March 29, 2024

బ్రహ్మలిఖితం 15

రచన: మన్నెం శారద

ఆ పిచ్చి పిల్లనింకెప్పుడిలాంటి స్థలాలికి తీసుకురాకు.
“ప్రొద్దుటే మీ ఊరు బయల్దేరు” అన్నారాయన వెంకట్‌తో.
ఈశ్వరి ఆయన మాటలు విని అర్ధం చేసుకోగల్గితే ఎలా వుండేదో? కాని… అది జరగనే లేదు.
వెంకట్‌ని ఆమె భర్తగా అనుకోవడం మాస్టారి తప్పు.
స్వార్ధంతో కనుపొరలు కప్పుకుపోయిన ఆ నీచుడికి ఆయన చెప్పిన నీతిశాస్త్రం అర్ధం కాలేదు.
కొంచెంలో తను బయటపడ్డానని మాత్రమే సంతోషిస్తున్నదతని హృదయం.
******
ఎక్కడో ఒక పేరు తెలియని పిట్ట వెర్రి ఆనందంతో కూతలు పెట్టింది.
లిఖిత గిలిగింతలు పెట్టినట్లుగా లేచి కూర్చుంది.
ఆ పిట్ట క్షణక్షణానికి రెచ్చిపోతున్నట్లుగా కూత పెంచింది.
లిఖిత గబగబా వెళ్ళి కిటికి తలుపులు తెరిచింది.
ఎదురుగా, దూరంగా బట్టతలల్లా వున్న కొండలు, ఆ వెనుక పరుగులు పెడుతున్న మేఘాలు, కొండవాలులో వివిధ దశల్లో వున్న తేయాకు తోటలు, ఎందుకా పక్షి వెర్రిగా కూస్తున్నదో అర్ధమైంది లిఖితకి.
మనిషి పరవశంలోంచే కళలు పుట్టుకొచ్చేయి. విపరీతమైన సంతోషానికి గురయినప్పుడే అతను చిందులేసేడు. ఎలుగెత్తి అరిచేడు. ఆ చిందులే నాట్యంగా, ఆ అరుపులే సంగీతమై నిలిచిపోయేయి.
అక్కడ ప్రకృతి సోయగాలు చూస్తే ఎవరికైనా హద్దులు మరచి ఆడాలని, పరవశించి పాడాలనిపిస్తుంది.
లిఖిత మొహం కడుక్కుని బేరర్‌ని పిలిచి కాఫీ తాగుతూ “ఇక్కడ చూడదగిన స్థలాలేమిటీ?” అనడిగింది ఇంగ్లీషులో.
“ఇక్కడ ఏ ప్రదేశమైనా అందంగానే వుంటుంది మేడం. ఇది సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తులో వుంది. ఈ ఊరు ముద్ర పూజ, నల్లగాని కుండల అనే మూడు కొండవాగుల మధ్య వుంది!” అన్నాడు బేరర్ ఉత్సాహంగా
ఇంకెలా కదపాలో ఆమెకర్ధం కాలేదు.
“టిఫినేముంది?”
“ఇడ్లీ, దోసె, వద”
“అంటే ఇవి మా వేపూ వుంటాయి. మీ కేరళ వంటకాలేమీ లేవా?”
“ఉన్నాయి ఇడియప్పం, పుట్టు”
“పుట్టా? పేరు గమ్మత్తుగా వుంది. ఎలా చెస్తారు?” అనడిగింది లిఖిత.
“బియ్యాన్ని, కొబ్బరిని పొడుగాటి వెదురు గొట్టాల్లో పెట్టి ఆవిరి మీద ఉడికిస్తారు” అని చెప్పేడు బేరర్.
“ఒన్ ప్లేట్ పుట్టు” అంది లిఖిత నవ్వుతూ.
బేరర్ ఉత్సాహంగా వెళ్ళి పుట్టు తెచ్చి పెట్టేడు.
లిఖిత పుట్టు తినడం ప్రారంభించగానే బేరర్ ఆమె మొహంలో భావాల్ని గమనిస్తూ నిలబడ్డాడు.
“చాలా బాగుంది” అంది లిఖిత.
బేరర్ సంతృప్తిగా నవ్వాడు.
“ఇక్కడ మంత్రగాళ్లు, అదే క్షుద్రపూజలు చేసే వాళ్లుంటారటగా?” అనడిగింది లిఖిత.
ఆమె ప్రశ్న అర్ధం చేసుకుని మొహం చిట్లించేడు బేరర్.
“వద్దు మేడం. చాలా డేంజర్. అటెళ్ళకండి” అన్నాడు కంగారుగా.
“ఎటు?” అంది లిఖిత.
అతను ఇబ్బందిగా చూశాడామె వైపు.
“ఇక్కడికి నలభయి కిలోమీటర్ల దూరంలో మరయూర్ అనే ప్రాంతముంది. ఇక్కడ వాటంతటవే పుట్టి పెరిగిన గంధపు వృక్షాలుంటాయి. ఆ వెనుక అడవిలో వాళ్ళుంటారు కాని..”
“ఏంటో చెప్పు బ్రదర్!”
ఆ పిలుపుకే అతను కరిగిపోయేడు.
మీరూరికే చూడాలనుకుంటే అటువైపు వెళ్ళొద్దు. వాళ్ల చేతిలో పడినవాళ్ళు తిరిగి రారు. వాళ్ళు చేసే క్షుద్రపూజలు స్త్రీలు చూడకూడదు”
“ఎందుకు?”
“వాళ్ళ క్షుద్రదేవత కూడా స్త్రీ. వాళ్ల మంత్రాలకి స్త్రీలు వశం కారు. స్త్రీలో కూడా అంతర్గతంగా వుండే శక్తి వాళ్ల మంత్రశక్తుల్ని పారనివ్వదు. అందుకే ఆ ప్రాంతాల్లోకి స్త్రీలని రానివ్వరు”
అతని మాటలు విని ఆమె ఆలోచనలో పడింది.
ఆ వెంటనే ఏదో తోచినట్లు ఆమె కళ్ళు మెరిసేయి.
“మగవాడి వేషంలో వెళ్తే?”
“అంతవసరమా సిస్టర్?”
“అవసరమే. మా డేడి మరణాన్ని మట్టుపెట్టే మంత్రం నేర్చుకోవాలని ఈ అడవుల్లోకి వచ్చేరు. సరిగ్గా ఎక్కడున్నారో తెలీదు. ఆయన్ని వెదుక్కుంటూ వచ్చేను. నా సహాయపడలేవా?” అనడిగింది లిఖిత.
ఆ కుర్రాడి మనసు చలించింది.
“నేనెళ్ళిరానా?” అన్నాడు ఆత్రంగా.
“వద్దు. నేనే వెళ్తాను. నాకు నీదొక డ్రెస్సు కావాలి!”
“వాళ్లు లుంగీ కట్టమంటారు. కుదరదక్కా”
“ఫర్వాలేదు. తెచ్చిపెట్టు”
అతను నిర్లిప్తంగా చూసి వెళ్ళిపోయేడు.
లిఖిత ఆలోచిస్తూ కూర్చుంది.
“తను చాలా సీరియస్సయిన విషయాన్ని తేలికగా తీసుకుంటున్నదేమో. అంత ఇంటీరియర్ ఫారెస్టులోకి తాను మగ వేషమేసి వెళ్ళడం దుస్సాధ్యమేమో. ఏదైనా ప్రమాదం జరిగితే.. తనెలా తప్పించుకురాగలదు. తన దగ్గరెలాంటి ఆయుధమూ లేదు. ఇంతకీ తన తల్లి ఎలా వుందో. తిరిగి తను ఫోన్ చేసే ప్రయత్నమే చెయ్యలేదు. ఆమెని వెంకట్ గుప్పెట్లో పెట్టుకుని ఏ విధంగా సతాయిస్తున్నాడో? అలా అనుకోగానే ఆమెకి వెంటనే తల్లితో మాట్లాడాలనిపించింది. వెంటనే ఆపరేటర్‌కి చెప్పి లైనిమ్మంది.
మరో పది నిమిషాల్లోనే వైజాగ్‌కి లైను దొరికింది. కాని.. ఎంతసేపు రింగయినా రిసీవరెవరూ లిఫ్ట్ చేయడం లేదు.
లిఖిత నిస్పృహగా రిసీవర్ క్రెడిల్ చేసింది.
తల్లి నిజానికి ఆ టైములో ఫాక్టరీలో వుంటుంది. తను లేకపోయినా ఆమె ఏకాగ్రతగా ఫాక్టరీకెళ్లి పనులు చూసుకోగల్గుతున్నదా?
ఎందుకో ఆమె మనసు కీడునే శంకిస్తుంది.
తల్లిని వెంకట్ ఏ విధంగా యిబ్బంది పెడుతున్నాడో తెలీదు. వెంకట్‌లో ఎందుకంత రాక్షసత్వం ఉద్భవించిందో కూఋఆ ఆమెకర్ధం కావqడం లేదు.
“సిస్టర్!”
బేరర్ పిలుపుకి తలెత్తింది లిఖిత.
బేరర్ ఒక కవరు ఆమె చేతికందించి “కట్టుకోండి” అన్నాడు బయట కెళ్తూ.
లిఖిత కవరు తెరచి చూసింది.
ఒక కొత్త లుంగీ, బనీను, టోపీ వున్నాయందులో.
లిఖిత కొంత సంశయంగా వాటిని చూస్తూ కూర్చుంది కాస్సేపు.
తను తండ్రి కోసం అంత దూరమొచ్చింది.
మంచో చెడో, సఫలమో విఫలమో తన ప్రయత్నం తాను చేసి తీరాలి. ఇప్పుడు తను బెదిరి వెనుకడుగేస్తే తనిక జీవితంలో తండ్రిని కలవలేదు.
లిఖిత లేచి టాయిలెట్‌లోకెళ్ళి డ్రెస్ మార్చుకొని అద్దంలో చూసుకుంది.
తన రూపం తనకే నవ్వు తెప్పించింది.
ఒక సున్నితమైన మగపిల్లవాడిలా వుంది తను.
బాబ్డ్ హెయిర్‌ని క్లిప్పులతో బిగించి టోపీ పెట్టుకుని చిన్న బాగ్‌లో తనకు కావల్సిన టార్చిలైటు ఇత్యాదివి సర్దుకొని రూం లాక్ చేసి బయటకొచ్చింది.
బేరర్ ఆమెని వింతగా చూసి నవ్వి “బావున్నావక్కా! రా నిన్ను బస్సెక్కిస్తాను” అన్నాడు.
లిఖిత అతన్ననుసరించింది.
మున్నారు అందాలు చూస్తుంటే మనసు పరవశిస్తోంది.
తాత్కాలికంగా తన సమస్యల్ని మరచి అతనితో బస్టాండుకి చేరుకుంది.
వాళ్లు వెళ్ళేసరికి మరయూర్ బస్ సిద్ధంగా వుంది.
“అక్కా! నీకు మళయాళం రాదు. జాగ్రత్త. ఏదైనా తెలుగు పేరే చెప్పు. ఇంతకీ మీ నాన్నగారెలా వుంటారో తెలుసా?”
“తెలియదు”
ఆమె జవాబు విని ఆతనాశ్చర్యపోయేడు.
“మరెలా కనుక్కుంటావు?”
“అదే తెలియడం లేదు. ఆయన్ని పుట్టేక చూసే అదృష్టం కల్గలేదు. పేరు కార్తికేయన్”
అంది లిఖిత.
“కార్తికేయన్.. కార్తికేయన్” అంటూ ఏదో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించేడు బేరర్.
కాని అప్పటికే బస్సు ఆ ప్రాంతాన్ని వదిలేసింది.
*****
కేయూరవల్లి మనసు మనసులో లేదు.
కూతురు తిరిగి తనకి ఫోను చేయలేదు. అసలెలా వుందో? వెళ్ళిన వెంకట్ కూడా తిరిగి రాలేదు. తనొక పిచ్చిది. కనీసం వెంకట్‌తోనన్నా తన భర్త ఫోటో ఇచ్చి పంపలేకపోయింది.
ఏం చేయడానికి దిక్కు తోచడం లేదు.
సరిగ్గా అప్పుడే ఆమెకొక టెలిగ్రాం వచ్చింది.
ఆమె ఆత్రుతగా సంతకం పెట్టి దాన్ని తిప్పి చూసింది.
“మీనన్ ఎక్స్‌పైర్డ్. జస్ట్ ఇన్ఫార్మ్‌డ్ నైబర్స్”
అది చూసి ఆమె పాతాళంలోకి కృంగిపోయిహ్నట్లయింది. ఇప్పుడు తమకి సహాయం చేసే మనిషొక్కడూ వెళ్ళిపోయేడు. చాలా దిగులుగా అనిపించింది కేయూరకు.
కష్టాలు అన్ని వైపులనుండి తరుముకొస్తున్న భ్రాంతి కల్గిందామె మనసుకి.
భర్తని వదిలి అనేక సంవత్సరాలు మనోనిబ్బరంగా, తనకు నచ్చిన రీతిలో గౌరవంగా బ్రతికింది తను. కాని ఏదో దుష్టగ్రహ ప్రభావం సోకినట్లుగా తాను అకస్మాత్తుగా అనేక కష్టనష్టాలకి గురవుతున్నది. కన్నకూతురు ఎటెళ్ళిందో తెలియడం లేదు. ఫాక్టరీకి కూడా కష్టాలు సంప్రాప్తించేయి. ఎక్స్పోర్ట్ అయిన స్టాకు తుఫానులో చిక్కుకుని డామేజయింది.
మనిషికి మరణం కన్నా గొప్ప శిక్ష ఒంటరితనం.
ప్రస్తుతం ఆమె పరిస్థితి అదే.
అది కూడా మానసికమైతే అదొక ప్రత్యక్ష నరకం.
కేయూరవల్లి పిచ్చిపట్టినట్లు గదంతా కలయ తిరిగింది కాస్సేపు. అప్పుడే ఆమె టెలిఫోన్ రింగయింది.
ఆ ఫోను లిఖిత నుండయి వుంటుందనే ఆత్రుతతో కేయూరవల్లి గబగబా వెళ్ళి రిసీవర్ ఎత్తింది.
“హలో నేను రాజ్యలక్ష్మిని”
రాజ్యలక్ష్మి ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్. శిరిడిసాయి డివోటి. అప్పుడప్పుడు సత్సంగం పేరుతో సాయి భక్తుల్ని ఒక చోట చేర్చి సాయి సూక్తులు పారాయణం చేస్తుంటుంది. ఉచిత వైద్య సదుపాయాలు, అన్నదానాలు చేయడమ ఆమె కార్యక్రమాలు. ఆమె కేయూరకి స్నేహితురాలు.
“ఏంటి?” అంది కేయూరవల్లి నెరసంగా.
“ఏంటంత నీరసంగా మాట్లాడుతున్నావు? లిఖిత రాలేదా?”
“లేదు”
“ఏ విషయమూ తెలియలేదా?”
“లేదు.”
“సరే. ఒక పని చెయ్యి. ఇప్పుడు వెంటనే నా దగ్గరకి బయల్దేరిరా. ఇక్కడికి నందనం నుండి బాబా భక్తులొకరొచ్చేరు. ఆయన్ని కలిస్తే నీకేదైనా పరిష్కారం కనిపించొచ్చు”
“సరే!” అంది కేయూర.
అనుకొన్న వెంటనే కారు తీసుకుని రాజ్యలక్ష్మి ఇంటీకి బయల్దేరింది.
మనసులో ఏవేవో ఆలొచనలు
అసలు దేవుడున్నాడా?
దేవుడున్నప్పుడు దయ్యమూ వుంటుందా?
దేవుడుంటే మంచివాళ్లకెందుకీ కష్టాలు?
దేవుడు నిర్వికారుడంటారు కదా, మరెందుకిన్ని రూపాలు వెలిసేయి. కేయూర పిచ్చిపిచ్చిగా ఆలోచిస్తూ రాజ్యలక్ష్మి ఇల్లు చేరింది.
కేయూరని సాదరంగా ఆహ్వానించింది రాజ్యలక్ష్మి.
నందనం నుండి వచ్చిన శర్మగారు కేన్ చెయిర్‌లో కూర్చుని ఉన్నారు. అప్పుడే కొంతమంది భక్తులు ఆయన రాక తెలిసి వచ్చి ఆయనకి నమస్కరిస్తున్నారు. ఏవేవో సందేహాలడుగుతున్నారు.
కేయూరవల్లిని చూడగానే ఆయన మందహాసం చేసేరు.
కేయూర నమస్కరించింది.
“మనిషి ప్రాకృత ఆలోచనే దేవుడు. అతని వికృత దృక్పధమే దయ్యం. తెలిసిందిగా..” అన్నారాయన.
కేయూర ఉలిక్కిపడినట్లుగా చూసిందతనివైపు. తను కారులో వేసిన యోచనీయనకెలా తెలిసింది.నిజంగా ఇతనేదో దైవాంశభూతుడేమో. అనుకుని మనసులో.
“రామ్మా కూర్చో”
కేయూర చాప మీద కూర్చుంది.
“నాలో ఏ అద్భుత శక్తి లేదు. నేనూ మీలాంటి మనిషినే. అన్ని కష్టాలూ చూసాను. కడగళ్ళు పడ్డాను. కన్నీళ్లు కార్చేను. ఎవరో సాయిని నమ్ము అన్నారు. ఆ రోజు నుండి సాయిని ప్రార్ధిస్తూ వచ్చెను. ఆయన్ని నేను ఏమీ అడగను. నన్నెవరు కష్తపెట్టినా, అవమానించినా, మోసగించినా నేను సాయి ఎదురుగా కూర్చుని ఆ నీచుల బారి నుండి నన్ను రక్షించమని ప్రార్ధిస్తాను. అంతేగాని వారిని దండించమని అడగను. నాకిది కావాలని కోరను. అలా అలా బాబాకి నేను సన్నిహితుణ్ణయ్యేను. చాలామంది నాలో ఏదో శక్తి వుందనుకుంటారు. ఆ శక్తి నీలోనూ వుంది తల్లి. నీవు కూడా భక్తురాలివేగా?”
అతని మాటలు మంత్రముగ్ధురాలిగా విన్నది కేయూరవల్లి. అతని కళ్ళలో ప్రేమ, వాత్సల్యం తొణికిసలాడుతున్నాయి.
రాజ్యలక్ష్మి వాళ్లందరికీ కాఫీలు తెచ్చిచ్చింది.
అందరూ వెళ్ళిపోయేక రాజ్యలక్ష్మి అతని దగ్గరగా కూర్చుంది.
“స్వామి! కేయూర కూడా చాలా భక్తురాలు. కాని ప్రస్తుతం ఆమె కాలం బాగా నడవటం లేదు. మానసికంగా చాలా క్షోభననుభవిస్తోంది. భర్త జడ, కూతురి జాడ తెలియడం లేదు. ఫాక్టరీలో కూడా నష్టాలు ప్రారంభమయ్యాయి. ఏదైనా మార్గం చెప్పండి!” అంది వినయంగా.
ఆయన కేయూరవైపు చూసి నవ్వారు.
“నేనెవర్నమ్మా మార్గం చెప్పడానికి. సాధనలచే అందరాని యసాధ్య వస్తువు సాయినామము. శోధనలు ఉడుగంగ గన్నడు చోద్యమీ శ్రీ సాయి నామం. నీవెంత తీవ్రంగా ప్రార్ధిస్తే అతనంత వేగంగా నీ సమస్యల్ని పరిష్కరిస్తాడు” అన్నారాయన.
కేయూరవల్లి అతనివైపు చూసింది.
“ఏంటి సందేహిస్తున్నావు?” అనడిగేడాయన.
“ఇంతవరకు మనస్థయిర్యంగానే బతికేను. ఎవరిచేతనైనా మోసపోయేవేమోగాని మోసగించలేదు. కాని.. ఇప్పుడేదో బలం కోల్పోతున్నట్లుగా వుంది. దిగులుగా వుంది” అంది కేయూర దీనంగా.
“బలిమి లేదను వగచు వారికి
బలము తానౌ సాయినామము
బలము చే గర్వించు వారికి
బల్లెమీ శ్రీ సాయి నామము”
“నీకేం భయంలేదు. సదా సాయిని జపించి నిమిత్త మాత్రురాలినై చూస్తూ కూర్చో. అతనే నీ ఛత్రం పడతాడు. అతనే నీ శత్రువులని కాలరాస్తాడు. నువ్వెంత నిజాయితీగా వుంటే ఆయన నీకంత త్వరితంగా దర్శనమిస్తాడు. మీ అమ్మాయికేం భయం లేదు. ఆమె విజయం సాధిస్తుంది. ఇవి బాబా చెబుతున్న పలుకులు. నావి కావు. ఈ విభూది పొట్లం గుమ్మానికి కట్టు. నీ ఇంట్లోకి శత్రువు రాలేదు” అన్నాడాయన ఒక విభూది పొట్లం ఇస్తూ.
కేయూర అతనికి నమస్కరించి బయటికి నడిచింది. రాజ్యలక్ష్మి ఆమెననుసరించింది.
భయపడకు. నీ పూజలూరికే పోవు. నీవు ఎవరి కొంపలూ ముంచలేదు. ఎవరి జీవితాలూ నాశనం చేయలేదు. నిన్ను భగవంతుడు సదా కాపాడుతాడు” అంది ఓదార్పుగా.
కేయూర చిన్నగా నవ్వడానికి ప్రయత్నించి “వస్తాను” అంది మెట్లు దిగుతూ.
ఆమె కారెక్కి బయల్దేరే వరకూ చూస్తూ నిలబడింది రాజ్యలక్ష్మి. కారెళ్లిపోయేక రాజ్యలక్ష్మి లోపలికొచ్చింది.
“ఆమె పెద్ద ఆపదలో వుంది. ఒక దుర్మార్గుడు ఆమె ఆస్తిని కాజేసే పథకం తయారుచేస్తున్నాడు. కాని.. అది జరగదు. ఆమె జోలికెళ్ళిన వాళ్లు వాళ్ళ కళ్ళు వాళ్ళే పొడుచుకుంటారు” అన్నారు శర్మగారు స్వగతంలా.
రాజ్యలక్ష్మి అతనివైపు చిత్రంగా చూసింది.
ఆయన చిన్నగా నవ్వి కళ్ళు మూసుకున్నారు.
“రుజువుగా వర్తించువారికి
రుజువు తాజౌ సాయినామము
రుణ విమోచనమైన ముక్తికి
రూపమీ సాయినామము.
ఆయన గొంతులో భక్తి పారిజాత పరిమళంలా వెల్లివిరుస్తోంది.
*****
ఆ అడవిలో బస్సు చిత్రవిచిత్రమైన మెలికలు తిరుగుతూ హైలీ ఎలివేటెడ్ రోడ్డుల మీద కొండ చిలువలా పాకుతూ వెళ్తోంది.

ఇంకా వుంది..

2 thoughts on “బ్రహ్మలిఖితం 15

  1. Eagerly waiting fir the next part akkaa . If you have full novel , I’ll fly to come to your Place and read the full novel

  2. ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాను ఈ సీరియల్ కోసం…చాలా బావుంది.. శారద గారూ అభినందనలు..Next part కోసం ఎదురుచూస్తూ…..

Leave a Reply to krishnavasanthika Cancel reply

Your email address will not be published. Required fields are marked *