు చిన్నా.
అందరి దగ్గరికీ వెళ్లి పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు మాత్రం కళ్లు పెద్దవి చేసి చూస్తుండి పోయారు. మళయాళం, కన్నడం వాళ్లు. వాళ్లకి పేర్లు చెప్పటం కూడా తెలీలేదు. అంకెలసలే రావు. వయసెంతంటే కూడా చెప్పలేక పోయారు.
వాళ్ల భాష తప్ప ఏదీ రాదు.
వాళ్లని చూస్తూ చిన్నా ఆలోచన్లో మునిగి పోయాడు.
ఆ పిల్లలిద్దరికీ నాలుగేళ్లకి మించి ఉండవనుకున్నాడు.
తనకి మాత్రం పదకొండేళ్లు నిండినా పదహారేళ్ల తెలివుంది. తనని ఎప్పుడూ చూసే డాక్టర్ గారదే అన్నారు.
“చూడు బుల్లయ్యా! కొంతలో కొంత నయం. చిన్నాకి కాస్త మంచిరకం పొట్టితనం వచ్చింది.”
“అదేంటి డాట్రుగారూ! ఇందులో మంచీ చెడూ కూడా ఉంటయ్యా?” బుల్లయ్యకి సందేహం.. అసలీ విడ్డూరవే ఎక్కడా చూళ్లేదు.
చిన్నాని హాస్పిటల్లో చూసే డాక్టర్ గారు చాలా మంచివారు. ప్రతీ ఆదివారం బాబా గుడికొస్తారు డాక్టర్ గారు, ఆయన భార్య. అందుకే బుల్లయ్యకి బాగా చనువు. అతని దగ్గరే పువ్వులు కొంటారు, చిన్నాతో మాట్లాడుతూ.
“ఉన్నాయి బుల్లయ్యా! ఈ పొట్టితనంలో వందల రకాలు పైగా ఉన్నాయి. ప్రధానంగా డ్వార్ఫ్ లు, మిడ్గెట్ లు అని రెండు రకాలు. ఒక్క డ్వార్ఫిజమ్ లోనే రెండు వందల రకాలున్నాయి. చాలా మంది పొట్టి వాళ్లకి మిడ్గెట్ అని పిలుస్తే కోపం వస్తుంది. కానీ ఆ పొట్టి రకమే కాస్త మంచిది. మిడ్గెట్లని, బుల్లి మనుషులు అని పిలవమంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా. డ్వార్ఫ్ లని కూడా బుల్లి మనుషులనే అంటారనుకో..”
“అసల్కి అలా ఎందుకవుతారయ్యగారూ?”
“పుట్టుకతో వచ్చిన జన్యులోపం వల్ల. ఆ లోపం ఎందుకొస్తుందంటే.. ఏం చెప్పలేం. ఆ దేవుడి మాయ.. ఆ సర్వేశ్వరుడి సంకల్పం అనే చెప్పాలి. మన శరీరంలో క్రోమోజోములని కొన్ని పదార్ధాలుంటాయి. వాటిలో ఒక క్రోమోజోమ్ సరిగ్గా లేక పోవడం వల్ల పెరగుదల మీద దాని ప్రభావం పడుతుంది. దానిని సరి చెయ్యడం మానవ మాత్రుల తరం కాదు.”
“మరి ఈ మంచి పొట్టాళ్లు..”
“అలా అనకూడదు బుల్లయ్యా! బుల్లి మనుషులు అనాలి. ఇంగ్లీష్ లో లిటిల్ పర్సన్స్ అంటారు. వాళ్లని కూడా మామూలు మనుషుల్లాగే చూడాలి. వింతగా, లేదా జాలిగా చూడ కూడదు.”
“అలాగే డాట్రు గారూ. నా కొడుకే అలా ఉన్నప్పుడు నేనెందుకు వేరుగా చూస్తాను?”
“నువ్వే కాదు. మీ బంధు మిత్రులందరికీ చెప్పాలి. చిన్నా చాలా తెలివైన వాడు. తప్పకుండా పెద్ద పేరు తెచ్చుకుంటాడు. ఒక రోజు వాడి మూలంగా మీకు గుర్తింపు వస్తుంది చూడు.”
“అంత కంటే కావలసిందే ముంది బాబూ! ఈ తేడా లేంటో.. మా వోడు మంచి బుల్లి మనిషెలా గయ్యాడో..”
డాక్టర్ ప్రకాశ్ కి నవ్వొచ్చింది మంచి బుల్లి మనిషని అంటుంటే..
“అదే.. చెప్తున్నా. డ్వార్ఫ్ పీపుల్ కి అవయవాలు సమంగా ఉండవు. అంటే సమతూకంగా ఉండవు. ఒకో అవయవం ఒకోలా ఎదుగుతుంది. తల పెద్దగా అవుతుంది. మెడ కనిపించదు. కాళ్లు చేతులూ లావుగా ఉంటాయి. వంకర టింకరగా నడుస్తారు. ఎముకలు సరిగ్గా.. ఒక తీరుగా పెరగవు. వికారంగా ఉంటాయి. వెన్నెముక వంగిపోతుంటుంది”
“చిన్నా! నువ్వు బైట కూర్చుంటావా?” అక్కడే కూర్చుని ఆసక్తిగా వింటున్న చిన్నాని అడిగాడు బుల్లయ్య. తనకే వినడానికి ఇంత బాధగా ఉంటే.. చంటోడు, వాడికెలా ఉంటుందీ.. ఎలా తట్టుకుంటాడూ.
“ఫర్లేదు నాన్నా..” చిన్నా కదల్లేదు.
“విననీ బుల్లయ్యా! చిన్నా బాగా తట్టుకుంటున్నాడు తన స్థితిని. అర్ధం చేసుకుంటే మంచిదే..” డాక్టర్ ప్రకాశ్ అన్నాడు.
“అలాగే నండీ.. ఇంకా ఏమవుతుంది..”
“కీళ్ల నొప్పులు.. అదే జాయింట్ పెయిన్స్, నరాలు నొక్కుకు పోతుంటాయి.. అంటే జామ్ అయిపోతాయి. దాని వల్ల రకరకాల సమస్యలొస్తాయి. ఒక కాలు పొట్టిగా, ఇంకొక కాలు కొంచెం పొడుగ్గా.. అలాగన్న మాట. ఒకోసారి దురదలు.. ఒకటని కాదు. కొంత మందికి ఎప్పుడూ తలనొప్పి ఉంటుంది.”
“మరి ఆ రెండో రకం”
“మంచి బుల్లి మనిషా?” డాక్టర్ ప్రకాశ్ నవ్వాడు.
“నేను అదే కదండీ డాక్టర్ గారూ?” చిన్నా ముందుకి వంగాడు.
“అవును. మిడ్గెట్ అని రిఫర్ చేస్తే కోపాలొస్తాయి వాళ్లందరికీ.. కానీ మెడికల్ గా సమస్యలెక్కువగా రావు. మిడ్గెట్స్ మామూలు మనుషుల్లాగే ఉంటారు. అంటే.. పెరుగుదల మాత్రం ఆలిశ్యంగా ఉంటుంది.. కొన్నాళ్లయ్యాక ఆగి పోతుంది. అంతే. అవయవాలన్నీ సక్రమంగా ఉంటాయి. చెయ్యి, కాలు.. పైభాగాల కింది భాగాల నిష్పత్తి, నడుం పైభాగం, కింది బాగం అన్నీ సమతూకంగా ఉంటాయి. తల కూడా పెద్దగా అవదు. ఎప్పటికీ చిన్న పిల్లల్లాగే ఉంటారు. మొహం కూడా అంతగా ముదరదు.”
“చిన్నాకి అటువంటిదే అనీ.. ఆ సంగతెలా తెలిసిందండీ?” బుల్లయ్య కాస్త నెమ్మదించుకుని అడిగాడు.
“చూస్తున్నా కదా.. పదేళ్లు నిండినా, ఐదేళ్ల పిల్లవాడిలాగే ఉన్నాడు. కొద్దిగా కళ్లలో మెచ్యూరిటీ కనిపిస్తోందంతే. కండరాలు కూడా వయసుకి తగ్గట్లు గట్టి పడలేదు. ఈ పాటికి వెన్నెముక వంగడం మొదలు పెట్టాలి. అదేం లేదు. కొన్ని రక్త పరీక్షలు చేసి నిర్ధారించుకుందాము. ఇంకా అదృష్టం ఏమిటంటే.. బుర్ర వయసుకి తగ్గట్టు తయారవుతోంది.. అంటే బుర్రలో తెలివి.. మామూలు పిల్లలాగే, ఇంకా మాట్లాడితే కొంచెం ఎక్కువగానే ఉంది. అందుకని చిన్నా మామూలుగా స్కూల్ కి వెళ్లి చదువు కుని, తను అనుకున్నది సాధించ వచ్చు.”
“అంటే.. మా వోడు వామనుడాండీ.”
“సరిగ్గా చెప్పావు బుల్లయ్యా. చిన్నా వామనావతారమే. ఏం సాధిస్తాడో చూడాలి.” డాక్టర్ ప్రకాశ్ కళ్ల ముందు మెదిలాడు చిన్నాకి.
తలుపు చప్పుడైతే ఆలోచనల్లోంచి బైట పడ్డాడు చిన్నా.
“ఏం సాధిస్తానూ? ఇలా ఇక్కడ చిక్కుకు పోతే.. స్కూలు లేదు. చదువూ లేదు. ఇంజనీర్ అవడం మాట దేవుడెరుగు.. ఇంక కంప్యూటర్ తన జీవితంలో ఎప్పుడైనా కంట పడుతుందా అనేది అనుమానమే.” మనసులో ఏడుస్తూ అనుకున్నాడు.

*****

తాన్యా భోజనం పట్టుకుని వచ్చాడు.
తనకి కూడా తెచ్చుకున్నాడు.
“ఎవరైనా సాయం చెయ్యండిరా! మీ ఇళ్లల్లో ఇల్లాగే దర్జా వెలగ బెడ్తారా? చస్తున్నాను, ఒక్కడినీ చెయ్యలేక.”
విడి విడిగా అట్ట పెట్టెల్లో కట్టించి తెచ్చాడు.
తలా ఒక పాకెట్టియ్యడానికి కష్టమేంటో అనుకున్నాడు చిన్నా. లేచి అందరికీ ఒక్కో పాకెట్, చిన్న సీసాల్లో నీళ్లు అందించాడు.
మూలగా ఉన్న పెద్ద చాప తీసుకొచ్చి పరిచాడు తాన్యా.
అందరినీ కింద కూచుని జాగ్రత్తగా తినమన్నాడు. తను కూడా వాళ్లతో కూర్చుని తింటున్నాడు.
పిల్లలంతా ఆడి ఆడి అలసి పోయి, ఆకలి మీదున్నారేమో.. చకచకా తినేశారు.
నిజం చెప్పాలంటే, చిన్నాకి తప్ప మిగిలిన అందరికీ ఇక్కడే మంచి భోజనం దొరుకుతోంది. ఎక్కడా అడుక్కోక్కర్లేదు. ఒక రొట్టె ముక్కకి ఇంట్లో వాళ్లతో, బైటి పిల్లలతో కొట్లాడక్కర్లేదు. కడుపు నిండా తినగల్గుతున్నారు.
ఒక్క అమ్మ ప్రేమ తప్ప అన్నీ దొరుకుతున్నాయి. ఎన్నాళ్లు దొరుకుతాయా అనేది వేరే విషయం.
తమనేంచేస్తారా.. భవిష్యత్తేమిటా అనేది ఆలోచించగలిగే వయసెవరికీ లేదక్కడ. చిన్నాకి తప్ప.
రెండు రోజులు గడిచాయి.
చిన్నాకి పిచ్చెక్కినట్లుగా ఉంది. ఈ పాటికి కంప్యూటర్ టీచర్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్ నేర్పిస్తూ ఉండే వాళ్లు.
ఎంత టైమ్ వేస్ట్ అయిపోతోందో! ఏడుపొచ్చింది. పొద్దున్నే తినడానికిచ్చేసి వెళ్లిపోయాడు జుట్టంకుల్. కార్టూన్లు పెట్టేసి.
రోజువారీ చర్య అదే.
మధ్యాన్నం భోజనం వచ్చే వరకూ కార్టూన్లు చూడ్డమే. పిల్లలలో చాలా మందికి అక్షరాలు చదవడమే కాదు.. గుర్తు పట్టడం కూడా రాదు కనుక, వాళ్లకేం ఇబ్బంది లేదు. టింకూ కూడా ఆటల్లో పడి పోయాడు. హోంవర్క్ ఏం చేయ్యక్కర్లేదని.. హాయిగా ఉంది వాడికి.
టింకూని చూస్తుంటే కూడా బాధగా ఉంది. లెక్కలు బాగా చేస్తాడు వాడు. ఈ పాటికి ఫ్రాక్షన్స్ నేర్చుకునే వాడు.
కనీసం చాక్ పీస్ దొరికినా బాగుండును. గ్రౌండ్ లో అరుగు మీద గుర్తున్నవి రాసుకునే వాడు.
పిల్లలని, వాళ్లకి కావలసినప్పుడు గ్రౌండ్ లోకి వెళ్ల నియ్యమన్నాడు ఆనంద్. లేకపోతే పంజరంలో బంధింపబడ్డ జంతువుల్లా ఐపోతారని.
“కేజ్ ఫ్రీ చికెన్స్ లాగ ఉండాలి. వాటి గుడ్లనీ, చికెన్లనీ కూడా రెట్టింపు డబ్బులిచ్చి కొంటారు. అదే విధంగా మన పిల్లలు కూడా యాక్టివ్ గా ఉండాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి.” బోధించాడు ఆనంద్.
నిజవే.. కోడిపిల్లలకీ ఈళ్లకీ తేడా లేదనుకున్నాడు తాన్యా.
చిన్నా గ్రౌండ్ లోకి పరుగెత్తాడు. వాడికి ఉన్నట్లుండి ఐడియా వచ్చింది.
కబడీ ఆడే చోట అంతా ఇసుకే కదా! అందులో వేలితో రాసుకుంటే.. అలాగే వెళ్లి.. చేత్తో చదును చేసి రాయడం మొదలు పెట్టాడు. ఏం రాయాలి?
ఇంగ్లీష్ పాఠం గుర్తు తెచ్చుకుని, తనే ప్రశ్నలు రాసుకుని, ఆన్సర్లు రాయ సాగాడు. కొంచె సేపటికి విసుగొచ్చింది. పెద్ద పెద్ద అక్షరాలు రాయాలి. ఒక వాక్యం రాయడానికే ఆరు సార్లు లేవాలి.
పైగా పైనించి ఎండ దంచేస్తోంది.
విసుగొచ్చి, లేచి లోపలికెళ్లి పోయాడు. వెళ్లే ముందు తను రాసింది తుడిపెయ్యడం మర్చి పోలేదు.
పిల్లలంతా కార్టూన్లో ములిగిపోయున్నారు. హాల్లోనే కాసేపు అటూ ఇటూ తిరిగాడు చిన్నా. వీధిలోదీ, గ్రౌండ్ లోకెళ్లేదీ కాక, మొత్తం ఆరు తలుపులున్నాయి హాల్లో. ఒక్కొక్కటీ తెరిచి చూశాడు.
ఒక తలుపు వంటింట్లోకి.. అక్కడ ఒక ఫ్రిజ్, స్టౌ.. గాజు తలుపులున్న అలమార్లలో గిన్నెలు, పళ్లాలు ఆవీ ఉన్నాయి. ఎప్పుడూ ఎవరూ వాడినట్లు లేదు. ఒక మూల ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు.. చెంచాలు.
రెండు తలుపులు గదుల్లోకి.. అవి తమ గదిలాగే ఉన్నాయి. మిగిలిన నలుగురూ అక్కడుంటారనుకున్నాడు చిన్నా.
ఇంకొకటి సరే.. తమ గది.
మిగిలిన రెండు తలుపులూ లాగితే రాలేదు. తాళాలేసున్నాయి. అవి తియ్యగలుగుతే ఏవన్నా తెలుస్తుంది. అక్కడ కంప్యూటర్ ఉంటే.. సరస్వతీ టీచర్ గారికి మెస్సేజ్ పంపచ్చు. మళ్లీ గుర్తుకొచ్చింది, నెట్ కూడా ఉండాలని.
పైగా తామెక్కడున్నారో.. అడ్రస్ అదీ ఏం తెలీదు. ఏమని ఇస్తాడు..
వీధి తలుపు చప్పుడవుతుంటే పరుగున వెళ్లి సోఫాలో కూర్చున్నాడు.. అదే కార్టూన్ ఎనిమిదోసారి చూస్తూ.. పోనీ అదయినా మార్చచ్చు కదా!
అడుగుతే ఏమంటారో..
గుడ్ అంకుల్ వచ్చినప్పుడు అడగాలి.
‘ఛ..ఛ వాడు గుడ్ ఏంటి.. వెరీ బాడ్ అంకుల్.’ చీదరగా అనుకున్నాడు మళ్లీ చిన్నా..
తలుపు తీసుకుని వచ్చారు ఆనంద్, తాన్యా.
ఈసారి టింకూ పరుగెత్తుకుని వెళ్లలేదు. తల కూడా కదిపి చూడలేదు. వాడి చిన్ని బుర్రకి కూడా అర్ధమయిపోయింది. ఇంక తమని ఇంటికి పంపరని.
“చూడండి మీకోసం ఏం తెచ్చానో?” ఉత్సాహంగా అన్నాడు ఆనంద్.
పిల్లలు మాత్రం నిరుత్సాహంగా చూశారు.
ఆనంద్ చేతిలో గోళీల సంచీ. వీధి పిల్లలు ఆడే ఆట. గోళీల కోసం చేతులు కాళ్లు కూడా విరుచుకున్న వాళ్లు తెలుసతనికి.
కిషన్ లేచి వెళ్లాడు.
“వీడికొక్కడికే వచ్చినట్లుందిరా ఈ ఆట.. పోన్లే.. నువ్వే నేర్పించి, ఆడించు. మీకందరికీ కొత్త పేర్లు పెడుతున్నాను. చిన్నా పేరు సమీర్. టింకూ పేరు సుభానీ. కిషన్ పేరు కృష్ణ. వీళ్ల పేర్లు నయీమ్, సిరాజ్, తబ్రీజ్. అందరూ గుర్తు పెట్టుకోండి. ఎవరడిగినా అవే పేర్లు చెప్పాలి. ఆ పేర్లతో పిలుస్తే పలకాలి. తెలిసిందా?” ఆనంద్ ఒక్కొక్కళ్ల దగ్గరికీ వెళ్లి చెప్పాడు.
“రేపు అందరికీ క్షవరం చెయ్యి. కొంచెం జుట్టుంచి మిలట్రీ కట్ లాగ చెయ్యి.” తాన్యాకి సూచనలిచ్చాడు.
“టివీలో ఇంకేవైనా పెడితే బాగుంటుందండీ. ఒకటే కార్టూన్ చూసి చూసి విసుగొస్తోందండి అందరికీ.” తాన్యా అడిగాడు.
“వాళ్లకా నీకా? సర్లే రేపు, వేరే కార్టూన్లు, మంచి మసాలా సినిమాల డివిడీలు తెచ్చి పడేస్తా.” నవ్వుతూ అన్నాడు ఆనంద్.
తాన్యా కూడా నవ్వాడు.
పిల్లలు ఆశ్చర్యంగా వాళ్లనే చూస్తున్నారు. ఇలా నవ్వగా ఎప్పుడూ చూడలేదు ఎవరూ మరి. చిన్నా మిగిలిన పిల్లల్నే అనుకరిస్తున్నాడు. తన స్వంత తెలివి బైట పెట్టడం లేదు.
“గోళీలాడుకుందాం వస్తారా?” హుషారుగా అడిగాడు ఆనంద్.
పిల్లలు లేచి గ్రౌండ్ లోకి నడిచారు.
“కృష్ణా! ఇట్రా.. గుంత తవ్వు. అందరికీ నేర్పిద్దాం. చాలా బాగుంటుంది తెలుసా? గురి చూసి కొట్టాలి. ఎన్ని గోళీలు కొట్ట గలుగుతే అక్కడున్నవన్నీ కొట్టిన వాళ్లకొచ్చేస్తాయి.” కాసేపు వాళ్లతో గడిపి వెళ్లాడు ఆనంద్.
మర్నాడు కొత్త డివిడీలొచ్చాయి.
సినిమాలు, కార్టూన్లు, పాటలు.. సమయం బాగా గడుస్తోంది అందరికీ.. చిన్నాకి తప్ప.
………………..
బుల్లయ్య నీరసంగా బయలుదేరాడు, బండి తోసుకుంటూ. ఏది చూసినా చిన్నాగాడే కనిపిస్తున్నాడు.
పది రోజులయిపోయింది. పిల్లల జాడ తెలియలేదు.
రోజూ పోలీస్ స్టేషన్ కెళ్లి వస్తున్నాడు.
“అన్ని చోట్లా తిరగేశాం బుల్లయ్యా! ఎక్కడా ఏ క్లూ అందటం లేదు. ఇంకో పదిరోజులు చూసి, కేసు మూసేస్తానంటన్నారు సి.ఐ గారు.” సబిన్స్పెక్టర్ చెప్పేశాడు.
కళ్లలో నీళ్లు కుక్కుకుని ఇంటికెళ్లిపోయాడు. ఇంట్లో నాలుగు రోజులు పొయ్యిలో పిల్లి లేవలేదు. చుట్టు పక్కల వాళ్లు రెండ్రోజులు సాయం చేసి ఊరుకున్నారు.
అందరివీ అంతంత మాత్రం బతుకులే. ఎక్కడ్నించి తెచ్చి పెడతారు?
జానీ ఆంటీ ఏడుస్తూనే పన్లు చేసుకుంటోంది. మిగిలిన పిల్లల సంగతి చూడాలి కదా మరి.
మస్తానయ్య పిల్లలు వెళ్లిన మర్నాటి నుంచే అయిపు లేడు. జానీకి అలవాటే.. వాడట్టా నెలా రెణ్ణెళ్లు మాయమై పోటం.
సరస్వతీ టీచర్ అప్పుడప్పుడొచ్చి అడుగుతుంటుంది.
“ఎప్పటికైనా ఆడు తిరిగొత్తాడ్రా! అప్పుడు మనం ప్రాణాల్తో ఉండాలి కదా! మనం మామూలుగా పన్లలో పడాలి. గుక్కెడు చాయ్ పడకపోతే ఇంక ప్రాణం పొయ్యేట్టుంది. లేవండి. అమ్మాయ్.. లే.” తల్లి గోలకి తప్పదన్నట్లు లేచాడు బుల్లయ్య.
సూరమ్మ కూడా, కడుపులో పేగులు ఉండ చుట్టుకు పోతుంటే, చాపమీంచి లేచి నిలబడింది. కళ్లు గిర్రున తిరిగాయి.
ముసలామె చెప్పిన మాట నిజమే. చిన్నా వచ్చేటప్పటికి తాము బతికుండాలి. అమ్మా, నాయనా కనిపించకపోతే ఎర్రినాగన్న ఎక్కడికి పోతాడూ! జుట్టు ముడేసుకుని, టీకి నీళ్లు పడేసి దొడ్లోకెళ్లింది.

మస్తానయ్య తను మొదటగా రాజాని కలిసిన జాగాకెళ్లి వెతికాడు..
రాజా కానీ, నానా కానీ కనిపిస్తారేమోనని. అటు కిలో మీటరూ, ఇటు కిలోమీటరూ వెతికినా కనిపించ లేదు.
యాభైవేలు వస్తున్నాయన్న ఉత్సాహంలో రాజాగాడి అడ్రస్ కనుక్కోలేదు. నానా ఎవరో అసలే తెలియదు. కనీసం కొంత అడ్వాన్స్ అన్నా తీసుకోవలసింది.
పైగా.. రాజాగాడే అన్నాడు.. “రోజూ ఈ బడ్డీ దగ్గరే కూకుంటా అన్నా..” అని.
అక్కడికీ పదిరోజులుగా కనిపించిన అందర్నీ అడుగుతూనే ఉన్నాడు. అందరూ తల అడ్డంగా ఊపే వాళ్లే. ఆడు అయిపులేడు. అటు పిల్లాడూ కనిపించకుండా పోయాడు.
ఛెళ్లుమని ఎవరో వీపుమీద కొట్టినట్టయింది.
‘ఒక్క నీ పిల్లాడేనా..’
మద్దిలో ఆ చిన్నాగాడ్నెందుకెత్తుకెళ్లారూ? అదో లేని పోని గోల కింద తయారైంది.
పొరపాట్న ఎవరికైనా తెలిసిందంటే బస్తీలో.. చంపేస్తారు తన్ని.
అప్పుడు.. ఏడుపొచ్చింది మస్తానయ్యకి. పాముని పెంచుతే ఊరుకుంటుందా? కనిపించినోళ్లందర్నీ కాటెయ్యదూ?
చెట్టుకిందికెళ్లి, నేల మీద కూర్చుని భోరుమన్నాడు.
తిండితిని రెండ్రోజులయింది. జేబులో డబ్బులున్నాయి కనుక అప్పటి వరకూ బళ్లదగ్గిర అవీ ఇవీ తిని కడుపు నింపుకున్నాడు.
అయిపోయింది. చేతిలో డబ్బూ.. ఇంట్లో స్థానం.
ఏ మొహం పెట్టుకునెళ్తాడూ?
అవునూ.. ఆ ఇల్లు తనది కాదూ? ఎవరు రావద్దంటారు.. అలా అంటే కాళ్లిరగ్గొట్టి పొయ్యిలో పెట్టలేడా? తల విదిలించుకుని ఇంటికి బయల్దేరాడు మస్తానయ్య.
దారిలో ఎదురయ్యాడు పెద్ద మేస్త్రి.
“కొత్త కాంప్లెక్సు వస్తా ఉంది మస్తానయ్యా! నువ్వుగానీ చేర్తావా మాతో? ఒక్క రోజుకూడా నాగా పెట్టకూడదు. ఆదివారాలు కూడా పన్చెయ్యాలి. డబ్బులు బాగా వస్తాయనుకో?”
దేవుడే కనిపించి వరమిచ్చినట్టయింది. అప్పటికి పాత పన్లు అయిపోయి చాలా రోజులయింది. అక్కడా అక్కడా చిన్నా చితకా పన్లు చేసుకుని కాలక్షేపం చేస్తున్నాడు.
జానీ గోలెట్టేస్తోంది. డబ్బు చాలట్లేదని.
ఈ పైసలు దొరికి శనారం శనారం ఐదారొందలు పడేశాడంటే డబ్బుకి ఢోకా ఉండదు. కాస్త ఈ టింకూ గాడి గోల కూడా సద్దుమణుగుతుంది.
ఏ మాటకామాటే.. మస్తానయ్యలో మంచి పనితనం ఉంది. లేబరు చేత కూడా బాగా పని చేయిస్తాడు.
“అట్టగే వస్తానయ్యా. ఇంకెవరికీ చెప్పమాకండి.” ఇంచుమించు ఏడుపు గొంతుతో అన్నాడు. కొంత ఇంట్లో పరిస్థితికి, కొంత ఆ రాజాగాడు మోసం చేశాడన్న బాధ.. కొంత పని దొరికిందన్న ఆనందంతో.. ఏడుపొచ్చేసింది. రోజూ కాసిని చుక్కలేసుకోవచ్చు.
“ఐతే రేప్పొద్దున్నే ఏడింటికల్లా వచ్చెయ్యి. శంకుస్థాపన ఏడున్నరకి అది అయ్యాక ముగ్గులెయ్యాలి. ఎల్లుండి నుంచే పునాదులు మొదలెట్టాలి. నీకు తెలిసిన లేబరుని కూడా పిల్చుకురా.” మేస్త్రి హడావుడిగా వెళ్లి పోయాడు.
మస్తానయ్య హుషారుగా ఇంటికి బయల్దేరాడు.

“జానీ! ఊరంతా వెదికానే.. ఎక్కడా కన్పడ లేదు.”
నిస్తేజమైన చూపుల్తో చూసింది జానీ.
“ఎప్పుడో ఊరు దాటించేసుంటార్లే. నీకు తెల్దూ ఆళ్లెవరో?”
“ఏం మాట్లాడ్తన్నావే.. నా కెట్టా తెలుస్తుందీ? రేపట్నుంచీ ఫుల్లు పనే. ఆరింటికల్లా బయల్దేరాలి. కొత్త కాంప్లెక్స్. రెండేళ్ల వరకూ చూసుకోక్కర్లేదు. టింకూగాడు లేపోతే లేపోయాడు. మిగిలినోళ్ల మాటేటి.. ఆళ్లని చూసుకోవద్దూ? ఆళ్లేమైపోతారు? ఆళ్ల చదువులు అవీ..”
“ఆహా.. ఏం బాద్యత? ఏం శ్రద్ధ.. ఎక్కడా ఇంత మంచి మొగోణ్ణి చూడం. మళ్లీ రేత్రైతే కల్లుపాకలే కన్పిస్తాయి. పెళ్లాం పిల్లలూ అంతా హుళ్లక్కే..” జానీ గట్టిగా అరిచింది.
“అరవమాకే.. ఇంక కల్లు జోలికెళ్లను. సత్తెపామాణికంగా. శనారం నువ్వే వచ్చి మేస్త్రి దగ్గర డబ్బులు తీసుకో. మొత్తం నువ్వే నడిపియ్యి.”
కళ్లు విప్పార్చి ఆశ్చర్యంగా చూసింది జానీ.
“అబ్బో అబ్బో.. ఎన్నిసార్లవలేదూ!”
“నిజవే.. నీమీదొట్టు.”
“చూద్దాంగా.. వారం రోజుల్లో తేలిపోదూ?”
………………..
3

పిల్లలందరినీ వరుసగా నిలబెట్టాడు తాన్యా.
డాక్టర్ వచ్చి కొలతలు తీసుకున్నాడు.
“అందరూ సరైన కొలతల్లో ఉన్నారు. తాన్యా చాలా బాగా చూసుకున్నాడు. అభినందనలు తాన్యా! కృష్ణ.. అదే కిషన్ కూడా బరువు తగ్గాడు. ఇంక మీరు తలుచుకున్న పని మొదలు పెట్టచ్చు.
చిన్నా, టింకూలు ఆనంద్ దగ్గరకు వచ్చి రెండు నెలలయింది.
రోజూ మంచి ఆహారం, వ్యాయమం.. పిల్లల్ని బాగా తయారు చేశాయి. టివీ.. అదే డివిడి లో చూసే సినిమాలు, కార్టూన్లూ సరే సరి..మంచి కాలక్షేపం.
చిన్నా బతిమిలాడితే, ఒక నోట్ బుక్, పెన్సిల్ తెచ్చిచ్చాడు తాన్యా.. బొమ్మలు గీసుకుంటానంటే. బొమ్మలతో పాటు తమ రోజువారీ కార్యక్రమాలన్నీ రాయసాగాడు.
ప్రతీ వారం వచ్చి ఆనంద్ చెప్పే జాగ్రత్తలు, పాఠాలు.. అన్నీ రాశాడు. ఐనా.. రోజూ జరిగేదొక్కటే. రెండు కాగితాల్లో సరిపోయింది అంతా.
టింకూ కూడా ఏడవడం మానేశాడు. నయీమ్, సిరాజ్, తబ్రీజ్ లు కూడా కాస్త్త నవ్వడం, చిన్న చిన్న మాటలు మాట్లాడ్డం నేర్చుకున్నారు.
చిన్నా ఊహించినట్లే వాళ్లకి నాలుగేళ్లు నిండలేదింకా.
తాన్యా పెట్టిన తిండి తింటుంటే, కాస్త బుగ్గలు, ముఖంలో మెరుపు వచ్చాయి. ముద్దు ముద్దుగా చిన్నా దగ్గరకొచ్చి ఏవేవో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకి తెలుగు నేర్పించాడు చిన్నా. కొన్ని పదాలు దక్షిణాది భాషల్లో ఇంచుమించు ఒకేలాగుంటాయి కనుక, బాగానే పట్టుకుంటున్నారు.
ఏం చేసినా, తాన్యా బైటికెళ్లినప్పుడే.
లేకపోతే ఈ పాటికి క్షుణ్ణంగా మాట్లాడ గలిగే వాళ్లు.
ఇంట్లో ఉన్నంత సేపూ ఉష్ట్ర పక్షిలా కాచుకునే ఉంటాడు తాన్యా.
డాక్టర్ ఉండగానే వచ్చాడు ఆనంద్.
“థాంక్యూ డాక్టర్. ఇదిగో మీకు ఇస్తామన్న మనీ. అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటే.. లేని పోని ఆరాలొస్తాయి. అవసరమైనప్పుడు మళ్లీ పిలుస్తాను. మీకు బాగా తెలుసు కదా.. సీక్రెసీ.. కొంచెం కూడా లీక్ అవకూడదు. పై వాళ్లు మన కదలికలు చూస్తూనే ఉంటారు. మన ఫామిలీల వివరాలు కూడా వాళ్ల దగ్గిర ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సారి ఈ పనులు వప్పుకుంటే.. ఇంక వదుల్చుకోడానికి ఉండదు. వన్ వే ఎంట్రీనే.”
ఆనంద్ మాటలకి తల పంకించి వెళ్లి పోయాడు డాక్టరు. ఆనంద్ తన గదిలోకెళ్లి కాసేపు ఏదో పనిచేసుకునొచ్చాడు.
పిల్లల్ని ఒకసారి చూస్తుండగానే సెల్ మోగింది. జేబులోంచి తీస్తూ తలుపు దగ్గరగా వెళ్లాడు, బైటికెళ్లి మాట్లాడ్డానికి.
అప్పుడే.. జేబులోంచి ఏదో జారిపోయింది.
ఆనంద్ బైటికెళ్లగానే, చిన్నా గబగబా వెళ్లి కింద పడిందేమిటా అని చూశాడు.
విజిటింగ్ కార్డ్..
చటుక్కున తీసి, తమ గదిలోకి తుర్రుమన్నాడు. తన డ్రాయింగ్ బుక్ తీసి ఒక బొమ్మ లో అడ్రస్, ఫోన్ నంబర్ రాసేశాడు. ఎపరైనా చూసినా అందులో ఏదో రాశాడని కనిపించదు.
బైటికి రాగానే, తలుపు దగ్గర ఆ కార్డ్ ని పడేశాడు.
చిన్నాకి తెలివి, సమయస్ఫూర్తి చాలా ఎక్కువ. అందుకే సరస్వతీ టీచర్ వాడి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంటుంది. విజ్ఞానాన్ని పెంచే అన్ని రకాల పుస్తకాలనీ పరిచయం చేసింది.
తాన్యా బైటికి వెళ్లి ఆరు సూట్ కేసులు, ఇంకా కొన్ని బట్టల పాకెట్ లు తీసుకొచ్చాడు. పిల్లలంతా అప్పటి వరకూ రెండే జతల బట్టలతో గడుపుతున్నారు. రోజూ వాడి వాడి, అవి కూడా అరిగి పోయాయి.
ఒక్కొక్క సంచీలో, నాలుగేసి జతల బట్టలున్నాయి. సరిగ్గా సరిపోయే సైజులు. సంచీ మీద పేర్లు రాసున్నాయి.
అందరినీ పేరు పేరునా పిలిచి ఒక బట్టల సంచీ, ఒక సూట్ కేసు ఇచ్చాడు ఆనంద్.
“రెండు మూడు రోజుల్లో మీరు ఇక్కడి నుంచి వెళ్లి పోతున్నారు. మీరంతా ఒకే చోటుకి వెళ్లకపోవచ్చు. ఎక్కడికెళ్తారో నాక్కూడా తెలియదు. ఇద్దరిద్దరికి ఒక్కొక్క అమ్మా నాన్నా ఉంటారు. ఇప్పటికి మీరు వాళ్ల పిల్లలన్న మాట. వాళ్లతోనే ఉండి, వాళ్లు చెప్పినట్లు వినాలి. మీకు పాస్ పోర్ట్ లు తయారు చేసి ఆ టెంపరరీ అమ్మా నాన్నలకిచ్చాను. ఏ దేశం వెళ్తున్నారో.. మీ మీ అదృష్టం. మీరు ఏ పనులు చేస్తారో, అదే.. మీ చేత ఏం చేయిస్తారో, నాకు తెలియదు. జాగ్రత్తగా.. ఎవరి దగ్గరుంటే వాళ్లు చెప్పిన మాట వినాలి. వినక పోతే చాలా ప్రమాదం. అర్ధమయింది కదా! మిమ్మల్ని ఇంక నేను కలవక పోవచ్చు. బైబై..”
ఆనంద్ ఏడెనిమిది భాషల్లో సంభాషించ గలడు. ఏ భాష పిల్లవాడితో ఆ భాషలో అర్ధమయేట్లు చెప్పాడు.
“విమానం ఎక్కి వెళ్తామా అంకుల్?” కిషన్ అడిగాడు.
“అయుండచ్చు. ఎందులో ఎక్కడికి తీసుకెళ్తారో నాకు తెలీదని చెప్పాగా? ఉంటాను. గుడ్ బై.” వాళ్లకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలనిపించలేదు. వాళ్ల చేత చేయించబోయే పనులు ఏవో తెలియక పోయినా..
అంత ఆనందం కలిగించే పనులు మాత్రం కాదని మాత్రం తెలుసు.
వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లి పోయాడు ఆనంద్..
చిన్నా, టింకూ.. మిగిలిన పిల్లలకీ ఏదో తెలియని భవిష్యత్తుని నిర్దేశించి.
…………………..

రాజీవ్ గాంధీ విమానాశ్రయం..
అర్ధ రాత్రి ఒంటిగంట దాటింది. కానీ అక్కడ పట్ట పగల్లాగే ఉంది. లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి.
టింకూ, చిన్నాల చెయ్యి పట్టుకుని ఒక స్త్రీ నడుస్తోంది.
టింకూ విమానాశ్రయాన్నీ, అటూ ఇటూ చకచకా తిరిగే మనుషుల్నీ కళ్లు విప్పార్చి చూస్తున్నాడు.
చిన్నా మాత్రం, తన చెయ్యి పట్టుకున్నావిడని పరికిస్తున్నాడు.
నలభై ఏళ్లుంటాయి. ఈవిడే మీ అమ్మ అని చెప్పాడు జుట్టంకుల్.
“ఏ మాత్రం అనుమానం కలిగేలాగ ఉండకూడదు. బిహేవ్ చెయ్యకూడదు. సుభానీ అదే టింకూ, చిన్నా అంటే సమీర్, వాళ్లిద్దరికీ ఒక అమ్మ. కృష్ణకి ఒకామె. మీరు ముగ్గురూ కలిసి వెళ్తున్నారు.
నయీమ్ వాళ్లు వేరే వాళ్లతో.. మీరు ఒకరికొకరు ఎదురు పడినా పలకరించుకోకూడదు. తెలియని వాళ్లలాగే ఉండాలి.” రెండురోజులు అందరికీ బోధ చేశాడు తాన్యా.
అలాగే అని తలూపారందరూ, గుండెలు దడదడలాడుతుండగా.
కొత్త చోటులో.. ఎలా ఉంటుందో? అమ్మ వెనుక గారాలు పోయే వయసులో, చిన్ని గుండెల్లో గుబులు.
కొత్త సూట్ కేసు లాక్కుంటూ ఎయిర్ లైన్స్ క్యూలో నిల్చున్నారు.. చిన్నా, టింకూ. కొత్తమ్మ వెనుకనే.
“మమ్మీ!” పిలిచాడు చిన్నా.
వెనక్కి తిరిగి కిందికి చూసింది ‘మమ్మీ’.
“రెస్ట్ రూమ్..” పిల్లలందరికీ ఈ మాటలన్నీ నేర్పించాడు ఆనంద్. ఎలా పలకాలో కూడా చెప్పాడు. చెప్పడమే కాదు.. రోజూ పలికించే వాడు కూడా.
అటూ ఇటూ పరికించింది. పిల్లలని ఒక్కొళ్లనీ ఎక్కడికీ పంపడానికి వీల్లేదు. వంటరిగా వదలడానికి అసలే లేదు.
క్యూ రానురాను పెరిగి పోతోంది.
“పిల్లలంతే.. సరిగ్గా సమయం చూసుకుని వస్తుంది వాళ్లకి. ఒక్కదానివే పిల్లలతో వెళ్తున్నావా?” వాళ్ల ముందున్నావిడ నవ్వుతూ అంది.
“అవునండీ. కాస్త సామాను చూస్తుంటారా?”
సరే అందావిడ. వాళ్ల వంతు రావడానికింకా అరగంట పట్టేట్టుంది.
ఇద్దర్నీ చెరో చేత్తో నడిపించుకుంటూ టాయిలెట్ల కేసి నడిచింది కొత్తమ్మ. చిన్నా ఎగురుతూ నడుస్తున్నాడు. మధ్య మధ్య టింకూని కవ్విస్తూ. టింకూ మమ్మీ చెయ్యి విదిల్చుకుని గుండ్రంగా పరుగెత్తాడు.
“హే.. గోల చెయ్యకుండా పదండి..సరిగ్గా క్యూలో ఉన్నప్పుడే వస్తుంది. సెక్యూరిటీ చెక్ అయ్యాక రెండుగంటలు టైముంటుంది. అప్పటి వరకూ ఆగలేరా..” మమ్మీ చిరాకు పడింది.
అదంతా కూడా ట్రయినింగ్ లో భాగమే. మరీ క్రమశిక్షణతో, నోరు మెదపకుండా జైలుకెళ్తున్న ఖైదీల్లాగ నడుస్తే అనుమానం వచ్చే అవకాశం ఉంది. పిల్లలన్నాక అల్లరి చెయ్యాలి. అది చూసి అమ్మ కసురుకోవాలి.
టింకూ బుద్ధిగా వచ్చి అమ్మ చెయ్యి పట్టుకున్నాడు.
ఆడవాళ్ల టాయిలెట్ కేసి నడిచింది మమ్మీ. చిన్నా గొడవ చేశాడు.. తను మగవాళ్ల దాంట్లోకే వెళ్తానని. ఎంత కసిరినా.. నచ్చ చెప్పినా వినలేదు. కొత్తమ్మకేమో భయం. అలా పంపకూడదు. అక్కడెవరితోనో మాటలు పెట్టుకుంటే.. మొత్తం ప్లాన్ అంతా తలకిందులవుతుంది.
చిన్నా వినట్లేదు. “షేమ్ షేమ్ మమ్మీ..” నేనక్కడికే వెళ్తా.
అదంతా చూస్తున్న ఒక యువకుడు ముందుకొచ్చాడు నవ్వుకుంటూ.
“నేను తీసికెళ్తానాంటీ. మీకేం భయం లేదు. నా సామాన్లు మీరు చూస్తుండండి.”
కొత్తమ్మకింక వేరే దారి లేదు.
ఈ పిల్లవెధవ కొంప ముంచేట్లున్నాడు. అటూ ఇటూ అయిందంటే అందరి పనీ అయిపోతుంది. ఏమనడానికీ లేదు.. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో, చిన్నాని కొరకొర చూస్తూ సరే అంది.
“అంకుల్ ని విసిగించకు, నీ వాగుడుతో..” వార్నింగిచ్చింది.
“ఓ.. అలాగే..”
చిన్నాకి మంచి అవకాశం. ఈ అంకుల్ కి జరిగిందంతా చెప్పేస్తే.. పోలీసులకి చెప్తాడు కదా! అప్పుడు టింకూ, తనూ ఇంటికెళ్లి పోవచ్చు.
కానీ.. గుడ్ అంకుల్ హెచ్చరికలు గుర్తుకొచ్చాయి.
“మీరు ఎవరికైనా చెప్పారంటే.. మిమ్మల్ని అక్కడే చంపేస్తారు. మీకు సాయం చేసే వాళ్లని కూడా. అంతే కాదు.. మీ అమ్మా నాన్నలని కూడా చంపేస్తారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. మీ కొత్త అమ్మలు చెప్పినట్లు వినండి.” ఆనంద్ ఎప్పుడూ అంతే. పిల్లలకి అర్ధంమవుతోందా లేదా అని చూడడు. తను చెప్ప దల్చుకున్నదంతా చెప్పేస్తాడు.
అతను నెమ్మదిగా కళ్లలోకి చూస్తూ చెప్పే విధానం పెద్ద వాళ్లకే వణుకు పుట్టిస్తుంది.
అందులోనూ.. చంపెయ్యడం అనే మాట అర్ధం కాని వాళ్లుండరు కదా!
చిన్నా మారు మాట్లాడకుండా పని ముగించుకుని బైటికొచ్చాడు.
“నువ్వుకూడా వెళ్తావా?” టింకూని అడిగింది మమ్మీ.
తల అడ్డంగా ఊపి ఆవిడ చెయ్యి పట్టుకున్నాడు వాడు.
క్యూలో తమ వంతు వచ్చింది. కుతూహలంగా చూస్తున్నాడు చిన్నా.. ఏం చేస్తారా అని.
టింకూ మాత్రం ఎయిర్ పోర్ట్ అంతా ఇంకా సంభ్రమంగా చూస్తూనే ఉన్నాడు. కళ్లు మిరుమెట్లు కొలిపే లైట్లు, అటూ ఇటూ హడావుడిగా పరుగెత్తే జనం.. వాడికి మిగిలిన విషయాలన్నీ పట్టించుకునే వయసు లేదు.
మూడు పాస్ పోర్ట్ లూ తీసింది మమ్మీ. కౌంటర్ దగ్గరున్నతను తీసి, వాటిని కంఫ్యూటర్ కి చూపిస్తూ ప్రశ్నలడగటం మొదలెయ్యాడు.
“ఇదే ఫస్ట్ టైమా?”
తలూపింది. సాధ్యమయినంత తక్కువ మాట్లాడమని ఆర్డర్.
“మీ వారేంచేస్తారక్కడ?”
సంచీలోంచి కాగితం తీసిచ్చింది.
మొత్తం చదివాడు కౌంటర్ ఆయన. ఎత్తెక్కువయి, చిన్నాకు సరిగ్గా కనిపించకపోతుంటే పక్కకి జరిగి, సూట్ కేసులు పెట్టే సందులోంచి చూశాడు. ఏమీ అనుమానం వచ్చినట్లు లేదు.
“పిల్లలు ట్విన్సా? ఇద్దర్నీ పక్కపక్కకి రమ్మను.” లేచి నిలబడి, చూశాడు. పాస్పోర్ట్ లో ఫొటోలనీ టింకూ, చిన్నాలనీ మార్చి మార్చి.
“ఒక్కలాగలేరే..”
“ఐడెంటికల్ ట్విన్స్ కాదండీ.” తడుముకోకుండా జవాబిచ్చింది.
చెకిన్ చెయ్యకపోవడానికి ఏ కారణం కనిపించలేదు. వీసా, పాస్ పోర్ట్ వివరాలు అన్నీ పక్కాగా ఉన్నాయి. బోర్డింగ్ పాస్ ఇచ్చేశాడు. సామాన్లు కూడా చెకిన్ చేసేసాడు.
చిన్నా, టింకూ కార్టూన్ పుస్తకాలు, బుల్లి బుల్లి కార్లు.. ఒక జత బట్టలు, వగైరాలున్న బాక్ పాక్ లు తగిలించుకుని మమ్మీ వెంట నడిచారు. చిన్నా తన నోట్ పుస్తకం తీసుకెళ్లడం మర్చి పోలేదు.
అమ్మయ్య అనుకుంటూ దూరం నుంచి చూస్తున్న ఎయిర్ పోర్ట్ లో పనిచేసే ఒకతనికి, తల ఊపి సౌంజ్ఞ చేసి, సెక్యూరిటీ దగ్గరికి నడిచింది మమ్మీ.
సెక్యూరిటీ దగ్గర కూడా.. పరీక్షలన్నీ చేసి వదిలారు.
ఆనంద్ దగ్గర పిల్లల్ని కొనే ముఠా అంతర్జాతీయంగా చాలా విస్తరించిపోయింది. ఎక్కడికక్కడ గూఢచారులు.. ప్రభుత్వ సంస్థలలో పని చేసే వాళ్లు, చాపకింద నీరులా ఉంటారు.
పాస్ పోర్ట్ లు సంపాదించడం, వీసాలు తెప్పించడం మంచినీళ్లు తాగినంత సులువు.
ఒకసారి వాడిన అమ్మల్ని నాన్నలని ఇంకొకసారి వాడరు.
వాళ్లు వ్యాపారం చేసేది, పాకిస్థాన్. బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, ఆఫ్రికా, కంబోడియా వంటి మనుషులెక్కువ, డబ్బు తక్కువ ఉన్న దేశాల్లోని చిన్న చిన్న బ్రోకర్లతో. అక్కడ, ఏ పని చెయ్యడానికైనా.. ఏ వయసు వారైనా.. మనుషులు దొరకటం పెద్ద కష్టం కాదు.
డబ్బుకు వెనుకాడక్కర్లేదు. నల్లబంగారం.. అంటే ముడి చమురు సమృద్ధిగా దొరికే దేశాల ధనికులు తయారుగా ఉన్నారు.
చిన్నాకి ఏడుపొస్తోంది. విమానం ఎక్కి కూర్చుని, ఎయిర్ హోస్టెస్ చేత బెల్ట్ కట్టించుకుంటుంటే.. ఇంటికెళ్లి అమ్మా నాన్నలని చూస్తాననే ఆశ పూర్తిగా పోయిందని. మళ్లీ తన ఊరికి, తన ఇంటికి ఎప్పటికైనా రాగలడా?
“ఫర్లేదు బాబూ! ఏం భయమెయ్యదు.” హోస్టెస్ ఆంటీ ధైర్యం చెప్పింది.
ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం చేయిస్తారూ?
చదివించడానికైతే కాదు. ఇంక చదువు.. కంప్యూటర్ ఇంజనీరవాలనే ఆశా, అమ్మా నాన్నలకి తానేమిటో చూపించుకోవాలనే తపన.. అన్నీ అయిపోయినట్లే. ఇంత చిన్న పిల్లల చేత చేయించ గలిగిన పనేముంది?
చిన్నా సందేహం కొద్ది గంటల్లో తీర బోతోంది.
టింకూకి అదేమీ పట్టలేదు. తనేంటీ.. విమానం ఎక్కాడా? గాల్లోకి నిజంగా ఎగురుతాడా.. కళ్లు పెద్దవి చేసి చూస్తున్నాడు, విమానం పైకి లేస్తుంటే.
తెల్లవారు ఝాము ఐదు దాటింది అప్పుడు.
……………..

అరేబియన్ గల్ఫ్ దేశాలు ప్రపంచమంతా గత శతాబ్దం మధ్య నుంచీ చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. ప్రపంచం మొత్తం వారి కను సన్నల మీదే ఆధార పడి జీవిస్తున్నట్లయింది
ముడి చమురు కనుగొనక ముందు ప్రజల జీవితాలకీ, కనుక్కున్నాక వారి జీవన విధానానికీ అనూహ్యమైన వ్యత్యాసం..
ఒక్క సారిగా, కుచేలుడికి కుబేరుని కృప దొరికినట్లు ఆయింది.
ఒక తరం ప్రజలు, హఠాత్తుగా ఏర్పడ్డ ఆ మార్పుని ఆనందంగా జీర్ణించుకుంటూనే తాము గడిపిన పాత జీవితాన్ని అరేబియన్ నైట్స్ కథల్లాగ చెప్పుకోవడం మొదలు పెట్టారు.
మనం రుబ్బురోలు, కట్టెలపొయ్యి, కుంపటి, తిరగలీ వంటి వస్తువుల గురించి చెప్పుకుంటున్నట్లుగా.. వాళ్లు ముత్యాల తయారీ (బస్రా పెర్ల్స్ ఇప్పటికీ ప్రాముఖ్యమైనవే), చేపల వ్యాపారం, సముద్ర గర్భంలో దొరికే వస్తువుల గిరాకీ, ఒయాసిస్ ల వద్ద వ్యవసాయం గురించి చెప్పుకుంటుంటారు.
అరవై, డెబ్భైలలో జరిగిన బ్లాక్ గోల్డ్ రష్, అరేబియన్ గల్ఫ్ సముద్ర తీరంలో ఉన్న చిన్న చిన్న గ్రామాలన్నింటినీ, కళ్లు మిరిమిట్లు గొలిపే పట్టణాల కింద మార్చేసింది. అనుకోని ఐశ్వర్యం ప్రజలని, ఆ సదుపాయాలను వదులుకోలేనట్లు మార్చేసింది.
ఎడారులు, ఒంటెలు అనేవి ఎండ మావుల కింద ఐపోయాయి.
అక్కడున్న అంతులేని సంపద.. ప్రపంచ దేశాలన్నిటినీ తమ పట్టణాల కేసి ఆకర్షించడం మొదలు పెట్టింది.. అట్లాంటిది, పచ్చని పైరుల కోసం పరుగెత్తే ఎడారి వాసులని ఆకర్షించడంలో వింత ఏముంది? ఆ సంపద తమ తమ దేశాల్లోనే దొరుకుతుంటే!
కొత్త ఆర్ధిక సామాజిక వ్యవస్థలో, ఒంటెల మీద ఆధారపడే ఎడారి జీవన విధానం క్రమంగా తగ్గిపోసాగింది.
ఒకప్పుడు ఎడారి ఓడగా ప్రసిద్ధి చెంది, రవాణా వ్యవస్థకి మూలాధారమై, ఇసుక దిబ్బల్లో మనుషులనీ, వస్తువులనీ తీసుకుని వెళ్లే ఒంటెలు, అవే.. లారీల్లో రవాణా అవుతున్నాయి.
గల్ఫ్ దేశాల్లో, ఒక చోట్నించి ఇంకొక చోటికి ఒంటెలను తీసుకెళ్తున్న లారీలు, హై వే మీద తరచుగా కనిపించే దృశ్యం. మైళ్ల తరబడి సాగిపోయే హై వేలకి అటూ ఇటూ బార్బ్డ్ వైర్ ఉంటుంది.. ఒంటెలు రోడ్లమీదికి రాకుండా హైవే పొడవునా వైర్ మెష్ వేసేశారు.
ఆ వైరు మెష్ లేనప్పుడు చాలా యాక్సిడెంట్ లు అవుతుండేవి.
తరతరాలుగా ఒంటెలతో ఉన్న సాన్నిహిత్యం గల్ఫ్ వాసులకి మరపు రానిదే. ఎంత ఆడీ, మెర్సిడెజ్ కారుల్లో తిరిగినా ఒంటెలని చూసే సరికి ఒక రకమైన ఆనందం పొంగి పొరలుతుంది వారిలో.
ఏదో ఒక విధంగా ఒంటెలని వారి జీవన విధానంలోకి తీసుకు రావాలి.
ఎలాగ? రకరకాల ఆలోచనల ఫలితంగా పరిష్కారం దొరికింది.
అదే.. ఒంటెల రేసుల ద్వారా..
వారి కఠినమైన జీవన విధానాల వలన ముడి చమురు దొరకడానికి ముందు, ఒంటెల పందాలకి అంత సమయం ఉండేది కాదు.. డబ్బుకి కూడా ఇబ్బందే.. ఇప్పుడు దేనికీ కొరవ లేదు.
వారి పాత సంస్కృతి గురించి కథలు చెప్పుకోవడమే కాదు.. హాయిగా, తిరిగి ఉద్ధరించుకోవచ్చు.
రేసు ఒంటెలని ‘అల్ హెజిన్’ లని అంటారు.
దుబాయ్, ఆబుదాబి, షార్జా, అజ్మాన్, ఫ్యుజైరా, వుమ్ అల్ క్వైన్, రాస్ అల్ ఖైమా, మొదలైన ఏడు దేశాలకూటమి అయిన యునైటెడ్ ఆరబ్ ఎమరైట్స్ లో, ఖతార్, ఓమాన్, సౌదీ అరేబియా దేశాల్లో..సెప్టెంబరునుంచీ నుంచీ, ఏప్రిల్ వరకూ ఒంటె రేసుల సీజన్ నడుస్తుంది.
ఆ సమయంలో అందరి దృష్టీ, పొడవుగా, ధృడంగా, సన్నగా ఉండే రేసు ఒంటెల మీదే ఉంటుంది. అనేక మంది ప్రత్యక్షంగా ట్రాక్ దగ్గర చూస్తే, లక్షల మంది, టివీ తెరలకంటుకుపోయుంటారు.
మన క్రికెట్ మాచ్ లప్పటి లాగే.
ఈ రకంగా తమ నేస్తాలయిన ఎడారి ఓడలని తమ జీవితాల్లోకి మళ్లీ ఆహ్వానించి, ఈ పందాల ద్వారా, కోల్పోయిన తమ సంస్కృతిని పొందినట్లుగా సంతోషిస్తున్నారు గల్ఫ్ దేశ వాసులు.
అంతే కాదు, ఈ క్రీడ అనూహ్యమైన సంపదని చేతులు మారుస్తుంది. కోట్ల డాలర్లలో సాగుతాయి పందాలు.
ఈ రేసు ఒంటెలు తమ యజమానులకీ, తమకి శిక్షణ ఇచ్చేవారికీ కోట్లు సమకూరుస్తాయి.
ఒక ఒంటె ఉంటే చాలు.. ఆ యజమానికి ఎంతో ఆదాయం, సమాజంలో అంతకు మించిన గౌరవం.
తమ సంస్కృతిని నిలుపుకొనే ప్రయత్నంలో వేలకొలదీ ఒంటెల్ని పెంచి పోషిస్తున్నారు. ఒక్క దుబాయ్ రేసుల్లోనే, 1996-97 సంవత్సరంలో నాలుగు వేలు పైగా ఒంటెలు పాల్గొన్నాయి. ఆ వెంటనే ఆబుదాబిలో .. వరుసగా ఒకదేశం తరువాత ఒక దేశంలో.. చెప్పుకోతగినన్ని రేసులు నడుస్తుంటాయి.
ఆ తరువాతి సంవత్సరాలలో ఇంకా పెరిగింది.
ఇంచుమించు అన్ని దేశాలలోనూ ఒంటె పందాలు జాతీయ పరిశ్రమల స్థాయికి చేరుకున్నాయి.
ఈ పందాలకి ఎంతో పెట్టుబడి, రకరకాల స్థానాల్లో పనిచేసే వాళ్లు, అంతర్జాతీయంగా అనేక మంది కలిసి కట్టుగా పనిచేసే సంస్థలు కావాలి.
పూర్వ సంస్కృతిని నిలుపుకోవాలనుకోవడం ఒక ఎత్తయితే.. ఆ పందాలు పెద్ద పరిశ్రమ స్థాయి రూపాలు దాల్చడం మరొక ఎత్తు.
ఈ పెట్రో డాలర్ల సంపాదన లేక మునుపు కూడా.. ఇరవయ్యో శతాబ్దపు పూర్వార్ధం వరకూ.. ఒంటెల రేసులు ఆరేబియా దేశాల్లో ముఖ్యమైన వినోదం గా ఉండేవి.
ఆ వినోదం రెండు రకాలుగా ఉండేది.
ఒకటి పండగలకీ పబ్బాలకీ జరుపుకునే వేడుక. ఇంకొకటి.. పందాల కోసమనే అందరూ చేరి, క్రీడగా జరుపు కునేది.
పెళ్లిల్లలో, వాన కురిసిన వేళలో(ఎడారిలో వాన కురవడం పెద్ద పండగే..), కుల పెద్దలు వచ్చినప్పుడు, మగ పిల్లలకి సుంతీ ఆపరేషన్లు జరిగినప్పుడు.. ఈ పందాలు వేడుకకి, సరదాగా సాగి పోయేవి.
ఒంటెలని పరుగు పందానికి వరుసగా నిలబెట్టి.. ఒక పక్కన నిల్చుని, వాటి యజమానులు ఒంటెలని హుషారు చేస్తూ బూరాలూ అవీ ఊదుతూ డప్పులు వాయిస్తూ, చప్పట్లు కొడుతూ ఉంటే, మిగిలిన వారు ఆనందిస్తూ ఉండే వారు. ఇందులో డబ్బు ప్రసక్తి లేదు.
ఇంకొకటి.. రేసుల కోసమే ప్రత్యేకంగా జరిగేది. దానికోసమే అందరూ కలిసే వారు. మొదటి, రెండు, మూడు.. స్థానాలకి బహుమతులు ఉంటాయి.
అవీ సరదా కోసమే సాగేవి.
ఆ ఒంటెల పరుగులు చూడటానికి వచ్చిన వాళ్లు పందాలు కాయడం అప్పటికింకా తెలియలేదు.
ఆధునిక కాలంలో.. అదీ గల్ఫ్ దేశాలు సంపన్న దేశాలయాక ఒంటెల రేసుల్లో చాలా మార్పులొచ్చాయి. ప్రపంచంలోని ఇతర దేశాల్లో జరిగే గుర్రప్పందాల లాగానే.. వాటిలో కూడా బెట్టింగు మొదలయింది.
రేసుల కోసం ప్రత్యేక జాతి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రెండు మూడు రకాల జాతులుంటాయి. ఆ ఒంటెలకి.. వాటికి పదమూడు నెలల నుంచీ పదహారు నెలలు వచ్చినప్పట్నుంచీ శిక్షణ ఇస్తారు.
వాటి ఆహారం వేరే రకం.. బలవర్ధకమైందీ, బరువు పెంచనిదీ ఉంటుంది. ఎడారిలో స్వేచ్ఛగా తిరగ నీయరు.
నెదర్లాండ్స్ వంటి యూరోప్ దేశాల నుంచి ప్రత్యేకంగా తయారైన ఆహారం దిగుమతి చేస్తారు. అందులో ఓట్స్, బార్లీ, కొన్ని చిరు ధాన్యాలు.. పీచు పదార్ధం ఎక్కువగా ఉండే పోషక పదార్ధాలుంటాయి. విటమిన్లు, అరుదైన లోహాలు అందులో కలుపు తారు.
కొంత కాలం క్రితం వరకూ ఒక బ్రిటిష్ అధికారి పర్యవేక్షణలో ఈ ఒంటెల ఆహారం తయారయేది.. తరువాత ఇంకా కొందరు ఆ వృత్తిలోకి దిగారు.
ఒంటె పిల్లకి మూడు సంవత్సరాలు వచ్చే సరికి, అది వేగంగా పరుగెత్త గలిగే స్థితికి చేరుకుంటుంది.
ప్రతీ రోజూ వెటర్నరీ డాక్టర్ వచ్చి వాటి ఆరోగ్యం చూడ్డం, ట్రయినర్ పరుగు పెట్టించడం వంటి శిక్షణ ఇస్తుంటారు.
ఒంటెలని.. అందులో పందాల్లో పాల్గొనే ఒంటెలని సాకడం చాలా ప్రతిష్ఠాత్మక మైన ప్రవృత్తి.
దేశాలనేలే రాజులు, అధ్యక్షులు, అధికారులు.. అత్యంత సంపన్నులైన వ్యాపారస్థులు వాటిని పెంచగలుగుతారు.
ఆ ఒంటెల పోషణకి అయే ఖర్చు కోట్లలో ఉంటుంది.
రేసుల కోసం తయారుచేసే ఒంటెల పెంపకంలో బోలెడు రూల్స్..
ఆ ఒంటెలని కొట్ట కూడదు.. శిక్షణ కార్యక్రమంలో.
మరీ ఎక్కువగా అలవ నియ్య కూడదు. స్వంత పిల్లల్లాగ చూసుకోవాలి.
ఐతే.. ఎక్కడైనా రూల్స్ అతిక్రమించే వాళ్లు ఉండనే ఉంటారు.
ఈ ఒంటె పందాల నిర్వాహకులకి సంఘాలుంటాయి. అందులో ప్రధాన పాత్ర ఒంటెల యజమానులదే.
ఒంటెల కోసం పెద్ద పెద్ద బయలు ప్రదేశాలుంటాయి. అవే కామెల్ ఫామ్స్.
ఒంటెలకి శిక్షణ నిచ్చే వారిది పెద్ద పొజిషన్ అందులో.
ఆ ఫార్మ్ లకి, వంట వాళ్లు, డ్రైవర్లు, ట్రైనింగ్ ఇచ్చే వాళ్లు, శుభ్రం చేసే వాళ్లు, సూపర్ వైజర్లు.. ఎంతో మంది లేబర్ కావాలి.
దేశ దేశాల్నుంచీ ఎంతో మందిని ఆకర్షించడమే కాదు వారికి ఉపాధి కూడా కల్పిస్తున్నాయి ఈ ఒంటె పందాలు..
మొత్తానికి గల్ఫ్ దేశాలలో ఈ ఒంటె రేసులు ప్రతిష్టాత్మక మైన వినోదం. అదొక పెద్ద వ్యవస్థ.
ఈ వ్యవస్థలో అతి ముఖ్యమైన పాత్ర వహించే వాళ్లు “జాకీ”లు. మొత్తం పందెం అంతా వారితోనేసాగుతుంది.
అంతెత్తు ఒంటెల మీద కూర్చుని వాటిని హుషారు పరుస్తూ పరిగెత్తించే జాకీలు.
గుర్రప్పందాల్లో జాకీలకీ, ఒంటె రేసుల జాకీలకీ చాలా తేడా ఉంది.
గుర్రాలు అరవై కిలోల బరువుని సునాయాసంగా తీసుకెళ్ల గలవు. అది కూడా.. వాటి వేగం ఏ మాత్రం తగ్గకుండా.
కానీ ఒంటెలు ముప్ఫై కిలోలకే ఒగరుస్తాయి. అది దాటితే.. వాటి వేగం చెప్పుకోతగినంతగా తగ్గి పోతుంది.
అందుకని ఈ రేసులకి జాకీలు పెద్ద సమస్య అయిపోయింది.
అయితే.. డబ్బుంటే సాధించలేనిదేముంది?
బరువు తక్కువుండే జాకీలు కావాలి.. దానికి పదేళ్ల లోపు పిల్లలైతే సరి పోతుంది. మరి ఆ పిల్లలెక్కడ దొరుకుతారు?
అరేబియన్ దేశాలవంటి సంపన్న దేశాలు ఆపురూపంగా చూసుకునే తమ పిల్లల్ని ఎందుకు పంపుతారు జాకీల కింద? దానికి బోలెడు బీద దేశాలు ఉండనే ఉన్నాయి.
ఎక్కువగా ముస్లిమ్ దేశాలవారు అరేబియన్ దేశాలకి పిల్లల్ని పంపడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, కొన్ని ఆఫ్రికన్ దేశాలు అందులో ముందున్నాయి.
ముస్లిమ్ దేశం కాక పోయినా.. అధిక జనాభా కల భారత దేశం నుంచి కూడా చిన్న పిల్లల ఎగుమతి జరుగుతుంది.
అటువంటి.. దురదృష్టవంతులైన పసివాళ్ల ఎగుమతులకే అంతర్జాతీయ ముఠాలు కొన్ని, చాలా పకడ్బందీగా పని చేస్తుంటాయి.
ఆ ముఠాలకి అనుబంధంగా ఆనంద్ వంటి వ్యక్తులు తాము చిన్న చిన్న ముఠాలని నడుపుతుంటారు.
………………..

4

ఉన్నట్లుండి టింకూ గట్టిగా ఏడుపు మొదలు పెట్టాడు.. కక్కటిల్లి పోతూ.
విమానం పైకి లేచి పదినిముషాలయింది. మధ్యలో మమ్మీ కూర్చుంది. ఇటూ అటూ చిన్నా, టింకూ.
చిన్నాకి సంగతేంటని కనుక్కోడానికి లేదు. వాడి ఏడుపు చూస్తుంటే వీడిక్కూడా గట్టిగా ఏడవాలని పిస్తోంది.
ఇప్పుడు తెలిసిందా వాడికి.. ఇంక అమ్మ ఎప్పటికీ కనిపించదని? విమానం ఎక్కానన్న మోజు తీరిపోయి, కొత్త చోటు, కొత్త మనుషులతో ఉండాలని తెలిసిందా?
కొత్తమ్మకి కూడా ఏం చెయ్యాలో అర్ధం అవట్లేదు. అప్పటి వరకూ నవ్వుతూ ఉన్నాడే.. ఇంకా హోస్టెస్ లు తిరగడం మొదలు పెట్టలేదు. వాడి ఏడుపు చూస్తుంటే కోమాలోకి వెళ్లి పోతాడేమో అనిపిస్తోంది.
“మరేం లేదు.. చెవులు నొప్పెట్టి ఉంటాయి. కొంతమందికి బాగా ఎక్కువగా ఉంటుంది గాలి వత్తిడి. చిన్న పిల్లాడు కదా.. ఈ చాక్ లెట్ ఇవ్వండి. కొంచెం సేపట్లో తగ్గి పోతుంది.” చిన్నాకి అటు పక్కన కూర్చున్న ఒక పెద్దాయన ఇచ్చాడు.
అప్పుడే చిన్నాకి కూడా అనిపించింది.. చెవుల్లో నొప్పి.
అంతలో ఎయిర్ హోస్టెస్ వచ్చి అందరికీ చాక్ లెట్లిచ్చింది. కొంచెం సేపటికి టింకూ ఏడుపు ఆపాడు. మమ్మీ లేపి ఒళ్లో కూర్చో పెట్టుకుంది.

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *