March 30, 2023

రెండో జీవితం – 6

రచన: అంగులూరి అంజనీదేవి

ఆముక్త కారుదిగి లోపలకి వస్తుంటే చూసి మండేనిప్పుల కణికలా అయింది శృతిక. రెండడుగులు ఎదురెళ్లి ఉరిమి చూస్తూ….
”ఆయన ఇంట్లో లేరు” అంది అక్కడే ఆగు అన్నట్లు.
అర్థంకాక బిత్తరపోయింది ఆముక్త. అభిమానంతో అడుగు వెనక్కి తీసుకొని, వెనుదిరిగి కారెక్కి వెళ్లిపోతూ ద్రోణకి కాల్‌ చేసింది. అతని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో వుంది.
ఆ రోజు ఫోన్లో కృతికతో శృతిక మాట్లాడటం విని, వెళ్లిపోయిన ద్రోణ ఇంతవరకు ఇంటికి రాలేదు శృతిక ఆ బాధలో వుండగా ఆముక్త ఇలా రావటం ఆగ్రహాన్ని తెప్పించింది. అడవిలో ఎండిన చెట్టుకి నిప్పంటుకున్నట్టు భగభగ మండింది. ఆ టైంలో తనేం చేస్తుందో తనకే అర్థంకాని పనిచేసింది శృతిక. ఆ పనివల్ల పర్యవసానం ఎలా వుంటుందోనని ఆలోచించలేదు. ఎవరైనా తనలాగే చేస్తారని తనని తను మభ్యపెట్టుకుంది.
వెంటనే బయటకొచ్చి తలుపుకి తాళంపెట్టి ఆటో ఎక్కింది.
ఓ గంట ప్రయాణించాక ఆటో దిగి లోపలకెళ్లి…
”అత్తయ్యా!” అంటూ గట్టిగా పిలిచింది శృతిక.
”ఎందుకే అంత గట్టిగా పిలుస్తావ్‌! నాకేమైనా చెవుడా?” అంది విమలమ్మ కోడలివైపు తిరిగి చూస్తూ…
”మీ అబ్బాయి నన్ను వదిలేసి శాంతినికేతన్‌ వెళ్లినట్లుంది. వెళ్లే ముందు నాకు చెప్పలేదు. రాష్ట్రంలో ఎక్కడ ఎగ్జిబిషన్‌ వున్నా నాకు చెప్పే వెళ్తాడు. ఫోన్‌ చేస్తే కట్ చేస్తున్నాడు. ఇప్పుడెలా? నాకు భయంగా వుంది.” అంది శృతిక.
షాక్‌ తిన్న దానిలా చూసింది విమలమ్మ.
”మాట్లాడరేం అత్తయ్యా! నాకు చాలా కంగారుగా వుంది. మామయ్యగారితో చెబుదాం!” అంటూ ఆయనకోసం కళ్లతోనే వెతికింది శృతిక.
”ఆయన ఇప్పుడే బయటకెళ్లారు. కూర్చో శృతీ! కంగారెందుకు?” అంది నెమ్మదిగా
శృతిక ఆశ్చర్యపోతూ.. ”మామయ్య మీతో చెప్పకుండా ఎటో వెళ్లి, ఫోన్‌ కట్ చేస్తుంటే కంగారుపడరా..?” అంది.
”ఆయనలా వెళ్లరు. చెప్పే వెళ్తారు” అంది విమలమ్మ
”ఈయన అలాకాదు. ఏం చెయ్యను నా ఖర్మ… ఇసుక తోడితే నీళ్లొస్తాయని నమ్మి పిచ్చిదానిలా తోడి, తోడి వేళ్లు పోతున్నాయ్‌! గోళ్లు పోతున్నాయ్‌! నీళ్లు రావటంలేదు. నిప్పులు రావటంలేదు.” అంది నీరసంగా చూస్తూ…
తన కొడుకునలా విమర్శిస్తుంటే బాధగా వుంది విమలమ్మకు వచ్చినప్పటినుండి కొడుకు ఎందుకంత డల్‌గా వున్నాడో ఇప్పుడర్థమైందామెకు…
శృతిక గొంతు విని గదిలోంచి బయటకొచ్చాడు ద్రోణ.
ద్రోణను చూసి ఆశ్చర్యపోతూ ”మీరిక్కడున్నారా? చెప్పరేం అత్తయ్యా! మీరు కూడా మీ కొడుకులాగే ఏడ్పించాలని చూస్తున్నారా?” అంది విమలమ్మ వైపు చూస్తూ…
”నిన్నెవరు ఏడ్పించరు. నువ్వే ఏడ్పిస్తున్నావు…” అన్నాడు ద్రోణ.
ద్రోణవైపు చూడకుండా ”మీరు పెద్దవారు.. ఆయన నాతో గొడవపడి వచ్చినప్పుడు నచ్చచెప్పి ఇంటికి పంపొద్దా? ఇక్కడే వుంచేసుకుంటారా ఎప్పటికి.?” అంది అత్తయ్యనే చూస్తూ పెద్దగా అరుస్తు…
ఏం మాట్లాడాలో తోచలేదు విమలమ్మకి…
ఎదుటిమనిషిని అకారణంగా నిందించటం, విమర్శించటం, ఫిర్యాదులు చెయ్యటం ద్రోణకి నచ్చదు. దేనిలోనైనా నిజాయితీ వుండాలంటాడు.
అందుకే… ”చూడు! శృతీ! నాకు తెలిసున్న పెద్ద యాడ్‌ ఏజన్సీ మేనేజర్‌ నన్ను కలుస్తానన్నారు. ఆ మేనేజర్‌ లేడి! నీకు ఆడవాళ్లు కన్పిస్తే భరించలేవు కదా! అందుకే ఇక్కడ వుంటాను. మీటవ్వమని చెప్పాను. ఆమెకు హోటల్స్‌లో కలుసుకోవటం ఇష్టం వుండదు.” అన్నాడు.
ద్రోణవైపు ఒకరకంగా చూసి.. ”అత్తయ్యా! నన్ను ఈయనకెందుకిచ్చి పెళ్లి చేశారు? ఈ బాధలన్నీ పడానికా? ఎప్పుడు చూసినా బొమ్మలతో, ఆడవాళ్లతో గడుపుతుంటే నా కళ్లతో నేనెలా చూడాలి?” అంది.
కోడలికెలా నచ్చచెప్పాలో తెలియలేదామెకి..
”మనిషికి ఇంత అసంతృప్తి, ఇంత గందరగోళం అవసరం లేదు. తెల్లకాగితంలా వుంచుకోవలసిన హృదయం నిండా పిచ్చిగీతలు గీసుకొని చిన్నాభిన్నం చేసుకుంటున్నావు. గాజుపలకలా వుంచుకోవలసిన మనసుని నీ చేతులతో నువ్వే పగలగొట్టుకుంటున్నావ్‌! ఇందుకు నేను ఏమాత్రం బాధ్యుడ్ని కాదు..” అంటూ తను అక్కడో క్షణం కూడా నిలబడకుండా తన గదిలోకి వెళ్లాడు.
శృతికను అక్కడే వదిలి కొడుకు దగ్గరకి వెళ్లింది విమలమ్మ.
”ద్రోణా! నాలుక కత్తికంటే పదునైంది. అది రక్తం చిందకుండానే దేన్నైనా నాశనం చేస్తుంది. ఆ బాధేంటో నాకు తెలుసు. కానీ శృతిక ఏడుస్తోంది. నువ్వు లేకుండా గంట కూడా వుండలేనంటోంది.” అంటూ ద్రోణ పక్కన కూర్చున్నాడు తండ్రి సూర్యప్రసాదు.
”అలాగే అంటుంది నాన్నా…! తర్వాత బాగా విసిగిస్తుంది.” అన్నాడు ద్రోణ.
”విసిగిపోయానని విసిరికొట్టానికి ఇదేమైనా క్రికెట్ బంతా! కాపురం. కోడలి ముఖం చూస్తే జాలిగా వుంది” అన్నాడు
”మీ కోడల్ని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు నాన్నా! క్షణక్షణం అనుభవించినవాడ్ని. చదువుకున్నానన్న సృహకూడా వుండదామెలో…” అన్నాడు ద్రోణ.
”నిన్ను కోరి – తన కూతుర్ని నీ చేతిలో పెట్టాడు మీ మామయ్య. నువ్వైతే బాగా చూసుకుంటావని.. ఆయన్ని బాధపెట్టకురా!” అంది విమలమ్మ.
”చూసుకుంటానని కాదమ్మా! భరిస్తానని..” అన్నాడు ద్రోణ.
”ఏదో ఒకటి… కోడల్ని ఇంటికి తీసికెళ్లు. తొందరపడకు.” అంటూ నచ్చ చెప్పాడు సూర్యప్రసాద్‌.
”నేనేం తొందరపడ్తున్నాను నాన్నా! నాకు బయటనుండి ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని మనసులో పెట్టుకొని వాళ్ల అక్కయ్య ఇంటికెళ్లి స్కూటీ యాక్సిడెంట్ లో నీనా చెయ్యి విరగ్గొట్టింది. వాళ్ల అత్తయ్య నోటికొచ్చినట్లు మాట్లాడితే భయపడి నావెంట వచ్చింది… ఫోన్‌కాల్స్‌ని చూసి ఫీలవుతోందని వాటిని కట్ చేస్తూనే వున్నాను.
కానీ విదేశాలనుండి వచ్చేకాల్స్‌ని, యాడ్‌ ఏజన్సీ వాళ్ల కాల్స్‌ని, పత్రికాఫీసుల కాల్స్‌ని కట్ చేస్తుంటే నన్ను ఆర్టిస్ట్‌ అంటారా? అందరికి అందుబాటులో వుండాల్సిన నేను అలా ఫోన్‌కాల్స్‌ని కట్ చేస్తే ఎలా వుంటుంది? పోకస్‌డ్‌గా డెవలప్‌ కావలసినవాడ్ని అలా మౌనంగా వుండి నా కాళ్లను నేనే విరగ్గొట్టుకున్నట్లు నా కళను నేనే అణచుకోవాలా?” అన్నాడు.
”నువ్వు నాకు అర్థమవుతున్నావు ద్రోణా!” అన్నాడు సూర్యప్రసాద్‌ అంతకన్నా ఇంకేం మాట్లాడలేక…
”నన్ను ఇంట్లోనే వుంచుకొని నాలుగురోజుల నుండి ఇంట్లో లేనని చెప్పటం నన్ను బ్లేమ్‌ చెయ్యటం కాదా? నా క్యారెక్టర్‌పై అవతలవాళ్లకి చిన్న చూపు కలగాలనేగా! అవమానించినా పడొచ్చుకాని, అనుమానించటం నరకం…” అన్నాడు
భార్యవైపు చూశాడు సూర్యప్రసాద్‌.
”ఏమోనండి! ఎవరి సమస్యల్లో వాళ్లు కొట్టుకుపోతున్నారు. మనమేం చెప్పగలం!” అంది రోగం బాగా ముదిరిన రోగుల్ని చూస్తున్న డాక్టర్‌లా చూస్తూ విమలమ్మ.
”అనుమానం ప్రేమవున్న చోటే వుంటుంది ద్రోణా!” అన్నాడు సూర్యప్రసాద్‌.
”అదేం ప్రేమ నాన్నా..? నేను ఎటు చూస్తే అటే చూస్తుంది. అక్కడెవరైనా అమ్మాయి వుందేమోనని… నేను వేసే అమ్మాయిల బొమ్మల్ని-చూసి.. ఇది మీరే వేశారా? ”ఈ బొమ్మను మీ కుంచే కదా తాకింది?” అంటుంది చురకత్తిలా చూస్తూ … ఇదేం ప్రేమో తట్టుకోలేక పోతున్నాను.” అన్నాడు ద్రోణ.
”మీ అమ్మకూడా శృతిక అంత వయసులో అలాగే వుండేదిరా! పోలికలు వస్తాయిగా! మీ అమ్మకి నేనంటే ప్రాణం ద్రోణా! దాన్ని భరించటంలో కూడా ఓ ఆనందం వుంది…” అన్నాడు సూర్యప్రసాద్‌.
ద్రోణ ఇంకేం మాట్లాడలేదు

*****

ఇంటికెళ్లాలని శృతికతో కలిసి కారులో కూర్చున్న ద్రోణను చూసి సంతోషించారు ద్రోణ తల్లిదండ్రులు…
కారులో కూర్చున్నాక శృతిక, ద్రోణ సరదాగా మాట్లాడుకుంటూ ఇల్లు చేరుకున్నారు.
ముందుగా కారు దిగిన శృతిక తలుపుకి తాళం తీసి నేరుగా వంటగదిలోకి వెళ్లింది.
కారుని పార్క్‌ చేసి హుషారుగా, ఉత్సాహంగా అడుగులు వేస్తూ నిత్యం తను బొమ్మలు వేసే గదిలోకి ప్రవేశించి స్థాణువయ్యాడు ద్రోణ.
ఆ గదిలో బూడిద తప్ప ద్రోణ వేసిన బొమ్మలు లేవు.
ఒక్కక్షణం తన కళ్లను తను నమ్మలేనట్లు గదంతా కలియజూశాడు. ఈ గది నాదేనా అన్న అనుమానంతో ఇది నీ గదే అన్నట్లు స్టాండ్‌ బోర్డ్‌ కన్పించటంతో షాక్‌ తిన్నాడు.
అంతత్వరగా తేరుకోలేని షాక్‌ అది.
నిలబడే శక్తి లేనట్లు కుప్పకూలిపోయాడు.
తను వెళ్లాక తన గదికి షార్ట్‌సర్క్యూట్ అయిందా? అనుకున్నాడు. అలా అనుకోవానికి ఆధారాలు బలంగా లేవు.
మరి ఏం జరిగింది?
తన బొమ్మలెందుకలా తగలబడిపోయాయి?
ఈ బొమ్మలు ఒక్కగంట, ఒక్కరోజులో వేసినవి కావు. నెలలు, సంవత్సరాలు శ్రమపడి వేసిన బొమ్మలు… ఈ మధ్యన ఎగ్జిబిషన్‌లో కొన్ని అమ్ముడుపోగా మిగిలినవి భద్రంగా ఇల్లు చేర్చుకున్నాడు. కొన్ని బొమ్మలు విదేశాలకు పంపాలని ప్యాక్‌ చేసి రెడీగా వుంచాడు. అవి కూడా కాలిపోయాయి. పత్రికలవాళ్లు పంపిన స్క్రిప్టులు కూడా కాలిపోయాయి. అందులో యాడ్‌ఏజన్సీ వాళ్లకోసం వేసిన బొమ్మలు కూడా వున్నాయి. ఇది ఏ ఆర్టిస్ట్‌కి జరగకూడని అన్యాయం… ఇదెలా జరిగింది?
వ్యాపారంలో నష్టమొస్తే కోలుకోవచ్చు. ఏదైనా జబ్బు వస్తే డాక్టర్‌ దగ్గరకి వెళ్లి నయం చేయించుకోవచ్చు… కానీ క్షణమో రకంగా ఫీలయి నెలలు, సంవత్సరాలుగా గీసిన ఈ బొమ్మల్ని ఈ జన్మలో తను మళ్లీ గీయగలడా?
జరిగిపోయిన సృష్టి మళ్లీ రాదు. జరగబోయే సృష్టికి జరిగిపోయిన సృష్టికి చాలా తేడా వుంటుంది. గతజన్మను ఎలా చూసుకోలేడో తన బొమ్మల్ని కూడా తనిక చూసుకోలేడు.
తల పగిలిపోతుంది ద్రోణకి…
శృతిక స్టౌ దగ్గర నిలబడి కాఫీ కలుపుతూ – ఇకపై తన భర్తతో హాయిగా గడపాలని… రోజుకో రకం చీర కట్టుకొని ఆయనకి నచ్చిన విధంగా వుండాలని… ఆయన అప్పుడప్పుడు అడిగే సన్నజాజులు తలలో పెట్టుకొని, పాతతరం అమ్మాయిలా, ఆయన గీసుకునే బొమ్మలా వుండాలని అనుకొంది.
కాఫీ కప్పు పట్టుకొని భర్త వున్న గదిలోకి వెళ్లింది. అక్కడ ద్రోణ సర్వం పోగొట్టుకున్న వాడిలా కూర్చుని వున్నాడు.
సన్నగా నవ్వుతూ అతనికి దగ్గరగా వెళ్లింది. ఆ బూడిదవైపు చేయి చూపి ” ఈ బొమ్మల కోసమేగా ఆడవాళ్లంతా పడి చచ్చి, మీకు ఫోన్లు చెయ్యటం… మీ చుట్టూ తిరగటం.. ఇవే లేకుంటే ఏముందిక్కడ? వట్టి బూడిద. అందుకే వీటిని బూడిద చేశా…” అంది నవ్వుతూ…
వెంటనే కొండను ఢీకొన్న పెనుకెరటంలా లేచి ఆమె చెంప చెళ్లు మనిపించాడు. ఆ దెబ్బ తీవ్రతకి కాఫీ కప్పుతో పాటు ఆమె కూడా తిరిగింది. కాఫీ మొత్తం గదినిండా పడ్డాయి.
నిలబడాలంటే కళ్లు తిరుగుతున్న దానిలా కాస్త తడబడి, నెమ్మదిగా కంట్రోల్‌ చేసుకొని నిలబడి…
”నన్ను కొడతారా?” అంటూ చెంపమీద చేయిపెట్టుకొంది.
”చంపేస్తాను…” అన్నాడు ఆవేశంగా.
”ఏం చేశానని నన్ను చంపుతారు?” అంది
”ఎన్నో సంవత్సరాల నా తపస్సుని పాడుచేశావు. నేను పడ్డ శ్రమనంతా ఒక్కక్షణంలో తగలబెట్టి బూడిద చేశావు.” అన్నాడు
”మీరు రోజూ నా మనసును బూడిద చెయ్యటం లేదా? అంతకన్నా ఇది ఎక్కువా?” అంది
”నీకు మనసుంటే కదా! బూడిద కావటానికి?” అన్నాడు
”నాకు మనసు లేకుంటే మిమ్మల్నింతగా ప్రేమిస్తానా?” అంది.
”నా వినాశనాన్ని కోరే నీ ప్రేమ నాకవసరంలేదు. నా భార్యగా నా పక్కన వుంటూ నామీద నువ్వింత అసూయను పెంచుకున్నావని తెలుసుంటే అప్పుడే మీ ఇంటికి పంపివుండేవాడ్ని…” అన్నాడు.
”నాకు ముందే తెలుసు. మీలాంటి వాడ్ని మార్చటం కష్టమని…” అంది.
”నీకు నాతో మాట్లాడే అర్హతలేదు. చేసిన బూడిద చాలు. నా ముందు నిలబడకు…” అన్నాడు. టెన్షన్‌తో అతని నరాలు పగిలిపోయేలావున్నాయి.
కోపంగా అక్కడనుండి వెళ్లింది శృతిక… కోపం తెచ్చుకునే ముందు పరిణామాలు కన్పించవు. కోపం మనిషిని పశువును చేస్తుంది. విచక్షణను కోల్పోయేలా చేస్తుంది.
సమస్యలు పెద్దవి కావటానికి కారణం కూడా కోపమే. ఆ రోజు భర్తమీద కోపంతో బొమ్మల్ని తగలబెట్టింది. ఇప్పుడు భర్త నిరసనను తట్టుకోలేకపోతోంది.
పర్యవసానం ఆలోచించకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది శృతిక.

*****

దోసిళ్లతో స్వచ్ఛమైన సెలయేటి నీళ్లు తాగినట్లుండాలి జీవితం అనుకున్న ద్రోణకి ఉలకని, పలకని అమ్మ వెంటపడి మొత్తుకున్నట్లుంది. నిప్పుపెదవులపై ముద్దాడి భయపడ్తున్నట్లుంది.
ద్రోణ తలపై చేతులు పెట్టుకొని…. ‘తనకింకేం మిగల్లేదు’ అన్న బాధతో కూర్చుని వున్నాడు.
అప్పుడొచ్చింది ఆముక్త కారు దిగి లోపలకి…
గదిలోకి రాగానే… ”ద్రోణా! నీ బొమ్మలేమయ్యాయి? గదినిండా ఈ బూడిదేంటి? ఫ్యానేస్తే ముఖంమీదకి వచ్చేలా వుంది. అసలేం జరిగింది?” అంది షాకింగ్‌గా చూస్తూ…
ఆముక్తకి ఏంచెప్పాలో ఒక్కక్షణం అర్థంకాలేదు ద్రోణకి.. అబద్ధం చెప్పేకన్నా నిజం చెబితే మంచిదనుకున్నాడు. జరిగింది చెప్పాడు. వేదనగా చూసింది ఆముక్త.
నాదీ అనుకున్నది ఎవరికి దక్కకూడదన్న ఆగ్రహంతో తారాస్థాయిలో తెగించిన శృతిక – ఇంత అతితో కూడిన తన ప్రేమను అవతలవాళ్లు తట్టుకోలేరని గ్రహించి వుండదు. అందుకే ఇలా చేసింది.
ద్రోణ ముఖంలోని వైరాగ్యం ఆముక్త హృదయాన్ని నొక్కి పెట్టినట్టైంది. ఒక కళాకారుని బాధ తోటి కళాకారులకి వెంటనే అర్థమవుతుంది.
బాధంటే ఏమిటో…. బాధపడటం అంటే ఏమిటో… సమస్యలు ఎలా వుంటాయో… ఆ సమస్యలు పైకి చిన్నగా కనిపిస్తూ మనసుని ఎంత పెద్దగా కోస్తాయో ఆముక్తకి ఇన్నిరోజులు తెలియదు. ఇప్పుడు ద్రోణను చూస్తుంటే అంతటి భావకవి అయిన కృష్ణశాస్త్రి – ”నాకు యుగాదులు లేవు. ఉషస్సులు లేవు.” అని ఎందుకు రాశాడో అర్థమయింది. ద్రోణ లాంటి వాళ్లే ఆయన హృదయాన్ని అప్పట్లో కదిలించి వుంటారు.
ఆవేశంగా ద్రోణవైపు చూస్తూ…. ”ఇది పెద్ద విధ్వంసకచర్య వర్షిత్‌ ! నేను మీడియా వాళ్లకి ఫోన్‌ చేస్తాను. దీన్ని పదిమందికి తెలిసేలా చేద్దాం! న్యాయం కావాలని ప్రజల్నే మనం అడుగుదాం! వాళ్ల సమాధానమే మనకి కొండంత అండ…” అంది ఆముక్త.
ఉలిక్కిపడి చూశాడు ద్రోణ…
”నువ్వు నా గురించి బాధపడ్తున్నందుకు థ్యాంక్స్‌ ఆముక్తా! నా సమస్యకి నువ్వు చూపే సొల్యూషన్‌ కరక్ట్‌ కాదు. నన్నిలా వుండనివ్వు.” అన్నాడు
”నీ బాధ చూడలేకపోతున్నాను వర్షిత్‌!” అంది జాలిగా
”మన ప్రమేయంలేకుండా దేన్నైనా కోల్పోయినప్పుడు బాధగానే వుంటుంది ఆముక్తా! జీవితంలో తెలిసి కోల్పోయేవి కొన్ని, తెలియక కోల్పోయేవి కొన్ని వుంటాయి కదా! ఏది ఏమైనా కోల్పోయింది నేను… నువ్వు బాధపడకు. ఇప్పుడేం రాస్తున్నావు?” అన్నాడు దీనిమీద ఇక ఏం మాట్లాడినా అనవసరమే అన్పించి…
”నా ఫ్రెండ్‌ సంవేద మొన్న కొన్ని సమస్యల్ని చెప్పి రాయమంది. ‘సమస్యలు సమస్యలే కదా! ప్రత్యేకించి రాయటం ఎందుకు?’ అని ఆలోచిస్తున్నాను. సపోజ్‌ ఆదాయం లేనివాడు అప్పులు చేస్తాడు. వాడు ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని ఆలోచించి కష్టపడే తత్వాన్ని పెంచుకుంటే సమస్య సాల్వ్‌ అవుతుంది. కాని దానిమీద నేను నాలుగు పేజీలు రాస్తే అప్పులు తీరవు కదా! అందుకే నేనా సమస్యను రాయదలచుకోలేదు. ఏదైనా న్యూ సబ్జక్ట్‌ దొరికితే రాస్తాను” అంది.
తలకొట్టుకునే ఆసక్తికూడా లేనట్లు మౌనంగా వున్నాడు.
అటు, ఇటు చూసి ”శృతిక లేదా?” అంది
”వెళ్లిపోయింది” అన్నాడు
”ఎక్కడికి?” అంది
”ఏమో! తెలియదు” అన్నాడు.
”ఇప్పుడెలా?” అంది
”దాని గురించి ఆలోచించే స్థితిలో లేను…” అన్నాడు.
”అందరికి ఒకసారి ఫోన్లు చెయ్యండి! మనం కూడా వెతుకుదాం! భార్య లేకుంటే కష్టం కదా!” అంది.
”కష్టం వచ్చినప్పుడు పడాలి.. కష్టం కదా! అంటే వచ్చిన కష్టం పోతుందా? పోనీ మనం కూడా దాన్నుండి పారిపోలేం. ధైర్యంగా నిలబడితే చూసి, చూసి అదే పారిపోతోంది.” అన్నాడు
అతని ముఖంలోని గంభీరతనే చూస్తూ… ”భార్య లేకుంటే ఎన్ని కష్టాలో ఓ కథ రాస్తాను.” అంది ఉద్వేగంగా.
నిట్టూర్చాడు ద్రోణ.
”నా జీవితం నీకు కధలా వుందా?” అన్నాడు
”నువ్వే కదా జీవితాల్లోకి వెళ్లి రాయమంటావు. సంవేద కూడా అప్పుడప్పుడు అదే చెప్తుంది.” అంది.
ఒకసారి ఆమె ముఖంలోకి జాలిగా చూసి, ‘సమస్యల్ని సృశించే నేర్పుకూడా ఓ కళే కదా!’ అని మనసులో అనుకొని, ఏమనాలో తెలియక ‘ఆల్‌ ద బెస్ట్‌’ అన్నాడు. అంతలో…
పేరెంట్స్ నుండి కాల్‌ రావటంతో ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అని ఆముక్తతో చెప్పి పక్కకెళ్లి మాట్లాడి వచ్చాడు.
ఆమె చాలా సేపు ద్రోణ దగ్గరే కూర్చుంది.
*****

అర్ధరాత్రి దాక – అందరు నిద్రపోతున్న సమయంలో గంగాధరం మళ్లీ అరుస్తూ లేచాడు.
నిశిత బెదిరిపోయి లేచి కూర్చుంది. ఆమె వణకటం చూసి…
”నిశితా భయపడకు..” అని మాత్రం అన్నాడు గంగాధరం.
”భయంగా వుంది మామయ్యా! మీరు రోజు ఇలాగే అరుస్తున్నారు. ఎందుకని?” అంది గుండెలపై చేయివేసుకొని.,..
నిశితకి చెప్పాలి! తనేంటో చెప్పాలి. ఏం జరిగిందో చెప్పాలి. ఇన్నిరోజులు వినేవాళ్లు లేక, ఆత్మీయులుగా అన్పించక చెప్పలేదు. ఇప్పుడు చెప్తే కనీసం నిశిత అయినా ధైర్యంగా తనపక్కన వుంటుంది. లేకుంటే తన అరుపులకి భయపడ్తూ ఎన్ని రోజులు ఇలా?
భార్య ఎలాగూ తనని దగ్గరకి రానీకుండా దూరంగా వుంది. అది ఏ జన్మలో చేసుకున్న పాపమోకదా!
ఆయన చెప్పానికి సిద్ధమయ్యాడు.
అది గమనించి మంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది నిశిత.
అవి తాగి చెప్పటం ప్రారంభించాడు.

*****

ఇంకా వుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

March 2018
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031