March 19, 2024

బ్రహ్మలిఖితం – 16

రచన: మన్నెం శారద

ప్రతి కిలోమీటరుకి అడవి దట్టమవడం గమనించింది లిఖిత. ముందంతా రబ్బరు తోటలున్నాయి.
వాటికి కట్టిన చిన్న చిన్న కుండలలో గాటు పెట్టిన చెట్టు నుండి చిక్కని పాలు కారుతున్నాయి. కొన్ని చోట్ల పాలని ట్రేలో ఎండబెట్టి తయారుచేసిన రబ్బరు షీట్లు ఆరవేసున్నాయి.
కొంత దూరం వెళ్లేక వాతావరణం బాగా మారిపోయింది. ఆకాశంలోని మబ్బులు కొండలమీదకు విహారం వచ్చినట్లుగా తిరుగుతున్నాయి.
ఇది తన తండ్రి చావు బ్రతుకుల సమస్య కాకపోతే తనెంతో ఎంజాయ్ చేసి ఉండేది విహారాన్ని. కాని మనసులో ఆయన ధ్యాస ఒక పక్క ముల్లులా గుచ్చుకుంటున్నది.
“ఎక్కడికెళ్తున్నావ్?”
పక్కన కూర్చున్న వ్యక్తి ప్రశ్నకి తన ఆలోచనలనుండి బయటపడి చూసింది లిఖిత.
ఒక వృద్ధుడు నుదుట అడ్డనామాలతో కూర్చుని లిఖిత వైపే చూస్తున్నాడు.
అతను మళయాళంలో మాట్లాడింది ఆమెకర్ధం కాలేదు.
“ఐ డు నాట్ నో మళయాళం” అంది.
“సైట్ సీయింగ్?”
“ఊ” అంది పొడిగా.
“యువర్ నేం?”
లిఖిత అనబోయి నాలిక్కరుచుకొని “ప్రభు” అంది అప్పటికప్పుడు తోచింది చెబుతూ.
అతను తర్వాతేం మాట్లాడలేదు.
బస్ మరయూర్ చేరింది.
లిఖితతో పాటు ఆ వృద్ధుడు కూడా బస్ దిగేడు. బస్ దిగి లిఖిత ఎటెళ్ళాలొ ఏం చేయాలో తెలీక అలాగే నిలబడింది.
మనసు మళ్ళీ ఆందోళన వైపు మొగ్గిపోసాగింది.
ఆ వృద్ధుడు ఆమెని దీక్షగా గమనిస్తూ “ఎక్కడికెల్లాలో చెప్పు. నేను తీసుకెళ్తాను” అన్నాడు వచ్చీరాని ఇంగ్లీషులో.
లిఖిత అతని మొహంలోకి నిశితంగా చూసింది. అతని వయసు అరవై దాటి ఉంటుంది. అతని కళ్లు గాజుగోళాల్లా ఉన్నాయి. భవరహితంగా అతనికి తను నిజం చెప్పొచ్చో లేదో. చెప్పకపోతే తనకిక్కడ ఆ మాత్రికులుండే దారెవరు చూపిస్తారు. ఇలాంటి పెద్దవాళ్లకి విషయాలు తెలిసుండొచ్చు. అతను వృద్ధుడు తనకెలాంటి హానీ చేయడు అనే నమ్మకం కుదిరిందామెకు.
“ఇక్కడ చేతబడులు, క్షుద్రపూజలు చేసే వాళ్లుంటారట. ఎక్కడో తెలుసా?”
అతను కళ్ళు పెద్దవి చేసి “వాళ్లతో ఏం పని నీకు?” అనడిగేడు.
“మా నాన్నగారు వాళ్ల దగ్గర కొన్ని విద్యలు నేర్చుకుందామని వచ్చేరు. ఆయన్ని వెదుక్కుంటూ వచ్చేను” అంది లిఖిత.
“నీకు భయం లేదా?” అతనాశ్చర్యంగా అడిగేడు.
లిఖిత లేదన్నట్లుగా తల అడ్డంగా తిప్పింది.
అతను ‘పద’ అంటూ ముందుకి నడిచేడు.
చందనపు చెట్ల సుగంధ శీతల గాలుల్లో వాళ్లిద్దరూ అలసట మరచి ముందుకు సాగేరు.
అరగంట గడిచింది.
ఆ చెట్లకవతల వున్న ఒక పెద్ద కొండ దగ్గర ఆగేడా వృద్ధుడు. లిఖిత కూడా ఆగింది.
“వెళ్లి ఆ వాగులో కాళ్లు కడుక్కునిరా”
లిఖిత వాలులో ప్రవహిస్తున్న వాగువైపు సాగింది. తన చేతిలోని సంచిని వాగు పక్కన పెట్టి కాళ్లు, చేతులు, మొహం కడుక్కుని తిరిగి చేతిలోకి సంచిని తీసుకుంది. అలా తీసుకోవడంలో ఆమెకు భగవతి కోవెలలో పూజారి కుట్టికారన్ ఇచ్చిన కుంకుమ పొట్ళం జారి క్రిందపదిపొవడం ఆమె గమనించలేదు.
అదే ఆమె దురదృష్టం.

*****

వాల్తేర్ స్టేషన్‌లో రైలు దిగగానే ఈశ్వరి వెంకట్ వైపు సందిగ్ధంగా చూసి “నేనిప్పుడెక్కడికెళ్ళాలి?” అని ప్రశ్నించింది.
“ఇంకెక్కడీకి, మీ ఇంటికే!” అన్నాడు వెంకట్.
“అదెలా? నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నాను. మీ ఇల్లే నా ఇల్లు” అంది ఈశ్వరి.
“అది నిజమే అనుకో. కాని.. నేను నీ కోసం మంచిల్లు చూడాలి. అన్ని వస్తువులూ కొనాలి. నువ్వు కూడా మీ ఆయనకి డైవొర్స్ ఇవ్వాలిగా. లేకపోతే శ్రీకృష్ణజన్మస్థానంలో పెడతారు మనిద్దర్ని.” అన్నాడు వెంకట్ ఆమెకి నచ్చచాబుతున్న ధోరణిలో.
ఈశ్వరి మొహం నిరుత్సాహంగా తయారయింది.
“నేను మిమ్మల్నొదిలి బ్రతకలేను” అంది బాధగా.
“ఎంత. నాల్రోజులోపిక పట్టు” అన్నాడు ఓదార్పుగా. ఈశ్వరి వస్తున్న కన్నీళ్లాపుకొని ఆటో ఎక్కింది.
వెంకట్ హమ్మయ్య అనుకొని మరో ఆటో ఎక్కి తన రూం చేరుకున్నాదు. అతను ఆటో చార్జీలు పే చేసి వెనక్కు తిరిగేసరికి అక్కడ తన మామయ్య సూర్యనారాయణ నిలబడి ఉన్నాడు.
అతన్ని చూడగానే గుండె గుభేలుమంది వెంకట్‌కి.
సూర్యనారాయణ గర్భ దరిద్రుడు. ఏ పని చేసినా కలిసి రాలేదు. ముగ్గురు కూతుళ్లు. అందులో ఏ దరిద్ర దేవతనో తనకంటగట్టాలని అతని ప్లాను. ఇదివరకు అనేక ఉత్తరాలు రాసేడు. తను జవాబివ్వకపోవడంతో నేరుగా వచ్చేసేడు.
“బావున్నావా అల్లుడూ! ఇంటికి తాళం కనిపించేసరికి ప్రాణం ఉసూరుమనిపించింది. వెళ్లిపోదామనుకుంటుండగా వచ్చేవు. నా అదృష్టం బాగుంది.” అన్నాడతను నవ్వుతూ.
వెంకట్ వస్తున్న ఏడుపుని నవ్వుగా మార్చుకొని “బాగానె ఉన్నాను. ఆఫీసు పని మీద టూరెళ్లేను” అంటూ ఇంటి తాళం తీసేడు.
“ఉద్యోగం చేస్తున్నావన్నమాట. బాగుంది. ఇంతకీ ఎలాగైనా మా పెద్దది అదృష్టవంతురాలు” అన్నాడాయన కుర్చీలొ దుమ్ము భుజమ్మీద కండువాతో దులుపుకొని కూర్చుంటూ.
తనుద్యోగం చేయడం వాళ్లమ్మాయి అదృష్టంగా ఎలా మారిందో ఆలొచిస్తూ “పని మీద వచ్చేవా?” అనడిగేడు ఎదురుగా వున్న స్టూలు లాక్కుని కూర్చుంటూ.
“పనే మరి! పెద్దదాని పెళ్లి చేయాలనుకుంటున్నాను” అన్నాడాయన నవ్వుతూ.
“కుదిరిందా?” అనడిగేడు వెంకట్ అమాయకంగా.
“పెద్దాడితో పరాచికాలాడకు. అది నిన్ను తప్ప మరొకర్ని కట్టుకోనని భీష్మించుకుంది. అందుకే వచ్చేను” అన్నాడు.
వెంకట్ గుండె గుభేలుమంది.
“అదికాదు మామయ్యా. నాకిప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు” అన్నాడు.
“నువ్విలా మాట్లాడతావనే శుభలేఖలచ్చేయించుకొని మరీ వచ్చేను. నా కూతురు కనకమహాలక్ష్మికేం లోటు. నిన్నే ప్రేమించిందని వెంటబడుతున్నాను కాని.. అప్పుడే విజయనగరంలో అరడజను దిగ్విజయమైన సంబంధాలొచ్చేయి తనకి” అన్నడు.
“మరింకేం చెయ్యలేకపోయేవా?” అంటూ వెటకారంగా అడిగేడు వెంకట్.
“చెబుతున్నాగా నిన్ను ప్రేమించి చచ్చిందని. పైగా చచ్చిన మీ అమ్మ కూడా నిన్ను నా కూతురికి చేసుకోమని చెప్పి మరీ చచ్చింది. లేకపోతే దాని పేరున పది లక్షలు బంపర్ లాటరీ వచ్చిన విషయం తెలిసి జనం ఎగబడుతున్నారు” అన్నాడు సూర్యనారాయణ గర్వంగా.
ఆ మాట వినగానే పాదాల క్రింద బాంబు పెట్టినట్లు ఎగిరి పడ్డాడు వెంకట్.
“ఏంటి మామయ్యా నువ్వు చెబుతున్నది నిజమేనా? కనక బంపర్ కొట్టేసిందా?” అనడిగేడు ఆశ్చర్యంగా.
వెంకట్ వెంటనే పెళ్ళికి ఒప్పేసుకుంటే డబ్బు మీద ఆశ పడుతున్నాడనుకుంటారని “నాకు నికరమైన ఉద్యోగం లేదు. పెళ్ళాన్నెలా పోషిష్తాను?” అన్నాడు బధగా మొహం పెట్టీ.
మగాడికి పెళ్ళాం పట్ల ప్రేమ, తన మగతనం పట్ల నమ్మకముంటే చాలు. ఆడది శుభ్రంగా సుఖపడిపోతుంది. అయినా దానికొచ్చిన డబ్బుల్లో సగం దానికే ఇద్దామనుకుంటున్నాను. ఇక భయం దేనికి?”
మామగారి మాటలు విని వెంకట్ ఉక్కిరిబిక్కిరయిపోయేడు. వెంటనే “నీ ఇష్టం” అన్నాడు సిగ్గు అభినయిస్తూ.
“అయితే నాతో బయల్దేరు” అన్నాడు సూర్యనారాయణ లేచి నిలబడి.
వెంకట్ ఇంటీకి తాళం వేసి అతనితోపాటు మెట్లు దిగేడూ అమితమైన ఆనందంతో.

*****

ఆ గుహ బాగా చీకటిగా ఉంది.
ఆ చీకటిని పారద్రోలేందుకు అక్కడక్కడా గుచ్చిన కాగడాలు ప్రయత్నిస్తున్నాయి.
లిఖిత ఆ వృద్ధుని వెంట లోనికి నడిచింది.
లోపల ఒక పెద్ద హోమగుండం వెలుగుతోంది.
అక్కడ కొందరు నల్లగా దృఢంగా వున్న వ్యక్తులు జనపనార గుత్తుల్లాంటివి నూనెలో ముంచి ఆ హోమగుండంలోముంచి నేలకేసి బాదుతున్నారు. ఆ చర్య అంతరరార్ధమేంటో లిఖితకి అర్ధం కాలేదు.
గుహలోపల ఒక ఎత్తయిన రాతి ఫలకం మీద పది తలలు, ఇరవై చేతుల స్త్రీ విగ్రహం దిశమొలతో ఉంది. ఆ పది తలల కళ్ళు వివిధ భావాల్ని ప్రకటిస్తున్నట్లుగా చూస్తున్నాయి. ఆ విగ్రహం పది నాలుకల్ని బయటకు సాచింది వికృతంగా. పెదవుల కిరువైపులా ఉన్న కోరలకి మాంసపు ముక్కలు గుచ్చి ఉన్నాయి.
బట్టతల, అడ్డబొట్టు పెట్టుకున్న వృద్ధుడొకడు ఆ విగ్రహమ్ముందు కూర్చుని మంత్రాలు చదువుతున్నాడు.
లిఖిత ఆ వాతావరణాన్ని భయంగా చూస్తోంది.
లిఖితతో వచ్చిన వృద్ధుడు ఆమెని అక్కడే నిలబడమని సైగచేసి పూజ చేస్తున్న వృద్ధుడి దగ్గరకెళ్ళి “మహామాయా!” అని పిలిచేడు.
అతదు కళ్ళు తెరచి చూసేడు ఏంటన్నట్లుగా.
“నువ్వు కావాలనుకున్నంత వయసు కుర్రాడు దొరికేడు” అన్నాడు మళయాళంలో.
అతను వెనక్కు తిరిగి చూసేడు.
లిఖిత టోపీతో లుంగీతో నిలబడి ఉంది.
“మన ప్రాంగణంలోకి నెత్తిన టోపీ పెట్టుకుని రాకూడదని చెప్పలేదా?” అన్నాడు మహామాయ
“మరచిపోయేను. ఇప్పుడు చెబుతాను”అంటూ వెనుతిరగబోయేడు వృద్ధుడు.
“ఆగు. పూజ ముగించి నేనొస్తాను. ఇంతకీ వాడు బ్రాహ్మణుడేనా?”
“తెలియదు. అడగలేదు”
“సరే. కాస్సేపాగు”
వృద్ధుడు వెనుతిరిగి లిఖిత దగ్గరకెళ్లి” కూర్చో. మహామాయ వస్తాడు” అన్నాడు.
లిఖిత అక్కడే ఉన్న రాయి మీద కూర్చుంటూ “ఏం చేస్తారిక్కడ?”అనడిగింది అమాయకంగా.
“ఏం చేద్దామని వచ్చావిక్కడికి?”
“మా నాన్న ఉన్నాడేమోనని. ఆయనిటువైపు అడవుల్లోకొచ్చేడని తెలిసి వచ్చేను.”అంది లేచి నిలబడుతూ.
“మీ నాన్న పేరు?”
“కార్తికేయన్”
ఆ జవాబు విని ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి.
“కూర్చో. మహామాయ వచ్చేక మాట్లాడుదువుగాని”
లిఖిత మళ్ళీ కూర్చుంది. దిక్కులు చూస్తూ, అక్కడి వ్యవహారం చూస్తే పిచ్చి పట్టేటట్లుంది.
చీకటిని మింగిన గుహలో, చిరుత కళ్ళలాంటి కాగడాలు వెలుగుతున్నాయి.
ఆ ఎర్రని కాంతిలో నల్లని పోత పొసిన కంచు విగ్రహాల్లాంటి మనుషులు కేవలం మాటలు రాని రోబోట్‌ల్లా యాంత్రికంగా ఊహకందని పనులు చేసుకుంటూ పోవడం, భగభగ మండే హోమగుండం, వికౄతంగా నాలుకలు సాచిన విగ్రహం. తన తండ్రి అకక్డ కూడా లేకపోతే ఏం చేయాలి.
ఆమె ఆలోచిస్తుండగానే మహామాయ ఆమె దగ్గర కొచ్చి నిలబది “నువ్వు కార్తికేయన్ కొడుకువా?” అనడిగేడు.
లిఖిత బెదురుతూ లేచి నిలబడి అవునని తల పంకించింది.
మహామాయ వృద్ధుడికేసి తిరిగి చిరునవ్వు నవ్వి “కుర్రాడు సున్నితంగా అమ్మాయిలా ఉన్నాడు” అన్నాడు మళయాళంలో.
వృద్ధుడు నవ్వాడు.
“ఇక్కడికి నెత్తిన టోపీ ధరించి రాకూడదు. తీసేయ్”
లిఖిత బెదిరినట్లు చూసింది మహామాయ వైపు.
“నీకే చెప్పేది”
“ఇంతకీ మా డేడీ ఉన్నారా ఇక్కడ?”
“ఆ సంగతి తర్వాత. ముందు టోపీ తియ్యి”
లిఖిత భయం భయంగా టోపీ తీసేసింది.
టోపీలో ముడిచిపెట్టిన జుట్టు భుజాల మీదకు జారింది. మహామాయతో పాటు, వృద్ధుడు కూడా నివ్వెరపోయి చూశారామెవైపు.
“నువ్వు అబ్బాయివి కావా? అనడిగేడు వృద్ధుడు ఆశ్చర్యంగా.
“అబ్బాయినే. అబ్బాయినే. నాకు మొక్కుంది.మా నాన్న కనిపించేక జుట్టు తీస్తానని”అంది కంగారుగా.
మహామాయ ఫక్కున నవ్వాదు.
ఆ నవ్వుకి గుహంతా దద్దరిల్లింది. వారి వారి పనుల్లో నిమగ్నమైన వాళ్లందరూ ఏకాగ్రత చెదరి మహామాయవైపు చూశారు.
మహామాయ ఎదుట నిలబడిన అమ్మాయిలాంటి అబ్బాయి మీద వాళ్లందరి దృష్టి పడింది.
“ఎందుకలా భయపడతావురా. నీకు తండ్రంటే ఎంతిష్టమా. సరే. మా దగ్గర చాలామంది భక్తులున్నారు. వాళ్లలో ఎవరు నీ తండ్రో రేపు తెలుసుకుందువుగాని. ఈ రాత్రికి కొలను పక్కన పడుకో. నువ్వు లోనికి రావచ్చునో లేదో అమ్మనడిగి చెబుతాను” అన్నాడు మహామాయ. లిఖిత భుజం చరుస్తూ.
లిఖిత తలవూపి మెల్లిగా బయటకొచ్చి కొలను పక్కన రాతిమీదకూర్చుంది భయంగా.
అప్పుడే చీకటి చెట్ల నీడలతో కలిసి దట్టమైన దుప్పటిలా అడవంతా పరచుకుంటుంది.

*****

“నీకు పూర్తిగా మతి పోయింది”
ఈశ్వరి చెప్పిన కథ విని తెల్లబోయి గట్టిగా అరచింది లావణ్య.
ఆమె అరుపుని విని మిగతా కొలీగ్స్ వాలిద్దరి వైపు చూసారు. ఆ విషయం గ్రహించి ఈశ్వరి “ష్”అంది.
లావణ్య పరిస్థితి గ్రహించి గొంతు తగ్గించి “నువ్వు చాలా పొరపాటుగా ప్రవర్తిస్తున్నావు. ముత్యాల్లాంటిద్దరు పిల్లల్ని, భర్తని పెట్టూకుని ఇంకొకడు నా మొగుడంటూ పెళ్లి చేసుకుంటావా? బుద్ధుందా అసలు” అంది.
ఈశ్వరి నవ్వి “ఏం చేస్తాను. అతనే నా భర్తని తెలిసేక, నువ్వయితే మాత్రమేం చేస్తావేంటి?” అంది తిరిగి ఎదుగు ప్రశ్నేస్తూ.
“నేనిలాంటి దొంగ సన్యాసుల మాటల్ని వినను. అయినా పూర్వజన్మ సింగినాదాల్ని నేను నమ్మను. ఇప్పుడు వీళ్లనేం చేస్తావు?”
“వదిలేస్తాను”
ఆ జవాబు విని తెల్లబోయింది లావణ్య.
“నిన్నెవరో భారీ ఎత్తున మోసం చేస్తున్నారే ఈశ్వరి. వెంటనే వాళ్లమీద పోలీస్ రిపోర్టివ్వు. లేకపోతే నువ్వింకా చిక్కుల్లో పడతావు” అంది.
“అది నీ భ్రమ. వెంకట్ నా జన్మజన్మల భర్త. నేనిక ఈ కుక్కగాడితో కలిసి బ్రతకడం దుర్లభం” అంది ఈశ్వరి నిష్కర్షగా పర్సు తీసుకుని తన సీటు కెళ్లిపోతూ.
లావణ్య ఆమెవైపు బాధగా చూసింది.
“ఈశవరి ఉత్త అమాయకురాలు. పల్లెటూరినుండొచ్చింది. కుటుంబరావుతో ఆమె కాపురమంత వరకూ సజావుగానే సాగుతోంది. ఎవరో ఆమెని మనసు విరిచి పక్కదారి పట్టిస్తున్నారు. ఏ ఉద్ధేశ్యంతోనో” అనుకుంది బధగా.
ఈశ్వరి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఆలోచిస్తున్నది. తను ఇక ఎంతమాత్రం వెంకట్‌కి దూరంగా ఉండదు. ఉండలేదు. తన గత జన్మ వృత్తాంతం వీలైనంత తొందరగా కుటుంబరావుకి చెప్పి వెంకట్ దగ్గరకెళ్ళిపోవాలి. ఎందుకనో వెంకట్ అహోబిళం నుండి వచ్చే తనకి తిరిగి కనిపించలేదు. ఏమయ్యేడో. ఆమె ఆఫీసవర్సు అయ్యేవరకు అతని గురించే ఆలోచిస్తూ గడిపింది.
అలా ఆలోచిస్తూనే ఆమె ఇల్లు చేరుకుంది.
ఇల్లు, పిల్లలు తనకి సంబంధం లేనివిలా కనిపిస్తున్నాయి. ఆమెని చూసి పిల్లలు పరిగెత్తుకొచ్చి “ఆకలేస్తుంది. ఏవైనా వండమ్మా” అన్నారు.
“అవన్నీ మీ నాన్ననడగండి. ఈ రోజు నుండి నాకేం సంబంధం లేదు” అంది.
పిల్లలు తెల్లబోయి చూశారు తల్లివైపు.
“సరే ఈ పది రూపాయలు పట్టుకెళ్ళి ఏవైనా తెచ్చుకు తినండి. నేను బయటకెళ్ళొస్తాను” అంటూ వాళ్లకి నోటందించి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని చీర మార్చుకుని ఆటో ఎక్కి భీమిలి రోడ్డులోని ఓంకారస్వామి ఆస్రమానికెళ్లింది.
ఈశ్వరిని చూడగానే రాజు ఓంకారస్వామిని చూసి కన్ను గీటేడు.
“ఏం జరిగింది బాలా? అహోబిళం వెళ్ళొచ్చేరా?” అనడిగేడు ఓంకారస్వామి.
“వెళ్ళేం స్వామి. అక్కడ అభుక్తేశ్వరస్వామి మీరు చెప్పినట్లే చెప్పేడు. అతను మా వివాహం కూడా జరిపించేసేడు” అంది ఈశ్వరి.
“మరి మీ ఆయన్ని తీసుకురాలేదేంటి?”
“ఆయనిక్కడికి రాలేదా?” ఆశ్చర్యపోతూ అడిగింది ఈశ్వరి. ఓంకారస్వామి, రాజు మొహమొహాలు చూసుకున్నారు.
అప్పుడే లోనికొచ్చిన సంపెంగి “ఇంకేం వస్తాడిక్కడికి. ఎవర్తినో పెళ్ళి చేసుకుని టింగురంగా అని బీచ్‌లో తిరుగుతుంటే చూశాను. దానికి పది లక్షల లాటరీ వచ్చిందాట. మీతో పని లేదని తెగేసి చెప్పేడు” అంది.
ఆ మాట విని కళ్ళు తిరిగి పడిపోయింది ఈశ్వరి.
“ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చిందని వాడు పెళ్ళీ చేస్కుంటే ఈవిడిక్కడ సొమ్మసిల్లి పోతుందేంటి?” అన్నాదు రాజు చిరాగ్గా.
“ష్” అన్నాడు ఓంకారస్వామి కోపంగా.
రాజు ఓంకారస్వామి వైపు చూసేడు.
” ఆ అమ్మాయి కనక ఇదంతా బయటపెడితే మన పరిస్థితి పూర్ణా మార్కెట్టయిపొతుంది. కాబట్టి మనం ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ వెంకట్‌గాడి జుట్టు మన చేతిలో ఇరికించుకోవాలి. ముందా పిల్ల మీద నీళ్లు జల్లండి” అన్నడు సీరియస్‌గా.
సంపెంగి ఈశ్వరి మొహాన నీళ్లు కొట్టింది.
ఈశ్వరి కాస్సేపటికి తేరుకుని లేచి కుమిలికుమిలి ఏడవటం ప్రారంభించింది.
“అమ్మాయి, ఎందుకలా ఏదో ఊహించుకుని ఏడుస్తావు? అసలేం జరిగిందో తెలుసుకోనివ్వు. ఆ అర్భకుడు మా చేతుల్లోంచి జారిపోడు. జారిపోలేడు. నువ్వు హాయిగా ఇంటికెళ్ళు. మేం విషయం కనుక్కుంటాంగా” అన్నాదు.
ఈశ్వరి కళ్లు తుడుచుకుని వాళ్ల కాళ్లకి దణ్ణం పెట్టి వెనుతిరిగింది.

****

టైమెంటయిందో తెలియదు.
నల్లటి మొహం మీద మచ్చల్లా ఉన్నాయి. ఆ చీకటిలో చెట్ల నీడలు.
రకరకాల జంతువులు ఉండి ఉండీ వింతగా అరుస్తున్నాయి.
నిశ్శబ్దాన్ని ఆసరా చేసుకుని వాగు ఘోషిస్తూ ప్రవహిస్తోంది.
లిఖితని ఆ వాతావరణం క్షక్షణం పిరికిదానిగా మారుస్తోంది.
గట్టు మీద కాళ్ళు ముడుచుకుని ఏ క్షణం ఏ జంతువు మీద పడుతుందోననే ఆందోళనతో చుట్టూ చీకటిని కళ్లు పెద్దవి చేసి దీక్షగా చూస్తోంది.
ఆమె భయాన్ని రెట్టింపు చేస్తూ ఎక్కడో ఏనుగు ఘీంకరించింది. ఆ అరుపుకి ఆమె చేతులు గుండెల మీదకి వెళ్ళేయి.
సరిగ్గా అదే సమయానికి గోరుచుట్టు మీద రోకటిపోటులా రెండు గజాల పొడుగున్న త్రాచొకటి జరజరా పాకుతూ వచ్చి వాగులో తలపెట్టి నీరు తాగసాగింది
లిఖిత ముందు మెరుస్తున్న దాని శరీరాన్ని చూసి ఏంటో అనుకుంది.
కాని ఆ మెరపు కదలడం అచ్చు పాములా ఉండటంతో ప్రాణం కోల్పోయినట్లుగా బిగుసుకుపోయింది.
భయంతో అరవాలన్నా అరుపు గొంతులోనే లుంగ చుట్టుకుపోయింది.
“ఏంటి భయపడ్డావా?”
ఆమె భుజమ్మీద పడ్డ మొరటు హస్తాన్ని చూసి కెవ్వున అరిచింది లిఖిత.
ఎదురుగా చీకటిలో నవ్వుతూ నిలబడ్డాడు మహామయా.

ఇంకా వుంది ..

1 thought on “బ్రహ్మలిఖితం – 16

  1. very interesting ..ఆమె ఆపదలో ఉందని ఈ వాక్యాలు చెప్పకనే చెప్పాయి(భగవతి కోవెలలో పూజారి కుట్టికారన్ ఇచ్చిన కుంకుమ పొట్ళం జారి క్రిందపదిపొవడం ఆమె గమనించలేదు.అదే ఆమె దురదృష్టం.)…తరువాయి భాగం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ..శారద గారికి అభినందనలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *