May 25, 2024

కొత్త చీర

రచన : శ్రీకాంత గుమ్ములూరి.

“అన్నవస్త్రాలకి పొతే ఉన్న వస్త్రం ఊడిందిట !!”
“ఎవరి మీదే అక్కసు?” అడక్కుండా ఉండలేకపోయింది కొత్తగా పెళ్ళైన అక్కని.
“అధముడికి భార్య అయ్యేకన్నా బలవంతుడికి భార్య అవడం మేలు …. ” ఇంకో సామెత దూసుకు వచ్చింది అక్క నోటి నుంచి బాణంలా…
‘పెళ్లై రెండు రోజులైనా కాలేదు అప్పుడే బావని తిట్టుకుంటున్నావా?” చెల్లెలి ప్రశ్న.
దానికి ఆమె ఇచ్చిన తలతిక్క జవాబు అత్యంత వినసొంపు !!
అనుకున్న పని అంగవస్త్రంలో అయినట్లు కట్టబెట్టారుగా నన్ను మేనరికానికి ….
అండలుంటే కొండలు దాటచ్చు, మేనత్త కొడుకుని పెళ్ళిచేసుకుంటే అత్తారింట్లో హాయిగా సుఖపడచ్చు అనుకుంటే.. జరిగిందేమిటిట? ఆడబడుచు కళ్లన్నీ నా చీరలమీదే… అండ ఉన్నవాడిదే అందలం… ఉన్నాడుగా అండగా చెట్టంత అన్న !అడిగిందే పాపం… అనుగ్రహం తన స్వభావం కదా… చెల్లెలు కొత్త చీర కొనిమ్మని కోరడం ఆలస్యం, “ఇప్పటికి ఇప్పుడే అంటే ఎక్కడ నుంచి తేను? కొత్త పెళ్లికూతురు దగ్గిర కొత్త చీరలు కోకొల్లలు. మన ఇంటి పిల్లేకదా. నీక్కావల్సింది ఒకటి తీస్కో.” అని సులువైన సలహా ఇచ్చాడు కట్టుకున్న మొగుడు.
ఇంటివాడు ఒసే అంటే బయటవాడూ ఒసే అంటాడు… అంతే ! నా చీరల మీదకి దండెత్తింది మహాతల్లి. నా పెట్టెలో ఉన్నకొత్త చీరలన్నీ మంచం మీద చక్కగా పరిచి మరీ ఎంచుకుంది తనకు నచ్చింది. నాకు నచ్చిన చీరే దానికీ నచ్చాలా? ఐనా … నా అన్న నాకిచ్చింది నేనింకొకళ్ళ కెందుకు ఇవ్వాలి? ఇచ్చినవాడు దాత… ఇవ్వనివాడు రోత… నా చీర నేనివ్వనని మొండికేస్తే… నామీద ఉక్రోషంతో ఒకటే ఏడుపు. ఇవ్వని మొండికి విడువని చండి …. “ఇవ్వనుగాక ఇవ్వను దిక్కున్నచోట చెప్పుకో.” అని నేను మొరాయిస్తే.. ఇల్లంతా పీకి పందిరే వేసింది…….
పోనీ అత్తయినా తనను సమర్ధిస్తుందా? అత్తకు మంచి లేదు చింతకు పచ్చి లేదు…
ఎంత బ్రతిమిలాడినా వినకుండా “ఇద్దరికీ బుద్ధి లేదు.” అంటూ… అన్న తనకి ఇచ్చిన నాల్గు కొత్త చీరలు, తాము పెట్టిన ఆరు కొత్త చీరలు ….. మొత్తం అన్నీ తీసి బీరువాలో దాచేసింది.
అంటే ఆరడి అనకుంటే అలుసు…. తాను గాని నోరు మెదప కుండా ఉండి ఉంటే … ఈ పాటికి తన చక్కదనాల కొత్త చీర కట్టేసుకుని బుట్ట బొమ్మల్లే ముస్తాబయ్యేది కదూ? ఇవ్వడమన్నది ఈ ఇంట లేదు, తే అన్నది తరతరాలుగా వస్తు న్నట్లు – కొత్త పెళ్లి కూతుర్ని నాకు పెట్టకపోగా నా నుంచే లాక్కోడానికి సర్వ ప్రయత్నాలూ చేస్తున్నారు వీళ్ళు!
మొన్నటికి మొన్న, నిశ్చితార్ధం రోజున అత్త ఇచ్చిన కొత్త జరీ చీర కట్టుకుని “ఈ చీరలో నేనెట్లా వున్నాను?” అని అడిగితే…. ” చీరెందుకే నీకు చిన్నారీ! చీర కంటే నువ్వు మరీ బాగుంటావు.” అన్నాడు బావ.
అడిగింది రొట్టె ఇచ్చింది రాయి… నేనన్నా నా చీరలన్నా అందరికీ అలుసే !

***

ఎఱ్ఱని అంచున్న తెల్ల చీర !!
ఎఱ్ఱని కలువలు పొదిగిన చీర !!
తన అర్ధాంగి మనసుపడి కోరిన చీర !!
తాను మక్కువతో కొని తెచ్చిన చీర !!

పొంగుతున్న పాలలా పెల్లుబుకుతున్న తన ఉత్సాహాన్ని క్షణంలో చన్నీళ్ళు చిలకరించి చప్పున చల్లార్చింది చెల్లి మహాతల్లి! పెళ్లి దానికైతే మరెవ్వరికీ మంచి చీర కట్టుకునే సౌభాగ్యం ఉండకూడదులావుంది!
జానా బెత్తెడు ఉద్యోగం. చిన్న చిన్న సంతోషాలు తీర్చుకోలేని జీవితం. అర్హతలు మించిన కోరికలు ఆనందాన్ని దూరం చేస్తాయనే నగ్నసత్యం తెలిసిన వాడు కనునకనే ఉన్నంతలో లోపం లేకుండా, తన గురించి అన్నీ తెలిసిన బావతో చెల్లెలి పెళ్లి కుదిర్చాడు. అమ్మ నాన్నలు కరువైన నాటినుంచీ అత్తమ్మే తమకు పెద్ద దిక్కు. ఏ కష్టమొచ్చినా కడుపులో పెట్టుకుని తమని ఆదుకుంది. దొడ్డ మనసుతో సంబంధం కలుపుకోడానికి తానే ముందుకు వచ్చి అడిగింది. వాళ్లదీ తమలాంటి మధ్య తరగతి బాపతే ! అయితేనేం? అత్తమ్మ చెల్లిని పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటుందన్న నమ్మకం తనకుంది. దాన్ని ఒక దారిలోకి తేగలదన్న ధీమా కూడా వుంది.
ఉన్నంతలో పెళ్లి పన్లు చకచకా చెయ్యడం మొదలెట్టాడు భార్య సహకారంతో.
కొత్త పెళ్లికూతురికి మూడు చీరలు, చిన్న చెల్లికొక చీర, తన భార్యకొక చీర…. అతి కష్టం మీద! అంతకు మించి కొనగలిగే తాహతేదీ?
ఆ రోజు … షాపింగు చేస్తున్న రోజు… షాపులో ఆ చీర చూడగానే కోమలి కళ్ళలో కనిపించిన మెఱుపు తానెలా విస్మరించగలడు? ఆ చీరతో తన భార్య ఎంత అందంగా ఉంటుందో అదే క్షణంలో, కొనక ముందే ఊహించేస్కున్నాడు! అది తన భార్యకే ఇవ్వడానికి గట్టిగా నిర్ణయించేసుకున్నాడు. కానీ అన్ని ఊహలూ నిర్ణయాలూ వ్యర్థం! ఇచ్చిన మూడు చీరలూ పుచ్చుకున్నాక ఆ చీర తనకి చాలా చాలా నచ్చిందనిన్నీ, అది గాని తనకివ్వకపొతే పెళ్లే చేసుకోననీ పెద్దపెట్టున రాగాలు పెట్టింది చెల్లి మహాతల్లి! అయ్యబాబోయ్! నిజంగా అలాగే జరిగితే తమ జీవితానికి తెరిపేదీ…. ?
ఇష్టం లేని పని కూడా తన ఇష్టానికి అనుగుణంగా మలచుకున్న వాడే ప్రజ్ఞావంతుడు….
ఎంత ప్రాప్తమో అంతే ఫలం…. మనసుని రాయి చేసుకుని, భార్యకి నచ్చ జెప్పుకుని, తల ప్రాణం తోకకి తెచ్చుకుని, ఇద్దరికీ ప్రాణ ప్రదమైన చీరను చెల్లికి ధారపోసి, పెళ్లి పనులలో బుర్ర దూర్చేసాడు అన్నివిధాలా అదే మంచిదని.

***

తనలో లోపాలే లేవనుకునే లోపాన్ని మించిన లోపం మరొకటి లేదు….
తాను చేసిన పనే అక్షరాలా తన ఆడపడుచు కూడా చేస్తోందన్న గ్రాహ్యం అక్కకి ఎందుకు లేదు ? తనకు తట్టిన విషయం అక్క కెందుకు తట్టలేదు ? ఆనాడు అన్న అందరికీ కొత్త చీరలు కొని తెచ్చినప్పుడు వొదినకి ఒక్క చీర కూడా మిగల్చకుండా అన్నీ తానే తీసేసుకోడం ఎంత అన్యాయం. ఎంతసేపూ తన గురించే తప్ప పక్కనున్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని ఇంగితమే లేదు అక్కకి. దేవుడు దీనికి తగిన శాస్తి చెయ్యకపోతాడా?
చిన్నబోయిన వదిన ముఖం, అన్న ముఖంలో నిరుత్సాహం ఆ క్షణంలో దాని కంట ఎందుకు పడలేదు ? స్వార్ధానికి సరిహద్దు లేదులా వుంది. అర్హతకు మించిన కోరికలు ఆనందాన్ని దూరం చేస్తాయి. ఉన్నంతలో సంతృప్తి ఊరంతా మంచి… లేనినాడు ప్రపంచమంతా చుక్కెదురే ! మూర్ఖురాలు – పరిస్థితి అర్ధం చేస్కోదే…. ఇక నుంచీ ఈ పరమ గయ్యాళిని అదుపులోనికి పెట్టవలసిన బాధ్యత అత్తమ్మదే.

***
అంతరంగం అందంగా ఉంటే ఆచరణ కూడా అర్ధవంతంగా ఉంటుంది ….
ఎవరినీ ప్రశ్నించకుండా, ఎవరిచేతా ప్రశ్నింపబడకుండా, ఎక్కడా పొల్లు పోకుండా, ఒకరికి వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా, ఉన్న నాల్గు రోజులూ ఒకే చీరతో, నోరెత్తకుండా పెళ్లి పనులన్నీ శ్రద్ధతో పూర్తిచేసి, భర్తతో ఇంటిముఖం పట్టడానికి సిద్ధమైంది కోమలి.
“బొట్టు పెట్టించుకుని వెళ్ళమ్మా” అని, దేవుడిగది లోనికి తీసుకువెళ్లి, ఆమె చేతిలో కొత్త చీరను ఉంచి, “నువ్వు ఈ చీర కట్టుకున్నాకనే ఈ గడప దాటేది.” అని హుకుం జారీ చేసింది అత్తమ్మ.
కొత్త చీర కట్టుకున్న కోమలిని చూసి కొత్త కోడలూ, కూతురూ కంగు తిన్నారు…..
కట్టుకున్న భర్త కళ్లింత చేసుకుని, కలువలన్నీ వెల్లి విరిసేట్టుగా వెన్నెలలు కళ్ళాపి జల్లాడు……
మేనల్లుడి కళ్ళలో జిలుగు చూసిన అత్తమ్మ ఆప్యాయంగా చిరునవ్వు నవ్వింది ……
కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు !!!

——————

4 thoughts on “కొత్త చీర

  1. ఎంతందంగా రాశారండీ… ఆ స్థాయి అనే సాహసం చేయను కానీ… శ్రీపాద వారు గుర్తుకొచ్చేలా చేశారు.

  2. హ హ ,
    బాలేవుందండి చీర పురాణం.అది ఎవరికి చేరాలొ వాళ్ళకే చేరింది.
    రాజేశ్వరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *