పల్లె సద్దు

రచన: కొసరాజు కృష్ణప్రసాద్

తూరుపున దినకరుడు పొద్దుపొడవకముందె,
చిరునవ్వి నా పల్లె నిదురలేచింది.

తల్లి వెనకాలెల్లు కోడిపిల్లల ధ్వనము,
దూడ దరిజేరగా పాలనిచ్చే ఎనుము –
చుట్టాలు వేంచేయు వార్త మోసుకొచ్చి,
నల్ల కాకులు చేయు కావు కావుల రవము!

కళ్లాపి స్నానంతొ వాకిళ్ళు తడవగా,
వికసించె ముంగిట్లో ముత్యాల ముగ్గులు –
సంకురాతిరి శోభ సంతరించుకోగ,
రంగవల్లుల మధ్య మెరిసేటి గొబ్బిళ్ళు!

అరుగుపైనజేరి పత్రికలు తిరగేస్తు
పెద్దమనుషులుజేయు చర్చ సద్దు –
సద్దిమూటనుగట్టి, హాలము బండిలొబెట్టి,
పొలము బయలెల్లేటి రైతుబిడ్డల సద్దు!

జడివాన జల్లులకు నల్లరేగడి తడవ,
మట్టితో చేసిన బొమ్మలాటల సద్దు –
చూరు గడ్డిని తడిపి జాలువాఱుతున్న
ముత్యాల సరళిలో బిందువుల సద్దు!

నాటులేసేకాడ అమ్మలక్కల నోట
పల్లె పాటలుజేయు మధురమైన సద్దు –
పైరుగాలికి పైరు పైటెగురుతుంటేను,
నాట్యమాడే ఎడ్ల అందె రవళుల సద్దు!

చిననాడు సెలవల్లొ నేనాడుకున్నట్టి
తాటిబుర్రల బండి పరుగుజేసిన సద్దు –
అందంగా ముస్తాబై ట్రింగు ట్రింగూ అంటు,
బంధుమిత్రులజేర్చు సైకిల్ రిక్షా సద్దు!

పాలైసు బండికై ఎదురుజూసిన కళ్లు,
గడ్డివాములొ దాచి పండించిన పళ్లు –
లొట్టలేసుకు తిన్న ఈత, నెరేళ్ళు,
సపోటా, బొప్పాయి, ముంజు, మామిళ్ళు!

పొద్దుపోయేదాక అలుపుసోలుపూ లేక
పిల్లలందరు కలిసి ఆటలాడిన సద్దు –
సాయంత్ర సంధ్యలో వడి వడిగ వస్తున్న,
రైతు బండి ఎడ్ల మువ్వ సవ్వడి సద్దు!

అక్కచెల్లెళ్ళతో, అన్నదమ్ముళ్ళతో,
నే పంచుకున్నట్టి అందాల పొదరిల్లు,
అలపుతో ఆనంద కలపుతో అలరారె
నా పల్లె రైతింట విరియాలి హరివిల్లు!

One comment on “పల్లె సద్దు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *