May 31, 2023

ఒక ప్రాతః వేళ

రచన: రామా చంద్రమౌళి

ఒక సీతాకోక చిలుక వచ్చి భుజంపై వాలినట్టనిపించి
చటుక్కున మెలకువ వస్తుంది
నిజానికి ప్రతిరాత్రీ నిద్రపోవడం ఎంత చిత్రమో
మర్నాడు మనిషి మేల్కొనడం అంతకన్నా విచిత్రం
జీవించీ జీవించీ అలసి రాతిశరీరాలతో
తిరిగొచ్చిన తర్వాత
ఏమి కనిపిస్తాయి .. అన్నీ ఖండిత స్వప్నాలు .. రక్త రేకులు తప్పితే
ఎవరో తరుముతున్నట్టు
ఎవరో ప్రశ్నిస్తున్నట్టు
ఎవరో లోపల నిలబడి గునపంతో తవ్వుతున్నట్టనిపిస్తున్నపుడు
కళ్ళుమూసుకుని మాంసవిగ్రహమై నిద్ర మోసుకొచ్చే రాత్రికోసం నిరీక్షణ
తనకోసం తను బతకడం మరిచిపోయి
ఎవరికోసమో జీవించడం.. నిజంగా మోకాలిపై సలిపే పుండే –
నగరాలు ఏ అర్థ రాత్రో రెక్కలను ముడుచుకుంటున్నపుడు
ఎక్కడివాళ్ళక్కడ కలుగుల్లో ఎలుకలు
ఖాళీ రోడ్లపై
‘ పహరా హుషార్ ‘ కంకకట్టె టక్ టక్ .. పోలీస్ చప్పుళ్ళు
నిజానికి ప్రతి అర్థ రాత్రీ ఒక కాలుతున్న కాష్ఠమే
ఎవరికి వారు శరీరాలను కోల్పోయి
ఒడ్డున తలుగుతో కట్టేసిన చీకిపోయిన పాత పడవలు
అంతా అలల చప్పుడే.. నిర్విరామంగా
* * *
ఉదయం నాలుగున్నరవుతుందా
ఒక ‘ నో హావ్స్ ‘ ప్రపంచం మేల్కొంటుంది
నెత్తులపై గంపలను బోర్లించుకుని
కొందరు స్త్రీలు నడిచొస్తూంటారు రోడ్లపై
ఎర్రని రేడియం మెరుపుల దుస్తులతో
మరి కొందరు స్త్రీలు దేవదూతల్లా రోడ్లూడుస్తుంటారు
రోడ్ల ప్రక్కన స్టవ్ ను వెలిగిస్తున్న చీమిడి ముక్కు నిక్కర్లు
‘ చాయ్ చాయ్ ‘ అని అరుస్తూంటే
ఆగి ఉన్న ఆటోల ఆగని చప్పుళ్ళు
ఆర్టీసీ తో యుద్ధం చేస్తూంటాయి
పేపర్ బాయ్స్ దినపత్రికల కట్టలను సైకిళ్ళపై సర్దుకుంటూ
ప్రతి ఒక్కడూ ఇక ఎగురబోయే పావురమే
ఒక గంట క్రితమే నిద్రకుపక్రమించిన బార్ ముందు
చెత్తకుండీ దగ్గర సగం మిగిలిని బిర్యానీ పొట్లాలు
కుక్కలూ, మనుషుల కొట్లాటలో మట్టిపాలౌతూంటే
రాత్రంతా నలిగిపోయిన ‘ కాంట్రాక్ట్ సెక్స్ ‘
ఇక జాకెట్టు హుక్స్ ను సర్దుకుంటూంటుంది
ప్రతి ప్రాతః కాల ఉదయం
రోడ్లన్నీ వీళ్ళతోనే
కూలీలు, లేబర్, కూరగాయల మనుషులు, పాలవాళ్ళు
పేపర్ బోయ్స్, ఆటోలు, అడుక్కునేవాళ్ళు, అన్నీ అమ్ముకునే వాళ్ళు
అప్పుడే నిద్రలేస్తున్న వీధి కుక్కలు –
* * *
సరిగ్గా అదే సమయానికి
పోర్టర్ రాజయ్య బిడ్డ పదవ తరగతి లక్ష్మి
ఉరికి ఉరికి క్రీడా శిక్షణా శిబిరానికొస్తుంది మొసపోస్తూ
ఎప్పటికైనా ఒలంపిక్ పతక సాధనే లక్ష్యంగా.. ఎక్కుపెట్టిన బాణమై
గురిపెట్టిన అమ్ము కసుక్కున లక్ష్యం గుండెలోకి దిగుతుందికదా నిశ్శబ్ద ధ్వనితో
అప్పుడామె గ్రహిస్తుంది
గాయమైన ప్రతిసారీ రక్తం రాదని –

7 thoughts on “ఒక ప్రాతః వేళ

  1. ప్రతీ ఒక్కడూ ఇక ఎగిరే పావురమే…Excellent poetry…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *