March 19, 2024

కలియుగ వామనుడు – 4

రచన: మంథా భానుమతి

అంతలో.. భళుక్ మని టింకూ మమ్మీ మీద కక్కేశాడు.
“ఓహ్.. ఎయిర్ సిక్ నెస్ ఉన్నట్లుంది. ఇదే ఫస్ట్ టైమా? టాయిలెట్ లోకి తీసుకెళ్లండి.” హోస్టెస్ సహాయంతో, టింకూని తీసుకుని వెళ్లింది మమ్మీ.
ఏ మాత్రం అసహ్యించుకోకుండా సొంత అమ్మ లాగే శుభ్రం చేసి తీసుకొచ్చింది. తన బట్టలు కూడా.. ఎవరో చెప్పినట్లున్నారు.. ఒక జత బట్టలు కూడా తెచ్చుకున్నట్లుంది.. అవి మార్చుకునొచ్చింది.
టింకూ, చిన్నాలవి ఎలాగా బాక్ పాక్ లో పైన ఉన్నాయి.
చిన్నా ఆశ్చర్యంగా చూస్తున్నాడు.. అస్సలు కొంచె కూడా అనుమానం రాకుండా, బయట పడకుండా ఆవిడ చేస్తున్న పనులని. బిక్క మొహం వేసుకుని చూస్తున్న చిన్నాకి నవ్వుతూ ధైర్యం చెప్పింది.. ఫరవాలేదంటూ.
ఆ తరువాత టింకూ నిద్ర పోయాడు.
ఎదురుగా ఉన్న టివీలో, చిన్నా న్యూస్ చూడ్డానికి ప్రయత్నం చేశాడు. అంతా ప్రపంచ వార్తలు. దుబాయ్ లో కడుతున్న కొత్త మాల్ విశేషాలు..
ఎక్కడో ఇండియాలో జరిగిన కిడ్నాప్ ల గురించి వాళ్లెందుకు చెప్తారు?
అదీ.. ఇంత కాలం తరువాత.
చిన్నాకి ఉన్నట్లుండి నీరసం వచ్చేసింది. దూరం.. దూరం వెళ్లి పోతున్నాడు. అమ్మా నాన్నలని ఇంక చూడలేడేమో! కొన్నాళ్ల తరువాత, తమని తీసికెళ్తున్న వాళ్లకి తన ప్రత్యేకత గురించి తెలుస్తుంది. అప్పుడేం చేస్తారు?
సరిగ్గా అదే సమయంలో గుర్తుకొచ్చింది..
డాక్టర్ ప్రకాశ్ గారు, నెలకొకసారి వచ్చి, పరీక్షలు చేయించుకోమన్న సంగతి. ప్రతీ నెలా, రక్తం, కాల్షియమ్, పెరుగుదల ఎలా సాగుతోందో.. ఎముకల గట్టిదనం.. అన్నీ పరీక్షిస్తుండాలని అన్నారు.
అప్పుడే రెండునెలలై పోయాయి.
ఇంక అసలు ఏ పరీక్షైనా చేయించుకోగలుగుతాడో లేదో తెలియదు. డాక్టర్ దగ్గరకెప్పుడయినా వెళ్లగలడా.. అంతేనా తన లైఫ్..
హాస్పిటల్లో తనని ఎంతో ముద్దు చేసే డాక్టర్లు, నర్సులు.. అమ్మా, నాన్నా.. నాయనమ్మ..
ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది చిన్నాకి. వెక్కటం మొదలెట్టాడు.
“వాడైంది.. ఇప్పుడు నువ్వా?”మమ్మీ విసుగు కనిపించనీయకుండా అంది.
“కవలలామ్మా? అంతే మరి.. తప్పదు. నీకు వాళ్లు పుట్టినప్పట్నుంచీ అలవాటై పోయుండాలి కదా?” పక్క సీటాయన నవ్వుతూ అన్నాడు.
“టాయిలెట్ కెళ్తావా?”
“అక్కర్లేదు మమ్మీ! చెవులు నొప్పి.”
మమ్మీకి ఏం చెయ్యాలో తోచలేదు. అంతలో హోస్టెస్ ఆంటీ వచ్చింది.
“చాక్లెట్ చప్పరించు. నోరు తెరిచి గట్టిగా గాలి పీల్చు. తగ్గిపోతుంది.” తను రెండు సార్లు చేసి చూపించింది.
కొంచెం సేపటికి సర్దుకుని టివీలో కార్టూన్లు చూడసాగాడు చిన్నా.
నాలుగు గంటల్లో దుబాయ్ వచ్చేసింది.
టింకూని లేపిందావిడ నెమ్మదిగా. కళ్లు నులుముకుంటూ లేచాడు.
“వచ్చేశామా? ఎక్కడికి?”
“ఎక్కడికేంటీ.. డాడీ దగ్గరకి. త్వరగా పదండి.” సూట్ కేసు చిన్నా లాగుతుండగా, బాక్ పాక్ తగిలించుకున్న పిల్లలిద్దరినీ ముందర నడిపించుకుంటూ విమానంలోనుంచి బయటకొచ్చింది మమ్మీ.
“వెల్ కమ్ టు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.” చిన్నా చదివాడు. ఇక్కడన్న మాట తాముండ బోయేది. అది తెలిసుంటే, విమానంలో దీని గురించి బాగా తెలుసుకునేవాడే కదా!
ఇమిగ్రేషన్ క్యూలో నిల్చున్నప్పుడు చిన్నాకి మళ్లీ ఏదే ఆశ..
ఫారిన్ కంట్రీ కదా! ఇంకా జాగ్రత్తగా ఉంటారేమో.. పిల్లల్ని ఇల్లీగల్ గా తీసుకొస్తున్నారని కనిపెడ్తే బాగుండును..
కౌంటర్ దగ్గర అన్ని వివరాలూ చూసి, పొడవాటి తెల్లని గౌనేసుకుని, తలమీద తెల్లని టోపీ లాంటిది పెట్టుకున్నాయన నవ్వుతూ చూశాడు.
చక్కని హిందీలో మాట్లాడ్డం మొదలు పెట్టాడు. ఫోటొలనీ, పిల్లలనీ, మమ్మీనీ తీక్షణంగా, పైనించి కిందికి చూశాడు.
“ఓ.. మీ హబ్బీ కామెల్ రేస్ ఫామ్ లో వర్క్ చేస్తాడా? గుడ్. ఈ సారి రేసెస్ కి నాకొక పాస్ ఇప్పిస్తావా?” నవ్వుతూ మాట్లాడాడు. ముగ్గురికీ ఫొటోలు తీశాడు. ముద్రలేసి పంపేశాడు.
సామాన్లు తీసుకునే దగ్గరే నిల్చుని చూస్తున్నాడు ‘డాడీ’. పిల్లి గడ్డం, నెత్తి మీద టోపీ.. తెల్లని పైజామా, లాల్చీ. తనే దగ్గరికి వచ్చి పలుకరించాడు.
సామాన్లు రావడానికి గంట పైనే పట్టింది.
కళ్లలో అనాసక్తత. ఎటో చూస్తూ యాంత్రికంగా నవ్వుతూ, దగ్గరికి తీసుకున్నాడు పిల్లలని.
సామాన్లు వచ్చే వరకూ అస్థిమితంగా అటూ ఇటూ తిరుగుతూ గడ్డం తడుముకుంటూ గడిపాడు.
“అవిగో..” మమ్మీ అరిచింది.
“చలో.. తొందరగా వెళ్లాలి.” సామాన్లు వచ్చిన వెంటనే.. పెద్ద పెద్ద అంగలేస్తూ బయటికి నడిచాడు.
డాడీని అందుకోడానికి, తమ చిన్న సూట్ కేసులు నెట్టు కుంటూ పరుగందుకున్నారు.
అప్పుడు దుబాయ్ టైమ్ పొద్దున్న ఆరున్నర.
మరొక మజిలీ ప్రారంభమయింది చిన్నా, టింకూలకి.
…………………….

ఒంటె పందాలలో అల్ ముధారి(ఒంటెలకి శిక్షణ ఇచ్చేవాడు) దే ముఖ్యమైన పాత్ర. అతని శిక్షణ బాగా ఉండి, ఒంటెలు గెలుస్తుంటే పేరు, కీర్తి వద్దన్నా వళ్లో వాల్తాయి.
అత్యధిక పారితోషకం తీసుకునే వృత్తులలో ఒంటెల శిక్షణ ముందుంటుంది. మంచి శిక్షకులు అరుదుగా ఉంటారు.
ఒంటెలకిచ్చే శిక్షణ రెండు విడతలుగా ఉంటుంది.
మొదటిది ‘అల్ అదాబ్’.. అంటే ఒంటెలకి అణకువగా ఉండేట్లు శిక్షణ ఇస్తూ ట్రయినర్ ఇస్తున్న ఆదేశాలని గ్రహించేలాగ చెయ్యడం. ఇది సుడానీస్ ట్రయినర్స్ బాగా ఇస్తారని పేరు.
పదమూడు నెలల ఒంటె పిల్లలకి మొదలుపెడతారు ఈ శిక్షణ. మూడు నెలల పాటు సాగుతుందది.
ఒంటె పిల్లని బాగా శిక్షణ పొందిన పెద్ద ఒంటెకి తాడుతో కడతారు. అది గైడ్ కింద పని చేస్తుంది.
దాని కదలికలు అదుపులో పెట్టడానికి, చిన్న ఒంటె తలచుట్టూ ఒక తాడు కట్టి, జాకీ కూర్చొనే మెత్తని జీను (అల్ శదాద్ లేక మహావీ అంటారు) వీపు మీద వేసి అలవాటు చేస్తారు.
అప్పుడప్పుడు ఇరవై పాతిక కిలోలున్న బరువుని కూడా పెట్టి, రేస్ ట్రాక్ మీద నడవడం కూడా నేర్పిస్తారు.. చివరికి ఒంటెకి పరుగెత్తడం వచ్చే వరకూ ఈ శిక్షణ ఉంటుంది.
ఒంటెకి మూడు సంవత్సరాలు వచ్చే సరికి పందెం లో పాల్గొనడానికి అర్హత వస్తుంది. అప్పుడు రెండవ స్టేజ్ మొదలవుతుంది.
రెండవ విడత శిక్షణలో ఒంటెలని మంచి ఫామ్ లోకి తీసుకొస్తారు. బరువు, ఎత్తు, చురుకుదనం.. అన్నీ సమంగా ఉండేలాగ.. గంటకి నలభై కిలోమీటర్లు పైగా పరుగెత్త గలిగేట్లు ట్రయినింగ్ ఇస్తారు.
మొదట్లో, పొద్దున్నే.. ఒంటెలని 20 కిలో మీటర్లు నడకకి తీసుకెళ్తారు. ఎండ ఎక్కువ అవక ముందే ఫామ్ కి తీసుకొచ్చి, అల్ఫా అల్ఫా గడ్డి, బార్లీ పెట్టి నీళ్లు తాగిస్తారు. ఎండ తగ్గే వరకూ నీడలో ఉంచుతారు. మళ్లీ నీళ్లు తాగించి, ఖర్జూరాలు బాగా తినిపిస్తారు.
సెప్టెంబర్ నెల వస్తుందంటే, శిక్షణ తీవ్రం చేస్తారు. నీళ్లు, ఆహారం తమతో తీసుకెళ్తారు. నలభై కిలో మీటర్లు పైగా నడిపిస్తారు. తలకి తాడు, వీపు మీద జీను తప్పదు. ఒక్కొక్క సారి జాకీలని కూడా కూర్చో పెడతారు.
బాగా నీళ్లు తాగిస్తారు. ఒంటె ఒక సారి ఏడు లీటర్ల వరకూ నీరు తాగగలదు. అలాగే.. రెండునెలల వరకూ నీరు లేకుండానూ ఉండగలదు.
అందుకే అది ఎడారి ఓడ అయింది.
చాలా మంది ముధారీలు తమ క్రీడాకారులైన ఒంటెలకి చాలా బలవర్ధకమూ, పోషక విలువలు కలిగిన ఆహారాన్నిస్తారు. ఆవుపాలలో, గొర్రె పాలలో చాలా ఖరీదైన, సహజ సిద్ధమైన తేనె కలిపి ఇస్తారు.
అనుక్షణం కనిపెట్టుకుని శిక్షణ ఇచ్చే ముధారీలకి ఆరబ్ దేశాల్లో చాలా గిరాకీ ఉంటుంది.
వారిలో అబ్దుల్ హలీమ్ ఎన్న దగిన వాడు.

‘అబ్దుల్ హలీమ్’.. యు.ఏ.ఇ దేశాలన్నిటిలో పేరు పొందిన ‘అల్ ముధారి’. . తర తరాలుగా ఎడారుల్లో ఒంటెలని సాంప్రదాయకంగా పెంచే కుటుంబానికి చెందిన వాడు.
ఎన్నో పందాలలో అతను శిక్షణ ఇచ్చిన ఒంటెలు బహుమతులను గెలుచుకోడం చూసి, స్వయంగా షేక్ అతన్ని తన ఒంటెలకి శిక్షణ ఇవ్వడానికి పెట్టుకున్నాడు.
షేక్ కి పాతిక పైగా ఒంటెలున్నాయి. వాటికి చాలా విశాలమైన మైదానం ఉంది. అందులో దాదాపు వంద మంది వరకూ పని చేస్తుంటారు.
అందరికీ, వారి వారి హోదాని బట్టి ఇళ్లు, వాహనాలు ఉంటాయి.
హలీమ్ కి విశాలమైన ఎయిర్ కండిషన్డ్ ఇల్లు, బెంజ్ కారు.. అతని పిల్లలకి యూరోపియన్ స్కూల్లో చదువు, ఇంట్లో పని వాళ్లు.. వంటి సదుపాయాలుంటాయి.. జీతం కాక.
ఒక చిన్న షేక్ కున్నట్లే ఉంటుంది జీవితం.
అతని కింద కాబోయే ముధారీలు నలుగురు పని చేస్తుంటారు. ఒంటెలతో పాటు, వాటి శిక్షకులకి కూడా శిక్షణ ఇవ్వడం అతనికి ఇష్టమయిన వృత్తి.
ఒంటె ఫామ్ కి ఐదు మైళ్లలో ఉంటుంది అతని ఇల్లు.
రోజుకి పన్నెండు గంటలు పైగా పని చేస్తాడతను.
చూడ్డానికి ఎంతో నెమ్మదిగా చిరునవ్వుతో ఉంటాడు.. కానీ తనకి కావసింది సాధించడంలో అంత కఠినంగా ఎవరూ ఉండలేరు.
తన ఒంటెలకి కావలసింది అనుకున్న సమయాని దొరకలేదా.. వెంటనే ఆ మనిషి మీద చర్య తీసుకోవలసిందే.
అదే విధంగా.. చెప్పిన మాట వినక పోతే ఒంటెలనయినా వదలడు. సాధారణంగా ఒంటెలని కొట్ట కూడదనేది, ముధారీల నియమం. మరీ మొండి ఒంటెలు హలీమ్ చేతిలో కొరడా దెబ్బలు తినాలిసిందే.
సెప్టెంబర్ నెల వచ్చిందంటే హలీమ్ కి రోజుకి ఇరవై నాలుగు గంటలు చాలవు. తెల్లవారకుండానే అసిస్టెంట్ లని పిలిచి ఎవరెవరు, ఏ ఒంటెలని ఎటుపక్కకి తీసుకెళ్లాలో.. ఏ ఆహారం ఎంత తీసుకెళ్లాలో అన్నీ పక్కాగా చెప్తాడు.
తమ పుస్తకాల్లో రాసుకుని, తు.చ తప్పకుండా పాటించాలి అందరూ.
అటూ ఇటూ అయిందంటే అంతే సంగతులు. వాళ్లు వేరే చోట పని వెతుక్కోవలసిందే.
అలాగే.. మిగిలిన స్టాఫ్ అంతా అప్రమత్తంగా ఉండాల్సిందే… ప్రతీ పనీ స్వయంగా పర్యవేక్షిస్తాడు.
చివరికి, ఒంటెల పేడ తీసి శుభ్రం చేసే దగ్గర కూడా.
అక్టోబర్ నెలలో జరగ బోయే పందాలకి సెప్టెంబర్ రాకుండానే, ఒంటెలని ట్రాక్ దగ్గరకి తీసుకెళ్ల నిస్తారు. అక్కడ ప్రాక్టీస్ చేయించ వచ్చు..
అసిస్టెంట్లకి ఒంటెల చేత ట్రాక్ ప్రాక్టీస్ చేయించ మని చెప్పి, జాకీల సెలెక్షన్ కోసం తను ఆగి పోయాడు, అబ్దుల్ హలీమ్.
…………………

విమానాశ్రయం బైటికి వచ్చాక కొత్త అమ్మ, డాడీకి పిల్లలనీ వాళ్ల పాస్ పోర్ట్ లనీ అప్పగించి, తను వేరే వెళ్లి పోయింది.
ఆవిడ తన వీసా పేపర్లలో చూపించిన మొగుడు అసలు మొగుడే. అతను టాక్సీలు ఆగే దగ్గర నిల్చుని చూస్తున్నాడు.
కాకపోతే, పిల్లలు లేరు వాళ్లకి. ఆ సంగతి ఒంటె పందాల అంతాజా (అంతర్జాతీయ) ముఠా వాళ్లు, వాళ్ల గురించి తెలుసుకుని, పట్టుకుని, చిన్నా టింకూలని వాళ్ల పిల్లల కింద బర్త్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ వీసాలని సంపాదించి తీసుకొచ్చేశారు.
ఒక సారి వారనుకున్న దేశం వచ్చేశాక ఎవరి దారి వారిదే. ఆ పని చేసినందుకు లక్షల్లో ఉంటుంది వారికి బహుమానం.
డాడీని చూస్తుంటే మమ్మీని చూసినప్పటి లాగా ఫరవాలేదని అనిపించ లేదు చిన్నాకి. కొంచెం భయం వేసింది.
“సమీర్, సుభానీ.. ఎలా ఉన్నారు? ప్రయాణం బాగా జరిగిందా” పాస్ పోర్ట్ లు తీసి పేర్లు చూస్తూ అడిగాడు, టాక్సీలో ఎక్కి కూర్చున్నాక.
“హా.. డాడీ.” కిటికీ లోంచి పెద్ద పెద్ద భవనాలని చూస్తూ సమాధాన మిచ్చాడు చిన్నా.
టింకూకి అంతా అయోమయంగా ఉంది. విమానంలో ఏమీ తినలేదేమో.. ఆకలిగా, నీరసంగా ఉంది.
కారులో కూర్చున్నాక ఫరవా లేదు కానీ, ఎయిర్ పోర్ట్ బైట నిలుచున్నప్పుడు ఎండకి కళ్లు మండి పోయాయి.. తీక్షణమైన ఎండ.
అలా సీటు మీదికి సోలి పోయాడు. వెంటనే కళ్లు మూసుకుని నిద్ర లోకి జారుకున్నాడు..
“ఎక్కడికెళ్తున్నాం డాడీ?” చిన్నా ప్రశ్నకి పక్కకి తిరిగి వాడి కేసి చూశాడు డాడీ.. ఆ చూపుకే అర్ధమయింది చిన్నాకి, ప్రశ్నలేం అడక్కూడదని. మమ్మీ దగ్గర లాగే కొడుకులా ఉండాలేమో అనుకున్నాడు..
కానీ.. కాదు. ఇప్పుడు పూర్తిగా వేరే పాత్ర వెయ్యాలని తెలిసి పోయింది. అదేం రోలో.. ఏం చెయ్యాలో..
“కొత్త ఇంటికి.”
ఇంకేం మాట్లాడకుండా తను కూడా కళ్లు మూసుకున్నాడు.
కారు ఆగి తలుపు తియ్యగానే తెలివొచ్చింది చిన్నాకి. వేడి గాలి ఈ చెవిలోంచి ఆ చెవిలోకి కొడుతోంది. టింకూని కూడా లేపాడు.
పెద్ద పాలస్ లాంటి ఇల్లు. ఇంటి ముందు పోర్టికోలో నాలుగు కార్లు, రెండు వాన్ లు ఉన్నాయి.
చిన్నా ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూశాడు.
ఇక్కడా తాముండ బోయేది?
టాక్సీని కాసేపు ఆగమని చెప్పి పిల్లలని ఇంట్లోకి తీసుకెళ్లాడు డాడీ.
అంత పెద్ద హాలు సినిమాల్లో కూడా చూడలేదు చిన్నా. తలుపు దగ్గరే ఆగి, తాము వచ్చినట్లు సాబ్ కి చెప్పమని పనామెకి చెప్పాడు డాడీ.
హాలు కప్పు ఎంత ఎత్తుందంటే, చిన్నా మెడ విరిగేట్లు చూడాల్సి వచ్చింది. టింకూ, నోట్లో వేలేసుకుని చిన్నా చెయ్యి పట్టుకున్నాడు.. బిక్క మొహం వేసుకుని బెదురు చూపులు చూస్తూ.
ఇద్దరూ అయోమయంగా చూస్తూ, డాడీ పక్కన నిలుచున్నారు.
లోపల్నుంచి పొడవాటి తెల్ల గౌనేసుకున్నాయన వచ్చాడు. నవ్వుతూ డాడీని పలుకరించాడు.. చిన్నాకి అర్ధం కాని భాషలో.
“గుడ్.. ఈ సారి సక్సెస్ అయిందా మిషన్? బాగున్నారు పిల్లలు. ట్విన్సా? జాగ్రత్తగా డీల్ చెయ్యండి. ఏ దేశం? పాకిస్తానా?” ఏ దేశమైతే ఏంలే అనుకుంటూ అడిగాడు. ఏదో ఒకటి అడగాలి కదా..
“కాదు సాబ్. ఇండియా.”
“ఓ.. ఇండియా! మా రోడ్ కాంట్రాక్టర్ దగ్గర చాలా మంది ఇండియన్స్ పని చేస్తున్నారు. హార్డ్ వర్కింగ్. హోప్.. వీళ్లు కూడా అంతే అనుకుంటా..”
ఐదారేళ్ల పిల్లలు.. హార్డ్ వర్కింగ్ కావాలా? ఆ మాట అర్ధమయిన చిన్నాకి అయోమయంగా ఉంది.
“హా సాబ్.. చాలా శ్రమ అయింది సాబ్.”
“అవునవును. తెలుసు. మానేజర్ ని అడుగు. మామూలు కంటే డబల్ ఇస్తాడు.”
“థాంక్ యూ సాబ్.”
తల పంకించి లోపలికెళ్లపోయాడు తెల్ల గౌనాయన.
పిల్లల్ని తన వెనుకే రమ్మని తలూపి బైటికెళ్లాడు డాడీ.
పెద్ద పెద్ద అంగలేస్తూ.
పరుగెత్తుకుంటూ వెళ్లి కారెక్కారు చిన్నా, టింకూ.
డాడీ చాలా ఖుషీగా ఉన్నాడు. పిల్లలిద్దరినీ నవ్వుతూ పలుకరించాడు. తన పెద్ద జేబులోంచి చాక్లెట్ తీసిచ్చాడు.
విమానాశ్రయం వద్ద కలిశాక ఇదే మొదటి సారి డాడీ ఇలా నవ్వడం.
టింకూ కూడా హాయిగా నవ్వాడు, విమానం లోంచి దిగాక మొదటి సారిగా.
“మనింటికా..” అడగబోయి నోరు మూసుకున్నాడు చిన్నా.
“ఎప్పుడూ నువ్వే మాట్లాడ్తావేంటి? తమ్ముడికి మాటలు రావా?”
“థాంక్యూ డాడీ!” టింకూ సన్నగా అన్నాడు.
*****
ఒంటెల పందాల బిజినెస్ లో ఒంటెల తరువాత అతి ముఖ్యమైన పాత్ర జాకీలది. కానీ ఒంటెల మీద పెట్టిన శ్రద్ధ జాకీల మీద పెట్టరు. జాకీ లు దొరికినంత చవగ్గా ఒంటెలు దొరకవు మరి.
ఒంటెల యజమానుల తరువాత జాకీల యజమానులదే ప్రాముఖ్యత, సంపద అంతా.
ఆ పెద్ద పాలస్ లో ఉన్న పొడవాటి డ్రస్సాయన.. పేరు పొందిన వ్యాపారస్థుడు. అరడజను పైగా పెట్రోలు బావులున్నాయి.
వంద మంది పైగా జాకీలకి యజమాని.
పందాలకి ఒంటెలనీ, జాకీలనీ అద్దెకిచ్చే వాళ్లకి ప్రభుత్వంలో చాలా పలుకుబడి ఉంటుంది.
జాకీల యజమానుల పలుకుబడిని, డబ్బుని ఉపయోగించి పిల్లలకి పాస్ పోర్ట్ లు, వీసాలు తెప్పించ గలుగుతున్నారు రకరకాల స్థాయిల్లో.
ఏ విధంగా తెస్తున్నారూ.. ఎంత ఖర్చు పెడుతున్నారూ అనేది యజమానికి అనవసరం. చివరికి సరుకు చేరిందా లేదా.. అంతే.
తినడానికి, గుడ్లు పెట్టటానికి, కోళ్లు పెంచుతారు..
ఒంటెలని అదిలించడానికి పసివాళ్లని తీసుకొస్తారు.
ఆ కోడి పిల్లలకీ, ఈ మనిషి పిల్లలకీ పెద్ద తేడా ఏం లేదు.
అయితే కోళ్లు ఒక్క వేటుకే పోయి ఆహారమైపోతాయి
కోట్లు సంపాదించడానికి కారకులైన జాకీలని మాత్రం క్షణ క్షణం చిత్రహింస పెడుతూనే ఉంటారు.

చాలా దూరం ప్రయాణం చేశాక ఒక పెద్ద మైదానంలాంటి బయలు ప్రదేశానికి తీసుకెళ్లాడు టాక్సీని ‘డాడీ’.
పెద్ద గేటు. చుట్టూ ఫెన్సింగ్. కనుచూపు మేరలో చెట్టనేది లేదు. ఫెన్సింగ్ చుట్టూ ఉన్న ముళ్లపొదలు తప్ప.
గేటులోంచి లోపలికి వెళ్లాక .. అక్కడ చిన్న చిన్న మెటల్ షెడ్స్ లాంటివి ఉన్నాయి. ఎక్కడా ఎవరూ ఉన్న అలికిడి లేదు.
ఆ మైదానాన్ని ఔజుబా ఫామ్ అంటారు. రేసులు జరిగే స్థలానికి దూరంలో ఉంటాయి ఔజుబాలు. ఆ షెడ్లలో ఉంచుతారు స్మగుల్ చేసిన పిల్లలని.
వాళ్లే కాబోయే కామెల్ జాకీలు.
ప్రపంచ ప్రఖ్యాతమైన ఒంటె రేసుల్లో ముఖ్య పాత్ర ధారులు.
పొద్దున్న తొమ్మిది గంటలు దాటింది.
పైనుంచి నిలువునా కాల్చేసే ఎండ. అది నేల మీదికి పడగానే వెనక్కి పంపే గాజు పొడి లాంటి ఇసుక.
టాక్సీ దిగి బయటికి రాగానే కొలిమిలో అడుగు పెట్టినట్లు అనిపించింది చిన్నాకి. టింకూ ఐతే ఎండి పోయినట్లు అయిపోయాడు.
“ఇదన్నమాట కొత్త ఇల్లు. ఇక్కడుండాలి ఇక నుంచీ. నో మమ్మీ, నో డాడీ..” గొణుక్కుంటూ ఆకాశం కేసి చూశాడు చిన్నా.
టింకూకి నేనూ.. నాకు టింకూ తోడు.
“కనీసం మమ్మల్నైనా ఒక చోట ఉంచేట్లు చూడు సామీ!”
తెల్లని ఆకాశం.. ఎక్కడా మబ్బన్న మాట లేదు. దేవుడికి రాయబారం పంపుదామంటే.
దూరంగా ఉన్న షెడ్ లోంచి పరుగెత్తుకుంటూ వచ్చాడు.. నల్లగా, పొడుగ్గా, తలమీది జుట్టంతా రింగు రింగులుగా, నెత్తి మీంచీ చెమటలు కక్కుకుంటూ ఒకతను. సినిమాల్లో చూపించే విలన్లు అంత కంటే సున్నితంగా ఉంటారు.
ఎండలో అతగాడి ఒంటిమీది చెమట నిగనిగా మెరుస్తోంది. కాకీ నిక్కరు, మాసి పోయినట్టున్న బనీను.
చిన్న పిల్లలు చూస్తేనే ఝడుసు కునేట్లున్నాడు.
మొహంలో ఈ చివరి నుంచా చివరికి మూతి సాగ దీసి, తెల్లని పళ్లు మెరిసేలా నవ్వుతూ వచ్చాడు.
“నజీర్! ఎలా ఉంది పని? ఇంకో ఇద్దర్ని తీసుకొచ్చా.” చిన్నాకి అర్ధం కాని భాషలో మాట్లాడుకుంటున్నారు.
చేతులు తిప్పడాన్ని బట్టి, సైగలని బట్టీ కొంత అర్ధ మవుతోంది.
ఆ నల్లతని పేరు నజీర్ అని మాత్రం తెలుస్తోంది.
“మామూలే వకీల్ సాబ్. పిల్లలతో మీకు తెలియందేముంది. ఏదో ఒక గొడవే రోజూ. వీళ్లు ట్విన్సా? భలే ఉన్నారు.. చూడ్డానికి. ముందుగా వీళ్లని చూస్తేనే జనం ఫ్లాట్. ఆ పాకిస్తాన్ వాళ్లేనా?”
“ఏ పాకిస్తాన్ వాళ్లు?” వకీల్ అని అందరూ పిలిచే డాడీ అడిగాడు.
“లాస్ట్ వీక్ తెస్తానన్నావు కదా? ఇద్దర్ని..”
“ఓ.. ఆ కేసా? తినడానికి తిండి లేదుకానీ.. ఆ లేడీ కి పౌరుషం చాలా ఉంది. ఇద్దరు పిల్లలూ.. సరిగ్గా మనకి పనికొచ్చేలా ఉన్నారు. వాళ్ల ఫాదర్ మన దగ్గర కొచ్చాడు. రెండో వాడు మరీ టూ ఇయర్స్. మనవే పెంచాలి. ఐనా ఫర్లేదనుకున్నా.. కానీ ఆ మదరే.. చస్తే ఒప్పుకోనంది.”
“అయ్యో.. బాగుండేది. మన క్కూడా, ఇక్కడి కొచ్చాక సగం మందే పనికొస్తున్నారు. తీరా కష్ట పడి ట్రయినింగ్ ఇచ్చాక. అందుకే ఎక్కువ మందిని ట్రయిన్ చెయ్యాల్సి వస్తోంది.” నజీర్ వాపోయాడు.
“ఆ మదర్ తిక్క కుదిరిందిలే.. మొగుడికి ఒళ్లు మండి మొహం మీద యాసిడ్ పోశాడు. లైఫ్ లాంగ్ ఏడవ్వలసిందే.” వకీల్ గట్టిగా నవ్వాడు.
“ప్చ్.. ఆ పని చెయ్యకుండా ఉండాల్సింది. మీడియాకి తెలుస్తే ఎంత ప్రమాదం..” భయంగా అన్నాడు నజీర్.
వకీల్ ఇంకొంచె గట్టిగా నవ్వాడు.
“మీడియా.. ఎలా తెలుస్తుంది?”
కొంచె ఇంగ్లీష్, కొంచెం వచ్చీ రాని అరాబిక్ కలిపి సాగుతున్న సంభాషణ, వాళ్ల హావ భావాలతో బాగానే అర్దమవుతోంది చిన్నాకి.
కాళ్లలోంచీ వణుకు పుట్టింది. వాళ్లు రాక్షసులా మనుషులా..
ఎండ వేడి లోపల్నుంచీ మంట పుట్టిస్తోంది. టింకూ ఐతే శోషొచ్చి పడి పోయేట్లున్నాడు.
“వాళ్ల బదులు వీళ్లిద్దరినీ తెచ్చాను. ట్విన్స్ ట. కరెక్ట్ గా మనకి పనికొచ్చే ఏజ్.” ఇద్దరి పాస్ పోర్ట్ లూ నజీర్ చేతిలో పెట్టాడు డాడీ.
నజీర్ ఎగాదిగా చూశాడు పిల్లల్ని.
టింకూనీ, చిన్నానీ ఒకళ్ల తరువాత ఒకళ్లని నడుం దగ్గర పట్టుకుని గాల్లోకి లేపాడు.
తయారుగా లేరేమో.. అంతెత్తు లేపే సరికి బిత్తరపోయి, ఇద్దరూ కంఠనాళాలు పగిలి పోతాయేమో అన్నట్లు అరిచారు.
అదేం పట్టించుకోలేదు అక్కడున్న ఇద్దరు పెద్దాళ్లూ. పిల్లల్ని అణువణువూ పరీక్షించడంలో మునిగి పోయున్నారు. వాళ్ల అరుపులు దున్న పోతుల మీద జడివాన కురిసినట్లే..
“ట్విన్సా.. అలా లేరే..” తల అడ్డంగా ఆడిస్తూ రెండు చేతులూ తక్కెడ లాగ చేసి, పైకీ కిందికీ ఆడించాడు నజీర్.
చిన్నా చిన్ని గుండె మళ్లీ దడదడలాడింది.
“ఈ ఫెలో కొంచెం ఏజ్డ్ గా ఉన్నాడు. ట్విన్స్ కానే కాదు. బట్.. నాకు ఓకే. బరువు సరిగ్గా ఉంది. మనకదేగా కావాలి.”
“అమ్మయ్య పనికొస్తారు కదా! నువ్వు యస్ అనే వరకూ నాకు టెన్షన్. ఇప్పుడు హాయిగా నిద్రపోతా. ఎంత అలవాటైనా.. ఒక్కొక్క కేసూ క్లియర్ అయే వరకూ బెదురుగానే ఉంటుంది.”
టాక్సీలోంచి ఇద్దరి సూట్ కేసులూ దించి వెళ్లిపోయాడు డాడీ. టాటా ఐనా చెప్ప లేదు.. పిల్లల కేసి చూడను కూడా చూడ లేదు.
అతని దృష్టిలో వాళ్లు రక్త మాంసాలున్న మనుషులు కాదు.
తన వెనుక రమ్మన్నట్లుగా తలూపి రెండో షెడ్ లోకి నడిచాడు నజీర్.
తమ సూట్ కేసులు ఇసుకలో కష్టపడి లాక్కుంటూ నజీర్ వెనుకే నడిచారు చిన్నా, టింకూ.
షెడ్ లోపల అంత వేడి లేదు. కానీ బైట ఉన్న కాల్చేసే ఎండ, మెటల్ కప్పు.. నీరసంగా నడుస్తోందో లేదో అన్నట్లున్న ఏసీ.. అంతలాగ చల్లబర్చడం లేదు. అయినా ఫరవాలేదు. మరి ఆ చిన్ని జాకీలు వడదెబ్బకి మాడి మసై పోకుండా ఉండాలి కదా!
పిల్లలిద్దరూ చెమటతో తడిసి ముద్దయ్యారు.
లోపల అప్పటికే నలుగురు పిల్లలున్నారు. ఒక్కడు తప్ప అందరూ ఇంచుమించు, చిన్నా టింకూ లంతే ఉన్నారు. వెనుకొక తలుపుంది.
తలుపులు లేని గోడల దగ్గర, వరుసగా సూట్ కేసులు, వాటి పక్కన బొంతల్లాంటి పరుపులు ఉన్నాయి. ఖాళీగా ఉన్న చోట్లో చిన్నా, టింకూల సూట్ కేసులు పెట్టుకోమన్నాడు నజీర్.
“అంకుల్.. ఉస్..” టింకూ భయం భయంగా అడిగాడు. పొద్దున్నెప్పడో విమానంలో వెళ్లిందే.. అసలా వేడికి ఒంట్లో ఉన్న నీరంతా ఇగుర్చుకుని పోయినట్లయింది.
వెనుక తలుపు వైపుకి సైగ చేశాడు అంకుల్.
టింకూ వెనుకే చిన్నా కూడా వెళ్లాడు.
కొంచెం దూరంలో వరుసగా ఆరు బాత్రూములున్నాయి.
అక్కడున్న పది షెడ్లకీ అవే. ప్రతీ బాత్రూంలోనూ, షవర్, లెట్రిన్ ఉన్నాయి.
టింకూ వెళ్లి రాగానే చిన్నా కూడా వెళ్లొచ్చాడు. స్నానం చెయ్యాలి..
ఒళ్లంతా జిడ్డు, చెమట.
కానీ భయానికి ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు చిన్నా. టింకూకి కూడా వాడే చేయిస్తున్నాడు రోజూ.
ఆకలేస్తోంది. తింటానికేవన్నా పెడతారా..
“హోహో బాయిస్…. కమాన్.” నజీర్ కేక విని తమ షెడ్లోకి పరుగెత్తారిద్దరూ.
“ఇవి తిని త్వరగా రెడీ అవండి. బైటికెళ్లాలి.” సైగలతో చెప్పి బైటికి వెళ్లి పోయాడు నజీర్.

‘అవి’ చూడగానే ఏడుపందుకున్నాడు టింకూ. ఎండి పోయిన బ్రెడ్ ముక్కలు. చిన్న ప్లాస్టిక్ గ్లాసుల్లో పాలు. టింకూకి బ్రెడ్ అస్సలు సయించదు. ఆకలేస్తోంది. ఎదురుగా ఇష్టం లేని తిండి.
“అమ్మ కావాలీ.. అమ్మా..”
“తినేయి టింకూ! అమ్మ దగ్గరికి ఎలాగైనా వెళ్లి పోదాం. అంత వరకూ మంచిగా ఉండాలి కదా! ఒంట్లో బాలేక కదల్లేకపోయావనుకో.. ఎలా వెళ్తాం? అందుకే ఏది దొరుకుతే అది తినేసి కడుపు నింపు కోవాలి.” బ్రెడ్ పాలలో నంచి టింకూకి పెట్టాడు చిన్నా.
“మీరు తెలుగు వాళ్లా?” ఎక్కడ్నుంచో సన్నగా వినిపించింది.
అటూ ఇటూ చూశాడు చిన్నా. అందరిలోకీ పొడుగ్గా, పెద్దగా ఉన్నాడొక కుర్రాడు. పన్నెండో పధ్నాలుగో ఏళ్లుంటాయి. సన్నగా, పొడుగ్గా.. మొహం కూడా పొడుగ్గా ఉంది. ఎంత సన్నం అంటే.. చేతులు పుల్లల్లా ఉన్నాయి. మొహంలో దవడ ఎముకలు కనిపించేలా ఉన్నాయి.
“అవును. నువ్వు కూడానా?” చిన్నా అడిగాడు, టింకూకి తినిపిస్తూనే.
“తెలుగు వాణ్ణే. తెలుగు ఇంకా గుర్తున్నందుకు నాకే వింతగా ఉంది.” నట్టుతూ ఆగి ఆగి మాట్లాడాడు ఆ అబ్బాయి.
టింకూ తినేశాక, అక్కడున్న సీసాలో నీళ్లు వాడికి తాగడానికి ఇచ్చి తను కూడా తినడం మొదలు పెట్టాడు చిన్నా.
“మీ తమ్ముడా?”
తలూపాడు. ఊరికే.. అందరికీ తమ స్టోరీ ఎందుకు చెప్పడం..
“అంత ఏడవద్దని చెప్పు. కన్నీళ్లు కూడా ఇక్కడ ప్రెషస్. ముందు ముందు ఇంకా చాలా ఏడవాలి.”
ఆశ్చర్యంగా చూశాడు చిన్నా.
“నా పేరు అబ్బాస్. నాకు సిక్స్ ఇయర్స్ అప్పుడు హైద్రాబాద్ నుంచి తీసుకొచ్చారు. ఎనిమిదేళ్లు పైనయింది. ఇప్పుడు నాకు హిందీ, ఇంగ్లీష్, అరాబిక్ వచ్చు. తెలుగు వాళ్లు చాలా రేర్ గా వస్తారు. అందుకే మీ మాటలు వినగానే నాక్కూడా మా ఊరు గుర్తుకొచ్చింది.”
“అదేంటీ.. మీ అమ్మా నాన్నా గుర్తుకు రాలేదా? నీకు ఫోర్టీన్ ఇయర్సా? నమ్మలేను.”
“అమ్మా.. కొంచెం గుర్తుంది. నాన్న గుర్తు లేదు. అక్కడున్నప్పుడే అంత లేదు. రాత్రి వచ్చే వోడు..రోజూ కొట్లాటలే. నన్ను అమ్మేశారు వీళ్లకి. ఏ రోజుకా రోజు బతకడానికి ఫైట్ చేసి చేసి.. నా అనేవాళ్లు ఎవరూ గుర్తు రారు. అబ్బాస్ పేరు కూడా వీల్లు పెట్టిందే.”
“అమ్మేశారా?” ఇంకా ఆశ్చర్య పోయాడు చిన్నా.
“అంటే మిమ్మల్ని అమ్మెయ్య లేదా?” ఈసారి అబ్బాస్ ఆశ్చర్యం..
“లేదు. మమ్మల్ని కిడ్నాప్ చేశారు. రాత్రి మా ఇంట్లో అరుగు మీద నిద్ర పోతుంటే..”
కళ్లు మూసుకుని కాసేపు ఆలోచించాడు అబ్బాస్.
“జనరల్ గా వీళ్లు కిడ్నాప్ చెయ్యరే. మీకు తెలీకుండా మీ నాన్న అమ్మేశాడేమో..”
“ఛా.. మా నాన్న అమ్మడమా!” ఆగి పోయాడు చిన్నా. అది వరకు కిషన్ కూడా అలాగే అన్నట్లు గుర్తుకొచ్చి..
“ఎవరైనా మీ నాన్నని కలిశారా, అదీ ఇంట్లో ఎవరూ లేనప్పుడు..” ఆగి పోయాడు. ఉన్నట్లుండి అబ్బాస్ కి అనుమానం వచ్చింది.. ఐదారేళ్ల పిల్లాడికి అదంతా అర్ధ మవుతుందా అని.
“ఆ.. ఒక రోజు మధ్యాన్నం, మేమిద్దరం వీధి వరండాలో చదువుకుంటుంటే.. ఇద్దరు వచ్చారు.. వాళ్ల తో కూడా..”
“మీ నాన్న వచ్చాడా? అప్పుడు మీ అమ్మ ఇంట్లో లేదు కదూ?”
అవునన్నట్లు తలూపాడు చిన్నా.
టింకూ కళ్లు పెద్దవి చేసుకుని చూస్తున్నాడు.
నాన్న.. అవును. అమ్మేసుంటాడు డబ్బుల కోసం అమ్మని కొడతాడు కదా రోజూ.. వాడి చిన్ని బుర్ర కి నిజమే అనిపించింది.
“అవునూ మీ రిద్దరూ ట్విన్సా? అలా లేరే. నువ్వు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నావు.” అబ్బాస్ ఇద్దరినీ మార్చి మార్చి చూశాడు. ఎనిమిదేళ్ల నించీ అనేక మంది పిల్లల్ని రకరకాల దేశాల్నుంచి, అనేక రకాల పరిస్థితులలో వచ్చిన వాళ్లని చూశాడు.
పిల్లలనీ వాళ్ల స్థితి గతుల్నీ ఇట్టే పట్టేస్తాడు.
చిన్నా పెద్దగా కనిపిస్తే, టింకూ పాలు కారుతున్న బుగ్గలతో పసివాడిలాగ ఉన్నాడు.
చిన్నా ఆలోచిస్తున్నాడు. ఈ అబ్బాయికి ఎంత వరకూ చెప్పచ్చు.. ఇతను తమ సైడా.. వీళ్ల సైడా..
“నేను మీ సైడే.. ఒక ఆరేళ్ల పిల్లవాడు పడ కూడని బాధలన్నీ పడ్డాను. వీలయినంత వరకూ పిల్లలకి హెల్ప్ చెయ్యాలనే చూస్తాను. మిమ్మల్ని ముందుగానే వార్న్ చేస్తాను. అదీ కాక మీ భాష నాకు వచ్చని ఆ ఎలుగు బంటి గాడికి తెలీదు. నన్ను మీరు నమ్మచ్చు.” అబ్బాస్ నమ్మకంగా చెప్పాడు.
అయినా చిన్నాకి నమ్మకం కలగ లేదు.
మిడుకూ మిడుకూ చూస్తున్నాడు.. బ్రెడ్ ముక్కలు గుటుక్కుమని మింగేసి.
“కావాలంటే వీళ్లని అడుగు.”
“హి.. గుడ్.” అన్నారు అబ్బాస్ ని చూపించి, అక్కడున్న ముగ్గురు పిల్లలూ. వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో అర్ధం కాక పోయినా.. చకచకా బట్టలు మార్చుకుంటూనే.. జాలి నిండిన కళ్లతో చిన్నా, టింకూలని చూస్తూ.
“మీరిద్దరూ అన్నదమ్ములు కామని చెప్పు ముందుగా ఆ ఎలుగు బంటికి. లేకపోతే ఇద్దరినీ వేర్వేరు చోట్ల పెట్టేస్తాడు. నన్నూ మా అన్ననీ అలాగే చేశారు. ఇప్పుడు వాడెక్కడున్నాడో నాకు తెలియదు.”
“మేమిద్దరం నిజంగానే అన్న దమ్ములం కాదు. పక్కింటి వాళ్లబ్బాయి వీడు. ఇద్దరం వీధి వరండాలో పక్కన పక్కన పడుక్కుంటే ఎత్తుకొచ్చేశారు.” చిన్నా చెప్పేశాడు. అన్నదమ్ములంటే వేరు చేస్తారన్నాడని.
“నేను చెప్తాలే నజీర్ గాడికి. పక్కింటాళ్లని కూడా చెప్పను. పాస్ పోర్ట్, వీసాల కోసం వీళ్ల ఏజెంట్లు అలా చెప్పారని చెప్తాను. మీరిద్దరూ అంత క్లోజ్ గా ఉండకండి, వాడున్నప్పుడు.”
అలాగే అన్నట్లు తలూపాడు చిన్నా.
“మీరిద్దరూ ఒక వయసు వాళ్లా? అలాగ లేరే..”
“కాదన్నా! వీడు నా కంటే చిన్న. నేను షార్ట్ ఫెలోని. వీడు కొంచెం టాల్. అందుకని ఒకే ఎత్తున్నాం.”
“అదే అనుకున్నా. సర్లే.. తయారవండి. వేరే ఫామ్ కి వెళ్తాం. అక్కడ పెద్ద ఒంటెలు.. రేసులకి పనికొచ్చేవి ఉంటాయి. వాటితో జాకీ ట్రయినింగ్ ఇస్తారు. స్నానం వచ్చాక చెయ్యచ్చు. ఇప్పుడు కావాలంటే బట్టలు మార్చుకుని వచ్చెయ్యండి. ఇంత కంటే పాత బట్టలు లేవా?” అబ్బాస్ కూడా వేరే బట్టలు వేసుకున్నాడు.
“ఇవే పాతవన్నా. అక్కడ అంకుల్ కొత్తవి కొనిచ్చాడు.”
“ఇస్తాడు. ఎందుకివ్వడూ.. ఎన్ని లక్షలు దొబ్బాడో..” కసిగా అన్నాడు అబ్బాస్..
“ఏం ట్రయినింగన్నా? జాకీలు కింద చేస్తారా మమ్మల్ని?” ఇంత కోపం ఎందుకో అనుకుంటూ అడిగాడు చిన్నా.
“చూస్తావు కదా! చాలా ఠయరై పోతారు. నజీర్ గాడికి మాత్రం ఎదురు చెప్పకండి.”
“చెప్పమన్నా. వింటున్నావు కదా టింకూ?”
తలూపాడు టింకూ, నోట్లో వేలేసుకుని చూస్తూ. వాడి మొహం మరీ పసిగా ఉందనుకున్నాడు అబ్బాస్. ఏం తట్టుకుంటాడో.. ఈ టార్చర్.. కడుపులోంచీ జాలి తన్నుకొచ్చింది.
“హొయ్.. హొయ్.. రెడీ?” గట్టిగా అరుస్తూ వచ్చాడు నజీర్.
అందర్నీ లైన్లో నిలబెట్టాడు అబ్బాస్. టింకూని ముందు నిలబెట్టాడు.
“గుడ్ గుడ్.. చలో..” హుషారుగా ఉంటే హిందీ మాటలు వస్తాయి అబ్బాస్ కి. పిల్లలు ఇండియా కదా.. ఆ మాటలకి సంతోషిస్తారని వాడి ఊహ.
షెడ్ బయటికి రాగానే వేడి గాలి కొట్టింది. షెడ్లో మెటల్ పైన ఏదో పరిచినట్లున్నారనుకున్నాడు చిన్నా. అంత వేడిగా లేదు. రెండు తలుపులూ తీసుకుంటే కాస్త గాలి కూడా వేస్తోంది. లోపల చిన్నగా ఏసీ కూడా ఉన్నట్లుంది.
బయట ఒక వాన్.. చుట్టూ ఓపెన్. మెష్ తో కవర్ చేసి ఉంది. లోపల కూర్చోడానికేం లేదు. అందర్నీ ఎక్కించాడు అబ్బాస్. నజీర్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అప్పటికే లోపల అరడజను మంది పిల్లలున్నారు.
ఇద్దరు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినట్లున్నారు.. అదే, తీసుకొచ్చి నట్లున్నారనుకున్నాడు చిన్నా. మిగిలిన వాళ్లు.. తెలియడం లేదు. ఏ భాషలు అర్ధ మవుతాయో..
అందరూ ఐదారేళ్ల పిల్లలే.. ముక్కు పచ్చలారని పసి వారే.
అందరి మొహాలూ నిద్ర నిద్రగా ఉన్నాయి. కళ్లలో ఆకలి కనిపిస్తోంది. ఇవేళ గడిచిపోతే చాలన్నట్లుగా ఉన్నారు.
టింకూ ఇంకా నోట్లో వేలేసుకునే చూస్తున్నాడు. వాడికి భయం వేసినప్పుడు, ఆకలేసినప్పుడు, నిద్ర వస్తున్నప్పుడూ నోట్లో వేలేసుకోడం అలవాటు. ఇప్పుడు మూడూ వేస్తున్నాయి వాడికి.
వాన్ లోకి ఎక్కగానే, ఒక మూల కూర్చుని కళ్లు మూసేసి నిద్రలోకి జారుకున్నాడు టింకూ.
పిల్లలందరూ కిందే కూర్చున్నారు. అందరూ ఎక్కారో లేదో చూసి, అబ్బాస్ ముందు సీట్లో నజీర్ పక్కన కూర్చున్నాడు.
వాన్ బయలు దేరింది దడదడ చప్పుడు చేస్తూ.
చిన్నాకి గుండె ఆగినంత పనయింది.
తమ గురించి చెప్పినవన్నీ చెప్పడు కదా!
సరిగ్గా అదే సమయానికి పక్కకి తిరిగి చిన్నా, టింకూల గురించే చెప్తున్నాడు అబ్బాస్, నజీర్కి.
………………..
5

అబ్దుల్ హలీమ్ తన ఒంటెల తోటలో తిరుగుతూ అంతా పరిశీలిస్తున్నాడు.
ఆ ఫామ్ షేక్ గారిదైనా అదంతా తనదే అన్నట్లుగా పని చేస్తాడు. చేయిస్తాడు. షేక్ కూడా అతనికి పూర్తి స్వతంత్రం ఇచ్చాడు.
ఒక పక్క ఒంటెలకి విశాలమైన షెడ్లు. అక్కడికి దగ్గర్లోనే పనివాళ్ల ఇళ్లు. వాళ్లు చేసే పనిని బట్టి ఇల్లు ఉంటుంది. వాళ్ల పిల్లలు స్కూల్స్ కి వెళ్లడానికి ఒక వాన్. ఇళ్లు కూడా ఎయిర్ కండిషన్డ్.
అన్ని సదుపాయాలూ అమర్చారు.
అందు లోనే ఇసక తిప్పలు.. ఒక ఒయాసిస్ కూడా ఉంది. దాని చుట్టూ ఖర్జూరం చెట్లు. ఎడారిలో పెరిగే చెట్లే కాక, ఒక చోట పార్క్ కూడా తయారు చేశారు. నీటికి ఇప్పుడక్కడ కొదవ లేదు కదా!
అందులోనే ఒక చోట రాళ్లు రప్పలు, మట్టి.. చిన్న కొండ..
మొత్తానికి, ఆ ఫామ్ ఒక చిన్న ఆరబ్ దేశంలా ఉంటుంది.
హలీమ్ కి చాలా ఇష్టమైన చోటు. ఆధునాతన మైన తన ఇంటికంటే తోటలో గడపటమే అతనికి ఇష్టం.
మరి అతను పుట్టిన వంశం, జాతి అటువంటిది.
ప్రాచీన కాలం నుంచీ అరేబియన్ ఎడారుల్లో నివసించిన బేడూ జాతికి చెందిన వాడు హలీమ్.
ఆ ఎడారులే.. ఇప్పటి ఇస్రాయిల్, జోర్డాన్, సిరియా, యు.యే.యి, సౌదీ అరేబియా, ఖతార్ వంటి సంపన్న దేశాలున్న ప్రదేశాలు..
బేడూ జాతి వారు సంచారులు. ఒక చోటని లేక, తమకి ఎక్కడ బాగుందనిపిస్తే అక్కడికి మారి పోతూ ఉండే వారు.. తమ గుడారాలని వెంట పెట్టుకుని.
బిడారులనే పేరు బేడూ నించే వచ్చి ఉంటుంది.
లొట్టిపిట్టలని (ఒంటెలు), గొర్రెలని తమ వెంట తిప్పుకుంటూ.. ఎక్కడ కాస్త నీటి వనరు దొరుకుతే అక్కడికి మారిపోతుంటారు.
బేడూలు తాము యాడమ్ కొడుకు, నోవా సంతతి వాళ్ల మని గర్వంగా చెప్పుకుంటారు. చారిత్రికంగా చాలా పురాతన మైన జాతి. అరేబియన్ కథలన్నింటిలో అందరూ చదివేది వారి గురించే.
వారి కాలంలోనే వర్తకం.. ఓడల్లో తిరిగి, సుగంధ ద్రవ్యాలు, ఉన్ని, ఖ్రజూరం వంటి ఆహార పదార్ధాలూ అన్ని దేశాల్లో అమ్మడం వచ్చింది. వారి మతం ఇస్లామ్. అందుకే ప్రపంచంలో ఇటు తూర్పు, అటు పశ్చిమ దేశాల్లో ఇస్లామ్ బాగా వ్యాప్తి చెందింది.
బేడూలు చాలా సరళ స్వభావులని పేరు. కొత్తవారిని సంకోచాల్లేకుండా తమలో కలిపేసుకుంటారు.
తాటి ఆకులతో కానీ, గొర్రె ఉన్నితో కాని తమ ఇళ్లని కప్పుకుంటారు.
చెట్ల నీడల్లోనైనా కాలం గడిపెయ్యడానికి తయారు.
వారు ఉండే ఎడారులు జనం నివసించడానికి అస్సలు వీలే లేని ప్రదేశాలుగా ఉండేవి. జనాభా చాలా తక్కువ. వర్షాలు ఏడాదికి ఒకటి రెండు సార్లు కురిస్తే గొప్ప. ఒక పక్క వేసంకాలంలో 50 డిగ్రీలు వేడి ఉంటే.. ఇంకొక పక్క చలికాలం సున్నాకి వెళ్లి పోతుంది.
ఇలాంటి వాతావరణంలో కూడా కొన్ని చోట్ల చెట్లు, చిన్న చిన్న చెరువులు (ఒయాసిస్ లు) ఉంటాయి. మొత్తం అంతా ఇసుకే ఉండదు. అక్కడక్కడ మట్టి, రాళ్లు కూడా ఉంటాయి.
జనావాసాలు ఉన్నాయి. జంతువులు జీవిస్తున్నాయి.
అరేబిక్ భాషే మాట్లాడతారు. అన్ని భాషల్లో లాగే వారికి కూడా ఒకే మాటకి, ప్రతి పదార్ధాలుంటాయి.
ప్రేమలు, విరహాలు, యుద్ధాలు.. వాటి మీద కుప్పలుగా కథలు వారికి కూడా సాధారణమే. ఎడారి దొంగలు, హంతకులు, అత్యాచారాలు.. అంతెందుకు, ఆధునిక మానవులలో ఏమేం భావాలు, స్పందనలు ఉన్నాయో.. అన్నీ ఆ ప్రాచీన జాతిలో ఉన్నాయి.
ఆడపిల్లలు పెద్దవాళ్లవుతూనే తలకి, మొహానికీ ముసుగు వేసుకోవడానికి ఇష్ట పడతారు. వారికి ఆచారాలని పాటించడం ఎంతో ఆనందం. మగపిల్లలు వారి చేతి వేళ్లని కూడా తాక కూడదు.
అత్మ గౌరవం, ఆతిథ్యం.. ఇవి రెండూ వారి ముఖ్యమైన లక్షణాలు. చిన్న చిన్న గుంపులుగా ఎడారుల్లో.. దొరికిన నీటి చుక్కలని దాచుకుంటూ తిరిగే వారికి ఆత్మ రక్షణ, ఆత్మ గౌరవం ముఖ్యమైనవే.
అలాగే.. ఎవరైనా వారి గుడారానికి వస్తే.. మైళ్ల తరబడి జనావాసం లేని చోటులో తరిమెయ్యలేరు కదా! మానవత్వంతో అక్కున చేర్చుకుంటారు.
అంతంత ఎండలు భరించాలంటే శరీరాన్ని పూర్తిగా కప్పుకోవలసిందే. అందుకే వారు పొడవాటి గౌన్లు ధరిస్తారు.. ఆడా మగా కూడా..రెండు వరుసల్లో. లేక పోతే, సూర్యుని ప్రతాపానికి శరీరం కమిలి పోతుంది.
తమ ఉనికికే కారణమైన ఒంటెలని, భగవంతుడు వారికిచ్చిన వరాలుగా భావిస్తారు. ఆకలి తీర్చడానికి ఒంటె పాలు. ఎక్కడికైనా వెళ్లాలంటే ఒంటె వాహనం.
వినోదం కావాలంటె ఒంటెల పరుగు పందాలు.
ఒంటెలని ఏ విధంగా పెంచాలో.. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో వారికి తెలిసినంతగా ఎవరికీ తెలీదు.
అందుకనే, ఆధునిక ఒంటె రేసుల నిర్వహణలో బేడూ జాతి వారినే, ఒంటెల సంరక్షకులుగా, ఆ వ్యవస్థకే నిర్వాహకులుగా నియమిస్తారు, ఆరేబియన్ దేశాల సంపన్నులు.
అబ్దుల్ హలీమ్ ఒమన్ దేశపు ఎడారుల్లో ఒక బిడారానికి అధిపతి అయిన బెడూ షేక్ కొడుకు. చిన్నతనం నుంచీ, ఒంటెల నిర్వహణలో తరిఫీదు పొందిన వాడు. షేక్ కొడుకవడంతో ఆ సమూహం లోని అన్ని ఒంటెల బాధ్యతనీ తీసుకునే వాడు.
ఒంటెలని వాహనాలుగా, వ్యాపార సాధకాలుగా వాడటం మానేశాక, బేడూలకి జీవనోపాధి పోయిందనే చెప్పాలి.
అందరూ చమురు బావుల్లో, సూక్ (బజారు) లలో, హోటళ్లలో.. ఇతర వ్యాపార సంస్థల్లో పని చెయ్యడం మొదలు పెట్టారు.
అతి ఖరీదైన రేసు ఒంటెల (ఒక్కొక్క ఒంటె 50,000 డాలర్ల పైనే ఉంటుంది) నిర్వహణ బాధ్యత చాలా క్లిష్టమయింది. బాగా అనుభవం, పేరు ఉన్న వారికే అప్పచెప్తున్నారు షేక్ లు, వ్యాపారస్థులు.
అందుకే.. హలీమ్ కి, ఆ దేశపు సర్వాధికారి తన ఒంటెల బాధ్యతని అప్పగించాడు.
హలీమ్ తన పిన్ని కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. బేడూలు సాధారణంగా ఫస్ట్ కజిన్లనే చేసుకుంటారు. నలుగురు పిల్లలూ అమెరికన్ స్కూల్స్ లో చదువుతున్నారు. పెద్దబ్బాయి, హైస్కూల్ గ్రాడ్యుయేషన్ అయాక అమెరికా వెళ్లి, వెటర్నరీ మెడిసిన్ చెయ్యాలనుకుంటున్నాడు.
సహజ సిద్ధంగా జంతువులమీద ఉన్న అవగాహన, శ్రద్ధ బేడూ సంతానాన్ని వాటికి సంబంధించిన చదువులే ఆకర్షిస్తాయి.

“సాబ్..” సన్నగా వినిపించిన పిలుపుకి ఆలోచనల్లో మునిపోయిన హలీమ్ తల తిప్పి చూశాడు.
“పొద్దుటి నుంచీ ఏమీ తినలేదు. ఒంటెలకి తినిపిస్తే మీ కడుపు నిండదు కదా. అమ్మగారు నన్ను కోప్పడతారు. మీకు నాస్తా తెచ్చేదా?” వంటశాల అధికారి.. మైన్ షెఫ్ అడిగాడు.
“అలాగే.. తీసుకురా.” నవ్వుతూ చూశాడు హలీమ్.
ఆ ఫామ్ లో వంట అందరికీ కామన్ గా ఉంటుంది. ఏమేం చెయ్యబోతున్నారో ముందు రోజే చెప్తారు. మార్పులు చేర్పులు కావాలంటే చేసుకోవచ్చు.
సరుకులు తెచ్చుకోవడం, వండుకోవడం వంటి బాదరబందీ ఉండకూడదని హలీమ్ ఆ ఏర్పాటు చేశాడు. అవసరమైతే, వంట అవగానే, తమ ఇళ్లకి తీసుకు పోవచ్చు. ఇంటి వాళ్లతోనే తినాలనుకుంటే.
ఆ వార జీతం తగ్గించి, దాంతో వంట శాలనీ అందులోకి పని వారినీ ఏర్పాటు చేశాడు.
దాని వలన అదనంగా కొంత మందికి ఉపాధి దొరికింది.
పని చెయ్యడంలో పూర్తిగా దృష్టి పెట్ట గలుగు తున్నారు. అందరికీ ఆనందం కలిగించింది ఈ పద్ధతి.
ఇతర ఫామ్ లు కూడా అనుసరిస్తున్నాయి ఈ పద్ధతిని.
“సాబ్! ఇదిగో. తిన్నాక చెయ్యండి మిగిలిన పనులన్నీ.” శుభ్రమైన పళ్లాలలో వెన్న నామమాత్రంగా వేసి కాల్చిన బ్రెడ్, ఆమ్లెట్, ఖర్జూరాలు, యాపిల్ ముక్కలు తెచ్చి బల్ల మీద పెట్టాడు షెఫ్.
చుట్టూ గాజు తలుపులున్న ఆ ఆఫీస్ గది హలీమ్ది. ఎత్తైన గుట్ట మీద ఉంటుంది. ఫామ్ మొత్తం గుండ్రంగా కనిపిస్తుంది అక్కడి నుంచి. అంగుళం అంగుళం పరిచయమే అతనికి.
ప్రతీ ఒంటె అతని కన్న బిడ్డ కంటే ఎక్కువ.
రోజుకు ఒక్క సారైనా వెళ్లి పేరు పేరునా పలకరించి వస్తాడు.
సెప్టెంబర్ నించీ మొదలవుతాయని ప్రకటించి నప్పటికీ, వేడి తట్టుకోలేక అక్టోబర్ లో ఆరంభిస్తారు రేసుల్ని.
అయితే.. హలీమ్ సెప్టెంబర్ మొదటి వారానికల్లా తయారుగా ఉంటాడు.. తన ఒంటెలతో, జాకీలతో.
హలీమ్ తినడం అయే వరకూ ఉండి, ఫ్రాస్కులో ఉన్న బ్లాక్ కాఫీ కప్పు లో పోసి ఇచ్చాడు షెఫ్.
“ఎలా ఉంది కిచెన్? ఏదయినా మార్పు కావాలా? సామానేమైనా కావాలా? పనివాళ్లు చెప్పిన మాట వింటున్నారా?” కాఫీ తాగుతూ కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు హలీమ్.
“అంతా బాగుంది సాబ్. ఇంకొక పెద్ద ఆవెన్, బ్లెండర్ కావాలి. ఆర్డర్ ఇచ్చా. రేపు.. సరుకు నాకు వస్తుంది. బిల్ మీకు వస్తుంది.”
చిరునవ్వు నవ్వాడు హలీమ్.
“ఇంకేం సమస్యల్లేవు కదా?”
“ఏం లేవు సాబ్. ఒంటెలకి దాణా బయట తయారయి వస్తుంది. అది చూసుకోవడానికి వేరే ఉన్నారు కదా! నాకే ప్రాబ్లమ్ లేదు.” షెఫ్ పళ్లాలు, కప్పు, ఫ్లాస్కు తీసుకుని వెళ్లిపోయాడు సలాం చేస్తూ.
ఒంటెలు మధ్యాన్నం రెండు గంటలకి కానీ రావు. ఈ లోగా జాకీలని తీసుకురావాలే నజీర్.. ఈ జాకీలని సప్లై చేసే వాళ్లతోనే కొంచె ప్రాబ్లం. అనుకున్న టైమ్కి ప్రామిస్ చేసినంత మందిని తీసుకు రారు. వాళ్లకేం సమస్యలున్నాయో కానీ..
హలీమ్ లోనున్న మంచి గుణం అదే.. ఎవరినైనా ఎత్తి చూపే ముందు వారికున్న ఇబ్బందులేమిటా అని ఆలోచిస్తాడు.
దూరంగా గేటు తీస్తున్నట్లు, అందులో నుంచి ఒక వాన్ లోపలికి రావడం కనిపించింది.
హలీమ్ ఆఫీస్ లోంచి బైటికి వచ్చి, తోటలో ఫౌంటెన్ దగ్గరకొచ్చాడు. విరజిమ్మే నీటి పక్కన ఆహ్లాదంగా ఉంది అక్కడ.
వాన్ వచ్చి కొంచె దూరంలో ఆగింది.
నజీర్, ఆ వెనుక అబ్బాస్ దిగారు.
నజీర్ సలాం చేసి నిలుచున్నాడు.
“తీసుకొచ్చారా?” హలీమ్ వాన్ కేసి చూస్తూ అడిగాడు.
“హా సాబ్.. మొత్తం వన్ డజన్.”
“షేప్ లో ఉన్నారా? బరువు తక్కువే కదా?”
“ఔ సాబ్. పదిహేను కిలోల కంటే ఎవ్వరూ ఎక్కువ లేరు. ఈ రోజు న్యూ యరైవల్ ఇద్దరున్నారు. వాళ్లకి ట్రయినింగ్ ఇవ్వాలి.”
“దింపండి.”
అబ్బాస్ వెళ్లి వెనుక తలుపు తీశాడు. అందరూ దుంకినట్లుగా కిందికి దిగారు. టింకూ తప్ప. వాడింకా నిద్ర పోతున్నాడు. హలీమ్ అందరినీ లెక్కపెట్టి, సాలోచనగా చూశాడు నజీర్ ని.
ఒక్కొక్క జాకీకి, రోజుకి ఇంతని డబ్బులివ్వాలి మరి..
అబ్బాస్, వాన్ లోకి ఎక్కి, టింకూని దింపాడు. వాడు కళ్లు నులుముకుంటూ లేచి చూశాడు. నీడ పట్టున ఉండి పెరిగాడేమో, పాల బుగ్గలింకా పోలేదు. నిద్ర కళ్లతో చూస్తుంటే హలీమ్ కి అనుమానం వేసింది.
“వీడింకా బేబీలాగున్నాడు కదయ్యా? కూర్చో గలడా జీను మీద? కొన్ని రోజులు వేరే పనులు, ఎక్సర్ సైజులు చేయించండి. ఒళ్లు కాస్త గట్టి పడ్డాక రైడింగ్ ఇవ్వచ్చు. ప్రోటీన్ ఫుడ్ పెట్టండి.”
“యస్ సర్..” వినమ్రంగా అన్నాడు నజీర్.
“వెళ్లేటప్పుడు మనీ తీసుకో. నీది మాత్రమే. మీ బాస్ మనీ తనకే క్రెడిట్ అవుతుంది.”
నజీర్ అలాగే అన్నట్లు తలూపి, పిల్లల్ని ఎక్కించి, తీసుకెళ్లాడు.

ఆ ఫామ్ లోనే ఈ బుల్లి జాకీలకి శిక్షణ ఇవ్వడానికి కొన్నిపిల్ల ఒంటెలుంటాయి. ఆ కొన్నింటినీ అక్కడే వాళ్ల ప్రైవేట్ ట్రాక్ మీద ప్రాక్టీస్ చేయిస్తారు.
అవి అప్పుడే పరుగందుకో లేవు. 20 కిలో మీటర్ల కంటే తక్కువ వేగంతో నడుస్తాయి.
ఆ తక్కువ వేగం కూడా, అప్పుడే స్వారీ మొదలు పెట్టిన వాళ్లకి భయం కలిగిస్తుంది.
అందరినీ, హలీమ్ ఫామ్ లో ట్రాక్ దగ్గరకి తీసుకెళ్లి దింపాడు నజీర్.
టింకూనీ, ఇంకొక కుర్రాణ్ణీ తప్ప అందరినీ ఒంటెలెక్కించాడు, హెల్మెట్లు పెట్టి. అసలే వేడి. దానికి తోడు హెల్మెట్.. ఊపిరాడనట్లు అనిపించింది
సుమారు ఏడడుగుల ఎత్తుండే ఒంటె వీపుమీద కూర్చోగానే చిన్నాకి మొదట్లో భయం వేసింది. కానీ.. కొత్త ఇంటికి వెళ్లగానే, నజీర్ అంతెత్తు ఎగరేసి పట్టుకోవడంతో ఎత్తంటే, అంత గాభరా వెయ్యలేదు.
అసలు అందుకే.. ఇది అలవాటు చెయ్యడానికే అలా ఎత్తేశాడేమో అనిపించింది చిన్నాకి.
కాళ్లు అటూ ఇటూ వేసి, వీపు జీను కట్టిన తాడుకి కట్టేసి పడిపోకుండా ఎలా కూర్చోవాలో చూపించాడు అబ్బాస్.. కాబోయే చిన్న ముధారీ.

1 thought on “కలియుగ వామనుడు – 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *