పాతది .. కొత్తది

రచన: రామా చంద్రమౌళి

శీతాకాలపు ఆ ఆదివారం ఉదయం
అతను ఆలస్యంగా నిద్రలేచాడు
కిటికీ తెరిచి , తలుపు తెరిచి .. వాకిట్లోకి అడుగు పెడ్తే
పల్చగా, చల్లగా, గాజుతెరలా మంచుపొర
మెట్ల దగ్గర .. మల్లెపాదు మొదట్లో కుక్కపిల్ల పడుకునుంది ముడుచుకుని
గేట్ దగ్గర పాల ప్యాకెట్ , రెండు దినపత్రికలు
లోపలికొస్తూ ‘ ష్ ‘ అని విదిలిస్తే .. కుక్క కళ్ళు తెరిచి .. చూచి.. లేచి
నాలుగడుగులు వెనుకనే నడచి వచ్చి
మళ్ళీ వెళ్ళి అక్కడే మల్లెపాదు మొదట్లోనే పడుకుంది బద్దకంగా
తర్వాత అతను చుట్టూ చూశాడు కాఫీ తాగుతూ
అదే పాత గది .. పాత ఇల్లు .. పాతదే వాకిలి
పాతవే పూల మొక్కలు
పాతదే కుక్కపిల్ల .. పాతదే గాలి .. పాతదే ఆకాశం
పాత సూర్యుడే.,
ఒక కొత్తదనం కోసం .. అతను బయటికి బయల్దేరాడు కార్లో
కొత్త వీధులు , కొత్త రోడ్లు .. కొత్త మనుషులు
కొత్త పొలాలు .. కొత్త అడవులు .. కొత్త గుట్టలు
చాలా దూరమే వెళ్ళాడతను .. చాలాసేపు
అప్పటికి అన్నీ పాతబడ్డాయి
తిరిగి వస్తున్నపుడు
అన్నీ పాత పొలాలు.. పాత అడవులు .. పాత గుట్టలు
పాతవే పాదాలు .. పాతదే శరీరం
ఏదో అర్థమౌతున్నట్టనిపించి
తిరిగి తిరిగి అతను మళ్ళీ ఇంటికొచ్చాడు –

గేట్ తెరవగానే
మల్లెపాదు మొదట్లోని కుక్కపిల్ల కోసం వెదికాడు
అది లేదక్కడ
చూస్తూండగానే తన కారు వెనుక సీట్లోనుండి దూకింది చటుక్కున
ఎందుకో అతను దాన్ని ప్రేమగా పొదివి పట్టుకుని
తాళం తెరిచి ఇంట్లోపలికి అడుగుపెట్టగానే
పాత గదే కొత్తగా .. పాత ఇల్లే మళ్ళీ కొత్తగా
పాతదే గాలి .. పాతదే ఆకాశం.. పాత సూర్యుడే అతి కొత్తగా
అనిపిస్తూండగా .. అతనికర్థమైంది
‘ బయట ఉన్నదంతా అతిపురాతనమైన పాతదే ,
ఎవరికివారు
కొత్తదనమంతా ‘ లోపలే ‘ వెదుక్కోవాలి ఎప్పటికప్పుడు..’ అని
నిశ్చలంగా అతను చూస్తూనే ఉన్నాడు బయటికి .. కిటికీలోనుండి
అవతల సన్నగా పాతదే మంచు కొత్తగా కురుస్తూనే ఉంది –

2 comments on “పాతది .. కొత్తది

  1. కొంతం శ్రీనివాస్, కరూర్ వైశ్యా బ్యాంక్. says:

    బాహ్య ప్రపంచం, అంతరంగ ప్రపంచం యొక్క, ప్రతిబింబం మాత్రమే.
    అంతరంగ ప్రపంచం లోని బింబమే, ఒక అద్దం లాగా, బాహ్య ప్రపంచం లో ప్రతిబింబిస్తుంది.
    కావున, ఒక అంతరంగం లోని మార్పు, బయట కనపడుతుంది అన్న మాటలను ఈ కథ నిరూపిస్తున్నది.
    రచయిత సదా అభినందనీయులు.

Leave a Reply to కొంతం శ్రీనివాస్, కరూర్ వైశ్యా బ్యాంక్. Cancel reply

Your email address will not be published. Required fields are marked *