March 31, 2023

“మనీ” షి

రచన: కంభంపాటి రవీంద్ర

“లుటే కోయీ మన్ కా నగర్ ..బన్ కె మేరా సాథీ” అని అనిత పాడుతూంటే, చేతిలో ఉన్న ఐస్ కోల్డ్ గా ఉన్న కోక్ టిన్ను పట్టుకుని అలా వింటూండిపోయేడు ఆత్రేయ ! ఆఫీస్ లో ఎవరో యూఎస్ వెళ్తూంటే ఫేర్వెల్ పార్టీ జరుగుతూంది, పార్టీ అనే ఏమిటి, వాళ్ళ ఆఫీస్ లో ఏ ఫంక్షన్ అయినా కూడా అనిత పాట పాడడం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, అంత బాగా పాడుతుంది మరి !
పాట పాడడం అయిపోయిన వెంటనే అందరూ ఒకటే చప్పట్లు, ఇంకొక్క పాట పాడమని తెగ రిక్వెస్టు చేస్తే,” తేరే బినా భి జిందగీ సే కోయి షిఖ్వా తో నహీ” అంటూ ఆ అమ్మాయి పాడడం మొదలెట్టేసరికి, కాస్త దూరంలో ఉన్న దోశ కౌంటర్లో దోశెలేసే నరహరి దోశ తిప్పడం మర్చిపోయి అలా వింటూండిపోయేసరికి, వేస్తున్న దోశ కాస్తా మాడిపోయింది !
పాట పాడడం అయిపోయిన వెంటనే ఆత్రేయ దగ్గిరికి పరిగెత్తుకుని వచ్చేసింది !
“మిథాలీ దగ్గర కాస్సేపు ఉండొచ్చుగా .. మళ్ళీ తను యూఎస్ నుంచి ఎప్పుడొస్తుందో మరి “అన్నాడు ఆత్రేయ
“నువ్వు నా చుట్టుపక్కల ఉన్నప్పుడు, నీ కన్నా నాకెవరూ ఇంపార్టెంట్ కాదు” అని అనిత అంటే,” పోనీ నన్ను వెళ్లిపొమ్మంటావా ?” అని నవ్వేడు ఆత్రేయ .
“ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పను .. సరే .. కాస్సేపు అలా బయటికెల్దామా ?” అడిగింది అనిత.
ఇద్దరూ ఆఫీస్ క్యాంటీన్ బయటనున్న లాన్ లో నడుస్తున్నారు .
“మన సంగతి .. మీ ఇంట్లో చెప్పేవా ?” అడిగింది అనిత
“చెప్పాలంటే భయమేస్తూంది .. అందుకే .. మా పిన్ని హెల్ప్ తీసుకుంటున్నా” అన్నాడు ఆత్రేయ
“ఆవిడ మనకి సపోర్ట్ గా మాట్లాడతారంటావా ?”
“తప్పకుండా.. మొన్న వీకెండ్ మా పిన్ని, బాబాయ్ లని కలిసేను .. నీ ఫోటో చాలా నచ్చింది వాళ్లకి .. అసలు నీకో సిస్టరుంటే వాళ్ళ అబ్బాయి ప్రవీణ్ కి చేసుకుందురట”
“పోన్లే.. అదొక రిలీఫ్ .. ఆవిడ మీ పేరెంట్స్ ని కన్విన్స్ చేయగలిగితే చాలు” అంది అనిత.
“సరే.. నేను ఇంటికి బయల్దేరాలి .. ఇవాళ మా లక్ష్మి పిన్ని వాళ్ళు ఇంటికొస్తామన్నారు .. హోప్ ఫుల్లీ ..వాళ్ళ సపోర్ట్ తో మన పెళ్లి సంగతి మాట్లాడతాను” అన్నాడు ఆత్రేయ
“లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్” అని అతని చేతిని గట్టిగా నొక్కింది అనిత .
ఆ రోజు రాత్రి ఆత్రేయ వాళ్ళింట్లో పెద్ద చర్చే నడిచింది .
“ఆ పిల్లకి తల్లీ, తండ్రీ లేరు, ఇలాంటి అణా కాణీ సంబంధం ఎందుకు మనకి” అన్నాడు ఆత్రేయ తండ్రి లక్ష్మణ్
“నిజమే బావగారూ .. ఆ పిల్లకి తల్లీ, తండ్రీ లేరు.. చిన్నప్పట్నుంచీ తనని వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య పెంచారు .. అయినా కూడా ఎంత చక్కగా పెరిగింది ఆ అమ్మాయి ! బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తూంది .. ఇంత కన్నా ఏం కావాలండీ” అని లక్ష్మి అంటే
“చాల్లేవే .. వీడు చేసే ఉద్యోగం లో అమెరికా వెళ్లే అవకాశం ఉంది .. కానీ ఆ పిల్ల అమెరికా వెళ్ళాదట .. తను అక్కడికి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య లని ఎవరూ చూసుకోడానికి ఉండరు కాబట్టి ఇక్కడే ఉంటుందట ..అంటే .. మన వెధవ కూడా ఆ పిల్ల తో పాటు, ఇక్కడే పడి ఉండాల్సిందే ..పైగా .. ఆ ముసలాళ్ళిద్దరి ఖర్చూ కూడా మన వెర్రాడి జేబులోంచే “అంటూ అందుకుంది ఆత్రేయ తల్లి సరస్వతి
“అక్కా .. ఆ అమ్మాయి తనని పెంచినందుకు వాళ్ళని చూసుకోడానికి ఇండియా లోనే ఉండిపోడానికి నిశ్చయించుకుంది అంటే .. ఆ పిల్లది ఎంత గొప్ప మనసో ..” అని లక్ష్మి అంటే.
“మనసుదేవుంది ..అన్నం పెడుతుందా ఏవన్నానా .. వీడి తోటివాళ్ళందరూ అమెరికా, యూరప్ అంటూ ఉద్యోగాలొచ్చి వెళ్లి, డబ్బులు సంపాదించేస్తూంటే, వీడు మటుకు ఆ పిల్లతో పాటు ఇక్కడే ఉండి, ఆ ముసలాళ్ళ సేవలో తరించాలేంటి ? పైగా ..వాళ్ళది మన శాఖ కూడా కాదు ..
కనీసం వెలనాట్లు కూడా కాదు ..నియోగులట !!” ఈసడింపుగా బదులిచ్చింది సరస్వతి
“డబ్బుదేముందక్కా .. గుణం ముఖ్యం గానీ .. ఇంక శాఖాభేదం అంటావా ..ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు కనక ?.. అసలు మీవాడో బ్రాహ్మణ పిల్లని ప్రేమించేడు .. అదే సంతోషం అనుకోవాలి” అంది లక్ష్మి
“నీకు డబ్బూ, శాఖ, కులమూ ప్రధానం కానప్పుడు, ఆ పిల్లని మీవాడికే చేసుకో .. మావాడ్ని వెనకేసుకు రాకు .. ఒకవేళ వీడు మమ్మల్ని కాదని ఆ పిల్లని చేసుకుంటే, వీడికి మేమెవరమూ లేనట్టే” కోపం గా అన్నాడు లక్ష్మణ్
“నాకు ఆత్రేయ, ప్రవీణ్ వేర్వేరు కాదండి . . ఒకవేళ ఆత్రేయ ఆ అమ్మాయిని ప్రేమించకుండా ఉండుంటే, ఆ పిల్లని మా ప్రవీణ్ కి కళ్ళకద్దుకుని చూసుకునేదాన్ని” అనేసి విసురుగా వెళ్ళిపోయింది లక్ష్మి .
మర్నాడు అనితని తీసుకుని, లక్ష్మి పిన్ని వాళింటికెళ్ళేడు ఆత్రేయ.
“పిన్నీ .. ఏం చెయ్యాలో తోచటం లేదు ..అనితేమో పెద్దలు ఒప్పుకోనిదే పెళ్ళొద్దు అంటూంది .. మరి నిన్న మా అమ్మా వాళ్ళ అభిప్రాయం చూసేవు కదా .. నువ్వే చెప్పు ..” అన్నాడు
“ఒరే వెధవా .. ఆ పిల్లని నిజంగా ప్రేమించుంటే, ఏం చెయ్యాలో తోచడం లేదు లాంటి వెర్రిమాటలెందుకొస్తాయి ?.. నిజం చెప్పు .. ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నావా ?” అంది లక్ష్మి
“భలేదానివి పిన్ని .. మా అమ్మతో సమానమైన రెస్పెక్ట్ ఇస్తాను నీకు .. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పేనా ?.. నేను అనిత ని తప్ప వేరెవర్నీ పెళ్లి చేసుకోను .. ప్రామిస్” అన్నాడు ఆత్రేయ
“అయితే …ఇంకేమి. నేనూ, మీ బాబాయి గారు కలిసి వీళ్ళ తాతగారితో మాట్లాడతాము .. మీ అమ్మావాళ్ళూ ఇప్పుడు ఒప్పుకోకపోయినా, తర్వాతయినా ఒప్పుకోక తప్పదు .. నువ్వు తప్ప వాళ్ళకెవరున్నారు కనుక ?” అని భరోసా ఇచ్చింది లక్ష్మి పిన్ని !
“చాలా థాంక్స్ పిన్నీ” అని ఆత్రేయ అంటే,” మీరీ హెల్ప్ చేసినందుకు ఎప్పటికీ మర్చిపోలేమండి” అంటూ అనిత లక్ష్మి పిన్ని కాళ్ళకి దణ్ణం పెట్టేసింది
“ఆమ్మో! మా పెద్ద కోడలు బంగారం” అంటూ ఆశీర్వదించింది లక్ష్మి .

**************************

“మనకి పెళ్ళై రెండేళ్ళవుతూంది. బాబు పుట్టి ఏడాదవుతూంది .. ఇంతవరకూ మావయ్యగారూ వాళ్ళూ మనల్ని కలుపుకోడానికి ఇష్టపడ్డం లేదు” దిగులుగా అంది అనిత
“పెళ్ళైతే మాతో సంబంధం లేదని మా నాన్నగారు ముందే చెప్పేరుగా” అన్నాడు ఆత్రేయ
“కరెక్టే .. కానీ ఇప్పుడు, బాబుని, అమ్మమ్మ వాళ్ళని చూసుకోడానికి నేను జాబ్ మానేసి ఏడాదవుతూంది .. నీ ఒక్కడి శాలరీతో ఇంతమందిని ఎలా పోషిస్తావు ?” బాధగా అంది అనిత
“ఒక మూడు నెలలు అమెరికాకి వెళ్లమంటున్నారు .. కొంచెం ఇలాంటి షార్ట్ ట్రిప్స్ ఒప్పుకుంటే డబ్బులు మిగులుతూంటాయి .. నీకు సపోర్ట్ గా మా లక్ష్మి పిన్ని ఉంటుంది .. ఓసారి వాళ్ళింటికి వెళ్ళి విషయం చెబుదాం” అని లక్ష్మి పిన్ని వాళ్ళింటికి బయల్దేరదీసేడు .
లక్ష్మి పిన్ని వాళ్ళ ఫ్లాట్ బయట చెప్పులిప్పి కాలింగ్ బెల్ కొట్టబోతూ ఆగాడు ఆత్రేయ,
“ఆ ఆత్రేయగాడిలా పిచ్చి సంబంధమేదైనా ప్రేమా దోమా అంటూ అన్నావంటే ఇదిగో. ఈ సిలిండర్ పేల్చుకుని చస్తా వెధవా .. నీకొచ్చింది అల్లాటప్పా సంబంధం అనుకున్నావా ? పిల్లకి గ్రీన్ కార్డుంది .. కోటీశ్వరులు .. పైగా మన శాఖే .. వైదీకులు” అంటూ తన కొడుకు ప్రవీణ్ మీద విరుచుకుపడుతున్న లక్ష్మి మాటలు స్పష్టంగా వినిపించాయి !

6 thoughts on ““మనీ” షి

 1. అయ్యో..ఎప్పటికి మారుతారో ..ఈ పిచ్చి జనాలు.శుభ్రం గా ఉన్న పిల్ల ని కాదనే మూర్ఖ తల్లి తండ్రులు..పిన్నులు..అయ్యో రామా..
  మీదైన స్టైల్ లో ఝలక్ ఇస్తూ బాగుందండి.

 2. అవునండీ నూటికి ఎనభైమందికి తమకో నీతి , ఎదుటి వాళ్ళకో నీతి . వేదికలెక్కి చెప్పేవారంతా చేస్తారనుకోవడం వంటిదే ఇది. మాటవినే కొడుకైతే శాఖల శఖలతో
  కూడా ఆడించేస్తారు . ఏవిటో కొడుకులు అమెరికా వెళితే వీళ్ళకేం ఒరుగుతుందో .?
  రెండుసార్లు అమెరికా వెళ్ళొస్తారు వీళ్ళుకూడా లేదా రెండు పురుళ్ళకో , పసిపిల్లలను పట్టకోడానికో వెళ్ళొస్తారు . అంతటితోఆమోజుతీరుతుంది . ముసలితనంలో ఆశ్రమాలే గతి ! ఎప్పటికి ఈ పెద్దవాళ్ళు కొందరు ఇచ్చిన మర్యాద , మంచితనం అర్థం చేసుకుంటారో కదా !
  చివర్లో ఝలక్ ఇచ్చారు . ఆ కొసమెరుపుకే మావంటి పాఠకులు ఫిదా !
  అభినందనలు

Leave a Reply to G.S.Lakshmi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

March 2018
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031