March 19, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 24

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

అన్నమయ్య ఆధ్యాత్మిక కీర్తనల్లో చాలా భాగం పల్లవి కొరకరాని కొయ్య. పైకి ఒక అర్ధం గోచరిస్తూ అంతరార్ధం తరచి తరచి చూస్తే గానీ తెలియరాని పరిస్థితి. ఊహ చాలా గొప్పగా ఉంటుంది. అర్ధం మాత్రం చాలా గోప్యంగా ఉంటుంది. జీవితం అన్నది జీవి తెలిసి ఎంచుకున్నది కాదు. అది “సంభవించింది” మాత్రమే! పుట్టినప్పుడు మన శరీరం చాలా చిన్నది, ఇప్పుడిలా పెరిగి పెద్దదైంది. అంటే ఖచ్చితంగా ఈ శరీరం మనం సేకరించుకున్నదే. దేన్నైతే మనం “నా శరీరం” అంటామో, అది మనం తిన్న ఆహార సేకరణ. అలాగే దేన్నైతే మీరు “నా మనస్సు” అంటారో అది భావాల సేకరణ. మన శరీరం మొదట అణురూపంలో సృష్టించబడుతుంది. అలాగే మన మనసు కూడా భావాల సేకరణ మాత్రమే. ఎప్పుడైతే మనం అనుభవాన్నే మనమనుకుంటామో, మనం కానిదానితో మనల్ల్ని గుర్తించుకుంటామో, అప్పుడు మన గ్రహణశీలత పూర్తిగా వక్రీకరింపబడుతుంది. మనం బైటనుంచి సేకరించుకున్న శరీరాన్ని మనం అని భావించిన క్షణం, మన మనస్సుపై పడిన ముద్రలను మనంగా భావించిన క్షణం, జీవితాన్ని ఉన్నదున్నట్టుగా చూడలేము. మనుగడకి ఏవిధంగా అయితే అవసరమో, ఆవిధంగానే జీవితాన్ని చూస్తారు తప్ప, అది నిజంగా ఎలా ఉందో అలా చూడలేము. అప్పుడు అనేక మాయలలో చిక్కి జననమరణ చక్రపరిభ్రమణంలో ఉండిపోతాము అంటున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో. ఈ దేహం ఎప్పటికైనా నశించిపోయేదే అన్న స్పృహ ఉండాలి. ఈ చక్ర పరిభ్రమణలో పడి మనిషి మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేస్తూ ఉన్నాడు. దీనికి విముక్తి ఏమిటి? అన్నమయ్య ఈ కీర్తనలో చూద్దాం.
కీర్తన:
పల్లవి: అణుమాత్రపుదేహి నంతే నేను
మొణిగెద లేచెద ముందర గానను

చ.1. తగు సంసారపు తరగలు నీ మాయ
నిగమముల యడవి నీ మాయ
పగలునిద్రలువుచ్చే భవములు నీ మాయ
గగనపు నీమాయ గడపగ వశమా! ॥అణుమాత్రపు॥

చ.2. బయలు వందిలి కర్మ బంధములు నీ మాయ
నియమపు పెనుగాలి నీ మాయ
క్రియనిసుకపాతర కెల్లొత్తు నీ మాయ
జయమంది వెడలగ జనులకు వశమా?॥ అణుమాత్రపు॥

చ.3. కులధనములతో జిగురుగండె నీ మాయ
నిలువు నివురగాయ నీ మాయ
యెలమితో శ్రీవేంకటేశ నీకు శరణని
గెలుచుట గాక యిది గెలువగ వశమా? ॥ అణుమాత్రపు॥
(రాగం: సామంతం; రేకు సం: 260, కీర్తన 3-347)

విశ్లేషణ:
పల్లవి: అణుమాత్రపుదేహి నంతే నేను
మొణిగెద లేచెద ముందర గానను
శ్రీనివాసా! అణుమాత్రపు కణంతో జన్మించాను నేను. అణువుతో సమానమైనవాడను. ఈ సంసార చక్రంలో పడి ముణుగుతున్నాను లేస్తున్నాను. అనగా పుడుతూ ఉన్నాను. మరలా జన్మిస్తూ ఉన్నాను. ఏది కొస ఏది మొదలు అనే అంతరం తెలియక కొట్టుమిట్టాడుతున్న వాడను. ముందు ఏమి జరుగుతుందో తెలీదు. తర్వాత ఏమి అవుతుందో తెలీదు. ఇదీ నా పరిస్థితి స్వామీ!

చ.1. తగు సంసారపు తరగలు నీ మాయ
నిగమముల యడవి నీ మాయ
పగలునిద్రలువుచ్చే భవములు నీ మాయ
గగనపు నీమాయ గడపగ వశమా!
ఈ సంసారమనే మహాసముద్రంలో వువ్వెత్తున లేచే తరంగాలు నీ మాయ. ఈ మహారణ్యంలో పెనువృక్షాలలాగా వేదవేదాంగాలు అర్ధంకాని పరిస్థ్తిలో ఉన్నవి ఇదీ నీ మాయే! రాత్రి పగళ్ళు, నశించేటువంటి ఈ పుట్టుక నీ మాయ. ఆకాశం ఎంత అగమ్యగోచరమో నీ మాయ అంతే ! ఏమీ అర్ధం కాదు. దీన్ని దాటడం సామాన్యులమైన మా వశమా?

చ.2. బయలు వందిలి కర్మ బంధములు నీ మాయ
నియమపు పెనుగాలి నీ మాయ
క్రియనిసుకపాతర కెల్లొత్తు నీ మాయ
జయమంది వెడలగ జనులకు వశమా?
స్వామీ! మేము చేతగాని అనేక అవక తవక పనులు చేస్తూ మళ్ళీ మళ్ళీ ఈ కర్మ బంధాలలో తగులుకుంటూనే ఉన్నాము. నీ నియమానుసారం సంచరించే గాలి ఒక్కోసారి ప్రళయకాల సదృశమై పెనుగాలిగా మారడం నీ మాయ కాదా? సర్వస్వం పెళ్లగించి ఇసుక పాతరలో పూడ్చి పెట్టేయడం నీ మాయ కాదా? నిన్ను ఎదిరించి జయించడం ఎవరికి తరము? మాలాంటి వారికి ఈ ఆటుపోట్లను తట్టుకొని నిలబడే శక్తి ఉంటుందా చెప్పండి అని ప్రార్ధిస్తున్నాడు.

చ.3. కులధనములతో జిగురుగండె నీ మాయ
నిలువు నివురగాయ నీ మాయ
యెలమితో శ్రీవేంకటేశ నీకు శరణని
గెలుచుట గాక యిది గెలువగ వశమా?
స్వామీ మేము గొప్ప కులంలో జన్మించామని కొందరు, గొప్ప కోటీశ్వరులుగా జన్మించామని కొందరు విర్రవీగుతుంటారు. కానీ ఇదంతా నీవు పన్నిన వుచ్చని తెలుసుకోలేని విధంగా మాయలో చిక్కిపోయాము. తెలుసుకోలేకపోతున్నాము. ఇలాంటి మాయా ప్రపంచంలో నివురుగప్పిన మాయతో జీవిస్తున్నాము. శ్రీ వేంకటేశ్వరా! నీవు మమ్మలను ప్రేమతో చేరదీస్తే ఈ మాయను గెలువగలము కానీ మామూలుగా జయింపవశముగాని మాయ ఇది. కనుక మమ్మలను ఈ మాయలో పడకుండా కాపాడి ముక్తిని ప్రసాదించండి అని అన్నమయ్య ప్రార్ధిస్తున్నాడు.
ముఖ్యమైన అర్ధాలు: మొణిగెద = ముణుగుతాను (ఇక్కడ జన్మించడం అనే అర్ధాన్ని స్ఫురింపజేస్తున్నది, అనేక జీవులలో ప్రవేశించడం) లేచెద = లేవడం అనేది సామాన్యార్ధం, ఇక్కడ మరణించడం అనే అర్ధం తీసుకొనాలి; తరగలు = తరంగాలు, అలలు; నిగమములు = వేదాలు; వుచ్చే భవములు = నశించే గుణం ఉన్న పుట్టుకలు; కదవగ = దాటుటకు; బయలు వందిలి = వ్యర్ధ ప్రయత్నాలు; క్రియనిసుకపాతర కెల్లొత్తు = సమూలంగా పెళ్ళగించి ఇసుక పాతరలో పూడ్చివేయడం; జిగురు గండె = పక్షులను పట్టుకొను సాధన విశేషము, ఉచ్చు; ఎలమి = వికాసము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *